టిడిపి టికెట్ కు డిమాండ్..కాంగ్రెస్ ఖాళీ..!!
posted on Dec 12, 2013 @ 11:27AM
నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పార్టీలో ఉంటూ వివిధ పదవులు అనుభవించిన ముఖ్య నేతలే ఫిరాయింపుల బాట పట్టారు. ఈ క్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి చేరడానికి టిడిపి అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం. ఆయన నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కూడా ఆయన మాతృసంస్థ అయిన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. నెల్లూరు నగర టిడిపి టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని షరతుపెట్టినట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కూడా టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా కాంగ్రెస్ వీడి టిడిపిలో చేరడానికి మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తనకు నెల్లూరు పార్లమెంట్ సీట్ కేటాయిస్తేనే పచ్చకండువా కప్పుకుంటానని టిడిపి అధినేతతో చెప్పినట్లు సమాచారం. వీరే కాక మరి కొందరు ముఖ్య నేతలు కూడా జంప్ జిలానీలుగా మారనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుండడం కేడర్ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కి అభ్యర్థులే కరువైనట్లు ప్రచారం సాగుతోంది.