విమానం హైజాక్ కేసు: కాక్‌పిట్‌ని టాయ్‌లెట్ అనుకున్నాడట

  ఆస్ట్రేలియా నుంచి బాలి ద్వీపానికి వస్తున్న విమానంలో తప్పతాగిన ఒక ప్యాసింజర్ కాక్‌పిట్‌లోకి దూరడం, పైలట్‌తో ఏదేదో వాగడం, పైలెట్ విమానాన్ని బాలిలో దించి విమానం హైజాక్ అయినట్టు ప్రకటించడం తెలిసిందే. దాంతో బాలీ ఎయిర్‌పోర్ట్ అంతా టెన్షన్‌కి గురైంది. మిలటరీ దిగిపోయింది. విమానం మీద మెరుపుదాడి చేసి హైజాకర్ని బంధించింది. ఆ తర్వాత అతను హైజాకర్ కాదని.. మందు ఎక్కువై ఏదేదో వాగాడని అర్థమైంది. అయినప్పటికీ మిలటరీ వాళ్ళు సదరు ప్రయాణికుడు మాట్ క్రిస్టోఫర్ని బాగా లోతుగా ప్రశ్నించారు. ఈ విచారణలో తేలిందేమిటంటే, పొట్ట పగిలేట్టు తాగిన క్రిస్టోఫర్‌కి అర్జెంటుగా నంబర్ వన్‌కి వెళ్ళాల్సి వచ్చిందట. అటూ ఇటూ చూసిన అతగాడికి ఎదురుగా ఒక తలుపు కనిపించే సరికి దాన్ని తెరిచి లోపలకి వెళ్ళి అక్కడ తన కార్యక్రమం పూర్తి చేయబోయాడట. సడెన్‌గా లోపలికి వచ్చిన క్రిస్టోఫర్ని చూసి పైలెట్లు షాకై క్రిస్టోఫర్ని నానామాటలూ అన్నారట. క్రిస్టోఫర్ కూడా ఏదేదో వాగేశాడట.తాగినమత్తులో తానేం వాగాడో తనకే అర్థం కాలేదట. ఈ గొడవలో తన నంబర్ వన్ ప్రాబ్లాన్ని కూడా మరచిపోయాడట. మిటలరీవాళ్ళు ఎటాక్ చేసి తనని పట్టుకునేవరకూ తనను అందరూ హైజాకర్ అనుకుంటున్న విషయం అర్థం కాలేదట. పాపం ‘నంబర్ వన్’ ఎంతపని చేసింది?

వారణాసి వెళ్ళడానికి ప్రియాంక ఎందుకు భయపడింది?

      దేశంలో నరేంద్రమోడీ హవా వీస్తోంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అర్థమైనా అర్థంకానట్టు నటిస్తోంది. తమనుంచి అధికార పీఠాన్ని మోడీ గద్దలాగా తన్నుకుని పోవడం ఖాయమని అర్థమైపోయిన సోనియా, రాహుల్ గాంధీ ద్వయం మోడీ మీద చాలా కోపంగా మాట్లాడుతున్నారు. ఆ తానులో గుడ్డే అయిన ప్రియాంక కూడా తన కుటుంబం ఓటమికి గురికాబోతోందన్న విషయాన్ని తట్టుకోలేకపోతోంది. అందుకే అందుకు కారణం కాబోతున్న మోడీ మీద తూటాల్లాంటి మాటలు వదులుతోంది. ఇంతకాలం నాయనమ్మని గుర్తు చేసే ఆమె పర్సనాలిటీని మాత్రమే చూసిన భారత ప్రజలు ఈ ఎన్నికల పుణ్యమా ఆమె ఎంత ఘాటుగా మాట్లాడగలదో కూడా చూస్తున్నారు. ఇంతఘాటుగా మాట్లాడే శక్తి వుంది కాబట్టే మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజవకర్గంలో ప్రియాంకని ప్రచారానికి దించాలని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. ఈ ప్రతిపాదనకు ప్రియాంక మొదట్లో సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, తాజాగా తాను మోడీ పోట చేస్తున్న వారణాసిలో ప్రచారం చేయబోనని ప్రకటించారు. తాను అమేథి, రాయబరేలి నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం చేస్తానని గతంలో చెప్పిన మాటని గుర్తుచేస్తోంది. అయితే రాజకీయ పరిశీకులు మాత్రం, ఎలాగూ కచ్చితంగా ఓడిపోయే స్థానానికి వెళ్ళి ప్రచారం చేయడం దండగని ప్రియాంక భావించిందని అంటున్నారు. ప్రియాంక ప్రచారం చేశాక కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే అది ప్రియాంకకే మైనస్ కాబట్టి వారణాసిలో ప్రచారం చేయకుండా ప్రియాంక వెనకడుగు వేసినట్టు భావిస్తున్నారు.

అయ్యో పాపం కృష్ణంరాజు!

  రాజకీయాల్లో కృష్ణంరాజు పరిస్థితిని చూస్తే ఎంతటి కఠిన హృదయాలైనా కరిగిపోతాయి. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, బీజేపీ ఎంపీగా ఎన్నికై, కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించిన కృష్ణంరాజు రాజకీయ ప్రభ అకస్మాత్తుగా మసిబారిపోయింది. ఏ క్షణంలో అయితే ఆయన బీజేపీని వదిలి పీఆర్పీలో చేరారో అప్పటి నుంచి ఆయన్ని రాజకీయ దరిద్రం పట్టి పీడిస్తోంది. ఈ పార్టీ తర్వాత ఈ పార్టీ, ఈ పార్టీ తర్వాత ఆ పార్టీ అంటూ ఎన్ని పార్టీలు మారినా ఆయనకు రాజకీయంగా పూర్వ వైభవం రాలేదు. లేటెస్ట్ గా బీజేపీ పంచన తిరిగి చేరిన కృష్ణంరాజు తనకు కాకికాడ ఎంపీ సీటో, నరసాపురం ఎంపీసీటో వచ్చేస్తుందని, గెలిచేసి మోడీ గవర్నమెంట్లో కేంద్రమంత్రి పదవి వెలగబెట్టేయొచ్చని ఆశించారు. అయితే బీజేపీ నాయకత్వం ఆయన ఆశల మీద చన్నీళ్ళు చల్లింది. ఆయనకి ఎంపీ టిక్కెట్ ఇవ్వనని చెప్పేసింది. ప్రభాస్‌తో బీజేపీకి ప్రచారం చేయిస్తానని కృష్ణంరాజు చెప్పినా బీజేపీ వద్దు పొమ్మంది. దీంతో కృష్ణంరాజు హతాశుడైనా, చేసేదేం లేక పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనకి సినిమావాళ్ళతో కలసి సీమాంధ్రలో ఊరూరూ తిరిగే పనిని బీజేపీ అప్పగించింది. భానుచందర్, సురేష్, శరత్‌బాబు, శివాజీరాజా, కోట శ్రీనివాసరావు, జీవిత... ఇలాంటి సీనిమావాళ్ళందర్నీ వెంటనేసుకుని ఎండలో తిరగాల్సిన బాధ్యత కృష్ణంరాజు నెత్తిన పెట్టింది. రాజకీయాల్లో పెద్దపెద్ద పదవులు అనుభవించిన కృష్ణంరాజు ఇప్పుడు ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నారు. అయ్యో పాపం.

పాపం శంకర్ దాదా..కాంగ్రెస్ పార్టీ

  “పాపం! ఈ చిరంజీవికి రాజకీయ అవగాహన ఎప్పటికి కలుగుతుందో.. అసలు ఎప్పటికయినా కలుగుతుందో లేదో...”అని ఆయన ప్రసంగాలు విన్న ప్రతీసారి సీమాంధ్రలో ప్రజలు జాలిపడుతుంటారు. ఆయన గత ఐదేళ్ళుగా రాజకీయాలలోనే ఉన్నప్పటికీ, దేశముదురు కాంగ్రెస్ నేతలతో భుజాలు రాసుకు తిరుగుతున్నపటికీ, ఆయన రాజకీయంగా ఇంకా ‘మెచ్యూర్’ అవలేదని రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు కూడా భావిస్తున్నారు.   మొన్న మచిలీపట్నంలో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నపుడు ఆయన మోడీని హిట్లర్ అన్నందుకు అక్కడి ప్రజలు కొందరు ఆయనని కోడిగుడ్లతో సన్మానం చేసారు. అయినప్పటికీ రోట్లో తల పెట్టిన తరువాత ఇక రోకటి పోటుకి భయపడటం ఎందుకన్నట్లు, కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నపుడు ప్రత్యర్ధులను విమర్శించక తప్పదని, ఈసారి తెదేపా, వైకాపా, బీజేపీలను విమర్శించి తన రాజకీయ అజ్ఞానాన్ని మరో మారు బయటపెట్టుకొన్నారు ఆ మెగాజీవి.   తెదేపా-బీజేపీలది అనైతిక బందమని ఆయన విమర్శించారు. అయితే తాము తెరాస, వైకాపాలతో రహస్య ఒప్పందాలు చేసుకొంటే అది నైతికం, తెదేపా-బీజేపీలు బహిరంగంగా పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తుంటే అది అనైతికమని చిరంజీవి చెప్పడం హాస్యాస్పదం. తెదేపా, వైకాపాలకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఆయన మరో కొత్త విషయం కనిపెట్టి, దానిని ప్రజలకు చాటి చెప్పారు. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొనే పోటీలో దిగి, ఎన్నికల తరువాత కూడా కలిసేపనిచేస్తామని వారే విస్పష్టంగా చెపుతున్నపుడు, చిరంజీవి ఈ విషయం కొత్తగా కనిపెట్టినట్లు చెప్పడం నవ్వు కలిగిస్తుంది.   వైకాపా విషయంలో కూడా తన రాజకీయ అవగాహనా రాహిత్యం ప్రదర్శించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన లగడపాటి, రాయపాటి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి అనేకమంది నేతలు తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రహస్య అవగాహన ఉందని కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్న సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? తెలిసి నటిస్తున్నారనుకోవాలా?   అయితే జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పొందేందుకు ఎన్నికల తరువాత ఏ కూటమి అధికారంలోకి వస్తే దానికే మద్దతు తెలుపుతారని ఎవరయినా ఊహించగలరు. అయితే జగన్ ఇప్పుడు మోడీని తిట్టడం లేదు కనుక ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారని చిరంజీవి చెప్పడం చూస్తే, తమ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోదని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయనకు నమ్మకముంటే, తమ పార్టీతో రహస్య అవగాహన ఉన్న జగన్ బీజేపీకి మద్దతు ఇస్తారని చెప్పిఉండరు. కానీ, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదని అర్ధమయిందో ఏమో జగన్ బీజేపీకి మద్దతు ఇస్తాడని ప్రకటించేశారు.   ఇక రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంద్రాలో తమ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో స్వయంగా చూస్తూ కూడా ఆయన చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలని, జగన్ కేసుల మాఫీ కోసమే పోరాడుతున్నారని అనడం గురువింజ గింజ సామెత జ్ఞప్తికి తెస్తుంది.   ఈసారి ఆంధ్ర, తెలంగాణా మరియు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని దాదాపు ఇప్పటికే ఖరారు అయింది. సీమాంద్రాలో వస్తే తెదేపా లేకపోతే వైకాపాలే అధికారంలోకి వస్తాయి తప్ప కాంగ్రెస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రాదని, రాలేదని సీమాంద్రా అంతటా పర్యటిస్తున్న చిరంజీవికి ఈపాటికి అర్ధమయ్యే ఉండాలి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి అక్కడేదో బావుకొందామని చూస్తే అక్కడా ఏటికి ఎదురీదక తప్పడంలేదిప్పుడు. ఎన్నికల తరువాత మళ్ళీ కేసీఆర్ దయతలిస్తే, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చో , పుచ్చుకోనో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్.   ఇదంతా తెలిసి కూడా చిరంజీవి శంకర్ దాదాలాగా ఇంత అమాయకత్వం ఒలకబోసేస్తుంటే ఎవరికయినా నవ్వు రాకమానదు.

చిరంజీవికి సిగ్గులేదు: కొత్తగా కనుక్కున్న కిరణ్

      చిరంజీవికి సిగ్గు లేదంట. ఈ విషయాన్ని తానేదో కొత్తగా కనుక్కున్నట్టు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ చెబుతున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీని సిగ్గులేకుండా విడిచిపెట్టేశానని చిరంజీవి పదేపదే విమర్శిస్తున్నారని, నిజానికి సిగ్గులేనిది తనకుకాదని.. ఇంకా కాంగ్రెస్ పార్టీని, మంత్రి పదవిని వదిలిపెట్టకుండా వున్న చిరంజీవికేనని కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పాపం కిరణ్ కుమార్ ఆవేదనలో కూడా నిజం వుందనే అనుకోవాలి. ఎందుకంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే అసాధ్యమైన బాధ్యతని భుజాన వేసుకున్న చిరంజీవి మొదటి నుంచీ కిరణ్ కుమార్‌ రెడ్డి మీద ఏదో ఒక విమర్శ చేస్తూనే వున్నాడు. చిరంజీవి ఎక్కడ మాట్లాడినా కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టకుండా ప్రసంగం పూర్తి కావడం లేదు. చాలాకాలంగా చిరంజీవి తిట్లని భరిస్తున్న కిరణ్ కుమార్ శనివారం నాడు శ్రీకాకుళంలో చిరంజీవికి సిగ్గేలేదన్న విషయాన్ని డిసైడ్ చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే...

  కాంగ్రెస్ పార్టీకి తెరాసకు, వైకాపాకు మధ్య కుదిరిన రహస్య ఒప్పందాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. అయితే రాహుల్ గాంధీ నిన్న ఎన్నికల ప్రచార సభలో ‘పెహ్లే హాత్ మిలాయే, బాద్ మే గల్లె మిలాయే...బాద్ మే పీట్ మే చూరి చలాయా” (మొదట కేసీఆర్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారని, తరువాత కౌగలించుకొన్నారని ఆనక వెన్నుపోటు పొడిచారని) చెపుతూ కేసీఆర్ తో తమకున్న రహస్య అవగాహన గురించి ఆయనే బయటపెట్టుకొన్నారని అన్నారు.   తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వాదిస్తున్న కిరణ్ నేటికీ రాష్ట్ర విభజన జరగలేదనే తాను భావిస్తున్నట్లు తెలిపారు. జూన్ రెండున రాష్ట్రం అధికారికంగా వేరు పడేంత వరకు కూడా తాను రాష్ట్ర విభజన జరిగినట్లు అంగీకరించనని అన్నారు. అయినా సుప్రీం కోర్టులో తను వేసిన కేసు వల్ల మళ్ళీ ఏదో ఒకరోజు తప్పకుండా విభజన బిల్లుని పునసమీక్షించే పరిస్థితి వస్తుందని అన్నారు. కాం   గ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటి నుండి దానిని వ్యతిరేఖిస్తూ తీవ్ర వాదనలు చేసినప్పటికీ కడదాక ఆయన విభజనకు తనవంతు సహకారం అందిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని చిరంజీవి, రఘువీరా రెడ్డి తదితరులు చెపుతున్నారు. వారికి బదులిస్తూ "అసలు రాష్ట్ర విభజన చేయబోతున్నామని సోనియాగాంధీ నాకెన్నడూ చెప్పలేదు. ఆవిషయం తెలిసినప్పతి నుండి నేను వ్యతిరేఖిస్తూనే ఉన్నాను. కానీ నాతో బాటు ఆ విషయం తెలిసిన చిరంజీవి వంటివారు అందరూ అధిష్టానానికి విదేయులుగా మేలుగుతూప్రజలను మభ్యపెడుతూ నేటికీ తమ మంత్రి పదవులలో కొనసాగుతున్న విషయం నిజం కాదా? అటువంటి వారి విమర్శలకు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నేను జవాబు చెప్పవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. నన్ను విమర్శించే ముందు, మొదట తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రశ్నలకు ఆయన జవాబీయగలిగితే బాగుటుంది," అని అన్నారు.   జగన్ గురించి మాట్లాడుతూ, "నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విషయంలో కలుగజేసుకోలేదనే విమర్శలు తర్కబద్దంగా లేవు. ఆయన వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను కలుగజేసుకోవడం సరికాదు. ఆయన సంగతి కోర్టులే చూసుకొంతాయి. ఆయన ముఖ్యమంత్రి అవడానికి నోటికి వచ్చినహామీలు గుప్పిస్తున్నారు. అయితే అవి ఆచరణ సాధ్యం కానివి. వాటిని అమలుచేసే చిత్తశుద్ది ఆయనకు అసలు లేదు. నా స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనవసరం," అని అన్నారు.   ఇక జైసపాలో చేరుతామని చెప్పిన వారు అందరూ ఒకరొకరుగా ఎందుకు పార్టీ విడిచి వెళ్ళిపోయారు? మీ పార్టీ ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబిస్తూ “చాలా మంది ఎవరి స్వార్ధం, భవిష్యత్తు, టికెట్స్ వారు చూసుకొని వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం రాష్ట్ర ప్రజల తరపున పోరాడేందుకే నేటికీ కట్టుబడి ఉన్నాను. మా పార్టీ ఎన్నికలలో గెలుస్తుందా లేదా అనేది ప్రధానం కాదు. నా ఆలోచన అంతా ప్రజలను చైతన్యవంతులను చేసి వారికి మంచి భవిష్యత్ ఏర్పరచాలనే తప్ప వేరొకటి లేదు,”అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌కి జెల్లకొట్టిన తమ్ముడు దల్జీత్ సింగ్

      ప్రధాని మన్మోహన్‌సింగ్‌కి తమ్ముడి వరసయ్యే దల్జీత్‌సింగ్ కోహ్లీ అనే సర్దార్జీ నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో వుంటూ అన్నగారికి తగ్గ తమ్మడిలా సోనియా కుటుంబానికి విధేయుడిగా వుండేవాడు. ఇప్పుడాయన ఎంచక్కా కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పేసి బీజేపీలో జాయినైపోయాడు. అమృత్‌సర్‌లో శుక్రవారం బీజేపీ ఒక భారీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా పాల్గొన్నాడు. ఈ ర్యాలీలోనే మన్మోహన్ సోదరుడు దల్జీత్‌సింగ్ బీజేపీలో చేరాడు. దల్జీత్‌సింగ్‌కి మోడీ బీజేపీలోకి సాదర స్వాగతం పలికారు. దేశంలో మోడీ హవాలాంటిదేమీ లేదని మన్మోహన్ సింగ్ ప్రకటించిన మర్నాడే ఆయన తమ్ముడు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి, మన్మోహన్ సింగ్‌కి షాక్ ఇచ్చింది. ఈ సంఘటన మన్మోహన్‌కి షాక్ ఇచ్చిందని ఒప్పుకుంటున్న ప్రధాని కార్యాలయ వర్గాలు మళ్ళీ తమాయించుకుని దల్జీత్‌సింగ్ మన్మోహన్‌కి సొంత తమ్ముడేమీ కాదు.. చాలాకాలంగా మన్మోహన్‌తో ఆయనకి సంబంధాలు లేవు అని కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

జగన్ పార్టీకి బ్యాడ్ న్యూస్: కొత్తపల్లికి సీరియస్!

      జగన్ పార్టీకి మరో బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఇప్పటికే భూమా శోభా నాగిరెడ్డి మరణంతో విషాదంలో వున్న పార్టీకి ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు గుండె, శ్వాసకోశానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. గత ఏడాది కొత్తపల్లి సుబ్బారాయుడు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు మరింత మెరుగైన చికిత్సతోపాటు విశ్రాంతి కూడా చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. కొత్తపల్లికి సీరియస్‌గా వుండి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో వున్నప్పటికీ, ఆయన నియోజకవర్గంలో మాత్రం ప్రచారం ఆగలేదు. ఆయన బంధువులు, సన్నిహితులు కొత్తపల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తూనే వున్నారు.

విజిల్ ఊదుతున్న ‘బాహుబలి’ సృష్టికర్త!

      ‘బాహుబలి’ సృష్టికర్త రాజమౌళి విజిల్ ఊదుతున్నారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల షూటింగ్‌లో తాను తీయబోతున్న ప్రతి సన్నివేశంలో నటీనటులు ఎలా నటించాలో తానే నటించి చూపిస్తూ వుంటారు. దీనిప్రకారం ‘బాహుబలి’ సినిమాలో ఏదో విజిల్ వేసే సీన్ వుండి వుంటుంది. దానికోసం రాజమౌళి విజిల్ ఊది చూపించి వుంటారని అనుకుంటున్నారా? కాదు.. రాజమౌళి విజిల్ ఊదింది సినిమా ‘బాహుబలి’ కోసం కాదు.. రాజకీయాల్లో ‘బాహుబలి’ కోసం. అవినీతిరహిత రాజకీయాలు చేయడానికి, అవినీతిపరులను రాజకీయాల నుంచి తప్పించడానికి ‘బాహుబలి’ లాంటి యోధుడిలా పనిచేస్తున్న జయప్రకాష్ నారాయణ కోసం! జయప్రకాష్ నారాయణ స్థాపించిన ‘లోక్‌సత్తా’ పార్టీకి రాజమౌళి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా లోక్‌సత్తా రూపొందించిన ఒక ప్రకటనలో రాజమౌళి నటించారు. నటించారు అనడం కంటే, ఓటర్లకి ఒక సందేశం ఇచ్చారని చెప్పడం బెటరేమో. సదరు ప్రకటనలో కనిపించిన రాజమౌళి- ‘మీ ఓటు కొనాలని ప్రయత్నించే రాజకీయ నాయకులను తరిమికొట్టంది’ అని ఓటర్లకి చెప్పి, శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలు ఊదిన లెవల్లో విజిల్ ఊదారు. ఈ ప్రకటన మిగతా రాజకీయ పార్టీల ప్రకటనల కంటే చాలా ఉన్నత స్థాయిలో వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకే మహిళా ముఖ్యమంత్రి అని ప్రకటించారా?

  తెలంగాణా ఏర్పడింది గనుక ఈ ఎన్నికలలో గెలిస్తే ముఖ్యమంత్రి అవుదామని తమలో తాము కుమ్ములాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలందరికీ రాహుల్ యువరాజావారు నిన్న పెద్ద షాక్ ఇచ్చారు. కేసీఆర్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో ‘తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మహిళని ముఖ్యమంత్రిగా చేస్తామని’ ప్రకటించేసి స్వంత పార్టీ నేతలను ఇరకాటంలో పడేసారు.   ముఖ్యమంత్రి పదవి కోసం జైపాల్ రెడ్డి తన కేంద్రమంత్రి పదవిని వదులుకొనేందుకు కూడా సిద్దపడిన సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా జానారెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు వంటి అనేకమంది సీనియర్లు ముఖ్యమంత్రి కుర్చీలో రుమాలు వేసి కుర్చీచుట్టూ చాలా కాలంగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ వారిని కాదని మహిళను ముఖ్యమంత్రిని చేస్తానని రాహుల్ గాంధీయే స్వయంగా ప్రకటించడంతో వారందరి ఆశల అడియాసలయ్యాయి. వారు కనుక ఇప్పుడు అలిగినట్లయితే, అది పార్టీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చును. తెరాసను దెబ్బ తీయాలని యువరాజావారు వేసిన ఎత్తుతో స్వంత పార్టీయే చిత్తయేలా ఉంది. ఒకవేళ టీ-కాంగ్రెస్ నేతలు తాత్కాలికంగా ఇప్పడు వెనక్కి తగ్గినా ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పరచగలిగితే, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ మొదటి రోజు నుండే ఆ మహిళా ముఖ్యమంత్రి కుర్చీ క్రింద మంట పెట్టడం ఖాయం.   తొలి ముఖ్యమంత్రి మహిళేనని యువరాజవారు ప్రకటించేశారు కనుక, ప్రస్తుతం ఆ రేసులో గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డీ.కే.అరుణ మాత్రమే ప్రధానంగా కనబడుతున్నారు. వారిలో గీతారెడ్డి ముందు స్థానంలో ఉన్నప్పటికీ, ఆమెను సీబీఐ భూతం వెన్నాడుతూనే ఉంది గనుక మిగిలిన ఇద్దరు లేదా కాంగ్రెస్ అధిష్టానం మదిలో మరో మూడో వ్యక్తి ఎవరో ఉండి ఉంటే ఆమె ముఖ్యమంత్రిగా నియమింపబడవచ్చును.   అయినా ఈరోజు తెలంగాణాలో పార్టీల పరిస్థితి చూసినట్లయితే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనబడటం లేదు. బహుశః అది గ్రహించే ఎలాగు తమ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే రాహుల్ గాంధీ, తెరాసను దెబ్బ తీస్తూనే మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఈవిధంగా ప్రకటించారేమో! ఒకవేళ ఎన్నికల తరువాత మళ్ళీ నిర్లజ్జగా తెరాసతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ముఖ్యమంత్రి కావాలని తపించిపోతున్న కేసీఆర్ ఒక కాంగ్రెస్ మహిళకి తన కూర్చోవాలనుకొంటున్న కుర్చీని అప్పగిస్తారని ఎవరూ అనుకోరు. పోనీ ఉపముఖ్యమంత్రి పదవైనా ఇస్తారా? అంటే దానిని ఆయన మైనార్టీలకు ఎప్పుడో వ్రాసి ఇచ్చేసానని చేపుతున్నారాయే. అంటే కాంగ్రెస్ స్పష్టమయిన మెజార్టీ సాధిస్తే తప్ప యువరాజవారి మాటకు విలువుండదని స్పష్టమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కి అంత సీను లేదు. అంటే...

కీలకదశకు చేరుకొన్న తెలంగాణా ఎన్నికల ప్రచారం

  తెలంగాణాలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొంది. అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో విజయం సాధించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ తన దళిత ముఖ్యమంత్రి వాగ్దానం పక్కనబెట్టడంతో, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడమే కాకుండా, బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని, ఆయనే తమ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించి తెరాసను ఇరకాటంలో పడేసారు.   అది చూసి కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్ తాము దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి, ఆనక టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహం చవిచూడటంతో ‘తూచ్! యస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వెనుకబడిన తరగతులలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తామని’ సవరణ ప్రకటన చేసారు. నిన్న తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిగా చేయాలనుకొంటున్నట్లు ప్రకటించి, ఆ పదవికి పోటీపడుతున్న టీ-కాంగ్రెస్ నేతలందరికీ షాక్ ఇచ్చారు.   ఈవిధంగా కాంగ్రెస్, తెదేపాలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఎవరో ప్రకటించడంతో, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్ పై, ఆయన పార్టీపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాహుల్ గాంధీ మహిళా ముఖ్యమంత్రి ప్రకటించి, అదే సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాటమీద నిలబడే మనిషి కాదని, కాంగ్రెస్ పార్టీని, దళితులను మోసం చేసినట్లుగానే, ఎన్నికలలో గెలిస్తే ఆయన రేపు తెలంగాణా ప్రజలందరినీ కూడా మోసం చేస్తారని రాహుల్ గాంధీ విరుచుకు పడ్డారు.   మరో నాలుగు రోజులలో ఎన్నికలు జరుగబోతున్న ఈ కీలక తరుణంలో సీబీఐ కోర్టు తమ ఆస్తులపై విచారణకు ఆదేశించడం, దానికి పై అధికారుల అనుమతి అవసరమంటూ మళ్ళీ సీబీఐ అధికారులే త్రొక్కి పట్టి ఉంచడం అన్నీ కూడా ఈ వ్యూహంలో భాగమేనని కేసీఆర్, హరీష్ రావు తదితరులు ఆరోపిస్తున్నారు. తెరాసలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ ప్రజలను ఆకట్టుకొనే శక్తి లేకపోవడంతో ఆ లోటు ఇప్పుడు ఎన్నికలలో మరింత స్పష్టంగా కనబడుతోంది. అందుకే కేసీఆర్ ఒక్కరే పార్టీని గెలిపించుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.    కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు ప్రదర్శిస్తున్న ఇంతవరకు ప్రచారంలో వెనుకబడి ఉన్న తెదేపా-బీజేపీ కూటమి, మంచి ప్రజాకర్షణ శక్తి, యువతను ఆకట్టుకొనేలా మంచి ప్రేరాణాత్మకంగా ఉపన్యసించగల పవన్ కళ్యాణ్ న్ని ప్రచారానికి తీసుకురావడంతో వారి కూటమి మళ్ళీ బలం పుంజుకొంటోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెరాస అధినేత కేసీఆర్ మరియు కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న ప్రసంగాలకు తెలంగాణా యువత నుండి మంచి స్పందన వస్తుండటంతో, అది కాంగ్రెస్, తెరాసల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది గనుక, అది సహజంగానే ఆ రెండు పార్టీలపై మరింత ఒత్తిడి పెంచుతుంది.   ఇక ఎన్నికల ప్రచారం ముగిసేందుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమె మిగిలి ఉండటంతో కాంగ్రెస్, బీజేపీలు తమ అతిరధ, మహారధులను బరిలో దింపి, సరికొత్త వ్యూహాలతో, సరికొత్త హామీలు గుప్పిస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో, ఈ ప్రభావం ప్రజలమీద పడి వారి ఓట్లు ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య చీలిపోయేట్లు కనిపిస్తోంది. వారు ఏ ఒక్క పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపే అవకాశం కనబడటం లేదు. అదే జరిగితే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమవుతుంది. ఇది కొత్త రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణకు ఎంతమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నరేంద్రమోడీ మనిషికాదు జంతువు: బేణీ ప్రసాద్ వర్మ

  నోరు పారేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీలోనే నంబర్‌వన్ స్థానంలో వున్న కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ గతంలో ఎన్నోసార్లు తిక్కవాగుడు వాగి అందరిచేత అక్షింతలు వేయించుకున్నాడు. అయితే తిట్టేనోరు ఊరుకోదన్నట్టుగా నోరు పారేసుకుంటూనే వుంటాడు. లేటెస్ట్‌ గా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మీద బేణీ ప్రసాద్ వర్మ నోరు పారేసుకున్నాడు. మోడీని ఆయన ‘జంతువు’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మోడీని బేణీ ప్రసాద్ వర్మ జంతువుగా అభివర్ణించడాన్ని భారతీయ జనతాపార్టీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా ఖండించాడు. బేణి ప్రసాద్ వర్మకు మతిస్థిమితం తప్పినట్టుగా వుందని, తక్షణం ఆయనకు మానసిక వైద్య పరీక్షలు జరిపించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. త్వరలో ఓడిపోబోతున్నామన్న విషయాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఆ బాధని తట్టుకోలేక నోటికొచ్చినట్టు వాగుతున్నారని ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు.

సీబీఐ కేసు: కేసీఆర్ బ్యాచ్‌కి జగన్ గతి పట్టబోతోందా?

      ఇంతకాలం కేసీఆర్ అండ్ బ్యాచ్ తెలంగాణ ఉద్యమం పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని, సీమాంధ్ర పారిశ్రామికవేత్తలను బెదిరించి కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన అక్రమ సంపాదన అంతా వ్యవసాయం అకౌంట్లో వేసేసి వైట్ మనీ చేసుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకు విచారణ జరిపే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు సీబీఐ కోర్టు కేసీఆర్, హరీష్ రావు, విజయశాంతి ఆస్తులపై విచారణకు ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రే అని హరీష్ రావు మొత్తుకుంటున్నాడు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడం చాలా కీలకమైన నిర్ణయం అని భావిస్తున్నారు. మాజీ మంత్రి శంకర్రావు వైసీపీ నాయకుడు జగన్ మీద చేసిన కంప్లయింట్ మేరకు ఇలాంటి ఆదేశాలే జారీ అయ్యాయి. వాటివల్ల జగన్ 16 నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ అండ్ టీమ్‌కి కూడా జగన్‌కి పట్టిన గతే పట్టబోతుందా అనే అనుమానాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్‌కి గుడ్‌బై కొట్టిన గూగుల్ ప్లస్ గుండోత్రా

  ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగుల్ నిర్వహిస్తున్న గూగుల్ ప్లస్ సృష్టికర్త, భారతీయుడు అయిన వివేక్ గుండోత్రా గూగుల్ సంస్థకు గుడ్ బై కొట్టేశారు. తాను గూగుల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన గూగుల్ ప్లస్ అకౌంట్లో మెసేజ్ పెట్టారు. మద్రాసు ఐఐటీలో చదువుకున్న గుండోత్రా 2007లో గూగుల్‌లో చేరారు. ఫేస్‌బుక్‌ తరహాలో వుండే గూగుల్ ప్లస్‌ని కనుక్కున్న ఆయన గూగుల్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నత స్థానంలో వున్నారు. గుండోత్రా గత ఎనిమిదేళ్ళుగా గూగుల్‌లో పనిచేస్తున్నారు. తాను గూగుల్‌కు ఎందుకు రాజీనామా చేస్తున్నదీ గుండోత్రా తన మెసేజ్‌లో ప్రస్తావించలేదు. గుండోత్రా రాజీనామాపై గూగుల్ సీఈఓ లారీ పేజ్ తన స్పందనను తెలియజేస్తూ, గుండోత్రా గూగుల్‌కి రాజీనామా చేయడం విచారకరమే. అయినప్పటికీ ఆయన గూగుల్‌కి, గూగుల్ ప్లస్‌కి చేసిన సేవలు సామాన్యమైనవి కావు. గూగుల్ ప్లస్ రూపకల్పనలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనదని అన్నారు.ఇప్పుడు గూగుల్ గుండోత్రా లాంటి మరో ప్రతిభావంతుడిని ‘సెర్చ్’ చేసే పనిలో వుంది.

హైజాక్ కాదు.. మందుబాబు నిర్వాకం!

      బాగా మందు కొడితే ఆకాశంలో విహరిస్తున్నట్టుంటుందని అంటారు. మరి ఆకాశంలో విహరిస్తూ బాగా మందు కొడితే ఎలా వుంటుంది? ఏదో ఒక కోతి పని చేయాలని అనిపిస్తుంది. అలాంటి కోతిపనే ఆస్ట్రేలియాకు చెందిన ఒక మందుబాబు చేశాడు.ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నుంచి ఇండోనేసియాలోని బాలి ద్వీపానికి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఆ మందుబాబు కాక్‌పిట్‌లోకి వెళ్ళి నానా హడావిడి చేశాడు. తప్పతాగిన మత్తులో ఏం వాగాడోగానీ, పైలెట్ విమానం బాలీకి వెళ్ళిన తర్వాత విమానం హైజాక్ అయిందని అధికారులకు సమాచారం ఇచ్చాడు. అంతే అక్కడితో పోలీసులు, మిలటరీ అని బోలెడు హడావిడి మొదలైంది. పోలీసులు రంగప్రవేశం చేసి మందుబాబు తప్పతాగి చేసిన హడావిడే తప్ప హైజాకూ గట్రా ఏమీ జరగలేదని తేల్చారు.

మా ఆస్తులపై సీబీఐ విచారణ కాంగ్రెస్ కుట్రే: హరీష్‌రావు ఆక్రోశం

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, మెదక్ ఎంపీ విజయశాంతి తన ఆస్తులపై విచారణకు నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలాజీ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుకు స్పందించిన సీబీఐ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు ఆయన మేనల్లుడు హరీష్‌రావు, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీబీఐ కోర్టు ఆ ముగ్గురి ఆస్తులపై విచారణ జరపాలని శుక్రవారం ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమని హరీష్ రావు అన్నారు. తమ ఆస్తులపై విచారణకు తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. తన మాట వినని పార్టీలను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావులా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. తన రాజకీయ అవసరాల కోసం సీబీఐను వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని హరీష్ రావు అన్నారు.

శోభా నాగిరెడ్డి డ్రైవర్ భయపడే పారిపోయాడా.. లేక...?

      అతి వేగంగా కారు నడిపి భూమా శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలవటానికి కారణమైన కారు డ్రైవర్ పేరు నాగేంద్ర. ఇతను శోభా నాగిరెడ్డికి రెగ్యులర్ డ్రైవర్ కాదు. రెగ్యులర్‌గా వచ్చే డ్రైవర్ అనారోగ్య కారణంగా లీవు పెట్టడంతో ఆ స్థానంలో తాత్కాలికంగా నాగేంద్ర డ్రైవర్‌గా వచ్చాడు. చాలా వేగంగా కారు డ్రైవ్ చేసిన నాగేంద్ర శోభా నాగిరెడ్డి వారిస్తున్నా వినకుండా కారును వేగంగా నడిపాడు. ఎదురుగా ధాన్యం కుప్ప కనిపించడంతో కారును అదుపు చేయలేక ఇంత దారుణానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించగా, నాగేంద్ర మాత్రం స్వల్పంగా గాయపడ్డాడు. నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర మేడమ్ భౌతిక కాయాన్ని చూసి వస్తానని చెప్పి ఆస్పత్రి నుంచి బయటకి వచ్చి కనిపించకుండా పోయాడు. తానే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అని తెలిస్తే శోభ అభిమానులు తనమీద దాడిచేసే అవకాశం వుందని భయపడి నాగేంద్ర పారిపోయాడా.. లేక ఇతర కారణాలేమైనా వున్నాయా అనే ఆలోచన పోలీసులలో మొదలైంది. నాగేంద్ర కోసం పోలీసులు వెతుకుతున్నారు.

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం కోర్టు స్టే

  మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడులోని ఏఐడీఎంకే ప్రభుత్వం తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసానికి నివేదించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ రాజీవ్ హంతకులు జైల్లోనే వుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం‌ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును ప్రతిపాదించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ కేసులో ఉత్పన్నమైన ధర్మసందేహాలను రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించింది. ఈ కేసులో ముందుగా మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడం, అనంతరం వారిని విడుదల చేయాలని నిర్ణయించడం వంటి అంశాలను బెంచ్ ధర్మాసనం ముందుంచింది. ఎవరైనా హంతకులను విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమా లేక కేంద్ర ప్రభుత్వమా అనేది నిర్థారణ చేయాలని కోరింది.