జగన్‌కు తెలంగాణలో 50 సీట్లు వస్తాయా..?
ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా, ఎప్పటికొచ్చినా అన్ని విధాలా లాభం మా పార్టీకే తప్ప మరోపార్టీకి ఏమీ కలిసిరాదంటూ జగన్ పార్టీ వర్గాలు తెగ డబ్బా కొట్టుకుంటున్నాయ్. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆఖరికి తెలంగాణలోకూడా అరవై సీట్లు రావడం ఖాయమని కొండా సురేఖ అనడం దీనికి సరైన ఉదాహరణ.
షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సురేఖ చేసిన వ్యాఖ్యలు కాస్తంత గట్టిగానే జనం గుండెల్లోకి నాటుకుపోవచ్చన్న భయం ప్రత్యర్దుల్లో కనపడుతూనే ఉందికూడా.. పనిలోపనిగా చంద్రబాబు పాదయాత్రమీద విరుచుకుపడ్డ సురేఖ,, వీలైనంతగా బాబు యాత్రని ఏకే ప్రయత్నం కూడా చేశారు.
నిజానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తెలంగాణ లో అరవై సీట్లు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అదికారం వచ్చినట్లే లెక్క. రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ కు తెలంగాణలో ఏబై సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు దక్కాయి. టీఆర్ ఎస్ ఖాతాలో పడ్డవి మాత్రం కేవలం పది స్థానాలే..
రెండువేల నాలుగులో కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు కలిపి సుమారు ఎనబై వరకు వచ్చాయి. అందులో టిఆర్ఎస్ కే ఇరవై ఆరొచ్చాయి. టిడిపికి అప్పట్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయ్. 1999 లో కాంగ్రెస్,తెలుగుదేశం లు పోటాపోటీగా సీట్లు సంపాదించుకున్నట్టే లెక్క. అప్పట్లో.. కోస్తా, రాయలసీమలలో టిడిపి అత్యదికంగా సీట్లు సంపాదించుకుని అదికారంలోకొచ్చింది.
1994లో కాంగ్రెస్ కు తెలంగాణలో కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ లో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో మరొకటి. ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీకి చెందిన అరడజను మంది అభ్యర్ధులు మినహా టిడిపి, వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి.
తెలంగాణలో టిడిపికి 1983లో నలభైమూడు స్థానాలు మాత్రమే రాగా, 1985 లో మాత్రం ఏబై కి పైగా వచ్చాయి. 1989లో టిడిపికి కూడా గణనీయంగానే తెలంగాణ లో సీట్లు వచ్చినా, మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పరమయ్యాయి. ఈ లెక్కల్నిబట్ట చూస్తే తెలంగాణలో యాభై సీట్లు తెచ్చుకుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కచ్చితంగా వంద సీట్లొచ్చినట్టే లెక్క. కొండా సురేఖ చెప్పిన జోస్యం నిజమైతే.. వైకాపా పూర్తి మెజారిటీతో అధికార పీఠమెక్కినట్టే లెక్క..
సురేఖ చెబుతున్నవి కాకి లెక్కలో లేక, నిజమైన లెక్కలో తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉందని అటు అధికార పక్ష నేతలూ, ఇటు ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు. జగన్ పార్టీ నేతలు పెద్దఎత్తున అంచనాలు పెంచుకుంటూ తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం పరిపాటైపోయిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనం విలక్షణమైన తీర్పు చెబుతారన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.