బ్యాంకు నోటీసులు: అడ్డంగా ఆరిపోయిన వినోద్ కాంబ్లి!

దురలవాట్లు మనిషిని ఎంత పతనానికి గురిచేస్తాయో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వాటిలో ది బెస్ట్ ఉదాహరణగా నిలిచే అర్హతను సాధించిన వ్యక్తి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి. వినోద్ కంబ్లి చిన్ననాటి మిత్రుడైన సచిన్ టెండూల్కర్ తన జీవితాన్ని క్రమశిక్షణతో మలచుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతే, వినోద్ కాంబ్లి మాత్రం అద్భుతమైన కెరీర్ వున్నప్పటికీ దురలవాట్లతో, విచిత్రమైన వ్యవహారశైలితో పాతాళానికి దిగజారిపోయాడు. ఇలాంటి వాడితో ఫ్రెండ్‌షిప్ ఎందుకని సచిన్ టెండూల్కర్ కూడా కాంబ్లిని పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. ఇదిలా వుంటే ఇంటి, వాహన రుణ వాయిదాలు చెల్లించడం లేదని దాంబివ్లీ నగరి సహకారి బ్యాంక్ కాంబ్లి దంపతులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు అధికారులు పలుమార్లు విజ్క్షప్తి చేసినా.. వాయిదాల చెల్లించడానికి నిరాకరించడంతో బ్యాంకు ఆస్తుల జప్తు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కాంబ్లికి పైసా సంపాదన లేదు. దురలవాట్లు భారీ స్థాయిలో వున్నాయి. అప్పులు కూడా గుండె పగిలిపోయే రేంజ్‌లో వున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి, వాహనం వాయిదాలు కూడా కట్టలేని స్థితికి కాంబ్లి చేరుకున్నాడు. దీనికితోడు మొన్నీమధ్య కాంబ్లికి గుండెపోటు కూడా వచ్చింది. ఆమధ్య తప్పతాగి తన అపార్ట్.మెంట్‌లోనే నానా గందరగోళం సృష్టించాడు. క్రికెట్‌గా ఎన్నో సెంచరీలు కొట్టిన కాంబ్లి వ్యక్తిగా మాత్రం డక్కౌట్ అయ్యాడు. ఏం లైఫ్‌రా భగవంతుడా!

ఇండియా - రష్యాలది పటిష్టమైన మైత్రీ బంధం

  భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య అణు, రక్షణ, ఇందన రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకునే అంశాల మీద ఆయనతో చర్చించారు. పుతిన్ భారతదేశాన్ని సందర్శించి తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టును సందర్శించాల్సిందిగా మోడీ ఆహ్వానించారు. దానికి పుతిన్ తన అంగీకారాన్ని తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడితో భేటీ అనంతరం మోడీ రష్యా అధ్యక్షుడితో కూడా సమావేశమయ్యారు. భారత, రష్యాలు పాత స్నేహితులు. అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మోడీ, పుతిన్ దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీని పుతిన్ అభినందించారు. భారత, రష్యాల అనుబంధం చాలా దృఢమైనదని మోడీ ఈ సందర్భంగా అన్నారు.

ఏపీ బడ్జెట్ రూపకల్పనలో యనమల బిజీ బిజీ!

  ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి మంత్రి యనమల బడ్జెట్‌ ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే బడ్జెట్‌ సమీక్షల్లో భాగంగా పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్‌, గిడ్డంగులు, పశుసంవర్ధక, మత్స్య, పౌరసరఫరాలు, సహకార శాఖలపై ఉన్నతాధికారులతో సమావేశమై ప్రతిపాదనలను స్వీకరించారు. మరోసారి కూడా అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన యనమల వారికి కొన్ని సూచనలు చేశారు. బడ్జెట్‌లో సాగుకు, వ్యవసాయ అనుబంధ రంగాలకూ నిధులు తగిన రీతిలో కేటాయిస్తామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు రావాలని, అందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని మంత్రి యనమల చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వారికి మంచి సదుపాయాలు అందేలా సూచనలివ్వాలని కోరారు. పాఠశాలలు, కాలేజీల్లో మౌలికసదుపాయాలకోసం, నాణ్యమైన విద్య కోసం..పథకాలు తయారుచేసి పంపాలన్నారు.

మోడీ జిన్‌పింగ్ హాయ్ హాయ్... భారత్, చైనా భాయ్ భాయ్..!

  భారత్, చైనా దేశాల స్నేహ సంబంధాలు బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మధ్య సరిహద్దులు చెరిపేసేలా స్నేహబంధం పటిష్టం చేసుకుందామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇరు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకుందామని, దీనిని మనం సామరస్యంగా పరిష్కరించుకోగలిగితే, ప్రపంచానికే ఆదర్శంగా నిలవొచ్చన్న మోడీ అభిప్రాయంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పూర్తిగా ఏకీభవించారు. భారత్, చైనాలు ప్రత్యర్థులు కాదని జిన్ పింగ్ అన్నారు. . స్నేహపూర్వకంగా, సానుకూల దృక్పథంతో ముందుకెళదామని, ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని జిన్‌పింగ్‌ చెప్పారు. బ్రిక్స్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు సోమవారం బ్రెజిల్‌ వచ్చిన మోడీ... చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు

పెళ్ళయిన వాళ్ళలోనే ఆత్మహత్యలు ఎక్కువట.. ఎందుకో!

  ఆత్మహత్యలు అనే అంశం మీద జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్సీఆర్బీ) అనే సంస్థ బాగా పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో తేలిన అంశం ఏమంటంటే, ఒంటరి జీవితాన్ని గడిపేవారికంటే పెళ్ళయిన వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధించాల్సిన అవసరం లేదు. మామూలుగానే అందరికీ తెలిసిన విషయమే ఇది. ఒంటరిగా వున్నవారికి ఎలాంటి వేధింపులు, సాధింపులు వుండవు. అదే పెళ్ళయిన వారికి ఎన్ని వేధింపులు వుంటాయో పెళ్ళి చేసుకున్నవారికే తెలుస్తుంది. అయినా పెళ్ళయిన వాళ్ళలోనే ఆత్మహత్యలు ఎక్కువ ఎందుకంటే... పెళ్ళే అన్నిటికన్నా పెద్ద ఆత్మహత్య అనే వాళ్ళూ వున్నారు. సరే, ఇలాంటి అభిప్రాయాల సంగతి అటు వుంచితే, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కాబట్టి, శాస్త్రీయంగా పరిశోధించి చెప్పిన వాటికే ప్రామాణికత వుంటుంది. ఎన్సీఆర్బీ పరిశోధన ఫలితాలకు అందుకే వాల్యూ వుంది. ఈ పరిశోధన, పరిశీలన ప్రకారం 2013లో ఆత్యహత్య చేసుకున్న వారిలో 69.4శాతం మంది పెళ్ళయిన వారు ఉండగా, 23.6 శాతం మంది ఒంటరివారని ఎన్సీఆర్బీ తన నివేదికలో వెల్లడించింది. అలాగే 3.7 శాతం మంది పెళ్ళయ్యాక ఒంటరితనం వచ్చినవాళ్లు!

కేసీఆర్ ప్రభుత్వం @ 45.. అభివృద్ధి @ 0: పొన్నం

  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు పూర్తయింది. ఇంతవరకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారుగానీ, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన అక్కడితో ఆగకుండా కేసీఆర్‌ని మాయల మరాఠీ అని సంబోధించారు. ఎన్నికల హామీలపై అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ వట్టి మాటల్ని కట్టిపెట్టి తెలంగాణ ప్రజలకు గట్టిమేల్ తలపెట్టే పనులు చేయాలని సూచించారు. ఇవన్నీ కేసీఆర్‌కి పొన్నం రాసిన బహిరంగ లేఖలో వున్నాయి. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికే నెలరోజులు సరిపోతుందన్న కేసీఆర్‌ మాటలు సరికావని పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు. రుణ మాఫీపై రోజుకో మెలిక పెడుతూ జాప్యం చేయడం సరికాదని, వర్షాభావానికి తోడు రుణాలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పొన్నం తన లేఖలో పేర్కొన్నారు.

సత్యం రాజుకు సెబి 1849 కోట్ల షాక్

సత్యం రామలింగరాజుకు సెబి దిమ్మతిరిగే షాకునిచ్చింది. సత్యం కుంభకోణంపై దాదాపు ఐదేళ్ళ విచారణ చేసిన సెబీ, తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రామలింగ రాజు, ఆయన సోదరుడు బీ.రామరాజు (సత్యం-మాజీ మేనేజింగ్ డైరెక్టర్), వదలమని శ్రీనివాస్ (సత్యం మాజీ సి.యఫ్.ఓ.), జీ.రామకృష్ణ (సత్యం-మాజీ వైస్ ప్రెసిడెంట్) మరియు వీ.యస్. ప్రభాకర్ గుప్తా (సత్యం-మాజీ హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్)లకు ఏకంగా రూ. 1849 కోట్ల జరిమానా విదించింది. వారు ఐదుగురు ఆ మొత్తాన్ని కేవలం 45రోజులలో సెబీ ఖాతాలో జామా చేయాలని ఆదేశించింది. అంతే కాక ఆ మొత్తానికి ఈ కుంభకోణం బయటపెట్టిన రోజు నుండి అంటే జనవరి 7, 2009 నుండి నేటి వరకు ఏడాదికి 12శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం కూడా విధించింది.

ఏనుగుల బీభత్సం: 10 రోజులు.. 30 మంది..

  ఏనుగులు మృత్యుదేవతలు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత పది రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల హింసాకాండ కారణంగా ఇప్పటి వరకూ 30 మంది మరణించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని జలపైగురి, డార్జిలింగ్, కూచ్ బీహార్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలలోని అడవుల నుంచి ఏనుగులు గ్రామాల మీద దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగులు గుంపులు గుంపులుగా జనావాసాల మీద పడి దాడి చేస్తూ వుండటంతో వాటిని అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. ఏనుగుల మందలు ఇప్పటి వరకు 30 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఏ సమయంలో ఏనుగుల గుంపులు దాడి చేస్తాయోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

రోడ్డుపై మాజీ ఎంపీని దోచుకున్న దొంగలు

ఇద్దరు దొంగలు మాజీ ఎంపీ డబ్బునే దోచుకోనిపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మందా జగన్నాథానికి సంబంధించిన 90 వేల రూపాయల నగదు, పాస్ పోర్ట్ ను దొంగలు దోచుకొని పారిపోయారు. ఆబిడ్స్ లో షాపింగ్ మాల్ వద్ద ఆగివున్న కారు నుంచి దొంగలు ఈ సొమ్మును కాజేశారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి రోడ్డు మీద పడివున్న పది రూపాయల నోట్లను తనకు చూపించి తన దృష్టి మళ్లించారని డ్రైవర్ శ్రీనివాస రెడ్డి పోలీసులకు చెప్పారు. తాను వారి వెంట పడినప్పటికి ఫలితం లేకపోయిందని అతను తెలిపాడు. ఆ పని స్థానిక ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తెలుగు మాట్లాడ్డమే తప్పయిపోయింది!

  హైదరాబాద్‌లోని ఒక ఎంగిలిపీసు బళ్ళో ఒక టీచరమ్మ విద్యార్థులని బెత్తంతో చితకబాదింది. విద్యార్థులు అంటే ఒకరో ఇద్దరో కాదు.. మొత్తం 40 మంది. ఇంతకీ ఆ పిల్లలు చేసిన తప్పు ఏంటో తెలిస్తే మనం బిత్తరపోతాం. ఇంతకీ ఆ పిల్లలు చేసిన తప్పు మరేమిటో కాదు.. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు అంతే. దాంతో టీచరమ్మకి కోపం వచ్చేసి పిల్లల్ని బెత్తంతో బాదేసింది. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో ఈ సంఘటన జరిగింది. టీచర్ చేతిలో దెబ్బలు తిన్న పిల్లలు లబోదిబోమంటూ తమ ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దాంతో పిల్లల తల్లిదండ్రులు మూకుమ్మడిగా సదరు స్కూలుకి చేరుకుని పిల్లల్ని చావబాదిన టీచర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల ముందు ఆందోళనకు నిర్వహించారు. స్కూలు యాజమాన్యం షరా మామూలుగా సదరు టీచరమ్మ చేత ఇంగ్లీషులో ‘సారీ’ చెప్పించింది.

మళ్ళీ చెబుతున్నా రుణమాఫీ చేస్తాం

  రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ ఆర్బీఐ నుంచి రీషెడ్యూల్ కోసం హామీ దక్కలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణమాఫీపై మళ్లీ ప్రకటన చేశారు. రుణమాఫీపై ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్ కు హామీ ఇవ్వలేదంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చేసిన ప్రకటనను ఆయన తోసిపుచ్చారు. ఈ విషయంలో ఆయనకు సమాచారం ఉండి ఉండకపోవచ్చని పుల్లారావు అబిప్రాయపడ్డారు. రెండు రోజుల్లో రిజర్వు బ్యాంకు నుంచి అధికారిక సమాచారం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలతో పాటు బంగారు రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయనన్నారు. రైతుల రుణమాఫీపై తాము వెనక్కి వెళ్లలేదని ఆయన చెప్పారు.

హైదరాబాద్ ఫ్యూచర్ సూపర్: కేసీఆర్

  హైదరాబాద్ భవిష్యత్తు అద్భుతంగా వుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలోని టిస్మన్ స్పెయిర్ వేవ్‌రాక్ ఐటీ పార్క్‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ హైదరాబాద్ను ప్రపంచ శ్రేణి ఐటీ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ త్వరలో డిజిటల్ సిటీ కానుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరానికి అద్భుతమైన భవిష్యత్తు వుందని, పెట్టుబడులు పెట్టేవారికి హైదరాబాద్ స్వర్గాధామమని కేసీఆర్ చెప్పారు. పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని అంటూ, పెట్టుబడిదారుల కోసం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మాజీ సీఎంని ‘చించేసిన’ డిప్యూటీ సీఎం!

  ఆయనసలే పక్కా తెలంగాణ వాది.. పైగా మంత్రి పదవిలో వున్నారు. ఆయనకి చిర్రెత్తుకొచ్చింది... దాంతో మాజీ సీఎం చిరిగిపోయాడు. అసలేం జరిగిందంటే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకి ఆస్పత్రి గోడ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటో కనిపించినట్టయితే బాగుండేది. కానీ ఆయనకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో కనిపించింది. తెలంగాణ ఆస్పత్రి గోడ మీద పక్కా సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో చూసేసరికి డిప్యూటీ సీఎం రాజయ్య కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోని గోడ మీద నుంచి లాగి పరపరా చింపేశారు. అప్పటిగానీ ఆయన ఆవేశం తగ్గలేదు.

ఆ పుర్రె చాలా ఓల్డు గురూ!

  నార్వేలో పురావస్తు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో దాదాపు ఎనిమిది వేల సంవత్సరాల క్రిందటి మానవ కపాలం బయటపడింది. నార్వేలోని స్టొక్కో ప్రాంతంలో జరుపుతున్న తవ్వకాల్లో ఈ పుర్రె బయటపడింది. ఈ పుర్రెని అధ్యయనం చేయడం ద్వారా రాతియుగం మానవుడి జీవితం ఎలా వుండేదన్న ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం వుందని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పురాతన పుర్రెతోపాటు కొన్ని ఎముకలు కూడా దొరికాయి. ఈ ఎముకలు సదరు పుర్రెకు సంబంధించిన వ్యక్తివా, లేక మరొకరివా, అదీ కాకపోతే జంతువులవా అనేది ల్యాబ్ పరీక్షల అనంతరం వెల్లడయ్యే అవకాశం వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త ఐటీ విధానం త్వరలో!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించనుంది. పదిహేను రోజుల్లో ఈ విధానాన్ని ప్రకటించే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విశాఖ జిల్లా మధురవాడలోని ఐటీ సెజ్‌ను ఆయన మంగళవారం నాడు సందర్శించారు. ఐటీ రంగంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, దీనివల్ల ఐటీ రంగ నిపుణులకు ఎంతో మేలు జరిగే అవకాశం వుందని అయన చెప్పారు. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే ఐటీ సెజ్ల్లో భూములను తీసుకుని వాటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు.