బ్రజేష్ ట్రిబ్యునల్ కోసం మరో చిట్కా
posted on Dec 20, 2013 8:38AM
యుద్దరంగంలో దూకవలసిన సమయంలో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ కాలక్షేపం చేయడం, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మనకేమి కొత్త కాదని ఆల్మెట్టి, బాబ్లీ డ్యాం, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తదితర వ్యవహారాలలో మన రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. ఇప్పుడు ప్రజాగ్రహానికి, ప్రతిపక్షాల విమర్శలకు జడిసి అఖిలపక్ష సభ్యులను వెంటేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని కలిసి, కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చాలా అన్యాయమని మొరపెట్టుకోనున్నారు. అయితే వివిధ అంశాలను, సమస్యలను పరిష్కరించిమని కోరుతూ ఇంతవరకు మన రాష్ట్రం నుండి చాలా మందే ఆయనను కలిసారు. కానీ ఆయన దేనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఆయనొక నిమిత్తమాత్రుడని తెలిసి కూడా ఆయనకు మొరపెట్టుకోవాలనుకోవడం గమనిస్తే, ఈ సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మరోసారి తేటతెల్లమవుతుంది. కనీసం చేతులు కాలకయినా సరయిన ఆకులు పట్టుకోవాలనే జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోయినప్పటికీ, తమకు ఎదురయ్యే ఎటువంటి సమస్యనుండయినా అవలీలగా బయటపడేందుకు ఇటువంటి చిట్కాలు ప్రయోగించడంలో ఆరితేరిపోయాయి.