కెసిఆర్ నెత్తిమీద 'రాయల..' కత్తి
posted on Dec 14, 2013 @ 12:35PM
రాష్ట్ర విభజన బిల్లు పై శాసన సభలో ఎలాంటి ప్రతిష్ట౦భన తలెత్తకుండా రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ తన మిషన్ పూర్తి చేసి వెళ్ళి పోతూ...తెరాస అధినేత కెసిఆర్ కి ఓ విషయాన్ని గుర్తుచేసి పోయారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చాలాసార్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం పై మేడమ్ సోనియా గాంధీని ఒప్పించానని..ఇక కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునెలా చేయాలని టీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు సమాచారం.
దీనిపై ఇప్పటికీ కూడా కేసీఆర్ స్పష్టమైన వైఖరిని కనబర్చడం లేదు. దీంతో రాయల తెలంగాణ అనే అంశాన్ని తిరిగి తెరమీదకు తెస్తున్నారు డిగ్గీ. దీనికి అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. బిల్లులోని అంశాల వారీగా విడివిడిగా సభ్యులు చర్చ జరిపి నివేదికలను పంపితే.. ఆ తర్వాత వాటన్నింటినీ సాకల్యంగా పరిశీలించిన తర్వాత మాత్రమే.. కేంద్రం తెలంగాణ విషయంలో తుది నిర్ణయానికి వస్తుందని దిగ్విజయ్ ప్రకటించారు.
కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలనే అభిప్రాయంతోనె ఇంకా రాయల తెలంగాణకు అవకాశం ఉన్నదంటూ డిగ్గీ మాట్లాడారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ కాంగ్రెస్ హైకమాండ్‌కు తలొగ్గడని తెలుసుకున్నఅధిష్టానం...కేసీఆర్ మెడపై కత్తి పేట్టేందుకు సిద్ధమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందనే దానిపై మనం కూడా వేచిచూడాల్సిందే.