కృష్ణాజిల్లాపై పట్టు కోసం వైకాపా కృషి
posted on Dec 14, 2013 @ 4:27PM
రాష్ట్ర రాజకీయాలలో కృష్ణా జిల్లాకున్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత రాజకీయ చైతన్యం గల జిల్లాలో కృష్ణాజిల్లా ప్రధమ స్థానంలో నిలుస్తుంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలకు ఆ జిల్లాపై పూర్తి పట్టు సాధించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటవంటి ఆ జిల్లాలో పాగా వేసేందుకు వైకాపా చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి నిమ్మకూరులో నందమూరివారి బంధువును పనిగట్టుకొని వెళ్లి పలకరించడం అందుకే. అయితే వైకాపాను అక్కడి ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది వచ్చే ఎన్నికలలోనే తేలుతుంది. కానీ, వైకాపా మాత్రం ఇప్పటి నుండే బలమయిన అభ్యర్ధులను కూడా సిద్దం చేసుకొంటున్నట్లు తాజా సమాచారం.
మునిగిపోతున్న కాంగ్రెస్ నావ నుండి వైకాపాలోకి దూకడానికి సిద్దంగా ఉన్నవారిలో మంత్రి పార్ధసారధికి బందర్ పార్లమెంట్ సీటు, మండలి బుద్ద ప్రసాద్ కు అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా దేవినేని నెహ్రు కొడుకు దేవినేని అవినాష్ కు పెనమాలూరు అసెంబ్లీ సీటు ఖరారు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలు,పుకార్లు మొదటి నుంచి పార్టీను నమ్ముకొని టికెట్ వస్తుందన్న నమ్మకంతో వున్నవారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.