లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాలూరు రాజేశ్వ‌ర‌రావు ఏడేళ్లు బెడ్ మీదే ఉన్నారు!

  తెలుగు సినిమా సంగీత స్వ‌రూపాన్ని మార్చిన ఘ‌నుడిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు సంపాదించారు సాలూరు రాజేశ్వ‌ర‌రావు. అనుస‌ర‌ణ‌లూ అనుక‌ర‌ణ‌లూ లేకుండా కొత్త శైలిలో సంగీతాన్ని సృష్టించారు. ఆయ‌న స్వ‌రాలు కూర్చిన 'ఇల్లాలు' చిత్రంలోని పాట‌లు అప్ప‌ట్లో కేవ‌లం తెలుగు ప్రాంతంలోనే కాకుండా మొత్తం ద‌క్షిణాదిలోనే ఓ సంచ‌ల‌నం. మ‌ల్లీశ్వ‌రి, మిస్స‌మ్మ‌, ఇద్ద‌రు మిత్రులు, ఆరాధ‌న‌, డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి, రంగుల రాట్నం, పూల రంగ‌డు, మ‌నుషులంతా ఒక్క‌టే, కురుక్షేత్ర‌ము లాంటి సినిమాల‌కు ఆయ‌న స్వ‌రాలు కూర్చిన పాట‌ల‌ను మ‌ర‌చిపోయేదెవ‌రు! చివ‌రి రోజుల్లో ఆయ‌న బెడ్‌మీద ఏకంగా ఏడు సంవ‌త్స‌రాలు ఉన్నార‌నే విష‌యం ఇప్ప‌టి సంగీత ప్రియుల‌కు, గాయ‌నీ గాయ‌కుల‌కు, సంగీత ద‌ర్శ‌కుల‌కు చాలామందికి తెలీదు. కృష్ణంరాజు సొంత సినిమా 'తాండ్ర పాపారాయుడు'కు ర‌స‌గుళిక‌ల్లాంటి పాట‌ల‌ను అందించిన సాలూరి, దాని త‌ర్వాత 'అయ్య‌ప్ప పూజాఫ‌లం' అనే చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఆ సినిమా కోసం నాలుగు ప‌ద్యాలు, మూడు పాట‌లకు స్వ‌రాలు కూర్చారు. ఎస్పీ బాలు, ఏసుదాస్‌, పి. సుశీల‌తో పాట‌లు పాడించి రికార్డు చేయించారు. కానీ ఆ సినిమా ఆ పాట‌ల రికార్డింగ్‌తోటే ఆగిపోయింది. ఓ రోజు ఆయ‌న‌కు ఎక్కిళ్లు రావ‌డం మొద‌లై ఎంత‌కీ ఆగ‌లేదు. వాళ్లింటి స‌మీపంలో ఉండే ఫ్యామిలీ డాక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌ను పిలిపించారు. ఆయ‌న మందు ఇచ్చాక ఎక్కిళ్లు త‌గ్గాయి. కానీ అనూహ్యంగా రాజేశ్వ‌ర‌రావు శ‌రీరంలో ఒక‌వైపు ప‌క్ష‌వాతం వ‌చ్చేసింది. ఆయ‌న‌కు అంత‌దాకా బీపీ కానీ, షుగ‌ర్ కానీ లేవు. కానీ ఒక్క‌సారిగా హైబీపీతో పాటు సెరిబ్ర‌ల్ పెరాల‌సిస్‌కు గుర‌య్యారు. ఫ‌లితం.. ఏడేళ్లు మంచంమీదే ఉండిపోయారు. ఉలుకూ ప‌లుకూ లేదు. కొంత‌కాలం హాస్పిట‌ల్‌లో.. కొంత‌కాలం ఇంట్లో బెడ్ మీదే ఉన్నారు. నోట్లో ట్యూబ్‌తో పాలు ప‌ట్టేవారు ఇంట్లోవారు. టాబ్లెట్లు కూడా పొడిచేసి నోట్లో వేసేవారు. ఐదుగురు కొడుకులు, ఐదుగురు కోడ‌ళ్లు రాజేశ్వ‌ర‌రావు ప‌సిబిడ్డ‌లాగా చూసుకున్నారు. అలా బెడ్ మీద ఉండే మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఆడుకుంటూ వ‌చ్చారు. అద్భుత‌మైన, స‌మ్మోహ‌న‌మైన స్వ‌రాల‌తో తెలుగు సినిమా పాట‌ను సుసంప‌న్నం చేసిన సాలూరు రాజేశ్వ‌ర‌రావు 1999 అక్టోబ‌ర్ 25న తుదిశ్వాస విడిచారు. సంగీత ద‌ర్శ‌కులుగా ఆయ‌న వార‌స‌త్వాన్ని ఆయ‌న కుమారులు వాసూరావు, కోటి కొన‌సాగించారు. (నేడు సాలూరి రాజేశ్వ‌ర‌రావు 23వ వ‌ర్ధంతి)

బ్లాక్‌బ‌స్ట‌ర్ 'య‌మ‌గోల' వెనుక ఇంత క‌థ జ‌రిగింది!

  ఎన్టీ రామారావు క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు రూపొందించిన 'య‌మ‌గోల' (1977) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, మ్యూజికల్‌గానూ సంచ‌ల‌నం సృష్టించింది. అందాల తార‌ జ‌య‌ప్ర‌ద నాయిక‌గా న‌టించిన ఈ మూవీలో య‌మునిగా స‌త్య‌నారాయ‌ణ‌, చిత్ర‌గుప్తునిగా అల్లు రామ‌లింగ‌య్య చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టించింది. రావు గోపాల‌రావు విల‌నీ ఈ సినిమాకు ఎస్సెట్‌. చ‌క్ర‌వ‌ర్తి సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ పాపుల‌రే. ఆడవె అందాల సురభామిని పాడవె కళలన్ని ఒకటేనని, ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, చిలక కొట్టుడు కొడితే, సమరానికి నేడే ఆరంభం, వయసు ముసురు, గుడివాడ వెళ్ళాను పాట‌లు జ‌నం నోళ్ల‌లో నానాయి.  అదివ‌ర‌కే సోషియో ఫాంట‌సీ ఫిల్మ్ దేవాంత‌కుడుతో హిట్ సాధించిన ఎన్టీఆర్‌, అదే త‌ర‌హా క‌థ‌తో రెండోసారి అంత‌కు మించి బాక్సాఫీస్ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డం విశేషం. చిత్ర‌గుప్తుడు చేసిన పొర‌పాటుతో ఒక‌రి బ‌దులుగా చ‌నిపోయి య‌మ‌లోకం వెళ్లిన స‌త్యం అనే యువ‌కుడు అక్క‌డ చేసిన అల్ల‌రి, య‌మ‌భ‌టుల‌తో క‌లిసి విప్ల‌వాన్ని రేకెత్తించి, య‌ముడిని హ‌డ‌లెత్తించ‌డం, తిరిగి భూలోకానికి రావ‌డం, అత‌డిని వెతుక్కుంటూ చిత్ర‌గుప్త స‌మేతంగా య‌ముడు భూలోకానికి వ‌చ్చి హంగామా చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచాయి. అలాంటి ఈ సినిమా తియ్య‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచింది. నిజానికి 'య‌మ‌గోల' అనే టైటిల్ అల‌నాటి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు చిత్త‌జ‌ల్లు పుల్ల‌య్య‌ది. పురాణాల మీద సెటైరిక‌ల్ పిక్చ‌ర్ తీయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న య‌మ‌గోల టైటిల్‌ను ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు. ర‌చ‌యిత ఆదుర్తి న‌ర‌సింహ‌మూర్తి (ఆదుర్తి సుబ్బారావు త‌మ్ముడు)తో కొంత క‌థ త‌యారుచేయించారు. ఏ కార‌ణం చేత‌నో ఆ క‌థ పూర్తి కాలేదు. కొన్నాళ్ల‌కు పుల్ల‌య్య క‌న్నుమూశారు. త‌ర్వాత ఆయ‌న కుమారుడు, ద‌ర్శ‌కుడు సి.య‌స్‌. రావు.. ఆ క‌థ‌ను సొంతంగా త‌న అభిప్రాయాల‌తో ఆయ‌న రాసుకున్నారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌టికే ఓ సినిమా తీసిన నిర్మాత డి.ఎన్‌. రాజు, మ‌రో సినిమా తియ్యాల‌ని అనుకున్న‌ప్పుడు త‌న 'య‌మ‌గోల' స్క్రిప్టును ఇచ్చారు సి.య‌స్‌. రావు. ఆయ‌న చ‌దివి, ఆ ఫైలును ప్ర‌ముఖ నిర్మాత డి.వి.య‌స్‌. రాజుకు ఇచ్చారు, అభిప్రాయం చెప్ప‌మ‌ని. అప్ప‌టికే త‌ను తీయ‌బోయే సినిమాకు రైట‌ర్‌గా డి.వి. న‌ర‌స‌రాజును తీసుకున్నారు డీవీయ‌స్ రాజు. ఆయ‌న ఆ ఫైల్‌ను న‌ర‌స‌రాజుకు ఇచ్చారు. ఆ స్క్రిప్టు న‌ర‌స‌రాజుకు అంత‌గా న‌చ్చ‌లేదు. అంత‌టితో డి.ఎన్‌. రాజు ఆ స్క్రిప్టును ప‌క్క‌న పెట్టేశారు. అయితే దాని విష‌యం తెలుసుకున్న డి. రామానాయుడు ఆ స్క్రిప్టు హ‌క్కులు కొనుక్కున్నారు. టైటిల్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని కొన్న ఆయ‌న‌, త‌ర్వాత ఆ క‌థ చ‌దివి, న‌చ్చ‌క‌పోవ‌డంతో మూల‌న ప‌డేశారు. దాంతో ఆ స్క్రిప్టు క‌థ‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. అయితే న‌ర‌స‌రాజు సూచ‌న మేరకు రామానాయుడు నుంచి స్క్రిప్టును కాకుండా కేవ‌లం 'య‌మ‌గోల' టైటిల్ హ‌క్కుల్ని 5 వేల రూపాయ‌ల‌కు నిర్మాత య‌స్‌. వెంక‌ట‌ర‌త్నం కొన్నారు. తాతినేని రామారావు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తియ్యాల‌నే నిర్ణ‌యం జ‌రిగింది. అప్ప‌టికే వ‌చ్చిన ఎన్టీఆర్ హిట్ సినిమా 'దేవాంత‌కుడు' త‌ర‌హాలోనే హీరో స్వ‌ర్గ‌న‌ర‌కాల‌కు వెళ్లిన‌ట్లు క‌ల రావ‌డం వ‌ర‌కు తీసుకొని, మిగ‌తా క‌థ అంతా వేరే విధంగా త‌యారు చేయాల‌నుకున్నారు న‌ర‌స‌రాజు, రామారావు, వెంక‌ట‌ర‌త్నం. ముగ్గురూ కూర్చొని క‌థ మీద ప‌నిచేశారు. 20 రోజుల్లో క‌థ సంతృప్తిక‌రంగా వ‌చ్చింది. హీరోగా బాల‌కృష్ణ‌నూ, య‌ముడిగా ఎన్టీఆర్‌నూ తీసుకోవాల‌ని అనుకున్న వెంక‌ట‌ర‌త్నం, ఎన్టీఆర్‌ను క‌లిసి ఆ విష‌యం చెప్పారు. న‌ర‌స‌రాజు చెప్పిన క‌థ విన్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చేసింది. "హీరో వేషం బాల‌కృష్ణ మోయ‌లేడండీ. నేనే వేయాల్సినంత ఇంపార్టెన్స్ ఉంది. అది నేను వేస్తాను. య‌ముడి పాత్ర‌ను స‌త్య‌నారాయ‌ణ చేత వేయిద్దాం" అన్నారు.  అలా షూటింగ్ మొద‌లైంది. య‌మ‌లోకం సీన్స్‌ను వాహినీ స్టూడియోలో వేసిన సెట్‌లో తీశారు. సినిమా రిలీజ‌య్యాక సూప‌ర్ హిట్ట‌యింది. య‌మ‌లోకం సీన్స్‌కు ఆడియెన్స్ బ్ర‌హ్మాండంగా రియాక్ట‌య్యారు. ఆ సినిమా డైలాగ్స్‌తో వ‌చ్చిన గ్రామ‌ఫోన్ రికార్డులు తెగ అమ్ముడుపోయాయి. డైలాగ్స్ అన్నిట్లోకీ, "చిత్ర‌గుప్తా! పెట్టెకు తాళం వేయ‌లేదా?" అని య‌ముడు అడిగితే, "తాళ‌ము వేసితిని, గొళ్లెము మ‌ర‌చితిని" అని చిత్ర‌గుప్తుడు చెప్పేది విప‌రీతంగా జ‌నం నోళ్ల‌లో నానింది. నేటికి స‌రిగ్గా 45 సంవ‌త్స‌రాల క్రితం.. 1977 అక్టోబ‌ర్ 21న 'య‌మ‌గోల' విడుద‌లైంది. - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

'ఖైదీ'లో సుమ‌ల‌త చేసిన క్యారెక్ట‌ర్‌కు ఫ‌స్ట్ చాయిస్ ప్ర‌భ అని మీకు తెలుసా?

  ప‌దిహేను సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'నీడ‌లేని ఆడ‌ది' (1974) సినిమాలో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి, నాలుగున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా న‌టిగా రాణిస్తూ, మ‌రోవైపు న‌ర్త‌కిగా అమిత పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్నారు ప్ర‌భ‌. అగ్ర‌న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, చిరంజీవి, మోహ‌న్‌బాబు  స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. 'దాన‌వీర‌శూర క‌ర్ణ' చిత్రంలో దుర్యోధ‌నునిగా న‌టించిన ఎన్టీ రామారావుతో క‌లిసి చేసిన‌ "చిత్రం భ‌ళారే విచిత్రం.." పాట ఆమె కెరీర్‌లో మ‌ర‌పురానిదిగా నిలిచిపోయింది. అయితే త‌న స‌మ‌కాలీన తార‌లైన జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, రాధిక‌ త‌ర‌హాలో ఆమె స్టార్‌డ‌మ్‌ను అందుకోలేక‌పోయారు. కొన్ని అవ‌కాశాలు ఆమె ప్ర‌మేయం లేకుండా మిస్స‌వ‌డం వ‌ల్ల కూడా ఆ మేర‌కు ఆమె కెరీర్‌కు న‌ష్టం వాటిల్లింది. వాటిలో ముఖ్య‌మైంది చిరంజీవి 'ఖైదీ'. అవును. ఆ సినిమాలో సుమ‌ల‌త చేసిన డాక్ట‌ర్ సుజాత పాత్ర‌ను మొద‌ట ఆఫ‌ర్ చేసింది ప్ర‌భ‌కే. ఆ సినిమా యూనిట్ మెంబ‌ర్ ఒక‌త‌ను ఆ సినిమాలో ప్ర‌భ‌కు ఆఫ‌ర్ చేసిన క్యారెక్ట‌ర్‌కు ఒక‌రోజు షూటింగే ఉంటుంద‌నీ, క‌థ‌లో ఇంపార్టెన్స్ ఉండ‌ద‌నీ చెప్ప‌డంతో.. అలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం ఎందుక‌ని దాన్ని వ‌దిలేసుకున్నారు ప్ర‌భ‌. "కానీ ఆ త‌ర్వాతే తెలిసింది.. అది సెకండ్ హీరోయిన్ క్యారెక్ట‌ర్ అని. 'అది చేసుంటే..' అని ఇప్పుడు బాధ‌ప‌డ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని తెలుసు. కానీ ఒక‌రి కార‌ణంగా ఆ సినిమా మిస్స‌య‌వ‌డంతో కెరీర్‌లో చాలా న‌ష్ట‌పోయాను. అదే కేర‌క్ట‌ర్ చేసిన సుమ‌ల‌త‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. దాంతో పాటు ఆమెకు వ‌రుస‌గా చిరంజీవి స‌హా పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా అవ‌కాశాలు ల‌భించాయి. బ‌హుశా.. నేను పెద్ద సినిమాలు ఎక్కువ‌గా చెయ్య‌క‌పోవ‌డం వ‌ల్లే నా ఫ్రెండ్స్ జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, రాధిక అందుకున్న స్టార్‌డ‌మ్‌ను అందుకోలేక‌పోయానేమో." అని ఓ ఇంట‌ర్వ్యూలో అభిప్రాయ‌ప‌డ్డారు ప్ర‌భ‌.

లెజెండ‌రీ క‌మెడియ‌న్ రాజ‌బాబు గురించి చాలామందికి తెలీని నిజాలు

  పుణ్య‌మూర్తుల ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ర‌మ‌ణ‌మ్మ దంప‌తుల‌కు 1937 అక్టోబ‌ర్ 20న పుట్టిన రాజ‌బాబు అస‌లుపేరు అప్ప‌ల‌రాజు. పుట్టిన ఊరు రాజ‌మండ్రిలో ఇంట‌ర్మీడియేట్ చ‌దివాక‌, టీచ‌ర్ ట్రైనింగ్ పూర్తిచేసి, బ‌డిపంతులుగా కొంత కాలం ప‌నిచేశారు. అదే కాలంలో 'నాలుగిళ్ల చావిడి', 'అల్లూరి సీతారామ‌రాజు', 'కుక్క‌పిల్ల దొరికింది' లాంటి నాట‌కాల్లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ న‌టుడు కావాల‌నే త‌ప‌న‌తో ఉద్యోగానికి రాజీనామా చేసి, 1960లో మ‌ద్రాస్ వెళ్లారు రాజ‌బాబు.  ఒక‌వైపు అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తూ, బ‌త‌క‌డం కోసం ట్యూష‌న్లు చెప్పారు. అడ్డాల నారాయ‌ణ‌రావు నిర్మించిన 'స‌మాజం' (1960)లో ఓ చిన్న పాత్ర దారా న‌టునిగా వెండితెర‌పై కాలుపెట్టారు. మొద‌ట్లో కెరీర్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త‌ర్వాత త‌న‌దైన శైలి కామెడీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ, తిరుగులేని క‌మెడియ‌న్‌గా రాణించారు. నిల్చున్న చోట కానీ, కూర్చున్న చోట కానీ కుదురుగా ఉండ‌కుండా, మెలిక‌లు తిరిగే బాడీ లాంగ్వేజ్‌తో, డిఫ‌రెంట్ డిక్ష‌న్‌తో ఆయ‌న చెప్పే డైలాగ్స్‌కు జ‌నం ప‌డీ ప‌డీ న‌వ్వేవారు. లీలా రాణి, గీతాంజ‌లి లాంటి తార‌లు ఆయ‌న స‌ర‌స‌న న‌టించిన‌ప్ప‌టికీ, ర‌మాప్ర‌భ‌తో ఆయ‌న కాంబినేష‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. తెర‌పై రాజ‌బాబు క‌నిపిస్తేనే న‌వ్వులు పండేది, ఇక ర‌మాప్ర‌భ కూడా ఆయ‌న‌కు తోడైతే.. ఆ గిలిగింత‌ల రేంజే వేరు.. అన్న‌ట్లు వుండేది వారి జంట‌. ఏ సినిమాలైనా ఆ ఇద్ద‌రూ జంట‌గా ఉన్నారంటే త‌ప్ప‌కుండా వారిపై ఓ హాస్య గీతం ఉండాల్సిందే. అనేక చిత్రాల‌కు ఆ జంట ఎస్సెట్ అయ్యింద‌నేది కాద‌న‌లేని నిజం. ఇక రెమ్యూన‌రేష‌న్ ప‌రంగా రాజ‌బాబు మిగ‌తా కామెడీ యాక్ట‌ర్ల కంటే ఓ మెట్టు పైనే ఉండేవారు. అప్ప‌టి టాప్ స్టార్స్‌కు ధీటుగా ఆయ‌న‌కు పారితోషికం ఇచ్చేవాళ్లు నిర్మాత‌లు. పెద్ద సినిమాల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా, చిన్న సినిమాల‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఆయ‌న నిలిచేవారు. సినిమాలో రాజ‌బాబు లేర‌ని తెలిస్తే, డిస్ట్రిబ్యూట‌ర్లు పెదవి విరిచిన సంద‌ర్భాలెన్నో. వారి డిమాండ్ కార‌ణంగా క‌థ‌కు సంబంధం లేక‌పోయినా స‌ప‌రేట్ ట్రాక్ తీసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయంటే ఆయ‌న హ‌వా ఎలా న‌డిచిందో ఊహించుకోవ‌చ్చు. ఓ వైపు క‌మెడియ‌న్‌గా న‌టిస్తూనే, కొన్ని సినిమాల్లో హీరోగానూ న‌టించారు రాజ‌బాబు. వాటిలో దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం 'తాత మ‌న‌వ‌డు' ప్ర‌ముఖ‌మైంది. ఎస్వీ రంగారావు తాత‌గా న‌టిస్తే, ఆయ‌న మ‌న‌వ‌డిగా న‌టించి, ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకున్న‌ ఆ సినిమాలో రాజ‌బాబు స‌ర‌స‌న విజ‌య‌నిర్మ‌ల హీరోయిన్ కావ‌డం ఇంకో విశేషం. ఆ త‌ర్వాత పిచ్చోడి పెళ్లి, తిర‌ప‌తి, ఎవ‌రికి వారే య‌మునా తీరే, మ‌నిషి రోడ్డున ప‌డ్డాడు లాంటి చిత్రాల్లో ఆయ‌న హీరోగా న‌టించారు. 'మ‌నిషి రోడ్డున ప‌డ్డాడు' చిత్రాన్ని నిర్మించిన ఆయ‌న ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయి నిజంగానే రోడ్డున ప‌డ్డాడంటారు. ల‌క్ష్మీ అమ్ములుతో 1965లో ఆయ‌న వివాహం జ‌రిగింది. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు.. నాగేంద్ర‌బాబు, మ‌హేశ్‌బాబు. న‌టుడిగా ఎంత‌టి ఉన్న‌త స్థాయిని చూశాడో, వ్య‌క్తిగా అంత‌కంటే ఉన్న‌తుడిగా పేరు తెచ్చుకున్నారు రాజ‌బాబు. అనేక‌మంది ఆయ‌న ఆర్థిక సాయం చేశారు. త‌ను జీవించి ఉండ‌గా ప్ర‌తి పుట్టిన‌రోజుకు ఒక సీనియ‌ర్ యాక్ట‌ర్‌ను ఆయ‌న స‌న్మానిస్తూ వ‌చ్చారు. సావిత్రి, రేలంగి, బాల‌కృష్ణ (అంజి), ర‌మ‌ణారెడ్డి లాంటి న‌టులు వారిలో ఉన్నారు.  రాజ‌బాబుకు అకాల మ‌ర‌ణం పొంద‌డానికి కార‌ణం, ఆయ‌న‌కున్న తాగుడు వ్య‌స‌నం. దాని వ‌ల్ల చివ‌రి రోజుల్లో ఆయ‌నకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్న అనేక‌మందిని ఆదుకున్న మంచి మ‌నిషి రాజ‌బాబు 1983 ఫిబ్ర‌వ‌రి 7న హైద‌రాబాద్‌లో గుండెపోటుతో క‌న్నుమూసి, అభిమానుల‌ను తీవ్ర విషాదంలో ముంచేశారు. రెండు ద‌శాబ్దాల పాటు తెలుగు సినిమాపై త‌న జెండాను రెప‌రెప‌లాడించి 580కి పైగా చిత్రాల్లో న‌టించిన‌ రాజబాబు తన ఊరికి, చలన చిత్ర రంగానికి చేసిన మరపురాని సేవలకు చిహ్నంగా 9 అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని రాజ‌మండ్రిలో గోదావరి తీరాన ప్రతిష్టించి ఆయ‌న‌పై త‌న అభిమానాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేసింది తెలుగు చిత్ర‌సీమ‌.

'మ‌న‌దేశం' హీరోయిన్ కృష్ణ‌వేణి ల‌వ్ స్టోరీ!

  ఎల్వీ ప్ర‌సాద్ డైరెక్ట్ చేసిన 'మ‌న‌దేశం' చిత్రంతో ఎన్టీ రామారావు న‌టునిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ మూవీలో చిత్తూరు నాగ‌య్య ప్ర‌ధాన పాత్ర ధ‌రించ‌గా, కృష్ణ‌వేణి నాయిక‌గా, చ‌ద‌ల‌వాడ నారాయ‌ణ‌రావు క‌థానాయ‌కునిగా న‌టించారు. మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్ప‌టికే రాజావారితో కృష్ణ‌వేణికి వివాహం జ‌రిగింది. ఆయ‌న‌కు ఆమె రెండో భార్య‌. రాజా మొద‌టి భార్య పేరు భూదేవి. ఆమె సంసారంపై ఆస‌క్తి కోల్పోవ‌డంతో కృష్ణ‌వేణిని ఇష్ట‌ప‌డ్డారు రాజావారు. ఆమెతో పెళ్లి ప్ర‌తిపాద‌న తెచ్చారు. ఆమె బాబాయ్‌తో మాట్లాడారు. కానీ, వారి పెళ్లికి అభ్యంత‌రాలు వ‌చ్చాయి. అందుకే ర‌హ‌స్యంగా విజ‌య‌వాడ‌లోని స‌త్య‌నారాయ‌ణ‌పురంలో వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత అంద‌రూ బాగానే క‌లిసిపోయారు. భూదేవికి న‌లుగురు పిల్ల‌లు. కృష్ణ‌వేణి ఆరోగ్య స్థితి రీత్యా ఒక్క కూతురితోనో స‌రిపెట్టుకున్నారు. ఆ కూతురు ఎవ‌రో కాదు.. త‌ర్వాత కాలంలో ప‌లు సినిమాలు నిర్మించి ఎన్‌.ఆర్‌. అనూరాధాదేవి. 'జీవ‌న‌జ్యోతి' అనే సినిమా సెట్స్ మీద ఉన్న‌ప్పుడు రాజావారు, కృష్ణ‌వేణి మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఆ సినిమాకు రాజావారు నిర్మాత‌. అప్పుడు కృష్ణ‌వేణి వ‌య‌సు కేవ‌లం 15 సంవ‌త్స‌రాలు. ఆ సినిమాలో ఆమె హీరోయిన్‌. ఆమెకూ, రాజావారికీ మ‌ధ్య వ‌య‌సులో చాలా తేడా ఉంటుంది. ఆమె కంటే ఆయ‌న 20 సంవ‌త్స‌రాలు పెద్ద‌. కానీ వారి మ‌ధ్య ప్రేమ‌కు ఆ వ‌య‌సు భేదం అడ్డు కాలేదు. 1940ల‌లో తెలుగు చిత్ర‌సీమ‌లోని నాయిక‌ల్లో ఇప్ప‌టికీ జీవించి ఉన్న ఏకైక తార‌.. సి. కృష్ణ‌వేణి!

'హృద‌యం ఎక్క‌డున్న‌దీ..' పాట ఎలా పుట్టిందో తెలుసా?

  సూర్య టైటిల్ రోల్ చేసిన 'గ‌జిని' మూవీ త‌మిళంలోనే కాకుండా తెలుగులోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆ మూవీతో తెలుగునాట కూడా సూర్య మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఎ.ఆర్‌. మురుగ‌దాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో నాయిక‌గా అసిన్ న‌టించింది. హారిస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి ఎస్సెట్‌. అందులో "హృద‌యం ఎక్క‌డున్న‌దీ.." సాంగ్ విప‌రీతంగా పాపుల‌ర్ అయ్యింది. ఎవ‌రి నోట విన్నా ఆ పాటే, ఆ రోజుల్లో. దాన్ని రాసింది వెన్నెల‌కంటి. ఆ పాట వెనుక ఓ క‌థ ఉంది. 'గ‌జిని'ని తెలుగులో డ‌బ్ చేసేట‌ప్పుడు డైలాగ్ రైట‌ర్‌గా వెన్నెల‌కంటి కుమారుడు శ‌శాంక్ వెన్నెల‌కంటిని ఎంచుకున్నారు నిర్మాత 'ఠాగూర్' మ‌ధు. పాట‌ల్లో రెండు వేటూరి చేత‌, ఒక‌టి భువ‌న‌చంద్ర‌తో, ఒక‌టి చంద్ర‌బోస్‌తో, ఒక‌టి వెన్నెల‌కంటితో రాయించే బాధ్య‌త‌ను శ‌శాంక్‌కే అప్ప‌గించారు మ‌ధు. "మీ నాన్న‌గారితో ఏ పాట రాయిస్తున్నావు?" అని అడిగారు. ఒరిజిన‌ల్‌లోని "సుట్టుం విళి సుడ‌రే.." అని చెప్పాడు శ‌శాంక్‌. "ఎందుక‌లా? ఆ పాట పెద్ద హిట్ కాబ‌ట్టా?" అన‌డిగారు మ‌ధు. "కాదంకుల్‌. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. సాహిత్యంలో డిఫ‌రెంట్ స్ట్ర‌క్చ‌ర్ ఉంటుంది. దాన్ని పెద్ద‌వారితో రాయించాలంటే.. వారితో నాకంత చ‌నువు లేదు. నాన్న‌గారైతే ఇంట్లోనే ఉంటారు కాబ‌ట్టి నాకు న‌చ్చిన విధంగా ఒక‌టికి రెండుసార్లు అడిగి రాయించుకోవ‌చ్చు" అని చెప్పాడు శ‌శాంక్‌. "ఊరికే అన్నాలే. మీ నాన్న‌గారితోనే ఆ పాట రాయించుకో".. న‌వ్వుతూ అన్నారు మ‌ధు. అది.. అసిన్ చుట్టూ తిరుగుతూ సూర్య పాడే పాట‌. "హృద‌యం ఎక్క‌డున్న‌దీ.. హృద‌యం ఎక్క‌డున్న‌దీ.. నీ చుట్టూనే తిరుగుతున్న‌దీ.." అని ప‌ల్ల‌వి రాశారు వెన్నెల‌కంటి. పాట పూర్త‌య్యాక‌, "బాణీకి స‌రిపోయే ప‌దాల‌తో ఉంది కానీ, మొద‌టి రెండు లైన్లు మాత్రం పొస‌గ‌లేదు నాన్న‌గారూ" అన్నాడు శ‌శాంక్‌. ఆయ‌న న‌వ్వి, "నీది ఆవేశం, నాది అనుభ‌వం. చూడు ఈ ప‌ల్ల‌వి ఎంత పాపుల‌ర్ అవుతుందో!" అన్నారు. ఆశ్చ‌ర్య‌మేమంటే ప‌ల్ల‌వే కాదు, చ‌ర‌ణాలు కూడా జ‌నం నోట్లో నానాయి. దాదాపు రెండేళ్ల పాటు ఏ సెల్ ఫోన్ చూసినా, రింగ్ టోన్ ఈ పాటే. బాంబే జ‌య‌శ్రీ‌, హ‌రీశ్ రాఘ‌వేంద్ర ఈ పాట‌ను ఆల‌పించారు.

గొప్ప‌న‌టులు గుమ్మ‌డి చివ‌రి రోజులు ఎలా గ‌డిచాయో తెలుసా?

  తెలుగుచిత్ర‌సీమ గ‌ర్వించే న‌టుల్లో ఒక‌రు.. గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు. మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ త‌ర‌లివ‌స్తున్న క్ర‌మంలో 1992లో హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు గుమ్మ‌డి. ఆ త‌ర్వాత కొద్ది కాలంలోనే ఆయ‌న గుండెజ‌బ్బుకు గుర‌య్యారు. స‌ర్జ‌రీ చేయించుకొని ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే 1995లో ప‌క్ష‌వాతం వ‌చ్చి ఇబ్బందిప‌డ్డారు. ఆ ప్ర‌భావం గొంతుమీద కూడా ప‌డింది. గంభీర‌మైన వాచ‌కానికి పేరుప‌డిన ఆయ‌న‌కు మాట ప‌ల‌కడం క‌ష్ట‌మైంది. త‌న పాత్ర‌కు మ‌రొక‌రు గొంతునివ్వ‌డం అనే ఆలోచ‌న న‌చ్చ‌క సినిమాలు మానేద్దామ‌నుకున్నారు. కానీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రెండు మూడు సినిమాలు చేశారు. తెర‌పై గుమ్మ‌డి నోట ఇంకెవ‌రి గొంతో వినిపించ‌డం చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆయ‌న‌కూ అది ఎబ్బెట్టుగా తోచింది. దాంతో వేషాలు మానుకున్నారు. అంజ‌లీదేవి నిర్మించిన 'పుట్ట‌ప‌ర్తి సత్య‌సాయిబాబా' చిత్రంలో బాబా స్వ‌యంగా అడ‌గ‌టంతో ఓ ముస‌లివాని పాత్ర చేశారు గుమ్మ‌డి. ఆయ‌న గొంతుకు బాబా ఏదో మందు లాంటిది రాసి, డ‌బ్బింగ్ చెప్ప‌మంటే, పాత్ర‌కు త‌గ్గ‌ట్లు డ‌బ్బింగ్ చెప్పి త‌న‌కు తానే ఆశ్చ‌ర్య‌పోయారు. అలాగే మ‌రోసారి 2008లో 'కాశినాయ‌న‌'గా తెర‌పై టైటిల్ రోల్ చేశారు. అప్పుడు కూడా గొంతు స‌హ‌క‌రించి, డ‌బ్బింగ్ చెప్పేలా చేసింది. దాదాపుగా ఆ స‌మ‌యంలోనే మాయాబ‌జార్‌ను క‌ల‌ర్‌లోకి మారుస్తున్నార‌ని తెలిసి, ఆ సినిమాని చెడ‌గొడుతున్నారేమోన‌ని బాధ‌ప‌డ్డారు గుమ్మ‌డి. చివ‌రికి ఆ చిత్రాన్ని రంగుల్లోకి మార్చాక‌, 2010 జ‌న‌వ‌రి 16న ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఆత్మీయుల మ‌ధ్య కూర్చొని చూసి, పుల‌కించిపోయారు. ఆ త‌ర్వాత వారం రోజుల‌కు గుమ్మ‌డిగారికి మ‌ళ్లీ సుస్తీ చేసింది. గుండె బ‌ల‌హీన‌ప‌డింద‌ని చెప్పారు వైద్యులు. బీపీ ప‌డిపోతుంటే, ఇంటికి ద‌గ్గ‌ర‌లోనే ఉన్న అపోలో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశారు. రెండు రోజుల చికిత్స త‌ర్వాత జ‌న‌వ‌రి 26న తిరిగిరాని లోకాల‌కు త‌ర‌లిపోయారు.

ఎన్టీఆర్‌ను మొద‌ట యాక్ట‌ర్‌గా, త‌ర్వాత హీరోగా ప‌రిచ‌యం చేసింది ఒక్క‌రే!

  మ‌న‌లో చాలామందికి తెలుసు.. న‌ట‌రత్న నంద‌మూరి తార‌క‌రామారావు 'మ‌న‌దేశం' (1949) చిత్రంతో న‌టునిగా ప‌రిచ‌యం అయ్యార‌న్న విష‌యం. అందులో పోలీస్ వేషంలో ఆయ‌న క‌నిపించారు. చిన్న పాత్రే అయినా ఓ సంద‌ర్భంలో కీల‌కంగా ఉంటుంది. ఆ సినిమా త‌ర్వాత 'ప‌ల్లెటూరి పిల్ల' (1950) అనే సినిమాలో ఫ‌స్ట్ టైమ్ హీరోగా న‌టించారు ఎన్టీఆర్‌. విశేష‌మేమంటే, అప్ప‌టికే హీరోగా ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు పొందిన న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అందులో సెకండ్ హీరోగా న‌టించ‌డం! 'మ‌న‌దేశం' మూవీలో ఎన్టీఆర్‌ను న‌టునిగా, 'ప‌ల్లెటూరి పిల్ల' సినిమాలో హీరోగా ప‌రిచ‌యం చేసింది మీర్జాపురం రాజా, సి. కృష్ణ‌వేణి దంప‌తులు. ఎం.ఆర్‌.ఎ. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై 'మ‌న‌దేశం' చిత్రాన్ని వారు నిర్మించారు. ఎం.ఆర్‌.ఎ. అంటే మేకా రాజ్య‌ల‌క్ష్మీ అనూరాధ‌. అది.. ఆ దంప‌తుల కుమార్తె పేరు. త‌ర్వాత కాలంలో ఆమె ఎం.ఆర్‌. అనూరాధాదేవి పేరుతో ప‌లు సినిమాలు నిర్మించారు.  కాగా, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'ప‌ల్లెటూరి పిల్ల‌'ను నిర్మించింది.. టైటిల్స్ ప్ర‌కారం ద‌ర్శ‌కుడు కూడా అయిన‌ బి.ఎ. సుబ్బారావు. నిజానికి ఆయ‌న పేరు మీద ఆ చిత్రాన్ని తీసింది రాజావారే. ఈ విష‌యాన్ని ఆ చిత్ర క‌థానాయిక కూడా అయిన కృష్ణ‌వేణి స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. "సుబ్బారావు పేరుతో రాజావారే 'ప‌ల్లెటూరి పిల్ల' చిత్రాన్ని నిర్మించారు. సుబ్బారావు అప్ప‌ట్లో మా ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌. మా శోభ‌నాచ‌ల‌ స్టూడియో వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌నే చూసేవారు." అని ఆమె చెప్పారు.

బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల రైట‌ర్ స‌త్యానంద్ డిటెక్టివ్ న‌వ‌ల‌లు రాశార‌ని తెలుసా?

  నంద‌మూరి, అక్కినేని కుటుంబాల్లోని మూడు త‌రాల హీరోల సినిమాల‌కు ప‌నిచేసిన ర‌చ‌యిత ఆయ‌న‌. సినీ ర‌చ‌యిత‌గా ఆయ‌న క‌లానిది దాదాపు ఐదు ద‌శాబ్దాల వ‌య‌సు. ఇప్ప‌టికీ అల‌స‌ట అన్న‌ది ఎరుగ‌కుండా నిర్విరామంగా ఆయ‌న క‌లం.. ప‌దునైన‌, బిగువైన స్క్రీన్‌ప్లేల‌ను అల్లుకుంటూ పోతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 400కు మించి సినిమాకు క‌థ‌లు, స్క్రీన్‌ప్లేలు, సంభాష‌ణ‌లు అందించిన ఆ గొప్ప ర‌చ‌యిత‌.. స‌త్యానంద్‌! చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన‌, చేస్తున్న సినిమాల స్క్రిప్టుల్లో ఆయ‌న చేయి ఉంది. హైస్కూలు రోజుల నుంచే ఆయ‌న‌కు క‌థ‌లు రాయ‌డం అల‌వాట‌య్యింది. ఆయ‌న మొద‌టి క‌థ 13వ ఏటే ఆంధ్ర‌ప్ర‌భ‌లో అచ్చ‌యింది. రాజ‌మండ్రి నుంచి మ‌ద్రాస్ వెళ్లి 21వ ఏట సినీ ర‌చ‌యిత అయ్యారు. దానికంటే ముందు ఆర్థిక అవ‌స‌రాల కోసం ఒక ప‌ది వ‌ర‌కూ డిటెక్టివ్ న‌వ‌ల‌లు రాశారు. అప్ప‌ట్లో 'డిటెక్టివ్' అనే మ్యాగ‌జైన్ వ‌చ్చేది. దానికి ఎడిటిర్‌.. జీవీజీ. అందులో ఒక డిటెక్టివ్ సీరియ‌ల్ కూడా రాశారు స‌త్యానంద్‌. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు ఆయ‌న‌కు స్వ‌యానా మేన‌మామ‌. మొద‌ట మేన‌ల్లుడు సినిమాల్లోకి వ‌స్తానంటే ఆదుర్తి ఎంక‌రేజ్ చెయ్య‌లేదు. దాంతో మ‌ద్రాస్‌లో ఇంకో ముగ్గురితో పాటు ఓ రూమ్‌లో ఉంటూ డిటెక్టివ్ న‌వ‌ల‌లు రాసుకుంటూ ఏడాదిపాటు గ‌డిపారు స‌త్యానంద్‌. ఒక్కో న‌వ‌ల‌కు రూ. 300 ఇచ్చేవారు.  ఆ త‌ర్వాత కృష్ణ హీరోగా త‌ను డైరెక్ట్ చేసిన 'మాయ‌దారి మ‌ల్లిగాడు' (1973) సినిమాతో స‌త్యానంద్‌ను డైలాగ్ రైట‌ర్‌గా ప‌రిచ‌యం చేశారు ఆదుర్తి సుబ్బారావు. ఆ సినిమా పెద్ద హిట్ట‌వ‌డంతో, మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కు క‌ల‌గ‌లేదు.

'మ‌న‌దేశం'తో న‌టునిగా ప‌రిచ‌య‌మైన ఎన్టీఆర్‌కు అందిన పారితోషికం ఇదే!

  ఎల్వీ ప్ర‌సాద్ డైరెక్ట్ చేసిన 'మ‌న‌దేశం' చిత్రం 1949లో విడుద‌లైంది. ఆ చిత్రంతోటే ఎన్టీఆర్ న‌టునిగా తెరంగేట్రం చేశారు. స్వాతంత్ర్యం రాక‌ముందు జ‌రిగే క‌థాంశంతో ఆ సినిమా తీశారు. నిజానికి స్వాతంత్ర్యం మునుపే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పూర్తి కావ‌డానికి చాలా కాలం ప‌ట్టింది. 'విప్ర‌దాస్' అనే బెంగాలీ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు ఎల్వీ ప్ర‌సాద్‌. తెలుగులో వెండితెర‌పై వ‌చ్చిన తొలి బెంగాలీ న‌వ‌ల 'విప్ర‌దాస్‌'. 'మ‌న‌దేశం' మూవీలో చిత్తూరు నాగ‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించారు. అప్ప‌ట్లో ఆయ‌న పెద్ద హీరో. సినిమాలో అంద‌రికంటే ఎక్కువ‌గా ఆయ‌న‌కు రూ. 40 వేల దాకా పారితోషికంగా ఇచ్చారు నిర్మాత‌లు. హీరోగా న‌టించిన నారాయ‌ణ‌రావుకు అందులో స‌గం.. అంటే రూ. 20 వేల దాకా అందింది.  ఎన్టీఆర్‌ను ఆ సినిమా హీరోయిన్‌, నిర్మాత అయిన సి. కృష్ణ‌వేణికి ప‌రిచ‌యం చేసింది డైరెక్ట‌ర్ ఎల్వీ ప్ర‌సాద్‌. "పోలీస్ క్యారెక్ట‌ర్‌కు ఈయ‌న‌ను అనుకుంటున్నాను" అని ఆయ‌న ప‌రిచ‌యం చేశారు. కృష్ణ‌వేణి స‌రేన‌న్నారు. అప్పుడే అడ్వాన్స్‌గా రామారావుకు 250 రూపాయ‌లు ఇచ్చారు. కృష్ణ‌వేణి స్వ‌యంగా చెక్కు రాసి ఎల్వీ ప్ర‌సాద్‌కు ఇస్తే, ఆయ‌న ఆ చెక్కును రామారావుకు ఇవ్వ‌బోయారు. రామారావు ఓసారి చెక్కువంకా, కృష్ణ‌వేణి వంకా చూసి, "వారి చేతుల మీదుగా ఇప్పించండి" అన్నారు. మొద‌టి చెక్కు అందుకున్న‌ప్పుడు ఎన్టీఆర్ క‌ళ్లు ఆనందంతో మెరిశాయి. ఈ సినిమాకు ఆయ‌న అందుకున్న మొత్తం సుమారు రూ. 2 వేలు! ఇక డైరెక్ట‌ర్ ఎల్వీ ప్ర‌సాద్‌కు అందిన పారితోషికం రూ. 15 వేలు. ఆ డ‌బ్బుతోనే ఆయ‌న మ‌ద్రాస్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఇల్లు కొనుక్కున్నార‌ని కృష్ణ‌వేణి స్వ‌యంగా చెప్పారు.

గాడ్‌ఫాదర్ లేకపోవడమే వాళ్లు చేసుకున్న పాపం!

  రాంగోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, బి. గోపాల్, రాజమౌళి, త్రివిక్ర‌మ్‌, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, సుకుమార్‌, కొరటాల శివ, బోయపాటి శ్రీను.. వగైరా పేరుపొందిన దర్శకుల వద్ద పనిచేశామని చెబితే చాలు.. టాలీవుడ్‌లో ఎవరైనా కథ వినడానికి ఆసక్తి చూపిస్తారు. వాళ్లు హీరోలైనా, నిర్మాతలైనా. అదే అప్పటివరకూ కేరాఫ్ అడ్రస్‌గా ఏ పేరుపొందిన డైరెక్టర్ పేరూ లేకపోతే, నీ దగ్గర ఎంత మంచి కథ ఉన్నా దాన్ని వినేవాడి అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం. ఆయా దర్శకుల వద్ద పనిచేసిన చాలామంది కోడైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇవాళ్ల డైరెక్టర్లుగా అవతారం ఎత్తి సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. ఒకట్రెండు సినిమాలతోటే అగ్ర హీరోల్ని డైరెక్ట్ చేసే అవకాశం సంపాదిస్తున్నారు. యూత్ క్రేజ్‌లో వచ్చిన కొంతమంది దర్శకులు కేవలం క్రేజ్ కోసమే డైరెక్ట్ చెయ్యకుండా ప్రొఫెషనల్ డైరెక్టర్స్‌గా స్థిరపడ్డారు. డైరెక్టర్‌గా తన పేరు వేస్తే చాలు.. సినిమా బిజినెస్ జరిగిపోయే స్థాయికి యువ దర్శకులు ఎదగడం విశేషంగానే చెప్పుకోవాలి. హీరో ఫేస్ వాల్యూతో పనిలేకుండా, డైరెక్టర్ ఎవరో తెలీకపోయినా మంచి చిత్రాల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం హీరోలతో పనిలేకుండా పోస్టర్‌పై కనిపించే డైరెక్టర్ పేరును బట్టి సినిమాకు వెళ్లిపోతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. పైన చెప్పుకున్న డైరెక్టర్లలో వినాయక్ కూడా అలా వచ్చినవాడే. ‘అమ్మ దొంగా’ ఫేం సాగర్ శిష్యుడైన వినాయక్ తొలి సినిమా ‘ఆది’లో జూనియర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసి, అతి స్వల్ప కాలంలోనే టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వంటివాళ్లు రాంగోపాల్ వర్మ శిష్యులుగా డైరెక్టర్లుగా మారి తామూ పేరుగొప్ప డైరెక్టర్లయ్యారు. ముత్యాల సుబ్బయ్య శిష్యుడైన బోయపాటి శ్రీను ఇప్పడు అగ్ర దర్శకుల్లో ఒకడు. రాఘవేంద్రరావు శిష్యుడైన రాజమౌళి ‘స్టూడెంట్ నం.1’గా, ‘సింహాద్రి’గా జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించి, ఇవాళ తెలుగులోనే కాకుండా దేశంలోనే అగ్ర‌ దర్శకుడిగా పేరు పొందాడు. ఆమ‌ధ్య‌ ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, మ‌హేశ్‌తో 'స‌ర్కారువారి పాట' తీసే ఛాన్స్ కొట్టిన‌ పరశురామ్‌కు ‘యువత’తో డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ రావడానికి కారణం.. అతను పూరి జగన్నాథ్ శిష్యుడు కావడం. ‘ఆర్ ఎక్స్ 100’తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి డైరెక్టర్ అయ్యాడంటే అతను రాంగోపాల్ వర్మ వద్ద పనిచెయ్యడం కారణం. ‘స్వామి రారా’తో సుధీర్ వర్మ్‌కు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందంటే, అతను పరశురామ్‌ వద్ద పనిచేశాడు మరి. అదే పరశురామ్‌ దగ్గర పనిచేసిన శివ నిర్వాణ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. ‘ఎఫ్2’, స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ కొట్టి త్వ‌ర‌లో బాల‌కృష్ణ‌ను డైరెక్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ అనిల్ రావిపూడి ‘పటాస్’తో డైరెక్టర్ కావడానికి ముందు.. ఇవాళ తమిళంలో టాప్ డైరెక్టర్‌లలో ఒకడైన శివ దగ్గర పనిచేశాడు. ఇలా ఎవరో ఒక పేరున్న దర్శకుడి అండ, రికమండేషన్, ఎవరైనా గాడ్‌ఫాదర్ ఉంటేనే కానీ టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా అవకాశం రావడం అంత ఈజీ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పేరుపొందిన, అగ్ర దర్శకుల వద్ద పనిచేసిన వాళ్లకు తప్ప, దిగువ స్థాయి దర్శకుల వద్ద పనిచేసిన అసిస్టెంట్లు, అసోసియేట్లు కూడా అవకాశాల కోసం నానా తిప్పలూ పడుతున్నారు. ఎప్పటికీ డైరెక్టర్ కాలేక ముసలివాళ్లయ్యేంత వరకూ కూడా కోడైరెక్టర్లుగా మిగిలిపోతున్నవాళ్లు అనేక మంది. ఇవాళ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లు వందల సంఖ్య దాటి వేలల్లోకి వచ్చారు. రేయింబగళ్లు కష్టపడి ఒక మంచి కథ తయారు చేసుకొని డైరెక్షన్ అవకాశం ఎవరైనా ఇవ్వకపోతారా అని ఇవాళ వందలాది మంది ఎదురుచూస్తూ ఫిలింనగర్‌లో, కృష్ణానగర్‌లో మనకు కనిపిస్తారు. తమ కథల బౌండెడ్ స్క్రిప్టులు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగే వాళ్లను చూస్తుంటే అయ్యో పాపం అనిపించక మానదు. ఎవరైనా కథవిని నచ్చితే, డైరెక్షన్ ఛాన్స్ మాత్రం ఇవ్వకుండా కథ తీసుకొని పంపేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. హీరో ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు కథలు తయారు చేసుకొని, ఆ హీరోకు కథ వినిపించే దారి తెలీక, దళారుల చేతుల్లో మోసపోతున్న వాళ్లూ ఉన్నారు. టాలెంట్ ఎంత ఉన్నా ఎంతో మంది యువకులకు డైరెక్షన్ ఛాన్స్ రాకపోవడానికి కారణం వాళ్ల వెనుక గాడ్‌ఫాదర్ లాంటివాళ్లు ఎవరూ లేకపోవడమే అని చెప్పక తప్పదు. - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

ఆనాటి సంగతి: వేటూరికి మహదేవన్ క్లాస్!

  మ‌హాన‌టుడు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా, జయప్రద, జయసుధ నాయిక‌లుగా నటించిన 'అడవిరాముడు ' (1976) సినిమా చరిత్రను సృష్టించి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. సత్య చిత్ర సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చగా వేటూరి రాసిన ప్రతి పాటా సూపర్ హిట్టే. వాటిలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ' పాట ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా పేరు తెచ్చుకుంది. వాడవాడలా మోగిపోయింది.  ఆరింటిలో ఐదు పాటల్ని ఒకే తాళం.. 'త్రిశ్రం'లో రాశారు వేటూరి. అందుకని ఆరో పాటనైనా 'చతురస్రం'లో రాయమని ఆయనకు సూచించారు మహదేవన్. ఆరవది క్లైమాక్స్ పాట. వేటూరి రాసిన పాటను రాఘవేంద్రరావు ఓకే చేసి మహదేవన్ కు  ఇచ్చారు. అది మారు వేషాలతో సాగే పాట. మహదేవన్ కు సన్నివేశం చెప్పి పనిమీద వెళ్లిపోయారు రాఘవేంద్రరావు.  పాట చూడగానే మహదేవన్ కోపంగా వేటూరిని చూస్తూ 'ఏం రాశావ్? చదువు' అన్నారు. 'చూడరా చూడరా సులేమాను మియ్యా' అని చదివారు వేటూరి. 'ఇది ఏం తాళం?' అని మహదేవన్ అడిగితే చతురస్రంలో రాశానన్నారు. తను పాడి వినిపించి 'ఇది చతురస్రమా?' అనడిగారు మహదేవన్. కాదన్నారు వేటూరి.  తాళం మార్చి రాయమని ఆయనడిగితే ఎలా మార్చాలో వెంటనే వేటూరికి తెలియలేదు. ఇది గమనించిన మహదేవన్ ఇంకో రెండు 'చూడరా'లు తగిలిస్తే సరిపోతుందని చెప్పారు. దాంతో 'చూడర చూడర చూడర చూడర ఒక చూపూ సులేమాన్ మియా' అని తిరిగి రాశారు వేటూరి. అప్పుడది అవలీలగా చతురస్రంలో వచ్చింది. అందరూ విని ఊగిపోయారు.

'పంజా'కు మొద‌ట అనుకున్న టైటిల్ 'ది షాడో' అని మీకు తెలుసా?

  ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్ రూపొందించిన 'పంజా' చిత్రం 2011 డిసెంబ‌ర్‌లో విడుద‌లైంది. ఆర్కా మీడియా వ‌ర్క్స్ (బాహుబ‌లి ప్రొడ‌క్ష‌న్ హౌస్‌), సంఘ‌మిత్ర ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో సారా జేన్ డ‌యాస్‌, అంజ‌లి లావ‌ణ్య హీరోయిన్లుగా న‌టించారు. అడివి శేష్ నెగ‌టివ్ రోల్ చేసి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. నిజానికి ఈ సినిమాకు విష్ణువ‌ర్ధ‌న్ మొద‌ట అనుకున్న టైటిల్ 'పంజా' కాదు.. 'ది షాడో'. 2011 మే నెల‌లో కోల్‌క‌తాలో ఈ సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్పుడు వ‌ర్కింగ్ టైటిల్‌గా 'ది షాడో'నే ప‌రిగ‌ణించారు. అప్పుడే ఇది తాత్కాలిక టైటిల్ అనీ, త‌ర్వాత టైటిల్ మారే అవ‌కాశాలున్నాయ‌నీ టీమ్ చెబుతూ వ‌చ్చింది. ద‌స‌రా టైమ్‌లో అస‌లు టైటిల్‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. 'ది షాడో' కాకుండా కాళీ, తిల‌క్‌, ప‌వ‌ర్‌, ప‌టేల్ అనే టైటిల్స్‌ను కూడా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌రిశీలించారు.  చివ‌ర‌కు 'పంజా' అనే టైటిల్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో విజ‌య‌ద‌శ‌మికి పంజా టైటిల్‌ను ప్ర‌క‌టిస్తూ, పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. సినిమా రిలీజ‌య్యాక టెక్నిక‌ల్‌గా సినిమా బాగుంద‌నీ, జ‌య్‌దేవ్ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా బాగా చేశాడ‌నీ, అలాగే ఇత‌ర పాత్ర‌ధారులు కూడా బాగా చేశార‌నీ, యాక్ష‌న్ సీన్స్ బ్ర‌హ్మాండంగా ఉన్నాయ‌ని మెచ్చిన విమ‌ర్శ‌కులు, క‌థాక‌థ‌నాలు ఆస‌క్తిక‌రంగా లేవ‌ని తేల్చేశారు. అందుకు త‌గ్గ‌ట్లే ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాని ఆద‌రించ‌లేదు. అయితే ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాకు చెప్పుకోద‌గ్గ ఆద‌ర‌ణ ద‌క్కింది.

ప్ర‌భాస్‌, గోపీచంద్‌తో 'షోలే'ని రీమేక్ చెయ్యాల‌ని పూరి అనుకున్నాడా?

  ప్ర‌భాస్‌, గోపీచంద్ మ‌ధ్య స్నేహ‌బంధం గురించి ఇండ‌స్ట్రీలోని వారంద‌రికీ బాగా తెలుసు. ఒక‌రి కోసం ఒక‌రు అన్నంత‌గా వారి మ‌ధ్య స్నేహం గ‌ట్టిప‌డింది. ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఓ సినిమాలో క‌లిసి న‌టించారు. ప్ర‌భాస్ హీరోగా, గోపీచంద్ విల‌న్‌గా న‌టించిన ఆ సినిమా 'వ‌ర్షం'. అది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆ ఇద్ద‌ర్నీ హీరోలుగా ఒకే సినిమాలో చూడాల‌ని అభిమానులు కోరుకోవ‌డంలో త‌ప్పేమీ లేదు. ఆ ప్ర‌య‌త్నం చాలా కాలం క్రిత‌మే జ‌రిగింది.  బాలీవుడ్‌లో వ‌చ్చిన క్లాసిక్ యాక్ష‌న్ ఫిల్మ్ 'షోలే'ను తెలుగులో రీమేక్ చేయాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ అనుకున్నాడు. అందులో ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల‌ను హీరోలుగా తీసుకోవాల‌ని కూడా ఆయ‌న భావించాడు. ఆ మేర‌కు అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో బాగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది ఎందుక‌నో వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. 'షోలే' లాంటి క్లాసిక్ జోలికి వెళ్ల‌డం ఎందుకు అనుకున్నారో, ఏమో! 'షోలే'ను రామ్‌గోపాల్ వ‌ర్మ హిందీలోనే 'రామ్‌గోపాల్ వ‌ర్మ కీ ఆగ్' పేరుతో తీసి, చేతులు కాల్చుకున్న విష‌యం మ‌న‌కు తెలుసు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టి, ఒకే థియేట‌ర్లో అత్య‌ధిక రోజులు ఆడిన సినిమా ('దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయేంగే' వ‌చ్చేంత వ‌ర‌కు)గా 'షోలే' కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించింది. ధ‌ర్మేంద్ర‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, సంజీవ్ కుమార్‌, హేమ‌మాలిని, జ‌య‌బాధురి, అంజాద్ ఖాన్ లాంటి హేమాహేమీలు న‌టించిన ఆ సినిమాని ర‌మేశ్ సిప్పీ డైరెక్ట్ చేశారు.

ప‌దేళ్లుగా వాస్త‌వ రూపం దాల్చని 'బొబ్బిలి రాజా' రీమేక్‌!

  వెంక‌టేశ్ హీరోగా బి. గోపాల్ డైరెక్ట్ చేసిన 'బొబ్బిలి రాజా' (1990) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేసింది. 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, వెంక‌టేశ్ కెరీర్‌లోనే మొద‌టి సిల్వ‌ర్ జూబ్లీ మూవీగా రికార్డుల‌కెక్కింది. ఇందులో వెంక‌టేశ్‌, హీరోయిన్ దివ్య‌భార‌తి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. విడుద‌లై 32 సంవ‌త్స‌రాలైనా.. ఇప్ప‌టికీ ఆ సినిమాని ప్రేమించే వాళ్లు ఎంద‌రో! ఒకానొక‌ప్పుడు 'బొబ్బిలి రాజా'కు సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు మీడియాతో సంభాష‌ణ‌లో చెప్పారు వెంక‌టేశ్‌.  అయితే త‌ర్వాత కాలంలో ఆ ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టేశారు. దానికి బ‌దులుగా త‌న కుమారుడు రానాతో 'బొబ్బిలి రాజా'ను రీమేక్ చేయాల‌ని నిర్మాత డి. సురేశ్‌బాబు అనుకున్నారు. రానాకు ఇది మాస్‌లో మంచి ఇమేజ్ తీసుకొచ్చే సినిమా అవుతుంద‌నేది ఆయ‌న అభిప్రాయం. రానా సైతం ఆ సినిమా చెయ్య‌డానికి ఉత్సాహం చూపించారు. దానికి సంబంధించిన ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇది జ‌రిగి పదేళ్ల‌యిపోయింది.  కానీ.. ఎందుక‌నో 'బొబ్బిలి రాజా' రీమేక్ ప‌నులు ఇప్ప‌టి వ‌ర‌కూ వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. ఇప్ప‌టికీ రానాతో ఎవ‌రో ఒక‌రు ఆ రీమేక్ గురించి ప్ర‌స్తావిస్తూనే ఉంటారు. నిజానికి ఆ రీమేక్ చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా ఆయ‌న స‌న్నిహితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి కొంత‌కాలం గ‌డిస్తే.. వ‌య‌సు రీత్యా ఆయ‌న‌కు ఆ క్యారెక్ట‌ర్ స‌రిపోక‌పోవ‌చ్చ‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు. రానా ఏం చేస్తాడో చూడాలి మ‌రి. 

'రెబ‌ల్‌'లో ప్ర‌భాస్ జోడీగా ఫ‌స్ట్ చాయిస్ అనుష్క అని మీకు తెలుసా?

  ప్ర‌భాస్ హీరోగా 2012లో వ‌చ్చిన 'రెబెల్' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన రీతిలో ఆడ‌లేదు. రాఘ‌వ లారెన్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్ర‌భాస్ తండ్రిగా రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు న‌టించారు. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా త‌మ‌న్నా, సెకండ్ హీరోయిన్‌గా దీక్షా సేథ్ చేశారు. అయితే త‌మ‌న్నా కంటే ముందు మెయిన్ హీరోయిన్‌గా అనుష్క‌ను అనుకున్నాడు లారెన్స్‌. అప్ప‌టికే వ‌చ్చిన 'బిల్లా' సినిమాలో ప్ర‌భాస్‌, అనుష్క జోడీ, వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ జ‌నానికి బాగా న‌చ్చేసింది. ప్ర‌భాస్ లాంటి ఆజానుబాహుడికి ఒడ్డూ పొడుగూ ఉన్న అనుష్క స‌రైన జోడీగా అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపించారు. అందుకే 'రెబ‌ల్‌'లో ఆమెను హీరోయిన్‌గా ఊహించుకున్నాడు లారెన్స్‌. కానీ ఆ టైమ్‌లో అనుష్క‌కు కాల్షీట్ల స‌మ‌స్య ఎదుర‌వ‌డంతో మ‌రో తార‌ను తీసుకోక త‌ప్ప‌లేదు. అలా ఆమె ప్లేస్‌లో త‌మ‌న్నా వ‌చ్చింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఏదేమైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'రెబ‌ల్' స‌రిగా ఆడ‌లేదు. అయితే ఆ త‌ర్వాత‌ ప్ర‌భాస్‌-త‌మ‌న్నా జోడీ 'బాహుబ‌లి' మూవీతో ప్రేక్ష‌కుల్ని రంజింప‌చేసింది. 'రెబ‌ల్‌' సినిమా త‌ర్వాత కొర‌టాల శివ‌ను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తూ, 'మిర్చి' మూవీని అంగీక‌రించాడు ప్ర‌భాస్‌. అందులో నాయిక‌గా అనుష్క‌ను ఊహించుకున్నాడు శివ‌. 'రెబ‌ల్‌'లో చేయ‌లేక‌పోయిన అనుష్క‌, 'మిర్చి' మూవీకి త‌న డేట్స్‌ను అడ్జ‌స్ట్ చేసింది. ఆ మూవీలో ప్ర‌భాస్‌-అనుష్క జోడీ ఎంత‌గా ఆడియెన్స్‌ను అల‌రించిందో చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా! 

రామ్‌చ‌ర‌ణ్‌తో 'ఎదురే లేదు' అనుకున్న‌ క‌రుణాక‌ర‌న్‌

  త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ. క‌రుణాక‌ర‌న్ తెలుగులో కొన్ని హిట్, సూప‌ర్ హిట్ సినిమాల‌ను డైరెక్ట్ చేశాడు. అత‌ని తొలిచిత్ర‌మే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. అది కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన చిత్రం. వెంట‌నే గుర్తుకొచ్చేసి ఉంటుంది క‌దూ.. అవును ప‌వ‌న్ న‌టించిన 'తొలిప్రేమ‌'తోటే క‌రుణాక‌ర‌న్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ సినిమాని డైరెక్ట్ చేసే ముందు అత‌ను శంక‌ర్‌, భాగ్య‌రాజ్ లాంటి అగ్ర ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచేశాడు.  'తొలిప్రేమ' త‌ర్వాత మ‌రో 9 సినిమాల‌ను డైరెక్ట్ చేశాడు క‌రుణాక‌ర‌న్‌. వాటిలో యువ‌కుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ లాంటి సినిమాలున్నాయి. 'డార్లింగ్' త‌ర్వాత అత‌ను రూపొందించిన ఎందుకంటే ప్రేమంట‌, చిన్న‌దాన నీకోసం, తేజ్ ఐ ల‌వ్ యూ (2018) ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి ఫ్లాప‌య్యాయి. నాలుగేళ్ల నుంచి అత‌ను ఖాళీగానే ఉన్నాడు. నిజానికి 'డార్లింగ్' హిట్ట‌వ‌డంతో అత‌ని డైరెక్ష‌న్‌లో చేయ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ అంగీక‌రించాడంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. క‌రుణాక‌ర‌న్ వినిపించిన క‌థ చ‌ర‌ణ్‌కు న‌చ్చింద‌నీ, ఆ సినిమాకు 'ఎదురే లేదు' అనే టైటిల్ కూడా ఓకే అయ్యింద‌నీ ఇండ‌స్ట్రీలో వినిపించింది. కానీ త‌ర్వాత ఏమ‌య్యిందో తెలీదు కానీ.. వారి కాంబినేష‌న్‌లో ఇంత‌దాకా సినిమా రాలేదు. 'డార్లింగ్' త‌ర్వాత రామ్‌, త‌మ‌న్నా జంట‌గా 'ఎందుకంటే ప్రేమంట' తీశాడు క‌రుణాక‌ర‌న్‌. ఆ త‌ర్వాత అత‌నికి క‌థ వినిపించే అవ‌కాశం చ‌ర‌ణ్ ఇవ్వ‌లేద‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.

న‌టుడిగా ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారిన ఆదిత్య ఓం!

  హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఒక‌డిగా కొన్ని సినిమాల్లో న‌టించాక ఆదిత్య ఓం ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారార‌ని మీకు తెలుసా? ఈ నిజం చాలా మందికి తెలీదు. అవును. వైవీఎస్ చౌద‌రి 'లాహిరి లాహిరి లాహిరిలో' మూవీతో యంగ్ హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది యువ‌కుడు ఆదిత్య ఓం. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన అత‌ను తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు. అయితే క్ర‌మంగా అత‌నికి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో ఒకానొక టైమ్‌లో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయాడు. త‌ను కెరీర్ ప్రారంభించిన ముంబైకి వెళ్లిపోయి, బాలీవుడ్‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ విష‌యాన్ని తెలుగువ‌న్‌కు వ‌చ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు ఆదిత్య ఓం. "తెలుగులో మంచి ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డం, అప్ప‌ట్లో వెబ్ సిరీస్‌ల లాంటివి కూడా లేక‌పోవ‌డంతో, కొత్త‌గా ఏదైనా ప్లాన్ చెయ్యాల‌ని ముంబైకి వెళ్లాను. కెరియ‌ర్ మొద‌ట్లో నేను ముంబైలో డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశాను. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అందుక‌ని మ‌ళ్లీ డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాల‌నుకున్నాను. అయితే ముంబైకి వెళ్లి నా ఎక్స్‌పీరియెన్స్ ప్ర‌కారంగా 2007-08 మ‌ధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా స్టార్ట్ చేశాను." అని అత‌ను తెలిపాడు. "నా ఫ్రెండ్స్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చెయ్యాల‌నుకున్న‌ప్పుడు, వాళ్ల‌కు గైడ్ చెయ్యాలనీ, డ‌బ్బు కోస‌మ‌నీ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారాను" అని ఆదిత్య ఓం వెల్ల‌డించాడు. "ఆ సినిమాల‌కు స్టార్టింగ్ నుంచి రిలీజ్ వ‌ర‌కు చూశాను. అలా నాలుగు సినిమాల‌కు ప‌నిచేశాను. దాంతో ఇండ‌స్ట్రీ ఎలా ఫంక్ష‌న్ అవుతుంద‌నే విష‌యం మ‌రింత‌గా తెలిసింది. నేను ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన వాటిలో బెస్ట్ ఫిల్మ్ 'శూద్ర‌'. క్యాస్ట్ సిస్ట‌మ్ మీద అదొక క‌ల్ట్ ఫిల్మ్‌. దానికిప్పుడు సీక్వెల్ కూడా వ‌స్తోంది. అందులో నేను యాంటీ హీరోగా యాక్ట్ కూడా చేశాను." అని అత‌ను చెప్పుకొచ్చాడు.

ఎంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టినా అమ్మని ద‌క్కించుకోలేక‌పోయాం!

  బాల‌న‌టునిగా 'అత‌డు', 'ఛ‌త్ర‌ప‌తి' సినిమాల‌తో ఆక‌ట్టుకొని, ఆ త‌ర్వాత హీరోగా 'ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌', 'ఒక క్రిమిన‌ల్ ప్రేమ క‌థ' లాంటి సినిమాల‌తో యూత్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు మ‌నోజ్ నందం. ఆ త‌ర్వాత ఆశించిన రీతిలో అత‌డి కెరీర్ ఊపందుకోలేదు. ప్ర‌స్తుతం ఒక‌వైపు హీరోగా న‌టిస్తూ, మ‌రోవైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు చేస్తూ వ‌స్తున్నాడు. త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీ 'సీతారామం'లో ఆర్మీమేన్‌గా స‌పోర్టింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.  మ‌నోజ్ వాళ్ల‌మ్మ కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ 2015లో మృతి చెందారు. "2012లో ఆమెకు కేన్స‌ర్ అని తేలింది. 2015లో చ‌నిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో వ‌ర‌స‌పెట్టి సినిమాలు చేసేశాను. కార‌ణం, నాకు డ‌బ్బు అవ‌స‌రం ఉంది. అమ్మ హాస్పిట‌ల్ బిల్స్‌కీ, ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల‌కు డ‌బ్బు బాగా అవ‌స‌రం అయ్యింది." అని తెలుగువ‌న్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో అత‌ను తెలిపాడు. వాళ్ల‌ నాన్న‌ బిజినెస్‌మేన్ అయినా అంత‌గా ఆదాయం ఉండేది కాదు. "అంత‌కుముందే ఆయ‌నకు వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చాయి. ఆయ‌న ఓఎన్‌జీసీ కాంట్రాక్ట‌ర్‌గా చేసి, త‌ర్వాత హ్యాండ్‌లూమ్ బిజినెస్ చేశారు. అందులో న‌ష్టాలు వ‌చ్చాయి. అంటే ఫైనాన్షియ‌ల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాం. నాకు వ‌చ్చిన ప‌ని, న‌టించ‌డం. ఆ ప‌నిచేసి, డ‌బ్బులు సంపాదించి, కుటుంబానికి స‌పోర్ట్‌గా నిలిచాను. అందువ‌ల్ల డ‌బ్బుల్లేక అమ్మ‌ను చూసుకోలేక‌పోయాన‌నే గిల్ట్ అయితే లేదు. ఎంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టినా అమ్మ ద‌క్క‌లేద‌నే బాధ మాత్రం ఉంది." అని చెప్పుకొచ్చాడు మ‌నోజ్‌.