కృష్ణ 'నేరము శిక్ష'కి 50 ఏళ్ళు.. యాక్సిడెంట్ చుట్టూ తిరిగే సినిమా!

  "మనిషికి మనసే సాక్షి.. మనిషి విధించే శిక్ష తప్పినా.. మనసు వేధించే శిక్ష తప్పదు. నేరానికి శిక్ష తప్పదు.." అనే పాయింట్ తో రూపొందిన చిత్రం 'నేరము శిక్ష'.  రష్యన్ నవల 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' ఆధారంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, భారతి జంటగా నటించారు. కాంతారావు, బాలయ్య, సత్యనారాయణ, రావుగోపాల రావు, అర్జా జనార్థన రావు, కృష్ణకుమారి, పండరీ బాయి, పుష్ప కుమారి, పి. ఆర్. వరలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, పి. జె. శర్మ, మాస్టర్ విశ్వేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  ఎం. బాలయ్య కథను అందించిన 'నేరము శిక్ష'కి సముద్రాల జూనియర్, మోదుకూరి జాన్సన్ సంభాషణలు సమకూర్చారు. కథాంశం విషయానికి వస్తే.. ధనవంతులైన రాజశేఖరం (కాంతారావు), శాంతమ్మ (పండరీ బాయి)కి విజయ్ (కృష్ణ) ఏకైక సంతానం. అందుకే ఆ ఇంట్లో విజయ్ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అలాంటి విజయ్ చేతికి ఓ కొత్త కారు వస్తుంది. ఈ క్రమంలోనే.. స్నేహితుడు సత్యం (సత్యనారాయణ)తో కారు డ్రైవింగ్ లో పోటీపడతాడు. సరిగ్గా ఇదే సమయంలో.. అనుకోకుండా ఓ యాక్సిడెంట్ చేస్తాడు విజయ్. ఈ ప్రమాదంలో చిన్నయ్య (బాలయ్య) కళ్ళు పోగొట్టుకోగా.. అతని అన్నయ్య కన్నుమూస్తాడు. దీంతో విజయ్ ఇంట్లో చాలా కాలంగా పనిచేసే డ్రైవర్.. శాంతమ్మ మీద అభిమానంతో  ఆ నేరం తన మీద వేసుకుంటాడు. మరోవైపు నిజం తెలిసి.. రాజశేఖరం కొడుకుని ఇంటి నుండి గెంటివేస్తాడు. పౌరుషంతో ఇంటి నుండి బయటికి వచ్చిన విజయ్.. మరో శ్రీమంతుడు నారాయణ రావు (రావు గోపాల రావు)కి కూతురు అయిన సుజాత (భారతి)ని ఓ విషయంలో సపోర్ట్ చేస్తాడు. అలా.. నారాయణ రావు ఇంట్లో బట్లర్ గా చేరతాడు. విజయ్ మంచితనం చూసి సుజాత క్రమంగా అతణ్ణి ప్రేమిస్తుంది. మరోవైపు.. తన కారణంగా ఇబ్బందుల్లో పడ్డ డ్రైవర్ ఫ్యామిలీకి, చిన్నయ్య కుటుంబానికి దేవుడయ్య, పిచ్చయ్య పేర్లతో దగ్గరవుతాడు విజయ్. ఆర్థిక సహాయం కూడా చేస్తుంటాడు. అంతేకాదు.. చిన్నయ్యకి తిరిగి కళ్ళు వచ్చేలా చేస్తాడు. అయితే విజయ్ ని చంపాలన్న పంతంతో ఉన్న చిన్నయ్య.. చివరకి అసలు నిజం తెలుసుకుని మనసు మార్చుకుంటాడు. విజయ్ మాత్రం తను చేసిన నేరానికి శిక్ష అనుభవించేందుకు సిద్ధమవడంతో కథ ముగుస్తుంది. పాటల విషయానికి వస్తే.. ఎస్. రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు, పి. గణపతి శాస్త్రి, సముద్రాల జూనియర్ సాహిత్యమందించారు. "దిక్కులేని", "చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొకరిది", 'దాగుడు మూత దండాకోర్", "వన్ టూ వన్ టూ", "రాముని బంటునురా", "వేశావు భలే వేషాలు", "ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారూ" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఎం. బాలయ్య సమర్పణలో అమృతా ఫిలింస్ పతాకంపై అలపర్తి సూర్య నారాయణ, మన్నవ వెంకట్రావు నిర్మించిన 'నేరము శిక్ష'.. తమిళంలో 'నీతిక్కు తలైవనంగు' (ఎంజీఆర్, లత), హిందీలో 'శిక్ష' (రాజ్ కిరణ్, సుష్మ వర్మ) పేర్లతో రీమేక్ అయింది. 1973 జూలై 27న విడుదలై మంచి విజయం సాధించిన 'నేరము శిక్ష'..  గురువారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.  

శోభన్ బాబు 'మల్లెపూవు'కి 45 వసంతాలు!

నటభూషణ్ శోభన్ బాబు పలు రీమేక్ మూవీస్ లో ఎంటర్టైన్ చేశారు. వాటిలో గురుదత్ హిందీ చిత్రం 'ప్యాసా' (1957) ఆధారంగా తెరకెక్కిన 'మల్లెపూవు' ఒకటి. ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావు రూపొందించిన ఈ సినిమాలో లక్ష్మి, జయసుధ నాయికలుగా నటించగా రావు గోపాల రావు, శ్రీధర్, గిరిబాబు, కేవీ చలం, మాడా ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. అల్లు రామలింగయ్య, వేటూరి సుందరరామ్మూర్తి, ఆరుద్ర, నిర్మల, పండరీబాయి అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. గుర్తింపుకు నోచుకుని ఓ కవి (శోభన్ బాబు) చుట్టూ తిరిగే 'మల్లెపూవు'లో.. ఆ కవి విఫలప్రేమ, అన్నదమ్ముల ఛీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, బ్రతికుండగా రాని గుర్తింపు చనిపోయాక అతనికి రావడం వంటి ప్రధాన ఘట్టాలు ఆకట్టుకుంటాయి. కె. చక్రవర్తి సంగీతమందించిన 'మల్లెపూవు'కి వేటూరి సుందరరామ్మూర్తి, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వీటూరి సాహిత్యమందించారు. "చిన్న మాట ఒక చిన్నమాట", "నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా", "ఓహో ఓహో లలిత నా ప్రేమ కవిత", "బ్రతికున్నా చచ్చినట్లే ఈ సంఘంలో", "మల్లెపూవులా వసంతం మా తోటకి వచ్చింది", "చకచక సాగే చక్కని బుల్లెమ్మ", "ఓ ప్రియా మరుమల్లియ కన్న తెల్లనిది", "జుంబంబా జుంబంబా" అంటూ సాగే ఇందులోని పాటలన్నీ ఆదరణ పొందాయి. వీటిని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, వాణీజయరామ్, వి. రామకృష్ణతో పాటు చక్రవర్తి గానం చేశారు. సమతా ఆర్ట్స్ పతాకంపై వి.ఆర్. యాచేంద్ర, కె. ఛటర్జీ నిర్మించిన 'మల్లెపూవు'.. వైజాగ్ లో శతదినోత్సవం జరుపుకుంది. 1978 జూలై 26న జనం ముందు నిలిచిన 'మల్లెపూవు'.. బుధవారంతో 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

బయోగ్రఫీ: నవరస నటనా సార్వభౌమ.. వెండితెర యమ.. మన కైకాల సత్యనారాయణ!

  శృంగారం, హాస్యం, వీరం, కరుణ, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.. ఇలా నవరసాలను అలవోకగా పలికించే నటులు కొంతమందే ఉంటారు. వారిలో కైకాల సత్యనారాయణ ముందు వరుసలో ఉంటారు.  ఆరు దశాబ్దాల చిత్ర ప్రయాణంలో దాదాపు 800 సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న ఆయన.. తెలుగునాట 'నవరస నటనా సార్వభౌమ'గా పేరుపొందారు. అంతేకాదు..  సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక.. ఇలా అన్ని రకాల జోనర్స్ లోనూ అభినయించి ఆకట్టుకున్న వైనం కైకాల సత్యనారాయణ సొంతం. అదేవిధంగా తెలుగు తెరపై యమధర్మరాజు పాత్రలకు చిరునామాగానూ నిలిచారాయన.  అలాంటి కైకాల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీకోసం..  కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణాజిల్లాలోని గూడూరు తాలుకాకి చెందిన కౌతవరం గ్రామంలో జన్మించారు. గుడ్లవల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్మీడియట్, గుడివాడ కళాశాలలో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే నాటకాల మీద ఆసక్తి ఉండడంతో.. పలు నాటకాల్లో కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ వేషాలు వేశారు. మరోవైపు.. డిగ్రీ పూర్తిచేసినా సరైన ఉద్యోగం లేకపోవడంతో, తన కుటుంబానికి చెందిన కలప వ్యాపారం చూసుకున్నారు. అదేసమయంలో.. తన స్నేహితుడి సలహా మేరకు సినిమా అవకాశాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మద్రాస్ బాట పట్టారు. తొలుత సహాయ కళా దర్శకుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ.. ఆపై నటుడిగా ప్రయత్నాల వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల కోసం.. మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, వాయిస్ టెస్ట్ జరిగినా అవకాశాలు దక్కలేదు.  ఈ  నేపథ్యంలోనే.. 'సిపాయి కూతురు' చిత్రంలో ఏకంగా హీరో ఛాన్స్ ఇచ్చారు 'దేవదాసు' నిర్మాత డి.ఎల్. నారాయణ.  1959లో నిర్మితమైన ఈ సినిమాలో అప్పటి అగ్ర కథానాయిక జమున హీరోయిన్. మొదటి చిత్రమే జమున వంటి స్టార్ హీరోయిన్ కి జోడీగా నటించిన సత్యనారాయణ.. ఆ మూవీ తరువాత తన దశ, దిశ మారుతుందని భావించారు. అయితే, 'సిపాయి కూతురు' పరాజయం పాలవడంతో కైకాల అంచనాలు, ఆశలు తల్లకిందులయ్యాయి. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలో మూడేళ్ళ ఒప్పందం ఉండడంతో కొన్నాళ్ళు అవకాశాల లేమి వెంటాడిది. ఇలాంటి తరుణంలో.. నటరత్న నందమూరి తారక రామారావు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న 'రాముడు - భీముడు'లో బాడీ డబుల్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్ కి డూప్ గా సత్యనారాయణ బాగా సెట్ అవడంతో.. తరువాతి కాలంలో పెద్దాయన నటించిన పలు డ్యూయెల్ రోల్ మూవీస్ లో బాడీ డబుల్ గా కనిపించారు సత్యనారాయణ. అంతకంటే ముందు.. 'సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి'లో రాజకుమారుడిగా చిన్న వేషం కల్పించారు ఎన్టీఆర్. ఆపై జానపద బ్రహ్మ బి. విఠలాచార్య రూపొందించిన 'కనక దుర్గ పూజా మహిమ'లో విలన్ గా నటించారు కైకాల. అది కాస్త క్లిక్ అవ్వడంతో.. ప్రతినాయకుడి పాత్రలపరంగా ఆపర్ల వర్షం కురిసింది. ఆర్టిస్టుగా బిజీ అవుతున్న సమయంలోనే నాగేశ్వరమ్మని వివాహమాడారు సత్యనారాయణ. పెళ్ళయి నలుగురి బిడ్డలకు తండ్రయ్యాక కైకాల కెరీర్ స్పీడందుకుంది.  ఈ దశలోనే ప్రతినాయకుడి పాత్రల్లో అలరిస్తూనే కరుణరసం, హాస్యరసంతో కూడిన పలు పాత్రలు పోషించారు కైకాల. అలాగే కెరీర్ ఆరంభం నుంచే పరమేశ్వరుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలు పోషిస్తూ వచ్చిన సత్యనారాయణకి.. ఎన్టీఆర్ 'యమగోల'లో యమధర్మరాజుగా నటించే అవకాశం దక్కింది. ఆ పాత్రలో ఆయన పరకాయప్రవేశం చేసిన తీరు.. ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఆపై 'యముడికి మొగుడు', 'యమలీల', 'యమగోల మళ్ళీ మొదలైంది' సినిమాల్లోనూ యముడిగా ఆకట్టుకున్నారు. అలా వెండితెర యమ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. యముడి పాత్రల్లో కైకాల నటిస్తే.. సినిమా పక్కా హిట్ అనే ఇమేజ్ వచ్చింది. కెరీర్ తుది దశలోనూ సీనియర్ యమగా 'దరువు' చిత్రంలో కనిపించారు కైకాల.   ఒకే కథాంశంతో తెరకెక్కి ఒకే రోజున పోటాపోటీగా రిలీజైన 'దానవీరశూరకర్ణ', 'కురుక్షేత్రం' సినిమాల్లో రెండు విభిన్న పాత్రల్లో అలరించారు సత్యనారాయణ. 'దానవీరశూరకర్ణ'లో భీముడిగా దర్శనమిచ్చిన ఆయన.. 'కురుక్షేత్రం'లో దుర్యోధనుడిగా కనిపించి మెప్పించారు.  కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాణంలోనూ తనదైన ముద్రవేశారు కైకాల సత్యనారాయణ. తన సోదరుడు కె. నాగేశ్వరరావు పేరిట రమా ఫిల్మ్స్ బేనర్ లో ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. నందమూరి తారక రామారావు హీరోగా 'గజదొంగ' చిత్రాన్ని చలసాని గోపితో పాటు నిర్మించి శుభారంభాన్ని చూసిన సత్యనారాయణ.. ఆపై 'ఇద్దరు దొంగలు', 'కొదమసింహం', 'బంగారు కుటుంబం' వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. సత్యనారాయణ కెరీర్ ని పరిశీలిస్తే.. పలు సందర్భాల్లో ఆయనకి నందమూరి తారక రామారావు ప్రోత్సాహం మెండుగా ఉందని చెప్పకతప్పదు. అందుకేనేమో.. ఎన్టీఆర్ తో ఏకంగా 101 సినిమాల్లో కలిసి నటించే అరుదైన అవకాశం దక్కింది కైకాలకి. అంతేకాదు.. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మూడు తరాల అగ్ర కథానాయకులతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని రంజింపజేశారు కైకాల. అలాగే ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, రవితేజ వంటి టాప్ స్టార్స్ కాంబినేషన్ లోనూ ఎంటర్టైన్ చేశారు. కళా రంగానికి చేసిన సేవలకి గానూ.. 2011లో రాష్ట్ర ప్రభుత్వం తరపున రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల సత్యనారాయణ.. 2017లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ కి ఎంపికయ్యారు. ఇక సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు కైకాల. 1996లో తెలుగుదేశం తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారాయన. ఇలా.. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు సత్యనారాయణ. 2022 డిసెంబర్ 23న అంటే తన 87వ ఏట అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు కైకాల సత్యనారాయణ. ప్రస్తుతం భౌతికంగా ఆయన మన ముందు  లేకున్నా.. విభిన్న పాత్రల  రూపంలో ఎప్పటికీ చేరువలోనే ఉంటారు కైకాల సత్యనారాయణ.  (జూలై 25.. కైకాల సత్యనారాయణ జయంతి)

ఇండస్ట్రీ హిట్స్ విషయంలో.. ఆ రికార్డ్ బి. గోపాల్ దే!

అగ్ర దర్శకుడు బి. గోపాల్ పేరు వినగానే.. మనకు ఆయన తీసిన భారీ బడ్జెట్ మూవీస్ నే ఠక్కున గుర్తుకువస్తాయి. వీటిలో చాలా మటుకు బ్లాక్ బస్టర్ బాట పట్టాయి. ఇంకొన్నైతే.. అంతకుమించి అన్నట్లుగా 'ఇండస్ట్రీ హిట్స్'గా నిలిచాయి. గోపాల్ కి ముందు, తరువాత కూడా కొందరు దర్శకులు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే, తక్కువ గ్యాప్ లో (మూడున్నరేళ్ళ వ్యవధిలో) ముచ్చటగా మూడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన రికార్డ్ మాత్రం బి. గోపాల్ దే. అంతేకాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకి వరుసగా మూడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన ఘనత కూడా బి. గోపాల్ దే. ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో బి. గోపాల్ తీసిన 'సమరసింహారెడ్డి' (1999) ఇండస్ట్రీ హిట్ గా నిలవగా.. ఆపై అదే బాలయ్యతో బి. గోపాల్ రూపొందించిన 'నరసింహనాయుడు' (2001) కూడా అదే బాట పట్టింది. ఈ రెండు సినిమాలు కూడా రెండేళ్ళ వ్యవధిలో సంక్రాంతి సీజన్ లోనే రిలీజయ్యాయి. అలాగే.. మెగాస్టార్ చిరంజీవితో బి. గోపాల్ తెరకెక్కించిన 'ఇంద్ర' కూడా ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకెక్కింది. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా 2002 జూలై 24న 'ఇంద్ర' జనం ముందు నిలిచింది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర'.. ఇలా టాలీవుడ్ మూడు వరుస ఇండస్ట్రీ హిట్స్ కి ఒకరే దర్శకుడు కావడం.. ఇవి కేవలం మూడున్నరేళ్ళ వ్యవధిలో రిలీజ్ కావడం రికార్డనే చెప్పాలి. కొసమెరుపు  ఏమిటంటే.. ఈ మూడు ఇండస్ట్రీ హిట్స్ కి కూడా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు.  (జూలై 24.. బి. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా)

స్టార్ హీరోలతో బి. గోపాల్ బ్లాక్ బస్టర్స్.. ఏంటో తెలుసా!

  సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న తెలుగు దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. నిన్నటి తరం అగ్ర కథానాయకులందరితోనూ ఘనవిజయాలు చూశారాయన. మరి.. టాప్ స్టార్స్ కాంబినేషన్ లో ఉన్న బి. గోపాల్ టాప్ హిట్స్ ఏంటో చూద్దామా.. అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున: తండ్రీకొడుకులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కాంబినేషన్ లో బి. గోపాల్ తీసిన 'కలెక్టర్ గారి అబ్బాయి' ఘన విజయం సాధించింది. చిరంజీవి: చిరంజీవి, బి. గోపాల్ కాంబినేషన్ లో తొలి చిత్రమైన 'స్టేట్ రౌడీ' ఘనవిజయం సాధించగా.. మూడో సినిమాగా వచ్చిన 'ఇంద్ర' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ: బి. గోపాల్ కి అచ్చొచ్చిన కథానాయకుడిగా బాలకృష్ణకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి కాంబోలో 5 సినిమాలు రాగా.. మొదటి నాలుగు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి సక్సెస్ చూశాయి. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్ స్పెక్టర్' బ్లాక్ బస్టర్స్ కాగా.. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. వెంకటేశ్: 'రక్త తిలకం' వంటి సూపర్ హిట్ తో మొదలైన వెంకీ, బి. గోపాల్  కాంబినేషన్ .. ఆపై 'బొబ్బిలి రాజా' వంటి సంచలన విజయాన్ని చూసింది. మోహన్ బాబు: 'అసెంబ్లీ రౌడీ' రూపంలో సంచలన విజయాన్ని చూసిన మోహన్ బాబు, బి. గోపాల్ కాంబో.. ఆనక 'బ్రహ్మ', 'అడవిలో అన్న', 'కలెక్టర్ గారు' వంటి చెప్పుకోదగ్గ హిట్స్ ని క్రెడిట్ చేసుకుంది. సుమన్: సుమన్, బి. గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన 'ఖైదీ ఇన్ స్పెక్టర్' బాక్సాఫీస్ ముంగిట మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. (జూలై 24.. బి. గోపాల్ బర్త్ డే)

బి. గోపాల్ డైరెక్ట్ చేసిన బాలీవుడ్ సినిమాలేంటో తెలుసా!

  మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. తెలుగులో భారీ విజయాలు చూసిన గోపాల్.. హిందీలోనూ రెండు సినిమాలు చేశారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ మూవీస్ నే కావడం విశేషం. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే.. ఇన్సాఫ్ కి ఆవాజ్: హిందీలో గోపాల్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రమిది. తెలుగులో బి. గోపాల్ ఫస్ట్ డైరెక్టోరియల్ అయిన 'ప్రతిధ్వని' (శారద, అర్జున్, రజిని)కి ఇది రీమేక్. రేఖ, అనిల్ కపూర్, రిచా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1986 నవంబర్ 12న రిలీజైంది. తెలుగు వెర్షన్ లాగే హిందీ వెర్షన్ కూడా విజయం సాధించింది. 'ప్రతిధ్వని' గోపాల్ కి తొలి సినిమా కాగా.. 'ఇన్సాఫ్ కి ఆవాజ్' అతని ఫిల్మోగ్రఫీలో రెండో చిత్రం కావడం విశేషం. కానూన్ అప్నా అప్నా: బాలీవుడ్ లో బి. గోపాల్ రూపొందించిన రెండవ, చివరి చిత్రమిది. తనే డైరెక్ట్ చేసిన 'కలెక్టర్ గారి అబ్బాయి' (అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, శారద, రజిని)కి హిందీ వెర్షన్ గా 'కానూన్ అప్నా అప్నా' తెరకెక్కింది. దిలీప్ కుమార్, నూతన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ రీమేక్ మూవీ.. 1989 అక్టోబర్ 27న జనం ముందు నిలిచింది. (జూలై 24.. బి. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా)

పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'కి పాతికేళ్ళు.. నో డ్యూయెట్స్.. నో ఫిమేల్ సింగర్ వాయిస్  

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభంలో పలు ప్రేమకథా చిత్రాల్లో సందడి చేశారు. వాటితో యువతని ఎంతగానో అలరించారు. అలాగే, వరుస విజయాలతో 'యూత్ ఐకాన్'గా అప్పట్లో గుర్తింపు పొందారు. అలాంటి.. పవన్ స్థాయిని పెంచిన సినిమాగా 'తొలిప్రేమ'(1998)కి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా 'తొలి ప్రేమ' నిలిచిపోయింది. ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ విడుదలై.. ఈ జూలై 24కి పాతికేళ్ళు. ఈ సందర్భంగా ఆ సినిమా తాలూకు జ్ఞాపకాల్లోకి వెళితే.. పవన్ కి ఫస్ట్ స్ట్రయిట్ సబ్జెక్ట్, డెబ్యూ డైరెక్టర్: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(1996)తో కథానాయకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. ఆపై 'గోకులంలో సీత' (1997), 'సుస్వాగతం' (1998) చిత్రాలతో పలకరించారు. ఇవన్నీ కూడా రీమేక్ మూవీస్ నే. అంతేకాదు.. ఈ మూడు కూడా ఈవీవీ సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని శ్రీనివాసరావు వంటి అనుభవమున్న దర్శకులతో చేసిన సినిమాలే. అయితే, 'తొలిప్రేమ' రూపంలో ఫస్ట్ స్ట్రయిట్ సబ్జెక్ట్ మూవీ చేశారు పవన్. అదేవిధంగా.. ఏ మాత్రం అనుభవం లేని ఎ. కరుణాకరన్ కి దర్శకుడిగా మొదటి అవకాశమిచ్చారు. ప్రేమకథంటే అప్పటివరకు సినీ ప్రేక్షకులకు డ్యూయెట్లు, రొమాన్స్ ఉన్న చిత్రాలే. అయితే, 'తొలిప్రేమ' అందుకు భిన్నంగా సాగడం కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో కీలకమైన ఇంట్రవెల్, క్లైమాక్స్ సీన్స్ లో తప్ప ఎక్కడా హీరోయిన్ ని ముట్టుకోడు హీరో. అలాగే, పతాక సన్నివేశాల వరకు కథానాయకుడిది వన్ సైడ్ లవ్ కావడంతో పాటల్లో ఫిమేల్ వాయిస్ లేకుండా డైరెక్టర్ డిజైన్ చేశారు. ఈ అంశం యువతని మాట్లాడుకునేలా చేసింది. కథాంశం: బాలు (పవన్ కళ్యాణ్) ఓ మధ్యతరగతి యువకుడు. ఎలాంటి లక్ష్యం లేకుండా.. కుటుంబం, స్నేహితులు, క్రికెట్ అంటూ కాలం గడిపేస్తుంటాడు. అప్పుడప్పుడు తండ్రి చేత తిట్లు తింటుంటాడు. అలాంటి బాలు.. ఓ దీపావళి రోజున చిచ్చుబుడ్డుల వెలుగులో అను (కీర్తి రెడ్డి)ని చూస్తాడు. తొలిచూపులోనే అనుతో ప్రేమలో పడిపోతాడు. అయితే, ఆమెతో నేరుగా మాట్లాడే అవకాశాల్ని ఎప్పటికప్పుడు తృటిలో కోల్పోతుంటాడు. మరోవైపు.. ఓ ప్రమాదంలో ఓ చిన్నారిని కాపాడిన బాలుని చూసి ఇంప్రెస్ అవుతుంది అను. తన హాబీలో భాగంగా బాలు ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నిస్తుంది కానీ కొద్దిలో మిస్ అవుతాడు. ఇలాంటి నేపథ్యంలో.. ఇద్దరూ ఊటీకెళ్ళే దారిలో ఎదురుపడతారు. అక్కడ జరిగిన కారు ప్రమాదంలో.. అనుని కాపాడే క్రమంలో కొండపైనుంచి కిందపడిపోతాడు బాలు. అదృష్టంకొద్ది గాయాలతో బయటపడతాడు. తనను కాపాడిన బాలుకి కృతజ్ఞతలు చెప్పడానికి అతని ఇంటికి వెళుతుంది అను. అలా.. ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. చెల్లెలు ప్రియ (వాసుకి) సలహా మేరకు అనుకి తన ప్రేమను తెలియజేసే మంచి తరుణం కోసం ఎదురుచూస్తుంటాడు బాలు. ఒకవైపు చెల్లికి పెళ్ళై అత్తారింటికి వెళ్ళడం.. మరోవైపు ఉన్నత చదువుల కోసం అను విదేశాలకు సిద్ధమవ్వడంతో బాలు దిగాలు పడిపోతుంటాడు. అనుకి వీడ్కోలు చెప్పడానికి ఎయిర్ పోర్ట్ వస్తాడు బాలు. అతనికి వీడ్కోలు పలికి దూరమవుతున్న సమయంలో.. బాలుతో ప్రేమలో ఉన్నట్లు గ్రహిస్తుంది అను.  అలా.. ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. యువతకు లక్ష్యం ఉండాలి అంటూ అను చెప్పిన మాటలనే గుర్తుచేస్తూ బాలు.. ఇద్దరూ లక్ష్యాలు చేరుకున్నాకే తిరిగి కలుద్దాం అంటూ చెప్పుకొస్తాడు. అలా.. బాలు, అను ప్రేమకథ సుఖాంతమవుతుంది.  'యువతరానికి ఓ లక్ష్యం ఉండా'లంటూ కరుణాకరన్ తెరకెక్కించిన 'తొలిప్రేమ'.. కేవ‌లం ప్రేమ‌క‌థ‌కే ప‌రిమితం కాకుండా అన్నాచెల్లెళ్ళ అనుబంధం, కుటుంబ బంధాల‌కు పెద్ద‌పీట వేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా రంజింపజేసింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జీవీజీ రాజు నిర్మాణ విలువలు కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. నటీనటులు: ప‌వ‌న్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన 'తొలిప్రేమ'లో వాసుకి, న‌గేశ్, అలీ, వేణుమాధ‌వ్, అచ్యుత్, ర‌విబాబు, పీజే శ‌ర్మ‌, న‌ర్రా వెంకటేశ్వ‌ర‌రావు, సంగీత‌, బెంగుళూరు ప‌ద్మ, విజయ్, మనీషా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు. దర్శకుడు ఎ. కరుణాకరన్ అతిథి పాత్రలో మెరిశారు. పాటలు: దేవా అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం 'తొలిప్రేమ'కి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. పవన్ సినిమాకి దేవా సంగీతమందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యంతో వచ్చిన  "ఈ మ‌న‌సే" (బాలు), "గ‌గ‌నానికి ఉద‌యం ఒక‌టే" (బాలు), "ఏమి సోద‌రా" (కృష్ణంరాజ్).. భువనచంద్ర పదరచన చేసిన "ఏమైందో ఏమో ఈ వేళ‌" (బాలు),  "రొమాన్స్ రిథ‌మ్స్" (సురేశ్ పీటర్స్, ఉన్నిక్రిష్టన్)   యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించాయి. వీటిలో "ఏమైందో ఏమో ఈ వేళ" పాటని పవన్ కి అభిమాని అయిన మరో హీరో నితిన్.. 'గుండెజారి గల్లంతయ్యిందే' కోసం రీమిక్స్ చేయడం విశేషం. ప్రదర్శన: 21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న 'తొలిప్రేమ'.. రెండు కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమైంది. అలాగే 365 రోజుల లాంగ్ రన్ చూసిన సినిమాల జాబితాలోనూ చేరింది.   అవార్డులు: తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న 'తొలిప్రేమ'.. పలు పురస్కారాలను సొంతం చేసుకుంది.  1998కి గానూ 'ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం' (తెలుగు)గా 'జాతీయ‌' పుర‌స్కారాన్ని అందుకున్న 'తొలిప్రేమ‌'.. ..  'ఉత్తమ చిత్రం', 'ఉత్తమ నూతన దర్శకుడు', 'ఉత్తమ సహాయనటి' (వాసుకి), 'ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత' (క‌రుణాక‌ర‌న్), 'ఉత్తమ ఆడియోగ్రాఫ‌ర్' (మ‌ధుసూద‌న్), 'ఉత్తమ ఎడిట‌ర్' (మార్తాండ్ కె. వెంక‌టేశ్) విభాగాల్లో ఆరు 'నంది' అవార్డుల‌ను దక్కించుకుంది. రీమేక్స్: తెలుగులో ఘనవిజయం సాధించిన 'తొలిప్రేమ'..  హిందీలో 'ముఝే కుచ్ కెహ‌నా హై' (తుషార్ క‌పూర్, క‌రీనా క‌పూర్), క‌న్న‌డ‌లో 'ప్రీతిసు త‌ప్పేనిల్ల‌' (వి. ర‌విచంద్ర‌న్, ర‌చ‌న‌) పేర్ల‌తో  రీమేక్ అయింది. రి-రిలీజ్: 'తొలిప్రేమ' పాతికేళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. గత నెల జూన్ లో రి-రిలీజ్ చేశారు. రి-రిలీజ్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది.  

టాప్ స్టార్స్ తో కోడి రామకృష్ణ టాప్ హిట్స్.. ఆ సినిమాలేంటో తెలుసా!

    (జూలై 23.. కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా) తెలుగునాట వందకి పైగా సినిమాలు తెరకెక్కించిన దర్శకులు.. పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. వారిలో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒకరు. ఒక తరం అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ కి మంచి విజయాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. కృష్ణ: కృష్ణ - కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో 'పోరాటం' మంచి విజయం సాధించింది. 'గూండా రాజ్యం', 'గూఢచారి నెం 117' కూడా మెప్పించాయి. చిరంజీవి: చిరంజీవి హీరోగా నటించిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తోనే కోడి రామకృష్ణ దర్శకుడిగా తొలి అడుగేశారు. భారీ విజయం సాధించిన ఈ సినిమా తరువాత చిరు, కోడి రామకృష్ణ కాంబోలో మరికొన్ని సినిమాలు వచ్చినా.. 'ఆలయ శిఖరం' మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. బాలకృష్ణ: 'మంగమ్మ గారి మనవడు' వంటి సంచలన చిత్రంతో మొదలైన బాలయ్య - కోడి రామకృష్ణ కాంబో.. ఆపై 'ముద్దుల కృష్ణయ్య', 'ముద్దుల మావయ్య', 'మువ్వ గోపాలుడు', 'ముద్దుల మేనల్లుడు' వంటి బ్లాక్ బస్టర్స్, హిట్ మూవీస్ ని క్రెడిట్ చేసుకుంది. నాగార్జున: 'మురళీ కృష్ణుడు' రూపంలో నాగార్జున, కోడి రామకృష్ణ కాంబోలో చెప్పుకోదగ్గ విజయం ఉంది. వెంకటేశ్: 'శత్రువు' రూపంలో వెంకీ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఘనవిజయం ఉంది. దీనికంటే ముందు వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. సుమన్: 'తరంగిణి' వీరి కాంబోలో బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే '20వ శతాబ్దం' కూడా జనరంజక చిత్రంగా నిలిచింది. రాజశేఖర్: రాజశేఖర్ తో  కోడి రామకృష్ణ రూపొందించిన సినిమాల్లో 'అంకుశం' సంచలన విజయం సాధించింది. అంతకంటే ముందు వచ్చిన 'తలంబ్రాలు', 'స్టేషన్ మాస్టర్', 'ఆహుతి' కూడా మంచి విజయం సాధించాయి. అర్జున్: 'మా పల్లెలో గోపాలుడు', 'మన్నెంలో మొనగాడు', 'మా వూరి మారాజు', 'పుట్టింటికి రా చెల్లి'.. ఇలా అర్జున్, కోడి రామకృష్ణ కాంబోలో మంచి విజయాలే ఉన్నాయి. జగపతి బాబు: జగపతి బాబుతో కోడి రామకృష్ణ తీసిన సినిమాల్లో 'దొంగాట' ఘనవిజయం సాధించగా.. 'పెళ్ళి పందిరి' కూడా విజయపథంలో పయనించింది.

అగ్ర కథానాయకులతో మంజుల టాప్ హిట్స్.. ఏంటో తెలుసా!

  (జూలై 23.. మంజుల 10వ వర్థంతి సందర్భంగా) మంజుల.. ఓ తరం యువత కలలరాణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఇలా దక్షిణాదికి చెందిన అన్ని భాషల సినిమాల్లోనూ అలరించిన అందాల తార. మరీముఖ్యంగా.. తెలుగులో అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ విజయాలను చూశారు మంజుల. టాప్ స్టార్స్ తో మంజుల అందుకున్న టాప్ హిట్స్ వివరాల్లోకి వెళితే.. నటరత్న నందమూరి తారక రామారావు: మంజులకి ఎన్టీఆర్ కాంబోలో మంచి విజయాలే ఉన్నాయి. 'వాడే వీడు' వంటి బ్లాక్ బస్టర్ తో ఈ కలయిక మొదలైంది. ఆపై 'మనుషులంతా ఒక్కటే', 'మగాడు', 'నేరం నాది కాదు ఆకలిది'.. ఇలా 1976లో ఎన్టీఆర్ మూడు వరుస హిట్స్ లో ఆమె నాయికగా కనువిందు చేశారు. ఆపై ఏడాది వచ్చిన హిట్ మూవీ 'చాణక్య చంద్రగుప్త'లోనూ ఇద్దరు నాయికల్లో ఒకరిగా ఆకట్టుకున్నారు మంజుల. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు: తెలుగులో మంజుల నటించిన మొదటి సినిమా.. ఏయన్నార్ నటించిన 'జై జవాన్'నే. అయితే, అందులో ఆమె లీడ్ హీరోయిన్ కాదు. తరువాతి కాలంలో  'బంగారు బొమ్మలు' వంటి విజయవంతమైన సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో జట్టుకట్టి సక్సెస్ చూశారు మంజుల. సూపర్ స్టార్ కృష్ణ: సూపర్ హిట్ మూవీ 'మాయదారి మల్లిగాడు'లో కృష్ణ సరసన భలేగా ఎంటర్టైన్ చేసిన మంజుల.. ఆపై 'భలే దొంగలు' వంటి జనరంజక చిత్రంలోనూ జతకట్టారు. నటభూషణ్ శోభన్ బాబు: తెలుగులో మంజులకి బాగా అచ్చొచ్చిన జోడీ అంటే.. శోభన్ బాబు అనే చెప్పొచ్చు. 'మంచి మనుషులు'తో మొదలుకుని 'జేబు దొంగ', 'ఇద్దరూ ఇద్దరే', 'పిచ్చి మారాజు' వరకు భలే హిట్స్ అందుకున్నారు ఈ జంట. వీరి కాంబోలో వచ్చిన 'గడుసు పిల్లోడు' కూడా చెప్పుకోదగ్గ విజయం చూసింది. 

కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఏంటో తెలుసా!

శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరొందిన కోడి రామకృష్ణ.. ఒకవైపు స్టార్ హీరోలతో భారీ విజయాలు చూస్తూనే, మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనూ తనదైన ముద్ర వేశారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వివరాల్లోకి వెళితే.. తరంగిణి: 1982లో వచ్చిన హిట్ మూవీ ఇది. శ్యామల గౌరి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సుమన్, భానుచందర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. కోడి రామకృష్ణ కెరీర్ లో ఇదే మొదటి నాయికా ప్రాధాన్య చిత్రం. ముక్కు పుడక: 1983లో వచ్చిన ఈ సినిమాలో సుహాసినిది ప్రధాన పాత్ర. భానుచందర్, విజయశాంతి, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. తలంబ్రాలు: "ఇది పాట కానే కాదు.. ఏ రాగం నాకు రాదు" అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉన్న 'తలంబ్రాలు'లో జీవితది ప్రధాన పాత్ర అయితే.. రాజశేఖర్ ది నెగటివ్ రోల్. 1987లో ఈ సక్సెస్ ఫుల్ మూవీ జనం ముందు నిలిచింది. మధురానగరిలో: 1991లో వచ్చిన ఈ సినిమాలో నిరోషాది ప్రధాన పాత్ర అయితే.. శ్రీకాంత్, చిన్నా, రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పెళ్ళాం చెబితే వినాలి: టైటిల్ కి తగ్గట్టే ఇది మహిళల చుట్టూ తిరిగే సినిమా. మీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హరీష్ కథానాయకుడు. కోవై సరళ, రాజీవి, వై.విజయ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. 1992లో ఈ మూవీ రిలీజైంది. పోలీస్ లాకప్: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో వినోద్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. 1993లో ఈ సూపర్ హిట్ మూవీ రిలీజైంది. అమ్మోరు: 1995లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అభినేత్రి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆల్ రౌండర్ రమ్యకృష్ణది టైటిల్ రోల్. గ్రాఫిక్స్ గురించి తెలుగునాట పదే పదే మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది. దేవి: ప్రేమ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా అప్పట్లో విజువల్స్ పరంగా టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. 1999లో వచ్చిన 'దేవి' అఖండ విజయం సాధించింది. అరుంధతి: లేడీ సూపర్ స్టార్ అనుష్క దశ, దిశని మార్చివేసిన విజువల్ వండర్.. 'అరుంధతి'. జేజేమ్మగా అనుష్కని  ఆవిష్కరించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  (జూలై 23.. కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా)

శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలేంటో తెలుసా!

నటనకు పర్యాయపదంలా నిలిచిన తారల్లో 'నడిగర్ తిలగమ్' శివాజీ గణేశన్ ఒకరు. తమిళంలో తిరుగులేని కథానాయకుడిగా రాణించిన ఈ 'నవరస నాయగన్'.. మన తెలుగు సినిమాల్లోనూ సందడి చేశారు. ఇటు ముఖ్య పాత్రల్లోనూ, అటు అతిథి పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. శివాజీ గణేశన్ నటించిన తెలుగు చిత్రాల వివరాల్లోకి వెళితే..  పరదేశి: ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగులో 'పరదేశి' పేరుతో, తమిళంలో 'పూంగోతై' పేరుతోనూ రూపొందిన ఈ సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావుతో కలిసి నటించారు శివాజీ గణేశన్. ఈ చిత్రానికి ఎల్వీ ప్రసాద్ దర్శకుడు. 1953 సంక్రాంతి కానుకగా జనవరి 14న 'పరదేశి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పెంపుడు కొడుకు: ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే తయారైన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, మహానటి సావిత్రి, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రల్లో అభినయించారు. 1953 నవంబర్ 12న ఈ సినిమా రిలీజైంది.  మనోహర: ఈ సినిమాకి కూడా ఎల్వీ ప్రసాద్ నే దర్శకుడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం.. తమిళ వెర్షన్ లో 1954 మార్చి 3న రిలీజ్ కాగా, 1954 జూన్ 3న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. బొమ్మల పెళ్ళి: తమిళంలో 'బొమ్మై కళ్యాణమ్', తెలుగులో 'బొమ్మల పెళ్ళి' పేర్లతో ఏకకాలంలో నిర్మితమైన ఈ ద్విభాషా చిత్రంలో.. శివాజీ గణేశన్, జమున ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఆర్. ఎం. కృష్ణస్వామి ఈ సినిమాకి నిర్దేశకుడు. 1958 జనవరి 11న తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా.. అదే సంవత్సరం మే 3న తమిళ వెర్షన్ థియేటర్స్ బాట పట్టింది. నివురుగప్పిన నిప్పు: సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. కె. బాపయ్య రూపొందించిన ఈ మూవీ 1982 జూన్ 24న జనం ముందు నిలిచింది.  బెజవాడ బెబ్బులి: కృష్ణ, రాధిక జోడీగా నటించిన ఈ చిత్రంలో రవీంద్ర, ఏఎస్పీ రఘుగా ఎంటర్టైన్ చేశారు శివాజీ గణేశన్. 1983 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి విజయ నిర్మల దర్శకత్వం వహించారు.  విశ్వనాథ నాయకుడు:  దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో కృష్ణది టైటిల్ రోల్ కాగా.. ఆయన తండ్రి నాగమ నాయకుడిగా శివాజీ దర్శనమిచ్చారు. కృష్ణదేవరాయగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించారు. 1987 ఆగస్టు 14న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెండితెరపైకి వచ్చింది.  అగ్ని పుత్రుడు: తండ్రీకొడుకులు ఏయన్నార్, నాగార్జున కలిసి నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. 1987 ఆగస్టు 27న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించారు. పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బి.ఆర్. పంతులు తెరకెక్కించిన త్రిభాషా చిత్రమిది. టైటిల్ కి తగ్గట్టు ఇందులో పిల్లలు ప్రధాన పాత్రధారులు కాగా.. శివాజీ గణేశన్ ఓ స్పెషల్ రోల్ లో మెరిశారు. 1960 జూలై 1న ఈ చిత్రం రిలీజైంది.  రామదాసు: చిత్తూరు వి. నాగయ్య టైటిల్ రోల్ లో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటరత్న నందమూరి తారక రామారావు శ్రీరాముడిగా కనిపించగా.. శివాజీ గణేశన్ లక్ష్మణుడిగా దర్శనమిచ్చారు. 1964 డిసెంబర్ 23న ఈ బయోగ్రాఫికల్ మూవీ రిలీజైంది. బంగారు బాబు: ఏయన్నార్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ అతిథి పాత్రలో కనిపించారు. వీబీ రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1973 మార్చి 15న రిలీజైంది. భక్త తుకారం: ఇందులో టైటిల్ రోల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించగా.. శివాజీ పాత్రలో శివాజీ గణేశన్ దర్శనమిచ్చారు. వి. మధుసూదన రావు రూపొందించిన ఈ మూవీ 1973 జూలై 5న తెరపైకి వచ్చింది. జీవన తీరాలు: కృష్ణంరాజు, వాణిశ్రీ, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ గెస్ట్ రోల్ చేశారు. జీసీ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1977 ఆగస్టు 12న జనం ముందుకు వచ్చింది.  చాణక్య చంద్రగుప్త: ఎన్టీఆర్ చంద్రగుప్త మౌర్యగా.. ఏయన్నార్ చాణక్యుడిగా టైటిల్ రోల్స్ లో అలరించిన ఈ సినిమాలో అలెగ్జాండర్ గా కాసేపు మెరిశారు శివాజీ గణేశన్. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ 1977 ఆగస్టు 25న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది.  (జూలై 21.. శివాజీ గణేశన్ వర్థంతి సందర్భంగా)

బయోగ్రఫీ: దక్షిణ భారత చిత్ర పరిశ్రమ 'మార్లన్ బ్రాండో'.. శివాజీ గణేశన్!

(జూలై 21.. శివాజీ గణేశన్ వర్థంతి సందర్భంగా) సినిమా.. ఓ అందమైన ప్రపంచం. సామాన్య జనాన్ని అన్నీ మరిచి మరో లోకానికి తీసుకెళ్ళే అద్భుత వినోద సాధనం. అలాంటి సినీ రంగంలో ఎందరో నటులు ప్రేక్షకుల్ని అలరించారు. అయితే, కొందరు మాత్రమే తరతరాలు మాట్లాడుకునేలా చిరస్మరణీయ ముద్ర వేశారు. అలాంటి కొందరిలో.. తమిళనాట 'నడిగర్ తిలగమ్' గా పిలువబడే శివాజీ గణేశన్ ఒకరు. పేరుకి తమిళ నటుడే అయినా దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు హిందీ నాట కూడా తనదైన బాణీ పలికించారు శివాజీ. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ.. ఎంతోమంది ప్రముఖ నటులపై తన విలక్షణ అభినయంతో ప్రభావం చూపిన వైనం ఆయన సొంతం. నాలుగు దశాబ్దాలకి పైగా చిత్ర ప్రయాణంలో.. ఆయన వేయని వేషం లేదు. పొందని పురస్కారం లేదు. ఆయనకి దక్కని గౌరవం లేదు. అలాంటి శివాజీ గణేశన్ 22వ వర్థంతి సందర్భంగా.. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీకోసం..   శివాజీ గణేశన్ 1928 అక్టోబర్ 1న తమిళనాడులోని విల్లుపురంలో చిన్నయ్య మన్రోయార్, రాజమణి అమ్మాల్ దంపతులకు నాలుగో కుమారుడిగా జన్మించారు. ఆయన అసలు పేరు.. వి. చిన్నయ్య మన్రోయార్ గణేశమూర్తి.  ఏడేళ్ళ ప్రాయంలో తండ్రి అనుమతి లేకుండా టూరింగ్ స్టేజ్ డ్రామా కంపెనీలో చేరిన శివాజీ.. పదేళ్ళ వయసులో తిరుచిరాపల్లి వెళ్ళి అక్కడి సంగిలియండపురంలోని డ్రామా ట్రూప్ లో చేరారు.   డ్రామా ట్రూప్ ట్రైనర్స్ నుంచి నటన, నర్తనం నేర్చుకున్నారు. మరీముఖ్యంగా.. భరతనాట్యం, కథక్, మణిపురి నృత్యాల్లో తీసుకున్న శిక్షణ.. శివాజీ జీవితాన్నే మేలిమలుపు తిప్పింది. ఇక తనలోని అసాధారణ జ్ఞాపకశక్తి కారణంగా ఎంతటి డైలాగ్ నైనా గుర్తుంచుకునేవారు శివాజీ. ఆ జ్ఞాపక శక్తినే.. అతనికి నాటకాల్లో ప్రధాన పాత్రలు వరించేలాచేసింది. యుక్తవయసులో 'శివాజీ కాండ హిందూ రాజ్యం' అనే నాటకంలో శివాజీ పాత్ర ధరించి మెప్పించారు గణేశన్. అతని నటనకు ముగ్థుడైన ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఇ.వి. రామస్వామి.. 'శివాజీ గణేశన్' అని పిలిచారు. అలా.. చిన్నయ్య మన్రోయార్ గణేశమూర్తి కాస్త శివాజీ గణేశన్ గా మారారు.  నేషనల్ పిక్చర్స్ కి చెందిన పంపిణీదారుడు పి.ఎ. పెరుమాళ్ ముదలియార్ ప్రోత్సాహంతో.. 1952 సంవత్సరంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు శివాజీ గణేశన్. కృష్ణన్, పంజు ద్వయం రూపొందించిన 'పరాశక్తి' రూపంలో తొలి అవకాశం దక్కింది శివాజీకి. అయితే ఆ సినిమా నిర్మాణ సమయంలో శివాజీని తొలగించాలనుకున్నారు  ఏవీయమ్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపకుడైన ఏవీ మేయప్పన్. 2 వేల అడుగుల ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయ్యాక.. శివాజీ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చక అతని బదులు కేఆర్ రామస్వామిని తీసుకోవాలనుకున్నారు మేయప్పన్. అయితే, అందుకు పెరుమాళ్ ఒప్పుకోలేదు. శివాజీపై నమ్మకం ఉంచి సినిమాని పూర్తిచేయమన్నారు. చిత్రీకరణ పూర్తయ్యాక మాత్రం మేయప్పన్.. తృప్తిచెందారు. తనని అసంతృప్తికి గురిచేసిన సన్నివేశాలను శివాజీపై  రీషూట్ చేశారు. అలా.. ఎన్నో సందేహల మధ్య పూర్తయిన 'పరాశక్తి' 175 రోజుల పాటు ప్రదర్శితమై శివాజీకి గొప్ప శుభారంభాన్నిచ్చింది. శ్రీలంకకు చెందిన మిలన్ థియేటర్ లో ఈ చిత్రం దాదాపు 40 వారాల పాటు ప్రదర్శితమై అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కోసం శివాజీ గణేశన్ అందుకున్న నెలసరి వేతనం ఎంతో తెలుసా.. రూ. 250. 'పరాశక్తి' తరువాత వచ్చిన శివాజీ చిత్రాల్లో 'అంద నాళ్' అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ రోజుల్లో అస్సలు పాటల్లేకుండా తెరకెక్కడమే ఇందుకు కారణం. ఇందులో యాంటి హీరోగా భలేగా ఎంటర్టైన్ చేశారు శివాజీ. అలాగే, తన పోటీదారుడైన మరో అగ్ర కథానాయకుడు ఎం.జి. రామచంద్రన్ తో కలిసి 'కూన్డుక్కిలి' మూవీ చేశాడు. ఇందులో శివాజీది ప్రతినాయకుడి వేషం. ఈ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది.  'వీరపాండ్య కట్టబొమ్మన్'లో పోషించిన పాత్ర.. శివాజీ జీవితంలో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఈజిప్టులోని కైరోలో 1960 మార్చిలో జరిగిన ఆఫ్రో  ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకి గానూ 'ఉత్తమ నటుడు'గా పురస్కారం అందుకున్నారు శివాజీ. ఓ భారతీయ నటుడు..  ఇలా విదేశాల్లో 'ఉత్తమ నటుడు' అవార్డు అందుకోవడం అదే తొలిసారి. దీంతో.. వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ఈ 'నవరస నాయగన్'. ఇక 'మహానటి' సావిత్రితో కలిసి శివాజీ గణేశన్ నటించిన 'పాశమలర్' చిత్రం తన కెరీర్ లోనే కాదు తమిళ చిత్ర చరిత్రలోనే మైలురాయిలాంటి సినిమా. జాతీయ పురస్కారం పొందిన ఈ సిస్టర్ సెంటిమెంట్ మూవీ.. పలు భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో ఈ చిత్రాన్నే 'రక్తసంబంధం'గా రీమేక్ చేశారు నటరత్న నందమూరి తారక రామారావు.  జూమ్ టెక్నాలజీతో తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రంగా పేరొందిన 'ఉత్తమ పుత్రన్'లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన శివాజీ గణేశన్.. ఆపై తన వందో చిత్రం 'నవరాత్రి' కోసం ఏకంగా తొమ్మిది వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఇక తన  200వ చిత్రంగా రూపొందిన 'త్రిశూలమ్'లోనూ త్రిపాత్రాభినయంతో మెస్మరైజ్ చేశారు శివాజీ.  వీటితో పాటు మరెన్నో సినిమాల్లో విలక్షణ భూమికలు ధరించి జనుల్ని రంజింపజేశారు. కెరీర్ చివరి రోజుల్లో 'లోకనాయకుడు' కమల్ హాసన్ కి తండ్రిగా 'దేవరమగన్', సూపర్ స్టార్ రజినీకాంత్ కి నాన్నగా 'పడయప్పా'లో ఆకట్టుకున్నారు. తెలుగులో 'నరసింహ' పేరుతో అనువాదమైన 'పడయప్పా'.. శివాజీ నటించిన ఆఖరి చిత్రం కావడం విశేషం.  స్వతహాగా తమిళ నటుడైన శివాజీ గణేశన్.. కేవలం తమిళంకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రధాన పాత్రలతో పాటు అతిథి వేషాల్లోనూ ఆయా భాషల్లో వినోదం పంచారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 'పరదేశి' అనే ద్విభాషా చిత్రంతో మొదలుకుని 'పెంపుడు కొడుకు', 'మనోహర', 'బొమ్మల పెళ్ళి', 'నివురు గప్పిన నిప్పు', 'బెజవాడ బెబ్బులి', 'విశ్వనాథ నాయకుడు', 'అగ్ని పుత్రుడు' వరకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు శివాజీ. అదేవిధంగా 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం', 'రామదాసు', 'బంగారు బాబు', 'భక్త తుకారం', 'జీవన తీరాలు', 'చాణక్య చంద్రగుప్త' వంటి తెలుగు సినిమాల కోసం గెస్ట్ రోల్స్ చేశారు. తెలుగులో అనువాదమైన, నేరుగా నిర్మితమైన పలు శివాజీ గణేశన్ చిత్రాలకు శివాజీ గణేశన్ కి మ్యాచ్ అయ్యేలా ప్రముఖ నటులు జగ్గయ్య డబ్బింగ్ చెప్పేవారు. ఇక శివాజీ గణేశన్ చిత్ర ప్రస్థానాన్ని.. "పరాశక్తి ముదల్ పడయప్పా వరై" అనే డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచడం జరిగింది.  సినిమాల్లో తిరుగులేని తారగా రాణించిన శివాజీ గణేశన్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందే 'ద్రవిడర్ కళగమ్'లో కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసిన గణేశన్.. 1949లో అన్నాదురై స్థాపించిన 'ద్రవిడ మున్నేట్ర కళగం'లో చేరారు. 1956 వరకు గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల డీఎంకే పార్టీని విడిచిన శివాజీ..  ఆనక నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే ఇందిరా గాంధీ మరణంతో శివాజీ రాజకీయ జీవితం మసకబారినట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే.. తరువాతి కాలంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం స్ఫూర్తితో 1988 సంవత్సరంలో 'తమిళగ మున్నేట్ర మున్నాని' పేరుతో సొంత పార్టీని స్థాపించారు శివాజీ. అయితే, ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయారు. ఆపై వి.వి. సింగ్ నేతృత్వంలో 'జనతాదళ్'లో చేరారు. క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.  చిత్ర పరిశ్రమలో చేసిన కళా సేవకు గానూ 1966లో పద్మశ్రీ, 1984లో పద్మభూషణ్, 1996లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1986లో గౌరవ డాక్టరేట్, 1996లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పొందిన శివాజీ.. 1995లో ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున 'చెవిలియర్' పురస్కారం పొందారు. అలాగే తన అభినయానికి గానూ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు తమిళనాడు స్టేట్ అవార్డ్స్ తో పాటు స్పెషల్ మెన్షన్ విభాగంలో జాతీయ పురస్కారం సైతం అందుకున్నారు శివాజీ. ఇక 'లాస్ ఏంజెల్స్ టైమ్స్' అప్పట్లో శివాజీని 'దక్షిణ భారత చిత్ర పరిశ్రమ మార్లన్ బ్రాండో'గా అభివర్ణించడం విశేషం.  శివాజీ గణేశన్ పలు పర్యాయాలు తనలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విద్యాసంబంధిత విషయాల్లో, 1965 నాటి ఇండో -పాకిస్థాన్ వార్ సమయంలో పెద్దమొత్తంలో ధన సహాయం చేశారు. అలాగే వేంకటేశ్వర ఆలయం, బృహదీశ్వర ఆలయం, తంజావూర్ టెంపుల్స్ కి ఏనుగులను విరాళమిచ్చారు. ఇక వీరపాండ్య కట్టబొమ్మన్ ఉరితీయబడిన కయతరు స్థలం కొని తన ఖర్చులతో వీరపాండ్య కట్టబొమ్మన్ విగ్రహం స్థాపించారు.   శివాజీ వారసత్వం విషయానికి వస్తే.. 1952లో ఆయన కమలని వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడబిడ్డలు. మగపిల్లల్లో ఒకరైన ప్రభు కథానాయకుడిగా పలుచిత్రాల్లో ఆకట్టుకున్నారు.  మరో కుమారుడైన రామ్ కుమార్ శివాజీ సొంత సంస్థ అయిన శివాజీ ప్రొడక్షన్స్ ని కొనసాగించారు. అలాగే ప్రభు కుమారుడైన విక్రమ్ ప్రభు.. రామ్ కుమార్ తనయుడైన దుశ్యంత్ రామ్ కూడా నటనలో తమదైన ముద్ర వేస్తూ తాత వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.  శివాజీ గణేశన్ చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.  దీర్ఘకాలిక గుండె సంబంధిత జబ్బుతో పాటు శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో 2001 జూలై 1న చేరిన ఆయన.. జూలై 21న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు వేలాది అభిమానులు, రాజకీయ నాయకులు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కళాకారుడిగా, సంఘసేవకుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రవేసిన శివాజీ గణేశన్ జీవితం.. ఎందరికో ఆదర్శప్రాయం. 

కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ 'స్నేహబంధం'కి 50 ఏళ్ళు!

తెలుగునాట స్నేహితుల కథలతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో 'స్నేహబంధం'కి ప్రత్యేక స్థానం ఉంది. రక్త సంబంధం కన్న స్నేహబంధం పటిష్టమైనదని నిరూపించే ఈ కుటుంబ గాథలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మిత్రులుగా కనిపించారు. జమున, లీలారాణి, శ్రీరంజని, గుమ్మడి, రాజబాబు, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పి. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు సంభాషణలు సమకూర్చారు. చిత్ర నిర్మాత యన్.వి. సుబ్బరాజు స్వయంగా కథను అందించడం విశేషం.  సత్యం సంగీతమందించిన ఈ సినిమాకి ఆత్రేయ, సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. ఇందులోని "స్నేహబంధం ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము" (ఎస్పీ బాలు, సుశీల, జి. ఆనంద్), "స్నేహబంధం ఎంత మధురము అది చెరిగిపోయి చేదైతే బ్రతుకు శూన్యము" (సుశీల, బాలు), "మోమాటపడకండి మొగుడుగారు" (ఘంటసాల, సుశీల), "ఇద్దరమూ గదిలో" (బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి), "షి ఉంటేనే షికారు కారుంటేనే హుషారు" (రామకృష్ణ, సుశీల), "ఎవడమ్మా వాడెవడమ్మా" (సుశీల) అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. బి. అచ్యుతరామరాజు సమర్పణలో శ్రీ వాణీ కంబైన్స్ పతాకంపై యన్.వి. సుబ్బరాజు నిర్మించిన 'స్నేహబంధం'.. 1973 జూలై 20న విడుదలై ప్రజాదరణ పొందింది. నేటితో ఈ చిత్రం 50 వసంతాలు పూర్తిచేసుకుంది. 

'పంతాలు పట్టింపులు'కి 55 ఏళ్ళు.. కృష్ణ మిస్ శోభన్ బాబు ఎస్!

నట భూషణ్ శోభన్ బాబుకి అచ్చొచ్చిన కథానాయికల్లో కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు..  అప్పటి జనాల్ని ఆకట్టుకున్నాయి. అలాంటి చిత్రాల్లో 'పంతాలు పట్టింపులు' ఒకటి. ఓ మరాఠి మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ సంగీత, నృత్య ప్రధాన చిత్రాన్ని తిలక్ డైరెక్ట్ చేశారు. గీతాంజలి, లీలా గాంధీ, గుమ్మడి, రమణారెడ్డి, రమాప్రభ, మాలతి, ఛాయాదేవి ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పినిశెట్టి మాటలు అందించగా.. శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు పాటలు రాశారు.  కథ విషయానికి వస్తే.. మురళి (శోభన్ బాబు) ఎంతో కష్టపడి కళారంజని (లీలా గాంధీ)కి నాట్యం నేర్పిస్తాడు. ఆ నాట్యంతో ఆమెకి మంచి పేరు వస్తుంది కూడా. కానీ ఒక నాట్య ప్రదర్శనలో అతని వాయిద్యానికి తగిన అడుగులు వేయలేక మురళిదే తప్పు అంటుంది కళారంజని. పైగా లయ తప్పింది అంటుంది. అంతేకాదు.. తనలాంటి మరో నాట్యగత్తెను తయారుచేయలేవని సవాలు చేస్తుంది. మరో మంచి నాట్యగత్తెను సృష్టించి ఆమెని ఓడిస్తానని సవాలు పై సవాలు చేస్తాడు. ఈ క్రమంలోనే.. ప్రతిభావంతులైన అక్కాచెల్లెళ్ళు జిమ్మి (వాణిశ్రీ), సోనీ (గీతాంజలి)కి నృత్యం నేర్పిస్తాడు. అయితే ఇద్దరు కూడా మురళిని ప్రేమిస్తారు. ఈ నేపథ్యంలో.. మురళి పంతం నెరవేరిందా? లేదా? అన్నది మిగిలిన సినిమా. శోభన్ బాబు, వాణిశ్రీ, గీతాంజలి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. మరీముఖ్యంగా.. వాణిశ్రీ, గీతాంజలి నృత్యాలు కనువిందుగా ఉంటాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తొలుత ఈ సినిమాలోని మురళి పాత్రకి సూపర్ స్టార్ కృష్ణ ని ఎంచుకున్నారట. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల శోభన్ బాబు ఆ పాత్రని ధరించారు. పెండ్యాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలో భాగమైన `తమాషా` నృత్యం తాలూకు పాటలకు ఆయన అందించిన మ్యూజిక్ గుర్తుండిపోయేలా ఉంటుంది. శ్రీ శంభూ ఫిల్మ్స్ పతాకంపై దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి నిర్మించిన 'పంతాలు పట్టింపులు'.. 1968 జూలై 19న విడుదలైంది. నేటితో ఈ సినిమా 55 ఏళ్ళు పూర్తిచేసుకుంది. 

"ధనమేరా అన్నింటికి మూలం".. 'లక్ష్మీ నివాసం'కి 55 ఏళ్ళు

'శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం' అనే పాయింట్ తో రూపొందిన సినిమా 'లక్ష్మీ నివాసం'. విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయనకి జంటగా అంజలీ దేవి కనిపించగా.. సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు, కళాభినేత్రి వాణిశ్రీ, భారతి, పద్మనాభం, విజయలలిత, రామ్మోహన్, చిత్తూరు వి. నాగయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆరుద్ర రచన చేశారు.  'దుడ్డే దొడ్డప్ప' అనే కన్నడ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  కథ విషయానికి వస్తే.. స్వయంకృషితో శ్రీమంతుడైన సుబ్బయ్య (ఎస్వీఆర్)కి భార్య శారద (అంజలీదేవి), ముగ్గురు పిల్లలు చంద్రం (కృష్ణ), రాజు (పద్మనాభం), కల్పన (భారతి) ఉంటారు. అయితే వీరెవరికి డబ్బు విలువ తెలియదు. వృథా ఖర్చులు చేసేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. భార్యాబిడ్డల ప్రవర్తనలో మార్పు కోసం గోపాల్ (చిత్తూరు వి. నాగయ్య), అతని పిల్లలు ఆనంద్ (శోభన్ బాబు), ఆశ (వాణిశ్రీ) సహాయం తీసుకుంటాడు సుబ్బయ్య. చివరికి అందరిలోనూ మార్పు రావడంతో.. కథ సుఖాంతమవుతుంది. పాయింట్ సింపుల్ గా ఉన్నా..  సినిమాని తీర్చిదిద్దిన విధానం బాగుంటుంది. అలాగే.. చిత్రం ప్రారంభంలో ఎస్వీఆర్ కాలం, ధనం విలువ గురించి చెప్పే మాటలతో పాటు "పేదరికమే పెద్ద గురువు" వంటి సంభాషణలు ఆలోచింపజేసేలా ఉంటాయి.  ఇక స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ అందించిన పాటల విషయానికి వస్తే.. "ధనమేరా అన్నింటికి మూలం" ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే "నవ్వు నవ్వించు", "గువ్వలాంటి చిన్నది", "చేయి చేయి కలుపు", "ఓహో ఊరించే అమ్మాయి", "ఇల్లే కోవెల చల్లని వలపే దేవత", "సోడా సోడా ఆంధ్రా సోడా" అంటూ మొదలయ్యే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. వీనస్ - పద్మిని కంబైన్స్ పతాకంపై టి. గోవింద రాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1968 జూలై 19న విడుదలై మంచి విజయం సాధించిన 'లక్ష్మీ నివాసం'.. నేటితో 55 వసంతాలు పూర్తిచేసుకుంది.     

జగ్గయ్య, కృష్ణకుమారి 'అనుబంధాలు'కి 60 ఏళ్ళు.. వీనుల విందైన పాటలు ఎస్సెట్!

విలక్షణ అభినయానికి చిరునామాగా నిలిచారు ప్రముఖ నటులు కొంగర జగ్గయ్య. కథానాయకుడిగానూ ఆయన కొన్ని చిత్రాల్లో అలరించారు. వాటిలో 'అనుబంధాలు' ఒకటి. ఇందులో జగ్గయ్యకి జంటగా కృష్ణకుమారి నటించారు. పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గుమ్మడి వెంకటేశ్వరరావు, సూర్యకాంతం, రమణారెడ్డి, పద్మనాభం, బేబి పద్మిని, పేకేటి, స్వర్ణ, చదలవాడ, కేవీఎస్ శర్మ, ఏవీ సుబ్బారావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పిచ్చేశ్వరరావు సంభాషణలు సమకూర్చారు.  ఎం.బీ. శ్రీనివాస్ సంగీతమందించగా.. దాశరథి, కొసరాజు రాఘవయ్య, సముద్రాల, సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. "ఇద్దరు అనుకొని ప్రేమించడమే" (పీబీ శ్రీనివాస్, జమునా రాణి), "నా పేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు" (ఎల్. ఆర్. ఈశ్వరి), "ఒకరొకరు చేయి కలుపుదాం" (మాధవపెద్ది బృందం), "తీవెకు పూవే అందం" (పి. సుశీల), "చల్లని తల్లి ఇల్లాలే" (ఘంటసాల), "ఈ రేయి కరిగిపోనున్నది" (జమునా రాణి), "చిన్న చిన్న పిల్లలము" (ఎల్. ఆర్. ఈశ్వరి, కె. రాణి) అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. వాసవి ఫిలిమ్స్ పతాకంపై కె. వెంకటేశ్వరరావు, కేయస్ మార్కండేయులు నిర్మించిన 'అనుబంధాలు'.. 1963 జూలై 19న జనం ముందు నిలిచింది. నేటితో ఈ చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంది. 

రాజశేఖర్ 'ఆగ్రహం'కి 30 ఏళ్ళు.. దేశం కోసమే బతకాలనుకునే సోల్జర్ కథ!

ఆవేశపూరిత పాత్రలకు పెట్టింది పేరు.. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్. 'అంకుశం' వంటి సంచలన చిత్రం తరువాత ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ బేనర్ లో ఆయన నటించిన 'ఆగ్రహం' కూడా ఈ తరహా పాత్రతో రూపొందిన సినిమానే. కె.యస్. హరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజశేఖర్ సరసన అమల నటించింది. కథానాయికగా ఇదే ఆమె చివరి చిత్రం కావడం విశేషం. పధిరె కృష్ణారెడ్డి, బాబూ మోహన్, బెంగుళూరు పద్మ, రామ్ గోపాల్, రమేశ్, ఎన్. వీరాస్వామి, గాదిరాజు సుబ్బారావు, సుందర రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి, సంధ్య, సంధ్యశ్రీ, బేబి శ్రేష్ఠ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.  కథ విషయానికి వస్తే.. తన ఊపిరి ఉన్నంత కాలం దేశం కోసమే బతకాలనుకునే ఓ సోల్జర్.. రౌడీ రాజకీయ నాయకుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? ఈ క్రమంలో ఏం కొల్పోయాడు? అన్నది 'ఆగ్రహం' సినిమా. ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ యూనిట్ కథ, స్క్రీన్ ప్లే ను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. రాజ్ - కోటి బాణీలు కట్టిన ఈ సినిమాకి మల్లెమాల, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహితి పదరచన చేశారు. పాటల్లో "నిన్ను కోరి వచ్చా రాజశేఖరా" అమితంగా ఆకట్టుకుంది. యం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో 1993 జూలై 19న జనం ముందు నిలిచిన 'ఆగ్రహం'.. బుధవారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.   

దర్శకుడిగా ఎస్వీఆర్.. ఎన్ని సినిమాలు తీశారో తెలుసా!

  (జూలై 18.. ఎస్వీఆర్ వర్థంతి సందర్భంగా) ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయప్రవేశం చేసే.. అతికొద్దిమంది నటుల్లో 'విశ్వ నట చక్రవర్తి' ఎస్వీఆర్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల చిత్ర ప్రయాణంలో ఆయన పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే, కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడిగానూ, నిర్మాతగానూ అవతారమెత్తారు ఈ నటదిగ్గజం. మరీముఖ్యంగా.. దర్శకుడిగా తన ఉత్తమాభిరుచిని చాటుకున్నారు ఎస్వీఆర్. అందుకు నిదర్శనం.. ఆయా చిత్రాలకు దక్కిన పురస్కారాలు. ఎస్వీఆర్ మెగాఫోన్ పట్టిన ఆ సినిమాల వివరాల్లోకి వెళితే.. చదరంగం(1967): ఎస్వీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హరనాథ్, జమున, అంజలీదేవి, రామకృష్ణ, రమణారెడ్డి, ధూళిపాళ, రాజబాబు, రమాప్రభ, అన్నపూర్ణ, మీనాకుమారి, ముక్కామల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. డీవీ నరసరాజు కథ, మాటలు అందించిన ఈ సినిమాకి దాశరథి సాహిత్యమందించారు. టీవీ రాజు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో "నవ్వని పువ్వే నవ్వింది" పాట ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచింది. ఎస్వీఆర్ ఫిల్మ్స్ పతాకంపై బడేటి సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. 1967లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. 'ద్వితీయ ఉత్తమ చిత్రం' విభాగంలో 'నంది' పురస్కారాన్ని అందుకుంది.  బాంధవ్యాలు (1968):  'చదరంగం' విడుదలైన తదుపరి సంవత్సరంలో ఈ సినిమా  వచ్చింది. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమా.. 'బాంధవ్యాలు' చుట్టూ అల్లుకున్న కుటుంబ కథా చిత్రం. ఇందులోనూ ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో కనిపించగా.. ప్రముఖ నటి లక్ష్మి ఈ సినిమాతోనే తెలుగునాట తొలి అడుగేశారు.  సావిత్రి, ధూళిపాళ, చంద్రమోహన్, చిత్తూరు వి. నాగయ్య, రాజనాల, హరనాథ్, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. డీవీ నరసరాజు రచన చేసిన ఈ సినిమాకి సాలూరి హనుమంత రావు సంగీతమందించగా, సి. నారాయణరెడ్డి -  కొసరాజు సాహిత్యమందించారు. ఎస్వీఆర్ రూపొందించిన రెండో చిత్రంగా జనం ముందు నిలిచిన ఈ ఫ్యామిలీ డ్రామా.. 1968లో రిలీజై జనాల్ని రంజింపజేసింది. 1968కి గానూ 'ఉత్తమ చిత్రం'గా 'నంది' పురస్కారాన్ని అందుకుంది. ఈ సినిమాని కూడా ఎస్వీఆర్ ఫిల్మ్స్ సంస్థనే నిర్మించింది. బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు నిర్మాతలు. మొత్తమ్మీద.. తన స్వీయ దర్శకత్వంలో తయారై వరుస సంవత్సరాల్లో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా 'నంది' పురస్కారాలు అందుకుని.. నిర్దేశకుడిగా ఎస్వీఆర్ ఉత్తమాభిరుచిని చాటిచెప్పాయి. 

టాప్ స్టార్స్ తో సౌందర్య టాప్ హిట్స్.. ఆ మూవీస్ ఏంటో తెలుసా!

(జూలై 18.. 'సౌందర్య' జయంతి సందర్భంగా) అభినేత్రి సౌందర్య.. వెండితెరపై ఓ మధుర జ్ఞాపకం. నిన్నటి తరం అగ్ర కథానాయకులందరితోనూ కలిసి నటించిన సౌందర్య.. ఏయే స్టార్ హీరోతో ఎలాంటి టాప్ హిట్స్ అందుకున్నారంటే.. సూపర్ స్టార్ కృష్ణ: 'నంబర్ వన్', 'అమ్మ దొంగా' వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో కృష్ణకి జంటగా సందడి చేశారు సౌందర్య.  మెగాస్టార్ చిరంజీవి: 'చూడాలని వుంది!', 'అన్నయ్య' వంటి ఘనవిజయాలు.. చిరు - సౌందర్య కాంబినేషన్ లో వచ్చాయి.  కింగ్ నాగార్జున: 'హలో బ్రదర్' వంటి సెన్సేషనల్ మూవీతో పాటు 'నిన్నే ప్రేమిస్తా', 'ఆజాద్' వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నాగ్, సౌందర్య జోడీ అలరించింది.  విక్టరీ వెంకటేశ్: తెలుగుతెరపై తిరుగులేని జంటల్లో ఒకటిగా నిలిచిన వెంకీ - సౌందర్య కలయికలో 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'పవిత్ర బంధం', 'పెళ్ళి చేసుకుందాం', 'రాజా', 'జయం మనదేరా' వంటి ఘనవిజయాలు ఉన్నాయి.  సూపర్ స్టార్ రజినీకాంత్: 'అరుణాచలం', 'నరసింహ'.. ఇలా రజినీకాంత్, సౌందర్య కలిసి నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఈ రెండు కూడా తమిళ్ డబ్బింగ్ మూవీస్.  నటకిరీటి రాజేంద్ర ప్రసాద్: 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'మాయలోడు', 'మేడమ్'.. వంటి హ్యాట్రిక్ విజయాలు రాజేంద్ర ప్రసాద్, సౌందర్య జంట సొంతం. ఈ మూడు సినిమాలు కూడా హాస్యభరితమైనవే కావడం విశేషం. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు: 'పెదరాయుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తో పాటు 'శ్రీరాములయ్య' వంటి సక్సెస్ ఫుల్ మూవీ కూడా మోహన్ బాబు, సౌందర్య కాంబోలో ఉంది. అందాల నటుడు సుమన్: సుమన్ తో సౌందర్య జట్టుకట్టిన సినిమాల్లో 'దొంగల్లుడు' చెప్పుకోదగ్గ విజయం సాధించింది.  యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్: 'మా ఆయన బంగారం', 'సూర్యుడు' వంటి మంచి హిట్స్ రాజశేఖర్ జతగా అందుకున్నారు సౌందర్య.  ఫ్యామిలీ హీరో జగపతి బాబు: 'చిలకపచ్చ కాపురం', 'దొంగాట', 'పెళ్ళి పీటలు' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో పెయిర్ గా కనిపించి ఆకట్టుకున్న జగపతి బాబు, సౌందర్య.. సూపర్ హిట్ మూవీ 'అంత: పురం' కోసం కలిసి నటించి మెప్పించారు.   మైటీ స్టార్ శ్రీకాంత్:  'నిన్నే ప్రేమిస్తా' వంటి సక్సెస్ ఫుల్ మూవీ.. శ్రీకాంత్  - సౌందర్య కాంబోలో వచ్చింది.