కేసీఆర్, హరీష్ రావులపై సీబీఐ విచారణ

  ఈ ఎన్నికలలో గెలిచి తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రి అవుదామని కలలుకంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి ఈరోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ వదేరా అనే న్యాయవాది వేసిన ఒక పిటిషనుపై స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు, మాజీ తెరాస నేత మరియు ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన విజయ శాంతి ముగ్గురిపై వెంటనే యఫ్.ఐ.ఆర్. నమోదు చేసి వారు ఆస్తులపై విచారణ చెప్పట్టాలని సీబీఐని ఆదేశించింది.   ఊహించినట్లుగానే, హరీష్ రావు దీనిపై స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధులు దారికి రానప్పుడు తన చేతిలో ఉన్న సీబీఐని వారిపైకి ఉసిగొల్పడం కొత్తేమీ కాదు. ఈ ఎన్నికలలో కేసీఆర్ ధాటికి తట్టుకోలేక ఎన్నికలలో ఓడిపోతామని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తనకలవాటయిన విద్య ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ బెదిరింపులకి మేము బెదిరేవాళ్ళము కాము. మేము ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగానే కాంగ్రెస్, తెదేపా నేతలపై విచారణ జరిపించి దోషులని తెలిసిన వారిని జైలుకి పంపడం ఖాయం,” అని ఘాటుగా జవాబిచ్చారు.   ఇక ఇటీవలే తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి కూడా దీనిపై స్పందిస్తూ “కోర్టు ఆదేశాలను నేను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. సీబీఐ వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.

జగన్మోహన్ రెడ్డికి కేవీపీ గండం

  టైటానియం కుంభకోణంలో కెవీపి రామచంద్రరావు అరెస్టు కోసం అమెరికా దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు భారత ప్రభుత్వానికి అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆయనకి ఆత్మ వంటివాడినని సగర్వంగా చెప్పుకొంటూ సదా తెర వెనుకే ఉంటూ చక్రం తిప్పిన కేవీపీ వల్ల అటు కాంగ్రెస్, ఇటు వైకాపా రెండూ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలే ఆయనకు కోరి మరీ రాజ్యసభ సీటు ఇచ్చినప్పటికీ, ఈ వ్యవహారం బయటపడగానే దానితో తమ పార్టీకేమీ సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకొంది. ఈ వ్యవహారంలో కేవీపీయే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు. ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు వీలయితే ఆయనను కాంగ్రెస్ ఆదుకోవచ్చునేమో కానీ కీలకమయిన ఈ ఎన్నికల సమయంలో అటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వెనకేసుకు వచ్చినట్లయితే, అది మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించి దూరంగా జరిగి ఉండవచ్చును.   ఇక జగన్మోహన్ రెడ్డి చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్నట్లుగా నేటికీ తన తండ్రి పేరు చెప్పుకొనే ప్రజలను ఓట్లు కోరుతున్నారు. ఆయన హయంలో ఎటువంటి అవినీతి జరగలేదని, అంతా దేవుడి పాలనేనని, తాను ముఖ్యమంత్రి అయిన తరువాత తాను కూడా సరిగ్గా అటువంటి పాలనే అందిస్తానని డంకా భజాయించి మరీ చెప్పుకొంటున్నారు. అటువంటప్పుడు కేవీపీపై వచ్చిన ఆరోపణలకు ఆయన తప్పక సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఆరోపణలతో తనకు, తన తండ్రికి ఎటువంటి సంబందమూ లేదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేవీపీ తన తండ్రి ఆత్మవంటి వారు గనుక.   ఒకవేళ ఇవే ఆరోపణలు ఏ సీబీఐ, ఈడీ లేదా సిఐడీ సంస్థో లేక మరో రాజకీయ పార్టీయో చేసి ఉండి ఉంటే, అవి తనను ఎన్నికలలో దెబ్బతీసేందుకే తన ప్రత్యర్ధులు చేస్తున్న మరో కుట్ర అని జగన్ ఈపాటికి చాలా గగ్గోలుచేస్తూ, చివరికి ఈ అంశం ద్వారా కూడా ప్రజల నుండి ఎంతో కొంత సానుభూతి పొందే ప్రయత్నం తప్పకుండా చేసి ఉండేవారు. కానీ ఈ ఆరోపణలు అమెరికాలో దర్యాప్తు సంస్థ చేయడంతో జగన్ సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఏ మీడియా ప్రతినిధో హటాత్తుగా ఇదే ప్రశ్నవేసినట్లయితే దానికి సమాధానం చెప్పడం కష్టమే గనుక ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిచాలా అని వైకాపా ఆలోచనలు చేస్తోంది.   కానీ మీడియా కంటే ముందు ఆ ప్రశ్న చంద్రబాబు వేయనే వేసారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ, ఆయన ఆత్మ ఇంకా రాష్ట్రంలో కేవీపీ రూపంలో సంచరిస్తూనే ఉందని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎందుకు ఇంతవరకు నోరు విప్పడం లేదని ఆయన నిన్న ప్రశ్నించారు.   అయితే దానికి జగన్ ఇంకా స్పందించవలసి ఉంది. సాధారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయినప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా చేసేదొకటే. ప్రజల దృష్టిని మళ్ళించేందుకు మరో ఆసక్తికరమయిన అంశం తలకెత్తుకోవడమో లేక ప్రత్యర్ధ పార్టీ నేతల భాగోతం ఏదో బయటపెట్టడమో చేస్తుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు ఏ ఉపాయం చేస్తారో చూడాలి.

ఆళ్ళగడ్డ పోలింగ్ ఆగదు: ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్

  ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీలో వున్న భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆళ్ళగడ్డ ఎన్నిక వాయిదాపడే అవకాశం వుందని అందరూ భావించారు. అయితే ఆళ్ళగడ్డ ఎన్నిక వాయిదాపడదని, యథాతథంగా జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన భన్వర్‌లాల్ ఎన్నికలు ఆపకుండా జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని ప్రకటించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం ఆళ్ళగడ్డలో ఎన్నికలు వాయిదా పడకుండా జరుగుతాయని ఆయన చెప్పారు. సాధారణంగా ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థి మరణిస్తే సదరు నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడతాయి. వైసీపీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన పార్టీయే తప్ప గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడం వల్ల శోభా నాగిరెడ్డి మరణించినప్పటికీ ఎన్నిక వాయిదా పడలేదు.

రాహుల్ కంటే ఆమాద్మీయే బెస్ట్ అట!

  ఉవ్వెత్తున ఎగసిపడి వెనక్కి వెళ్లిపోయిన కెరటంలా, ఆమాద్మీ పార్టీ యావత్ భారతదేశాన్ని ఒక ప్రభంజనంలా కమ్ముకొని, కేవలం 49 రోజులలోనే కుంటిసాకులతో చేతులెత్తేసి అధికారం వదులుకొని, తనపై మాన్యులు, సామాన్యులు పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేసింది. అయితే, ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననట్లు డిల్లీ వంటి చిన్నరాష్ట్రాన్ని గట్టిగా రెండు నెలలు కూడా పరిపాలించలేని ఆమాద్మీ నేతలు, యావత్ దేశాన్ని పరిపాలించేసేందుకు, దేశ వ్యాప్తంగా ఎన్నికలలో పోటీకి సిద్దమయిపోయారు. అయితే ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన ఆమాద్మీ నేత మరియు మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అనేక చోట్ల ఆ సామాన్యుల చేతిలోనే చెంప దెబ్బలు తిన్న తరువాత కానీ జ్ఞానోదయం కాలేదు. తాను చాలా తొందరపడి ప్రజలు అప్పజెప్పిన భాధ్యతని నిర్వర్తించకుండా తప్పించుకొని వారి నమ్మకాన్ని వమ్ము చేసానని అనేక మార్లు ప్రజల ముందు లెంపలు వేసుకొన్నారు. అలాగని తమ తీరు మాత్రం ఎన్నటికీ మారదని తెలియజేస్తున్నట్లు, ప్రముఖుల మీద పోటీకి దిగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.   అయితే అదేమీ ప్రజాస్వామ్య, చట్ట విరుద్దం కాదు గనుక వారినెవరూ తప్పుపట్టలేరు. కాని ఆవిధంగా పోటీ చేయడంలో వారి వెనుక ఉన్న సూత్రదారులెవరు? ఏ ప్రయోజనం ఆశించి ఆవిధంగా చేస్తున్నారు? అని సామాన్యులకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వారి ఉద్దేశ్యాలు ఏమయినప్పటికీ, వారు కూడా పోటీలో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల లాగే వారు కూడా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు. విజయం సాధించాలని కోరుకొంటున్నారు. అయితే ఈ ఆమాద్మీ గురించి దేశంలో ఆమాద్మీలు ఏమనుకొంటున్నారు? అనే ప్రశ్నకు జవాబుని టైమ్స్ అనే ప్రముఖ వార్త పత్రిక క్లుప్తంగా తెలియజెప్పింది.   ఆ పత్రిక 2014లో 100 మంది అత్యంత ప్రజాకర్షక వ్యక్తులు ఎవరనే సంగతి కనిపెట్టేందుకు తన పాటకుల అభిప్రాయాలు కోరితే వారిలో ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కి అనుకూలంగా 2,61,114 మంది ఓటువేయగా, దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నారని అందరూ భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఆయనకంటే సరిగ్గా లక్షవోట్లు తక్కువగా పడ్డాయి. అంటే మోడీకి కేవలం 1,64,572 మంది మాత్రమే సానుకూలంగా ఓట్లు వేసారు.   మరి వీరిద్దరి సంగతీ తెలుసుకొన్నపుడు, ‘ప్రధానమంత్రి పదవి నా జన్మహక్కు!’ అని భావిస్తున్న యువరాజు రాహుల్ గాంధీకి ఎంతమంది అనుకూలంగా ఓట్లు వేసారో తెలుసుకోవాలని ఎవరికయినా ఆసక్తి కలగడం సహజం. రెండు రోజుల క్రితం ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో తాను నూటికి 103 శాతం ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సంసిద్దంగా ఉన్నానని తన మనసులో మాటను బయటపెట్టారు. కానీ ఆయనని అరవింద్ కేజ్రీవాల్, మోడీలతో పోలిస్తే 50శాతం మంది కూడా సానుకూలంగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు అనుకూలంగా కేవలం 96,070 మంది మాత్రమే ఓట్లు వేసారు. సామాన్యుల చేతిలో చెంప దెబ్బలు తింటున్నపటికీ నేటికీ అరవింద్ కేజ్రీవాలే యువరాజా వారి కంటే అన్ని విధాల మిన్నఅని సామాన్య ప్రజలు అనుకొంటుంటే, ఆయన మాత్రం నూటికి 103 శాతం ప్రధాన మంత్రి కుర్చీలో తానే కూర్చోవాలని ఆశించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. జనాలు నవ్వితే నవ్విపోదురు గాక నాకేటి? అని ఆయన అనుకొంటున్నారేమో?

శోభా నాగిరెడ్డి దుర్మరణం: డ్రైవర్ లీవ్ పెట్టినందువల్లే...

      శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించడానికి అనేక కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయాణించేవారిని కాపాడటానికి కారులో ఎన్నో సదుపాయాలున్నప్పటికీ సమయానికి అవి ఉపయోగపడలేదు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన వ్యక్తి శోభా నాగిరెడ్డి దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న డ్రైవర్ కాదు. ఆ డ్రైవర్ తన వ్యక్తిగత పనుల వల్ల లీవ్ పెట్టడంతో మరో వ్యక్తిని డ్రైవర్‌గా తీసుకున్నారు. శోభా నాగిరెడ్డి కారు ప్రమాదానికి గురైనట్టు తెలుసుకున్న అసలు డ్రైవర్ దుర్ఘటన స్థలానికి వచ్చి భోరున విలపించాడు. తాను లీవ్ పెట్టకుండా వుంటే మేడమ్ బతికి వుండేవారని కన్నీరుమున్నీరవుతూ చెప్పాడు.

పవన్ కళ్యాణ్ మీద కేసీఆర్ సెటైర్లు

  '     తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ కూటమికి ఈ ఎన్నికలలో ప్రచారం చేయడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ శుక్రవారం నుంచి తెలంగాణలో ప్రచారం చేయబోతున్నాడు. ఇదిలా వుంటే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వెటకారంగా మాట్లాడాడు. ఆమధ్య పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని ప్రకటించినప్పుడు కేసీఆర్ ఓ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ పేరు తనకి గుర్తులేనట్టు పక్కన వున్నవాళ్లని కనుక్కుని ‘‘ఆ... పవన్ కళ్యాణ్’’ అన్నారు. ఇది కేసీఆర్ ఎదుటివాళ్ళని కించపరిచే పద్ధతుల్లో ఒకటి. అయితే కేసీఆర్ వ్యవహరించిన ఈ తీరు పవన్ కళ్యాణ్‌ని బాగా హర్ట్ చేసింది. ఆ బాధని ‘జనసేన’ పార్టీ పెట్టిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి సభలో ఆయన వ్యక్తం చేశాడు.   కేసీఆర్ తన పేరు గుర్తురానట్టు చేసిన నటనను పవన్ కళ్యాణ్ అనుకరించి చూపించాడు. ఇలాంటి ఎన్ని వెటకారాలు చేసినా భరిస్తానని చెప్పాడు. అలా చెప్పినప్పటికీ కేసీఆర్ వెటకారం పవన్‌ని ఎంత హర్ట్ చేసిందో ఆయన ముఖంలో కనిపించింది. ఇప్పుడు కేసీఆర్ మరోసారి గురువారం నాడు ఓ ఎన్నికల మీటింగ్‌లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అదే తరహా వెటకారం ప్రదర్శించాడు. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించి, ‘‘ఎవరా యాక్టర్’’ అని, పవన్ కళ్యాణ్ పేరు మరచిపోయినట్టు నటించి, వెనుక వున్న గన్‌మాన్స్ ని అడిగి పేరు తెలుసుకుని ‘‘ఆ పవన్ కళ్యాణ్’’ అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్‌కి ఎక్కడో కాలేలా చేసే వెటకారం. కేసీఆర్ అక్కడితో ఆగకుండా.. ‘‘ఆ పవన్ కమాల్ కళ్యాణం’’ అనే మాట విసిరారు. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వివాహ జీవితం మీద కేసీఆర్ అంటించిన చురక. మరి కేసీఆర్ వేసిన చురకలకి శుక్రవారం నుంచి తెలంగాణలో పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

కారులో సదుపాయాలూ శోభా నాగిరెడ్డిని కాపాడలేకపోయాయి

      కారు ప్రమాదంలో మరణించిన రాజకీయ నాయకురాలు శోభా నాగిరెడ్డి ఉపయోగించే కారు అత్యాధునికమైన కారు. టైర్లు మంచి గ్రిప్‌తో వుంటాయని చెబుతారు. అయితే వరికుప్పలని తప్పించే ప్రయత్నంలో టైర్లు జారిపోయి కారు అదుపు తప్పింది. యాక్సిడెంట్ జరిగిన పక్షంలో కారులో వున్న బెలూన్లు తెరుచుకుని కారు ముందు సీట్లో వున్న వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే సదుపాయం కూడా ఆ కారులో వుంది. అయితే సమయానికి కారులో బెలూన్లు తెరుచుకోలేదు. ఇటీవలి కాలంలో అన్ని కార్లలో వుంటున్నట్టుగానే ఈ కారులో కూడా సీటు బెల్టు వుంది. అయితే శోభా నాగిరెడ్డి సీటు బెల్టు ధరించకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు డోర్ తెరుచుకుని శోభా నాగిరెడ్డి కారులోంచి బయటకి పడిపోయారు. దాంతో తలకు తీవ్రమైన గాయం తగిలింది. దాంతో పరిస్థితి విషమించింది.

కేవీపీకి ‘రెడ్‌కార్నర్’పై చేతులెత్తేసిన ఏఐసీసీ

      రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వుండగా వైఎస్సార్, కేవీపీ ఆధ్వర్యంలో జరిగిన టైటానియం కుంభకోణం విషయంలో అమెరికా కేవీపీ రామచంద్రరావుకు ‘రెడ్ కార్నర్’ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద త్వరలో కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కుంభకోణంతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా చేతులెత్తేసింది. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన స్పందనను తెలియజేసింది. ఈ విషయంలో అమెరికా స్పందిస్తున్న ఆరోపణలకు కేవీపీ రామచంద్రరావు వివరణలిచ్చుకోవాలని, దీనితో తమకెలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తెలియజేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు కేవీపీ రామచంద్రరావే వివరణలిచ్చుకోవాలి. ఈ కుంభకోణంలో ఆయన దోషిగా ఖరారైతే శిక్ష అనుభవించక తప్పదు అని ఆనంద్ శర్మ అన్నారు.

శోభా నాగిరెడ్డి మృతి: షాక్‌లో కుటుంబం

      భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్రం యావత్తూ జీర్ణించుకోలేకపోతోంది. ఆమె కుటుంబం అయితే షాక్‌లో వుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. శోభా నాగిరెడ్డి పిల్లలు తల్ల మృతదేహం మీద పడి భోరున రోదిస్తున్నారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఆమెకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి రోదిస్తూనే వున్నారు. ఆమె మరణించినట్టు ప్రకటించినప్పటి నుంచి ఆయన భోరున విలపిస్తున్నారు. ఊహించని షాక్‌కి గురైన ఆయన చాలాసేపు స్పృహతప్పి పడిపోయారు. శోభ తండ్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్ర శోకంలో మునిగిపోయి వున్నారు. తన చిన్న కూతురు శోభ గృహిణిగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కాకుండా, రాజకీయాల్లో కూడా రాణిస్తోందన్న సంతోషంలో వున్న తమ జీవితాలను ఈ విషాదం అల్లకల్లోలం చేసిందని ఆయన అన్నారు.

శోభా నాగిరెడ్డి మృతి: రాజకీయాలు ప్రారంభం

      ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకోవడం పార్టీలకి, వాటిలోని వ్యక్తులకు మామూలైపోయింది. ఇప్పుడు యాక్సిడెంట్‌లో మరణించిన భూమా శోభా నాగిరెడ్డి మరణం మీద కూడా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రాజకీయాలు శోభ మరణం ముందు నుంచే ప్రారంభమయ్యాయి. శోభా నాగిరెడ్డి చికిత్స పొందిన కేర్ ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఈ రాజకీయాలకు తెరతీశారు. శోభా నాగిరెడ్డి కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణమని ఆమె అన్నారు. రోడ్డు మీద రైతులు ధాన్యం ఆరబోయడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, అలా ధాన్యం ఆరబోసే పరిస్థితులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమని ఆమె అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది కాబట్టి ఈ యాక్సిడెంట్‌కి రాష్ట్రపతే కారణమని ఆరోపించలేదు. రాష్ట్రపతి వరకూ రానందుకు లక్ష్మీపార్వతి మేడమ్‌కి థాంక్స్. ఇదిలా వుంటే జగన్ మీడియా ఆయన ముఖ్యమంత్రి కావడమే శోభా నాగిరెడ్డి ముఖ్య లక్ష్యమని ప్రచారం చేస్తోంది. దానికి సంబంధించి శోభా నాగిరెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తోంది.

బాలకృష్ణ ‘లెజెండ్’కి ఇ.సి. బ్రేక్ వేస్తుందా?

      నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలని జగన్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేయడంతోపాటు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ఓటర్లమీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి ఆ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని వైసీపీ ఎన్నికల కమిషన్‌ని అభ్యర్థించింది. దీని మీద తెలుగుదేశం వర్గాలు వైసీపీ మీద మండిపడ్డాయి. ఇదిలావుంటే వైసీపీ అభ్యర్థనకు స్పందించిన ఇ.సి. ‘లెజెండ్’ సినిమా చూసి అందులో రాజకీయ అంశాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయేమో పరిశీలించాలని నిర్ణయించింది. దీంతో ఈ సినిమాని ఎన్నికల కమిషన్ ప్రతినిధులకు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఈ సినిమా చూసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ‘లెజెండ్’ ప్రదర్శనను నిలిపివేయడానికి ఆదేశాలు జారీ చేస్తారన్న నమ్మకంలో వైసీపీ నేతలు వున్నారు. అయితే అలా జరిగే అవకాశమే లేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూలు ఖరారు

      బీజేపీ, టీడీపీ కూటమికి తన మద్దతు ప్రకటిస్తానని, ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఈ రెండు పార్టీలు పవన్‌ కళ్యాణ్‌ని తెలంగాణలో ప్రచారానికి దించేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిపే ఎన్నికల ప్రచారం షెడ్యూలు ఖరారైపోయింది. శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ నాయకులతో కలసి తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈనెల 25న హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 27న ఎల్బీనగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో, 28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.

సబ్బం హరి పోటీ ఎవరితో?

  అనకాపల్లి సిట్టింగ్ యంపీ సబ్బం హరి, కొన్ని నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే వైకాపా తరపున పనిచేసారు. జగన్ జైలు నుండి విడుదల కాగానే కాంగ్రెస్ ను వీడి వైకాపాలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నారు. అయితే ఆయన వైకాపాలో చేరక మునుపే అత్యుత్సాహానికి పోయి “ఎన్నికల తరువాత తమ పార్టీ (వైకాపా) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని” నోరుజారడంతో, ఆయనకి వైకాపా తలుపులు మూసుకుపోయాయి.   ఆ తరువాత నుండి మళ్ళీ ఆయన నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తూ, అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమంతో మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డికి క్రమంగా దగ్గరయ్యారు. ఆనక కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో, కాంగ్రెస్ నుండి వేరుపడి కొత్త పార్టీ పెట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన కూడా సమైక్యమయిపోయారు. ఈసారి జైసాపా పార్టీ టికెట్ మీద వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.   ఆయన వైజాగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం తను పార్టీలో చేరక ముందే తన మొహం మీద తలుపులేసి అవమానించిన వైకాపాపై ప్రతీకారం తీర్చుకోవడానికే! ఈసారి ఎన్నికలలో తాను గెలవకపోయినా పరువాలేదు కానీ విజయమ్మ గెలవకుండా అడ్డుపడగలిగితే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిని ఓడించిన ఘనత దక్కుతుంది. అంతే గాక తమ పార్టీ గౌరవాధ్యక్షురాలినే గెలిపించుకోలేకపోయినందుకు వైకాపాకు తీరని అవమానమే. ఆవిధంగా వైకాపా ప్రతీకారం తీర్చుకోన్నట్లవుతుందని సబ్బం హరి ఆలోచన.   సబ్బం హరి అందుకు సమర్దుడేనని చెప్పవచ్చును. బీజేపీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కంబంపాటి హరిబాబు పేరు వైజాగ్ ప్రజలు విని ఉండకపోవచ్చునేమో కానీ వైజాగ్ కి మాజీ మేయర్ గా విశేష సేవలందించిన సబ్బం హరి గురించి తెలియని వారుండరు. స్థానికుడయిన ఆయనకు అనేకమంది అనుచరులున్నారు, అన్ని పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఆయన ఈ ఎన్నికలలో తాను గెలిచినా గెలవకున్నా విజయమ్మ విజయావకాశాలకు గండి కొట్టగల సమర్ధుడు.   ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్ధులలో ఎవరో ఒకరికి లోపాయికారిగా సహకరించి నట్లయితే విజయమ్మ విజయం అనుమానమే అవుతుంది. ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన భావించినట్లయితే ఆ పార్టీ అభ్యర్ధికి సహకరించవచ్చును. తద్వారా ఎన్నికల తరువాత ఆయన బీజేపీలోకి మారిపోయి, చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఏ రాజ్యసభ సీటులోనో ఒద్దికగా సర్దుకు పోవచ్చును. అందువల్ల ఒకవేళ విజయమ్మ ఓడిపోయినట్లయితే ఆమె ఓటమికి సబ్బం హరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని ఆయనతో రాజీపడినట్లయితే, ఆయన విజయమ్మకే సహకరించినా ఆశ్చర్యం లేదు.

వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వదోదర, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. వదోదరలో మోడీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు లక్షలమంది కాషాయదళంతో ప్రదర్శనగా వెళ్ళి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవ్య మనవడు జస్టిస్ గిరిధర్ మాలవ్య వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్‌ని బలపరిచారు. వారణాసిలోనే నివసించే షహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు కూడా తన నామినేషన్‌ని బలపరిస్తే బాగుంటుందని నరేంద్ర మోడీ భావించారు. అయితే తాము రాజకీయాలకు పూర్తిగా దూరంగా వుండేవారని బిస్మిల్లాఖాన్ చెబుతూ వుండేవారని, అందువల్ల మీ నామినేషన్‌ని మేము బలపరచలేమని బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు చెప్పడంతో మోడీ వారిని ఇబ్బంది పెట్టలేదు.

శోభానాగిరెడ్డి మృతి: తల్లడిల్లుతున్న ఆళ్ళగడ్డ ప్రజలు

      తమ ప్రియతమ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్ళగడ్డ ప్రజానీకం తల్లడిల్లుతోంది. శోభ మరణవార్త వినగానే ఆళ్ళగడ్డలో విషాద ఛాయలు అలముకున్నాయి. శోభ ఏ పార్టీలో వున్న ఆళ్ళగడ్డ ప్రజలు ఎప్పుడూ ఆమెకు మద్దతుగానే వున్నారు. తమ ప్రాంతానికి చెందిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తెగా, భూమా నాగిరెడ్డి భార్యగా స్థానిక ప్రజలు ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలను వారు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని భావిస్తున్న తరుణంలో ఆమె ఇలా దుర్మరణం పాలు కావడాన్ని అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాత్రి ఎన్నికల ప్రచారంలో ఎంతో చురుకుగా పాల్గొన్న ఆమె తెల్లవారేసరికి ఇలా అయిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఆమె ఏపార్టీలో ఉన్నా పార్టీలో సంబంధం లేకుండా ఆమెని గెలిపించుకునే ఆళ్ళగడ్డ ప్రజలు ఈసారి కూడా ఆమె మంచి మెజారిటీతో గెలవటం ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఈ ఊహించని దుర్ఘటన వారి మధ్య నుంచి శోభా నాగిరెడ్డిని తీసుకెళ్ళిపోయింది. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా ఆళ్ళగడ్డ పరిసరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.