తెలంగాణ రాజముద్ర రాంగ్: హై కోర్టులో కేసు!
posted on Jul 12, 2014 @ 10:29AM
తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన రాజముద్ర తప్పుగా వుందని, తెలంగాణ రాజముద్ర రూపకల్పనలో స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలను పాటించలేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ నగరానికి చెందిన టి.ధనగోపాల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజముద్ర రూపకర్త లక్ష్మణ్ ఏలేలను పేర్కొన్నారు. సాధారణంగా మూడు సింహాల కింద దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే మాటలు వుంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన లోగోలో సత్యమేవ జయతే అనే మాటలు మూడు సింహాల కంటే చాలా దూరంగా లోగో కింది భాగంలో వున్నాయి. ఇది స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ తప్పును సరిదిద్దకుండానే తెలంగాణ ప్రభుత్వం రాజముద్రకు ఆమోదం తెలిపిందని, కోర్టు వెంటనే రాజముద్ర లోపాలను సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేయాలని ధన గోపాల్ తన పిటిషన్‌లో హై కోర్టును కోరారు.