జనసేన పార్టీ వార్నింగ్..!
posted on Jul 11, 2014 @ 12:41PM
సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జనసేన పార్టీపైన వస్తున్న సెటైర్లుపైన ఆపార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైన సెటైర్లు వేస్తున్నారని, ఇక నుంచి ఇటువంటి సెటైర్లు వేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ గట్టిగా హెచ్చరించింది. అలాగే జనసేన పార్టీ తరపున ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలో జనసేన పార్టీ గురించి గానీ, పార్టీ తరపున ప్రకటనలు అంటు వస్తే అటువంటి వాటితో తమకు సంబంధం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందులో స్పష్టంచేశారు. పార్టీ పేరుతో ఈ సోషల్ నెట్‌వర్క్‌లో గానీ ఇతర మార్గాల ద్వారా గాని విరాళాలు సేకరిస్తున్న వారితో ఎటువంటి సంబంధం లేదంటూ జనసేన క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి పూర్తిస్థాయి గుర్తింపు వచ్చిన తరువాత భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తారని తెలిపారు.