ఎన్నికల తరువాతనే తెలంగాణా: రేణుకా చౌదరి
posted on Sep 17, 2013 @ 11:43AM
మొన్న ఆదివారం హైదరాబాదులో వాడివేడిగా సాగిన టీ-కాంగ్రెస్ నేతల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ రానున్నఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చునని చెప్పడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
“గత 60సం.లుగా హైదరాబాదుతో అనుబంధం పెనవేసుకొన్న సీమాంధ్ర ప్రజలు, విభజన సందర్భంగా హైదరాబాదును వదులుకోవలసి వస్తుందని ఆందోళన చెందడం సహజం. ఆ ఆందోళనతోనే వారు ఉద్యమాలు చేస్తున్నారు. అందువలన వారిని పూర్తిగా తప్పు పట్టలేము. అయితే ఈ పరిణామాల వలన రాష్ట్ర విభజనలో కొంత జాప్యం జరుగుతున్నంత మాత్రాన్న మనం కూడా ఆందోళన చెందనవసరం లేదు. దైర్యం కోల్పోనవసరం లేదు. తెలంగాణా ఏర్పాటులో కొంత ఆలస్యం జరగవచ్చునేమో గానీ ఈ విషయంలో అధిష్టానం ఇక వెనక్కి తగ్గబోదని మనకి తెలుసు. హైదరాబాద్ అంశంపై ఉన్న చిక్కుముడులు విప్పేందుకు మరికొంత సమయం పట్టవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము,” అని అన్నారు.
సమావేశంలో ఆమె పాల్గొనడాన్ని నిరసించిన పొన్నం ప్రభాకర్ కి ఆమె పరోక్షంగా చురకలు వేసారు. “నేను ఇంతవరకు ఏది మాట్లాడినా పార్టీకి అనుకూలంగానే మాట్లాడాను తప్పఇతర పార్టీనేతలతో చేతులు కలపలేదు,” అన్నారు.