దర్శకేంద్రుడితో శ్రీదేవి ఫస్ట్ ఫిల్మ్.. శోభన్, జయసుధ, తలైవా మిస్.. అప్పుడే 45 ఏళ్ళయిందా!?

  అతిలోక సుందరి శ్రీదేవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో 23 సినిమాలు వచ్చాయి. వాటిలో సింహభాగం ఘనవిజయం సాధించాయి. అలా సంచలనం సృష్టించిన సినిమాల్లో.. 'పదహారేళ్ళ వయసు' ఒకటి. రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబోలో ఇదే ఫస్ట్ ఫిల్మ్ కావడం విశేషం. అయితే, ఇది ఒరిజినల్ మూవీ కాదు. తమిళంలో భారతీరాజా రూపొందించిన సెన్సేషనల్ మూవీ '16 వయతినిలే'కి రీమేక్. శ్రీదేవి, కమల్ హాసన్, రజినీకాంత్ నటించిన సదరు తమిళ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. ఇందులో శ్రీదేవితో పాటు చంద్రమోహన్, మోహన్ బాబు, నిర్మలమ్మ, నవకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. వాస్తవానికి ఈ సినిమా కోసం శ్రీదేవి నటించిన పాత్రలో జయసుధ, చంద్రమోహన్ అభినయించిన పాత్రలో శోభన్ బాబు, మోహన్ బాబు పోషించిన వేషంలో రజినీకాంత్ నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.  16 ఏళ్ళ ప్రాయంలో మల్లి (శ్రీదేవి) అనే అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేదే 'పదహారేళ్ళ వయసు' సినిమా. చక్రవర్తి బాణీలు కట్టిన ఈ చిత్రంలో "సిరిమల్లె పువ్వా" (రెండు వెర్షన్స్), "పువ్వు లాంటి మల్లి పుష్ఫించెనమ్మా", "కట్టుకథలు చెప్పి నేను నవ్విస్తే", "వయసంతా ముడుపుకట్టి", "పంటచేలో పాలకంకి నవ్వింది" అంటూ సాగే పాటలు విశేషాదరణ పొందాయి. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అంగర సత్యం, మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావు నిర్మించిన 'పదహారేళ్ళ వయసు'.. 1978 ఆగస్టు 31న జనం ముందు నిలిచింది. విడుదలైన దాదాపు ప్రతీ థియేటర్ లోనూ శతదినోత్సవం జరుపుకున్న ఈ సంచలన చిత్రం.. నేటితో  45 వసంతాలు పూర్తిచేసుకుంది. 

కొత్త దర్శకులతో నాగ్ మెమరబుల్ హిట్స్!

కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా ప్రోత్సహిస్తూనే పలు మెమరబుల్ మూవీస్ ని తన ఖాతాలో జమ చేసుకున్నారాయన. కొత్త దర్శకుల కాంబినేషన్ లో నాగ్ అందుకున్న విజయాల వివరాల్లోకి వెళితే.. శివ (1989): సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఇదే తొలి చిత్రం. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ.. నాగ్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్. నువ్వు వస్తావని (2000): వి. ఆర్. ప్రతాప్ కిదే తొలి చిత్రం. అన్నమయ్య తరువాత సరైన విజయం లేని నాగ్ కి మళ్ళీ గ్రాండ్ సక్సెస్ ని అందించిన సినిమా. తుళ్ళదా మనముమ్ తుళ్ళుమ్ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ వెర్షన్. నిన్నే ప్రేమిస్తా (2000): తమిళ చిత్రం నీ వరువాయ ఎనా ఆధారంగా రూపొందిన ఈ హిట్ సినిమాతో ఆర్. ఆర్. షిండే దర్శకుడిగా తొలి అడుగేశాడు.  సంతోషం (2002): నాగ్ కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలిచే ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ చిత్రంతో దశరథ్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. మాస్ (2004): నాగ్ కెరీర్ లో గుర్తుండిపోయే మాస్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంతోనే నృత్య దర్శకుడు లారెన్స్ రాఘవ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. సోగ్గాడే చిన్ని నాయనా (2016): నాగ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ ఇది. ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా తొలి అడుగేశాడు.  (ఆగస్టు 29.. నాగార్జున బర్త్ డే సందర్భంగా)

నాగ్ కి 'ఉత్తమ నటుడి'గా 'నంది'ని అందించిన సినిమాలివే!

కింగ్ నాగార్జున కెరీర్ లో పలు మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు తనకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందించాయి కూడా. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య (1997): నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అన్నమయ్య. ఇందులో టైటిల్ రోల్ లో జీవించేశారు నాగ్. అందుకే తన నటనకి ప్రతిష్ఠాత్మక నంది పురస్కారం దక్కింది. ఇక ఇదే చిత్రంతో స్పెషల్ మెన్షన్ కేటగిరిలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు కింగ్. సంతోషం (2002): నాగార్జున నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో సంతోషంకి ప్రత్యేక స్థానం ఉంది. 2002లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం.. నాగ్ కి బెస్ట్ యాక్టర్ గా మరోమారు నందిని అందించింది. అయితే, ఈ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి(ఇంద్ర)తో షేర్ చేసుకోవడం విశేషం. శ్రీరామదాసు (2006): నాగార్జున కెరీర్ లో మరో మెమరబుల్ మూవీ అయిన శ్రీరామదాసు.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా 'ఉత్తమ నటుడు' విభాగంలో నాగ్ కి ముచ్చటగా మూడో నంది పురస్కారాన్ని అందించింది. వీటితో పాటు స్పెషల్ జ్యూరీ విభాగంలోనూ రాజన్నకి నందిని అందుకున్నారు నాగ్. అలాగే నిర్మాతగా నిన్నే పెళ్ళాడతా, ప్రేమకథ, యువకుడు, మన్మథుడు, రాజన్న చిత్రాలకు కూడా వేర్వేరు విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకున్నారు కింగ్.  (ఆగస్టు 29.. నాగార్జున పుట్టినరోజు సందర్బంగా)  

ఒకే రోజు రిలీజైన నాగ్ సినిమాలు.. ఒకదాంట్లో హీరో, మరొకదాంట్లో గెస్ట్!

కింగ్ నాగార్జున ఒకే రోజు రెండు సినిమాలతో పలకరించారని తెలుసా? అది కూడా ఒక సినిమాలో హీరోగా.. మరో చిత్రంలో స్పెషల్ రోల్ లో. అయితే, ఇది ఇప్పటి విషయం కాదు. 28 ఏళ్ళ క్రితం నాటి విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో నాగ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ 'ఘరానా బుల్లోడు'. ఇందులో నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, ఆమని నటించారు. "భీమవరం బుల్లోడా" అంటూ సాగే పాపులర్ పాట ఇందులోదే. 1995 ఏప్రిల్ 27న విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కమర్షియల్ గా హిట్ స్టేటస్ చూసింది. ఇక అదే రోజు ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఘటోత్కచుడు' కూడా విడుదలైంది. అలీ, రోజా జోడీగా కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నాగ్ ఓ స్పెషల్ రోల్, సాంగ్ లో కనిపించారు. ఇక ఇదే మూవీలో రాజశేఖర్, శ్రీకాంత్ కూడా అతిథి పాత్రల్లో మెరిశారు. ఏదేమైనా.. ఒకే రోజున నాగ్ తెరపై దర్శనమిచ్చిన సినిమాలుగా ఘరానా బుల్లోడు, ఘటోత్కచుడు రికార్డులకెక్కాయి. అన్నట్టు.. ఈ రెండు చిత్రాల టైటిల్స్ లో ఆద్యంతాలుగా ఒకే అక్షరాలు ఉండడం మరో విశేషం. (ఆగస్టు 29.. నాగ్ పుట్టినరోజు సందర్భంగా)

ఏయన్నార్ సినిమాలో నాగ్ అతిథి పాత్ర.. అమెరికన్ ఫిల్మ్ చూసి కాపీ కొట్టారు!

కింగ్ అక్కినేని నాగార్జున పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో సందడి చేశారు. వాటిలో కొన్ని చిత్రాలు బాగా క్లిక్ అయ్యాయి కూడా. ఈ క్రమంలోనే.. తన తండ్రి, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఓ సినిమాలోనూ నాగ్ అతిథి పాత్ర పోషించారు. అది కూడా.. 'హీరో నాగార్జున'గానే. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ఫిల్మ్ 'ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్' (1965)ని ఆధారంగా చేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సంస్థలు 'రావుగారిల్లు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించాయి. తరణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, జయసుధ, రేవతి, మురళీ మోహన్, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, సుత్తి వేలు, బేబి విజయ (రాశి) ముఖ్య పాత్రల్లో నటించగా.. స్పెషల్ రోల్ లో నాగ్ కనిపించారు. 1988 జూన్ 6న విడుదలైన ఈ చిత్రం అక్కినేని అభిమానులను అలరించింది.  (ఆగస్టు 29.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా)

వెంకీతో నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. ఏంటో తెలుసా!

కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. ఒకే ఏడాదిలో తెలుగు తెరపై కథానాయకులుగా అరంగేట్రం చేశారు. 1986 మే 23న విక్రమ్ చిత్రంతో నాగ్ హీరోగా ఎంట్రీ ఇస్తే.. అదే ఏడాది ఆగస్టు 14న కలియుగ పాండవులుతో వెంకీ కథానాయకుడిగా మొదటి అడుగేశారు. ఇద్దరు కూడా ఫస్ట్ ఎటెంప్ట్ లోనే సక్సెస్ చూశారు. ఆపై ఇద్దరు కూడా విభిన్న ప్రయత్నాలతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోలుగా ఎదిగారు. వీరికి బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే, నాగ్ - వెంకీ మల్టిస్టారర్ చేస్తే చూడాలన్నది చాలామంది కోరిక. అది నెరవేరకపోయినా.. ఈ ఇద్దరు రెండు సినిమాల్లో భాగమయ్యారు. అందులో ఒకటి త్రిమూర్తులు కాగా, మరొకటి ప్రేమమ్. వెంకటేశ్ హీరోగా నటించిన త్రిమూర్తులు (1987) మూవీలో నాగార్జున ఒక పాటలో కాసేపు తళుక్కున మెరుస్తారు. అలా.. వెంకీ, నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక చిత్రంగా త్రిమూర్తులు గుర్తుండిపోతుంది. ఇక నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ లో.. చైతూకి తండ్రిగా నాగ్, మేనమామగా వెంకీ వేర్వేరు సీన్స్ లో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

నాగ్ తో 35 ఏళ్ళు రొమాన్స్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా!

టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో నాగ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ హీరోయిన్ తోనైనా తన కెమిస్ట్రీ అద్భుతంగా కుదురుతుంది. అలాంటి నాగ్ తో సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువ కాలం రొమాన్స్ చేసిన హీరోయిన్ గా ఒకరికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. గ్లామర్ క్వీన్ రమ్యకృష్ణ. వివరాల్లోకి వెళితే.. 1987లో విడుదలైన సంకీర్తన చిత్రంతో నాగ్, రమ్య కాంబో మొదలవగా.. ఆపై వీరి కలయికలో ఇద్దరూ ఇద్దరే (1990), అల్లరి అల్లుడు (1993) (స్పెషల్ సాంగ్), హలో బ్రదర్ (1994), క్రిమినల్ (1994), ఘరానా బుల్లోడు (1995), అన్నమయ్య (1997), చంద్రలేఖ (1998), సోగ్గాడే చిన్ని నాయనా (2016), బంగార్రాజు (2022) చిత్రాలు వచ్చాయి. అంటే.. వెండితెరపై నాగార్జున, రమ్యకృష్ణ జోడీ 35 ఏళ్ళు రొమాన్స్ చేశారన్నమాట. ఇలాంటి రికార్డు తెలుగునాట అరుదనే చెప్పాలి. 

నాగ్ తో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడెవరు.. వీరిది హ్యాట్రిక్ హిట్స్ కాంబో కూడా!

సెంచురీ క్లబ్ కి చేరువలో ఉన్న కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. వచ్చే ఏడాది 'శతచిత్రాల కథానాయకుడు' ట్యాగ్ తో మురిపించనున్నారాయన. కాగా, ఈ ప్రయాణంలో ఎంతో మంది దర్శకులతో ముందుకు సాగిన నాగ్.. ఒకరితో మాత్రం తొమ్మిది సినిమాలు చేశారు. ఇంతకీ ఆ దర్శకుడెవరో తెలుసా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.  అగ్ని పుత్రుడు (1987)తో మొదలైన నాగ్, రాఘవేంద్రరావు కాంబో.. ఆపై ఆఖరి పోరాటం (1988), జానకి రాముడు (1988), అగ్ని (1989), ఘరానా బుల్లోడు (1995), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006), షిరిడి సాయి (2012), ఓం నమో వేంకటేశాయ (2017) వరకు సాగింది. వీటిలో ఆఖరి పోరాటం, జానకి రాముడు, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు మంచి విజయం సాధించాయి. అంటే.. ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు రూపంలో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్స్ కూడా చూశారన్నమాట. కాగా, రాఘవేంద్రరావు తరువాతి స్థానంలో ఎ. కోదండరామిరెడ్డి, రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. వీరిద్దరూ నాగ్ తో అరడజను సినిమాలు చేశారు. (ఆగస్టు 29.. నాగార్జున బర్త్ డే సందర్భంగా)

ఒకే ఏడాదిలో నాగ్ హ్యాట్రిక్.. ఏ సంవత్సరమో గుర్తుందా!?

కింగ్ నాగార్జున కెరీర్ లో పలు మెమరబుల్ హిట్స్ ఉన్నాయి. అయితే, ఒకే ఏడాదిలో తను నటించిన మూడు వరుస చిత్రాలు విజయం సాధించడమన్నది మాత్రం ఒకే ఒకసారి జరిగింది. ఈ మూడు చిత్రాలు కూడా మ్యూజికల్ గానూ మెప్పించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. 2000 సంవత్సరంలో నాగ్ నుంచి మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో తొలి చిత్రమైన 'నువ్వు వస్తావని' ఏప్రిల్ 5న జనం ముందుకు వచ్చింది. అప్పట్లో నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ మూవీ ఇదే కావడం విశేషం. ఆపై సెప్టెంబర్ 14న వచ్చిన 'నిన్నే ప్రేమిస్తా', సెప్టెంబర్ 29న రిలీజైన 'ఆజాద్' కూడా మంచి విజయాన్నే సాధించాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో విడుదలైన ఈ రెండు సినిమాల్లోనూ సౌందర్య నాయికగా నటించడం విశేషం. నిన్నే ప్రేమిస్తాలో నాగ్ ది పూర్తి స్థాయి పాత్ర కాదు.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చాలా ఇంపార్టెంట్ రోల్. ఏదేమైనా.. 2000 లాగా మరే ఏడాదిలోనూ నాగ్ కి మూడు వరుస హిట్స్ లేకపోవడం గమనార్హం. 

నాగ్ బర్త్ డేకి రిలీజైన ఏకైక సినిమా.. ఏంటో తెలుసా!

కింగ్ నాగార్జున ఇప్పటివరకు 98 సినిమాల్లో సందడి చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ఎంటర్టైన్ చేశారు. అలాగే కథానాయకుడిగానే కాకుండా.. అడపాదడపా అతిథి పాత్రల్లోనూ మెరిశారు. ఓవరాల్ గా.. 37 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేశారు. ఇదిలా ఉంటే, నాగార్జున కెరీర్ మొత్తమ్మీద బర్త్ డే స్పెషల్ గా ఎన్ని సినిమాలు రిలీజయ్యాయో తెలుసా? కేవలం ఒకే ఒక చిత్రం. అది కూడా కెరీర్ ఆరంభంలో సందడి చేసిన మూవీ. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. 'కెప్టెన్ నాగార్జున్'. నాగ్ రెండో సినిమాగా జనం ముందుకొచ్చిన ఈ చిత్రం.. 1986 ఆగస్టు 29న రిలీజైంది. వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ కి జంటగా ఖుష్బూ నటించింది. మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ఇట్టే ఆకట్టుకోలేకపోయింది. 

వెండితెర సమ్మోహనాస్త్రం.. మన్మథుడు నాగార్జున!

వెండితెరపై ప్రయోగాలు చేయడానికే.. 'నేనున్నాను' అంటారాయన. నట సమ్రాట్ కి 'వారసుడు' అన్న ట్యాగ్ తోనే సినీ 'గగనం'లో అడుగుపెట్టిన ఆ 'గ్రీకు వీరుడు'.. ఒక దశలో వరుస విజయాలతో 'జైత్రయాత్ర' సాగించి 'ఎదురులేని మనిషి'గా నిలిచారు. క్లాస్ కైనా, 'మాస్'కైనా.. తనే 'బాస్' అనిపించుకున్నారు. 'నిన్నే ప్రేమిస్తా', 'నిన్నే పెళ్ళాడతా' అని అమ్మాయిలను పలవరించేలా చేసి.. వారి కలలకు 'ఊపిరి' పోశారు. 'ఆకాశ వీధిలో' 'మజ్ను'లా సాగుతూ.. తన 'గీతాంజలి'తో మురిపించారు.  'గోవింద గోవిందా', 'ఓం నమో వేంకటేశాయ' అంటూ 'అన్నమయ్య' 'సంకీర్తన'లు ఆలపిస్తూనే.. ఆ 'జానకి రాముడు'కి 'శ్రీరామదాసు'డయ్యారు. జన 'చైతన్యం' కోసం 'ఢమరుకం' మ్రోగించి వెండితెరపై 'శివ' తాండవం చేశారు. 'సంతోషం' పంచడానికి 'అంతం' లేదంటూ.. అనూహ్య 'నిర్ణయం' తీసుకుని మరీ బుల్లితెరపైనా 'సూపర్' అనిపించుకున్నారు. ఇంతలా సమ్మోహనపరిచిన ఆ 'మన్మథుడు' ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అతనే మన 'కింగ్' నాగార్జున.  తెలుగు తెరపై ఎందరో నట వారసులు సందడి చేశారు. అయితే, కొందరు మాత్రమే స్టార్స్ గా వెలుగొందారు. అలాంటి వారిలో.. కింగ్ నాగార్జున ఒకరు. నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున..  కెరీర్ ఆరంభంలో లుక్స్ విషయంలోనూ, యాక్టింగ్ స్కిల్స్ విషయంలోనూ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకవైపు వాటిని స్వాగతిస్తూనే.. మరోవైపు తనను తాను మెరుగుపరుచుకుంటూ 'వజ్రం'లా ప్రకాశించే దిశగా అడుగులు వేశారు. 'విక్రమ్' వంటి విజయవంతమైన చిత్రంతో 1986లో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన నాగ్.. ఆపై ఫ్లాప్, హిట్స్ సమంగా చూస్తూ ముందుకు సాగారు. అయితే 1989.. నాగ్ కెరీర్ లో మరపురాని సంవత్సరమనే చెప్పాలి. ఆ ఏడాది తను నటించిన 'గీతాంజలి', 'శివ' చిత్రాలు తనని స్టార్  చేశాయి. అప్పటివరకు సాదాసీదా కథానాయకుడిగానే సాగుతున్న నాగార్జునని కాస్త సమ్ థింగ్ స్పెషల్ గా చేశాయి ఆ చిత్ర ద్వయాలు. ఆ విజయాల స్ఫూర్తితోనే మరిన్ని ప్రయోగాలు చేశారు ఈ అక్కినేని హ్యాండ్సమ్ హీరో. వాటిలో వికసించిన వాటికంటే వికటించినవే ఎక్కువ. అయినప్పటికీ కొత్తదనమే తన 'ఊపిరి' అనుకుంటూ వైవిధ్యానికే పెద్దపీట వేశారు.  ఈ క్రమంలోనే.. 'జైత్రయాత్ర', 'అంతం' వంటి విభిన్న ప్రయత్నాలు నిరాశపరిచినా.. 'ప్రెసిడెంటు గారి పెళ్ళాం', 'వారసుడు', 'అల్లరి అల్లుడు', 'హలో బ్రదర్', 'ఘరానా బుల్లోడు' వంటి మాస్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ పట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..  'నిన్నే పెళ్ళాడతా'తో రొమాంటిక్ కింగ్ అనిపించుకున్న నాగ్.. ఆపై వెనువెంటనే వచ్చిన 'అన్నమయ్య'తో తెలుగుజనులను భక్తిపారవశ్యంలో ముంచేయడం అనూహ్యం, అసాధారణం, అపూర్వమనే చెప్పాలి. "నాగార్జున ఏంటి? అన్నమయ్యగా చేయడమేంటి?" అన్నవాళ్ళకు తన అద్భుతాభినయంతో సమాధానమివ్వడమే కాకుండా.. తొలిసారి 'నంది' పురస్కారాన్ని, అలాగే 'స్పెషల్ జ్యూరీ' విభాగంలో నేషనల్ అవార్డ్ ని కైవసం చేసుకుని విస్మయపరిచారు. 'శివ' తరువాత ఎలాగైతే నాగ్ కి వరుస పరాజయాలు పలకరించాయో.. 'అన్నమయ్య' తరువాత కూడా దాదాపు అదే పరిస్థితి ఎదురైంది. అయితే, మ్యూజికల్ సెన్సేషన్ 'నువ్వు వస్తావని'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి.. ఆపై 'నిన్నే ప్రేమిస్తా', 'ఆజాద్' వంటి హిట్స్ తో 2000లో హ్యాట్రిక్ చూశారు. మళ్ళీ 2001లో వరుస ఫ్లాఫ్స్ తో మరోసారి ఇబ్బందిపడ్డప్పటికీ.. మరుసటి ఏడాది నుంచి 'సంతోషం', 'మన్మథుడు', 'శివమణి', 'నేనున్నాను', 'మాస్' వంటి వరుస హిట్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. 'శ్రీరామదాసు'గా మరోసారి ఆధ్యాత్మిక బాట పట్టి మరో నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.   శ్రీరామదాసు అనంతరం దాదాపు పదేళ్ళ పాటు తన స్థాయికి తగ్గ హిట్ లేనప్పటికీ.. వైవిధ్యం పంచడంలో వెనుకడుగేయలేదు నాగ్. ఆపై 'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' వంటి వరుస విజయాలతో మెరిశారు. అటుఇటుగా అదే సమయంలో బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి హోస్ట్ గా చేసి మెస్మరైజ్ చేశారు. ఆపై 'బిగ్ బాస్' షోతోనూ పలు సీజన్స్ లో మురిపించారు. ఎందరో దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసి 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' అనిపించుకున్న నాగ్.. నిర్మాతగానూ తిరుగులేని విజయాలు చూశారు. అదేవిధంగా తెలుగు తెరకే పరిమితం కాకుండా హిందీ, తమిళ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశారు. అడపాదడపా అతిథి పాత్రల్లోనూ మెరిశారు. అవార్డులు, రివార్డులు, రికార్డుల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఓవరాల్ గా.. 98 సినిమాలు పూర్తిచేసిన నాగార్జున త్వరలో తన 99వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. బహుశా వచ్చే ఏడాది ఇదే సమయానికి 'శతచిత్రాల కథానాయకుడు' అనే ట్యాగ్ సైతం పొందే అవకాశం లేకపోలేదు. 1959 ఆగస్టు 29న జన్మించిన నవ మన్మథుడు నాగార్జున.. 64 ఏళ్ళు పూర్తిచేసుకుని 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది 'తెలుగువన్. కామ్'. 

 నాగ్ ని కింగ్ ని చేసిన టాప్ 10 మూవీస్ ఇవే!

కింగ్ నాగార్జున.. వెండితెర సమ్మోహనాస్త్రం. మూడున్నర దశాబ్దాలకిపైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. స్వీట్ 60 క్లబ్ లోనూ గ్లామర్ తో కనువిందు చేస్తున్న 'మన్మథుడు'. అలాంటి నాగ్ ని తెలుగునాట 'కింగ్'ని చేసిన టాప్ 10 జనరంజక చిత్రాలేంటో చూద్దాం.. 1. గీతాంజలి: అప్పటి యువతకి సరికొత్త ప్రేమకథని పరిచయం చేసిన చిత్రమిది. ఇందులో క్యాన్సర్ వ్యాధికి గురైన యువకుడు ప్రకాశ్ గా తన సహజ నటనతో ఆకట్టుకున్నారు నాగ్. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు ఎస్సెట్ గా నిలిచాయి. 2. శివ: టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో 'శివ' ఒకటి. ఈ సినిమాతోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరంగేట్రం చేశారు. ఇందులో విభిన్న ఛాయలున్న శివ పాత్రలో తన అద్బుతాభినయంతో అలరించారు నాగ్. హిందీలోనూ ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ అయి.. అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  3. ప్రెసిడెంటు గారి పెళ్ళాం: 'శివ' తరువాత ట్రాక్ తప్పిన నాగార్జున కెరీర్ ని.. మళ్ళీ విజయపథంలోకి తీసుకువచ్చిన సినిమా 'ప్రెసిడెంటు గారి పెళ్ళాం'. ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇందులో పల్లెటూరి యువకుడు రాజాగా మాస్ ని భలేగా ఎంటర్టైన్ చేశారు నాగ్. 4. హలో బ్రదర్: తెరపై ఒక్క నాగార్జున కనిపిస్తేనే.. ఫ్యాన్స్ కి మస్త్ ఎంటర్టైన్మెంట్. అలాంటిది రెండు పాత్రల్లో దర్శనమిస్తే.. అది 'హలో బ్రదర్'లా అటు క్లాస్ ని, ఇటు మాస్ ని మెస్మరైజ్ చేసే బ్లాక్ బస్టర్ బొమ్మే. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దేవా, రవివర్మ గా తన ద్విపాత్రాభినయంతో అభిమానులను భలేగా అలరించారు ఈ అక్కినేని వారి హ్యాండ్సమ్ స్టార్. 5. నిన్నే పెళ్ళాడతా: కుటుంబ ప్రేక్షకులకు నాగ్ ని ఎంతో దగ్గర చేసిన సినిమా 'నిన్నే పెళ్ళాడతా'. ఇందులో శీను పాత్రలో ఎంతో నేచురల్ గా కనిపించి మురిపించారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టబుతో నాగ్ పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇప్పటికీ చర్చనీయాంశమే. 6. అన్నమయ్య: నాగ్ కెరీర్ ని 'అన్నమయ్య'కి ముందు, తరువాత అన్నంతగా ప్రభావం చూపిన సినిమా. నిజంగా అన్నమయ్య అంటే ఇలానే ఉంటారేమో అన్నట్లుగా పాత్రలో ఒదిగిపోయారు నాగ్. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా తొలి నందిని అందుకోవడమే కాకుండా స్పెషల్ మెన్షన్ కేటగిరిలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు నాగార్జున. 7. నువ్వు వస్తావని:  'అన్నమయ్య' చిత్రం తరువాత సరైన విజయాల్లేని నాగ్ ని.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం 'నువ్వు వస్తావని'. ఇందులో చిన్ని కృష్ణ పాత్రలో జీవించేశారు నాగ్. ఈ సాఫ్ట్ రోల్ తో మహిళా ప్రేక్షకులకు మరెంతో దగ్గరయ్యారు. నూతన దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ రూపొందించిన 'నువ్వు వస్తావని' అప్పట్లో ఓ సంగీత సంచలనం. 8. మన్మథుడు: అమ్మాయిలంటే అస్సలు పడని అభిరామ్ అనే యువకుడిగా నాగ్ ఎంటర్టైన్ చేసిన మూవీ 'మన్మథుడు'. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ విజయభాస్కర్ డైరెక్టోరియల్.. నాగ్ కి సరికొత్త అభిమాన గణాన్ని అందించింది. ఇక 'మన్మథుడు' అనే టైటిల్ కాస్త నాగ్ కి ముద్దు పేరైపోయింది.  9. మనం: ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలిసి నటించడమంటేనే.. ఓ అపురూపమైన అంశం. దానికి ఓ అద్భుతమైన కథ తోడైతే.. అది 'మనం' చిత్రమే.  ఇటు తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతోనూ, అటు తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతోనూ నాగ్  స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ మెమరబుల్ మూవీని విక్రమ్ కుమార్ తీర్చిదిద్దారు. 10. సోగ్గాడే చిన్ని నాయనా: తండ్రీకొడుకులుగా నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ ఇది. అంతేకాదు.. నాగ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా కూడా. నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో బంగార్రాజు, రాముగా మెస్మరైజ్ చేశారు కింగ్.  

శంకర్ 'బాయ్స్'కి 20 ఏళ్ళు.. కుర్రకారుని పిచ్చెక్కించిన సినిమా!

సామాజిక సందేశానికి సాంకేతికతను జోడించి సినిమాలు తెరకెక్కించడం.. దర్శకుడు శంకర్ శైలి. యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తెరకెక్కించిన 'బాయ్స్' కూడా ఈ తరహా సినిమానే. ఫ్యాషన్, మ్యూజిక్, లైఫ్ స్టైల్ వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ చిత్రం.. ప్రధానంగా ఐదుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి పై సాగే కథ. యూత్ కోసమే తీసిన సినిమా కావడంతో.. కథానుసారం కొన్ని బోల్డ్ సీన్స్ కూడా తెరకెక్కించారు శంకర్. అవి అప్పట్లో వివాదస్పదం అయినప్పటికీ.. కాలక్రమంలో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్.  సిద్ధార్థ్, జెనీలియా, భరత్, తమన్ (నేటి ప్రముఖ సంగీత దర్శకుడు), నకుల్, మణికంఠన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బాయ్స్'లో వివేక్, భువనేశ్వరి, అనితా రత్నం, జానకి సబేష్, సుభాషిణి, ఇళవరసు, మనోబాల, రామ్ జీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ గాయకులు ఎస్పీబీ, హరిహరన్, విజయ్ యేసుదాస్, రంజిత్, బ్లాజీ అతిథి పాత్రల్లో మెరిశారు. స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమన్ సంగీతం 'బాయ్స్'కి ఎస్సెట్ గా నిలిచింది. ఇందులోని "నాకొక గాళ్ ఫ్రెండ్ కావలెను", "ఎగిరి దుమికితే", "సరిగమ", "బూమ్ బూమ్", "మారో మారో", "డేటింగ్", "ప్లీజ్ సార్" అంటూ మొదలయ్యే పాటలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. 2003 ఆగస్టు 29న విడుదలై బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించిన 'బాయ్స్'.. మంగళవారంతో 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

ఏయన్నార్ 'పునర్జన్మ'కి 60 ఏళ్ళు.. నాగ్ బర్త్ డే స్పెషల్ మూవీ!

నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పలు నవలాధారిత చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో 'పునర్జన్మ' ఒకటి. 'పత్థర్ కే హోంఠ్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఇందులో ఏయన్నార్ కి జంటగా కృష్ణ కుమారి దర్శనమివ్వగా.. రమణారెడ్డి, గుమ్మడి, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, చదలవాడ, సూర్యకాంతం, హేమలత, ఎల్. విజయలక్ష్మి, సంధ్య, వాసంతి, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.  టి. చలపతిరావు సంగీతమందించిన ఈ చిత్రానికి శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు, సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. ఇందులోని "ఎవరివో నీవెవరివో", "దీపాలు వెలిగే", "నీ కోసం" (రెండు వెర్షన్స్), "పూలు విరిసెను", "మనసు తెరిచి చూడు" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం.. హిందీలో 'ఖిలోనా' (1970), తమిళంలో 'ఎంగిరుదో వందాళ్' (1970), మలయాళంలో 'అమృతవాహిని' (1976) పేర్లతో రీమేక్ అయింది. ఏయన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున 4వ పుట్టినరోజు సందర్భంగా 1963 ఆగస్టు 29న 'పునర్జన్మ' జనం ముందు నిలిచింది. మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.  

చిరంజీవి 'చూడాలని వుంది!'కి పాతికేళ్ళు.. మణిశర్మ స్థాయిని పెంచిన బ్లాక్ బస్టర్ !

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ ది హ్యాట్రిక్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే.. రెండో చిత్రం 'చూడాలని వుంది!' ఘనవిజయం సాధించింది. ఇక మూడో సినిమా అయిన 'ఇంద్ర' పలు రికార్డులను భూస్థాపితం చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వాస్తవానికి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరువాత అశ్వనీదత్.. చిరంజీవితో ఒకట్రెండు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసినప్పటికీ అవి కొంతమేర నిర్మాణం జరుపుకుని ఆగిపోయాయి. దాంతో.. భారీ విరామం అనంతరం చిరు, దత్ కాంబోలో రెండో సినిమాగా 'చూడాలని వుంది' వెలుగులోకి వచ్చింది.  అండర్ వరల్డ్ డాన్ చేతిలో చిక్కుకుపోయిన తన కొడుకుని రక్షించుకోవడం కోసం.. రామకృష్ణ (చిరంజీవి) అనే ఓ తండ్రి చేసిన అన్వేషణ, పోరాటమే 'చూడాలని వుంది' సినిమా.  కలకత్తా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఒక బిడ్డకి తండ్రిగా కనిపించి అలరించారు చిరు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రైల్వే స్టేషన్ ఎపిసోడ్ లో లవర్ బాయ్ గానూ భలేగా ఎంటర్టైన్ చేశారు. అదేవిధంగా సౌందర్యతో సాగే సన్నివేశాల్లోనూ సరదాలు పంచారు. ఇక నృత్యాల్లోనూ, పోరాటాల్లోనూ తనదైన శైలిలో రంజింపజేశారు.   గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'చూడాలని వుంది'కి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమాతో స్వరకర్తగా మణిశర్మ దశ, దిశ మారిపోయిందనే చెప్పాలి. "యమహా నగరి", "రామ్మా చిలకమ్మా", "ఓ మారియా ఓ మారియా", "సింబలే సింబలే", "అబ్బబ్బా ఇద్దూ", "మనస్సా ఎక్కడున్నావ్".. ఇలా  ఇందులోని పాటలన్నీ అప్పట్లో సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ఇక నేపథ్య సంగీతం సరేసరి. ఈ చిత్రానికిగానూ ఇటు 'నంది', అటు 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు మణిశర్మ.   చిరంజీవికి జోడీగా సౌందర్య, అంజలా ఝవేరి నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ప్రతినాయకుడిగా నటించగా.. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ధూళిపాళ, వేణుమాధవ్, మాస్టర్ తేజ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. తెలుగునాట శతదినోత్సవం జరుపుకున్న 'చూడాలని వుంది!'.. హిందీలో 'కలకత్తా మెయిల్' పేరుతో రీమేక్ అయింది. 1998 ఆగస్టు 27న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చూడాలని వుంది!'.. ఆదివారంతో 25 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.   

శోభన్ బాబు 'తోడు నీడ'కి 40 ఏళ్ళు.. ఏ సినిమాకి రీమేకో తెలుసా?!

ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో నట భూషణ్ శోభన్ బాబు ఒకరు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాల్లో సింహభాగం విజయం సాధించాయి. వాటిలో 'తోడు నీడ' ఒకటి. 1981 నాటి హిందీ చిత్రం 'బసేరా' (శశి కపూర్, రాఖీ, రేఖ, పూనమ్ థిల్లాన్) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేయగా సరిత, రాధిక, నళిని కథానాయికలుగా నటించారు. గుమ్మడి, ఎం. ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, మిక్కిలినేని, రాళ్ళపల్లి, చలపతిరావు, సాయికుమార్, అత్తిలి లక్ష్మి, మాస్టర్ సురేశ్, మాస్టర్ మణి కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  లీలా పన్సాల్ కర్ మూలకథకి గుల్జార్ స్క్రీన్ ప్లే సమకూర్చగా.. ఆచార్య ఆత్రేయ మాటలు అందించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ ఈ ఫ్యామిలీ డ్రామాని డైరెక్ట్ చేశారు.  దిగ్గజ స్వరకర్త చక్రవర్తి బాణీలు కట్టిన ఈ చిత్రానికి ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించగా.. ఎస్పీబీ, సుశీల గాత్రమందించారు. "నా తోడువై నా నీడవై", "పూజలెన్ని చేశాను", "కోకమ్మత్త", "అక్కగారూ చక్కాని చుక్క", "ఒళ్ళెంతో సుబ్బరం" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకుంటాయి. మహేశ్వరి ఫిలింస్ పతాకంపై  ఎస్పీ వెంకన్నబాబు నిర్మించిన 'తోడు నీడ'.. 1983 ఆగస్టు 27న జనం ముందు నిలిచింది. ఆదివారంతో ఈ సినిమా 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 

కృష్ణ 'సింహగర్జన'కి 45 ఏళ్ళు.. ఎన్టీఆర్ సినిమాపై పోటీ..!

నటరత్న నందమూరి తారక రామారావు, నటశేఖర కృష్ణ సినిమాల మధ్య పలు పర్యాయాలు బాక్సాఫీస్ వార్ జరిగింది. మరీముఖ్యంగా.. 1977 సంక్రాంతికి ఒకే కథాంశంతో 'దాన వీర శూర కర్ణ', 'కురుక్షేత్రం' చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో ఎన్టీఆర్ 'దాన వీర శూర కర్ణ' సంచలన విజయం సాధించింది. ఇదే తరహాలో 1978 ఆగస్టులోనూ రెండు వారాల వ్యవధిలో ఒకే జోనర్ (జానపదం)లో వీరి సినిమాలు పోటీపడ్డాయి. ఎన్టీఆర్ నటించిన 'సింహబలుడు' ఆగస్టు 11న జనం ముందు నిలిస్తే.. కృష్ణ నటించిన 'సింహగర్జన' ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో 'సింహబలుడు' భారీ బడ్జెట్ కారణంగా యావరేజ్ గా నిలిస్తే.. 'సింహగర్జన' మాత్రం మంచి విజయం సాధించింది.  ఇక 'సింహగర్జన' సినిమా విషయానికి వస్తే.. మత్తగజాల కుంభస్థలాలపై లంఘించి, గర్జనలు చేసి చీల్చి చెండాడిన ఇద్దరు కొదమ సింగాల్లాంటి యువకుల పరాక్రమ విక్రమాల స్వైర్య విహార గాథ ఇది. ఇందులో పగలు అనే మారుపేరుతో సాగే శివ వర్మ అనే యువకుడి పాత్రలో కృష్ణ కనిపిస్తే.. రాత్రి అనే మారుపేరుతో సాగే కేశవ వర్మ అనే యువకుడి వేషంలో గిరిబాబు దర్శనమిచ్చారు. అలాగే దుష్టులైన రాకుమారుల పాత్రల్లో మోహన్ బాబు, శరత్ బాబు అలరించగా.. గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, కేవీ చలం, సంగీత, అంజలీ దేవి, జయమాలిని, త్యాగరాజు, మిక్కిలినేని, జగ్గారావు, రమాప్రభ, పుష్ప కుమారి, జయవాణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక కృష్ణకి జంటగా లత సందడి చేశారు. హాస్య బ్రహ్మ జంధ్యాల సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి కొమ్మినేని దర్శకత్వం వహించారు.  పాటల విషయానికి వస్తే.. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన గీతాలకు ఆచార్య ఆత్రేయ, సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, గోపి, జాలది, నాగభైరవి సాహిత్యమందించారు. ఇందులోని "కత్తులు కలిసిన శుభసమయంలో", "అమ్మ రావే తల్లి రావే", "సాహసమే మా జీవమురా", "తొలకరి సొగసులు", "అమ్మా దుర్గా మాత" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. గిరిబాబు సమర్పణలో జయభేరి  ఇంటర్నేషనల్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు, యర్రా శేషగిరి రావు నిర్మించిన 'సింహగర్జన'.. 1978 ఆగస్టు 26న విడుదలైంది. శనివారంతో ఈ జనరంజక చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.   

చైతూ ఫస్ట్ ఫిల్మ్ తో.. సిద్ధు జొన్నలగడ్డకి కనెక్షన్ ఏంటి?

'డీజే టిల్లు'తో యువతరాన్ని విశేషంగా అలరించాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా.. త్వరలోనే జనం ముందుకు రానుంది.  ఇదిలా ఉంటే, సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టి చాలా కాలమే అయింది. కరెక్ట్ గా చెప్పాలంటే.. 2009లోనే సిద్ధు నటుడిగా తొలి అడుగులు వేశాడు. అది కూడా.. అంతగా గుర్తింపు లేని పాత్రతో. ఆ వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరంగేట్రం చేసిన 'జోష్' సినిమాతోనే సిద్ధు కూడా డెబ్యూ ఇచ్చాడు. అందులో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. అంటే.. చైతూకి హీరోగా, సిద్ధుకి నటుడిగా 'జోష్'నే మొదటి సినిమా అన్నమాట. ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' (2010)లో సంతోష్ పాత్రలో కాసేపు మెరిశాడు మిస్టర్ జొన్నలగడ్డ. ఆనక మరికొన్ని సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఎంటర్టైన్ చేసిన సిద్ధు.. ప్రవీణ్ సత్తారు డైరెక్టోరియల్ 'గుంటూరు టాకీస్' (2016)తో మెస్మరైజ్ చేశాడు. ఇక కోవిడ్ టైమ్ లో ఓటీటీలో స్ట్రీమ్ అయిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' (2020)తో మరింత గుర్తింపు తెచ్చుకుని.. 'డీజే టిల్లు' (2022)తో అనూహ్య విజయం అందుకుని సంచలనం సృష్టించాడు. ఏదేమైనా.. చిన్న చిన్న రోల్స్ తో కెరీర్ ఆరంభించి ఇప్పుడు క్రేజీ హీరోగా సిద్ధు దూసుకుపోతున్న వైనం యువతరానికి స్ఫూర్తిదాయకమే.

మహేశ్ ఎన్ని సినిమాల్లో డబుల్ రోల్స్ చేశాడో తెలిస్తే.. షాక్ అవుతారు?

అటు చైల్డ్ ఆర్టిస్ట్ గానూ, ఇటు హీరోగానూ స్టార్ డమ్ చూసిన వైనం.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతం. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ.. అనతికాలంలోనే వెండితెరపై తనదైన ముద్ర వేశారు మహేశ్. ఒకవైపు వాణిజ్యాత్మక చిత్రాల్లో నటిస్తూనే.. అడపాదడపా ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక సినిమాల్లోనూ సందడి చేస్తున్నారు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో.  ఇదిలా ఉంటే, ఇప్పటి టాప్ హీరోల్లో ఒకరిగా ముందుకు సాగుతున్న ఈ సెన్సేషనల్ స్టార్.. తన కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు 36 సినిమాల్లో నటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీటిలో కేవలం రెండే రెండు చిత్రాల్లో మాత్రమే ఇంతవరకు ద్విపాత్రాభినయం చేశారు. బాలనటుడిగా అభినయించిన 'కొడుకు దిద్దిన కాపురం' (1989)లో వినోద్, ప్రమోద్ అనే అన్నదమ్ముళ్ళ పాత్రల్లో కనిపించిన మహేశ్.. హీరోగా నటించిన 'నాని' (2004) కోసం క్లైమాక్స్ సీన్ లో తండ్రీకొడుకులుగా కాసేపు డబుల్ రోల్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఏదేమైనా.. 36 సినిమాల్లో కేవలం రెండే రెండు సార్లు మహేశ్ డ్యూయెల్ రోల్స్ లో దర్శనమివ్వడం అంటే ఒక రకంగా షాకింగ్ విషయమే మరి.