బ‌ర్త్ డే స్పెష‌ల్ః  మెలోడీబ్ర‌హ్మ కేరాఫ్ ఇండ‌స్ట్రీ హిట్స్

మ‌ణిశ‌ర్మ అంటే ఇండ‌స్ట్రీ హిట్స్.. ఇండ‌స్ట్రీ హిట్స్ అంటే మ‌ణిశ‌ర్మ.. అన్న‌ట్లుగా ఒక ద‌శ‌లో తెలుగునాట‌ త‌న‌దైన హ‌వా చాటారు స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌.  మెలోడీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, బ్యాగ్రౌండ్ స్కోర్ లోనూ బ‌ల‌మైన ముద్ర వేసిన మ‌ణిశ‌ర్మ..  అప్ప‌ట్లో ప‌లు ఇండ‌స్ట్రీ హిట్స్ లో భాగమ‌య్యారు.  1999 సంక్రాంతికి విడుద‌లైన 'స‌మ‌ర‌సింహారెడ్డి'తో తొలి ఇండ‌స్ట్రీ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న మ‌ణిశ‌ర్మ‌.. ఆపై 2001 సంక్రాంతికి సంద‌డి చేసిన 'న‌ర‌సింహ‌నాయుడు'తో మ‌రో ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. అలాగే, అదే ఏడాది వేస‌వికి వినోదాలు పంచిన 'ఖుషి'తో ఇంకో ఇండ‌స్ట్రీ హిట్ లో భాగ‌మ‌య్యారు. 'ఖుషి' అనంత‌రం 2002లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన 'ఇంద్ర‌'కి కూడా మ‌ణిశ‌ర్మనే బాణీలు క‌ట్టారు. ఆపై 2006లో వ‌చ్చిన 'పోకిరి'తో చివ‌రి ఇండ‌స్ట్రీ హిట్ చూశారు మ‌ణిశ‌ర్మ‌. అలా.. త‌న త‌రం, త‌రువాతి త‌రంలో ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో అత్య‌ధిక సంఖ్య‌లో ఇండ‌స్ట్రీ హిట్స్ చూసిన కంపోజ‌ర్ గా రికార్డ్ నెల‌కొల్పారు మెలోడీ బ్ర‌హ్మ‌. ఇక‌  'ప్రేమించుకుందాం.. రా!', 'చూడాలని వుంది!', 'ఆది', 'ఒక్క‌డు', 'ఠాగూర్' వంటి  బ్లాక్ బ‌స్ట‌ర్స్ అయితే మ‌ణిశ‌ర్మ ఖాతాలో భారీగానే ఉన్నాయనే చెప్పాలి.  (జూలై 11 - మ‌ణిశ‌ర్మ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..)

వెంక‌టేశ్ 'వ‌సంతం'కి 20 ఏళ్ళు.. క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అతిథి పాత్ర‌లో మెరిసిన సినిమా!

  ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్స్ అన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చే క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేశ్ ఒక‌రు. ఈ జాన‌ర్ లో వెంకీ న‌టించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. వాటిలో 'వ‌సంతం' సినిమా ఒక‌టి. ఆడ‌, మ‌గ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ చిత్రంలో వెంక‌టేశ్ కి జోడీగా ఆర్తి అగ‌ర్వాల్ న‌టించ‌గా, స్నేహితురాలి పాత్ర‌లో క‌ళ్యాణి ద‌ర్శ‌న‌మిచ్చింది.  ఆకాశ్, సునీల్, చంద్ర‌మోహ‌న్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హేమ‌, ఆహుతి ప్ర‌సాద్, కొండ‌వ‌ల‌స‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, ఎల్బీ శ్రీ‌రామ్, ప్ర‌సాద్ బాబు, సూర్య‌, వైజాగ్ ప్ర‌సాద్, శివారెడ్డి, మాస్ట‌ర్ తేజ‌ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అతిథి పాత్ర‌లో మెరిశారు. 'సూర్య‌వంశం' మాతృక ద‌ర్శ‌కుడైన‌ విక్ర‌మ‌న్.. తెలుగులో నేరుగా రూపొందించిన తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. క‌థాంశం విష‌యానికి వ‌స్తే.. అశోక్ (వెంక‌టేశ్), జూలీ (క‌ళ్యాణి) చిన్న‌ప్ప‌ట్నుంచి స్నేహితులు. క్రికెట‌ర్ గా రాణించాల‌న్న‌ది అశోక్ క‌ల‌. జూలీ కూడా ఆ విష‌యంలో ఎంత‌గానో ప్రోత్స‌హిస్తుంటుంది. ఇదే స‌మ‌యంలో అశోక్ జీవితంలోకి నందిని (ఆర్తి అగ‌ర్వాల్) వ‌స్తుంది. తొలుత అశోక్, జూలీ స్నేహాన్ని ఇబ్బందిగా ఫీలైనా.. క్ర‌మంగా అర్థం చేసుకుంటుంది నందిని. మ‌రోవైపు.. మైఖేల్ (ఆకాశ్)తో ప్రేమ‌లో ప‌డుతుంది జూలీ. వారిద్ద‌రి పెళ్ళి కోసం.. మైఖేల్ పెట్టిన ష‌ర‌తు కార‌ణంగా జూలీకి దూర‌మ‌వుతాడు అశోక్. కొన్ని సంఘ‌ట‌న‌ల త‌రువాత‌ భార‌తీయ జ‌ట్టు త‌రపున క్రికెట్ ఆడి గెల‌వ‌డ‌మే కాకుండా.. జూలీ స్నేహాన్ని కూడా మ‌ళ్ళీ గెలుచుకుంటాడు అశోక్. అలాగే కాల‌క్ర‌మంలో అశోక్, జూలీ పిల్ల‌లు సైతం స్నేహితుల‌వుతారు.  మెలోడీ స్పెష‌లిస్ట్ ఎస్.ఎ. రాజ్ కుమార్ బాణీలు క‌ట్టిన 'వ‌సంతం'కి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి, 'సిరివెన్నెల' సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్, కుల‌శేఖ‌ర్ సాహిత్యమందించారు. "గాలి చిరుగాలి", "అమ్మో అమ్మాయేనా", "నిను చూడ‌క‌", "జాంపండువే", "గోదార‌ల్లే పొంగే", "ఓ జాబిలి", "ఓ లాలీ పాప్ కి".. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. శ్రీ సాయిదేవా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎన్వీ ప్ర‌సాద్, ఎస్. నాగ అశోక్ కుమార్ నిర్మించిన 'వ‌సంతం'.. స్పెష‌ల్ జ్యూరీ (ఎన్వీ ప్ర‌సాద్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ (పి. రాంబాబు) విభాగాల్లో 'నంది' పుర‌స్కారాలు ద‌క్కించుకుంది. అంతేకాదు.. 'సింహాద్రి' వంటి సెన్సేష‌న‌ల్ మూవీ విడుద‌లైన రెండు రోజుల త‌రువాత వ‌చ్చిన 'వ‌సంతం'..  139 కేంద్రాల‌లో 50 రోజులు, 71 కేంద్రాల‌లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మై అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచింది. 2003 జూలై 11న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన 'వ‌సంతం'.. మంగ‌ళ‌వారంతో 20 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంటోంది. 

ఈవీవీ 'క‌న్యాదానం'కి పాతికేళ్ళు.. అప్ప‌ట్లో వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా!

ఓ ఆడ‌పిల్ల తండ్రి.. క‌న్యాదానం చేయ‌డ‌మ‌న్న‌ది అనాదిగా ఉన్న వ్య‌వ‌హార‌మే. అయితే.. త‌న భార్య‌ ప్రేమించిన వ్య‌క్తికే ఆమెని క‌న్యాదానం చేసిన భ‌ర్తని మాత్రం క‌నివిని ఎరుగం. అలాంటి  ఓ భ‌ర్త క‌థే.. 'క‌న్యాదానం' చిత్రం. వినూత్న క‌థాంశాల‌కు చిరునామాగా నిలిచిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన ఈ సినిమాలో భ‌ర్త‌గా శ్రీ‌కాంత్, భార్య‌గా ర‌చ‌న న‌టించ‌గా.. ప్రియుడు పాత్ర‌లో ఉపేంద్ర (తెలుగులో త‌న‌కిదే తొలి చిత్రం) అల‌రించాడు. కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ నారాయ‌ణ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, క‌విత‌, శివాజీ, రాజీవ్ క‌న‌కాల‌, గోకిన రామారావు, వినోద్ బాల, మాధ‌విశ్రీ (వ‌ర్ష) ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.  కోటి సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌కు 'సిరివెన్నెల' సీతారామ‌శాస్త్రి, భువ‌న‌చంద్ర‌, చంద్ర‌బోస్ సాహిత్య‌మందించారు. "క‌ళ్యాణం ఇది క‌నివిని ఎరుగ‌ని", "సింగ‌పూర్ సింగారాలే", "అయ్య‌య్యో అయ్య‌య్యో", "భ‌లేగుంది భ‌లేగుంది", "క‌నులే వెతికే", "ఇది ప్రేమ చ‌రిత్ర‌కి", "ఎక్కడుంది న్యాయం", "గౌలిగూడ లాలాగూడ".. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. అంబికా కృష్ణ నిర్మించిన 'క‌న్యాదానం'.. 1998 జూలై 10న విడుద‌లై జ‌నాల్ని రంజింప‌జేసింది. నేటితో ఈ హిట్ మూవీ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. 

సంచ‌ల‌న 'సింహాద్రి'కి 20 ఏళ్ళు.. అప్ప‌ట్లో 'సింగ‌మ‌లై' దెబ్బ‌కి బాక్సాఫీస్ అబ్బా అనేసింది!

కొన్ని కాంబినేష‌న్స్ అంతే గురూ! ఏదో మంత్ర‌మేసిన‌ట్టు.. జ‌ట్టుక‌ట్టిన ప్ర‌తీసారి హిట్టుకొట్టేస్తుంటాయి. అలాంటి మ్యాజిక‌ల్ కాంబోల్లో.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సో స్పెష‌ల్ అంతే. ఈ ఇద్ద‌రు క‌లిస్తే మాత్రం.. రికార్డుల ఊచ‌కోతే. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మొద‌టి చిత్రం 'స్టూడెంట్ నెంః 1' సూప‌ర్ హిట్ గా నిలిస్తే.. ఆపై వ‌చ్చిన 'సింహాద్రి', 'య‌మ‌దొంగ‌', 'ఆర్ ఆర్ ఆర్' సరికొత్త రికార్డులు సృష్టించాయి. మ‌రీ ముఖ్యంగా.. 'సింహాద్రి' అయితే ఊర మాస్ ఆడియ‌న్స్ ని ఓ రేంజ్ లో మెస్మ‌రైజ్ చేసిప‌డేసింది.  ప‌దిమంది చ‌ల్ల‌గా ఉండ‌డం కోసం ఒక‌డ్ని చంప‌డానికైనా, త‌ను చావ‌డానికైనా సిద్ధ‌ప‌డే ఓ యువ‌కుడి క‌థే.. 'సింహాద్రి'. స్టోరీ సింపులే కానీ దాన్ని జ‌క్క‌న్న తెర‌పైకి తీసుకువ‌చ్చిన విధానం మాత్రం అద్భుతః. ఇక సింహాద్రిగా, సింగ‌మ‌లైగా రెండు ఛాయ‌లున్న పాత్ర‌లో నూనుగు మీసాల ఎన్టీఆర్ త‌న పెర్ఫార్మెన్స్ తో ఇచ్చి ప‌డేశాడు.  2003లో ఒరిజిన‌ల్ రిలీజ్ టైమ్ లోనే కాదు.. 2023లో తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రి-రిలీజ్ చేసినా బాక్సాఫీస్ ని షేక్ చేయ‌డంలోనూ 'సింహాద్రి' ఏ మాత్రం త‌గ్గ‌లేదంటే ఆ వాడి, వేడి ఏ పాటిదో అర్థం చేసుకోవ‌చ్చు.  మ‌రీ ముఖ్యంగా.. కేర‌ళ నేప‌థ్యంలో సాగే సింగ‌మ‌లై ఎపిసోడ్స్ ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ తెప్పించేస్తుంటాయి.  స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు - నేప‌థ్య సంగీతం 'సింహాద్రి'కి మ‌రో మెయిన్ ఎస్సెట్.  ''నువ్వు విజిలిస్తే'', ''చిన్న‌ద‌మ్మే చీకులు'', ''చీమ చీమ‌'', ''న‌న్నేదో సేయ‌మాకు'', ''చిరాకు అనుకో'', ''అమ్మైనా నాన్నైనా'', ''సింగ‌మ‌లై''.. ఇలా ఇందులోని ప్ర‌తీ పాట విశేషాద‌ర‌ణ పొందింది. ఇక‌ తార‌క్ నృత్యాల సంగ‌తి స‌రేస‌రి. ప్రేక్ష‌కుల రివార్డులు, బాక్సాఫీస్ రికార్డుల‌తో వార్త‌ల్లో నిలిచిన 'సింహాద్రి'.. 55 కేంద్రాల్లో 175 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ విభాగంలో ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌ని రికార్డుని త‌న సొంతం చేసుకుంది. అలాగే త‌మిళంలో 'గ‌జేంద్ర' (2004) పేరుతోనూ, క‌న్న‌డంలో 'కంఠీర‌వ' (2012) పేరుతోనూ ఈ ఇండ‌స్ట్రీ సెన్సేష‌న్ రీమేక్ అయింది.  భూమికా చావ్లా, అంకిత క‌థానాయిక‌లుగా న‌టించిన 'సింహాద్రి'లో నాజ‌ర్, భానుచంద‌ర్, సీత‌, సంగీత‌, బ్ర‌హ్మానందం, అలీ, రాహుల్ దేవ్, శ‌ర‌త్ స‌క్సేనా, ముకేశ్ రిషి, వేణుమాధ‌వ్, కోట శ్రీ‌నివాస‌రావు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ర‌మ్య‌కృష్ణ ప్ర‌త్యేక గీతంలో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది.  వి. దొర‌స్వామిరాజు స‌మ‌ర్ప‌ణ‌లో వి. విజ‌య్ కుమార్ వ‌ర్మ నిర్మించిన 'సింహాద్రి'.. 2003 జూలై 9న విడుద‌లై వ‌సూళ్ళ‌ వ‌ర్షం కురిపించింది. ఆదివారంతో ఈ చిత్రం 20 వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది.  

మూడు ద‌శాబ్దాల‌ 'కొండ‌ప‌ల్లి రాజా'.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు మీ కోసం!

  'చంటి'(1992)తో తెలుగునాట‌ ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్.. విక్ట‌రీ వెంక‌టేశ్, స్టార్ డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టిది. ఆ చిత్రం త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమా 'కొండ‌ప‌ల్లి రాజా'(1993). 'చంటి' ఎలాగైతే రీమేక్ మూవీనో.. 'కొండ‌ప‌ల్లి రాజా' సైతం రీమేక్ చిత్రం కావ‌డం విశేషం. త‌మిళ సినిమా 'చిన్న తంబి' (1991) ఆధారంగా 'చంటి' తెర‌కెక్కితే.. 'కొండప‌ల్లి రాజా' కూడా 'అణ్ణామ‌లై' (1992) అనే త‌మిళ చిత్రం ఆధారంగా రూపొందింది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. 'అణ్ణామ‌లై' కూడా రీమేక్ నే. 1987లో విడుద‌లైన హిందీ చిత్రం 'ఖుద్ గ‌ర్జ్' ఆధారంగా  'అణ్ణామ‌లై' త‌యారైంది. అయితే, 'అణ్ణామ‌లై' కంటే ముందు 'ఖుద్ గ‌ర్జ్'కి రీమేక్ గా తెలుగునాట 'ప్రాణ స్నేహితులు' (1988) (కృష్ణంరాజు, శ‌ర‌త్ బాబు, రాధ‌) రూపొంద‌డం విశేషం. అంటే.. 5 ఏళ్ళ వ్య‌వ‌ధిలో ఒకే క‌థ‌తో ప్రాణ స్నేహితులు, కొండ‌ప‌ల్లి రాజా తెర‌కెక్కాయ‌న్న‌మాట‌.  మ‌రో విష‌య‌మేమిటంటే.. ఇటు 'ప్రాణ స్నేహితులు'లోనూ, అటు 'అణ్ణామ‌లై'లోనూ హీరోకి ఫ్రెండ్ గా శ‌ర‌త్ బాబు న‌టించారు. ఇక 'కొండ‌ప‌ల్లి రాజా' క‌థ విష‌యానికి వ‌స్తే.. రాజా (వెంక‌టేశ్), అశోక్ (సుమ‌న్) అనే ఇద్ద‌రు చిన్న‌నాటి స్నేహితులు.. వారి స్నేహం గిట్ట‌ని అశోక్ తండ్రి గంగాధ‌రం (కోట శ్రీ‌నివాస‌రావు) కార‌ణంగా విడిపోతారు. తిరిగి ఈ మిత్రులు ఎలా ద‌గ్గ‌ర‌య్యారు? అనేదే మిగిలిన క‌థ‌. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కిన ఈ రీమేక్.. అప్ప‌ట్లో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఇందులో వెంకీకి జంట‌గా న‌గ్మా క‌నిపించ‌గా.. సుమ‌న్ కి జోడీగా రేఖ ద‌ర్శ‌న‌మిచ్చింది. 'చంటి'లో వెంకీకి అమ్మ‌గా న‌టించిన సుజాత‌.. ఇందులోనూ అదే పాత్ర‌లో ఆక‌ట్టుకున్నారు. అదే విధంగా 'చంటి'లో చిన్న‌నాటి వెంక‌టేశ్ గా అల‌రించిన మాస్ట‌ర్ రాఘ‌వేంద్ర‌.. 'కొండ‌ప‌ల్లి రాజా'లోనూ వెంక‌టేశ్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను పోషించ‌డం విశేషం. శ్రీ‌కాంత్, అలీ, యువ‌రాణి, సుధాక‌ర్, అర్చ‌నా పూర‌న్ సింగ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేశారు.  ఇక పాట‌ల విష‌యానికి వ‌స్తే.. స్వ‌ర‌వాణి కీరవాణి బాణీల‌న్నీ చార్ట్ బ‌స్ట‌ర్సే. టైటిల్ సాంగ్ తో పాటు ''దానిమ్మ తోట‌లోకి'', ''గువ్వ‌మ్ గుడుగుడు'', ''అమ్మ‌మ్మ‌మ్మ‌మ్మో'', ''ఏ కాశీలో సిగ్గు'', ''సింగ‌రాయ‌కొండ‌''.. ఇలా ఇందులోని గీతాల‌న్నీ జ‌న‌రంజ‌క‌మే. సౌదామిని క్రియేష‌న్స్ ప‌తాకంపై కేవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మించిన 'కొండ‌ప‌ల్లి రాజా'.. 1993 జూలై 9న విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఆదివారంతో ఈ సినిమా 30 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది. 

దర్శకురాలిగా సావిత్రి తొలి సినిమా 'చిన్నారి పాపలు'కు 55 యేళ్లు!

  సావిత్రి మహానటి. ఎంతటి మహానటో అంతటి దయాశీలి. అంతేకాదు, ఆమెలో చక్కని దర్శకురాలు కూడా ఉంది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన 'చిన్నారి పాపలు' చిత్రం విడుదలై జూన్ 21కి 55 యేళ్లు నిండుతున్నాయి. ఇదే రోజు 1968లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అప్పటి గొప్ప నటీనటులు చాలామంది నటించారు. వారిలో జగ్గయ్య, సావిత్రి, షావుకారు జానకి, జమున, ఎస్వీ రంగారావు, పద్మనాభం, శాంతకుమారి, రేలంగి, సూర్యకాంతం, రమణారెడ్డి, రమాప్రభ లాంటి వాళ్లున్నారు. రోజారమణి బాలనటిగా ఇందులో కనిపించింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశాన్ని మద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో 1967 అక్టోబర్ 12న చిత్రీకరించారు. హీరోయిన్ కాస్ట్యూమ్స్ సహా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సావిత్రి చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి తానే నిర్మాతనన్నట్లు వ్యవహరించారు. ఎందుకంటే నిర్మాణ సంస్థ శ్రీ మాతా ఫిలిమ్స్‌లో 14 మంది భాగస్వాములు ఉన్నారు. అందరూ పెద్దమనుషుల భార్యలు. వాళ్లందరూ పెట్టుబడి పెట్టినా సినిమా పూర్తి కాని స్థితి. దాంతో కొంతమంది ఫైనాన్షియర్స్‌ను తీసుకొచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందు దాని పనులన్నింటినీ తన భుజాల మీద వేసుకున్న సావిత్రి తన సొంత డబ్బుల్ని చాలావరకు వెచ్చించారు. ఈ సినిమా నిర్మాణంలో భర్త జెమినీ గణేశన్ నుంచి ఆమెకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ముహూర్తపు షాట్‌కు మాత్రం క్లాప్ కొట్టారు.  1968 జూన్ 21న విడుదలైన 'చిన్నారి పాపలు' సినిమా పెట్టుబడిలో పావు వంతు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఫైనాషియర్స్ వచ్చి కూర్చున్నారు. నిర్మాణ సంస్థలోని షేర్ హోల్డర్స్ అందరూ ముఖాలు చాటేశారు. లాభం లేదనుకొని తన దగ్గర ఉన్న క్యాష్‌తో పాటు నగలు అమ్మగా వచ్చిన డబ్బును ఫైనాన్షియర్స్‌కు ఇవ్వాల్సింది ఇచ్చేశారు సావిత్రి. అయితే ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలుచుకోవడం ఒకింత ఊరట. సావిత్రి దర్శకురాలిగా మంచి ప్రతిభ చూపించింది అనే పేరు తెచ్చుకున్నారు. అలనాటి అద్భుత గాయని పి. లీల ఈ సినిమాతో సంగీత దర్శకురాలిగా మారడం మరో విశేషం. పర్యవేక్షకునిగా ఎస్పీ కోదండపాణి వ్యవహరించారు. పాటలను కొసరాజు, ఆరుద్ర, సినారె, వి. సరోజిని రాశారు. శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీని అందించిన ఈ చిత్రానికి ఎంఎస్ఎన్ మూర్తి ఎడిటర్‌గా పనిచేశారు. నిర్మాతగా వ్యవహరించిన వీరమాచనేని సరోజిని.. రమణతో కలిసి సంభాషణలు రాయడమే కాకుండా ఒక పాటనూ రాశారు.   ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇదే సినిమాను శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జెమిని గణేశన్ హీరోగా 'కుళందై ఉళ్లం' టైటిల్‌తో మళ్లీ తీశారు సావిత్రి. దానికి కూడా తెలుగు సినిమాకు పట్టిన గతే పట్టింది. 

అపురూప సంగీత దృశ్యకావ్యం 'సాగరసంగమం' వయసు 40 యేళ్లు!

  తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'సాగరం సంగమం' విడుదలై నేటికి సరిగ్గా 40 వసంతాలు. గొప్ప నటులు కమల హాసన్, జయప్రద ప్రధాన పాత్రలు ధరించిన ఈ క్లాసిక్ మూవీని దిగ్దర్శకులు కె. విశ్వనాథ్ రూపొందించారు. ఆ ముగ్గురితో పాటు, చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు ఈ సినిమా ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్నీ సాధించిపెట్టింది. చూసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం మనకు తెలియజేసే సినిమా 'సాగర సంగమం'. నాట్యాన్ని ప్రాణప్రదంగా భావించే బాలకృష్ణ, ఆ నాట్యాన్ని ప్రేమించే మాధవి కథ ఈ సినిమా. మాధవిని ప్రేమించిన బాలకృష్ణ, అప్పటికే ఆమె వివాహిత అనీ, ఆస్తి వివాదాల కారణంగా అతడికి దూరంగా ఉంటోందని తెలిసి, ఆ ఇద్దర్నీ కలిపి, తాను దూరంగా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల తర్వాత 'నాట్యమయూరి' బిరుదు ప్రదాన సభలో శైలజ నాట్యంలోని లోపాలను ఎత్తిచూపుతాడు. అప్పుడే ఆమె మాధవి కూతురనే విషయం తెలుస్తుంది. దాంతోపాటే మాధవి వితంతువుగా మారిందనే విషయమూ తెలిసి తట్టుకోలేకపోతాడు. శైలజను తన వారసురాల్ని చెయ్యాలనే తపనతో ఆమెకు నాట్యం నేర్పించి, ఆమె ప్రదర్శన చూసి తృప్తిగా తనువు చాలిస్తాడు. కథానాయకుడు బాలకృష్ణ ఎక్కువ భాగం ముసలివాడిగా కనిపించాలి కాబట్టి మొదట ఆ పాత్రను చెయ్యడానికి కమల్ హాసన్ ఇష్టపడలేదు. ఐదారు నెలలు ఆయన వెంటపడి మొత్తానికి ఆయన చేత సరేననిపించారు ఏడిద నాగేశ్వరరావు. మాధవి పాత్రకు మొదట జయసుధను అనుకొని, ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, జయప్రదను తీసుకున్నారు. శైలజ పాత్రకు నాట్యం తెలిసిన కొత్తమ్మాయి అయితే బాగుంటుందని అనుకొని, అప్పుడే డాన్స్ నేర్చుకుంటున్న ఎస్పీ శైలజను ఎంపిక చేశారు. సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్‌ని అనుకున్నారు కె. విశ్వనాథ్. అయితే ఏడిద నాగేశ్వరరావు సలహాతో ఇళయరాజాను తీసుకున్నారు. అన్ని పాటల్నీ వేటూరి రాశారు. మ్యూజికల్‌గానూ ఈ సినిమా పెద్ద హిట్. కమల్ హాసన్ బాగా మద్యం తాగి, మత్తులో ఓ బావిపై అడ్డంగా ఉన్న పంపుగొట్టమీద డాన్స్ చేస్తూ "తకిట తకిట తందాన.." పాటను పాడుతూ ఉంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే "వేదం.. అణువణువున నాదం.." పాటలో కాలికి గాయంతోటే డాన్స్ చేశారు కమల్.  సుమారు రూ. 30 లక్షల వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు. అందులో కమల్ పారితోషికం రూ. 4 లక్షలు. 75 పని దినాల్లో మద్రాస్, ఊటీ, వైజాగ్, హైదరాబాద్ లోకేషన్స్‌లో షూటింగ్ జరిపారు. కమల్ కాస్ట్యూమ్స్‌ను అప్పటి ఆయన భార్య వాణీ గణపతి డిజైన్ చేశారు. శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్‌కుమార్‌కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పడం విశేషం. జయప్రద భర్త వేణుగోపాలరావు పాత్రను నటి లక్ష్మి మాజీ భర్త మోహన్ శర్మ చేశారు. ఆయనకు ఎస్పీ బాలు డబ్బింగ్ చెప్పారు. 1983 జూన్ 3న విడుదలైన 'సాగరసంగమం' ఘన విజయం సాధించింది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళం (సలంగై ఒలి)లో 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బెంగళూరు, మైసూరులో ఒకటిన్నర సంవత్సరం పాటు ఆడటం విశేషం. రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమా 'సాగరసంగమం'.  ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఎస్పీ బాలుకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకునిగా పురస్కారాలు అందించింది ఈ చిత్రం. కమల్ హాసన్ ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు. అవార్డులు రాకపోయినా నటిగా జయప్రదకు చాలా మంచి పేరు వచ్చింది. జంధ్యాల రాసిన సంభాషణలు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.  కమల్ స్నేహితుడు రఘుగా శరత్‌బాబు నటించిన ఈ సినిమాలో సాక్షి రంగారావు (బాబాయ్), వంకాయల సత్యనారాయణ (డాక్టర్ మూర్తి), మిశ్రో (డాన్స్ డైరెక్టర్ చిత్తరంజన్), ధం (ఇంటి ఓనర్), పొట్టి ప్రసాద్ (శివయ్య), మాస్టర్ చక్రవర్తి (చక్రి), ఇతర పాత్రలు చేశారు. పి.ఎస్. నివాస్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, జి.జి. కృష్ణారావు ఎడిటింగ్ కూడా 'సాగరసంగమం' క్లాసిక్‌గా రూపొందడంలో తమ వంతు పాత్రలు పోషించాయి. - బుద్ధి యజ్ఞమూర్తి

శకపురుషుని శతజయంతి.. జయహో ఎన్టీఆర్! 

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనీషి ఎన్టీఆర్. ఇది.. తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం ఎన్టీఆర్ శతజయంతి సందర్భం. ఆకర్షణకూ, సమ్మోహనత్వానికీ మరోపేరుగా భాసించిన తారకరాముడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న లక్ష్మయ్య, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన నోట ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలికాయి. 1942 మేలో పందొమ్మిది సంవత్సరాల వయసులో మేనమామె కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్. శర్మ వంటి నటులతో కలిసి ఎన్నో నాటకాలు ఆడారు. ఆయన కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయని ఆనాడే అందరూ ప్రశంసించారు.  మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే బీయే పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా! సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు. కొన్ని కష్టాల తర్వాత లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ రూపొందించగా 1949లో విడుదలైన 'మనదేశం' చిత్రంలో చేసిన పోలీస్ సబిన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌తో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు. అప్పుడెవరూ ఊహించలేదు.. నందమూరి తారక రామారావు అనే యువకుడు సమీప భవిష్యత్తులోనే తన సమ్మోహన శక్తితో, అనితర సాధ్యమైన అభినయంతో తెలుగువారి ఆరాధ్య తారగా వెలుగొందుతాడని! 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళభైరవి' సినిమా ఎన్టీఆర్ నటజీవితాన్ని మలుపు తిప్పింది. తోటరామునిగా తారకరాముడు తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచాడు. తన రూపం, వాచకం, అభినయం, ఖడ్గచాలనంతో వారిని సమ్మోహితుల్ని చేసేశాడు. ఆయన నటన ఒక ఎత్తు, నడక మరో ఎత్తు.  ప్రధానంగా పౌరాణిక చిత్రాలు తారాకరాముని తెలుగువారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు.. ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు.. ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు.. ఆయనే భీముడు, ఆయనే బృహన్నల.. అన్నీ ఆయనే! తెరపై కనిపించేది ఎన్టీఆర్ కాదు, ఆయా పాత్రలే. శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం, సుయోధనుడి వాచకం రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లు. 'లవకుశ' చిత్రంలో చేసిన అపూర్వాభినయంతో తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడు ఆయనే అయిపోయారు. అంతకంటే ముందుగానే 'మాయాబజార్' సినిమాతో శ్రీకృషునిగా నీరాజనాలు అందుకున్నారు. ఆ కాలంలో శ్రీరామ, శ్రీకృష్ణ వేషాల్లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు పటాలు, క్యాలెండర్లు.. అనేక తెలుగిళ్లలోని గోడలపై అలంకారాలయ్యాయి. ఆయనే రామునిగా, ఆయనే కృష్ణునిగా భావించి పూజలు చేసిన వాళ్లెందరో!  తారకరాముడు కేవలం తెరపై గొప్పనటుడు మాత్రమే కాదు, తెరవెనుక మహాగొప్ప దర్శకుడు కూడా! 1961లో వచ్చిన 'సీతారామ కల్యాణం' దర్శకునిగా ఆయన తొలి సినిమా. అయితే సొంత బేనర్ ఎన్ఏటీపై తీసిన ఆ సినిమా టైటిల్స్‌లో దర్శకుని పేరు వేయకుండా రిలీజ్ చేయడం ఆయనకే చెల్లింది. ఇందులో ఆయన రావణాసురుని పాత్రను పోషించారు. దర్శకునిగా తన ప్రతిభ ఏమిటో తొలి సినిమాతోనే ఆయన చాటిచెప్పారు. 1977లో విడుదలైన 'దానవీరశూర కర్ణ' చిత్రంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసి, మరో చరిత్ర సృష్టించారు. పౌరాణిక పాత్రలతో తెలుగువారి అవతార పురుషునిగా రాణించిన ఎన్టీఆర్ జానపద, చారిత్రక చిత్రాల ద్వారానూ అమితంగా ఆకట్టుకున్నారు. 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' చిత్రం నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. టైటిల్ రోల్‌ను పోషిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లోనే పూర్తయినా, సెన్సార్ చిక్కుల్లో పడి, ఆయన ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తర్వాత 1984లో విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిన నందమూరి తారకరామారావు.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో జీవించి, తరించారు. తరగని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచారు. 'మనదేశం'తో మొదలైన మహానటప్రస్థానం 'మేజర్ చంద్రకాంత్' వరకూ జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో, తనకెంతో ఇష్టమైన 'శ్రీనాథ కవిసార్వభౌమ' పాత్ర కూడా పోషించి సంతృప్తిపడ్డారు. నటునిగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైనందుకు తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో స్వీయానుభావంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం కించపరుస్తున్నదని గ్రహించి, తెలుగువాడి సత్తా ఏమిటో తెలియజెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగి, 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు ఎన్టీఆర్. తెలుగువారు ఈ నేలమీద ఉన్నంతవరకూ ఒక శకపురుషునిగా నందమూరి తారకరామారావు పేరు నిలిచే ఉంటుంది. ఇది సత్యం, ఇది తథ్యం. - బుద్ధి యజ్ఞమూర్తి

అల్లు అర్జున్ 'పరుగు'కు పదిహేనేళ్లు!

  పెద్ద కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతే, ఒకవైపు ఆమె కోసం గాలిస్తూ, మరోవైపు తన చిన్నకూతురు కూడా అలాగే చేస్తుందేమోనని ఆందోళనపడే ఒక ఫ్యాక్షనిస్ట్ కథతో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన 'పరుగు' సినిమాని ప్రేక్షకులు ఆదరించి, బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించిపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై నేటికి.. అంటే మే 1వ తేదీకి సరిగ్గా 15 యేళ్లు. నీలకంఠం అనే ఫ్యాక్షనిస్టుగా ప్రకాశ్‌రాజ్ నటించిన ఈ సినిమాలో ఆయన చిన్నకూతురు మీనాక్షిగా షీలా చేసింది. కథ ప్రకారం నీలకంఠం పెద్దకుమార్తె సుబ్బలక్ష్మి (పూనం బజ్వా) తను ప్రేమించిన యువకుడు ఎర్రబాబు (సంజయ్ వెల్లంకి)తో వెళ్లిపోతుంది. దీనికి ఎర్రబాబు మిత్రుడైన కృష్ణ (అల్లు అర్జున్), అతని బృందం కారణమని భావించి, వాళ్లనందర్నీ తన ఇంటి దగ్గర బందీ చేస్తాడు నీలకంఠం. ఆ టైంలోనే ఆయన చిన్నకూతురు మీనాక్షితో ప్రేమలో పడతాడు కృష్ణ. సుబ్బలక్ష్మిని వెతికే క్రమంలో మీనాక్షి సైతం కృష్ణ ప్రేమలో పడుతుంది. ఈ సంగతి తెలిసి, నీలకంఠం ఏం చేశాడు, కృష్ణ-మీనాక్షి ప్రేమకథ ఏమయ్యింది.. అనేది మిగతా కథ.  మొదట ఈ మూవీలో మీనాక్షి రోల్‌కు వేదిక, ప్రియమణి పేర్లు పరిశీలనకు వచ్చాయి. ప్రియమణి పేరు ఖరారయ్యింది కూడా. తర్వాత అనూహ్యంగా ఆమె స్థానంలో షీలా వచ్చింది. ఆ టైంలో టీవీలో యాంకర్‌గా పాపులర్ అయిన చిత్రలేఖ ఈ మూవీలో మీనాక్షి చెలికత్తె టైపు క్యారక్టర్‌ను చేసింది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, హీరో మిత్ర బృందంలో ఒకడైన యజ్ఞనారాయణ శర్మ పాత్ర చేసి, అందరి దృష్టిలో పడ్డాడు సప్తగిరి. సునీల్, సుబ్బరాజు, జయప్రకాశ్ రెడ్డి, జీవా, ధన్‌రాజ్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కృష్ణ పాత్రలో అల్లు అర్జున్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అంతదాకా చాలా జోవియల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తూ వచ్చిన అతను ఈ మూవీలో కృష్ణగా చాలా సెటిల్డ్‌గా, హృదయాన్ని కదిలించే నటనను ప్రదర్శించాడు. మ్యూజికల్‌గానూ 'పరుగు' మంచి పేరు తెచ్చుకుంది. మణిశర్మ బాణీలు కూర్చగా సీతారామశాస్త్రి రచించిన 'హృదయం ఓర్చుకోలేనిది గాయం', అనంత్ శ్రీరాం రాసిన 'నమ్మవేమో గాని అందాల యువరాణి', 'మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో', 'ఎలగెలగా ఎలగా ఎలగెలగా', చంద్రబోస్ రాసిన 'చల్ చల్ చలో' పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ మూవీకి విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్‌గా పనిచేశారు. అదివరకు భాస్కర్‌ను 'బొమ్మరిల్లు'తో దర్శకుడిగా పరిచయం చేసిన దిల్ రాజు, అతని రెండో సినిమా 'పరుగు'నూ నిర్మించారు. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం.. తర్వాత ఒడియా, బెంగాలీ, నేపాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. హిందీ రీమేక్ 'హీరోపంతి' ద్వారా జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయమై, విజయం సాధించాడు. మలయాళంలో 'కృష్ణ' టైటిల్‌తో డబ్బయిన ఈ మూవీ అక్కడ కూడా విజయ దుందుభి మోగించింది. 

నలభై ఏళ్ల 'రెండు జెళ్ల సీత'

  ముళ్లపూడి వెంకటరమణ తన బుడుగు భాషలో సృష్టించిన పాత్రను టైటిల్‌గా పెట్టి హాస్యబ్రహ్మ జంధ్యాల సృషించిన అందమైన చిత్రం 'రెండు జెళ్ల సీత'. శ్రీ భ్రమరాంబికా ఫిలిమ్స్ బ్యానర్‌పై కె. కేశవరావు నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ నాయుడు సమకూర్చిన సంగీతం బిగ్ ఎస్సెట్. ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచిన ఈ మూవీ సరిగ్గా 40 సంవత్సరాల క్రితం.. 1983 మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కథ, మాటలను జంధ్యాల స్వయంగా రాశారు. ఒకే అమ్మాయిని ప్రేమించిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. గోపి, కృష్ణ, మోహన్, మూర్తి అనే నలుగురు అబ్బాయిలు క్లాస్‌మెట్స్ మాత్రమే కాకుండా రూంమేట్స్ కూడా. వాళ్లు ఉంటున్న ఇంట్లోనే ఒక పోర్షన్‌లోకి సీత అనే అమ్మాయి తన తల్లితండ్రులతో అద్దెకు దిగుతుంది. తొలిచూపులోనే నలుగురు కుర్రాళ్లూ ఆమె ప్రేమలో పడిపోయి, ఆమె మనసు గెలుచుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఈ విషయంలో నలుగురి మధ్యా పోటీ ఏర్పడుతుంది. దాంతో లాభం లేదనుకొని, నేరుగా ఆమెనే అడుగుతారు, తమలో ఆమె ఎవరిని ప్రేమిస్తున్నదో చెప్పమని. అప్పుడు సీత తను మధు అనే ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి షాకిస్తుంది. తన గతం చెబుతుంది. మధు తండ్రి గండభేరుండం ఆ పెళ్లి జరగాలంటే రెండు లక్షల కట్నం కావాలంటాడు. బడిపంతులైన సీత తండ్రి సూర్యనారాయణ దానికి ఒప్పుకొని, పెళ్లికి ఏర్పాట్లు చేసుకోగా, ముహూర్తం సమయానికి సీతమీద్ నింద మోపి పెళ్లి ఆపుచేస్తాడు గండభేరుండం. అతనికి బుద్ధిచెప్పి మధుతో సీత పెళ్లి నలుగురు యువకులూ ఎలా జరిపించారనేది మిగతా కథ.  సీతగా మహాలక్ష్మి అనే చక్కని చుక్క నటించిన ఈ చిత్రంలో నలుగురు అబ్బాయిల పాత్రల్ని నరేశ్, ప్రదీఎప్, రాజేశ్, శుభాకర్ పోషించారు. సీత ప్రేమించిమ అబ్బాయి మధు పాత్రని కమలాకర్ అనే అతను చేశాడు. మహాలక్ష్మి ఎవరో కాదు, అలనాటి నటి పుష్పలత కుమార్తె. అదివరకే కన్నడంలో కొన్ని సినిమాల్లో నటించిన మహాలక్ష్మికి ఇదే తొలి తెలుగు చిత్రం. ఆ నిజ జీవిత తల్లీకూతుళ్లు ఈ సినిమాలోనూ అవే పాత్రలు పోషించడం ఈ సినిమాలోని ఇంకో విశేషం. నిజానికి సీత పాత్రను చెయ్యడానికి సెలక్షన్ కోసం వచ్చినవారిలో విజయశాంతి, భానుప్రియ, శోభన వంటి వాళ్లున్నారు. వాళ్లు కాదని మహాలక్ష్మిని ఎంపిక చేశారు జంధ్యాల. హీరోగా ప్రదీప్‌కు ఇదే చివరి చిత్రం. హాస్యనటిగా శ్రీలక్ష్మికి టర్నింగ్ పాయింట్‌గా ఈ సినిమా నిలిచింది. రిటైర్డ్ మేజర్ మంగపతిగా సుత్తి వీరభద్రరావు నవ్వులు పూయించారు. "నేను రెండుసార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాను తెలుసా?" అంటూ ఆయన చెప్పే డైలాగ్‌కు జనం పడీపడీ నవ్వారు. గండభేరుండంగా విలనీని అల్లు రామలింగయ్య పండించిన ఈ చిత్రమి శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు, సుత్తివేలు, దేవి, పొట్టి ప్రసాద్, రాళ్లపల్లి కీలక పాత్రలు చేశారు. రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చిన 'రెండు జెళ్ల సీత తీపి గుండెకోత', 'సరిసరి పదపదనీ', 'మందారంలో ఘుమఘుమలై', 'కొబ్బరి నీళ్లా జలకాలాడీ' జనాలకి తెగ నచ్చేశాయి. వీటిని వేటూరి రాశారు. క్లైమాక్స్‌లో వచ్చే 'పురుషులలో పుణ్యపురుషులు వేరు' పాటను రాసింది ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ఆయనకు ఇదే తొలి సినిమా పాట. రెండు జెళ్ల సీత సినిమాని జనం బాగా ఆదరించారు.

ఎన్టీఆర్ 'దేశోద్ధారకులు' విడుదలై నేటికి 50 వసంతాలు

  శకపురుషుడు నందమూరి తారకరామారావు నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం 'దేశోద్ధారకులు'. ఎన్టీఆర్ మేనత్త కుమారుడు, అభిరుచి కలిగిన నిర్మాత, దర్శకునిగా పేరున్న యు. విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.యస్. రావు దర్శకత్వం వహించారు. దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో తారకరాముని జోడీగా అప్పటి అగ్ర తార వాణిశ్రీ నటించారు. ప్రేక్షకుల విశేషాదరణ పొందిన దేశోద్ధారకులు సినిమా సరిగ్గా 50 ఏళ్ల క్రితం.. 1973 మార్చి 29న విడుదలైంది. కె.వి. మహదేవన్ స్వరాలు కూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ పాపులరే. తెలుగులో తొలి పూర్తి కలర్ ఫిల్మ్ 'లవకుశ' (1963)లో నటించిన ఎన్టీఆర్ తన తొలి కలర్ సోషల్ ఫిలింలో నటించడానికి ఏకంగా పదేళ్ల కాలం తీసుకోవడం గమనార్హం. ఆ రోజుల్లో తెలుగు నిర్మాతలకు కలర్ ఫిల్మ్ లభించేది కాదు. పేరున్న సంస్థలు, ల్యాబ్‌లకు మాత్రమే కోటా లభించేది. ఎన్టీఆర్‌తో కలర్ ఫిల్మ్ తీయాలని విశ్వేశ్వరరావు నిర్ణయించుకున్నారు. డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్‌ను ఈ విషయం చెబితే, ఆయన కలర్ ఫిల్మ్ ఇప్పించారు. 'దేశోద్ధారకులు' నిర్మించడానికి రూ. 35 లక్షలు వెచ్చించారు. అప్పట్లో అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. ఈ విషయంలో నిర్మాత నాగిరెడ్డి ఆయన మందలించారు కూడా. సినిమా ఫలితంపై భరోసా ఉండటంతో విశ్వేశ్వరరావు ఆందోళన పడలేదు. ఆయన నమ్మకం నిజమై రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. 30 రోజుల్లోనే 30 లక్షలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది 'దేశోద్ధారకులు'. 12 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన ఈ చిత్రం కడపలో 210 రోజులు ఆడింది. గోపాలరావు అలియాస్ గోపి చందరంగంలో నిపుణుడు. పోటీలో పోలీస్ కమిషనర్ ప్రభాకర రావును ఓడించడమే కాకుండా ఆయన కుమార్తె రాధ హృదయాన్నీ కొల్లగొడతాడు. ప్రజాబంధుగా పేరుపొందిన రాజభూషణం నిజానికి ఒక దుష్టుడు. కుట్రపన్ని గోపి అన్నయ్య ఆంధ్రా నేషనల్ బ్యాంక్ ఏజెంట్ అయిన రాజారావును దొంగ నోట్ల నేరంపై జైలుకు వెళ్లేట్లు చేస్తాడు. ఆ తర్వాత తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి గోపికి. తండ్రి చావు వెనుక ఉన్నది ప్రభాకరరావు అని భావించిన గోపి ఆయనతో ఘర్షణ పడతాడు. ఆ సందర్భంలో ప్రభాకరరావు మరణిస్తాడు. తండి చావుకు గోపి కారణమని అతడిని ద్వేషిస్తుంది రాధ. గోపి జైలుపాలవుతాడు. తర్వాత అతను బ్రౌన్ దొర పేరుతో విదేశాల నుంచి వస్తాడు. రాధకు తన సెక్రటరీగా ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత అసలు దొంగలను అతను ఎలా బయటపెట్టాడనేది క్లైమాక్స్. మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుందీ, స్వాగతం దొరా సుస్వాగతం, కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు, ఈ వీణకు శృతిలేదు, ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు, ఇది కాదు మా ప్రగతి పాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి. ఈ పాటలను ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, విశ్వేశ్వరరావు, మోదుకూరి జాన్సన్ రాశారు. "పనిచెయ్యకుండా పుచ్చుకునేది జీతం, చేస్తానని పుచ్చుకునేది లంచం, చేసి పుచ్చుకునేది లాంఛనం" లాంటి డైలాగ్స్ బాగా పేలాయి. మహారధి, మోదుకూరి జాన్సన్ ఈ చిత్రానికి మాటలు రాశారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్, ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ పోషించిన విధానం ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. నాయిక రాధ పాత్రలో వాణిశ్రీ చులాగా ఇమిడిపోయారు. ఎన్టీఆర్, వాణిశ్రీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ అనింపించేట్లు ఉంటుంది. మెయిన్ విలన్‌గా నాగభూషణం తనదైన డైలాగ్ డిక్షన్‌తో అదరగొట్టగా, మితగా విలన్ పాత్రధారులు రాజనాల, సత్యనారాయణ, త్యాగరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిజాయితీగా బతకాలనుకొని, చివరకు పిచ్చివాడైపోయే పాత్రలో పద్మనాభం మెప్పించారు. సీబీఐ ఆఫీసర్‌గా రావు గోపాలరావు కనిపిస్తారు.

తారకరాముడిని శ్రీరామునిగా జనం గుండెల్లో నిలిపిన 'లవకుశ'కు 60 ఏళ్లు!

  "రామన్న రాముడూ కోదండ రాముడూ శ్రీరామచంద్రుడు వచ్చాడురా.. మన సీతమ్మ తల్లితో వచ్చాడురా.." అంటూ శ్రీరామ పట్టాభిషేకంతో మొదలైన ఉత్తర రామాయణ గాథను వెండితెరపై చూస్తూ జనం మైమరచి, పులకించి, పులకరించిపోయి ఇవాళ్టికి 60 వసంతాలు గడిచిపోయాయి. అవును. సమ్మోహనాకారుడు నందమూరి తారకరామారావు జనం గుండెల్లో శ్రీరామచంద్రునిగా నిలిచిపోవడానికి కారణభూతమైన మహోన్నత పౌరాణిక చిత్రం 'లవకుశ' విడుదలైంది 60 ఏళ్ల క్రితం.. అనగా 1963 మార్చి 29న. ఎన్టీఆర్ కాకుండా ప్రపంచంలోని ఇంకే ప్రాంతంలోనూ ఒక నటుడు శ్రీరాముని రూపంతో జనం చేత కొలవబడ్డ దాఖలా మరిలేదు, ఇంకరాదు కూడా. అలాంటి సుందరరూపుడు తారకరాముడు! సీతగా అంజలీదేవి సైతం తెలుగువారికి ఆరాధ్యురాలైంది కూడా 'లవకుశ' చిత్రంతోటే. సీతారాములుగా అంజలి, రామారావు జోడీకి అంతగా జనం తమ మనసుల్లో గుడి కట్టేశారు. వారు ఎక్కడికి కలిసి వెళ్లినా హారతులు పట్టారు. లక్ష్మణునిగా కాంతారావు అతికినట్లు సరిపోయిన ఈ సినిమాలో భరత, శతృఘ్నులుగా కైకాల సత్యనారాయణ, శోభన్‌బాబు నటించగా, రాజగురువు వశిష్ట ముని పాత్రలో ధూళిపాళ వారు ఒదిగిపోయారు. ఇక టైటిల్ రోల్స్ లవకుశులుగా అప్పటి బాలనటులు నాగరాజు, సుబ్రహ్మణ్యం ఎంతగా జన హృదయాల్ని దోచుకున్నారో కదా! కన్నాంబ, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, రమణారెడ్డి లాంటి వాళ్లు తమ పాత్రల్లో చులాగా ఒదిగిపోయి రాణించిన తీరు ఎంత గొప్పది! అప్పటి దాకా అనేక సినిమాల్లో తన నటనతో నవ్వులు పూయిస్తూ వచ్చిన రేలంగి వెంకట్రామయ్య ఈ సినిమాలో సీతమ్మ అడవుల పాలవడానికి కారకుడైన తిమ్మడి పాత్రను చేసి, ఎంతమంది జనాల తిట్లకు గురయ్యారో!! సీతమ్మకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి లవకుశులను గొప్ప విలుకాండ్లుగా తీర్చిదిద్దే వాల్మీకి మహర్షి పాత్రలో చిత్తూరు నాగయ్యను కాకుండా మరొక నటుణ్ణి ఊహించుకోగలమా! తండ్రీకొడుకుల ప్రేమానురక్తికీ, భార్యాభర్తల అనురాగానికీ, అన్నాతమ్ముళ్ల అనుబంధానికీ, అత్తాకోడళ్ల ఆత్మీయ స్ఫూర్తికీ అద్దంపట్టే 'లవకుశ'ను తండ్రీకొడుకులు సి. పుల్లయ్య, సి.యస్. రావు మహోన్నత కళాఖండంగా సెల్యులాయిడ్‌పైకి తీసుకు వచ్చారు. సదాశివ బ్రహ్మం రచించిన సంభాషణలు, సముద్రాల రాఘవాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, సదాశివబ్రహ్మం కలాల నుంచి జాలువారిన పాటలు ఆడియో క్యాసెట్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించాయి. పానుగంటి, కంకటి పాపరాజు రచించిన పద్యాలను అదే పనిగా వల్లెవేసిన వారి సంఖ్య తక్కువా! ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే, రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా, రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ, వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా, వల్లనోరి మావా నీ పిల్లని, నేనొల్లనోరి మావా నీ పిల్లని.. ఏం పాటలివి.. ఎంతటి మనోజ్ఞమైన రాగాలవి..! ఇదంతా ఘంటసాల కూర్చిన స్వరాలు, పి. సుశీల, పి. లీల, జిక్కి, జె.వి. రాఘవులు, రాణి, వైదేహి, పద్మ మల్లిక్ లాంటి వారితో కలిసి ఆయన చేసిన ఆలాపన మహిమే కదా!! సినిమా ఇంత ఘన విజయం సాధించడంలో సన్నివేశాలను అంత సుందరంగా, ప్రభావవంతంగా తన కెమెరాతో తీసిన పి.ఎల్. రాయ్ చాయాగ్రహణ ప్రతిభ కూడా కచ్చితంగా ఉంది. ఇక ఈ సినిమా నిర్మాణ విషయానికి వస్తే.. లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించిన 'లవకుశ' షూటింగ్ 1958లో మొదలు కాగా, ఆర్థిక సమస్యలతో సినిమా చిత్రీకరణ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య అనారోగ్యం పాలుకావడంతో ఆయన కుమారుడు సి.ఎస్. రావు పునఃప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని 1963లో 26 కేంద్రాల్లో విడుదలైంది. సినిమా అపూర్వమైన వాణిజ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా 'లవకుశ' చరిత్రకెక్కింది. రిపీట్ రన్ లోనూ ఈ చిత్రం స్థాయిలో ఆడిన చిత్రం మరొకటి లేదు. రిపీట్ రన్లోని ప్రదర్శనలన్నీ కలుపుకుంటే వందకు పైగా కేంద్రాల్లో ఏడాదిపైగా ఆడిన చిత్రంగా భారతదేశం మొత్తమ్మీద మరో రికార్డు స్వంతం చేసుకుంది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా రూ. కోటి వసూళ్ళు సాధించడం ఒక చరిత్ర. విడులైన అన్ని కేంద్రాల్లోని జనభా 60 లక్షల మంది కాగా, 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడుకావడం అపూర్వ ఘట్టం. సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. 'లవకుశ' సినిమా తెలుగు సినిమాలపైనే కాక తెలుగువారిపైనా తన ప్రభావాన్ని చూపించింది. తెలుగు గ్రామాల్లోని రామాలయాల్లో ఈ సినిమా పాటలు మారుమోగి తెలుగునాట 'లవకుశ' పాటలు వినిపించని గ్రామమే లేదన్నంత స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి. ఆ కాలంలో తెలుగు గ్రామాల్లో శ్రీరామనవమి సహా ఏ ఉత్సవం చేసినా ఊరికి బాక్సు తీసుకువచ్చి సినిమాలు వేసే క్రమంలో 'లవకుశ' సినిమాను వేయడమన్నది ఒక రివాజుగా మారింది. 

'శివయ్య'గా రాజశేఖర్ అలరించి నేటికి పాతికేళ్లు!

  రాజశేఖర్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన హిట్ ఫిల్మ్ 'శివయ్య'. 'మృగం'తో డైరెక్టర్‌గా పరిచయమై అందర్నీ తనవైపుకు తిప్పుకున్న సురేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోనికా బేడి, సంఘవి నాయికలుగా నటించారు. ఎం.ఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చిన పాటలు జనాదరణ పొందాయి. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. 1998 మార్చి 27న 'శివయ్య' చిత్రం విడుదలైంది.  శివయ్య (రాజశేఖర్) తన చెల్లెలి ఇంటర్మీడియేట్ చదువు కోసం ఊరి నుంచి నగరానికి వస్తాడు. అక్కడి మిఠాయికొట్టు యజమాని కూతురైన శిరీష (సంఘవి) అతడికి మనసిస్తుంది. లోకల్‌గా జనాన్ని బెదిరిస్తూ సమాంతర రాజ్యం నడుపుతున్న జ్యోతి (మోహన్ రాజ్), పూర్ణ (రవిబాబు) అనే గూండాలతో శివయ్య తలపడతాడు. నమ్మినవాళ్లే ద్రోహం చెయ్యడంతో శివయ్య వాళ్ల చేతుల్లో దారుణంగా గాయపడతాడు. అతని కళ్లముందే చెల్లెలిపై అత్యాచారం చేస్తారు.   ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోజా (మోనికా బేడి) వచ్చి, శివయ్య గతం గురించి చెబుతుంది. తన కుటుంబ గౌరవం కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా ఎలా దూరం పెట్టాడో తెలియజేస్తుంది. శివయ్య జనాల్ని చైతన్యవంతుల్ని చేసి కోర్టులో గూండాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి, వారికి శిక్ష పడేలా చూడ్డంతో కథ ముగుస్తుంది.   ఊరికి సంబంధించిన సన్నివేశాల్ని తూర్పుగోదావరి జిల్లాలోని కోడూరుపాడు అనే గ్రామంలో చిత్రీకరించి, సిటీకి సంబంధించిన సీన్లను హైదరాబాద్ పరిసరాల్లో తీశారు. పోసాని కృష్ణమురళి రాసిన సంభాషణలు ఈ సినిమాకు బలంగా నిలిచాయి. క్లైమాక్స్‌లోని కోర్టు సీన్‌లో శివయ్య మాటలు కూడా బాగా పేలాయి. అయితే కొన్ని సందర్భాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. 'మొదటిసారి ముద్దుపెడితే ఎలాగుంటది' పాట బాగా పాపులర్ అయ్యింది.  శివయ్య క్యారెక్టర్‌లో రాజశేఖర్ శివతాండవం చేసిన ఈ మూవీలో సంఘవి గ్లామర్ రోల్‌లో, మోనికా బేడి పోలీస్ క్యారెక్టరులో అలరించారు. గూండాలు జ్యోతి, పూర్ణ పాత్రల్లో మోహన్ రాజ్, రవిబాబు విలనీని బాగ్రా ప్రదర్శించారు. అపార్ట్‌మెంట్ వాసులుగా అనేకమంది పాపులర్ నటులు ఈ మూవీలో కనిపించారు. వారిలో ఏవీఎస్, రాళ్లపల్లి, జయప్రకాశ్ రెడ్డి, మాడా, పిఎల్ నారాయణ లాంటివారున్నారు. ఈ మూవీ 100 రోజుల వేడుక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

హిట్ ఫిల్మ్ 'రాముడు కాదు కృష్ణుడు' విడుదలై నేటికి 40 ఏళ్లు!

  అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో అత్యధిక శాతం విజయం సాధించినవే. వాటిలో ఒకటి 40 ఏళ్ల క్రితం వచ్చిన 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రం ఒకటి. 1983 మార్చి 25న విడుదలైన ఈ సినిమాలో అక్కినేని సరసన నాయికలుగా జయసుధ, రాధిక నటించారు. కథ, చిత్రానువాదం, సంభాషణలు, పాటలు కూడా దాసరే రాశారు. లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్‌పై ఎన్.ఆర్. అనూరాధాదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈమె ఎవరో కాదు, అలనాటి నటీమణి, మనదేశం చిత్రంతో ఎన్టీఆర్‌ను నటునిగా పరిచయం చేసిన సి. కృష్ణవేణి కుమార్తె. 'రాముడు కాదు కృష్ణుడు'లో నాగేశ్వరావు ద్విపాత్రాభినయం చేశారు. రాము (అక్కినేని నాగేశ్వరరావు) కోటీశ్వరుడైన బహదూర్ అప్పారావు (సత్యనారాయణ) కుమారుడు. అతను మంచి మనసున్నవాడే కాదు, కొంచెం అమాయకత్వం ఉన్నవాడు కూడా. అతని మేనమామ గోపాలరావు (రావు గోపాలరావు) ఒక మోసగాడు. కూతురు జయమ్మ (జయమాలిని)ని రాముకిచ్చి పెళ్లిచేసి, అతని ఆస్తినంతా తన హస్తగతం చేసుకోవాలనే దురాలోచన ఉన్నవాడు. ఆ ఇంట్లో వరాలు (జయంతి) ఒక్కతే రామును బాగా చూసుకొనే వ్యక్తి. ఆమె చనిపోయిన రాము అన్న భార్య. రాము పేదింటి అమ్మాయి శారద (రాధిక)ను ప్రేమిస్తాడు. అయినా తండ్రి ఆజ్ఞ మేరకు మరదలు జయమ్మను పెళ్లి చేసుకోడానికి సిద్ధపడతాడు. జయమ్మకు మేనబావ గిరి (గిరిబాబు)తో శారీరక సంబంధం ఉందనే విషయం రాముకు చెబుతుంది వరాలు. దీంతో రాము, వరాలుకు మధ్య అక్రమ సంబంధం ఆపాదించి వరాలును ఆమె ఇద్దరు పిల్లలతో ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయేలా చేస్తాడు గోపాలరావు. రాము కూడా ఆ ఇంట్లో ఉండలేనని వెళ్లిపోతాడు. అప్పారావును దివాళా తీయించి, ఆయనను పిచ్చివాడిగా చిత్రీకరించి ఆ ఇంట్లోనే బంధించి ఉంచుతాడు గోపాలరావు. మరోవైపు రాము తమ్ముడైన కృష్ణ తన తల్లి లక్ష్మి (సుకుమారి)తో కలిసి ఉంటూ, సత్య (జయసుధ) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అనుకోకుండా రాము, కృష్ణ పరస్పరం తారసపడతారు. గోపాలరావు కుట్ర కారణంగా తను గర్భవతిగా ఉన్నప్పుడు అప్పారావు తనను వదిలివేశాడని లక్ష్మి ఆ ఇద్దరికీ గతం వివరిస్తుంది. విచ్చిన్నపైపోయిన ఆ కుటుంబాన్ని ఒక్కటి చేసే బాధ్యత తీసుకున్న కృష్ణ ఏం చేసి, గోపాలరావు ఆట కట్టించాడనేది క్లైమాక్స్.   రాము, కృష్ణగా రెండు భిన్న మనస్తత్వాలున్న పాత్రలను అక్కినేని ఎంతో వేరియేషన్‌తో నటించి సినిమాను తన భుజాల మీద మోసుకుపోయారు. రాధిక, జయసుధ ఆయన సరసన నాయికలుగా సరిగ్గా సరిపోయారు. ఇద్దరికిద్దరూ హుషారుగా ఆ పాత్రల్ని పోషించారు. నిజానికి ఈ మూవీలో జయసుధ, జయప్రదలను హీరోయిన్లుగా ఎంచుకున్నారు దాసరి. అయితే జయప్రదకు ఆ సమయంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె స్థానంలో రాధిక వచ్చారు. అక్కినేని సరసన రాధిక నటించిన తొలి సినిమా ఇదే. రావు గోపాలరావు విలనీ సంగతి ప్రత్యేకించి చెప్పేదేముంది! రాము ఆఫీసులో పనిచేసే గుమాస్తా లింగంగా అల్లు రామలింగయ్య తనదైన మార్క్ కామెడీతో నవ్వించారు. అప్పారావుగా సత్యనారాయణ, వరాలుగా జయంతి, లక్ష్మిగా సుకుమారి, గోపాలరావు తల్లి కాంతమ్మగా సూర్యకాంతం, భార్య రాధమ్మగా రాజసులోచన, గిరిగా గిరిబాబు, జయమ్మగా జయమాలిని, మమతగా మమత తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభాకర రెడ్డి, సత్యేంద్రకుమార్, కొసరాజు అతిథి పాత్రలో కనిపించారు.   చక్రవర్తి సంగీతం సమకూర్చిన 'ఒక లైలా కోసం', 'చూశాకా నిను చూశాకా', 'ఒక చేత తాళి' పాటలతో పాటు 'అందమంతా అరగదీసి', 'అన్నం పెట్టమంది అమ్మ' లాంటి స్పెషల్ సాంగ్స్ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినా 'ఒక లైలా కోసం సాంగ్' వినిపించేది. 'చూశాకా నిను చూశాకా' పాటను మద్రాస్‌లోని వీజీపీ గార్డెన్స్‌లో కేవలం రెండున్నర గంటల వ్యవధిలో చిత్రీకరించి రికార్డ్ నెలకొల్పారు దాసారి. ఈ పాట మొత్తం అక్కినేని, జయసుధను వీజీపీ చుట్టూ పరిగెత్తించారు కొరియోగ్రాఫర్ సలీం. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన ఈ సినిమా నిర్మాతకు, పంపిణీదారులకు మంచి లాభాలు సమకూర్చి పెట్టింది. ఈ మూవీ శతదినోత్సవం మద్రాస్‌లోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో కన్నుల పండువగా జరిగింది. హిందీ స్టార్ యాక్టర్ జితేంద్ర ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక సభకు డైరెక్టర్ వి. మధుసూదనరావు అధ్యక్షత వహించారు.

పాతికేళ్ల ఫ్యామిలీ ఫిల్మ్ 'మావిడాకులు'

  జగపతిబాబును ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో 'మావిడాకులు' కూడా ఒకటి. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. రవిబాబు నటునిగా పరిచయమైంది ఈ సినిమాతోటే. బెంగాలీ అమ్మాయి రచన నాయికగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం ఒక ప్లస్ పాయింట్. శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జె. భగవాన్, డీవీవీ దానయ్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జె. పుల్లారావు సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమా సరిగ్గా 25 ఏళ్ల క్రితం.. అంటే 1998లో మార్చి 20న విడుదలైంది. మావిడాకులు అనేవి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినవి. పండగలకు, పబ్బాలకు ఇంటి ద్వారాలను మావిడాకులతో అలంకరిస్తారు. వాటితో అలా అలంకరించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అలాగే పెళ్లిలోనూ మావిడాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ చిత్ర కథకూ, మావిడాకులకూ సంబంధం ఉంది. ప్రతాప్ ఆహా అనే టీవీ చానల్‌లో క్రియేటివ్ హెడ్‌గా వర్క్ చేస్తుంటాడు. పెళ్లైన కొద్ది కాలానికే భార్యతో విడాకులు తీసుకొని, పసిపాపను తనే పెంచుతుంటాడు. ఇంకోవైపు ప్రియ ఓహో అనే చానల్‌కు క్రియేటివ్ హెడ్. ఆమె హాస్పిటల్‌లో కొడుకును కనడం, కోర్టులో భర్తతో విడాకులు మంజూరవడం ఒకేసారి జరుగుతాయి. ఆహా, ఓహో చానళ్లు ఒకదానికొకటి పోటీ చానళ్లు కావడంతో ప్రతాప్, ప్రియ ఇద్దరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి కుస్తీలు పడుతుంటారు. ప్రతాప్ కూతురు పప్పీ, ప్రియ కొడుకు బబ్లూ ఇద్దరూ సింగిల్ పేరెంట్ లవ్‌తో విసిగిపోతుంటారు. తనకు తల్లి కావాలని ప్రియ, తనకు తండ్రి కావాలని బబ్లూ కోరుకుంటూ ఉంటారు. ప్రతాప్ మాజీ మామగారైన బాపినీడు ఎలాగైనా మాజీ అల్లుడికి ఇంకో పెళ్లిచెయ్యాలని కంకణం కట్టుకొని ఒక నాటకం ఆడతాడు. దాంతో ప్రతాప్, ప్రియ.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఇండాల్సి వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ, ప్రతాప్, ప్రియ.. ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఆ ఇద్దరికీ ఎలా పెళ్లి జరిగిందనేది మిగతా కథ. ప్రతాప్, ప్రియ మధ్య వృత్తిపరమైన పోటీతో వచ్చే స్పర్ధలు తొలిగి, ఆ ఇద్దరూ పరస్పరం దగ్గరయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే పిల్లల సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. ఆహా చానల్ ఓనర్‌గా ఏవీఎస్, ఓహో చానల్ ఓనర్‌గా తనికెళ్ల భరణి, లవంగం క్యారెక్టర్‌లో బ్రహ్మానందం.. అలాగే మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ కామెడీ క్యారెక్టర్లతో నవ్వించారు. ప్రతాప్ మాజీ మామగారు బాపినీడుగా కోట శ్రీనివాసరావు ఒక కీలక పాత్రలో సినిమాకు ఎస్సెట్ అయ్యారు. దాసరి నారాయణరావు సినిమా 'కల్యాణ ప్రాప్తిరస్తు'లో హీరోయిన్‌గా నటించిన కావ్య ఈ సినిమాలో ప్రతాప్‌ను ఆకట్టుకొని, అతడి భార్య కావాలని ఆశిస్తూ అతడి ఇంటికి పనిమనిషిగా వచ్చే మాధురి వ్యాంప్ తరహా పాత్రలో కనిపిస్తుంది. జగపతిబాబు, కావ్యలపై ఓ పాట కూడా ఉంది. బలభద్రపాత్రుని రమణి, ఈవీవీ సంయుక్తంగా కథ అందించిన ఈ సినిమాకు జనార్దన మహర్షి ప్రభావవంతమైన సంభాషణలు రాశారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా, కె. రవీంద్రబాబు ఎడిటర్‌గా, శ్రీనివాసరాజు ఆర్ట్ డైరెక్టర్‌గా తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. కోటి స్వరాలు కూర్చిన పాటలకు సీతారామశాస్త్రి, భువనచంద్ర, మధుఫల (పరిచయం) సాహిత్యం అందించారు. ఈ పాటలకు డీకేఎస్ బాబు, రాజు సుందరం, రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ సమకూర్చారు.

30 సంవత్సరాల మ్యూజికల్ హిట్ 'అల్లరి ప్రియుడు'

  యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అప్పటి దాకా రాజశేఖర్‌కు ఉన్న ఇమేజ్‌ను మార్చేసిన సినిమా 'అల్లరి ప్రియుడు'. ఆయనను కూడా రొమాంటిక్ హీరోగా జనం యాక్సెప్ట్ చేస్తారని ఆ సినిమాతోటే ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్‌కు తెలిసింది. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజశేఖర్ సరసన రమ్యకృష్ణ, మధుబాల నటించారు. హిందీలో అప్పటికే విడుదలై ఘన విజయం సాధించిన 'సాజన్' మూవీకి ఇది ఫ్రీమేక్. ఆ సినిమాలో మాధురీ దీక్షిత్ హీరోయిన్ కాగా, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఆమెను వలచే హీరోలుగా నటించారు. ఆ మూవీలో హీరోయిన్ రోల్ తెలుగులోకి వచ్చేసరికి హీరో అయితే, అందులోని హీరోలు తెలుగు మూవీలో హీరోయిన్లుగా మారిపోయారు. రాఘవేంద్రరావు సొంగ బ్యానర్ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై 'అల్లరి ప్రియుడు' మూవీని కె. కృష్ణమోహనరావు నిర్మించారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. 1993లో మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లలిత, కవిత ఫ్రెండ్స్. ఒకే రోజు పుడతారు. లలిత ఒక భవన నిర్మాణ మేస్త్రీ కూతురు అయితే, కవిత బిల్డర్ రంగారావు కూతురు. ప్రమాదంలో లలిత తండ్రి చనిపోతే, అనాథ అయిన ఆమెను తన ఇంటికి తెచ్చుకొని కవిత లాగే తన కన్న కూతురిగా పెంచుతారు రంగారావు దంపతులు. అలా సొంత అక్కచెల్లెళ్లుగా పెరిగిన లలిత (రమ్యకృష్ణ), కవిత (మధుబాల) ఒకరి కోసం మరొకరు ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. కవిత పేరుతో లలిత రాసిన కవితలు పత్రికల్లో పబ్లిష్ అయ్యి పాపులర్ అవుతుంటాయి. వాటిని ఫైవ్ స్టార్ మ్యూజిక్ ట్రూప్‌ను నడిపే రాజా (రాజశేఖర్) అనే గాయకుడు పాడుతూ పేరు తెచ్చుకుంటాడు. ఆ కవితలపై తన అభిమానం తెలియజేస్తూ ఉత్తరాలు కూడా రాస్తుంటాడు. అయితే వాళ్లు ముగ్గురూ కలిసిన సందర్భంలో ఆ కవితలను కవితే రాసిందంటూ రాజాకు పరిచయం చేస్తుంది లలిత. నిజమేననుకొని కవితకు దగ్గరవుతాడు రాజా. అయితే, కవితతో పాటు లలిత కూడా రాజాకు మనసిస్తుంది. అయితే ఒకరోజు తాను రాజను ప్రేమిస్తున్న విషయం లలితకు చెప్పేస్తుంది లలిత. ఖిన్నురాలైన లలిత తన ప్రేమను మనసులోనే దాచేసుకుంటుంది. ఒకానొక రోజు ఆ కవితలు రాసేది కవిత కాదనీ, లలిత అనీ రాజాకు తెలిసిపోతుంది. దాంతో రాజా ఏం చేశాడు? రాజాను లలిత గాఢంగా ప్రేమిస్తోందని తెలిసిన కవిత ఏం చేసింది? అనేది మిగతా కథ. ప్రధాన పాత్రల్లో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల చాలా బాగా రాణించి, రక్తి కట్టించారు. వారి మధ్య ముక్కోణ ప్రేమ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఒకరికొకరు ఎవరో తెలీనప్పుడు రాజశేఖర్, రమ్యకృష్ణ పడే గొడవలు, పరస్పరం తిట్టుకొనే తీరు ఆకట్టుకున్నాయి. రమ్యకృష్ణ గ్లామర్ అదనపు ఆకర్షణ. కీరవాణి స్వరాలు కూర్చగా వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, కీరవాణి రాసిన పాటలన్నీ ప్రజాదరణ పొంది, సినిమా విజయంలో కీలక భూమిక నిర్వహించాయి. రోజ్ రోజ్ రోజాపువ్వా, అందమా నే పేరేమిటి అందమా, ప్రణయమా నీ పేరేమిటి, ఏం పిల్లది ఎంత మాటన్నది, ఉత్తరాల ఊర్వశి, అహో.. ఒక మనసుకు నేడే, చెప్పకనే చెబుతున్నది.. పాటలను జనం తెగ పాడుకున్నారు. విశేషమేమంటే.. అంత దాకా డాన్స్ రాని హీరోగా పేరుపొందిన రాజశేఖర్ వేసిన స్టెప్పులు ముచ్చటగా అనిపించి ఆయనకు పేరు తెచ్చాయి. ఆ క్రెడిట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాదే అని చెప్పాలి. రాఘవేంద్రరావు చిత్రీకరించిన తీరు, అశోక్ కుమార్ కళా దర్శకత్వం, తండ్రీకొడుకులు విన్సెంట్, అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీతో ఆ పాటలు చూడచక్కగా ఉంటాయి. ఇవాళ మాస్ మహరాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోన్న రవితేజ ఈ మూవీలో రాజశేఖర్ మిత్రబృందంలో ఒకడిగా సైడ్ క్యారెక్టర్‌లో కనిపించడం గమనించదగ్గ విషయం. రాజశేఖర్ మ్యూజిక్ ట్రూప్ మేనేజర్ బిట్రగుంట బిళహరిగా బ్రహ్మానందం, వారు ఉండే ఇంటి ఓనర్‌గా బాబూ మోహన్ నవ్వులు పంచారు. రాజా మామ్మగా మనోరమ, పోస్ట్‌మాస్టర్‌గా సారథి, మంకీస్ అనే మ్యూజిక్ బ్యాండ్ నడిపే వాడిగా శ్రీహరి, రంగారావు మేనల్లుడు బుచ్చిబాబుగా సుధాకర్ తమ పాత్రల్ని చక్కగా పోషించి సినిమా విజయంలో తమ వంతు బాధ్యతల్ని నెరవేర్చారు.

శత దినోత్సవ చిత్రం 'కిరాయి కోటిగాడు'కు 40 ఏళ్లు!

  కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'కిరాయి కోటిగాడు' సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన సంగీతం ప్లస్సయ్యింది. వేటూరి సుందరరామ్మూర్తి కలం విన్యాసాలు చిందించిన పాటల్లో నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం, పట్టుమీద ఉన్నాది పాకాన పడ్డాది, కూడబలుక్కుని కన్నారేమో మీ అమ్మ మా అమ్మ, ఎక్కి తొక్కి నీ అందం ఎలాకిలా పడుతుంటే, చీకటెప్పుడవుతుందో శ్రీరామ.. ప్రజాదరణ పొందాయి. కిరాయికి ఎలాంటి పనైనా చేసే కోటిగాడిగా కృష్ణ అలరించిన ఈ చిత్రంలో నాయిక గౌరి పాత్రను శ్రీదేవి చేసింది. ఊరిని దోచుకుతింటూ, తమను ఎదిరించిన వాళ్లను పీడించే భూస్వాములు ఆదిశేషయ్య, గరుడాచలం పాత్రల్ని రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య చేశారు. అన్నాచెల్లెళ్లుగా శ్రీధర్ (రాంబాబు), అరుణ (లక్ష్మి), వాళ్ల తల్లిగా నిర్మలమ్మ కీలక పాత్రలు చేశారు. కిరాయికి ఎవరి చేతులు, కాళ్లనైనా విరిచేసే కిరాతకుడు అయిన కోటిగాడు ఎలా మంచివాడైపోయి, ఒక వూరివాళ్లకు మేలు చేశాడనేది ఈ చిత్రం తాలూకు ఇతివృత్తం. ఆదిశేషయ్య, గరుడాచలం అనే భూస్వాములు ఒక వూరిని దోచుకుంటూ ఉంటారు. వాళ్ల దాష్టీకాల్ని అడ్డుకోవాలని చూస్తాడు మిలిటరీలో పనిచేసి వచ్చిన రాంబాబు. అతడి అడ్డు తొలిగించుకోవాలని పట్నం నుంచి కోటిగాడిని కిరాయికి తీసుకొస్తారు ఆదిశేషయ్య, గరుడాచలం. రాంబాబుతో తలపడి అతడి కాలు విరిగిపోయేలా చేస్తాడు కోటిగాడు. రాంబాబు చెల్లెలు లక్ష్మిని శేషారావు మేనల్లుడు రేప్ చేయబోతే, అతడ్ని చావచితక్కొట్టి లక్ష్మిని కాపాడతాడు కోటిగాడు. అతడు స్వతహాగా మంచివాడేననీ, అతడిలోని మానవత్వాన్ని మేలుకొలిపి మంచివాడిగా మారిస్తే, మహాత్ముడవుతాడనీ రాంబాబు అంటే, ఆ పని చేయడానికి ముందుకొస్తుంది గౌరి. కోటిగాడిని గౌరి మంచివాడిగా ఎలా మార్చింది, కోటిగాడు ఎలా ఆదిశేషయ్య, గరుడాచలం ఆగడాలను అడ్డుకుని, ఊరికి ఉపకారి అయ్యాడనేది మిగతా కథ. కోటిగాడు క్యారెక్టర్‌లో కృష్ణ చెలరేగిపోయి ఎంత హుషారుగా నటించారో, శ్రీదేవీ అంత జోరుగా అభినయించారు. విలన్లుగా రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు బ్రహ్మాండంగా రాణిస్తే, శ్రీధర్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. జయమాలిని ఓ స్పెషల్ సాంగ్‌లో గిలిగింతలు పెట్టారు. సత్యమూర్తి రాసిన కథను చక్కని స్క్రీన్‌ప్లేతో కోదండరామిరెడ్డి తెరమీదకు తీసుకువచ్చారు. సత్యానంద్ కలం బలం ఏమిటో తెలియజేసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆయన రాసిన పదునైన సంభాషణలు సినిమాకి బలంగా మారాయి. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన 'కిరాయి కోటిగాడు' శత దినోత్సవం మద్రాస్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో అప్పటి బాలీవుడ్ స్టార్ జితేంద్ర, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, మూవీ మొఘల్ డి. రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ కృష్ణ అభిమానులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు.

జయలలితపై జమునకు ఎందుకు కోపం వచ్చింది?

  అల‌నాటి న‌టీమ‌ణులు జ‌మున‌, జ‌య‌ల‌లిత‌.. ఇద్ద‌రికి ఇద్ద‌రూ అభిమాన‌వంతులుగా పేరు పొందిన‌వాళ్లే. ఆత్మాభిమానం విష‌యంలో అంత త్వ‌ర‌గా వారు రాజీప‌డ‌రు. అందువ‌ల్లే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు జ‌మున‌తో అప్ప‌టి అగ్ర హీరోలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కొంత కాలంపాటు న‌టించ‌లేదు. ఆ విష‌యం అలా ఉంచితే, ఒక సంద‌ర్భంలో జ‌య‌ల‌లిత‌తో జ‌మున‌కు గొడ‌వ వ‌చ్చింది. ఆ సంద‌ర్భం.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన 'శ్రీ‌కృష్ణ విజ‌యం' (1971) సినిమా సెట్స్ మీద సంభ‌వించింది. క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు డైరెక్ట్ చేసిన 'శ్రీ‌కృష్ణ విజ‌యం'లో శ్రీ‌కృష్ణునిగా నంద‌మూరి తార‌క‌రామారావు న‌టించ‌గా, హీరోయిన్ వ‌సుంధ‌ర పాత్ర‌లో జ‌య‌ల‌లిత‌, స‌త్య‌భామ పాత్ర‌లో జ‌మున న‌టించారు. కౌముది ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మ‌ల్లెమాల సుంద‌ర‌రామిరెడ్డి (ఎం.ఎస్‌. రెడ్డి) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక‌రోజు జ‌య‌ల‌లిత‌, జ‌మున‌కు డైరెక్ట‌ర్ కామేశ్వ‌ర‌రావు రిహార్స‌ల్స్ నిర్వ‌హించారు. మొద‌ట జ‌య‌ల‌లిత డైలాగ్ చెబితే, త‌ర్వాత దానికి స‌మాధానంగా జ‌మున డైలాగ్ చెప్పాలి. అందుక‌ని జ‌య‌ల‌లిత‌ను డైలాగ్ చెప్ప‌మ‌న్నారు జ‌మున‌. ఆమె "నేనెందుకు చెప్పాలి?  మీరే చేసుకోండి" అని నిర్ల‌క్ష్యంగా జ‌వాబిచ్చారు. జ‌మున‌కు కోపం వ‌చ్చింది. "ఏంటండీ డైరెక్ట‌ర్ గారూ.. ఆ అమ్మాయి డైలాగ్ చెప్ప‌క‌పోతే, నేనెట్లా రిహార్స‌ల్ చెయ్య‌ను. ఆమె చెప్పాలి క‌దా?" అని అడిగారు జ‌మున‌. ఆయ‌న ఏం మాట్లాడ‌లేదు.  జ‌మున విసురుగా త‌న మేక‌ప్‌రూమ్‌లోకి వెళ్లిపోయారు. జ‌య‌ల‌లిత అక్క‌డే కూర్చున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇద్ద‌రూ జ‌మున ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఆరోజు షూటింగ్ చేయ‌కుండా వెళ్లిపోవాల‌ని మేక‌ప్ తీసేయ‌డానికి రెడీ అయ్యారు జ‌మున‌. ఆ ఇద్ద‌రూ ఆమెకు స‌ర్దిచెప్పి, ఎలాగో ఉంచేశారు. ఈ ఉదంతాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించారు జ‌మున‌. ఆ త‌ర్వాత కాలంలో తాను, జ‌య‌ల‌లిత స‌న్నిహిత స్నేహితుల‌మ‌య్యామ‌ని కూడా ఆమె చెప్పారు.

హాస్యం కంటే శృంగారం గొప్ప‌దంటూ అక్కినేని చెప్పిన క‌ప్ప‌ క‌థ‌!

న‌వ‌ర‌సాల్లో శృంగార ర‌సం, హాస్య ర‌సం చాలా గొప్ప‌వంటారు. అయితే ఈ రెండింటిలోనూ శృంగార ర‌సం మ‌రింత గొప్ప‌దంటారు మ‌హాన‌టుడు దివంగ‌త అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఒక‌సారి శృంగార‌, హాస్య ర‌సాల్లో ఏది గొప్ప‌ద‌నే వాద‌న వ‌చ్చిన‌ప్పుడు "హాస్య‌ర‌సం చాలా మంచిది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుంచి రిలీవ్ కావాలంటే హాస్య‌ర‌సం కావాలి." అని చెప్తూనే, ఒక సంఘ‌ట‌న పంచుకున్నారు. అక్కినేనికి మార్నింగ్ వాక్ త‌ర్వాత కిచెన్ గార్డెన్‌లో కొంచెంసేపు ప‌నిచెయ్య‌డం అల‌వాటు. అలా ప‌నిచేస్తుండ‌గా ఒక‌చోట ఒక క‌ప్ప క‌నిపించింది. దాన్ని తొల‌గించి, అక్క‌డ శుభ్రం చెయ్యాల‌నుకున్నారు. అది క‌ద‌ల్లేదు. ఒక పుల్ల తీసుకువ‌చ్చి, దాన్ని పొడిచారు. అయినా అది క‌ద‌ల్లేదు. గ‌ట్టిగా ఉన్న ఆకులాంటిది తీసుకువ‌చ్చి, దాన్ని తీసేశారు. "అప్పుడేమైందంటే.. ఆ క‌ప్ప‌కింద అప్పుడే ప్ర‌స‌వించిందో, పెట్టిందో.. దాని చిన్న‌పిల్ల‌లు.. క‌ప్ప‌పిల్ల‌లు క‌నిపించాయి. వాటిని చూసి నా క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. దీన్ని ఎంత డిస్ట్ర‌బ్ చేశాను నేను. ఆ త‌ల్లిప్రేమ ఎలాంటిది. అయ్య‌య్యో.. నేనెంత పొర‌పాటు పని చేశాను. అని బాధ‌ప‌డ్డాను. ఆ వెంట‌నే తెలియ‌కుండా చేస్తే త‌ప్పులేదు క‌దా అని స‌రిపెట్టుకున్నాను." అని చెప్పారు. అప్పుడాయ‌న అనుభ‌వించింది క‌రుణ‌ర‌సం. "కానీ ఆ త‌ల్లిప్రేమ ఉండ‌టానికి కార‌ణం, ఆ ప్రేమ ఉద్భ‌వించ‌డానికి కార‌ణం, ఆ పిల్ల‌లు పుట్ట‌డానికి కార‌ణం శృంగార ర‌స‌మా.. హాస్య ర‌స‌మా.. చెప్పండి. అందుచేత ఫ‌స్ట్ మార్క్ ఎన్న‌టికీ శృంగారానికే. హ్యాట్సాఫ్ టు రొమాన్స్‌. ద‌టీజ్ ల‌వ్." అని చెప్పారు అక్కినేని. అందుకే కాబోలు తెర‌పై శృంగార ర‌సాన్ని అద్భుతంగా ఆయ‌న ఆవిష్క‌రించేవారు. నేడు అక్కినేని వర్థంతి