కాంగ్రెస్ సాలెగూటిలో తెదేపా చిక్కుకొందా
posted on Nov 6, 2013 @ 12:30PM
రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రుల బృందానికి లేఖ వ్రాయడం కూడా విభజనకు అంగీకరించినట్లే అవుతుందని భావించిన తెదేపా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాన్ని కనుగొన్న తరువాతనే విభజన చేయమని కోరుతూ ప్రధానికి లేఖ వ్రాసింది. త్వరలో జరుగనున్నఅఖిలపక్ష సమావేశానికి కూడా తెదేపా హాజరుకాకపోవచ్చును.
అయితే ఇవి ఆ పార్టీకి తాత్కాలిక ఉపశమనంగానే ఉపయోగపడతాయి తప్ప, పార్టీని రెండు ప్రాంతాలలో బలోపేతం చేయడానికి ఏవిధంగాను దోహదపడవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎత్తు వేస్తూ, రాష్ట్రంలో ప్రతిపక్షాలను గందరగోళ పరిస్థితుల్లో కొనసాగేలా ఉంచుతోంది. వచ్చే ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ బహుశః ఇదే విధానం అవలంబించవచ్చును.
ఎన్నికలకు ఇంకా కేవలం ఆరు నెలలే సమయం మిగిలి ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఈ విభజన అంశంపైనే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోందంటే, కాంగ్రెస్ వాటిని ఎంతగా కట్టడి చేసి ఉంచిందో అర్ధం అవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిశంబర్లో తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టిన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మధ్యంతర ఎన్నికలకి వెళ్ళదలచుకొంటే, అందరికంటే ఎక్కువ ఇబ్బందిపడేది రెండు రాష్ట్రాలలో పోటీ చేయాలనుకొంటున్న తెలుగుదేశం పార్టీయే.
ఎందుకంటే ఇంతవరకు అందుకు అనుగుణంగా పార్టీని జాతీయ పార్టీగా మార్చుకోవడం, తెలంగాణాలో పార్టీ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకోవడం, అభ్యర్ధుల పేర్లను సిద్దం చేసుకోవడం వంటి ప్రక్రియ ఏదీ కూడా మొదలుపెట్టలేదు. మొదలుపెడితే అది సీమాంధ్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతుందనే భయంతోనే వెనక్కి తగ్గవలసి వస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెదేపా ఇదే అయోమయ స్థితిలో కొనసాగాలని కోరుకొంటోంది. బహుశః అందుకే అఖిలపక్షం వంటి ఐడియాలతో ఆ పార్టీ దృష్టి ఎన్నికలపైకి మళ్ళకుండా బిజీగా ఉంచుతోంది.
తెదేపా కూడా కాంగ్రెస్ అల్లిన ఆ సాలెగూటి నుండి బయటపడలేక ఎప్పటికపుడు తాత్కాలిక వ్యూహాలతో కాలక్షేపం చేస్తూ ఏమరపాటుగా వ్యవహరిస్తోంది. దీనివల్ల ఆ పార్టీకే నష్టం కలుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టమూ జరుగదు.