రైల్వే బడ్జెట్ 2014-15 హైలైట్స్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. ఈ ఏడాది రూ. 602 కోట్లు మిగుల ఆదాయమే తమ లక్ష్యమని ప్రకటించారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు: 1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం. 2. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం. 3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 4. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్. 5. చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు. 6. కొత్తగా అయిదు జన సాధారణ్ రైళ్లు. 7. విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ప్రెస్ కొత్తరైలు. 8. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు. 9. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్. 10.పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్. 11. 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి. 12.11,794 కోట్ల లోన్ కోసం ప్రయత్నం. 13. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం. 14. రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది. 15. హైస్పీడ్ నెట్వర్క్ను నెలకొల్పుతాం. 16. గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి. 17. 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. 18. ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం. 19. ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం. 20.  12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం. 21. 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి. 22. పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు. 23.ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్. 24. నిమిషానికి 7200 టికెట్లు ఇచ్చేలా ఈ టికెటింగ్ వ్యవస్థ తీర్చిదిద్దుతాం. 25. 4వేల మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం. 26. ఎంపిక చేసిన 9 మార్గాల్లో రైళ్ల స్పీడ్ 160 కిలోమీటర్లు నుంచి 200 కిలోమీటర్లుకు పెంచుతాం. 27. త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు. 28. ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు. 29. ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయం లక్ష్యం. 30. రైల్వేకు కేంద్రం రూ.1100 కోట్లు సాయం. 31. విద్యార్థులకు ప్రత్యే రాయితీలు. 32. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. 33.ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు. 34. టికెట్ల అమ్మకం ద్వారా రూ. 44,645 కోట్లు ఆదాయం. 35. చార్థామ్, కేదారనాథ్,బద్రీనాథ్లకు రైల్వే కనెక్టివిటీ.

రైల్వే బడ్జెట్ 2014: చైనా, రష్యా తర్వాత మనమే

  రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. రోజుకు 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 12,500 రైళ్లల్లో సురక్షిత ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. 676 ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ. 1.82 లక్షల కోట్లు కావాలని చెప్పారు. పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కానీ ఒక్క లైను మాత్రమే పూర్తి చేశారని గుర్తు చేశారు. పది ఏళ్ల పాటు ప్రతిపాదిత లైన్లకు ఏడాదికి రూ. 5 లక్షల కోట్లు అవసరం అవుతుందన్నారు.

రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సదానందగౌడ

  కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. మంత్రి సదానందగౌడ తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెబుతూ ప్రారంభించారు. దేశ సంస్కృతికి రైల్వేలు ప్రతీక. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వేలు వెన్నెముక. సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తాం. 12,500 రైళ్లల్లో 23 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిన్నారు. రైల్వే వ్యవస్థ అభివృద్ధి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. రక్షణ, సరుకు రవాణాలో రైల్వేలది కీలక పాత్ర. ప్రజల సుఖమే రాజ్యసుఖం. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి.

కేసిఆర్ కు అనిల్ అంబానీ అభినందనలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు మొదట ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పవర్ ప్లాంట్ నెలకొల్పడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఆతరువాత ఆయన తెలంగాణ ముఖ్యమ౦త్రి కేసిఆర్ తో కూడా భేటి అయ్యారు. తెలంగాణ విద్యుత్, మీడియా, మౌలిక రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త పారిశ్రామిక విధానం పూర్తయిన తరువాత మరోసారి దీనిపై చర్చిద్దామని కేసిఆర్ అంబానీతో అన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్బంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు కేసిఆర్ ని అంబానీ అభినందించారు.

ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్న జగన్ పార్టీ!

  వైఎస్ జగన్‌కి, ఆయన పార్టీ వాళ్ళకి ఈమధ్య అన్నిటి మీదా పడి ఏడవటం ఎక్కువైపోయిందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వస్తుందని కలలు కని, చివరికి ఆ కలలన్నీ కల్లలు కావడంతోపాటు, జగన్ బాబుకి త్వరలో జైలు నుంచి ఆహ్వానం తప్పదన్న వార్తలు వస్తూ వుండటంతో ఆయన పార్టీయులు సహనం కోల్పోయి ఏదో ఒక హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ నాయకులు, జగన్ మీడియా ఒక అంశాన్ని టేకప్ చేసింది. ఆ అంశం మీద నానా రచ్చా చేస్తోంది. తెలుగుజాతి వున్నంతకాలం ఆయన పేరు వినిపిస్తూనే వుంటే మహా నటుడు, మహా నాయకుడు అయన నందమూరి తారక రామారావు పేరును కృష్ణ లేదా గుంటూరు జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ప్రభుత్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, జగన్ మీడియా రంగంలోకి దిగింది. ఎన్టీఆర్‌ పేరును ఒక జిల్లాకు పెట్టడం చాలా ఘోరం, నేరం అయినట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీ నాయకుడు జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కడప జిల్లాకు పెట్టడం కరెక్ట్ అయినప్పుడు, అటు సినిమా రంగం మీద, ఇటు రాజకీయ రంగం మీద తనదైన ముద్ర వేసి, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువాడి ఖ్యాతిని పెంచిన నందమూరి తారక రామారావు పేరును ఒక జిల్లాకు పెట్టడంలో ఎందుకు కరెక్ట్ కాదో వైసీపీ నాయకుల బుర్రలకి ఎంతమాత్రం తట్టడం లేదు. ప్రస్తుతం ఏ పనీ లేక ఖాళీగా వున్న వైసీపీ నాయకులు ఎన్టీఆర్ మీద పడి ఏడవటం కంటే జనానికి పనికొచ్చే పనులేవైనా చేస్తే మంచిదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

వైజాగులో డిసాలినేషణ్ ప్లాంటు

  వైజాగ్ ప్రజల చిరకాల డిమాండ్- డిసాలినేషణ్ ప్లాంటు (సముద్రపు నీటిని త్రాగు నీటిగా మార్చే కర్మాగారం) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతించారు. దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో పెట్టబోయే ఈ ప్లాంటు ద్వారా 100 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసి సరఫరా చేయవచ్చును. కానీ ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక ఇంతవరకు ఇది ఏర్పాటు కాలేదు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల సహాయపడేందుకు సిద్దంగా ఉంది గనుక ఈ ప్లాంటు ఏర్పాటుకి అవసరమయిన నిధులను కేంద్రం మంజూరు చేయవచ్చును.   ప్రస్తుతం నగరంలో రోజుకి 80 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా కేవలం 56-60 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి జలాలపై ఆశపెట్టుకొనే పరిస్థితులు లేవు గనుక, వైజాగులో నానాటికీ పెరుగుతున్న నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు డిసాలినేషణ్ ప్లాంటు ఏర్పాటుకి అనుమతిచ్చారు. నగర మున్సిపల్ మరియు నీటి సరఫరా అధికారులు దీని కోసం ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ప్లాంటు ఏర్పాటుకి తగిన్స స్థలం, నిధులు అన్నీ కుదరగానే (బహుశః మూడు నాలుగు నెలలలో) పనులు మొదలుకావచ్చును.

చంద్రబాబుతో అనీల్ అంబానీ సమావేశం

  ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో దేశంలోనే అగ్రగాములుగా వున్న పలు కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమలను విస్తరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో తన పరిశ్రమలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.ఈ సమావేశంలో అనీల్ అంబానీతో పాటు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో ప్రతినిధులు పాల్గొన్నారు.

విపక్షాల అందోళన.. లోక్ సభ వాయిదా

  లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. విపక్షాలు మాత్రం ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టాయి. స్పీకర్ వారి అందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించడంతో.. విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. సభ్యులు శాంతించాలని స్పీకర్ కోరిన వారు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. అంతకముందు సభ ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటన, తమిళనాడు చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతులకు సభ్యులు సంతాపం తెలిపారు.

పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి ఆర్ధిక మరియు రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్ధిక సర్వే, 10న ఆర్ధిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టబడతాయి. ఆర్ధిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెడతారు. రెండు బడ్జెట్లపై ఈ నెల 30వరకు చర్చలు జరిగి అదే రోజు ఆమోదించబడతాయి. పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 14న ముగుస్తాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని అఖిలపక్ష భేటిలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది.

రాష్ట్ర యంపీలతో చంద్రబాబు సమావేశం

  మళ్ళీ 18ఏళ్ల తరువాత అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల యంపీలతో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఆహ్వానించింది. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్టీలకు అతీతంగా రాష్ట్ర యంపీలు అందరూ ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యి, పార్లమెంటులో ప్రస్తావించవలసిన రాష్ట్ర సమస్యల గురించి, కేంద్రం నుండి రాబట్టవలసిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల గురించి చర్చించేవారు. నిన్న హైదరాబాద్ సీయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన యంపీల సమావేశంలో కూడా ఇంచుమించు అదేవిధమయిన చర్చ జరిగింది.   ఈ సమావేశంలో పాల్గొన్న యంపీలు వివిధ అంశాలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారికి అనేక సూచనలు చేసారు. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన ఆర్ధిక సహాయం, రాజధాని నిర్మాణం కోసం నిధుల విడుదల, రాష్ట్ర లోటు బడ్జెటుని పూడ్చేందుకు అదనపు నిధులు, పెండింగులో ఉన్న వివిధ ప్రాజెక్టులు, వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం వంటి మొత్తం 35అంశాలను ఈ సమావేశంలో గుర్తించారు. వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, వాటి సాధన కోసం యంపీలు అందరూ కృషిచేయాలని నిర్ణయించుకొన్నారు. వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలపైనే ఆసక్తి కనబరుస్తోందని అందుకే ఈ సమావేశానికి హాజరు కాకుండా తప్పించుకొందని, రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  ఈరోజు నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. సమావేశాల మొదటిరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు వంటివి సభలో ప్రతిపాదించబోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి యం.వెంకయ్య నాయుడు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేఖించాలని తెరాస యంపీలకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు గనుక సమావేశాలు తొలిరోజు నుండే సభలో యుద్ద వాతావరణం నెలకొనబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ధరలు, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, ఇరాక్ నుండి భారతీయుల తరలింపు వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై కత్తులు దూయడానికి సిద్దంగా ఉంది.   ఈ నేపధ్యంలో సభలో 2014-15 సం.లకు ఆర్ధిక మరియు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. ఈ నెల 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్ధిక సర్వే, 10న ఆర్ధిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టబడతాయి. ఆర్ధిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెడతారు. రెండు బడ్జెట్లపై ఈ నెల 30వరకు చర్చలు జరిగి అదే రోజు ఆమోదించబడతాయి. పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 14న ముగుస్తాయి. ఆ మరునాడు అంటే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి ప్రసంగిస్తారు.

అందుకే ఈ హడావుడి అంతా?

  ఇటీవల జరిగిన మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలను అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చైర్మన్ పదవులను హస్తగతం చేసుకొనే ప్రయత్నం చేయడంతో, రెండు పార్టీలు తీవ్ర ఘర్షణ పడ్డాయి. ఈ ప్రయత్నంలో జరిగిన సభ్యుల కిడ్నాపులు, పార్టీ ఫిరాయింపులను ఖండిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు గవర్నర్ నరసింహన్ను ఈరోజు కలిసి పిర్యాదు చేయనున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని, అందువలన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని వైకాపా కోరుతోంది.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే తపన గురించి తెలియనివారు లేరు. కానీ అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నెలరోజులు గడవక మునుపే ఏవో సాకులతో రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం చాలా హాస్యాస్పదం. గత ఐదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మరో ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండవలసి రావడం చాలా కష్టమే. అన్నేళ్ళు పార్టీలో సభ్యులు గోడ దూకేయకుండా కాపాడుకొంటూ, పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ మాత్రం హడావుడి తప్పదు మరి.