అంతరిక్ష ప్రయోగాలకి వ్యాపార కేంద్రంగా భారత్

 

ఈ రోజు భారత్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగ్గ రోజు. మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై పరిశోధనలు చేసేందుకు ప్రయోగించిన పీ.యస్.యల్వీ-సి25 విజయవంతమవడంతో, మన శాత్రవేత్తల నైపుణ్యం, మేదస్సు, మన దేశ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. మంగళ్ యాన్ అనే పేరును సార్ధకం చేసుకొంటూ, ఇస్రో షార్ నుండి నేడు ప్రయోగించిన రాకెట్ ప్రయోగంలో కీలకమయిన మొదటి నాలుగు దశలు పూర్తిచేసుకొని, విజయవంతంగా అంగారక గ్రహం వైపు దూసుకుపోతోంది.

 

ఏకధాటిగా ౩౦౦రోజులు ప్రయాణించిన తరువాత, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశించడంతో దాని యాత్ర పూర్తయ్యి, పరిశోధనలు మొదలవుతాయి. దీనివలన శాస్త్రవేత్తలకు అంగారక గ్రహం గురించి మరింత కీలక సమాచారం లభ్యమవుతుంది. అయితే దీనివలన ప్రజలకి, దేశానికి ఏమి ప్రయోజనం కలుగుతుందని కొందరు ప్రశ్నించవచ్చును.

 

ఈ విజయంతో భారత్ అంతరిక్ష ప్రయోగాలకి ప్రధాన వ్యాపార కేంద్రంగా మరింత ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక చిన్నా, పెద్ద దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశ పెట్టేందుకు భారత్ ను ఆశ్రయిస్తున్నారు. తద్వారా భారత్ తన అంతరిక్ష పరీక్షలపై, టెలికాం, టీవీ ప్రసారాలకోసం ఇస్రో ప్రయోగిస్తున్న అనేక ఉపగ్రహాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న వందల కోట్ల సొమ్ముని తిరిగి ఈవిధంగా రాబట్టుకొనే వీలుకలుగుతుంది. అందువలన భారత్ మున్ముందు మరింత అత్యాదునికమయిన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమయిన నిధులను స్వయంగా సమకూర్చుకొనగలుగుతుంది. దానివలన ప్రజలకు మరింత అత్యాదునికమయిన సాంకేతిక పరికరాలను ఉపయోగించే వీలు, సౌకర్యం కలుగుతుంది. నేటి ఈ విజయం ద్వారా ఇటువంటి కనబడని పరోక్ష ప్రయోజనలెన్నోప్రజలకి కలుగుతాయి.