ఇలాంటి విభజన చూడలేదు: చంద్రబాబు
posted on Dec 13, 2013 @ 6:16PM
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశంలో ఎప్పుడూ ఇలాంటి విభజన చూడలేదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలో దిగ్విజయ్ సింగ్ ఎలా చెబుతారని, బిఎసిని ప్రభావితం చేసే విధంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారని ఆయన అన్నారు. బిల్లును చూడకుండా అబద్ధాలు చెప్పే పరిస్థితికి దిగ్విజయ్ సింగ్ వచ్చారని ఆయన దుమ్మెత్తిపోశారు.
ప్రత్యేక విమానంలో విభజన ముసాయిదా బిల్లును తేవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుంటే ఏకాభిప్రాయం అవుతుందా అని అడిగారు. నాలుగైదు సీట్ల కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని గుర్తు చేస్తూ ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా అని అడిగారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమతో కలుస్తాడని, వైయస్ జగన్ తమవాడే అని దిగ్విజయ్ సింగ్ మరోసారి చెప్పారని, దాన్ని బట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తాము చెబుతున్న విషయంలో వాస్తవం ఉన్నట్లు రుజువైందని ఆయన అన్నారు.