రూటు మారిన జేసీ బస్సు!
posted on Nov 7, 2013 @ 1:37PM
రాయలసీమ కాంగ్రెస్ నాయకుడు, ట్రావెల్స్ అధినేత జేసీ దివాకరరెడ్డి తన రాజకీయ బస్సును సమైక్యాంధ్ర రూట్లోంచి రాయల తెలంగాణ రూట్లోకి మళ్ళించారు. ఆమధ్యకాలంలో తన బస్సును రాయల తెలంగాణ రూట్లో నడిపినప్పటికీ నిన్న మొన్నటి వరకూ సమైక్యాంధ్ర రూట్లోనే నడిపారు.
తాజాగా తన బస్సును రాయల తెలంగాణ రూట్లోకి ఆయన మళ్ళించారు. గతంలో సమైక్యాంధ్ర కోసం తాపత్రయపడిన జేసీ ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో ఫోన్‌లో గొడవ కూడా పడ్డారు. బొత్సతో గొడవ పడినందువల్లే పాలెం బస్సు ప్రమాదంలో జేసీ ట్రావెల్స్ మీద కూడా కేసు నమోదైందన్న వార్తలు వచ్చాయి... అది వేరే విషయం. మొత్తమ్మీద జేసీ తన రూటు మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.
జేసీ దివాకరరెడ్డి రాయలసీమ ప్రాంత నాయకుడైనప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాయని అంటారు. ఇంకా చెప్పాలంటే దివాకరరెడ్డి పుట్టింది రాయలసీమ పక్కనే వున్న తెలంగాణ ప్రాంతంలోనేనని చెబుతారు. ఆ విధంగా జేసీకి తెలంగాణతో కూడా బోలెడంత అనుబంధం వుంది. అంత అనుబంధం వున్న తెలంగాణ నుంచి విడిపోవడం ఇష్టం లేకనే ఆయన రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి వుండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతోపాటు జేసీకి చెందిన ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కి ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. రేపు రాష్ట్రం విడిపోయి రాయలసీమకు, తెలంగాణకు సంబంధాలు లేకపోతే ఆ ప్రభావం ఆయన ట్రావెల్స్ మీద కూడా వుండే అవకాశం వుంది. అదే రాయల తెలంగాణ ఏర్పడితే తెలంగాణతో తనకున్న అనుబంధం తెగిపోదు అలాగే తన ట్రావెల్స్ కీ ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఇవన్నీ ఆలోచించే జేసీ రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
జేసీ దివాకరరెడ్డి రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి అక్కడితే ఆగితే బాగానే వుండేది. తన బస్సుకి అక్కడితే బ్రేక్ వేస్తే మంచిగా వుండేది. అలా బ్రేక్ వేస్తే ఆయన జేసీ ఎందుకవుతారు? రాయల తెలంగాణని వ్యతిరేకించేవాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దాంతో ఒకవైపు సమైక్యాంధ్రకోసం, మరోవైపు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం తంటాలు పడుతున్న రాయలసీమ నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం జేసీ బస్సు రాయల తెలంగాణ వైపు దూసుకుపోతోంది. భవిష్యత్తులో ఏ రూట్లోకి మారుతుందో వేచి చూద్దాం.