అఖిలపక్షం కాదు.. వికలపక్షం!
posted on Nov 7, 2013 @ 11:26AM
ఈనెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అఖిల పక్షానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్న తెలుగుదేశం, సీపీఎం, వైఎస్సార్సీపీలను మినహాయించి ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలిచింది. 12న ఉదయం ఐదు పార్టీలతో విడివిడిగా కేంద్ర మంత్రుల బృందం సమావేశం అవుతుంది. అన్ని పార్టీలతో ఏర్పాటు చేసే సమావేశాన్ని ‘అఖిలపక్షం’ అని పిలవొచ్చుగానీ, కొన్ని పార్టీలతో జరిపే సమావేశాన్ని ‘వికలపక్షం’ అని పిలవాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వికలపక్షంలో పాల్గొనే పార్టీల్లో ఒక్క ఎంఐఎం తప్ప మిగతా పార్టీలన్నీ రాష్ట్ర విభజనను సమర్థించే పార్టీలే. ఎంఐఎం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటూనే రాయల తెలంగాణ ఇస్తే ఓకే అంటుంది. మొత్తమ్మీద చూసుకుంటే తెలుగుజాతి విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలే కేంద్రం జరపబోయే వికలపక్ష సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఈ వికలపక్ష పార్టీలన్నీ కలసి ఒకే మాట మీద నిలబడి తెలుగు తల్లిని వికలాంగురాలిని చేయాలని నిర్ణయిస్తే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మేం పిలిచినా మీరు రాలేదు.. వికలపక్షానికి వచ్చిన పార్టీలన్నీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేయమన్నాయి కాబట్టి చేసేస్తున్నామని వికలపక్షం ముగిశాక కేంద్రం పక్షపాతంతో ప్రకటిస్తే పరిస్థితేంటి?
ఈ ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. కేంద్రం తెలుగు జాతిని ఎంత దారుణంగా అవమానిస్తోందో చెప్పడానికి ఈ వికలపక్ష సమావేశం మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సమావేశానికి ప్రతి పార్టీ నుంచి ఐదుగురు మెంబర్లు రావొచ్చట. ఒక్కో పార్టీకి విడివిడిగా అరగంట సమయం కేటాయించారట! రోజుల తరబడి చర్చించినా తీరని సమస్య గురించి అరగంటలో చర్చించాలని కండీషన్ పెట్టడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? తెలుగువారి హృదయాలను మరింత వికలం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ వికలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని అనుకోవాలి.