ఐట‌మ్ సాంగ్స్‌లో చాలీచాల‌ని దుస్తులపై అప్ప‌ట్లో సిల్క్ స్మిత ఫీలింగ్‌ ఇదే!

  తెలుగు ప్రేక్ష‌కుల్ని కొన్నేళ్ల పాటు త‌న మ‌త్తుక‌ళ్ల‌తో, నాట్య విలాసాల‌తో, ఒంపుసొంపుల‌తో అల‌రించిన తార సిల్క్ స్మిత‌. ఐట‌మ్ గాళ్‌గా ఆమెకు సాటి రాగ‌ల‌వారు లేరు అనే రేంజ్‌లో ఆమె కీర్తిని సంపాదించుకుంది. అయితే.. అనూహ్యంగా త‌న అభిమాన సందోహాన్ని విషాదంలో ముంచేస్తూ, చిన్న వ‌య‌సులోనే ఆత్మ‌హ‌త్య చేసుకొని ప‌ర‌లోకానికి వెళ్లిపోయింది. ఏలూరులోని క్రిస్టియ‌న్ కాన్వెంట్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గానే స్మిత త‌మ డాన్స్ మాస్ట‌ర్ పార్వ‌తి ద‌గ్గ‌ర నాట్యం నేర్చుకునేది. 'వండి చ‌క్రం' అనే త‌మిళ చిత్రంలో చేసిన 'సిల్క్' అనే గ్లామ‌ర‌స్ రోల్‌తో ప‌రిచ‌య‌మైంది స్మిత‌. ఆ చిత్రంలోనూ, ఆ త‌ర్వాతి చిత్రాల్లోనూ ఆమె నాట్య‌మే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది.  సినిమా ఇండ‌స్ట్రీలోకి క‌థానాయిక‌గా, న‌టిగా రాణించాల‌ని వెళ్లిందా? లేక నాట్య‌తార‌గానే రాణిద్దామ‌నుకుందా? "సినిమాల్లో వేషాలు వెయ్యాల‌న్న ఉత్సాహంతోనే నేను మ‌ద్రాస్ వెళ్లాను. ఆ వేషం డాన్స‌ర్ కానివ్వండి, క్యాబ‌రే ఆర్టిస్ట్‌, వ్యాంప్‌, ఏ క్యారెక్ట‌ర్ కానివ్వండి, చివ‌ర‌కు హీరోయిన్ క్యారెక్ట‌ర్ అయినా వెయ్య‌డానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విధంగానే భార‌తీరాజాగారి అలైగ‌ళ్ ఓయ్‌వ‌దిల్లై (తెలుగు సీతాకోక‌చిల‌క‌) చిత్రంలో ఒక మంచి పాత్ర ధ‌రించి ప్రేక్ష‌కుల మెప్పు పొందాను. మూన్రాంపిరై మూవీలో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న నేను చేసిన నాట్య‌మే కాక‌, ముస‌లి మొగుడితో సుఖం పొంద‌లేని యువ‌తిగా నా న‌ట‌న కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. అని అప్ప‌ట్లో ఆమె చెప్పుకొచ్చింది. "క్ల‌బ్ సాంగ్స్‌లో, స్పెష‌ల్ సాంగ్స్‌లో చాలీ చాల‌ని దుస్తులు ధ‌రించి నాట్యం చేస్తుంటారు క‌దా.. ఈ విష‌యంపై కొత్త‌ల్లో మీరెలా ఫీల‌య్యేవారు?" అనే ప్ర‌శ్న ఆమెకు ఎదురైంది. "నాకు చిన్న‌ప్ప‌టి నుంచి గౌన్లు, మినీ, మాక్సీ డ్ర‌స్‌లు వంటి మోడ‌ర‌న్ దుస్తులు ధ‌రించ‌డ‌మే అల‌వాటు. అందువ‌ల్ల ఆ దుస్తులు ధ‌రించ‌డంలో నాకు కొత్తేమీ లేదు. అదీకాక నా ధ్యేయం అభిమానుల ఆద‌ర‌ణ పొందాల‌న్న‌ది. అందువ‌ల్ల పాత్ర‌కు త‌గ్గ దుస్తులు ధ‌రించ‌డంలో నేనెప్పుడూ ఏ విధంగానూ ఫీల‌వ‌లేదు" అనేది ఆమె స‌మాధానం.

అభిమాన సంఘాల విష‌యంలో చంద్ర‌మోహ‌న్ అభిప్రాయం ఇదే!

  ఇవాళ అభిమాన సంఘాలు ఉండ‌ని హీరోలు లేరు. స్టార్ల‌కే కాదు, చిన్న చిన్న హీరోల‌కు కూడా అభిమాన సంఘాలు త‌యారైపోతుంటాయి. తెలుగు స్టార్ హీరోల అభిమానులే కాదు, మిగతా భాష‌ల‌కు చెందిన స్టార్ల అభిమానులు కూడా అనేక‌మంది సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇది నాణేనికి ఓ వైపు. మ‌రోవైపు వేర్వేరు హీరోల అభిమానుల మ‌ధ్య శ‌త్రుత్వం న‌డుస్తూ ఉంటుంద‌నేది ఎన్టీఆర్‌, కృష్ణ కాలం నుంచి మ‌నం గ‌మ‌నిస్తున్నాం.  ఒక స్టార్ సినిమా రిలీజైతే, ఆ హీరో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటూ ఉంటే, మ‌రో స్టార్ ఫ్యాన్స్ ఆ సినిమాపై కావాల్సినంత నెగ‌టివిటీని వ్యాప్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. వాల్‌పోస్ట‌ర్ల యుగంలో అయితే ఒక హీరో సినిమా పోస్ట‌ర్ల‌పై మ‌రో హీరో ఫ్యాన్స్ పిడ‌క‌లు కొట్ట‌డం గ్రామాల్లో నిత్యం క‌నిపించే స‌న్నివేశం. ఇప్పుడు సోష‌ల్ మీడియా కాలంలో ఒక హీరోపై మ‌రో హీరో ఫ్యాన్స్ దుమ్మెత్తిపోయ‌డం, అస‌భ్య‌క‌రంగా కామెంట్లు పెట్ట‌డం చూస్తున్నాం. దీంతో త‌ర‌చూ ఆయా స్టార్ల ఫ్యాన్స్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్స్ న‌డుస్తుంటాయి. క‌లెక్ష‌న్ల విష‌యంలో భిన్న హీరోల‌ ఫ్యాన్స్ త‌ర‌చూ పోట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి ఫ్యాన్స్ అసోసియేష‌న్ల‌పై ఒక‌సారి సీనియ‌ర్ యాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ స్పందించారు. అభిమానుల‌పై త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. చంద్ర‌మోహ‌న్ హీరోగా న‌టిస్తున్న కాలంలో ఓ అభిమాని, "నిర్మాత‌లు ఎన్నో ల‌క్ష‌ల పెట్టుబ‌డితో తీసిన చిత్రాల బాగోగులు నిర్ణ‌యించేది ప్రేక్ష‌కులే కానీ, అభిమాన సంఘాలు కాదు. కానీ ఒక్కోచోట ఈ అభిమాన సంఘాల దురాగ‌తాలు విప‌రీతంగా ఉంటున్నాయి. ఈ విష‌యంలో మీ అభిప్రాయం?" అని అడిగాడు. దానికి చంద్ర‌మోహ‌న్‌, "మీరు చెప్పింది నిజ‌మే. అటువంటి అభిమాన సంఘాల‌ను ఆయా న‌టులు కూడా ప్రోత్స‌హించ‌కూడ‌దు. కానీ అది జ‌రిగే ప‌ని కాదు క‌దా!" అని జ‌వాబిచ్చారు. తను న‌టించిన చిత్రాల్లో 'ప‌ద‌హారేళ్ల వ‌య‌సు'లోని కుంటివాని పాత్ర త‌న‌కు బాగా క్లిష్టంగా అనిపించింద‌ని ఆయ‌న అన్నారు. "ఆ చిత్రానికి మూల‌మైన త‌మిళ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ గోచీ క‌ట్టుకొని న‌టించారు. తెలుగులో తీస్తున్న‌ప్పుడు నిర్మాత‌ల కంటే ముందుగా నేనే గోచీ క‌ట్టుకొని చేస్తాన‌న్నాను" అని ఆయ‌న చెప్పారు.

కురుచ దుస్తుల‌తో క్ల‌బ్ డాన్సులు చేసేప్పుడు జ‌య‌మాలిని ఫీలింగ్ ఇదే!

  ఒక‌ప్పుడు 'జ‌గ‌న్మోహిని'గా తెలుగు, త‌మిళ చిత్ర‌సీమ‌ల్ని ఏలేసింది జ‌య‌మాలిని. క్ల‌బ్ సాంగ్స్‌కు, ఐట‌మ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. బొద్దుగా ఉంటూనే అంద‌చందాలు, నాట్య‌విలాసాల‌తో ప్రేక్ష‌కుల‌ను దాసోహం చేసుకుందామె. ఆ రోజుల్లో జ‌య‌మాలినిని ఆరాధించ‌ని ర‌సిక జ‌నం లేరంటే అతిశ‌యోక్తి కాదు. కురుచ దుస్తుల్లో, వంటి ఒంపుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ కెమెరా ముందు డాన్స్ చేస్తున్న‌ప్పుడు ఎలాంటి ఇబ్బందీ అనిపించ‌దా? అనే సందేహం చాలా మందికి వ‌స్తుంది. దానికి జ‌య‌మాలిని ద‌గ్గ‌ర స‌మాధానం ఉంది. ఆమె శృంగార నృత్య‌తార‌గా పీక్ స్టేజ్‌లో ఉండ‌గా ఒక‌సారి, "జ‌య‌మాలిని గారూ! మీరు మంచి న‌టి, న‌ర్త‌కి అయివుండి కూడా కేవ‌లం క్ల‌బ్ డాన్స‌ర్ గానే స్థిర‌ప‌డిపోయారు. కానీ ఆ క్ల‌బ్ శృంగారం ఈ మ‌ధ్య మ‌రీ మోతాడు మీరిపోతోంది. మీ డాన్సుకి కెమెరా కూడా మ‌రింత చురుగ్గా దోహ‌దం చేస్తోంది. ఇది మ‌గ ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయించ‌వ‌చ్చుగాని, స్త్రీల‌కు మాత్రం ఇబ్బందిగానే ఉంటోంది. అలాంటి నాట్యాలు చేస్తున్న‌ప్పుడు ఒక స్త్రీగా మీకు ఇబ్బంది ఉండ‌దా?  మీ నృత్యాల‌కు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారా? అలాంటి నాట్యాలు చేస్తున్నందుకు మీరెప్పుడైనా ఫీల‌య్యారా?" అని ఒక ప్రేక్ష‌కురాలు ప్ర‌శ్నించింది. "మీ బాధ నాకు అర్థ‌మైంద‌మ్మా. నేను చిత్రాల్లో న‌టించాల‌నే వ‌చ్చాను, న‌టించాను కూడా. కానీ, అలాంటి డాన్సులు చెయ్య‌డంతోనూ, అవి రాణించ‌డంతోనూ న‌న్ను ఒక డాన్స‌ర్‌గానే ముద్ర‌వేశారు. అలాంటి డాన్సులు ఆడిన‌ప్పుడు కెమెరా కూడా అలాగే ప‌నిచెయ్యాలి. డాన్స్ డైరెక్ట‌ర్లు కూడా అలాంటి మూవ్‌మెంట్స్‌నే కంపోజ్ చెయ్యాలి. మీరు చెప్పిన‌ట్టు, ఆ డాన్సులు మ‌గ‌ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయించ‌డానికే! స్త్రీల‌కు ఇబ్బందే కావ‌చ్చు, కానీ అందుకు నేను బాధ్యురాలిని కాను. ఇలాంటి నృత్యాల‌కు విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌ను అన‌స‌రించి, ద‌ర్శ‌క నిర్మాత‌లు అలాంటి నృత్యాలు పెట్ట‌డం ఆపేయాలి క‌దా. కానీ, ఒక్కోసారి ఇలాంటి నృత్యాలే బాక్సాఫీస్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అంచేత త‌ప్ప‌డం లేదు! అలాంటి నాట్యాలు చేస్తున్నందుకు నేనెప్పుడూ ఫీల్ కాలేదు. ఎంచేత‌?  ఫీలైతే, మ‌ళ్లీ చేసి ఉండ‌నుగా." అని చెప్పుకొచ్చింది జ‌య‌మాలిని.

ఫ్లాష్‌బ్యాక్‌: రాధిక‌, ప్ర‌తాప్ పోత‌న్ పెళ్లికి అన్నీ తానై చూసుకున్న స‌రిత‌!

  సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల మ‌ధ్య ప్ర‌గాఢ స్నేహం ఏర్ప‌డ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. ఇగో స‌మ‌స్య‌ల‌తో దూర‌దూరంగా మెల‌గుతూ ఉంటారు. అయితే ఒక‌ప్ప‌టి హీరోయిన్లు రాధిక‌, స‌రిత మంచి స్నేహితులు. కెరీర్ ఆరంభ‌మైన తొలినాళ్ల‌లోనే వారికి స్నేహం కుదిరింది. క్ర‌మంగా అది మ‌రింత బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది. 1983లో తోటి న‌టుడు ప్ర‌తాప్ పోత‌న్‌ను రాధిక వివాహం చేసుకున్నారు. అయితే వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిల‌వ‌క‌పోవ‌డం వేరే సంగ‌తి. ప్ర‌తాప్ పోత‌న్ 2022 జూలై 15న క‌న్నుమూశారు. రాధిక‌, ప్ర‌తాప్ పోత‌న్ పెళ్లిలో రాధిక త‌ర‌పున చాలా ప‌నులు చూసుకుంది స‌రిత‌. అదివ‌ర‌కు ఎన్నోసార్లు రాధిక ఎదుర్కొన్న క్లిష్ట స‌మ‌యాల్లో స‌పోర్ట్‌గా నిలిచి, ఆమెకు ధైర్యాన్నిచ్చింది స‌రిత‌. 1983లో ఒక‌రోజు ఉన్న‌ట్లుండి రాధిక పెళ్లి నిర్ణ‌యం తీసుకుంది. ఆ సంగ‌తి ముందుగా స‌రిత‌కే చెప్పింది. ఆమె ఎంతో సంతోషించింది. రాధిక ప‌క్క‌నే ఉండి పెళ్లి బ‌ట్ట‌ల ద‌గ్గ‌ర్నుంచీ, మంగ‌ళ‌సూత్రం వ‌ర‌కూ అన్నిటినీ కొన‌డంలో ఎంత‌గానో స‌హ‌క‌రించింది స‌రిత‌. అప్ప‌ట్లో రాధిక ప్ర‌తిదానికీ క‌ల‌వ‌ర‌ప‌డుతూ, గంద‌ర‌గోళానికి లోన‌య్యేది. అలాంటి స‌మ‌యాల్లో స‌రిత ఆమె ప‌క్క‌నే ఉండి, సాయం చేసింది. రాధిక‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్సాహ‌ప‌రిచేది. ఈ ఇద్ద‌రికీ మ‌రో మంచి స్నేహితురాలు ఉంది.. ఆమె, న‌టి శ్రీ‌ప్రియ‌. ఈ పెళ్లి విష‌యం ఆమెకు చెప్పాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించారు రాధిక‌, స‌రిత‌. అప్పుడు శ్రీ‌ప్రియ ఔట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లి ఉంది. అక్క‌డ‌కు ఫోన్ చేసింది రాధిక‌. కానీ శ్రీ‌ప్రియ దొర‌క‌లేదు. దాంతో ఎంతో ముఖ్య‌మైన ఆ స‌మ‌యంలో రాధిక పెళ్లికి సంబంధించిన బాధ్య‌త‌ల్లో ఎక్కువ‌గా స‌రితే చూసుకుంది.  పెళ్లి తేదీ అక‌స్మాత్తుగా నిర్ణ‌యించ‌డంతో, ఆ రోజు రాధిక షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండ‌టంతో నిర్మాత అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావుకు ఆ సంగ‌తి చెప్పింది రాధిక‌. అప్పుడాయ‌న 'ముగ్గురు మొన‌గాళ్లు' మూవీ నిర్మిస్తున్నారు. అందులో శోభ‌న్‌బాబు జోడీగా న‌టిస్తోంది రాధిక‌. ఆమె చెప్పిన మాట‌ల‌కు పూర్ణ‌చంద్ర‌రావు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యారు. స‌రిత‌కు కూడా ఆ రోజు షూటింగ్ ఉంది. కానీ ఎలాగైనా పెళ్లి స‌మ‌యానికి చేరుకోవాల‌ని, రాధిక కోసం లంచ్ త్యాగం చేసి, షూటింగ్‌లో త‌న వ‌ర్క్ వీలైనంత త్వ‌ర‌గా ముగించ‌మ‌ని నిర్మాత ద‌ర్శ‌కుల్ని అడిగి, ముందుగానే వేడుక‌కు హాజ‌రైంది. ఇలా స‌రిత మంచిత‌నం గురించీ, స్నేహితురాలిగా ఆమె చూపిన ప్రేమ‌, ఆద‌రాభిమానాల గురించి స్వ‌యంగా వెల్ల‌డించింది రాధిక‌.

ఉదయ్ కిరణ్ చేయాల్సిన 'అతడు' మహేష్ చేశాడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'అతడు'(2005). మహేష్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. బుల్లితెరపై ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ క్లాసిక్ ఫిల్మ్ లో మొదట ఉదయ్ కిరణ్ నటించాల్సి ఉండగా.. ఆయనకు కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మహేష్ దగ్గరకు వెళ్లిందట. 'చిత్రం'(2000) సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' సినిమాలతోనూ సూపర్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2000-2005 సమయంలో ఉదయ్ కిరణ్ తో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే 'అతడు' స్క్రిప్ట్ కూడా మొదట ఉదయ్ దగ్గరికే వెళ్లిందట. ఈ విషయాన్ని అతడు చిత్రాన్ని నిర్మించిన సీనియర్ యాక్టర్ మురళి మోహన్ తాజాగా రివీల్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్.. 'అతడు' స్క్రిప్ట్ మొదట ఉదయ్ కి వినిపించగా ఆయనకి నచ్చిందని కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయలేకపోయాడని తెలిపారు. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ మహేష్ దగ్గరకు వెళ్లిందని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'అతడు' లాంటి క్లాసిక్ ఫిల్మ్ ని ఉదయ్ అనవసరంగా మిస్ చేసుకున్నాడని, ఆ సినిమా చేసుంటే అతని ఇమేజ్ మరింత పెరిగి బిగ్ స్టార్ గా మారిపోయేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవి త‌దుప‌రి సినిమాల‌పై హైప్ ఏదీ?

  'కృషితో నాస్తి దుర్భిక్షం' అనే నానుడిని నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచారు చిరంజీవి. స్వ‌యంకృషితోనే అసాధార‌ణమైన మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగారు. అక్క‌డితో ఆగ‌కుండా ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం త‌పిస్తూ అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ, వారి గుండెల్లో చిర‌స్థాయి స్థానం సంపాదించుకున్నారు. ఆరున్న‌ర ద‌శాబ్దాల వ‌య‌సు పైబ‌డినా, జీవితంలో అత్యంత ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగినా ఆయ‌న‌లోని ప‌ట్టుద‌ల ఏమాత్రం త‌ర‌గ‌లేదు. ఇంకా ఏదో సాధించాల‌నే త‌ప‌న ఆయ‌న‌లో నిత్యం క‌నిపిస్తుంటుంది. రాజ‌కీయాలు త‌న‌కు ప‌నికిరావ‌ని స్వ‌ల్ప కాలంలోనే గ్ర‌హించి, 'ఖైదీ నంబ‌ర్ 150'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, అభిమానుల్ని ఆనంద సాగ‌రంలో ఓల‌లాడించారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో 'సైరా' చేసి, ఔరా అనిపించారు. అయితే మునుప‌టి సినిమా 'ఆచార్య' అనూహ్య‌మైన రీతిలో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డం ఆయ‌న జీర్ణించుకోలేని విష‌యం. ఆ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్లు దారుణంగా న‌ష్ట‌పోయారు. వారికి ఎంత‌మేర‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌నే విష‌యంలో ఇప్ప‌టికీ చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి.  కాగా, 'ఆచార్య' ఎఫెక్ట్ ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల‌పై ప‌డుతున్న‌ద‌నే అభిప్రాయం ఇండ‌స్ట్రీలో వ్య‌క్త‌మ‌వుతోంది. చిరంజీవి సినిమా అంటే మినిమ‌మ్ గ్యారంటీ ఉంటుంద‌నే న‌మ్మ‌కాన్ని 'ఆచార్య' వ‌మ్ముచేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంద‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకే ఆశించిన రీతిలో వాటిపై హైప్ రావ‌ట్లేద‌ని అంటున్నారు. ద‌స‌రాకు చిరంజీవి నెక్ట్స్ మూవీ 'గాడ్‌ఫాద‌ర్' విడుద‌ల కానున్న‌ది. మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన 'లూసిఫ‌ర్' మూవీకి ఇది రీమేక్‌. చిరంజీవి అంటే.. హీరోయిన్ల‌తో ఆట‌పాట‌లు, డాన్సులు, ఫైట్లు, కామెడీ లాంటి వాటిని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. వీటిలో ఫైట్లు మిన‌హా మిగ‌తావి ఉండ‌వు. ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌నే గాడ్‌ఫాద‌ర్‌కు ప్రాణం లాంటిది. త‌న న‌ట‌న‌తోనే ఆయ‌న ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెల‌వాల్సి ఉంది. త‌న‌ ట్రేడ్‌మార్క్ డాన్సులు, కామెడీ, హీరోయిన్‌తో స‌ర‌సాలు లాంటివి లేకుండా గాడ్‌ఫాద‌ర్‌గా ఆయ‌న ఏమేర‌కు బాక్సాఫీస్‌ను గెలుస్తార‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ మూవీ త‌ర్వాత ఆయ‌న బాబీ డైరెక్ష‌న్‌లో చేస్తున్న 'మెగా 154', మెహ‌ర్ ర‌మేశ్‌తో చేస్తున్న 'భోళాశంక‌ర్' సినిమాలు మ‌న ముందుకు రానున్నాయి. ఈ డైరెక్ట‌ర్ల విష‌యంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా లేర‌ని సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్స్‌, ట్రోల్స్ తెలియ‌జేస్తున్నాయి. క్రేజ్ ఉన్న డైరెక్ట‌ర్స్‌ను ఎంచుకోకుండా, వీళ్ల‌ను ఆయ‌న ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కావ‌ట్లేద‌ని వాపోయిన‌, వాపోతున్న వాళ్లెంద‌రో!  డైరెక్ట‌ర్ల వ‌ల్ల కూడా ఈ సినిమాల‌కు హైప్ రావ‌ట్లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువే. దాంతో ఇటు బాబీపై, అటు మెహ‌ర్ ర‌మేశ్‌పై ఒత్తిడి మామూలుగా లేదు. ఆ సినిమాలు ఆడితే, వారి కెరీర్ల‌కు మేలు జ‌రుగుతుంది. లేదంటే.. కెరీర్ ప‌రంగా వారు మ‌రింత క‌ష్ట‌కాలం ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వారిని డైరెక్ట‌ర్లుగా ఎంచుకున్నందుకు చిరు కూడా విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతారు. ఈ సినిమాలు చిరును గెలిపిస్తాయా, లేదా అనేది ఇప్పుడు అంద‌రిలోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌.

కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించింది ఈ సినిమాలోనే!

  'అల్లూరి సీతారామ‌రాజు' (1974) సినిమా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఎంత‌టి పేరు తెచ్చిందో, ఆయ‌న కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయిగా ఎలా నిలిచిందో మ‌న‌కు తెలుసు. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన మ‌న్యంవీరుడు సీతారామ‌రాజు పాత్ర‌లో కృష్ణ అద్భుతాభిన‌యం అశేష ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకొని, ఆయ‌న అభిమాన గ‌ణాన్ని ఎన్నో రెట్లు పెంచింది. అయితే సీతారామ‌రాజు పాత్ర‌ను ఆ సినిమాలో కంటే ఆరేళ్ల ముందుగానే మ‌రో సినిమాలో కృష్ణ పోషించారు. అది.. 'అసాధ్యుడు' (1968) సినిమా. హీరోగా మారిన మూడేళ్ల‌కు చేసిన ఆ సినిమాలో ఓ నృత్య రూప‌కంగా సీతారామ‌రాజు క‌థ వ‌స్తుంది. సుప్ర‌సిద్ధ రంగ‌స్థ‌ల‌, సినీ న‌టుడు వ‌ల్లం న‌ర‌సింహారావు ప్ర‌ద‌ర్శించే 'అల్లూరి సీతారామ‌రాజు' నాట‌కం చూసి, ఉత్తేజితులైన కృష్ణ.. ఎలాగైనా ఆ పాత్ర పోషించాల‌ని త‌పించేవారు. 'అసాధ్యుడు' చిత్ర నిర్మాత, ప‌హిల్వాన్ అయిన నెల్లూరు కాంతారావు ద‌ర్శ‌కుడు వి. రామ‌చంద్ర‌రావుతో చ‌ర్చించి సినిమాలో సీతారామ‌రాజుకు సంబంధించిన ఒక ఎపిసోడ్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. సంగీత ద‌ర్శ‌కుడు టి. చ‌ల‌ప‌తిరావుతో త‌మ ఆలోచ‌న చెప్పారు. పాట రూపంలో సీతారామ‌రాజు క‌థ చెబితే బాగుంటుందని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. ఆ పాట రాసే బాధ్య‌త‌ను మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌కి అప్ప‌గించారు. "తెల్ల‌దొర‌ల గుండెల‌ల్ల ఝ‌ల్లుమ‌నంగా" అంటూ ఉద్వేగ‌భ‌రితంగా సాగే పాట‌ను రాసిచ్చారు శ్రీ‌శ్రీ‌. చ‌ల‌ప‌తిరావు ట్యూన్ క‌ట్టిన ఆ ఏడు నిమిషాల పాట‌ను బి. గోపాలం, వ‌సంత బృందం ఆల‌పించారు. వ‌ల్లం న‌ర‌సింహారావు వ్యాఖ్యానం అందించ‌గా నృత్య రూప‌కంగా దాన్ని మ‌ల‌చారు. ఆ రూప‌కం చిత్రీక‌ర‌ణ‌కు ప‌ది రోజుల స‌మ‌యం ప‌ట్టింది. వేణుగోపాల్ కొరియోగ్ర‌ఫీ అందించిన ఆ రూప‌కం 'అసాధ్యుడు' చిత్రం మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. సీతారామ‌రాజుగా కృష్ణ ఆహార్యం ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. రూథ‌ర్‌ఫ‌ర్డ్‌గా ప్ర‌భాక‌ర్‌రెడ్డి న‌టించ‌గా, గిరిజ‌న యువ‌తిగా వాణిశ్రీ క‌నిపించారు. అనంత‌ర కాలంలో గొప్ప సినిమాటోగ్రాఫ‌ర్‌గా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించిన వి.ఎస్‌.ఆర్‌. స్వామికి ఇది తొలి సినిమా. ఆయ‌న ప్ర‌తిభా సామ‌ర్థ్యాలు ఎలాంటివో తొలి సినిమాలోనే మనం చూడొచ్చు. విశేష‌మేమంటే 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాకూ ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డం. అలాగే 'అసాధ్యుడు'లో సీతారామ‌రాజు నృత్య రూప‌కాన్ని రాసిన శ్రీ‌శ్రీ 'అల్లూరి సీతారామ‌రాజు'లో రాసిన "తెలుగువీర లేవ‌రా" పాట‌కు ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. 'అసాధ్యుడు' ద‌ర్శ‌కుడైన రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలోనే 'అల్లూరి సీతారామ‌రాజు' మొద‌లైంది. అయితే మ‌ధ్య‌లో ఆయ‌న ఆక‌స్మికంగా మృతి చెందడంతో కె.ఎస్‌.ఆర్‌. దాస్ స‌హ‌కారంతో తానే ఈ సినిమాను పూర్తి చేశారు కృష్ణ‌. అయితే రామ‌చంద్ర‌రావు మీద గౌర‌వంతో టైటిల్స్‌లో ఆయ‌న పేరే వేశారు. (ఈరోజు అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతి)

ఎన్టీఆర్ 'రాముడు-భీముడు' క‌థ‌ను మొద‌ట ఏఎన్నార్ రిజెక్ట్ చేశారు!

  న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు ద్విపాత్రాభిన‌యం చేసిన‌ 'రాముడు-భీముడు' చిత్రం 1964లో రిలీజై ఘ‌న విజ‌యం సాధించిన‌. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం అదే. నిజానికి రామారావు కంటే ముందు ఆ స్క్రిప్టు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. కథ న‌చ్చి కూడా ఆయ‌న దాన్ని రిజెక్ట్ చేశారు. దానికి ఓ కార‌ణం ఉంది. నిజానికి 'రాముడు-భీముడు' క‌థ‌ను మొద‌ట జాన‌ప‌ద క‌థ‌గా రాశారు ర‌చ‌యిత డి.వి. న‌ర‌స‌రాజు. 'ప్రిజ‌న‌ర్ ఆఫ్ జెండా' ఇనే ఇంగ్లిష్ న‌వ‌ల‌, వేదం వేంక‌ట‌రాయ‌శాస్త్రి ర‌చించిన 'ప్ర‌తాప‌రుద్రీయం' నాట‌కం.. రెండింటినీ క‌లిపి ఆయ‌న ఒక జాన‌ప‌ద క‌థ అల్లారు. అయితే అదే స‌మ‌యంలో త‌మిళంలో ఎంజీ రామ‌చంద్ర‌న్‌, భానుమ‌తి, బి. స‌రోజాదేవి కాంబినేష‌న్‌లో 'నాడోడి మ‌ణ్ణ‌న్' అనే జాన‌ప‌ద సినిమా వ‌చ్చింది. అందులో ఎంజీఆర్ అన్న‌ద‌మ్ములుగా డ్యూయ‌ల్ రోల్ చేశారు. ఆ టైమ్‌లో 'ది స్కేప్ గోట్' అనే న‌వ‌ల చ‌దివిన న‌ర‌స‌రాజుకు 'రాముడు-భీముడు' క‌థ‌ను సాంఘికంగా మార్చాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. మూడు నాలుగు వారాల్లో పూర్తి స్క్రిప్టు రాసేశారు. దాన్ని క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు డైరెక్ష‌న్‌లో మిద్దే జ‌గ‌న్నాథ‌రావు నిర్మించాల‌నేది ప్లాన్‌. ఆ క‌థ‌ను అక్కినేనితో తియ్యాల‌ని జ‌గ‌న్నాథ‌రావు అనుకున్నారు. ఎందుకంటే అంత‌కుముందే ఆయన నిర్మించిన 'రాజ‌నందిని' సినిమాలో ఎన్టీఆర్ హీరోగా న‌టించారు. ఆయ‌న సూచ‌న మేర‌కు అక్కినేనికి ఆ క‌థ వినిపించారు న‌ర‌స‌రాజు. 'రాముడు-భీముడు' క‌థ ఏఎన్నార్‌కు బాగా న‌చ్చింది. కానీ ఆయ‌న న‌ర‌స‌రాజుతో, "ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్ప‌ట్లో జ‌గ‌న్నాథ‌రావుకు కాల్షీట్లు ఇవ్వ‌లేను. అదీగాక మ‌రికొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాలో నేనే న‌టించ‌లేను. నాకు క‌థ న‌చ్చ‌లేదు అని వారికి  చెప్తాను. మీరేమీ అనుకోవ‌ద్దు. నిజానికి క‌థ నాకు బాగా న‌చ్చింది. ఈ విష‌యంలో మీరు నాకు స‌హ‌క‌రించాలి" అని చెప్పారు. అలా ఆ ప్రాజెక్టు అట‌క ఎక్కింది. ఆ త‌ర్వాత సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌ను ప్రారంభించిన డి. రామానాయుడు, దానిపై తొలి చిత్రాన్ని తాపీ చాణ‌క్య ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌ని సంక‌ల్పించారు. మ‌ద్రాస్ మెరీనా బీచ్‌లో ఆ ఇద్ద‌రికీ క‌థ చెప్పారు న‌ర‌స‌రాజు. వారికి న‌చ్చింది. మ‌రుస‌టి రోజు ఎన్టీ రామారావు ఇంట్లో ఆయ‌న‌కు క‌థ వినిపించారు. వెంట‌నే ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అలా అన్న‌ద‌మ్ములుగా రామారావు డ్యూయ‌ల్ రోల్ చేసిన 'రాముడు-భీముడు' థియేట‌ర్ల‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ట‌యి, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌కు ఘ‌న‌మైన ఆరంభాన్నిచ్చింది.

త‌న లైఫ్‌లోని మ‌రో స్త్రీ ఎవ‌రో బ‌య‌ట‌పెట్టేసిన‌ పృథ్వీ!

  న‌టుడు పృథ్వీరాజ్ కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్నారు. ఆమె విజ‌య‌వాడ‌లో ఉంటుంటే, ఈయ‌న హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. పృథ్వీపై ఆమె పెట్టిన కేసులు కోర్టులో న‌డుస్తున్నాయి. కాగా త‌న జీవితంలోని మ‌రో స్త్రీ ఎవ‌ర‌నేది తొలిసారిగా బ‌య‌ట‌పెట్టారు పృథ్వీ. లేటెస్ట్‌గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో 20 ఏళ్లుగా త‌న బాగోగులు ఓ స్త్రీ చూసుకుంటున్నార‌నీ, ఆమె పేరు దాస‌రి ప‌ద్మ‌రేఖ అనీ ఆయ‌న వెల్ల‌డించారు. "2020లో న‌న్ను ప‌ల‌క‌రించిన వాళ్లెవ‌రూ లేరు. ఒక‌వైపు లాక్‌డౌన్‌. సినిమాలు లేవు. బ‌య‌టేమో ఉగ్ర‌వాద శిబిరాల నుంచి మ‌న‌కు కోట్లు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం. సెంట‌ర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లి టిఫిన్ చేసేవాడ్ని. భోజ‌నం కూడా అక్క‌డే. మిగ‌తావాళ్లు ఎలా సంపాదించుకున్నారో నాకు తెలీదు. 'లౌక్యం' సినిమాలో యాక్ట్ చేశాను కానీ, నాకు లౌక్యం లేదు. ఆడా, మగా క‌లిస్తే వేరే ర‌క‌మైన రిలేష‌న్ అంట‌గ‌ట్టేస్తుంటారు. హైద‌రాబాద్‌లో ఒకామె 20 ఏళ్ల నుంచీ నా బాగోగులు చూసుకుంటూ వ‌స్తున్నారు. నా లైఫ్‌లో కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు నా ప‌క్క‌నే ఉండి, నాకు డ‌బ్బులిచ్చి, త‌న పిల్ల‌ల‌తో పాటు న‌న్నూ ఓ పిల్లాడిలా చూసి, ఆద‌రించారు. ఇప్ప‌టికీ ఆద‌రిస్తున్నారు. ఇప్పుడు నేను బ‌తికున్నానంటే కార‌ణం ఆమే. త్వ‌ర‌లో ఆమె ఎవ‌ర‌నేది రివీల్ చేస్తాను." అని ఆయ‌న అన్నారు. "ఒక‌సారి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆమె న‌న్ను తీసుకెళ్లి, త‌న పిల్ల‌ల మ‌ధ్య‌లో న‌న్ను పెట్టి, త‌న బంధువుల నుంచి ఎన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నా, ఈ ఫ్రెండ్‌ను బ‌తికించాల‌న్న ఉద్దేశంతో నన్ను చూసింది. కొవిడ్ అప్పుడు కూడా హాస్పిట‌ల్‌లో జాయిన్ అయితే, తెల్ల‌వారుజాము 4 వ‌ర‌కు అక్క‌డే ఉండి చూసుకుంది. దాన్ని వేరే రిలేష‌న్ కింద జ‌నం చూస్తుంటే, నేనామెతో 'పుకార్ల‌వుతున్నాయో, షికార్ల‌వుతున్నాయో.. వాట‌న్నింటిని ప‌క్క‌న పెట్టేసేయండి. వీటికి 2023లో స‌రైన స‌మాధానం చెబుదాం. అన్నీ మంచి జ‌రుగుతున్నాయ్‌.' అని చెప్పాను. అని తెలిపారు పృథ్వీ. "ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చింది క‌దా.. చెప్పండి".. అని ఆర్కే అన‌డంతో, "ఆమె పేరు దాస‌రి ప‌ద్మ‌రేఖ‌. వాళ్లు వ‌రంగ‌ల్ నుంచి చెన్నైకి త‌ర‌లివెళ్లారు. నేను చెన్నైలో ఉన్న‌ప్ప‌ట్నుంచీ ఆమె తెలుసు. సినిమా రంగంలో డాన్స‌ర్‌గా చేసి, హైద‌రాబాద్ వ‌చ్చేశారు. ఆమెకు ఇక్క‌డ పొలాల‌వీ ఉన్నాయ్‌. మంచి హెల్పింగ్‌ నేచ‌ర్‌. వాళ్ల తాత‌గారు కూడా నాకు బాగా స‌న్నిహితం. వాళ్ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేను వెళ్తున్నా. నాకే స‌మ‌స్య వ‌చ్చినా వాళ్లుంటారు. నేను షూటింగ్‌లో ఉంటే లొకేష‌న్‌కు భోజ‌నం కూడా పంపిస్తుంటారు. నేను చాలా హ్యాపీ. ఎనిమిదేళ్ల నుంచీ నేను ఫ్యామిలీ లైఫ్‌కు దూరంగా ఉంటున్నా. పిల్ల‌ల్ని నేను బాగానే చూసుకున్నా. వాళ్లిప్పుడు సెటిలైపోయారు. నా భార్య విజ‌య‌వాడ‌లో ఉంటుంది. మా మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయ్‌. కోర్టులో న‌డుస్తున్నాయ్‌. ఇప్పుడు నా ప‌క్క‌న దాస‌రి ప‌ద్మ‌రేఖ ఉన్నారు." అని వివ‌రించారు పృథ్వీ.

రంభ ఇప్పుడేం చేస్తున్నారు? ఎక్క‌డున్నారు?

  ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. కానీ రంభ అనే స్క్రీన్ నేమ్‌తోటే ఆమె పాపుల‌ర్ అయ్యారు. తెలుగు, త‌మిళ తెర‌ల‌పై టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్‌లో కాలుపెట్టిన రంభ‌, ఆ త‌ర్వాత కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, రాజ‌శేఖ‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, సుమ‌న్‌, జె.డి. చ‌క్ర‌వ‌ర్తి లాంటి హీరోల స‌ర‌స‌న సూప‌ర్ హిట్ సినిమాల్లో నాయిక పాత్ర‌లు పోషించారు. ఇక త‌మిళంలోనూ ర‌జ‌నీకాంత్‌తో మొద‌లుపెట్టి ఒకటిన్న‌ర ద‌శాబ్దం క్రితం అక్క‌డి పాపుల‌ర్ స్టార్స్ అంద‌రితోనూ ఆమె న‌టించారు. చివ‌రిసారిగా ఆమె క‌నిపించిన సినిమా 2008లో వ‌చ్చిన 'దొంగ స‌చ్చినోళ్లు'. రాజా వ‌న్నెంరెడ్డి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రంభ ఓ ప్ర‌త్యేక పాత్ర చేశారు. నిజం చెప్పాలంటే ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద కాలం టాలీవుడ్‌, కోలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ల‌లో ఆమె ఒక‌రు. హిందీలోనూ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 2001 నుంచి ఆమె ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఆ టైమ్‌లో టీవీ షోల‌కు జ‌డ్జిగా కూడా ఆమె వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. ఆమ‌ధ్య వ‌చ్చిన‌ అజ‌య్ భూప‌తి మూవీ 'మ‌హాస‌ముద్రం'లో రంభ వీరాభిమానులుగా హీరో శ‌ర్వానంద్, న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌నిపించి, ఆమెకు నీరాజ‌నాలు ప‌ల‌క‌డం విశేషం.  వివాహానంత‌రం రంభ‌ న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. 2010 ఏప్రిల్‌ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను ఆమె పెళ్లాడారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గానే ఉంటూ వ‌స్తోన్న రంభ‌, త‌మ పిల్ల‌ల‌కు సంబంధించిన క్యూట్ ఫొటోల‌ను త‌ర‌చూ షేర్ చేసుకుంటూనే వ‌స్తున్నారు. అప్పుడ‌ప్పుడు త‌న సెల్ఫీ పిక్చ‌ర్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తున్నారు. భ‌ర్త ఇంద్ర‌కుమార్‌, ఇద్ద‌రు కూతుళ్లు, కొడుకుతో చాలా హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం రంభ ఫ్యామిలీ టోరంటోలో నివాసం ఉంటోంది.

ప్ర‌భాస్ ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక‌వుతారు!

  ఒక మామూలు హీరోలా ప‌రిచ‌య‌మై, ఇవాళ దేశ‌వ్యాప్తంగా కోట్లాదిమంది ప్ర‌జానీకానికి ఆరాధ్య సినీ నాయ‌కుడిగా మారిపోయాడు ప్రభాస్. 'బాహుబ‌లి' సినిమాలు రెండూ తెచ్చిన అమేయ‌మైన ఇమేజ్‌తో ఇవాళ ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి అత్యంత క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. 2002లో జ‌యంత్ సి. ప‌రాన్జీ డైరెక్ట్ చేసిన 'ఈశ్వ‌ర్' మూవీతో కృష్ణంరాజు త‌మ్ముడు సూర్య‌నారాయ‌ణ‌రాజు త‌న‌యుడైన‌ ప్ర‌భాస్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ మూవీలో మంజుల కుమార్తె శ్రీ‌దేవి హీరోయిన్‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'ఈశ్వ‌ర్' యావ‌రేజ్‌గా ఆడింది. అయితే హ్యాండ్స‌మ్‌నెస్‌, ఎన‌ర్జీతో భ‌విష్య‌త్తులో హీరోగా నిల‌దొక్కుకుంటాడు అనిపించుకున్నాడు ప్ర‌భాస్‌. ఆ సినిమాలో న‌టించినందుకు అత‌నికి ప్రొడ్యూస‌ర్ కె. అశోక్‌కుమార్ ఇచ్చిన రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా? ఓ ఇంట‌ర్వ్యూలో ఆ విష‌యం వెల్ల‌డించాడు ప్ర‌భాస్‌. "ఆ సినిమాకు నా పారితోషికం 5 లక్షలు. దాన్ని ఏం చేశానో గుర్తులేదు." అని చెప్పాడు. హీరో కాకుండా ఉంటే ప్ర‌భాస్ ఏమ‌య్యేవాడు? "అసలు నేను హీరో అవుదామని అనుకోలేదు. హీరో కాకుండా ఉంటే కచ్చితంగా బిజినెస్ చేద్దామనుకున్నా. ఫలానా బిజినెస్ చేయాలని మాత్రం అనుకోలేదు." అనేది అత‌డి స‌మాధానం. జ‌యాప‌జ‌యాలు అత‌డిపై ప్ర‌భావం చూపుతుంటాయి. "ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు తప్పకుండా బాధపడతా. నా వల్ల ఫెయిల్ కాకూడదని అనుకుంటా. చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతా." అని తెలిపాడు ప్ర‌భాస్‌.

బ‌న్నీ, ప్ర‌భాస్‌ హీరోయిన్ ఏమైపోయింది?

  అందాల పోటీల్లో ఫైన‌లిస్ట్‌, తెలుగులో కొన్ని ఆస‌క్తిక‌ర సినిమాల్లో.. అందులోనూ ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, ర‌వితేజ లాంటి స్టార్ల సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన ఓ తార.. ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్క‌డ ఉంది? అనేది చాలామందికి అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఆమె.. దీక్షా సేథ్‌! అందచందాల విష‌యంలో టాప్ హీరోయిన్ల‌కు తీసిపోని, ప‌ర్ఫార్మెన్స్ విష‌యంలో త‌క్కువ చేయ‌లేని దీక్ష 2009లో జ‌రిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఫైన‌లిస్ట్‌గా నిలిచింది. ఆమె ఫొటోలు చూసిన డైరెక్ట‌ర్ క్రిష్‌.. త‌న 'వేదం' (2010) మూవీలో అల్లు అర్జున్ జోడీగా పూజ అనే క్యారెక్ట‌ర్‌తో న‌టిగా ఇంట్ర‌డ్యూస్ చేశాడు. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న విజ‌యం సాధించ‌క‌పోయినా, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అమితంగా పొందింది. దీక్ష కూడా పూజ పాత్ర‌లో బాగానే రాణించింది. ఆమె అంద‌చందాలు ప‌లువురిని ఆక‌ర్షించాయి. ఆ వెంట‌నే హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన 'మిర‌ప‌కాయ్' మూవీలో రిచా గంగోపాధ్యాయ్‌తో పాటు ఓ హీరోయిన్‌గా న‌టించింది. 'వాంటెడ్‌'లో గోపీచంద్ జోడీగా, 'నిప్పు'లో ర‌వితేజ జోడీగా, 'ఊ కొడ‌తారా ఉలిక్కిప‌డ‌తారా' మూవీలో మంచు మ‌నోజ్ స‌ర‌స‌న క‌నిపించిన దీక్ష‌.. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ స‌ర‌స‌న 'రెబెల్' (2013) మూవీలో చేసింది. అందులో ఆమెది విషాదాంత పాత్ర‌. లారెన్స్ రాఘ‌వ డైరెక్ట్ చేసిన ఈ సినిమా త‌ర్వాత అనూహ్యంగా మ‌ళ్లీ ఇంత‌దాకా మ‌రో తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు దీక్ష‌. హిందీలో అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ఆమె చేసిన య‌త్నాలు ఫ‌లించ‌లేదు. 2014లో 'లేక‌ర్ హ‌మ్ దీవానా దిల్' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఫ్లాప‌యింది. ఆ త‌ర్వాత 2016లో 'జ‌గ్గుదాదా' మూవీతో క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో కాలుపెట్టింది. ఆ మూవీలో ద‌ర్శ‌న్ హీరో. అదే ఏడాది వ‌చ్చిన హిందీ చిత్రం 'సాత్ క‌ద‌మ్' ఆమె చివ‌రి చిత్రం. దాని త‌ర్వాత దీక్ష సినిమాల‌కు దూర‌మైంది. గ్లామ‌రస్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న ఆమెను ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎంక‌రేజ్ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం. ఇప్పుడు ఆమె ఏం చేస్తోందో తెలీదు.

స‌మీరారెడ్డి టాలీవుడ్‌కు దూర‌మ‌వ‌డానికి కార‌ణం.. ఆ లింక‌ప్ రూమ‌ర్స్‌!

  మ‌నం త‌ర‌చూ సినిమా సెల‌బ్రిటీల ఎఫైర్ల గురించి చ‌దువుతుంటాం, వింటుంటాం. అయితే ఆ ఎఫైర్ల ప్ర‌చారం ఆ సెల‌బ్రిటీల‌పై ఎలాంటి మాన‌సిక‌, భావోద్వేగ ప్ర‌భావానికి కార‌ణ‌మ‌వుతుంద‌నే సంగ‌తి మ‌నం ఏమాత్రం ప‌ట్టించుకోం. 2006లో త‌మ‌పై ఈ త‌ర‌హా రూమ‌ర్స్ రావ‌డంతో ఇద్ద‌రు సెల‌బ్రిటీలు ఇలాంటి భావోద్వేగ స్థితికి గుర‌య్యారు. వారు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, స‌మీరా రెడ్డి. ఆ ఇద్ద‌రూ జంట‌గా 'న‌ర‌సింహుడు', 'అశోక్‌' చిత్రాల్లో న‌టించారు. ఎట్లా వ‌చ్చిందో, ఎవ‌రు పుట్టించారో తెలీదు కానీ, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహాన్ని మించిన బంధం బ‌ల‌ప‌డిందంటూ వ‌దంతులు వెల్లువెత్తాయి. కొన్నేళ్ల త‌ర్వాత‌, తానెందుకు తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని వ‌దిలేసిందో ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది స‌మీరా రెడ్డి. అప్ప‌టి త‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితిని తెలియ‌జేస్తూ కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాల‌ను ఆమె బ‌య‌ట‌పెట్టింది. "నిజ‌మేమంటే నేను చాలా ఫ్రెండ్లీగా ఉండే ముక్కుసూటి మ‌నిషిని. దేన్నీ దాచ‌డానికి ప్ర‌య‌త్నించ‌ను. అత‌ను చాలా వండ‌ర్‌ఫుల్ కో-స్టార్‌. అత‌నితో ప‌నిచేయ‌డం ఎవ‌రికైనా సౌక‌ర్యంగా ఉంటుంది. అత‌ను నాకు చాలా విష‌యాలు నేర్పించాడు. నేను తెలుగు అమ్మాయినైనా, తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన‌ప్పుడు ఇక్క‌డి విష‌యాలేవీ నాకు తెలీదు. మా గురించి వ‌దంతులు పుట్టేస‌రికి మా ఫ్యామిలీ అప్సెట్ అయ్యింది. అప్ప‌టికే నేను చాలా సినిమాల్లో న‌టించినా, చివ‌ర‌కు నేను మా నాన్న‌కు స‌మాధానం చెప్పుకోవాలి. అలాగే అత‌ను కూడా త‌న కుటుంబానికి స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి" అని చెప్పింది స‌మీరా. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో లింక‌ప్ రూమ‌ర్స్ త‌న ఫ్యామిలీని ఇబ్బంది పెట్ట‌డంతో ఈ ఇండ‌స్ట్రీకి దూరంగా వెళ్లిపోవాల‌నీ, అలాగే త‌మ ఫ్రెండ్‌షిప్‌ను కూడా వ‌దులుకోవాల‌నీ ఆమె నిర్ణ‌యించుకుంది. "జ‌నం ఎక్కువ‌గా మాగురించి మాట్లాడుతుండ‌టంతో తెలుగు సినిమా నుంచి దూరంగా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆమెను అత‌ను పెళ్లి చేసుకోబోతున్నాడా? అత‌డ్ని మీరు పెళ్లాడ‌బోతున్నారా? ఇలాంటివి త‌ర‌చూ ఎదుర‌య్యేవి. అభిమానులు చాలా విష‌యాలు చెప్పేవారు. జ‌నం మా గురించే మాట్లాడుకొనేవారు. వాళ్లు మా సినిమాల గురించి మాట్లాడుకొనేవాళ్లు కాదు. వాళ్లు నా సామ‌ర్థ్యం గురించి మాట్లాడుకొనేవాళ్లు కాదు. నా పేరును స‌మీరా రెడ్డి నుంచి స‌మీరా ఎన్టీఆర్ అని రాసేదాకా వెళ్లింది" అని చెప్పుకొచ్చింది స‌మీరా. మొద‌ట బాలీవుడ్‌లో న‌టించి, 'న‌ర‌సింహుడు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన స‌మీరా.. ఆ త‌ర్వాత 'జై చిరంజీవ‌', 'అశోక్' సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. తార‌క్‌తో లింక‌ప్ రూమ‌ర్స్‌తో తెలుగు తెర‌కు దూర‌మై, తిరిగి ఆరేళ్ల త‌ర్వాత రానా సినిమా 'కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్' సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. వివాహానంత‌రం పూర్తిగా సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసింది. ప్ర‌స్తుతం ఆమె త‌న కుటుంబంతో చాలా హ్యాపీగా జీవితాన్ని గ‌డుపుతోంది. 2014లో వ్యాపార‌వేత్త‌ అక్ష‌య్ వ‌ర్దేను పెళ్లాడింది స‌మీరా. వారికి హ‌న్స్ అనే కొడుకు, నైరా అనే కూతురు ఉన్నారు.

చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో గొల్ల‌పూడి ఎలా న‌టుడ‌య్యారో తెలుసా?

  న‌టుడు కాక‌ముందు గొల్ల‌పూడి మారుతీరావు ర‌చ‌యిత‌గా సుప్ర‌సిద్ధులు. చిరంజీవి, మాధ‌వి జంట‌గా న‌టించిన‌ 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాతో వెండితెర‌పై అడుగుపెట్టి, న‌టుడిగా తొలి సినిమాలోనే ప్రేక్ష‌కుల నుంచి అభినంద‌న‌లు అందుకున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ ఆయ‌న పాత్ర‌మీద పెట్టిందే. ఆ సినిమాలో న‌టించ‌క ముందే రంగ‌స్థ‌లంపై ఆయ‌న చాలా నాటిక‌లు, నాట‌కాల్లో న‌టించారు. విద్యార్థి జీవితంలో స‌గ‌భాగం స్టేజిమీదే గ‌డిపారు. నాట‌కాలు రాయ‌క‌ముందు ఆయ‌న న‌టుడే. త‌ర్వాతే ర‌చ‌యిత‌య్యారు. సినిమాల్లో ర‌చ‌యిత‌గా అడుగుపెట్టాక ఆయ‌న‌లోని న‌టుడు వెన‌క‌ప‌డ్డాడు. జీవితంలో స‌గం ఉద్యోగానికీ, త‌క్కిన స‌గం సినిమా ర‌చ‌న‌కీ అంకితం అయిపోయింది. ఇంత‌కీ ఉన్న‌ట్లుండి ఆయ‌న‌ 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాలో కీల‌క పాత్ర‌లో ఎలా న‌టించారు?  ప్ర‌తాప్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె. రాఘ‌వ తీసిన 'త‌రంగిణి' సినిమా క‌థ గొల్ల‌పూడి రాసిందే. త‌న‌కున్న నాట‌కానుభ‌వంతో స్క్రిప్టు చ‌దివేట‌ప్పుడు, పాత్ర‌ప‌రంగా చ‌ద‌వ‌డం ఆయ‌న‌కున్న అల‌వాటు. అందులోని ఓ పాత్ర తీరును చెప్పిన‌ప్పుడు, చ‌దివిన‌ప్పుడూ 'ఈ వేషం మీరు వెయ్యాలి' అన్నారు రాఘ‌వ‌. న‌వ్వేసి ఊరుకున్నారు గొల్ల‌పూడి. కొన్ని కార‌ణాల వ‌ల్ల 'త‌రంగిణి' షూటింగ్ వాయిదా ప‌డింది. 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' షూటింగ్‌కు ముందు గొల్ల‌పూడి ఇంటికి డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ వ‌చ్చారు. 'మీరొక వేషం వెయ్యాలి' అన్నారు. 'అలాగే, చూద్దాం' అన్నారు గొల్ల‌పూడి. వెంట‌నే రాఘ‌వ‌కు ఫోన్‌చేసి, 'మారుతీరావు గారు ఒప్పుకున్నారు' అని చెప్పేశారు రామ‌కృష్ణ‌. సుబ్బారావు అనే ముఖ్య‌పాత్ర త‌న‌చేత ధ‌రింప‌చెయ్య‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు తీర్మానించుకున్నార‌ని గొల్ల‌పూడికి అర్థ‌మైంది. టైటిల్ రోల్‌, కొత్త ద‌ర్శ‌కుడు (కోడి రామ‌కృష్ణ‌), ఒక ముఖ్య‌పాత్ర‌లో కొత్త‌న‌టుడు.. గొల్ల‌పూడికి భ‌య‌మేసింది. కానీ వాళ్లిద్ద‌రికీ ఏ భ‌య‌మూ లేదు. అప్పుడు గొల్ల‌పూడి, 'వేస్తాను. మీకు ఎప్పుడు కానీ, ఏ క్ష‌ణాన కానీ తృప్తిగా క‌నిపించ‌క‌పోయినా.. న‌న్ను మార్చేసి, ఇంకొక‌ర్ని పెట్టుకోండి' అన్నారు. వాళ్లు కూడా 'మొహ‌మాట‌ప‌డం' అని చెప్పారు. అట్లా 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాలో సుబ్బారావు అనే ప్ర‌ధాన పాత్ర పోషించి, ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల మెప్పును పొందారు గొల్ల‌పూడి. ఆ సినిమా చూసిన క్రాంతికుమార్‌కు గొల్ల‌పూడి న‌ట‌న తెగ న‌చ్చేసి, త‌ను అప్పుడే తీస్తున్న 'ఇది పెళ్లంటారా?'  సినిమాలో మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు. ఆ త‌ర్వాత కాలంలో న‌టుడిగా య‌మ బిజీ అయిపోయి, ర‌చ‌యిత‌గా త‌క్కువ సినిమాల‌కు రాశారు గొల్ల‌పూడి మారుతీరావు.

ధనుష్‌కూ, శ్రుతికీ ఎఫైర్ ఉంద‌ని రాసిన ప‌త్రిక‌.. త‌ర్వాత సారీ చెప్పింది!

  హీరో ధ‌నుష్‌కీ, హీరోయిన్ శ్రుతి హాస‌న్‌కీ మ‌ధ్య ఎఫైర్ న‌డుస్తోందంటూ ఓ ఆర్టిక‌ల్ రాసిన ఓ త‌మిళ ప‌త్రిక, ఆ త‌ర్వాత అది రాసినందుకు క్ష‌మాప‌ణ‌లు తెలిపింద‌ని మీకు తెలుసా? ప‌దేళ్ల క్రితం.. అంటే 2012లో ఈ ఉదంతం జ‌రిగింది. ఆ క‌థ‌నం చ‌దివిన శ్రుతి తీవ్ర ఆగ్ర‌హానికి గురైంది. ర‌జ‌నీకాంత్ కుటుంబంతో ఆమెకు స‌న్నిహిత‌త్వం ఉంది. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ స‌న్నిహిత స్నేహితులు. అలాంటిది ఆ కుటుంబం అల్లుడితో త‌ను రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాన‌ని రాయ‌డం శ్రుతి హాస‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంత‌టితో ఆగ‌కుండా, ఆ క‌థ‌నం వండిన ప‌త్రిక‌పై కేసు కూడా పెట్టింది. త‌న లాయ‌ర్ ద్వారా లీగ‌ల్ నోటీసులు పంపించింది. దాంతో దిగి వ‌చ్చిన ఆ ప‌త్రిక అలాంటి స్టోరీ ప్ర‌చురించినందుకు విచారం వ్య‌క్తంచేస్తూ శ్రుతికి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసింది. అప్ప‌ట్లో ఈ విష‌యాన్ని స్వ‌యంగా తెలియ‌జేస్తూ, "ఎప్ప‌టికైనా నిజ‌మే గెలుస్తుంది. నా మీద ఆ ప‌త్రిక రాసిన స్టోరీకి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. మొత్తానికి నాకు హ్యాపీగా ఉంది" అని చెప్పింది శ్రుతి.  ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య‌ను ధ‌నుష్ వివాహం చేసుకున్న విష‌యం మ‌న‌కు తెలుసు. వారికి ఇద్ద‌రు కొడుకులు కూడా ఉన్నారు. కాగా, ఇటీవ‌ల తెలీని కార‌ణాల‌తో ఆ ఇద్ద‌రూ విడిపోయారు. పిల్ల‌లు త‌ల్లిద‌గ్గ‌రే ఉంటున్నారు. నిజానికి ధ‌నుష్‌, శ్రుతి జంట‌గా న‌టించిన '3' మూవీని డైరెక్ట్ చేసింది స్వ‌యంగా ఐశ్వ‌ర్య కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంత‌ను హ‌జారికాతో రిలేష‌న్‌షిప్‌లో ఉంది శ్రుతి.

అజ్ఞాతంలోకి వెళ్లిన తోడ‌ల్లుడి కుటుంబానికి ఆశ్ర‌య‌మిచ్చిన ఘంట‌సాల‌!

  ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు తోడ‌ల్లుడు ఆమంచి న‌ర‌సింహారావు క‌ర‌డుక‌ట్టిన‌ క‌మ్యూనిస్ట్‌. తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా జ‌రుగుతున్న రోజుల్లో ఆయ‌న‌తో పాటు క‌మ్యూనిస్ట్ నాయ‌కులు అంద‌రి మీదా నిర్బంధం పెరిగింది. షూట్ ఎట్ సైట్ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అంద‌రూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. న‌ర‌సింహారావు భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు దిక్కు తోచ‌లేదు. వాళ్ల‌ను మ‌ద్రాస్‌లోని త‌న ఇంటికి తీసుకువ‌చ్చి ఆశ్ర‌య‌మిచ్చారు ఘంట‌సాల‌. న‌ర‌సింహారావు కుటుంబ స‌భ్యులు ఘంట‌సాల ఇంట్లో ఆశ్ర‌యం పొందుతున్న విష‌యం తెలుసుకున్న సీఐడీ అధికారులు న‌ర‌సింహారావు ఆచూకీ చెప్పాల్సిందిగా ఘంట‌సాల‌ను ప్ర‌శ్నించారు. "మా ఇంట్లో ఉన్న‌ది మా వ‌దిన‌గారు, ఆమె పిల్ల‌లు. బంధువుల్ని మా ఇంట్లో ఉంచుకోకూడ‌ద‌ని చ‌ట్టం ఏమీ లేదుగా" అని జ‌వాబిచ్చారు ఘంట‌సాల‌. ఆయ‌న‌ను ఎన్ని రకాలుగా అధికారులు ప్ర‌శ్నించినా మ‌రో స‌మాధానం ల‌భించ‌లేదు. "ఘంట‌సాల గారూ! మీరు పేరు ప్ర‌తిష్ఠ‌లు ఉన్న‌వారు. మీ పాటంటే మాక్కూడా ఎంతో అభిమానం. కాబ‌ట్టి మిమ్మ‌ల్ని ఇంత స‌హ‌నంగా అడుగుతున్నాం. దాన్ని ఆస‌రాగా తీసుకోకండి. అత‌డు క‌నిపిస్తే కాల్చెయ్య‌మ‌ని ఉత్త‌ర్వులున్నాయి. తెలిసి కూడా ఆచూకీ చెప్ప‌కుండా దాచ‌డం నేరం. మీ ఇంటిపై పోలీసు నిఘా ఉంది. మిమ్మ‌ల్ని అరెస్టు చేసే అవ‌స‌రం మాకు రానివ్వ‌కండి" అని హెచ్చ‌రించి వెళ్లారు అధికారులు. ఘంట‌సాల భ‌య‌ప‌డ‌లేదు, వారి హెచ్చ‌రిక‌ల్ని ల‌క్ష్య‌పెట్ట‌లేదు. న‌ర‌సింహారావు మీద కేసుల‌న్నీ కొట్టేసి, ఆయ‌న తిరిగి ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చేంత వ‌ర‌కూ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఘంట‌సాల‌. ఆయ‌న‌లోని దేశ‌భ‌క్తికీ, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల విష‌యంలో ఆయ‌న‌కు ఉన్న అపార గౌర‌వానికి ఈ ఘ‌ట‌న ఓ చిన్న ఉదాహ‌ర‌ణ‌. ఆధారం: 'నేనెరిగిన నాన్న‌గారు' పుస్త‌కం

కృష్ణ‌కు త‌మిళం రాక‌పోవ‌డం మంచిద‌య్యింది.. లేదంటే!

  సూప‌ర్‌స్టార్ కృష్ణ 'తేనె మ‌న‌సులు' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో కృష్ణ‌కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. అయితే నిజానికి ఆయ‌న‌కు మొద‌ట హీరోగా ఆఫ‌ర్ వ‌చ్చింది ఓ త‌మిళ సినిమాకు. అయితే ఆయ‌న‌కు త‌మిళం రాక‌పోవ‌డంతో ఆ ఛాన్స్ చేజారింది. లేన‌ట్ల‌యితే ఆయ‌న త‌మిళ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యుండేవారు. త‌మిళ ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్ ఓసారి చెన్నై పాండీ బ‌జార్‌లోని భార‌త్ కేఫ్ ముందు నిల్చొని ఉన్న కృష్ణ‌ను చూసి, 'చాలా బాగున్నాడు, నా సినిమాలో హీరోగా ప‌నికొస్తాడ‌'ని భావించారు. ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచి, "సినిమాల్లో న‌టిస్తావా?" అన‌డిగితే న‌టిస్తాన‌ని చెప్పారు కృష్ణ‌. "రేపు మా ఆఫీసుకు వ‌చ్చి క‌లుసుకో" అని ఆ ఆఫీసు పేరు, అదెక్క‌డ ఉంటుందో చెప్పి వెళ్లారు. అప్పుడు శ్రీ‌ధ‌ర్ 'కాద‌లిక్క నేర‌మిల్లై' (1964) అనే త‌మిళ చిత్రాన్ని అంతా కొత్త‌వాళ్ల‌తో తీద్దామ‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ర్నాడు చిత్రాల‌య బ్యాన‌ర్ ఆఫీసుకు వెళ్లారు కృష్ణ‌. ఆయ‌న‌కు త‌న సినిమాలో హీరో వేషం ఇవ్వ‌ద‌ల‌చుకున్న‌ట్లు చెప్పారు శ్రీ‌ధ‌ర్‌. కృష్ణ‌కు ఆనందం వేసింది. అయితే త‌న‌కు త‌మిళం రాద‌ని చెప్పారు. దాంతో ఆయ‌న కోసం ఓ త‌మిళ ట్యూట‌ర్‌ను అరేంజ్ చేశారు శ్రీ‌ధ‌ర్‌. అయితే వారం రోజులు గ‌డిచినా కృష్ణ‌కు త‌మిళం ఏమాత్రం వంట‌ప‌ట్ట‌లేదు. ఎందుకంటే ఆయ‌న దృష్టంతా తెలుగు సినిమాల మీదే ఉంది మ‌రి. దీంతో ఉప‌యోగం లేద‌నుకున్న శ్రీ‌ధ‌ర్.. హీరో వేషానికి మ‌రో కొత్త న‌టుడు ర‌విచంద్ర‌న్‌ను ఎంపిక‌చేశారు. అలా ఆ సినిమా కృష్ణ‌కు త‌ప్పిపోయింది. లేక‌పోతే 'తేనె మ‌న‌సులు' (1965) కంటే ముందే ఆ సినిమాతో ఆయ‌న ప‌రిచ‌యం అయ్యుండేవాడు. అప్పుడు 'తేనె మ‌న‌సులు' సినిమా మిస్స‌యిపోయేదేమో. విశేష‌మేమంటే శ్రీ‌ధ‌ర్ తీసిన 'కాద‌లిక్క నేర‌మిల్లై' సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. అది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరోగా న‌టించిన 'ప్రేమించి చూడు'. ఈ ఉదంతం జ‌రిగిన ప‌దహారు సంవ‌త్స‌రాల‌కు శ్రీ‌ధ‌ర్ డైరెక్ష‌న్‌లో తొలిసారి న‌టించారు కృష్ణ‌. ఆ సినిమా.. ఎక్కువ‌గా అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న 'హ‌రే కృష్ణ హ‌లో రాధ' (1980).

టీజ్ చేసిన‌ కృష్ణ‌.. దండం పెట్టేసిన‌ అల్లు రామ‌లింగ‌య్య‌!

  మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్ ప‌దో ఫ్లోర్‌లో "చంద‌మామ‌తో బిళ్లంగోడు ఆడిన‌ట్లు దిక్కుల‌న్నీ అదిరిప‌డ్డ‌వి.. అరెరె రెరెరెరే చుక్క‌ల‌న్నీ చెదిరిప‌డ్డ‌వి.." అంటూ పాట వినిపిస్తోంది. కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌, గీత‌, జ్యోతిల‌క్ష్మిల‌కు చేయాల్సిన మూవ్‌మెంట్‌ను వివ‌రిస్తున్నారు కొరియోగ్రాఫ‌ర్ శ్రీ‌ను. ఇంత‌లో అల్లు రామ‌లింగ‌య్య సెట్‌లోకి వ‌చ్చారు. లాల్చీ ధ‌రించి, భుజంమీద కండువా వేసుకొని, మంచి యంగ్ గెట‌ప్‌లో ఠీవిగా న‌డ‌చివ‌స్తున్న అల్లును చూసి.. "ఏమిటీ ప్రేమాభిషేకం గెట‌ప్‌. పాపారాయుడి పోజు కొట్టుకుంటూ వ‌స్తున్నారు. హీరో అవుదామ‌ని ట్రై చేస్తున్నారా ఏంటి? నేనిప్పుడే రామారావు, నాగేశ్వ‌ర‌రావు గార్ల‌కు చెప్తాను." అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు కృష్ణ‌. "అయ్యా మీరు హీరోలు, మేం క‌మెడియ‌న్స్‌. సినిమాల్లో ఎలాగూ ఏడిపిస్తారు. బ‌య‌టైనా మ‌మ్మ‌ల్ని మామూలుగా ఉండ‌నియ్యండ‌య్యా.." అంటూ మందు కొట్టిన‌వాడిలా, మ‌త్తు ఎక్కుతున్న‌వాడిలా న‌టిస్తూ మాట్లాడారు. అక్క‌డ సెట్ లైటింగ్ అరేంజ్‌మెంట్స్‌ను చెక్ చేస్తున్న డైరెక్ట‌ర్ పి. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, "ఏమండీ రామ‌లింగ‌య్య‌గారూ.. మీ షాట్ ఇంకా అర‌గంట త‌ర్వాత తీస్తాం. ఇప్ప‌ట్నుంచే తాగుబోతు మూడ్‌లో మీరు ఉండాల్సిన అవ‌స‌రం లేదు. షాట్ తీసే ముందు మీకు చెప్తాను. అప్పుడు తాగుబోతు మూడ్‌లోకి వ‌ద్దురుగానీ." అన్నారు. వెంట‌నే కృష్ణ అందుకొని, "ఏమిటీ.. ఈయ‌న తాగుబోతు మూడ్‌లో సాంగ్ పాడ‌తారా ఇప్పుడు మీరు తీసే షాట్‌లో? అన‌డిగారు. "ఈ సినిమాలో ఈయ‌న‌కు అమ్మాయిలంటే భ‌లే మోజు. క‌నిపించిన ప్ర‌తి అమ్మాయి వెంటా ప‌డుతూ ఉంటాడు. ఎంత‌మంది అమ్మాయిల ద‌గ్గ‌ర‌కు పెళ్లిచూపుల‌కు వెళ్లినా ఏదో ఒక ఇబ్బంది ఎదుర‌వుతుంటుంది. ఓసారి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లిచూపుల‌క‌ని బ‌య‌ల‌దేర‌బోతూ ఉంటే, 'అయ్యా మీరు ఆ అమ్మాయిని పెళ్లిచూపులు చూడ్డానికి వెళ్ల‌కూడ‌దు.' అని అల్లు రామ‌లింగ‌య్య ఫ్రెండ్ ఒకాయ‌న ఆపుతాడు. 'ఏమిట‌య్యా నాకు ఇప్పుడు ఏం త‌క్కువ‌య్యింద‌ని.' అని రామ‌లింగ‌య్య రెచ్చిపోతాడు. 'బాబూ.. ఆ అమ్మాయి త‌ల్లిని 20 సంవ‌త్స‌రాల క్రితం మీరు పెళ్లిచూపులంటూ వెళ్లి చూశారు. క‌నుక ఇప్పుడు ఈ అమ్మాయి మీకు కూతురు వ‌ర‌స అవుతుంది. క‌నుక మీరు వెళ్ల‌కూడ‌దు.' అని ఆయ‌న చెప్పేస‌రికి, 'ఇదీ నిజ‌మే' అని ఆగిపోతాడు. అలాగే గీత‌ను ల‌వ్ చేస్తాడు. గీత పోలీసాఫీస‌ర్ అయిన మిమ్మ‌ల్ని ప్రేమిస్తోంద‌ని తెలిసి, భ‌య‌ప‌డి ఆ ప్ర‌య‌త్నం మానేస్తాడు. ఇలా ర‌క‌ర‌కాలుగా స‌ర‌దాగా సాగే ఈయ‌న పాత్ర ఈరోజు తీసే సాంగ్‌లో 'మ‌న‌సు గ‌తి ఇంతే అంటూ' మందు చేత్తో ప‌ట్టుకొని బాధ‌ప‌డే బిట్స్ తీయాలి. ఆ త‌ర్వాత డాన్స్‌లో జ్యోతిల‌క్ష్మి పోజు చూసి 'భ‌లేమంచి పోజు ఖ‌రీదైన పోజు' అంటూ ఆమె వెంట‌ప‌డే షాట్స్ తియ్యాలి." అని వివ‌రించారు చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. "మొత్తానికి ఈ సినిమాలో పాట పాడ‌తార‌న్న మాట." అన్నారు రామ‌లింగ‌య్య‌తో కృష్ణ‌. "ఈ పాట‌లోని బిట్‌లే కాకుండా రామ‌లింగ‌య్య‌, గీత‌ల‌పై ఓ పాట తియ్యాల‌నుకుంటున్నామండీ అన్నారు." అక్క‌డే ఉన్న‌ చిత్ర స‌మ‌ర్ప‌కులు ఎన్‌.వి. సుబ్బ‌రాజు. "ఓహో అదన్న మాట సంగ‌తి. అందుకే ఇంత పోజుకొడుతూ సెట్లోకి వ‌చ్చారు." అని అల్లుని చూపిస్తూ కృష్ణ‌ అనేస‌రికి, "నాయ‌నా కృష్ణా.. ఇక ఆ విష‌యం వ‌దిలెయ్‌. ప‌డ‌క ప‌డ‌క ఈ గెట‌ప్‌లో నీ క‌ళ్ల‌లోనే ప‌డ్డాను." అన్నారు రామ‌లింగ‌య్య‌. "స‌రే మీరు కాసేపు ప‌క్క‌న ఉండండి. ఈ షాట్‌లో మీరు లేరు. షాట్‌లో మీరు లేకుండా ఇప్పుడు ఇక్క‌డికి ఎందుకొచ్చారు. అన‌వ‌స‌రంగా మ‌మ్మ‌ల్ని న‌వ్విస్తూ టైమ్ వేస్ట్ చేయించ‌డానికా?" అని మ‌ళ్లీ అడిగారు కృష్ణ‌. "ఏడీ ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎక్క‌డ‌? న‌న్ను ర‌మ్మ‌న్నాడు. షాట్ రెడీ అన్నాడు. అత‌ను ఏడండీ." అంటూ సెట్ అంతా వెతుకుతున్నారు. "మీరు అడుగుతున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అడుగో ఫ్లోర్ బ‌య‌ట నుంచి సెట్‌లోకి వ‌స్తున్నాడు చూడండి." అని కృష్ణ చెప్పారు. రామ‌లింగ‌య్య సీరియ‌స్‌గా, "ఏమ‌య్యా షాట్ రెడీ అంటూ వ‌చ్చావు. ఇంకా రెడీ అవ‌లేదంట క‌దా." అని నిల‌దీసి అడిగారు. "ఆ విష‌య‌మే మీతో చెపుదామ‌ని బ‌య‌ట‌కు వెళ్లి మీకోసం వెతుకుతున్నానండీ." అన్నాడ‌త‌ను. "నేను ఇక్క‌డే ఉన్నాను క‌దా.." అని రామ‌లింగ‌య్య ఆశ్చ‌ర్యంగా చూశారు. "ఇంత‌మంది ఆర్టిస్టుల మ‌ధ్య‌లో మీరు క‌నిపించ‌లేదేమో.." అని జోక్ చేశారు ఆప‌రేటివ్ కెమెరామ‌న్ ల‌క్ష్మ‌ణ్ గోరే. ఇదంతా 'ప‌గ‌బ‌ట్టిన సింహం' సెట్స్ మీద నిజంగా జరిగిన ఓ స‌ర‌దా స‌న్నివేశం. క‌వ‌ల సోద‌రులుగా కృష్ణ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాలో జ‌య‌ప్ర‌ద‌, గీత, ప్ర‌భ‌ హీరోయిన్లు. స‌త్య‌నారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, సార‌థి, నాగ‌భూష‌ణం, రావు గోపాల‌రావు, పుష్ప‌ల‌త‌, జ్యోతిల‌క్ష్మి, త్యాగ‌రాజు, భీమ‌రాజు కీల‌క పాత్ర‌ధారులు. సత్యం సంగీతం, ఎస్‌.ఎస్‌. లాల్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ సినిమాకు మాట‌లు మోదుకూరి జాన్స‌న్‌, పాట‌లు వేటూరి రాశారు. నిజానికి టైటిల్స్‌లో మోదుకూరి జాన్స‌న్ ఒక్క‌రి పేరే వేసినా, ఆయ‌న కంటే ఎక్కువ‌గా ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌. 1982 సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమా విడుద‌లైంది.

ఫ్లాష్ బ్యాక్ః సుమ‌న్ కి మూడు సార్లు క‌లిసొచ్చిన మే 30!

తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన అందాల న‌టుల్లో సుమ‌న్ ఒక‌రు. 80, 90ల్లో సుమ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. వాటిలో `20వ శ‌తాబ్దం`, `పెద్దింట‌ల్లుడు`, `నాయుడు గారి కుటుంబం` వంటి సినిమాలు కూడా ఉన్నాయి. 90ల్లో జ‌నం ముందు నిలిచిన ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఒక కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ మూడు జ‌న‌రంజ‌క సినిమాలు కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఒకే తేదిన సంద‌డి చేశాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ లో సుమ‌న్ న‌టించిన యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `20వ శ‌తాబ్దం`.. 1990 మే 30న విడుద‌లైంది. ``అమ్మ‌ను మించిన దైవ‌మున్న‌దా`` అనే పాపుల‌ర్ సాంగ్ ఈ సినిమాలోనిదే. ఇక ఇదే మే 30న 1991లో సుమ‌న్ నుంచి మ‌రో చిత్రం వ‌చ్చింది. అదే.. `పెద్దింట‌ల్లుడు`. ఒక‌ప్ప‌టి అగ్ర క‌థానాయిక న‌గ్మా న‌టించిన తొలి తెలుగు చిత్ర‌మిది. శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో వాణిశ్రీ‌, మోహ‌న్ బాబు ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. ఇక సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో సుమ‌న్ న‌టించిన స‌క్సెస్ ఫుల్ మూవీ `నాయుడు గారి కుటుంబం` కూడా 1996లో ఇదే మే 30న రిలీజైంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని బోయిన సుబ్బారావు డైరెక్ట్ చేశాడు. మొత్త‌మ్మీద‌.. మే 30న ఆరేళ్ళ వ్య‌వ‌ధిలో ముచ్చ‌ట‌గా మూడు హిట్స్ చూసి వార్త‌ల్లో నిలిచారు సుమ‌న్.