ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో తలైవా టాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమా ఏంటో గెస్ చేయగలరా!?

ప్రస్తుతం 'జైలర్'గా బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు తలైవా రజినీకాంత్. ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి వార్తల్లో నిలుస్తున్నారీ సూపర్ స్టార్. తెలుగులోనూ ఈ మూవీ.. రూ. 70 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.  ఇదిలా ఉంటే, పేరుకి కోలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ.. తెలుగు నేలపైనా తనదైన ముద్ర వేశారు రజినీకాంత్. తెలుగులో నేరుగా కొన్ని చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు భలేగా వినోదం పంచారాయన. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. టాలీవుడ్ లో రజినీకాంత్ నటించిన మొట్టమొదటి సినిమా ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఆ చిత్రమే.. 'అంతులేని కథ'. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన ఈ సినిమాలో జయప్రద ప్రధాన పాత్రలో నటించగా.. ఆమెకి అన్నగా ఓ ముఖ్య పాత్రలో దర్శనమిచ్చారు రజినీకాంత్. 1976 ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమాకి.. తమిళ చిత్రం 'అవళ్ ఒరు తొడర్ కథై' (1974) ఆధారం. ఇందులో రజినీకాంత్ పై చిత్రీకరించిన "దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" అనే పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ గీతాన్ని మధుర గాయకుడు కేజే ఏసుదాసు ఆలపించారు. అన్నట్టు.. రజినీకాంత్ తెలుగులోనే  తొలిసారిగా పూర్తి స్థాయి పాత్ర చేశారు. 'చిలకమ్మ చెప్పింది' (1977) పేరుతో రూపొందిన ఈ సినిమాకి ఈరంకి శర్మ దర్శకత్వం వహించగా.. శ్రీప్రియ, సంగీత ముఖ్య పాత్రల్లో కనిపించారు. 'చిలకమ్మ చెప్పింది' 1977కిగానూ 'ఉత్తమ చిత్రం'గా నంది పురస్కారం అందుకోవడం విశేషం.

పవన్ కళ్యాణ్ రీమేక్స్ లో ఆ హీరోవే ఎక్కువ.. ఇంతకీ ఎవరా స్టార్!?

తెలుగునాట రీమేక్స్ అనే మాట వినగానే గుర్తొచ్చే కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తన తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి రీసెంట్ మూవీ 'బ్రో' వరకు పవన్ మొత్తం 28 చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో 13 సినిమాలు వేరే భాషల్లో విజయం సాధించిన చిత్రాలకి రీమేక్ వెర్షన్స్ కావడం విశేషం.  ఇక పవన్ కళ్యాణ్ ఏ స్టార్ హీరో నటించిన సినిమాలను ఎక్కువగా రీమేక్ చేశారు? అంటే మాత్రం ఠక్కున వచ్చే సమాధానం.. కోలీవుడ్ హీరో దళపతి విజయ్. పవన్ కి యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన 'సుస్వాగతం' (1998) విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ 'లవ్ టుడే' (1997)కి తెలుగు వెర్షన్. అలాగే పవర్ స్టార్ స్థాయిని అమాంతం పెంచేసిన 'ఖుషి' (2001) కూడా విజయ్ 'ఖుషి' (2000) ఆధారంగానే తెరకెక్కింది. అయితే, 'ఖుషి' కథ మొదట పవన్ కళ్యాణ్ నే విన్నా.. ఫస్ట్ తెరపైకి వచ్చింది మాత్రం తమిళ్ 'ఖుషి'నే. సో.. అలా 'ఖుషి' కూడా రీమేక్ బాటలో సాగినట్లయ్యింది. అలాగే పవన్ 'అన్నవరం' (2006) కూడా విజయ్ నటించిన 'తిరుప్పాచ్చి' (2005) చిత్రానికి రీమేక్ రూపమే. మొత్తమ్మీద.. విజయ్ నటించిన మూడు తమిళ చిత్రాలను పవన్ రీమేక్ చేశారు. వీటిలో 'సుస్వాగతం', 'ఖుషి' ఘన విజయం సాధించాయి. 'అన్నవరం' మాత్రం యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. 

వెంకటేశ్ కోసం 24 మంది అతిథులు.. ఏ సినిమా కోసమో తెలుసా!!

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 24 మంది ప్రముఖులు.. ఒకే సినిమాలో, అది కూడా ఒకే పాటలో అతిథులుగా సందడి చేయడం అంటే మాములు విషయం కాదు. 36 ఏళ్ళ క్రితం 'టాక్ ఆఫ్ టాలీవుడ్'గా నిలిచిన అంశమిది.  ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'నసీబ్' (1981) ఆధారంగా తెలుగులో 'త్రిమూర్తులు' పేరుతో సినిమాని నిర్మించారు ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి. హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, రిషి కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తే.. తెలుగు వెర్షన్ లో వెంకటేశ్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ఆ వేషాల్లో కనిపించారు. ఇక మాతృకలో "జాన్ జానీ జనార్థన్" అంటూ సాగే పాటలో రాజ్ కపూర్, షమ్మీ కపూర్, రణధీర్ కపూర్, ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, రాకేశ్ రోషన్, విజయ్ అరోరా, వహీదా రెహ్మాన్, షర్మిలా ఠాగూర్, మాలా సిన్హా, బిందు, షిమి గేర్వాల్, సింపుల్ కపాడియా, ప్రేమ నారాయణ్ ఇలా 14మంది ప్రముఖులు అతిథులుగా మెరిస్తే.. "ఒకే మాట ఒకే బాట" అంటూ సాగే తెలుగు వెర్షన్ పాటలో క‌ృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి మారుతీరావు, పద్మనాభం, ఎ. కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, విజయనిర్మల, శారద, రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, సుమలత, జయమాలిని, అనూరాధ, వై. విజయ ఇలా 24 మంది ప్రముఖులు గెస్ట్స్ గా సందడి చేశారు. కలర్ ఫుల్ గా సాగే ఈ గీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  కాగా, కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించిన 'త్రిమూర్తులు'.. 1987 జూన్ 24న ప్రేక్షకుల ముందు నిలిచింది. 

మెగాస్టార్ బాలీవుడ్ మూవీస్.. కామన్ పాయింట్ అదే!

తెలుగునాట తిరుగులేని కథానాయకుడిగా రాణించిన మెగాస్టార్ చిరంజీవి.. హిందీలోనూ తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ లో ముచ్చటగా మూడు సినిమాల్లో హీరోగా నటించి... అక్కడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారాయన. 1990, 1992, 1994 సంవత్సరాల్లో విడుదలైన ఈ చిత్రాలు.. చిరుకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి.  ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా దక్షిణాదిన ఘనవిజయం సాధించిన చిత్రాలకు రీమేక్ వెర్షన్స్ నే. ఆ వివరాల్లోకి వెళితే..  ప్రతిబంధ్ (1990): హిందీలో చిరంజీవి నేరుగా నటించిన మొదటి సినిమా 'ప్రతి బంధ్'. తెలుగులో అఖండ విజయం సాధించిన 'అంకుశం' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాతృకలో రాజశేఖర్ పోషించిన పాత్రని హిందీలో చిరంజీవి చేశారు. ఆజ్ కా గూండారాజ్ (1992): చిరంజీవి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'గ్యాంగ్ లీడర్'.. హిందీలో 'ఆజ్ కా గూండారాజ్' పేరుతో రీమేక్ అయింది. తెలుగులో తను పోషించిన పాత్రనే హిందీ వెర్షన్ లోనూ ధరించారు మెగాస్టార్. ది జెంటిల్ మేన్ (1994): కోలీవుడ్ సెన్సేషన్ 'జెంటిల్ మేన్' సినిమాని హిందీలో 'ది జెంటిల్ మేన్' పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో అర్జున్ పోషించిన పాత్రని.. బాలీవుడ్ లో చిరంజీవి చేశారు. హిందీనాట చిరు హీరోగా నటించిన ఆఖరి చిత్రమిదే కావడం విశేషం. 

వేరే భాషల్లోకి రీమేక్ అయిన మెగాస్టార్ మూవీస్.. ఏంటో తెలుసా!

మెగాస్టార్ చిరంజీవికి రీమేక్స్ తో మంచి అనుబంధమే ఉంది. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అనదగ్గ కొన్ని సినిమాలు.. వేరే భాష నుంచి రీమేక్ అయ్యాయి. అదే సమయంలో.. చిరంజీవి నటించిన కొన్ని స్ట్రయిట్ మూవీస్.. ఇక్కడ మంచి విజయం సాధించడంతో పాటు వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అలా ఇతర భాషల్లో రీమేక్ అయిన చిరంజీవి సినిమాల వివరాల్లోకి వెళితే..  ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య : 1982లో రిలీజై ఘనవిజయం సాధించిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'.. తమిళంలో 'వీటుల రామన్ వెళియల కృష్ణన్', కన్నడంలో 'మనెలి రామన్న బీధిలి కామన్న', హిందీలో 'ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్' పేర్లతో రీమేక్ అయింది.  అభిలాష: 1983లో విడుదలైన ఈ నవలా చిత్రం.. తమిళంలో 'సట్టత్తై తిరుతుంగళ్' పేరుతో రీమేక్ అయ్యింది. ఖైదీ: చిరంజీవి కెరీర్ ని మేలిమలుపు తిప్పిన సినిమా 'ఖైదీ'.. అమెరికన్ ఫిల్మ్ 'ఫస్ట్ బ్లడ్' స్ఫూర్తితో తెరకెక్కింది. 1983లో విడుదలై సంచలన విజయం సాధించిన 'ఖైదీ'.. 1984లో హిందీ, కన్నడ భాషల్లో అదే పేరుతో రీమేక్ అయింది.  యముడికి మొగుడు: సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తో రూపొందిన 1988 నాటి 'యముడికి మొగుడు'.. 1990లో 'అతిశయ పిరవి' పేరుతో తమిళ్ లో రీమేక్ అయింది.  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు: 1989 సంక్రాంతి సెన్సేషన్ 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'.. 1989 సంవత్సరంలో 'మాపిళ్ళై' పేరుతో తమిళంలో, 1990లో 'జమై రాజా' పేరుతో హిందీలో, 2000లో 'ససుర్ బారి జిందాబాద్' పేరుతో బెంగాలీలో రీమేక్ అయింది.  గ్యాంగ్ లీడర్: కథానాయకుడిగా చిరంజీవి కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్ళిన మాస్ ఎంటర్టైనర్ 'గ్యాంగ్ లీడర్'. 1991లో జనం ముందు నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. హిందీలో 'ఆజ్ కా గుండారాజ్' పేరుతో రీమేక్ అయింది. 1992లో విడుదలైన ఈ సినిమాలోనూ చిరంజీవినే హీరోగా నటించారు. ఇక ఇదే చిత్రం 2003లో 'కుటుంబ' పేరుతో కన్నడ భాషలోకి రీమేక్ అయింది.  బావగారూ బాగున్నారా: 1998లో విడుదలై మంచి విజయం సాధించిన 'బావగారూ బాగున్నారా'.. బాలీవుడ్ లోకి 'కున్వారా' పేరుతో రీమేక్ అయింది. 2000 సంవత్సరంలో ఈ రీమేక్ రిలీజైంది. చూడాలని వుంది: 1998లో రిలీజైన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ 'చూడాలని వుంది'..  హిందీనాట 'కలకత్తా మెయిల్' పేరుతో 2003లో రీమేక్ అయింది.  అన్నయ్య: 2000 సంక్రాంతికి వినోదాలు పంచిన 'అన్నయ్య' చిత్రం.. 2005లో 'దేవ్ దూత్' పేరుతో బెంగాలీలోకి రీమేక్ అయింది. ఇంద్ర: 2002లో రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'ఇంద్ర'..  2005లో ఇండియన్ బెంగాలీలో 'దాదా' పేరుతోనూ, 2006లో బంగ్లాదేశీ బెంగాలీలో  'గోరిబేర్ దాదా' పేరుతోనూ రీమేక్ అయింది.  స్టాలిన్: చిరంజీవి నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'స్టాలిన్' 2006లో రిలీజ్ కాగా..  ఆ సినిమా హిందీ రీమేక్ 'జయహో' 2014లో జనం ముందు నిలిచింది.  (ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా)  

వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్స్.. మెగాస్టార్ సెన్సేషన్ ఇది!

ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దాదాపు నాలుగన్నర దశాబ్దాల కెరీర్ లో మొత్తం ఎనిమిది సార్లు ఇండస్ట్రీ హిట్స్ ని అందించారు చిరు. తన కెరీర్ ని మేలిమలుపు తిప్పిన 'ఖైదీ' (1983)తో మొదలుకుని 'ఇంద్ర' (2002) వరకు అంటే సుమారు 20 ఏళ్ళ పాటు ఇండస్ట్రీ హిట్స్ తో వార్తల్లో నిలిచారు మెగాస్టార్.  ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'ఖైదీ', 'ఇంద్ర' నడుమ చిరంజీవి పేరిట నమోదైన ఇండస్ట్రీ హిట్స్ అన్నీ వరుస సంవత్సరాల్లో సందడి చేశాయి. అంటే.. ఏడాదికి ఒక ఇండస్ట్రీ హిట్ చొప్పున ఆరేళ్ళ పాటు ఆరు ఇండస్ట్రీ హిట్స్ చిరు ఖాతాలో చేరాయన్నమాట. 1987లో 'పసివాడి ప్రాణం', 1988లో 'యముడికి మొగుడు', 1989లో 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 1990లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 1991లో 'గ్యాంగ్ లీడర్', 1992లో 'ఘరానా మొగుడు'.. ఇలా వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్స్ అందించారు చిరు. ఇది ఒక రకంగా అరుదైన రికార్డు అనే చెప్పాలి.    (ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా)

బర్త్ డే మంత్ లో మెగాస్టార్ బాక్సాఫీస్ హిట్స్.. ఏంటో తెలుసా!

ఆగస్టు నెల.. మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ప్రత్యేకం. ఈ నెల 22న చిరు పుట్టినరోజు. ఇక ఇదే నెలలో వేర్వేరు సంవత్సరాల్లో పలు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించారు చిరు. వీటిలో కొన్ని బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే.. ఛాలెంజ్: 1984లో విడుదలైన మ్యూజికల్ సెన్సేషన్ ఇది. ఆగస్టు 9న రిలీజైన ఈ చిత్రం అప్పటి యువతరాన్ని విశేషంగా అలరించింది. యండమూరి వీరేంద్రనాథ్ 'డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు' నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇందులో చిరంజీవికి జంటగా విజయశాంతి, సుహాసిని నటించగా ఇళయరాజా సంగీతమందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరణ మృదంగం: చిరంజీవికి 'మెగాస్టార్' అనే టైటిల్ ఇచ్చిన సినిమా ఇదే. 1988 ఆగస్టు 4న జనం ముందు నిలిచిన 'మరణ మృదంగం'లో చిరుకి జోడీగా రాధ, సుహాసిని అలరించగా.. ఎ. కోదండరామిరెడ్డి రూపొందించారు. ఈ సినిమాకి కూడా యండమూరి నవలే ఆధారం. 'మరణ మృదంగం' అనే నవలాధారంగా తయారైన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించగా.. ఇళయరాజా బాణీలు కట్టారు. కొదమ సింహం: కౌబాయ్ పాత్రలో మెగాస్టార్ ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రమా ఫిలింస్ పతాకంపై కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. రాజ్ - కోటి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ, సోనమ్ నటించారు. 1990 ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు నిలిచింది.  చూడాలని వుంది: చైల్డ్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా సౌందర్య, అంజలా ఝవేరి నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాని గుణశేఖర్ తీర్చిదిద్దారు. మణిశర్మ సంగీతం ఎస్సెట్ గా నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. 1998 ఆగస్టు 27న జనం ముందు నిలిచింది.   

ఎవరి మాట వినని 'సీతయ్య'కి 20 ఏళ్ళు.. హరిక‌ృష్ణ నట విశ్వరూపం!

నందమూరి హరికృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'సీతయ్య' ఒకటి. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి విజయవంతమైన సినిమాల తరువాత వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ నటించిన మూడో సినిమా ఇది. గత రెండు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించిన హరికృష్ణ.. 'సీతయ్య'లో కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించారు. ఇందులో హరికృష్ణకి జోడీగా సౌందర్య, సిమ్రన్ నటించగా ముకేశ్ రిషి, రాహుల్ దేవ్, రవి ప్రకాశ్, జయ ప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, మోహన్ రాజ్, కాంతారావు, బాలయ్య, ఆహుతి ప్రసాద్, రాజన్ పి. దేవ్, దేవన్, నళిని, సత్య ప్రకాశ్, సుభాషిణి, వింధ్య, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, మల్లికార్జున రావు, రమాప్రభ, సునీత వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రాయలసీమలోని ఓ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలను నివారించి.. శాంతిని నెలకొల్పిన సీతయ్య అనే ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కథే.. ఈ సినిమా.  స్వరవాణి కీరవాణి బాణీలు 'సీతయ్య'కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సిమ్రన్ తో కలిసి హరికృష్ణ చిందేసిన "బస్కెక్కి వస్తావో", "అమ్మతోడు" సినిమాకి ఎస్సెట్ గా నిలవగా.. "ఒక్క మగాడు", "సమయానికి", "సిగ్గేస్తోంది", "ఇదిగో రాయలసీమ గడ్డ", "రావయ్య రావయ్య", "ఆది శంకరుల", "ఎవరి మాట వినడు" కూడా ఆకట్టుకున్నాయి. వీటిలో "ఇదిగో రాయలసీమ గడ్డ" పాటకిగానూ 'ఉత్తమ గాయకుడు' విభాగంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 'నంది' పురస్కారం అందుకున్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వయంగా నిర్మించిన 'సీతయ్య'.. 2003 ఆగస్టు 22న జనం ముందు నిలిచింది. మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.   

'మాయలోడు'కి 30 ఏళ్ళు.. మళ్ళీ మ్యాజిక్ చేసిన కాంబో!!

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ సినిమాలే.. 'రాజేంద్రుడు - గజేంద్రుడు', 'మాయలోడు'. కేవలం ఆరు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలకీ దాదాపుగా ఒకే టీమ్ పనిచేయడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనూ సౌందర్య నాయికగా నటించగా.. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించారు. అలాగే దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చగా, శరత్ ఛాయాగ్రహణం అందించారు. కె. రామ్ గోపాల్ రెడ్డి ఎడిటర్ గా పనిచేశారు. అదేవిధంగా కోట శ్రీనివాస రావు, బాబూ మోహన్, బ్రహ్మానందం, అలీ, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి వంటి ప్రముఖ నటులు ఈ రెండు సినిమాల్లోనూ సందడి చేశారు.  కాగా, రాజేంద్ర ప్రసాద్ - ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమైన 'మాయలోడు' (1993) ఆగస్టు 19తో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సినిమా విశేషాల్లోకి వెళితే..  * 'రాజేంద్రుడు - గజేంద్రుడు' ఏనుగు సెంటిమెంట్ తో రూపొందితే.. 'మాయలోడు' చైల్డ్ సెంటిమెంట్ తో తెరకెక్కింది.  * ఇందులో హాస్యనటుడు బాబూ మోహన్, సౌందర్యపై చిత్రీకరించిన "చినుకు చినుకు అందెలతో" అనే వాన పాట అప్పట్లో ఓ సంచలనం. ఈ పాటకి వచ్చిన స్పందన చూసి.. తన దర్శకత్వంలోనే తెరకెక్కిన 'శుభలగ్నం' (1994) కోసం అలీ, సౌందర్యపై రీమిక్స్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి. రెండు సినిమాల్లోనూ ఈ సాంగ్ ఓ ఎస్సెట్ గా నిలిచింది.  * 'ఉత్తమ బాలనటి' (బేబి నిఖిత), 'కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా'.. ఇలా రెండు విభాగాల్లో 'మాయలోడు' నంది పురస్కారాలు అందుకుంది.  * ఆరు పాటల ట్రెండ్ నడుస్తున్న ఆ సమయంలో.. 'రాజేంద్రుడు - గజేంద్రుడు' తరహాలోనే 'మాయలోడు'లోనూ ఐదు పాటలతో సరిపెట్టారు ఎస్వీకే. రెండు ఆల్బమ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని భలేగా ఆకట్టుకున్నాయి.   

'సమరసింహారెడ్డి'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా!

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రం 'సమరసింహారెడ్డి'. 'పెద్దన్నయ్య' (1997) తరువాత కాస్త ట్రాక్ తప్పిన బాలకృష్ణకి ఈ సినిమా విజయం సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. 1999 సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యాక్షన్ డ్రామా.. అప్పట్లో పలు రికార్డులను భూస్థాపితం చేసి ఇండస్ట్రీ హిట్ గా నమోదయ్యింది. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్ స్పెక్టర్' వంటి ఘనవిజయాల తరువాత బాలయ్య, దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. వారికి హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ రేంజ్ ని మరింత పెంచింది. అదేవిధంగా, తెలుగునాట ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి ఊపు తీసుకువచ్చింది.  వాస్తవానికి 'సమరసింహారెడ్డి'కి ఫస్ట్ ఛాయిస్ బాలయ్య కాదు. తన కంటే ముందు మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ని సంప్రదించారు దర్శకుడు బి. గోపాల్. అయితే కథ విన్న వెంకీ.. తనకి ఈ సబ్జెక్ట్ అంతగా సెట్ కాదని, బాలకృష్ణ లాంటి మాస్ హీరో చేస్తే నెక్స్ట్ లెవల్ కి వెళుతుందని సున్నితంగా తిరస్కరించారట. దాంతో.. వెంకటేశ్ చేయాల్సిన 'సమరసింహారెడ్డి' కాస్త బాలయ్య ఖాతాలో పడింది. వెంకీ చెప్పినట్లుగానే తనదైన అభినయంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు నటసింహం. ఏదేమైనా.. వెంకీ ఓ ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసుకున్నారు. 

"ఊహలు గుసగుసలాడే".. ఎన్టీఆర్ 'బందిపోటు'కి 60 ఏళ్ళు !

నటరత్న నందమూరి తారక రామారావు, జానపద బ్రహ్మ బి. విఠలాచార్య కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి. వీటిలో సింహభాగం బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో 'బందిపోటు' ఒకటి. ఎన్టీఆర్, బి. విఠలాచార్య కలయికలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇందులో ఎన్టీఆర్ కి జంటగా కృష్ణకుమారి నటించగా.. రాజనాల, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, మిక్కిలినేని, వంగర, రాజబాబు, బాలకృష్ణ, గిరిబాబు, ఈవీ సరోజ, లీలావతి, పుష్పవల్లి, మీనా కుమారి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. త్రిపురనేని మహారథి కథ, మాటలు అందించగా.. బి. విఠలాచార్య స్క్రీన్ ప్లే సమకూర్చారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందరలాల్ నహతా, డూండీ నిర్మించారు.  ఘంటసాల సంగీతమందించిన ఈ చిత్రానికి దాశరథి, సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు సాహిత్యమందించారు. ఇందులోని "ఊహలు గుసగుసలాడే", "వగలరాణివి నీవే" పాటలు బాగా ప్రాచుర్యం పొందగా "మల్లియల్లో మల్లియల్లో", "ఊ అంటే తెలియని", "అంతా నీ కోసం", "మంచితనం కలకాలం" అంటూ సాగే గీతాలు కూడా రంజింపజేశాయి. 1963 ఆగస్టు 15న విడుదలై ఘనవిజయం సాధించిన 'బందిపోటు'.. మంగళవారంతో 60 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

"ఇంకేం ఇంకేం కావాలే|".. ఐదేళ్ళ 'గీత గోవిందం'.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ మరచిపోవడం సాధ్యమా!?

తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'గీత గోవిందం'.. బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మరీముఖ్యంగా.. వీరిద్దరి మధ్య వచ్చే ముద్దు సీన్ అయితే హాట్ టాపిక్ గా నిలిచింది. నిత్యా మీనన్, అను ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్రల్లో మెరిసిన 'గీత గోవిందం'లో సుబ్బరాజు, నాగబాబు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, గిరిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  గోపీసుందర్ సంగీతమందించిన 'గీత గోవిందం'లో "ఇంకేం ఇంకేం కావాలే" అంటూ సాగే గీతం బాగా పాపులర్ కాగా.. "ఏంటి ఏంటి", "వచ్చిందమ్మా", "కనురెప్ప కాలం", "తనేమందే తనేమందే", "వాట్ ద లైఫ్" అంటూ మొదలయ్యే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన 'గీత గోవిందం'.. 2018 ఆగస్టు 15న విడుదలై అఖండ విజయం సాధించింది. మంగళవారంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 5 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది. 

ఎన్టీఆర్ 'మంచి మనసుకు మంచి రోజులు'కి 65 ఏళ్ళు.. ఆ పాపులర్ పాటని చిరంజీవి హిట్ మూవీలో భలే వాడారు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో పలు రీమేక్ హిట్స్ ఉన్నాయి. వాటిలో 'మంచి మనసుకు మంచి రోజులు' ఒకటి. తమిళ చిత్రం 'తాయ్ పిరందాళ్ వళి పిరక్కుమ్' (ఎస్. ఎస్. రాజేంద్రన్, ఎం.ఎన్. రాజమ్, ప్రేమ్ నజీర్, రాజసులోచన) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజసులోచన, రాజనాల, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణ మూర్తి, పేకేటి శివరామ్, సూర్యకాంతం, గిరిజ, జయశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, టి. అశ్వద్ధ నారాయణ నిర్మించారు. ఏకే వేలన్ కథకి సముద్రాల జూనియర్ సంభాషణలు సమకూర్చారు.  ఘంటసాల మాస్టార్ సంగీతమందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, గిరిజపై చిత్రీకరించిన "అనుకున్నదొక్కటి అయిందొక్కటి" గీతం బాగా పాపులర్ అయింది. ఇదే పాటని మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ 'చట్టానికి కళ్ళు లేవు' (1981)లో కీలక సన్నివేశాల్లో సందర్భానుసారంగా వాడుకున్నారు. ఇక "రావే నా చెలియా", "కలవారి స్వార్థం", "హైలో హైలెస్సా", "ధరణికి గిరి భారమా", "ఓ చిన్ని బాలా", "వినవమ్మా వినవమ్మా", "భరత నారి" గీతాలు కూడా రంజింపజేశాయి. 1958 ఆగస్టు 15 జనం ముందు నిలిచిన 'మంచి మనసుకు మంచి రోజులు'.. సిల్వర్ జూబ్లీ జరుపుకుని విజయవాడలో 152 రోజులు ప్రదర్శన చూసింది. కాగా, మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 65 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

ఏయన్నార్ 'పల్లెటూరి బావ'కి 50 ఏళ్ళు.. హైలైట్ గా నిలిచిన "రంగి" పాట!

నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కొన్ని రీమేక్ చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో 'పల్లెటూరి బావ' ఒకటి. శివాజీ గణేశన్, జయలలిత, శుభ ముఖ్య పాత్రల్లో రూపొందిన తమిళ సినిమా 'పట్టిక్కాడా పట్టణమా' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ఏయన్నార్ కి జంటగా లక్ష్మి నటించగా శుభ కీలక పాత్రలో కనిపించారు. కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాలో చంద్రమోహన్, నాగభూషణం, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, గోకిన రామారావు, మాడా, చిట్టిబాబు, సారథి, రమా ప్రభ, సుకుమారి, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాతినేని చలపతిరావు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. పాటల్లో "ఒసేయ్ వయ్యారి రంగి" (రెండు వెర్షన్స్) బాగా ప్రాచుర్యం పొందగా.. "ఏయ్ బావయ్య పిలక బావయ్య", "మురిపించే గువ్వలారా", "ఎటు చూసినా అందమే", "తెలివి ఒకడి సొమ్మంటే", "శరభ శరభ" గీతాలు కూడా రంజింపజేశాయి. 1973 ఆగస్టు 15న విడుదలైన 'పల్లెటూరి బావ'.. మంగళవారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

రవితేజ 'బలాదూర్'కి 15 ఏళ్ళు.. 'విక్రమార్కుడు' జోడీ రిపీట్!

సంచలన చిత్రం 'విక్రమార్కుడు'(2006)లో జంటగా ఆకట్టుకున్నారు మాస్ మహారాజా రవితేజ, స్టార్ బ్యూటీ అనుష్క. కట్ చేస్తే.. ఆ సినిమా విడుదలైన రెండేళ్ళకి మరో చిత్రంతో అలరించే ప్రయత్నం చేశారు. 'బలాదూర్' పేరుతో తెరకెక్కిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించగా..  'కలిసుందాం.. రా!' ఫేమ్ ఉదయ్ శంకర్ తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందులో రవితేజకి పెదనాన్నగా నటించగా.. చంద్రమోహన్, సునీల్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి, పరుచూరి వెంకటేశ్వర రావు, గుండు హనుమంత రావు, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు, సత్యం రాజేశ్, సుమిత్ర, భార్గవి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.  కథాంశం విషయానికి వస్తే.. చంటికి (రవితేజ)కి నాన్న పురుషోత్తం (చంద్రమోహన్) కంటే పెదనాన్న రామకృష్ణ (కృష్ణ) అంటేనే ఎక్కువ గౌరవం. వ్యక్తిగా మంచివాడైనప్పటికీ.. నాన్న దృష్టిలో మాత్రం బలాదూర్ గా పేరు పొందుతాడు చంటి. మరోవైపు.. 20 ఏళ్ళ క్రితం నాటి ఓ ఘటన కారణంగా రామకృష్ణపై శత్రుత్వం పెంచుకుంటాడు ఉమాపతి (ప్రదీప్ రావత్). అందుకే.. రామకృష్ణపై పగతీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచిచూస్తుంటాడు. ఇలాంటి తరుణంలో.. చంటి కొన్ని అపార్థాల వల్ల ఇంటి నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో.. రామకృష్ణని టార్గెట్ చేసుకుంటాడు ఉమాపతి. అయితే, చంటి రహస్యంగా ఉమాపతి ఎత్తుల్ని చిత్తు చేస్తాడు. తిరిగి కుటుంబ సభ్యులకు దగ్గరవుతాడు.  పాటల విషయానికి వస్తే.. కె.ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి చంద్రబోస్, అనంత శ్రీరామ్, పెద్దాడమూర్తి సాహిత్యమందించారు. "అందమైన", "నువ్వు కొంచెం", "గుండెల్లో ఇల్లుంది", "రంగు రంగు", "ఎటు పోదాం", "తెల్ల చీర" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. 2008 ఆగస్టు 14న విడుదలైన బలాదూర్.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.  

'సిద్ధు ఫ్రమ్ సికాకుళం'కి 15 ఏళ్ళు.. అల్లరోడి సరదా ప్రేమకథ!

హాస్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. అల్లరి నరేశ్. కామెడీ హీరోగా తను నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టాయి. వాటిలో 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ఒకటి. ఈశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే మంజరి, శ్రద్ధా దాస్ తెలుగునాట కథానాయికలుగా తొలి అడుగేశారు. జయ ప్రకాశ్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఎల్బీ శ్రీరామ్, సురేఖా వాణి, తెలంగాణ శకుంతల, సత్యం రాజేశ్, కృష్ణ భగవాన్, మాస్టర్ భరత్ ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  కథాంశం విషయానికి వస్తే.. శ్రీకాకుళంకి చెందిన సిద్ధు వైజాగ్ కి చెందిన ఓ కళాశాలలో చేరతాడు. అక్కడే శైలజ (మంజరి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. శైలు కూడా అతని ప్రేమని అంగీకరిస్తుంది. అయితే, తన తండ్రి ఓబుల్ రెడ్డి (జయ ప్రకాశ్ రెడ్డి) ఓ పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని.. భూమారెడ్డి తమ్ముడితో ఆల్రెడీ పెళ్ళి కూడా ఫిక్స్ చేశాడని చెబుతుంది. ఈ నేపథ్యంలో.. సిద్ధు తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు? ఓబుల్ రెడ్డి అనుమతితోనే శైలజని ఎలా పెళ్ళి చేసుకున్నాడు? అనేది మిగిలిన సినిమా.  పాటల విషయానికి వస్తే.. కె.ఎం. రాధాకృష్ణన్ సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, వనమాలి, భూపాల్, పెద్దాడమూర్తి, సాయిశ్రీహర్ష సాహిత్యమందించారు. ఇందులోని "తెల్లారిపోనీకు ఈ రేయిని" గీతం మెలోడీప్రియులను విశేషంగా అలరించగా.. "జాంపండు లాంటి పిల్ల", "సరసాంగి రతనాంగి", "ఓ క్షణమైనా చాలు", "నా నబబా నననా" పాటలు కూడా ఆకట్టుకున్నాయి. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ళ విజయ ప్రసాద్ నిర్మించిన 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' 2008 ఆగస్టు 14న జనం ముందు నిలిచింది. నేటితో ఈ చిత్రం 15 వసంతాలు పూర్తిచేసుకుంది. 

పాతికేళ్ళ 'శ్రీరాములయ్య'.. ప్రారంభోత్సవంలో 'కారుబాంబు' దాడి!

వెండితెరపైకి వచ్చాక సంచలనం సృష్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రారంభోత్సవం నుంచే వార్తల్లో నిలిచిన చిత్రాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో.. 'శ్రీరాములయ్య' ఒకటి. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించగా.. తనకి జంటగా అభినేత్రి సౌందర్య కనిపించారు. కామ్రేడ్ సత్యంగా నందమూరి హరికృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వగా.. శ్రీహరి కీలక పాత్రలో అలరించారు. 'ఎన్ కౌంటర్' ఫేమ్ ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరిటాల సునీత నిర్మించారు.  1997 నవంబర్ 19న ప్రారంభమైన 'శ్రీరాములయ్య'కి సంబంధించిన 'కారుబాంబు' దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. జూబ్లీహిల్స్ రామానాయుడు స్టూడియో సమీపంలో చోటుచేసుకున్న ఈ వ్యూహాత్మక దుర్ఘటనలో పలువురు సినీ జర్నలిస్ట్ లు, చిత్ర సాంకేతిక నిపుణులు మృతి చెందడం అప్పట్లో రాజకీయ రంగంలోనూ, ముఠాకక్షల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ ప్రకంపనలు రేపింది. అప్పటి పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యుడు, పరిటాల శ్రీరాములు తనయుడు పరిటాల రవీంద్రని చంపడానికి 'సూరి' అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి వేసిన ఈ కారు బాంబు ప్లాన్.. దాదాపు 25 మంది ప్రాణాలు బలితీసుకుంది. పరిటాల రవి సహ పలువురు గాయాల పాలయ్యారు. వేలాదిమంది పరిటాల రవీంద్ర అభిమానులు హాజరైన ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.  ప్రారంభోత్సవం అనంతరం దుర్ఘటన చోటుచేసుకున్నా.. పలువురు మోహన్ బాబు, శంకర్ ని సినిమా చేయొద్దంటూ బెదిరించినా.. చిత్ర నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు పరిటాల రవీంద్ర. కథానాయకుడు, దర్శకుడు సహకారంతో సకాలంలోనే పూర్తి చేశారు. 'దాన వీర శూర కర్ణ' (1977) తరువాత నటనకు విరామం తీసుకున్న హరికృష్ణ.. 21 ఏళ్ళ అనంతరం తెరపై కనిపించిన సినిమా 'శ్రీరాములయ్య' కావడం విశేషం. అది కూడా పరిటాల రవీంద్ర కోరిక మేరకే ఆయన రీఎంట్రీ ఇచ్చారని సమాచారం.  ప్రారంభోత్సవ సమయంలో, నిర్మాణ తరుణంలో పలు సమస్యలు, దుర్ఘటనలు ఎదురైనా.. సిల్వర్ స్క్రీన్ పై మాత్రం జననీరాజనాలు అందుకుంది 'శ్రీరాములయ్య' సినిమా. మోహన్ బాబు, హరికృష్ణ, సౌందర్య, శ్రీహరి తదితరుల అభినయంతో పాటు శంకర్ దర్శకత్వ ప్రతిభ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం 'శ్రీరాములయ్య' విజయంలో ముఖ్య భూమిక పోషించాయి. ఇందులోని "భూమికి పచ్చాని రంగేసినట్టు", "నను గన్న నా తల్లి", "కర్మభూమిలో పూసిన ఓ పువ్వా" గీతాలు విశేషాదరణ పొందగా.. "విప్ప పూల", "పోరాటాల రాములు", "జోహారు జోహారు", "రాజ్యహింస", "ఘడియ ఘడియ" పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఉత్తమ గాయకుడు (వందేమాతరం శ్రీనివాస్), స్పెషల్ జ్యూరీ (శ్రీహరి) విభాగాల్లో 'శ్రీరాములయ్య' నంది పురస్కారాలు అందుకుంది. 1998 ఆగస్టు 14న జనం ముందు నిలిచిన 'శ్రీరాములయ్య'.. నేటితో 25 వసంతాలు పూర్తిచేసుకుంది. 

అతిలోక సుందరి ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన 9 సినిమాలు. ఆ చిత్రాలేంటో తెలుసా!?

వెండితెరపై తిరుగులేని తారగా రాణించిన వైనం.. అతిలోక సుందరి శ్రీదేవి సొంతం. ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ తనదైన అభినయంతో మురిపించారీ ఆల్ ఇండియా సూపర్ స్టార్. బాలనటిగా కెరీర్ ని ఆరంభించి ఆనక అగ్ర కథానాయికగా శ్రీదేవి ఎదిగిన తీరు.. ఎందరో తరువాతి తరాల తారలకు మార్గదర్శకంగా నిలిచిందంటే అభినేత్రిగా ఆమె స్థాయి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు గ్లామర్ వేషాలతో కట్టిపడేసిన శ్రీదేవి.. మరోవైపు అభినయానికి ఆస్కారమున్న భూమికల్లోనూ భలేగా మెప్పించారు. ఇక డబుల్ రోల్స్ లో అయితే శ్రీదేవి అదరహో అనిపించారనే చెప్పాలి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కలుపుకుని తొమ్మిది చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు శ్రీదేవి. ఒక కథానాయిక ఇన్ని సార్లు డ్యూయెల్ రోల్స్ లో కనిపించడం అరుదనే చెప్పొచ్చు. అంతేకాదు, వీటిలో రెండు సినిమాలకి గానూ 'ఫిల్మ్ ఫేర్' అవార్డులు కూడా అందుకున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.  శ్రీదేవి డబుల్ రోల్స్ చేసిన చిత్రాల వివరాల్లోకి వెళితే..  అంగీకారం (1977): శ్రీదేవి నటించిన తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇది. మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో సతి, విజిగా తల్లీకూతుళ్ళ పాత్రల్లో కనిపించారు అతిలోక సుందరి. వణక్కతుక్కురియ కాదలియే (1978): రజినీకాంత్, విజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ తమిళ చిత్రంలో అక్కాచెల్లెళ్ళుగా శాంతి, జెన్నీ వేషాల్లో మెప్పించారు శ్రీదేవి. మోసగాడు (1980): శోభన్ బాబు టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో చిరంజీవి ప్రతినాయకుడిగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సీత, గీత అనే అక్కాచెల్లెళ్ళుగా ఎంటర్టైన్ చేశారు శ్రీదేవి. గురు (1989): మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ బాలీవుడ్ సినిమాలో రమ, ఉమగా రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి. చాల్ బాజ్ (1989): శ్రీదేవికి ఉత్తరాదిన ఉత్తమ నటిగా తొలి 'ఫిల్మ్ ఫేర్' అవార్డుని అందించిన హిందీ చిత్రం 'చాల్ బాజ్'. సన్నీ డియోల్, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కవలలైన అంజు, మంజుగా కనిపించారు అతిలోక సుందరి.  లమ్హే (1991): బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటైన 'లమ్హే'లో పల్లవి, పూజగా తల్లీకూతుళ్ళ పాత్రల్లో అలరించారు శ్రీదేవి. అలాగే బెస్ట్ యాక్ట్రస్ గా మరో 'ఫిల్మ్ ఫేర్' అవార్డ్ ని తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఇందులో అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించారు.  బంజారన్ (1991): పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ హిందీ చిత్రంలో రేష్మ, దేవిగా రెండు వేర్వేరు కాలాలకు చెందిన పాత్రల్లో దర్శనమిచ్చారు శ్రీదేవి. ఈ సినిమాలో రిషి కపూర్ హీరోగా యాక్ట్ చేశారు. ఖుదా గవా (1992): అమితాబ్ బచ్చన్, నాగార్జున కథానాయకులుగా నటించిన ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో బెనజిర్, మెహందీగా తల్లీకూతుళ్ళ పాత్రల్లో మెస్మరైజ్ చేశారు శ్రీదేవి.  గురుదేవ్ (1993): రిషి కపూర్, అనిల్ కపూర్ హీరోలుగా నటించిన ఈ హిందీ మూవీలో ప్రియ, సునీతగా ద్విపాత్రాభినయం చేసి మురిపించారు శ్రీదేవి. (ఆగస్టు 13.. శ్రీదేవి జయంతి సందర్భంగా)

"సన్నజాజులోయ్.. కన్నెమోజులోయ్.." - ఎన్టీఆర్ 'సింహబలుడు'కి 45 ఏళ్ళు 

నటరత్న నందమూరి తారక రామారావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో సింహభాగం బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. 'అడవి రాముడు' వంటి ఇండస్ట్రీ హిట్ తో మొదలైన ఈ కాంబో.. 'మేజర్ చంద్రకాంత్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ వరకు సాగింది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్ని కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. అలా అలరించిన చిత్రాల్లో 'సింహబలుడు' ఒకటి. 'అడవి రాముడు' వంటి సెన్సేషనల్ మూవీ తరువాత ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ఈ సినిమా.. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. అయితే, పాటల పరంగా మాత్రం భలేగా మురిపించింది. మరీముఖ్యంగా.. ఇందులోని "సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్" గీతం ఇప్పటికీ ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో అందాల నర్తకి జయమాలిని తన చిందులతో కనువిందు చేసింది. ఈ గీతంతో పాటు "చూపులతో ఉడకేసి", "ఓ చెలి చలి", "ఏందమ్మో చురుక్కుమంది", "ఈ గంట గణ గణ" కూడా ఆకట్టుకున్నాయి.  జానపద కథాంశంతో తెరకెక్కిన 'సింహబలుడు'లో ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ నటించగా.. రావుగోపాల రావు, సత్యనారాయణ, మోహన్ బాబు, త్యాగరాజు, మాడా, సారథి, పీజే శర్మ, అంజలీ దేవి, రమాప్రభ, పల్లవి, హలం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. డి.వి. నరసరాజు కథను అందించిన ఈ చిత్రానికి యం.యస్. విశ్వనాథన్ స్వరాలు సమకూర్చగా.. వేటూరి సుందరరామ్మూర్తి పదరచన చేశారు. తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీరంగరాజు నిర్మించిన 'సింహబలుడు'.. 1978 ఆగస్టు 11న రిలీజైంది. శుక్రవారంతో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.