రాజీనామాల అవసరం లేదు: జేసీ

      రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసేందుకు సీమాంధ్ర నేతలంతా సిద్దంగా వున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే ప్రస్తుతం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బిల్లును శాసనసభలో తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వం పడిపోయే స్థితి లేనందువల్ల ఎంపీలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, ఎంపీలు రాజీనామా చేసిన తమపై ఒత్తిడి రాదని అన్నారు.     ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందువల్లనే రాజీనామాలపై వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. అందరం కలిసి త్వరలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రితో మళ్లీ రాజీనామాల అంశంపై మాట్లాడుతామని ఆయన చెప్పారు.

ఎన్ఐసీ నుంచి చంద్రబాబు నాయుడు వాకౌట్

      దేశంలో భద్రతాచర్యలపై ఇవాళ ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం జరిగింది. ఈ సమావేశాన్ని హాజరైన చంద్రబాబు వాకౌట్ చేశారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు.     అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

టీ-సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిర్భావం

  రాష్ట్ర విభజన కంటే ముందుగానే తెలుగు సినీపరిశ్రమ రెండుగా చీలిపోయింది. తెలంగాణా నిర్మాతలు, సినిమా పంపిణీదారులు, ప్రదర్శకులు మరియు స్టూడియో యజమానులు కలిసి కొద్ది నెలల క్రితం పెట్టుకొన్న దరఖాస్తుని రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ హైదరాబాద్ ఆమోదించడంతో ‘తెలంగాణా సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్’ (రిజిస్టర్డ్ నంబర్: 602, ఆగస్ట్ 21,2013) ఆవిర్భవించింది. దీనిపై తెలంగాణా సినీ దర్శకులు, నిర్మాతలు తదితర సంఘాల వారు హర్షం వ్యక్తం చేసారు.   టీ-చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యుల పేర్లు: అధ్యక్షుడు: యాన్. శంకర్; ఉపాధ్యక్షుడు: సంగిశెట్టి దశరద్; ప్రధాన కార్యదర్శి: సయ్యద్ రఫీ; జాయింట్ సెక్రెటరి: ఆకుల సురేష్; కోశాధికారి: సాయి వెంకట్. టీ-సినిమా నిర్మాతల కౌన్సిల్ అధ్యక్షుడు: సాన యాదిరెడ్డి టీ-సినీ పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు: ఉదయ రెడ్డి టీ- సినిమా ప్రదర్శకుల సంఘం అధ్యక్షుడు: వీ.యల్. మల్లికార్జున్ గౌడ్   టీ-సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిర్భావం గురించి తెలియజేస్తూ ఒక లేఖను మంత్రి డీకే అరుణ కుమారికి వారు సమర్పించి దానికి ప్రభుత్వ గుర్తింపు కల్పించవలసిందిగా వారు కోరారు. ఆమె వారిని ఈ సందర్భంగా అభినందించి లేఖను సంబంధిత అధికారులకు వెంటనే పంపారు.

కేభినెట్‌ ముందకు టి నోట్‌

  25 నుంచి ప్రదాని విదేశి పర్యటన నేపధ్యంలో ఈ 24 న జగరనున్న ప్ర్యతేక కేభినేట్‌ సమావేశంలోనే తెలంగాణ నోట్‌పై చర్చించనున్నారు. భారత్‌ అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందాల వ్యవహారాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం అవుతున్న కేభినేట్‌ పనిలో పనిగా తెలంగాణ నోట్‌పై కూడా చర్చించనుందని సమాచారం. ఇప్పటికే నోట్‌ రెడీ అయినట్టుగా ప్రకటించిన హోం మంత్రి షిండే పలువురు సీమాంద్ర కేంద్ర మంత్రులకు నోట్‌ కాపీని కూడా అందించారట. ఎలాంటి సాంకేతిక పరమైన అంశాలను ప్రస్తావించకుండా రెడీ చేసిన ఈ నోట్‌లో, మంత్రుల బృందం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది. నోట్‌ కేభినెట్‌ ముందుకు వచ్చిన దగ్గర నుంచి ఇక తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన అన్నిఅంశాలు మంత్రి వర్గమే చూడనుంది. అయితే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఆంటోని కమిటీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిన కేంద్ర, ఎవరికి ఏ అభ్యంతరాలు ఉన్న ఆంటోరి కమిటీకే నివేదించుకోవాలని చెపుతుంది.

నేడు జగన్‌ బెయిల్ పిటిషన్‌పై తీర్పు

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటీషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశామని కోర్టుకు తెలిపిన సిబిఐ, జగన్‌ రాజకీయంగా బలమైన వ్యక్తి కనుక సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందుకే బెయిల్‌ ఇవ్వవద్దని వాదించింది. అయితే సిబిఐ దర్యప్తు పూర్తయినందున  బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ తరుపు న్యాయవాది వాదించారు. ఈ నెల 18న ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ రోజు జగన్‌ బెయిల్‌ వస్తుందా లేదా అన్న అంశం పై ఉత్కంట నెలకొంది.

కమలం దిశగా సైకిల్‌ పయనం

  బిజెపితో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు ఈ మేరకు సంకేతాలనిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితులను రాష్ట్రపతితో పాటు పలువురు నేతలతో చర్చించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతో కలిసి తాము దేశాన్ని ఎంతో అభివృద్ది చేశామన్న చంద్రబాబు, యుపిఏ మాత్రం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. అయితే ఈ సందర్భంలో విభజనకు ముందు నుంచి మద్దతు తెలుపుతున్న బిజెపిని చంద్రబాబు విమర్శించకపోగా, ప్రస్థుతం దేశంలో అభివృద్దిలో బాగంగా ఉన్న విశాలమైన రోడ్లు, ఐటి టెక్నాలజీ వంటివి బిజెపి చేసిన అభివృద్దే అని కొనియాడారు. అయితే ఈ విషయం అధికారికంగా చెప్పాటనికి చంద్రబాబు ఇష్టపడలేదు, ఢిల్లీలో రాజ్‌నాధ్‌ను కలిసిన ఆయన్ను ఎన్డీఏతో పొత్తు, మోడి ప్రదాని అభ్యర్ధిత్వంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలను బాబు దాటవేశారు. దీంతో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాబు బిజెపిల పొత్తు కాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సీమాంద్ర ఎంపిలకు సియం బుజ్జగింపులు

  అధిష్టానం వైఖరితో రాజీనామాలకు సిద్దపడ్డ సీమాంద్ర ఎంపిలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు సియం. ఆదివారం క్యాంపు కార్యాలయంతో తనతో కలిసిన నేతలతో ఇప్పుడే రాజీనామాలపై తొందరపడొద్దని తెలిపినట్టుగా సమాచారం. ఒకవేళ ఎంపిలు రాజీనామలు చేస్తే ఆ ప్రభావం మిగతా నేతలపైనా పడుతుందని అప్పుడు వారు తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పాడుతుందన్నారు. రాజీనామాల వల్ల విభజన తీర్మానం అసెంబ్లీకి వచ్చినపుడు, కేభినెట్‌ నోట్‌ మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు, బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు సీమాంద్ర తరుపున పోరాడటానికి ఎవరూ ఉండరని నిర్ణయం ఏకపక్షంగా సాగుతుందని సీయం ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లును సీమాంద్ర ఎంపిలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చిన్నరాష్ట్రాలను వ్యతిరేఖించే పార్టీలన్ని అండగా నిలుస్తాయని సియం హామి ఇచ్చారు. అధిష్టానం కూడా రాజీనామాలు చేసినా వెనక్కు తగ్గే పరిస్ధితి లేదని వివరించారు. ఒకవేళ రాజీనామాలు అనివార్యం అయితే అందరం కలిసే చేద్దామని సియం నేతలకు వివరించారు.

రాజీల్లేవ్‌ రాజీనామాలే

తెలంగాణ ప్రకటనతో కాంగ్రెస్‌ పార్టీలో మొదలైన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.హైకమాండ్‌తో పాటు సీమాంద్ర నేతలు డీ అంటే డీ అంటున్నారు. తెలంగాణ ప్రకటన విషయంలో వెనక్కి తగ్గేది లేదని అధిష్టానం తెగేసి చెపుతుండటంతో, సీమాంద్ర నేతలు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు రాజీనామాల విషయంలో దాటవేత దొరణి అవలంభించిన ఆ ప్రాంత ఎంపిలు ఇక రాజీనామలకే మొగ్గెతున్నారు. అందులో భాగంగానే మంగళ వారం స్పీకర్‌ను కలవనున్న ఏడుగురు లొక్‌సభ సభ్యులతో పాటు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోనున్నారు. మొదట పదవులకు ఆ తరువాత పార్టీకి కూడా రాజీనామ చేయడానికి సిద్దమవుతున్నారు ఆప్రాంత నేతలు.మంగళవారం స్పీకర్‌ను కలవటానికి నిర్ణయం తీసుకున్న సీమాంద్ర నేతలే శాంతింప చేయడానికి సియం సహా పలువురు నేతలు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఎంపి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో రాజీనామాలు చేస్తామని పట్టుపడుతున్నారు. 2014లో వైసిపితో పొత్తుకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం, సీమాంద్ర కాంగ్రెస్‌ నేతల భవిష్యత్తును పణంగా పెడుతున్నట్టుగా భావిస్తున్నారట ఆ ప్రాంత నేతలు.

రెండు ప్రాంతాల మధ్య చిచ్చు: చంద్రబాబు

      రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ యత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించాలని, రెండు ప్రాంతాల జేఏసీ నేతలతో కేంద్రం చర్చలు జరిపి ఎవరికీ నష్టం జరగకుండా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   హస్తిన పర్యటనలో ఉన్న తాను ఎవరితోనూ, ఎక్కడా రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను మాత్రమే శరద్‌యాదవ్‌కు వివరించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రంలోని అనిశ్చితి తొలగించాలని శరద్‌యాదవ్‌ను కోరామని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్ నేతల సతీమణులు ఉమ్మడిగా రాష్ట్రపతిని కలవడంతో కాంగ్రెస్‌తో వైసీపీ కుమ్మక్కు అయిందని రుజవు అయిందని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చంద్రబాబు అన్నారు.   

ఏపీ ఎన్జీఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం

      ఏపీ ఎన్జీవో నేతలతో ఆదివారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీమాంధ్రలో సమ్మె వలన జనజీవనం స్తంభించి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పరిపాలన స్తంభించిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని పరిస్థితి ఉందని అందువల్ల సమ్మె విరమించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. దీనిపై స్పందించిన ఉద్యోగులు రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే సమ్మె విరమిస్తామని వారు స్పష్టం చేశారు.     రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీఎన్జీవో సంఘం నేత అశోక్‌బాబు తెలిపారు. సమ్మె విరమించాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలు తమను కోరలేదని, రాష్ట్రం సమైక్యం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రజలు కోరుతున్నారని ఆయన మంత్రివర్గ సబ్ కమిటీకి తెలిపారు. తాము జీతాలు తీసుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం చేయలేమని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో నేతలతో పాటు మంత్రులు ఆనం రామ్‌నారాయణ రెడ్డి, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు.

మ‌రో ఉద్యమానికి కెసిఆర్ పిలుపు

  స‌మైక్యాంద్ర ఉద్యమం ఉదృతంగా న‌డుస్తున్న నేప‌ధ్యంతో తెలంగాణ నాయ‌కులు కూడా ఉద్యమ కార్యచ‌ర‌ణ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌తో ఓయూ జేఎసి నాయ‌కులు స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్ధుల‌తో చ‌ర్చించిన కెసిఆర్ ప్రత్యేఖ రాష్ట్రంపై కీల‌క వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే నెల 5లోపు కేభినెట్ నోట్ వ‌స్తుంద‌న్న కెసిఆర్, హైద‌రాబాద్ పై కేంద్ర వైఖ‌రి ఎలా ఉండ‌బోతుందో కూడా తెలిపారు. హైద‌రాబాద్ లా అండ్ ఆర్డర్ తో పాటు రెవెన్యూకు సంబందించిన అన్ని అధికారాలు కేంద్రం త‌న వ‌ద్దే ఉంచుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. తాము కోరుకున్న తెలంగాణ ఇది కాద‌న్న కెసిఆర్ మ‌రో ఉద్యమానికి విద్యార్ధులు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఆరునెల‌ల పాటు స‌మ్మెలు నిషేదం

  తెలంగాణ ప్రక‌ట‌న‌తో సీమాంద్ర జిల్లాల్లో ఎగ‌సి ప‌డ్డ స‌మ్మెల‌ను క‌ట్టడి చేయ‌టానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయ‌త్నిస్తుంది. స‌మ్మె మొద‌ల‌యిన ద‌గ్గర నుంచి ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్న ప్రభుత్వం. ఎంత‌కీ చ‌ర్చలు ఫ‌లించ‌క‌పోవ‌టంతో కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా ఉద్యోగ సంఘాల మీద ఎటువంటి చ‌ర్యల‌కు ఆదేశాలు ఇవ్వక పోవ‌డంతో ఇప్పుడు మ‌రో ఆయుదాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. ఆరు నెల‌ల పాటు మున్సిపాలిటీ, కార్పోరేష‌న్‌ల‌లో స‌మ్మెల‌ను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శ‌నివారం జారి అయిన ఈ జీవో ఆ రోజు నుంచి అమలు అవుతుంద‌ని ప్రక‌టించింది. ప్రస్థుతం రాష్ట్రంలో ఉన్న 162 మున్సిపాలిటీలు, 19 కార్పోరేష‌న్‌ల‌లో శ‌నివారం నుంచి స‌మ్మెలు నిషేదం.

గన్నవరం నుండి బాలకృష్ణ పోటీ

వచ్చే సాధారణ ఎన్నికలలో శాసనసభకు పోటీ చేస్తానని నందమూరి బాలకృష్ణ చాలా కాలం క్రితమే ప్రకటించారు. మొదట ఆయన కృష్ణ జిల్లా గుడివాడ నుండి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన గన్నవరం నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన గన్నవరం నుండే పోటీ చేసేందుకు రంగం సిద్ధం అవుతోందని తెలుస్తోంది.   ప్రస్తుత తెదేపా సిట్టింగ్ యం.యల్.ఏ. దాసరి బాలవర్ధన్ కు కృష్ణాజిల్లా సహకార పాలసంఘం అద్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ బోర్డులో కీలక పదవి కట్టబెట్టి, ఆయన స్థానం బాలకృష్ణకు కేటాయించాలని తెదేపా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ, తెదేపా సీనియర్ నేత వల్లభనేని వంశీ గన్నవరం సీటు తనకే కేటాయించాలని మొదటినుండి కోరుతున్నారు.   ఒకవేళ గన్నవరం సీటు తనకి ఇవ్వనట్లయితే రాజకీయాలు వదిలిపెట్టి పోతానని వంశీ ఇదివరకు అన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గన్నవరం నుండి పోటీకి దిగితే వంశీ వేరే చోటి నుండి పోటీ చేయడానికి ఇష్టపడతాడా? లేక పార్టీకి గుడ్ బై చెప్పి వైకాపాలోకి వెళ్ళిపోతారా అనేది టికెట్స్ కేటాయింపు మొదలయితే గానీ తెలియదు.  

సీమాంధ్ర యంపీలు రాజీనామాలకు సిద్ధం

  సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడుకుతున్న సీమాంద్రాలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో డిల్లీలో తచ్చట్లాడుతున్న సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు నిన్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, షిండే, మనిష్ తివారీ, చాకో తదితరులు రాష్ట్ర విభజన ఖాయం అంటూ వరుసపెట్టి చేసిన ప్రకటనలతో వారు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొన్నారు. దానికితోడు నిన్ననే ఏపీఎన్జీవోలు మరో మారు విజయవాడలో భారీఎత్తున ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సమైక్య సభను నిర్వహించి ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించడం, అదే మాటను నేడు వారు హైకోర్టుకి కూడా ఖరాఖండిగా తెలియజేయడంతో, పదవులు పట్టుకొని వ్రేలాడుతున్న స్వార్ధ రాజకీయ నేతలుగా తమపై ముద్ర పడుతుందని ఆందోళన చెందుతున్నారు.   ఇక దిగ్విజయ్ సింగ్ “మీరు రాజీనామాలు చేయడలచుకొంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు”నని చెప్పడంతో సీమంధ్ర యంపీలు ఉండవల్లి, రాయపాటి, లగడపాటి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వెంకటరామిరెడ్డి, ఎస్పీవైరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. వారు ఈనెల 24న స్పీకర్ కలిసేందుకు అపాయింట్మెంటు కూడా తీసుకొన్నారు. అదేరోజు వారు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకొంటామని చెపుతున్నారు. కేంద్రమంత్రులు మాత్రం ఇంకా రాజీనామాలపై ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. అయితే సీమాంధ్ర యంపీలు నిజంగా రాజీనామాలు చేయబోతున్నారా లేదా? అనే సంగతి బహుశః 24న తేలిపోవచ్చును.

సమ్మె కొనసాగింపుకే ఎన్జీవోల మొగ్గు

  ఏపీఎన్జీవోల నిరవధిక సమ్మెపై హైకోర్టులో దాఖలయిన కేసు నాలుగవ రోజు కూడా కొనసాగింది. ఉద్యోగులు ఇన్నిరోజులు సమ్మె చేయడం భావ్యం కాదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల వెంటనే సమ్మె విరమించమని కోర్టు కోరింది. అయితే, తాము కేంద్రం తన నిర్ణయం మార్చుకోనేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు కోర్టుకు తేల్చి చెప్పారు. కోర్టు ఈ కేసును మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజునే కోర్టు తన తీర్పు వెలువరించే అవకాశం ఉంది.   నిన్న కేంద్రమంత్రి మనిష్ తివారీ, హోంమంత్రి షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మరియు ఏఐసీసీ ప్రతినిధి చాకో రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేయడం తధ్యమని ఖరారు చేసిన నేపధ్యంలో ఏపీఎన్జీవోలు ఇప్పటికీ అంతే పట్టుదలగా వ్యవహరించడం విశేషమే. ఉద్యోగుల ఈ నిర్ణయంతో నేరుగా ఇప్పుడు రాజకీయ నేతలు, పార్టీలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇంతవరకు మూడు ప్రధాన పార్టీలను ఉపేక్షిస్తున్న ఉద్యోగ సంఘాలు, ఇక నుండి నేరుగా వారిని డ్డీ కొనే ప్రయత్నం చేయవచ్చును. దానివల్ల ముఖ్యంగా కాంగ్రెస్, తెదేపా నేతలకు ఇబ్బందులు తప్పవు. ఇంత జరుగుతున్నా రాజీనామాలు చేసేందుకు నిరాకరిస్తున్న కాంగ్రెస్ నేతలు, సమైక్యంద్రాపై నోరుమెదపని తెదేపా ముందుగా ఇబ్బందులో పడవచ్చును.   ఇక వైకాపాను కూడా ఉద్యోగులు నమ్ముతున్నట్లు దాఖలాలులేవు. సమ్మె కాలానికి ఉద్యోగులకు జీతాలు, బోనసులు ఇస్తామని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన ఆఫరును ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు నిర్ద్వందంగా తిరస్కరించడమే అందుకు ఉదాహరణ. సీమాంధ్రలో రాజకీయంగా పైచేయి సాధించడానికే వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తోందని వారు భావించడమే అందుకు ప్రధాన కారణం.   ఏమయినప్పటికీ, యన్జీవోలు సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు సమ్మె కొనసాగించాలని దృడ నిశ్చయం ప్రదర్శించడం రాజకీయపార్టీలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.

చంద్రబాబు డిల్లీ యాత్ర రాజకీయాలకోసం కాదుట

  చంద్రబాబు శనివారం డిల్లీ చేరుకొన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మరియు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి, వారిని ఈ విషయంలో జోక్యం చేసుకొని పరిస్థితులు చక్కదిద్దవలసిందిగా కోరేందుకే వచ్చానని అన్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన సీమాంద్రా, తెలంగాణా నేతలు కూడా వెళ్లి ప్రధానిని, రాష్ట్ర పతిని కలుస్తారు. ఆ తరువాత వారు డిల్లీలో ప్రతిపక్ష జాతీయ నేతలను కలిసిరాష్ట్రంలో పరిస్థితులు వారికీ వివరించి, పరిస్థితి చక్కదిద్దమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిందిగా వారిని కోరనున్నారు.   ఇక పనిలోపనిగా బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీని ఎంపిక చేసినందుకు శుభాకాంక్షలు తెలిపే మిషతో బీజేపీ అగ్రనేతలను కూడా కలిసి రెండు పార్టీల మధ్య పొత్తులకు మార్గం సుగమం చేయవచ్చును. ఒకవేళ ఈవిషయమై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడినప్పటికీ ఇప్పటికిప్పుడు అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. ఎందుకంటే దాని వలన రెండు పార్టీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. తెదేపా, బీజేపీలు చేతులు కలుపుతున్నట్లు గ్రహిస్తే వెంటనే కాంగ్రెస్, వైకాపాలు తదనుగుణంగా తమ వ్యూహాలు మార్చుకొనే అవకాశం ఉంటుంది.   ఇక ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు ఈడీ మరియు విజిలన్స్ అధికారులని కలిసి జగన్ వ్యవహారం గుర్తు చేసి వచ్చారు గనుక చంద్రబాబు మళ్ళీ ఆ ప్రయత్నం చేయకపోవచ్చును. కానీ జగన్ బెయిలు పిటిషనుపై సీబీఐ కోర్టు తన తీర్పును సోమవారం నాడు వెలువరించనున్నఈ సమయంలో చంద్రబాబు డిల్లీలో మఖాం వేయడంతో వైకాపా మళ్ళీ ఆయనపై ఆరోపణలు గుప్పిస్తోంది.

లగడపాటికి సమైక్య సెగ..ఉద్రిక్తత

      ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు సమైక్య సెగ తగిలింది. ఆటోనగర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా లారీ ఓనర్ల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు దీక్షాశిబిరానికి వచ్చిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసి రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. అయితే తాను ఎందుకు విజయవాడ వచ్చింది?రాజీనామాల గురించి తమ వైఖరి ఏమిటో వివరించడానికే వచ్చానని లగడపాటి వివరించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో లగడపాటి అనుచరులు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాష్ట్రపతి వద్దకు ఎంపీల సతీమణులు

      సమైకాంధ్ర ప్రదేశ్ కోసం ఏపీ ఎన్జీఓలు చేస్తున్న ఉద్యమంలోకి రాజకీయ నాయకులను రానీయకపోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు తాముగా పోరాడుతున్నారు. అయినా వారికి సీమాంధ్రుల నుండి సెగల తప్పడంలేదు. వారు చేస్తున్న ప్రయత్నానికి మరింత బలం, పాపులారిటీ రావడం కోసం సీమాంధ్ర రాజకీయ నాయకుల సతీమణులను కూడా ఉద్యమంలోకి దించుతున్నారు. గతంలో వీరంతా రాష్ట్ర గవర్నర్ ని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పోరాటం ఢిల్లీకి కూడ చేరబోతుంది.     సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు మద్దతుగా వారి సతీమణులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నానం వీరు ప్రణబ్ ముఖర్జీని కలవడానికి అపాంట్ మెంట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజించే దిశగా ఏ చర్యలూ తీసుకోవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరనున్నారు. వీరు ఢిల్లీ వెళ్లడాన్ని చూస్తే కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాలతో సహా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేశామని చెప్పుకోవడాని తప్ప వీరు ఢిల్లీ వెళ్ళి ప్రయోజనం లేదని, ఒకవేళ సీమాంధ్ర కాంగ్రెస్ వారు నిజంగా సమైక్యరాష్ట్రం కోరుకుంటే అధిష్టాన్ని దిక్కరించి, పార్టీకి పదవులకు రాజీనామా చేస్తే సరిపోతుంది కదా ? ఇలా కుటుంబాలను రోడ్డు పైకి తేవడం దేనికి అని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు.