Read more!

మద్యం సిండికేట్ డొంక మళ్ళీ కదిలింది

 

ఒకప్పుడు మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి తనకు పక్కలో బల్లెంలా ఉన్న పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లొంగదీసేందుకు, ఆయన విజయనగరం జిల్లాలో నడిపిస్తున్న లిక్కర్ సిండికేట్ పై ఏసీబీ విచారణకు ఆదేశించేరు. అయితే అది కక్ష సాధింపు చర్యగా కనబడకూదదనే ఆలోచనతో రాష్ట్రంలో కొన్ని ఇతర జిల్లాలలో జరుగుతున్న మద్యం సిండికేట్ వ్యాపారాలపై దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా పలు జిల్లాలలో నిర్వహించిన దాడులలో అనేకమంది అధికార, ప్రతిపక్ష పార్టీల యం.యల్యేలు. ప్రభుత్వాధికారులు, బ్రోకర్లు, చివరికి కొందరు పత్రికా విలేఖరులు కూడా పట్టుబడ్డారు. అయితే ఇదంతా బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసి మొదలుపెట్టినందున, ఏసీబీ అధికారులు విజయనగరంలో చాలా లోతుగా దర్యాప్తు చేసి, ఈ సిండికేట్ మూలాల వరకు చొచ్చుకు పోయారు. అప్పుడు బొత్స హడావుడిగా డిల్లీ వెళ్లి చక్రం తిప్పితే గానీ, ఈ దర్యాప్తుకు బ్రేకులు పడలేదు. అంతటితో దర్యాప్తు ఆగిపోయింది. ఏసీబీ అధికారులు ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొంటూ ఎంతో శ్రమించి తయారుచేసిన నివేదికలో రాజకీయ నాయకుల పేర్లన్నీ కనబడకుండా వాటంతటవే మాయమయిపోయాయి. ఆ తరువాత కిరణ్ కూడా చల్లబడిపోవడంతో ఏసీబీ అధికారులు మిగిలిన నివేదికను కూడా అటకెక్కించేసారు. ఆ తరువాత ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారం, తెలంగాణా ప్రకటన, సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆ కధ కంచికి వెళ్లిపోయింది. కానీ మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఏసిబీ అధికారులు ఆ నివేదికను అటక మీద నుండి దింపి దుమ్ము దులిపి, ఈ మద్యం సిండికేట్ లో నిందితులుగా పేర్కొనబడ్డ 34 మంది ఎక్సైజ్ అధికారులపై చర్యలు విచారణకు అనుమతించాలంటూ గవర్నర్ నరసింహన్ కోరారు. ఆయన అందుకు వెంటనే అనుమతి ఇస్తూ ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దీనినే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని అంటారేమో! దర్యాప్తుకి ఆదేశించిన కిరణ్ పదవిలో లేరు పార్టీలోను లేరు. బొత్స కూడా ఇప్పుడు మాజీ అయిపోయారు. నివేదికలో పేర్లు ఎక్కిన అధికారులు మాత్రం ఇంకా ఉద్యోగాలలోనే ఉన్నారు గనుక అడ్డంగా బుక్ అయిపోయారు.