రామోజీరావుకి హైకోర్టు జలక్
posted on Dec 20, 2013 9:12AM
ప్రముఖ దినపత్రిక ఈనాడు యజమాని రామోజీరావు విశాఖలో ఈనాడు కార్యాలయం స్థాపించేందుకు మంతెన ఆదిత్య కుమారవర్మఅనే వ్యక్తి నుండి 1973లో 2.78 ఎకరాల స్థలం మరియు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 సంవత్సరాల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి అప్పట్లో నెలకు కేవలం మూడు వేల రూపాయలు అద్దె చెల్లించడానికి రామోజీరావు అంగీకరించారు. ఆ తరువాత కొంత కాలానికి స్థల యజమానికి తెలియకుండా ఆ స్థలంలో కొంత భాగం రోడ్లు విస్తరణ కోసం విశాఖ నగరాభివృద్ధి సంస్థకు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఆయన దారాదత్తం చేయడమే కాకుండా అందుకు ప్రతిగా వేరేచోట ఆయన తనపేరిట స్థలం కూడా తీసుకొన్నారు. ఇదొక నేరమయితే, లీజు కాలం ముగిసిన తరువాత కూడా ఖాళీ చేయడానికి నిరాకరిస్తూ స్థల యజమానిని ముప్పతిప్పలు పెడుతూ జిల్లా కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పరుగులు పెట్టిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ కోర్టు ఆయనకు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ, నేటికీ ఆ స్థలాన్ని సదరు యజమాని స్వాదీనం చేయకుండా కోర్టుల చుట్టూ తిప్పిస్తూ నెలలు సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఇటీవల రామోజీ భాదితుడు మంతెన ఆదిత్య కుమారవర్మ మళ్ళీ హైకోర్టు తలుపు తట్టడంతో, కేసు విచారణ పూర్తయ్యేవరకు ఈనాడు కార్యాలయం అదే స్థలంలో కొనసాగాలని రామోజీరావు కోరుకొంటున్నట్లయితే, ప్రస్తుత ప్రభుత్వ విలువ ప్రకారం నెలకు రూ 17 లక్షలు చొప్పున స్థల యజమానికి అద్దె చెల్లించాలని, అంతే గాక పాత బకాయిల క్రింద రూ 2.06 కోట్లను వచ్చేనెల 10వ తేదీలోగా చెల్లించాలని హైకోర్టు రామోజీరావుని ఆదేశించింది.