బొత్స కూతురు పెళ్లికి కెసిఆర్ కుమార్తె

                        పిసీసీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె వివాహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పలువురు విజయనగరం వెళుతున్నారు. బొత్స ఆహ్వానంపై కేసీఆర్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీలో చర్చించిన తర్వాత వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి హాజరుకానున్నారు. కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంతో హాజకలేకపోతున్నారు. బొత్స కూతురు పెళ్లికి కాంగ్రెసు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

దారి మార్చుకున్న కారు

కారు తీరు మారుతోంది. రోజులతరబడి ఢిల్లీలో మకాం వేసి ప్రత్యేక రాష్ట్రంకోసం లాబీయింగే చేశారో లేక ప్రత్యర్ధులు ఆరోపించినట్టుగా సొంతపనులే చూసుకున్నారో తెలీదుగానీ.. డ్రైవర్ పోస్ట్ లో ఉన్న కేసీఆర్ లో మాత్రం చాలా మార్పు కనిపిస్తోంది. పూర్తిగా మట్టి కరుచుకు పోయిన పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేసీఆర్ గట్టి ఏర్పాట్లే చేసుకుంటున్నారు.     అయినవాళ్లనీ, కానివాళ్లనీ, కనిపించినవాళ్లందరినీ కారులో ఎక్కించేసుకుని కలుపుపోయి బలప్రదర్శన చేయాలన్న ఆలోచన ఇప్పుడు కేసీఆర్ మైండ్ ని తెగ తొలిచేస్తోంది. అందుకే చిన్న నేతల్నైనా సరే కలిసి తీరాలన్న పట్టుదలతో సారున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయ్.   పక్క పార్టీల్లో కనిపిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్ద నేతలే ఇప్పుడు టార్గెట్. ఎలాగైనా వలవేసి వాళ్లని ఒడిసిపట్టుకుని, పార్టీలోకి లాగేయాలన్న తలంపుతో బొబ్బిలి దొరవారు గట్టిగా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. పక్కా ప్లాన్ తో ముందుకెల్తే తప్ప పని కాదని నిర్ణయించుకున్న కేసీఆర్ అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించి చూస్తున్నారట.   పరిగి టిడిపి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని ఆల్రెడీ లైన్ లో పెట్టేశారు. నాగం జనార్దన్ రెడ్డిని, వేణుగోపాలాచారిని మెల్లగా దువ్వి లోపలికి లాక్కునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోంది. తనకున్న వశీకరణ శక్తులన్నింటినీ ప్రయోగించి, ఇకపై అసలు తెలంగాణలో మరో పార్టీయే లేదనిపించేందుకు దొరవారు అహరహం శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది.  అసలు మరో పార్టీయే లేకపోతే అంతా మనదేకదా.. అన్న సూత్రాన్ని అందరికీ నూరిపోస్తున్నారటకూడా.  

పాలడుగు వ్యాఖ్యలు సరైనవేనా?

  కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఆచి తూచి మాట్లాడతారని చాలామందికి ఓ నమ్మకం. హుందాగా రాజకీయం నడపడం పాలడుగు ప్రత్యేకతని చాలామంది చెప్పుకుంటారుకూడా.. ఎప్పుడూ కాంట్రవర్సీల జోలికిపోయినట్టుకూడా కనిపించిన బాపతు కానే కాదు. కానీ ఉన్నట్టుండి ఆయనో బాంబు పేల్చి కలకలం రేపారు.   వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేతలంతా నిజాయతీ లేనోళ్లే అంటూ పాలడుగు చేసిన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చాలామందికి మింగుడుపడలేదు. కొందరైతే ఔరా.. ఏంటీ పెద్దాయన ఇలా మాట్లాడ్డం మొదలెట్టాడు అని ముక్కున వేలేసుకున్నారుకూడా.. ముందుగా ఈ మాటనాలనుకున్న చాలామంది రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకుని వెనకడుగువేశారు. పాలడుగు మాత్రం వీరోచితంగా చెప్పదలచుకున్న నాలుగు ముక్కలూ  బైటపెట్టేశారు.   ఐదేళ్లపాటు పాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే, నేతలు ప్రలోభాలకు లోనై సొంతపార్టీల్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తున్నాయంటూ పాలడుగు పదునైన విమర్శలు చేశారు. కిందటి ఎన్నికల్లో.. నీతి, నిజాయతీ లేనివాళ్లకు టిక్కెట్లివ్వడంవల్లే ఇప్పుడిలిం పరిస్థితి తలెత్తిందని ఆయనకు నిశ్చితాభిప్రాయం.   రాజకీయాల్లో విలువలు అంతరించిపోతున్నాయని కామెంట్ చేసిన పాలడుగు.. వైకాపాలో చేరిన నేతలంతా ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన రోజు త్వరలోనే వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు. నిజానికి వై.ఎస్ కుటుంబంతో పాలడుగుకి బీరకాయ పీచు చుట్టురికంకూడా ఉంది. కానీ.. తిట్టిపోయడానికి బంధుత్వం అడ్డురాకూడదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమయ్యింది.

కొత్తనాయకులే కరువా

  అన్ని పార్టీలనుండి వైసిపి లోకి వలసలు, కప్పదాట్లు, గోడదాటటాలు ఎక్కు వయిపోయాయి. తీన్ని చూసిన ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ అధినాయకత్యం కొత్త నాయకులను తయారు చేసికోలేరా అనే సందేహాన్ని సందిస్తున్నారు.   గతంలో ఎన్టీరామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. ఆయన పేరు చెప్పి ఏ ఎన్నికల్లో ఎవరూ నిలబడినా......ఊరూ పేరు లేని వారుకూడా ఎమ్మేల్యేలుగా ఎంపిలుగా మారారు. రాష్ట్రంలో కొత్తతరానికి చెందినవారు నాయకులుగా మారారు.  యువత రాజకీయాలలోకి రాజబాటలో ప్రయాణించారు.   ఇప్పటికీ యువత నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నా గత మూడేళ్లనుండి యువతను పార్టీలోకి తేవడానికి వైయస్సార్ కాంగ్రెస్ ఏ మాత్రం శ్రద్ద చూపకుండా పాతనాయకులనే తమ పార్టీలోకి ఆహ్వానించడం పలువిమర్శలకు తావిస్తుంది. కొత్తపార్టీ కొత్త నాయకత్వం లేకుండా పాత నాయకత్వం తో పనిచేయడం వల్లే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ  ఎన్నికల్లో గెలుపు సాధించ లేక పోయిందని రాజకీయవర్గాలు ఉటంకిస్తున్నాయి.  

కాబోయే బాస్ కొత్తరూల్స్

  కొత్తగా రాష్ట్రంనుండి పదవులొచ్చిన కేంద్రమంత్రులకు కాబోయే కాంగ్రెస్ అధినాయకుడైన రాహూల్ గాంథీ కొత్తరూల్స్ పెట్టారు. అవేమిటంటే  పదవులకన్నా పార్టీకే ముఖ్య ప్రాధాన్యత నివ్వాలి. అలాగే ఒక్కొక్క మంత్రి కనీసం రెండు జిల్లాలను పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో దగ్గర సంభంధాలు కొనసాగించాలి. అలాగే అవసరమైనప్పుడు లేదా కేంద్రం అడిగినప్పుడల్లా రాష్ట్ర, జిల్లా పరిస్థితులను రిపోర్టు చేయాల్సి వుంటుంది,   ఎమ్మెల్యేలు, ఎంపిలు, నాయకులు, లీడర్లు పార్టీ నుండి బయటికి పోకుండా చూడాలి. ప్రజలకు సంక్షేమ పధకాలను గురించి వివరించాలి. రానున్న ఎన్నికల్లో కనీసం 30 ఎంపి సీట్లు ఆంద్రప్రదేశ్ నుండి తెచ్చే విధంగా కర్యాక్రమాలు అమలు జరగాలని వారు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించే ప్రధాన మంత్రి రేపు మంత్రులందరినీ ఒక సారి రమ్మన్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచి ఏలాంటి ఉద్యమాలు జరగకుండా చూడాలని కూడా వారు కోరుతున్నారు.   కార్యకర్తల్లో ఆత్మస్ధయిర్యాన్ని నింపాలని అధిష్టానం కోరుతుంది. దీనికి అనుగుణంగానే కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అధినేత్రి సోనియాగాంథీ తనయుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సంసిద్దాంగా వున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచి రాహుల్ ప్రధాన మంత్రిగా కొన సాగటానికి ఇప్పటినుండే పావులు ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

ఇంతకీ కావూరి రాజీనామా చేసినట్టా, చేయనట్టా..?

  చాలాకాలంగా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న కావూరి, ఈ సారికూడా మంత్రివర్గ విస్తరణలో తనకి స్థానం దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో ఆవేదన చెందుతున్నారు. నేను పార్టీ పదవులకే తప్ప మంత్రిపదవికి పనికిరానా.. అంటూ ఆయన సన్నిహితుల దగ్గర తన ఆవేదనను బైటపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. తాను కష్టకాలంలో పార్టీకోసం విపరీతంగా శ్రమించానని, ఎన్టీఆర్ తోకూడా తలపడ్డానని, అయినా అధిష్ఠానం తనపై శీతకన్నేసిందని కావూరి బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్టు సమాచారం. పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలిగినా కూడా అధిష్ఠానం కావూరి డిమాండ్ ని పట్టించుకోకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సారి మంత్రిపదవులకు అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. వ్యాపార వర్గాలకూ, ఉద్యమాల్ని నెత్తినేసుకుని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలనుకునేవాళ్లకూ మొండిచేయి చూపించింది. ఆఖరికి రాహుల్ కి అత్యంత సన్నిహితులుగా చెప్పుకునేవాళ్లకూ ఈ కారణాలవల్ల మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. రాజీనామా అస్త్రాన్ని సంధిస్తే హై కమాండ్ దిగొస్తుందనుకున్న కావూరి.. నేరుగా పప్పులో కాలేసినట్టే లెక్క. ఆ మాటకొస్తే అసలు రాజీనామా సంగతిని సోనియా అస్సలు పట్టించుకున్న దాఖలాలుకూడా ఎక్కడా కనిపించలేదుకూడా. అహ్మద్ పటేల్ రంగంలోకి దిగి కావూరి బుజ్జగించే ప్రయత్నాలు చేశారని ఢిల్లీ వర్గాలు కోడై కూశాయ్. తర్వాత అసలు ఆ ఊసే వినిపించలేదు. కావూరి తన రాజీనామాని లోక్ సభ స్పీకర్ మీరా నాయర్ కి, సోనియాకి పంపించారన్న ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అసలు కావూరి రాజీనామా చేశారా లేదా అన్నది ఇప్పుడు చాలామందికి కలుగుతున్న అనుమానం. దాన్ని నివృత్తి చేస్తూ తాను రాజీనామా చేయలేదని కావూరే స్వయంగా తోటి నేతలతో చెప్పారనికూడా ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు ఏం జరిగిందన్న విషయం మాత్రం ఇంకా బైటికి పొక్కడం లేదు. కేంద్ర మంత్రి పదవి దక్కలేదన్న నిరాశలో కూరుకుపోయిన కావూరిని తెలంగాణ, ఆంధ్ర అన్న బేధం లేకుండా ఎంపీలు, మంత్రులు వరసపెట్టి పరామర్శిస్తున్నట్టు సమాచారం.  గుప్పిస్తూ అటు కాంగ్రెస్ నీ ఇటు బిజెపినీ ముప్పుతిప్పలు పెడుతున్న కేజ్రీవాల్ మీద రెండు పక్షాలనుంచీ అటాక్ మొదలైంది. రాబర్ట్ వాద్రాపై డిఎల్ ఎఫ్ స్కామ్ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే కేజ్రీవాల్.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఆరోపణలు గుప్పించారు. అటు తిరిగీ ఇటు తిరిగీ మొత్తం బరువంతా తిరిగి కేజ్రీవాల్ మీదే పడుతోంది. కాంగ్రెస్, బిజెపి నేతలు .. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తమపై బురదజల్లుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇదేదో స్పాన్సర్ షిప్ వ్యవహారంలా ఉంది తప్ప.. వాస్తవాలు కనిపించడంలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థకి భారీగా విదేశీనిధులు అందాయని, తెరవెనకఉండి చక్రం తిప్పుతున్న గురువులెవరో కేజ్రీవాల్ ని నడిపిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ పత్రిక కమల్ సందేశ్ లో ఈ వెర్షన్ ని ముద్రించారుకూడా.. కేజ్రీవాల్ సుపారీ తీసుకుని పనిచేస్తున్నారని,  దీనిపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం డబ్బుకోసమే కేజ్రీవాల్ ఇలాంటి పనులు చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అన్నాహజారేకి నమ్మకంగా ఉండలేని వ్యక్తి దేశానికి ఎలా నమ్మకంగా సేవలందిచాలనుకుంటున్నాడో తేల్చి చెప్పాలంటూ కేజ్రీవాల్ మీద తారా స్థాయిలో భాజపా నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణఫై చంద్రబాబు లేఖ అపర చాణక్యం

చంద్రబాబు అపర చాణక్యాన్ని ప్రదర్శించారు. కర్రా విరగకుండా పామూ చావకుండా ఉండే మార్గాన్ని తెలంగాణ విషయంలో అవలంబించారు. ప్రస్తుతానికి అసలు తమ వైఖరేంటో చెప్పకపోయినా నెపాన్ని కాంగ్రెస్ మీదికి నెట్టిపారేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల ఆయనకు రెండు లాభాలు. ఒకటి తెలంగాణ కోసం లేఖ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్న తెలుగుదేశంలోని తెలంగాణావాదుల్ని సంతృప్తి పరచడం మొదటిదైతే, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ఉండడంవల్ల సీమాంధ్ర ప్రాంతం నేతల అభిమానాన్ని కూడా చూరగొనడం రెండో లాభం. రేపటికి రాజెవడో రెడ్డవడో..? అయ్యేది కాకమానదు. జగబోయేదాన్ని ఎలాగూ అపలేం.. కానీ మన చేతుల్లో ఉన్న ప్రజాభిమానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదన్న సత్యం చంద్రబాబుకి ఇప్పటికి స్పష్టంగా బోధపడినట్టుగా అనిపిస్తోంది. అటు సీమాంధ్ర నేతలకూ, ఇటు తెలంగాణ నేతలకూ పార్టీలో సమ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల రేపన్న రోజు ఏం జరిగినా ఇద్దరి మద్దతూ తనకుంటుందన్న ధోరణిలో చంద్రబాబు శరవేగంతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పాదయాత్ర చేపట్టిన నేపధ్యంలో బాబు లేఖ ఓ రకంగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించడానికి వీఐపీ పాస్ లా పనికొస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. కేసీఆర్ లాంటివాళ్లో, లేక ఆవేశం చల్లారక ఎగిరెగిరిపడే కొందరు తెలంగాణ నేతలో విమర్శలు గుప్పించినంత మాత్రాన లేఖ విషయంలోగానీ, మరే ఇతర విషయాల్లోగానీ చంద్రబాబుకి వచ్చిన నష్టమేమీ లేదు. పైగా “గోపి” ధోరణివల్ల లాభాలే తప్ప అణువంతైనా నష్టం లేదుగాకు లేదు. కేవలం చంద్రబాబు వల్లే తెలంగాణ వెనక్కి పోయిందని ఆరోపిస్తున్న కేసీఆర్ మాటల్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కాంగ్రెస్ గోల కాంగ్రెస్ దే. ఎటొచ్చీ వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు రాబట్టుకోవాలా అన్న అంశంమీదే ఇప్పుడు బాబు పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చిందన్న సామెతను నిజంచేస్తూ కాంగ్రెస్, వైకాపాల మధ్య రగులుతున్న ( అంతా పైపైకేలా అనే వాళ్లూ కొందరున్నారు) చిచ్చుని తెలుగుదేశం ఓటుబ్యాంక్ కిందకి మార్చుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం. చూద్దాం.. ఏం జరుగుతుందో..

హస్తినలో గవర్నర్ కీలక మంతనాలు

రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయ్. ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఓ పక్క జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు రక్షణ కల్పించాలి. మరో పక్క తెలంగాణ మార్చ్ గొడవ. ఇంకోవైపు గణేష్ నిమజ్జనోత్సవాలు. ప్రభుత్వం కోదండరామ్ ని గెడ్డం పట్టుకుని బతిమిలాడినా మార్చ్ ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం గడగడలాడుతోంది. ఏం జరిగినా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనుక భద్రత విషయంలో కాంప్రమైజ్ కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రిసహా మంత్రులందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నరసింహన్.. రాష్ట్రపతి ప్రణబ్, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం లను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణ విషయంలో ఓ ప్రకటన చేస్తేనే తప్ప మార్చ్ ని విరమించుకునేది లేదని తెలంగాణ వాదులు భీష్మించుక్కూర్చున్న విషయాన్నికూడా నరసింహన్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనికితోడు ఘనత వహించిన ఓ వలసదొరకూడా తన మనుగడకోసం హస్తినలో మకాం వేసి ఏదో ఒక ప్రకటన చేయమని కాంగ్రెస్ అధిష్టానాన్ని బతిమిలాడుకుంటున్నారన్న వార్తలుకూడా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో ఓ ప్రకటన చేయబోతోందన్న ఆశలకు ప్రాణం పోస్తున్నాయి.  

రాహుల్‌ అంతర్జాతీయనేత..! సోనియా విశ్వమాత...!

ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో ఎవరికెవరూ తీసిపోరని మోడీ. రాహుల్‌ స్థాయిల విషయంలో చోటు చేసుకున్న మాటల యుద్ధం రసపట్టుగా మారింది! వ్యక్తి పూజకే అగ్రతాంబూల మిచ్చే కాంగ్రెస్‌లో పొగడ్తలు శృతి మించిపోతున్నాయ్‌! బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మన్మోహన్‌ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేసిన బి.జె.పి అంటే కాంగ్రెస్‌ నేతలు గుర్రుగానే ఉన్నారన్నది నిజం! తమ నాయకుల మనసులో చెలరేగిపోతున్న అలజడిని గమనించిన కొందరు కార్యకర్తలు ఆ కచ్చను గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిపై వెళ్ళగక్కడానికి ప్రయత్నిస్తూ తమ నేత రాహుల్‌ గాంధీ జాతీయ నాయకుడైతే, మోడీ కేవలం ప్రాంతీయ నాయకుడంటూ తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు! అందుకు మోడీ స్పందిస్తూ `తాను నిజంగానే ప్రాంతీయ నాయకుడినేనని ఒప్పేసుకుంటూ రాహుల్‌ గాంధీ మాత్రం అంతర్జాతీయ నాయకుడనీ, ఆయన ప్రపంచంలో ఎక్కడినుంచైనా పోటీ చేస్తారనీ, అవసరమైతే ఇటు భారత్‌, అటు ఇటలీ ఎన్నికల్లోనూ పోటీ చేసెయ్యగల రంటూ సెటైర్‌ విసిరారు! ఆ వ్యాఖ్యకు ఎలాస్పందించాలో ఆర్థం కాక తల నెరసిన పెద్ద నాయకులు తలలు పట్టుకుకూర్చుంటే `ఛోటా నాయకులు మాత్రం మోడీ వ్యాఖ్యలపై స్పందించకపోతే తమ పరువేంగావాలనుకున్నారో ఏమో గానీ `రాహుల్‌ గాంధీ ప్రపంచ దేశాలను ప్రభావితం చెయ్యగల అంతర్జాతీయ నాయకుడేనని చెప్పేస్తున్నారు! ఇంతటితో వీళ్ళు ఊరుకుంటారా...? లేక మరో అడుగు ముందుకేసి సోనియమ్మ విశ్వమాతంటూ కితాబిచ్చి `ఆమె ఏ గ్రహంలోనైనా పోటీ చేసేస్తారంటూ చెప్పేస్తారో వేచిచూడాల్సిందే!  ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు మోడీపై చెళుకు లెయ్యాలని ప్రయత్నిస్తే సోనియా విదేశీయత వివాదం మరోసారి తెరమీదికి తెస్తున్నట్లవుతోంది కదూ...!  

సంక్షోభంలో యుపిఎ సర్కార్‌

అనుకున్నంతా జరిగింది....! ఆడ్డగోలు నిర్ణయాలతో ప్రజాజీవనాన్ని కష్టాల్లోకి యుపిఎ సర్కార్‌ నెట్టేస్తోందంటూ కళ్ళెర్రజేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్‌కు తన మద్దతు పూర్తిగా ఉపసంహరించుకుంది. డీజిల్‌ ధరను బాగా పెంచడంతో బాటు భారత్‌ భావిప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ ఎఫ్‌డిఐకి అనుమతి ఇవ్వడంపట్ల మమత మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుడిని మరిన్ని సమస్యలకు గురి చేస్తాయనీ, కాబట్టి ఎఫ్‌డిఐకి అనుమతి ఇచ్చే విషయాన్ని పూనరాలోచించి తక్షణమే ఆ నిర్ణయాలను రద్దు చేసుకోవాలంటూ మమత హెచ్చరించింది. భాగస్వామ్య పార్టీలు హఠం చేసినప్పుడ్‌ల్లా నిర్ణయలు మార్చుకోటే పరసతి పోతుందనుకున్న సర్కార్‌ తన నిర్ణయానికే కట్టుబడిరది. అంతేకాకుండా పార్లమెంటులో తృణమూల్‌కు ఉన్న బలం 19 మంది ఎంపిలు కాగా, వీరు వైదొలగినా తమకు 307 మంది ఎంపిల బలం ఉంటుంది కాబట్టి తమ సర్కార్‌ కొచ్చిన ఇబ్బందేంలేదని యుపిఎ భరోసాగా ఉంది. నిజానికి 276 మంది ఎంపిలు కాంగ్రెస్‌ బలంకాగా, ఎస్పీ, బిఎస్పీ, జనతాదళ్‌ సెక్యులర్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలు బయట నుంచి ఇస్తున్న మద్దతుతో ఆ బలం 307 అవుతుంది. ఇది అధికారంలో కొనసాగేందుకు అవసమైన ఎంపీల సంఖ్యకంటే 35 ఎక్కువ. కాబట్టి తమ సర్కార్‌కు ఢోకాలేదంటూ కాంగ్రెస్‌ నేతలు పైకి చెబ్తున్నా రాజకీయ చదరంగంలో అద్భుతంగా పావులు కదపగలిగే మేధాశక్తి ఉన్న మమత మళ్ళీ ఏం ఎత్తులు వేస్తుందో అనుకుంటూ భయంభయంగానే ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ నేతల భయాలను నిజం చేస్తున్నట్లుగా` మమతా బెనర్జీ ఇప్పటికే యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరో సంవత్సరకాలంలో ఎన్నికలు ఎదుర్కోవలసి ఉన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు మద్దతు పలికితే అందుకు పరిహారం వచ్చే ఎన్నికల్లో మనం చెల్లించుకోవలసి వస్తుందంటూ మమత హెచ్చరిస్తున్నారట ! ఇది నిజమేనని అంగీకరించిన ఇతర భాగస్వామ్య పక్షాలు మమతతో చేతులుకలిపి మద్దతు ఉపసంహరణ దిశగా ఆలోచనలు సారిస్తున్నట్లు  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చినా తమకే లాభం అనుకుంటూ బిజిపి పక్షాలు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి !