జగన్ కేంద్రంలో నీ ఓటు ఎటు?

      తెలంగాణ ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని తీసుకోలేదని చాలామందికి సుస్పష్టం. మరి ఏమి ఆశించి విభజన నిర్ణయాన్ని తీసుకుంది?వరుసగా రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకుని,మూడవసారి ఎన్నికలలో గెలవాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజల వ్యతిరేకతను అధిగమించటానికి రాష్ట్రంలో విభజన నిర్ణయాన్ని తీసుకుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.     విభజన వలన తెలంగాణలో టి.ఆర్. ఎస్ ని కలుపుకుని గెలవవచ్చునని,ఆంద్ర రాయలసీమ ప్రాంతంలో వై.యస్.ఆర్.సి.పి గెలుస్తుందని,ఎన్నికల తరువాత వారు కేంద్రంలో యు.పి.ఎ ని సపోర్ట్ చేస్తారని అనే ధీమాతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ జైలుకు వెళ్లకముందు ఆయన తల్లి విజయమ్మ బి.జె.పి ని సమర్ధించటం,కేంద్రం లో యు.పి.ఏ  ని బలపరుస్తామని చెప్పటమే ఈ అభిప్రాయానికి కారణమా?                        మరి మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా ఆంద్ర రాయలసీమ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్న ఈ సందర్భంగా కూడా వై.ఎస్.ఆర్.సి.పి 2014 ఎన్నికల తరువాత విభజిస్తే కేంద్రంలో యు.పి.ఎ  ని సమర్ధిస్తారా అనేది ప్రజలకు తెలియవలసి ఉంది. వై.ఎస్.ఆర్.సి.పి ఈ విషయంలో మరొకసారి స్పష్టంగా చెప్పని పక్షంలో ఈ విభజన కుట్రలో వై.ఎస్.ఆర్.సి.పి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా రాష్ట్ర విభజన జరిగితే 2014 తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.ఆర్.సి.పి సమర్ధిస్తుందా  అని ఎందుకు నిలదీయదు?

జగన్ కేసులో ఆఖరి చార్జ్ షీట్లు నేడే

  వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ ఈ రోజు ఆఖరి చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో దాఖలుచేయబోతోంది. ఇదే విషయం కోర్టుకి ముందే తెలియజేసి అందుకు కోర్టు అనుమతి కూడా పొందింది. రేపు కోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణకు స్వీకరించబోతున్నందున, సీబీఐ ఈ రోజే దానిపై కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.   నేటితో సీబీఐ తుది చార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం పూర్తవుతుంది గనుక, సీబీఐ ఈసారయినా జగన్మోహన్ రెడ్డి బెయిలుకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అంగీకరిస్తుందా లేక మళ్ళీ అడ్డుపడుతుందా అనేది సంగతి రేపు కోర్టులో విచారణ మొదలయినప్పుడు తేలిపోవచ్చును. కానీ తెదేపా, వైకాపాలు జగన్ బెయిలు విషయంలో ఒకరిపై మరొకరు చేసుకొంటున్నఆరోపణలను గమనిస్తే, అతని బెయిలు సంగతి సీబీఐ కోర్టులో కాక డిల్లీలో నిర్ణయించబడుతుందనే అపోహ ప్రజలలో కలుగుతోంది.

ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు ఫైర్

  ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దమంటూ తెలంగాణా న్యాయవాదులు వేసిన పిటిషనుపై హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇంత కాలంగా సమ్మె జరుగుతున్నాసమ్మెను విరమిమ్పజేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అయితే సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘనేతలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, కానీ అవి ఫలించలేదని ప్రభుత్వ న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అయితే సమ్మె చేస్తున్నఉద్యోగులపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో చెప్పాలంటూ గట్టిగా అడిగింది. ప్రభుత్వం ఈ కేసులో వాయిదాలు కోరినట్లయితే వారానికి రూ.2లక్షలు జరిమానా వేస్తామని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వమే స్వయంగా సమ్మెను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టులో ఈ కేసుపై ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నాయి.

కావూరికి సమైక్య సెగ

      కావూరి సాంబశివరావు ఇంటిని సమైక్య వాదులు ముట్టడించారు. వీరిలో సమైక్యవాదం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు కూడా ఉన్నారు. సీమాంధ్రను ఎడారి చేసే తెలంగాణ విభజన ప్రకటన వచ్చి యాభై రోజులు కావస్తున్నా కనీసం రాజీనామా చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో దిగి ఇంటికి వెళ్తున్న కావూరిని ఎయిరు పోర్టులో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసుల జోక్యంతో తప్పించుకున్నారు. మళ్లీ కలపర్రు గ్రామం వద్ద సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు. దీంతో వాహనాలు ముందుకు కదలకుండా ఆగిపోయాయి. ఇక చేసేది లేక కావూరీ పోలీసుల రక్షణతో వేరే కారులో వెళ్లిపోయారు. అయినా సమైక్యవాదులు శాంతించలేదు. ఆయన ఇంటిని ముట్టడించారు. కావూరి ఇంట్లో ఫర్నీచరు ధ్వంసం చేశారు. రాజీనామా చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇంతలో కావూరి వర్గం సమైక్యవాదులపై గొడవకు దిగింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని కావూరి సాంబశివరావు మీడియాతో చెప్పారు. విభజన వల్ల నష్టాలు ఎక్కువే అన్నారు.

జగన్ వెనుక కాంగ్రెస్

    వైఎస్ఆర్. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుపై మరోసారి పోరాడేందుకు టిడిపి పార్టీ ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఒకటి గంటలకు ఈడి, సాయంత్రం ఐదు గంటలకు సిబిఐ డైరెక్టర్‌తో ఎంపీలు భేటీ కానున్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని కోరనున్నారు.     జగన్ ఆస్తుల కేసు విషయమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను కలిసిన అనంతరం ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు మాట్లాడారు. జగన్ కేసు దర్యాఫ్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. హవాలా మార్గంలో నల్లధనంపై ఆరోపణలు వస్తే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాము సివిసి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. దర్యాఫ్తును వేగవంతం చేసేందుకు విచారణ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణలో తేలిన అక్రమాస్తులకు, జప్థు చేసిన ఆస్తులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలిసిపోతాయని భావిస్తున్న విధంగానే జరుగుతోందని నామా వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ విమోచన దినం

      సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను స్వర్గీయ నందమూరి తారక రామారావే తొలగించారన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘటన టిడిపిదే అన్నారు. తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు టిడిపితోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. హైదరాబాదు చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని టిడిపి మొదటి నుండి వ్యతిరేకిస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భూములు అమ్ముతుంటే తెలంగాణపై ఇప్పుడు మాట్లాడే నేతలు అప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆ మాట ప్రజల అని చూడండి: అశోక్ బాబు

  ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ “సీమాంధ్ర నేతలని ఎవరూ రాజీనామా చేయమని అడగనందున రాజీనామాలు చేయడం లేదని అంటున్నది నిజమయితే వారు తమ నియోజక వర్గంలో బహిరంగ సభలు పెట్టుకొని అదే మాటని ప్రజల వద్ద అంటే దానికి ఏవిధంగా స్పందించాలో ప్రజలే నిర్ణయిస్తారు,” అని అన్నారు.   ఈ నెల 30వరకు ఉద్యమాలు మరింత తీవ్రతరం చేసి ఆ తరువాత ఎన్జీవో నేతలందరూ మరో మారు సమావేశమయ్యి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. ఈ నెల 23 నుండి 30వరకు సీమాంధ్రలో విద్యాసంస్థల బంద్ కుఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 24న సీమాంధ్ర బంద్ కు, 25, 26 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సర్వీసుల బంద్ కు ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికల తరువాతనే తెలంగాణా: రేణుకా చౌదరి

  మొన్న ఆదివారం హైదరాబాదులో వాడివేడిగా సాగిన టీ-కాంగ్రెస్ నేతల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ రానున్నఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చునని చెప్పడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.   “గత 60సం.లుగా హైదరాబాదుతో అనుబంధం పెనవేసుకొన్న సీమాంధ్ర ప్రజలు, విభజన సందర్భంగా హైదరాబాదును వదులుకోవలసి వస్తుందని ఆందోళన చెందడం సహజం. ఆ ఆందోళనతోనే వారు ఉద్యమాలు చేస్తున్నారు. అందువలన వారిని పూర్తిగా తప్పు పట్టలేము. అయితే ఈ పరిణామాల వలన రాష్ట్ర విభజనలో కొంత జాప్యం జరుగుతున్నంత మాత్రాన్న మనం కూడా ఆందోళన చెందనవసరం లేదు. దైర్యం కోల్పోనవసరం లేదు. తెలంగాణా ఏర్పాటులో కొంత ఆలస్యం జరగవచ్చునేమో గానీ ఈ విషయంలో అధిష్టానం ఇక వెనక్కి తగ్గబోదని మనకి తెలుసు. హైదరాబాద్ అంశంపై ఉన్న చిక్కుముడులు విప్పేందుకు మరికొంత సమయం పట్టవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము,” అని అన్నారు.   సమావేశంలో ఆమె పాల్గొనడాన్ని నిరసించిన పొన్నం ప్రభాకర్ కి ఆమె పరోక్షంగా చురకలు వేసారు. “నేను ఇంతవరకు ఏది మాట్లాడినా పార్టీకి అనుకూలంగానే మాట్లాడాను తప్పఇతర పార్టీనేతలతో చేతులు కలపలేదు,” అన్నారు.

బీజేపీకి మోడీ, కాంగ్రెస్ రాహుల్ యావ

  ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు అర్ధం అవుతోంది. రానున్న ఎన్నికలలో ఎలాగయినా అధికారం చేజిక్కించుకోవాలని తపిస్తున్న బీజేపీ నరేంద్రమోడీని పార్టీ రధ సారధిగా చేసుకొని విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఇక అధికారం ఎలాగయినా నిలబెట్టుకొని వచ్చే ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ఆరాట పడుతోంది. అధికారం చేజిక్కించుకోవడమే ఏకైక ఎజెండా చేసుకొని తదనుగుణంగానే ఈ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. అదేవిధంగా రాహుల్, మోడీల ప్రధాని మంత్రి అభ్యర్దిత్వమే జాతీయ సమస్య అన్నట్లు రెండు పార్టీలు చర్చిస్తున్నాయి, తప్ప దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించే తీరిక, శ్రద్ద వారికి లేకుండాపోయింది.    రాష్ట్ర విభజన విషయంలోకూడా ఈ రెండు పార్టీలు దాదాపు అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించి, ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, తెరాస, వైకాపాలను దెబ్బతీసి ఎన్నికలలో చక్రం తిప్పాలని కాంగ్రెస్ భావిస్తే, ముందు విభజనకు వత్తాసు పలికిన బీజేపీ దానివల్ల తనకెటువంటి ప్రయోజనమూ ఉండదని గ్రహించగానే వెనక్కి తగ్గడమే కాకుండా, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ఇవ్వమని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ముందుకు వెనక్కు వెళ్ళకుండా అడ్డుపడుతోంది. రెండు పార్టీలు కూడా ఏవిధంగా ముందుకు వెళితే రాష్ట్రంలో తమకు ప్రయోజనం కలుగుతుందా అని ఆలోచిస్తున్నాయి తప్ప, రాష్ట్ర ప్రజల సమస్యలు, వారి మనోభాలను మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ యావ, బీజేపీకి మోడీ యావ!

మిస్ అమెరికా-2014పై అమెరికన్ల ఆగ్రహం

  తెలుగమ్మాయి నీనా దావులూరి మిస్ అమెరికా-2014గా ఎంపికయినందుకు భారతీయులు ముఖ్యంగా తెలుగువాళ్ళు సంతోషిస్తుంటే, కొందరు అమెరికావాసులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మిస్ అమెరికా’ అంటే అమెరికాకు చెందిన అమ్మాయే అయ్యుండాలని అనేకమంది ట్వీట్ చేసారు. నీనా అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి విద్యాభ్యాసం చేసినందున ఆమె చట్టప్రకారం అమెరికన్ అయ్యి ఉండవచ్చును కానీ ఆమెను మిస్ అమెరికాగా అంగీకరించలేమని అనేకమంది ట్వీట్ చేసారు. మరికొంత మంది ఆమె ఎంపికను అమెరికాపై తాలిబాన్ ఉగ్రవాదుల దాడితో కూడా సరిపోల్చారు. అయితే చాలా మంది ఇది అమెరికా యొక్క విశాల దృక్పదానికి చక్కటి నిదర్శనమని అబిప్రాయపడ్డారు. నీనా వైద్యవిద్యను పూర్తి చేసుకొని వైద్యురాలిగా స్థిరపడాలని భావిస్తున్నారు. ఈపోటీల్లో ‘మిస్ కాలిఫోర్నియా’ క్రిస్టల్ లీ ఫస్ట్ రన్నర్ అప్‌గా, ‘మిస్ ఒక్లహామా’ కెల్సీ గ్రిస్‌వోల్డ్ సెకండ్ రన్నర్అప్‌గా నిలిచారు.

అవును అందుకే ఢిల్లీకి వెళ్ళేది

  జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుకోనేందుకే చంద్రబాబు డిల్లీ యాత్రకు బయలుదేరుతున్నారని ఇంతవరకు వైకాపా ఆరోపించడం, దానిని తెదేపా నేతలు ఖండించడం రోజువారి వార్తలుగా మారిపోయాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ యంపీలను, సభ్యులను వెంటబెట్టుకొని సీబీఐ, ఈడీ తదితరులందరినీ కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో పిర్యాదులు చేయబోతున్నట్లు వస్తున్నవార్తలు, ఇక ఈ ముసుగులో గుద్దులాటలు అవసరం లేకుండా చేసాయి. చంద్రబాబు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సమాజంపై ఆర్ధిక అత్యాచారం చేసిన నేరగాడని, అతని కేసు కూడా నిర్భయ అత్యాచార కేసు వంటిదేనని, అందువల్ల అతనికి ఉరి శిక్షవేసినా తక్కువేనని ఆయన అన్నారు. ఈ నేపద్యంలో చంద్రబాబు డిల్లీ వెళ్లి సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను ఎందుకు కలవాలనుకొంటున్నారో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.   అయితే, తెదేపా మాత్రం తాము ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో, సమైక్యాంధ్ర ఉద్యమాలు, హైదరాబాద్ వంటి పలు అంశాల గురించి వారికి వివరించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని కోరేందుకే డిల్లీ వెళుతున్నామని చెపుతున్నారు.

మోపిదేవికి బెయిలు మంజూరు

  మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వచ్చేనెల 31వరకు వైద్యం కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేవలం వైద్యం కోసమే బెయిలు మంజూరు చేస్తున్నందున ఈ సమయంలో బయట వ్యక్తులను ఎవరినీ కలువరాదని, అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేయరాదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు సూచించింది. ఈ షరతులలో దేనిని ఉల్లంఘించినా బెయిలు రద్దు చేస్తామని హెచ్చరించింది. మోపిదేవిని మళ్ళీ నవంబర్ 1న పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.   ఇక జగన్మోహన్ రెడ్డి తనకు ఇంటి నుండి భోజనం తెప్పించుకొనేందుకు అనుమతించాలని కోర్టుకు పెట్టుకొన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను బుధవారంనాడు విచారణకు వస్తుంది. ఆ రోజే సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో బాటు, అక్రమాస్తుల కేసులో ఆఖరి రెండు చార్జ్ షీట్లు దాఖలు చేయనుంది.

తెదేపా నేతలకి షర్మిల సూటి ప్రశ్న

  తెదేపా, వైకాపా నేతలలో ఎప్పుడు ఎవరు డిల్లీ బయలుదేరుతున్నారెండో పార్టీ నేతలు దానిపై వివాదం రేకెత్తించడం రివాజుగా మారిపోయింది. అయితే ఆ రెండు పార్టీ నేతలు కూడా ‘కాంగ్రెస్ పార్టీతో మీరు కుమ్మక్కయ్యారంటే మీరే’ అని వాదులాడుకొంటూ ప్రజలకి మంచి కాలక్షేపంతో బాటు కొత్త అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. కానీ, ఇందులో మూడో పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈవాదప్రతివాదనలు, ఆరోపణలపై ఎన్నడూ స్పందించకపోవడం విశేషం.   ఇక తల్లి, పిల్ల కాంగ్రెస్ కలయిక అనివార్యమని బల్ల గుద్ది చెపుతున్నతెదేపా నేతలకు వైకాపా నేత షర్మిల ఒక సూటి ప్రశ్న అడిగారు. తెదేపా చెపుతున్నట్లు తాము కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యి ఉండి ఉంటే, తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి 16నెలల్లుగా జైల్లో మ్రగ్గేవాడా? కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఉంటే ఏనాడో కేంద్ర మంత్రి అయ్యి ఉండేవారు కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పడు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుపడేందుకే పనిగట్టుకొని డిల్లీ బయలుదేరుతున్నారని ఆమె ఆరోపించారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీతో ఎవరు చేతులు కలుపుతున్నారో అందరికీ అర్ధం అవుతోందని ఆమె అన్నారు.   అయితే, వైకాపా, కాంగ్రెస్ పార్టీతో ఎన్నడూ చేతులు కలపదని, కాంగ్రెస్ లో విలీనం కాదని షర్మిల హామీ ఇవ్వగలరా? అని తెదేపా నేతలు ఎదురు ప్రశ్నించారు.

అద్వానికి ఆఫ‌ర్ ఇచ్చిన బిజెపి..?

  మోడిని ప్రదాని అభ్యర్ధిగా ప్రక‌టించ‌టంతో అలిగి పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉన్న ఎల్‌కె అద్వాని ఒక్కసారిగా యు ట‌ర్న్ తీసుకున్నారు. మోడి అభివృద్దికి కెరాఫ్ అడ్రస్ అంటూ పొగ‌డ్తల‌తో ముంచెత్తారు. అయితే నిన్నటి వ‌ర‌కు బెట్టు చేసిన ఈ రాజ‌కీయ కురువృద్దుడు ఇలా ఒక్కసారిగా మారిపోవ‌టం వెనుక పెద్ద కార‌ణమే ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో మోడి సార‌ధ్యంలోని బిజెపి పార్టీ విజ‌యం సాదించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని భావిస్తున్న పార్టీ వ‌ర్గాలు. మోడి ప్రదాని అయితే అద్వానికి కూడా ఓ అత్యున్నత ప‌ద‌వి అందించే ఆలోచ‌న ఉన్నాయి బిజెపి వ‌ర్గాలు. అయితే ప్రదాని ప‌ద‌వికి మించిన ఆ స్థానం ఏంటా అన్నదే ఇప్పుడు అస‌లు చ‌ర్చ. గ‌తంలో ఇలాగే ప్రదాని పీఠం మీద ఆశ‌ప‌డి అది అంద‌క భంగ ప‌డిన రాజ‌కీయ కురువృద్దుడు ప్రణ‌బ్ ముఖ‌ర్జీ. అయితే ప్రదాని కూర్చిలో కూర్చోక పోయిన త‌న అనుభ‌వంతో రాష్ట్రప‌తిగా అత్యున్నత స్థానంలో ఉన్నారు ప్రణ‌బ్‌. ప్రస్థుత ప‌రిణామాలు చూస్తుంటే అద్వాని ముందున్న ఆఫ‌ర్ కూడా అదేనేమో అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు. అందుకే ఒక్కసారిగా అద్వానీ యుట‌ర్న్ తీసుకున్నారంటున్నారు.

బెయిల్ కోసం ఆశారాం అడ్డగోలు వాద‌న‌

  16ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేదింపులకు పాల్పడి, ప్రస్తుతం జైళు ఊచ‌లు లెక్కపెడుతున్న ఆద్యాత్మిక గురువు ఆశారాం బాపు, బైలు కోసం రక‌ర‌కాల పాట్లు పడుతున్నాడు. ఆశారాం త‌రుపున ఈ కేసు వాదిస్తున్న 90 ఏళ్ల సీనియ‌ర్ లాయ‌ర్ రాంజెఠ్మాల‌ని వింత వాద‌న‌ల‌ను తెర మీద‌కు తీసుకువ‌స్తున్నాడు. ఆశారాం పై ఆరోప‌ణ‌లు చేసిన అమ్మాయి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేద‌న్న జెఠ్మాలాని ఆ కార‌ణంగానే ఆ అమ్మాయి ఆశారాంపై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు చేసింద‌న్నారు, త‌న క్లైంట్‌కు ఎలాంటి పాపం తెలియ‌నందున ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని వాదించారుర. అయితే ఈ కేసులో బాధితురాలి త‌రుపున వాధిస్తున్న లాయ‌ర్ త‌న క్లైంట్‌కు ఆశారాం త‌రుపునుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌న్నారు అందుకు ఆదారంగా కాల్ రికార్డింగ్స్‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పించారు. వారి వాద‌న‌తో ఏకీభ‌వించిన కోర్టు ఆశారాం బెయిల్ పిటీష‌న్‌ను తిర‌స్కరించింది. దాంతో పాటు ఆయ‌న రిమాండ్ గ‌డువును ఈ నెల 30 వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అలక వీడిన ఎల్‌కె.అద్వానీ

      భారతీయ జనతాపార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఎట్టకేలకు అలక వీడారు. బీజేపీ ఎన్నికల ప్రచారసారథి, ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. చత్తీస్‌గడ్, కోర్బా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అద్వానీ మాట్లాడుతూ మోడీ హయాంలో గుజరాత్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. గ్రామీణ విద్యుత్‌ను ఆధునీకరించారని, పల్లెల్లో విద్యుత్ కాంతులు నింపిన ఘనత ఆయనదేనని అద్వానీ పొగడ్తలతో ముంచెత్తారు. గ్రామీణాభివృద్ధికి నరేంద్ర మోడీ చేసిన కృషి అభినందనీయమని అద్వానీ పేర్కొర్నారు. రాజస్థాన్‌లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పంచాయితీల ఆదాయం కోసం ప్రభుత్వ సంస్థల మధ్య పంచాయితీ

  సీమాంధ్ర నేతలు చెపుతున్నట్లు రాష్ట్ర విభజన జరిగితే ఆదాయ పంపకాలు, నీటియుద్దాలు వగైరాలనీ ఒట్టి అపోహలేనని తెలంగాణా వాదులందరూ చాలా గట్టిగానే వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.యం.డీ.ఎ.) మరియు గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ (జీ.హెచ్.యం.సీ.) సంస్థల మధ్య 36 పంచాయితీల ఆదాయం కోసం జరుగుతున్నయుద్ధం గమనిస్తే సీమాంధ్ర నేతల వాదనలు నిజమేనని నమ్మక తప్పదు.   2007లో గ్రేటర్ హైదరాబాదు పరిధిని శివార్లలో ఉన్న36 పంచాయితీలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకొన్నపటి నుండి ఈ యుద్ధం మొదలయింది. ఈ 36 పంచాయితీల నుండి దాదాపు రూ. 200కోట్లు వివిధ పన్నుల రూపంలో సాలీనా ఆదాయం లభిస్తుంది. ఇంత కాలంగా తమ అధీనంలో ఉన్నఆ 36 పంచాయితీల పరిధిలో గల 10 మునిసిపాలిటీల నుండి గత ఆరు సంలుగా జీ.హెచ్.యం.సీ. వసూలు చేసిన రూ.1200 కోట్ల డెవెలప్మెంట్ చార్జీలను కక్కమని హెచ్.యం.డీ.ఎ. అధికారులు ఒక లేఖ వ్రాసారు. ఒకవేళ అందుకు అంగీకరించని పక్షంలో ఇక ముందు తమకు సదరు పంచాయితీ పరిధిలో డెవెలప్మెంట్ చార్జీలను వసూలు చేసుకొనే హక్కు ఇప్పించాలని ప్రభుత్వానికి కూడా ఒక లేఖ వ్రాసారు.   హెచ్.యం.డీ.ఎ. కమీషనర్ నీరభ్ కుమార్ “2007లో ప్రభుత్వం ఈ10 మునిసిపాలిటీలను జీ.హెచ్.యం.సీ.లో విలీనం చేస్తూ జారీచేసిన జీఓలో జీ.హెచ్.యం.సీ.కి ఆయా ప్రాంతాలలో డెవెలప్మెంట్ చార్జీలను వసూలు చేసుకొనే అధికారం ఇచ్చినప్పటికీ, ఆ మొత్తాన్ని హెచ్.యం.డీ.ఎ. ఖాతాలో జమా చేయాలని స్పష్టంగా పేర్కొందని” అన్నారు.   కానీ, జీ.హెచ్.యం.సీ. పంచాయతీల విలీనం పట్ల చూపిన ఆసక్తి అ తరువాత వసూలయిన మొత్తాన్ని హెచ్.యం.డీ.ఎ. ఖాతాలో జమా చేయడంలో మాత్రం చూపలేదని ఆయన ఆరోపించారు. డెవలప్మెంట్ చార్జీల పేరిట వసూలయిన మొత్తం అంతా జీ.హెచ్.యం.సీ. వాడుకొంటోందని, న్యాయంగా తమకు రావలసిన మొత్తం తమ ఖాతాలో జమ చేసినట్లయితే కేవలం హెచ్.యం.డీ.ఎ. పరిధిలోనే గాకుండా జీ.హెచ్.యం.సీ. పరిధిలో ఉండే ప్రాంతాలలో కూడా అవసరమయిన మౌలిక వసతులు కల్పించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.   అయితే, జీ.హెచ్.యం.సీ. చీఫ్ సిటీ ప్లానర్ జీ.వీ. రఘు మాత్రం ఆయన వాదనలతో ఏకీభవించట్లేదు. 10 మునిసిపాలిటీలలో తమ సంస్థ వసూలు చేస్తున్నడెవెలప్మెంట్ చార్జీలతో ఇంతవరకు హెచ్.యం.డీ.ఎ. చేస్తున్నపనినే ఇప్పుడు జీ.హెచ్.యం.సీ. చేస్తోందని, అందువల్ల తాము ఎవరికీ డబ్బు వాపసు చేయవలసిన అవసరం లేదని అన్నారు.

చంద్రబాబు ఆస్తుల విలువ 42 లక్షలు

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలను తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ. 42.06 లక్షలు, తన భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ ముప్పై మూడు కోట్లు అని ఆయన చెప్పారు. తన కుమారుడు లోకేష్ ఆస్తుల విలువ నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు, తన కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలువ మూడు కోట్ల ముప్పైలక్షల రూపాయలని చంద్రబాబు పేర్కొన్నారు. హెరిటేజ్ కంపెనీ ఈ ఏడాది 30 శాతం డివిడెండ్ చెల్లించినట్లు ఆయన తెలిపారు. తాను ప్రకటించినవి కాకుండా ఇంకా ఎలాంటి ఇతర ఆస్తులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే అందులో వారికి ఆస్తుల్లో పెర్సంటేజ్ ఇస్తానని చంద్రబాబు సవాల్ చేశారు.

జగన్ పై సిబిఐ ఫైనల్ ఛార్జీషీట్

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన సిబిఐ నేడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశం వుంది. దీనిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్, కోల్‌కతా బేస్డ్ సూటుకేసు కంపెనీలు, సండూరు పవర్ వంటి అంశాలు ఉండనన్నాయని తెలుస్తోంది. ఇప్పటికె ఈ కేసులో సిబిఐ ఎనిమిది ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.   చివరి ఛార్జీషీటులో మంత్రి గీతా రెడ్డి భవిష్యత్ కూడా తేలే అవకాశాలున్నాయంటున్నారు. సండూర్ పవర్, లేపాక్షి గీతా రెడ్డిని సాక్షిగా సిబిఐ ప్రస్తావించే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల దాఖలు సిమెంట్స్ అంశంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ సాక్షిగా ప్రస్తావించింది. తుది ఛార్జీషీటులో గీతా రెడ్డిని కూడా సాక్షిగానే పేర్కొనే అవకాశాలున్నాయని అంటున్నారు. వారు ఈ ఛార్జీషీటును ఇవాళ రేపట్లో దాఖలు చేసే అవకాశాలున్నాయి.