పోలింగ్ సీన్: బుద్ధిగా క్యూలో నిల్చుంటున్న ప్రముఖులు

  జూబిలీ హిల్స్ పోలింగ్ స్టేషన్‌లో క్యూలో నిల్చోకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన నటుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. చిరంజీవికి ఎదురైన అనుభవం మీడియాలో టామ్ టామ్ అయిపోవడంతో ప్రముఖులెవరూ డైరెక్ట్ గా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళడానికి సాహసించకుండా, బుద్ధిగా క్యూలో నిల్చుంటున్నారు. రాజకీయాల్లో ఎలా వుండాలో చాలామంది నాయకులు నేర్పించారు. రాజకీయాల్లో ఎలా వుండకూడదన్న విషయాన్ని నిరూపించిన చిరంజీవి, ఇప్పుడు ఓటు వేసే విషయంలో కూడా చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎలా ఓటు వేయకూడదో ప్రాక్టికల్‌గా చెప్పారు.

బ్రహ్మానందం ఓటు గల్లంతు.. నీ ఎంకమ్మ!

  తన కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టే బ్రహ్మానందాన్ని ఎన్నికల సిబ్బంది విలవిలలాడేలా చేశారు. పాపం బ్రహ్మానందం బుధవారం మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్లతో కలసి జూబిలీహిల్స్ లోని జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. బాధ్యతగల పౌరుడిలా క్యూలో నిల్చుని ఓటు వేయడానికి వెళ్ళారు. తీరా ఓటింగ్ దగ్గరకి వచ్చేసరికి బ్రహ్మానందానికి కళ్ళు తిరిగే వార్త తెలిసింది. తన ఓటు గల్లంతైపోయినట్టు తెలుసుకున్న బ్రహ్మానందం అవాక్కయిపోయాడు. మరోసారి పరిశీలించమని ఆయన ఎన్నికల సిబ్బందిని కోరారు. అయితే ఎన్నిసార్లు పరిశీలించినా లేని ఓటు ఎక్కడి నుంచి వస్తుంది? తన ఓటు గల్లంతైపోయిందని తెలుసుకున్న బ్రహ్మానందం చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. అందరినీ నవ్వించే బ్రహ్మానందం విషయంలో భలే కామెడీ జరిగింది. కిల్‌బిల్‌ పాండే ఓటు అన్యాయంగా కిల్ అయిపోయింది. బ్రహ్మానందం ఓటు గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న క్యూలో వున్నవాళ్ళు ‘నీ ఎంకమ్మ’ అనుకుంటూ నవ్వుకున్నారు.

ఓటర్లని చావబాదారు.. గర్భిణికి గాయాలు!

  బాధ్యతగల పౌరులుగా ఓటు వేయడానికి వెళ్ళిన ఓటర్లని పోలీసులు లాఠీలతో చావబాదారు. ఈ దుర్మార్గం మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలో జరిగింది. ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గర భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో వుండటం వల్ల కొంత తోపులాట జరిగింది. దాంతో అవకాశం దొరికింది కదా అని పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఓటర్లని నిర్దాక్షిణ్యంగా లాఠీలతో బాదడం ప్రారంభించారు. దాంతో ఓటర్లు చెల్లాచెదురైపోయారు. పోలీసులతోపాటు మరికల్ ఎస్.ఐ. శ్రీధర్ కూడా తన లాఠీకి పని చెప్పాడు. ఒక గర్భిణిని శ్రీధర్ విపరీతంగా కొట్టడంతో ఆమెకి గాయాలయ్యాయి. పోలీసుల దుర్మార్గాన్ని స్థానిక ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు.

రాహుల్ ప్రచార వాహనాన్ని ఢీకొన్న రైలు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనలో ప్రచారం కాన్వాయ్‌లో వుండే జామర్ వాహనాన్ని పోలీసులు సిద్ధం చేశారు. ఈ వాహనం హిందూపురం సమీపంలోని గుడ్డం దగ్గర గేటులేని రైల్వే ట్రాక్‌ని దాటుతున్న సమయంలో బెంగుళూరు వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్ ప్రెస్ ఢీకొంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన పోలీసు సిబ్బంది సదరు వాహనంలోంచి బయటకి దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడిన జామర్ వాహనం డ్రైవర్ని హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

అవసరమైతే అర్ధరాత్రి వరకు ఓటింగ్: భన్వర్‌లాల్

  తెలంగాణలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తప్ప సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన పక్షంలో అర్ధరాత్రి వరకు అయినా పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ బూత్‌ దగ్గరకి వచ్చిన ఓటర్లందరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని, 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్ని వందలమంది ఓటర్లు ఉన్నా వారందరూ ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. అవసరమైతే అర్ధరాత్రి వరకు అయినా ఓటింగ్‌కి అనుమతి ఇస్తామని భన్వర్ లాల్ చెప్పారు.

పవన్ ఓటు సందేశం: సినిమా టిక్కెట్ల కోసం నిల్చుంటాం కానీ...

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబిలీహిల్స్ లోని గాయత్రి హిల్స్ పోలింగ్ కేంద్రంలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం మంచిది కాదని అన్నారు. మనకి ఇష్టమైన సినిమా చూడాలన్న ఉద్దేశంతో టిక్కెట్ల కోసం గంటలు గంటలు క్యూలో నిల్చుంటాం. మన భవిష్యత్తుని నిర్ణయించే ఓటు వేయడానికి మాత్రం బద్ధకిస్తాం. ఇది మంచి పద్ధతి కాదని, అందరూ తమ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలని అన్నారు.

గవర్నర్ నరసింహన్‌కీ తప్పని ఈవీఎం గండం!

  తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణలోని చాలా పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దాంతో చాలా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోవడం, లేదా ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది. ఈసీఐఎల్ కంపెనీ తయారు చేసిన ఈవీఎంలే మొరాయిస్తున్నాయని ఎన్నికల ప్రధాన అధికారం భన్వర్ లాల్ చెప్పారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఈవీఎంల బారిన పడ్డారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన ఓటు వేయడానికి అందరికంటే ముందున్నారు. రాజ్‌భవన్ ఏరియాలోని ఎం.ఎస్. మక్తాలోని పోలింగ్ కేంద్రనికి గవర్నర్ ఉదయాన్నే తన భార్యతో కలసి వెళ్ళారు. అయితే ఆయన ఓటు వేయడానిక వెళ్ళిన ఈవీఎం మొరాయించింది. దాంతో ఆయన సదరు ఈవీఎంని బాగు చేసేంతవరకూ వేచి వుండి ఆ తర్వాత ఓటు వేశారు.

పోలింగ్ సీన్: రెండు గంటల్లో 14 శాతం ఓటింగ్

  తెలంగాణ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే.. అంటే ఉదయం 9 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 14 శాతం ఓటింగ్ జరిగింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 17 శాతం ఓటింగ్ కూడా జరిగింది. హైదరాబాద్‌లో మాత్రం 11 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం మరింత పుంజుకునే అవకాశం వుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ అన్ని ఏరియాలలో ప్రశాంతంగా జరుగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని భన్వర్ లాల్ తెలిపారు.

కేంద్రమంత్రి చిరంజీవికి ఓటర్ల షాక్

  మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి జూబిలీహిల్స్ ఓటర్లు షాక్ ఇచ్చారు. కుటుంబంతో కలసి జూబిలీహిల్స్ లోని పోలింగ్ బూత్‌కి వెళ్ళిన చిరంజీవి మొదట కుటుంబంతో కలసి క్యూలోనే నిలబడ్డారు. అయితే కొంతమంది ‘స్వామిభక్తులు’ చిరంజీవిని డైరెక్ట్ గా వచ్చి ఓటు వేయమని ఆహ్వానించారు. దాంతో చిరంజీవి కుటుంబం క్యూలోంచి బయటకి వచ్చి డైరెక్ట్ గా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళబోయింది. అయితే అక్కడ క్యూలో వున్న ఓటర్లు చిరంజీవి అలా డైరెక్ట్ గా వెళ్ళిపోవడాన్ని అడ్డుకున్నారు. మీరూ మాలాంటి ఓటరేనని, మీరు కేంద్రమంత్రి అయినంత మాత్రాన మీకు ప్రత్యేకత లేదని, ఓటు వేసే దగ్గర ప్రొటోకాల్ వుండదని స్పష్టం చేశారు. దాంతో చిరంజీవి నాలుక్కరుచుకుని ఓటర్లకు సారీ చెప్పి, మళ్ళీ కుటుంబంతో కలసి క్యూలో నిల్చుని వెళ్ళి ఓటు వేశారు.

గవర్నర్ అంటే నరసింహన్‌లా వుండాలి: ఓటు హక్కు వినియోగం!

  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అసలు గవర్నర్ అంటే ఎలా వుండాలో ఉదాహరణగా నిలిచారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన ఓటు వేయడానికి అందరికంటే ముందున్నారు. రాజ్‌భవన్ ఏరియాలోని ఎం.ఎస్. మక్తాలోని పోలింగ్ కేంద్రనికి గవర్నర్ ఉదయాన్నే తన భార్యతో కలసి వెళ్ళారు. ఓటు వేసిన అనంతరం ఆయన తన భార్యతో కలసి ఓటు వేసినట్టుగా చూపుడువేళ్ళని మీడియాకి చూపించారు. గవర్నర్ ఓటు వేస్తుండగా మీడియా కెమెరాలు చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. అయితే ఆయన దాన్ని వారించారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన గొప్ప అవకాశం అని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నరసింహన్ చెప్పారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలివే!

  వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో వున్న కొండేటి శ్రీధర్ మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. తన నియోజకవర్గం పరిధిలోని పెద్ద పెండ్యాల్ గ్రామంలో వున్న మామిడి తోటలో శ్రీధర్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో వున్న శ్రీధర్ని ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ల ముందు రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేయడం మీద పోలీసులు, రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్రీధర్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. వర్ధన్నపేటలో రాజకీయంగా హోరాహోరీ పోరు జరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ డబ్బు కుమ్మరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీధర్ తన శక్తికి మించి ఇప్పటికే ఖర్చు పెట్టేశాడు. పార్టీ నుంచి ఫండ్ వస్తుందని అనుకుంటే అక్కడి నుంచి పైసా కూడా రాలలేదు. మరోవైపు ఆర్థికంగా బలంగా వున్న తన ప్రత్యర్థులు డబ్బులు వెదజల్లుతూ వుండటంతో ఈ ఎన్నికలలో తాను ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయానికి శ్రీధర్ వచ్చాడు. దాంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్‌ను టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

బుధవారం లోక్‌సభ పోలింగ్‌లో మహామహులు...

      బుధవారం నాడు జరిగే ఏడో విడత పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, యు.టి.లలోని 89 లోక్‌సభ స్థానాలలో ఓటింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, డామన్ అండ్ డ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత ఎన్నికల బరిలో భారతీయ జనతాపార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (వదోదర), అగ్ర నాయకులు ఎల్.కె.అద్వానీ (గాంధీ నగర్), మురళీ మనోహర్ జోషి (కాన్పూర్), అరుణ్ జైట్లీ (అమృత్‌సర్), ఉమా భారతి (ఝాన్సీ), వినోద్ ఖన్నా (గురుదాస్ పూర్) రంగంలో వున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయబరేలి), కెప్టెన్ అమరీందర్ సింగ్ (అమృత్‌సర్), రీటా బహుగుణ (లక్నో), అంబికా సోని (ఆనంద్ పూర్ సాహిబ్) రంగంలో వున్నారు. వీరితోపాలు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (శ్రీనగర్), జేడీయు అధ్యక్షుడు శరద్ యాదవ్ (మాధేపురా) రంగంలో వున్నారు.

మద్యం సిండికేట్ డొంక మళ్ళీ కదిలింది

  ఒకప్పుడు మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి తనకు పక్కలో బల్లెంలా ఉన్న పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లొంగదీసేందుకు, ఆయన విజయనగరం జిల్లాలో నడిపిస్తున్న లిక్కర్ సిండికేట్ పై ఏసీబీ విచారణకు ఆదేశించేరు. అయితే అది కక్ష సాధింపు చర్యగా కనబడకూదదనే ఆలోచనతో రాష్ట్రంలో కొన్ని ఇతర జిల్లాలలో జరుగుతున్న మద్యం సిండికేట్ వ్యాపారాలపై దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా పలు జిల్లాలలో నిర్వహించిన దాడులలో అనేకమంది అధికార, ప్రతిపక్ష పార్టీల యం.యల్యేలు. ప్రభుత్వాధికారులు, బ్రోకర్లు, చివరికి కొందరు పత్రికా విలేఖరులు కూడా పట్టుబడ్డారు. అయితే ఇదంతా బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసి మొదలుపెట్టినందున, ఏసీబీ అధికారులు విజయనగరంలో చాలా లోతుగా దర్యాప్తు చేసి, ఈ సిండికేట్ మూలాల వరకు చొచ్చుకు పోయారు. అప్పుడు బొత్స హడావుడిగా డిల్లీ వెళ్లి చక్రం తిప్పితే గానీ, ఈ దర్యాప్తుకు బ్రేకులు పడలేదు. అంతటితో దర్యాప్తు ఆగిపోయింది. ఏసీబీ అధికారులు ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొంటూ ఎంతో శ్రమించి తయారుచేసిన నివేదికలో రాజకీయ నాయకుల పేర్లన్నీ కనబడకుండా వాటంతటవే మాయమయిపోయాయి. ఆ తరువాత కిరణ్ కూడా చల్లబడిపోవడంతో ఏసీబీ అధికారులు మిగిలిన నివేదికను కూడా అటకెక్కించేసారు. ఆ తరువాత ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారం, తెలంగాణా ప్రకటన, సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆ కధ కంచికి వెళ్లిపోయింది. కానీ మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఏసిబీ అధికారులు ఆ నివేదికను అటక మీద నుండి దింపి దుమ్ము దులిపి, ఈ మద్యం సిండికేట్ లో నిందితులుగా పేర్కొనబడ్డ 34 మంది ఎక్సైజ్ అధికారులపై చర్యలు విచారణకు అనుమతించాలంటూ గవర్నర్ నరసింహన్ కోరారు. ఆయన అందుకు వెంటనే అనుమతి ఇస్తూ ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దీనినే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని అంటారేమో! దర్యాప్తుకి ఆదేశించిన కిరణ్ పదవిలో లేరు పార్టీలోను లేరు. బొత్స కూడా ఇప్పుడు మాజీ అయిపోయారు. నివేదికలో పేర్లు ఎక్కిన అధికారులు మాత్రం ఇంకా ఉద్యోగాలలోనే ఉన్నారు గనుక అడ్డంగా బుక్ అయిపోయారు.

మావోయిస్టులు రంగంలోకి దిగారు జర భద్రం

      బుధవారం నాడు తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఒకపక్క సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీంలు కార్యకలాపాలు ప్రారంభించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల పోలీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ కొనసాగిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్‌తో పాటు, మావోయిస్టుల ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులను పోలీసు అధికారులు రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాలను, నాయకులను టార్గెట్ చేసి మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

వల్లభనేని వంశీపై జగన్ పార్టీ నేతల దాడి

      జగన్ పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేయడం తప్ప మరో పని ఉన్నట్టు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జగన్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ ఎన్నికలలో వైకాపా అడ్రస్ గల్లంతు కాబోతోందన్న ఆందోళనతో వైకాపా నాయకులు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా జగన్ పార్టీ నాయకులు గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మీద దాడి చేశారు. వంశీ ప్రయాణిస్తున్న కారు మీద వైకాపా కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడంతోపాటు కారును కూడా పూర్తిగా పాడు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

పోలింగ్ ముందు కాంగ్రెస్ విభజన హడావిడి

      ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీలకి వుండే అతి తెలివితేటలన్నీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టున్నాయి. తెలంగాణలో రేపు పోలింగ్ జరగబోతోంది. సోమవారం నాడే ప్రచార కార్యక్రమం ముగిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ముందు రోజు కూడా తెలంగాణలోని ఓటర్లని ప్రభావితం చేసే కుళ్ళు ఐడియాని ఆచరణలో పెట్టింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని రాష్ట్ర విభజన ఎలా చేయాలా అనే విషయం మీద తీవ్రంగా చర్చించారు. ఈ మీటింగ్ ఎన్నికల ముందు రోజే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అలాగే కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. మే 9న సమావేశమై విభజన ప్రక్రియని సమీక్షిస్తారట. అలాగే విభజనపై ఏర్పడిన 21 కమిటీల నివేదికలను మే 8న వెబ్ సైట్‌లో వుంచుతారట. హోం శాఖ నేతృత్వంలో మరో కమిటీని కూడా ఏర్పాటు చేస్తారట. ఈ శుభవార్తలన్నీ  చెప్పదలచుకుంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత చెప్పొచ్చు కదా.. పోలింగ్ ముందురోజే చెప్పడం ఎందుకో! కాంగ్రెస్ పార్టీ తెలివితేటలన్నీ ఇలాగే వుంటాయి.