కులరాజకీయాల పాచికలాట
ఎన్నికలు దగ్గరికొచ్చేస్తున్నాయ్.. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి పాతా కొత్తా పార్టీలన్నీ రకరకాల పాచికల్ని ప్రయోగిస్తున్నాయ్. ప్రాంతీయ తత్వాలు, వర్గ పోరాటాలు ఒరగబెట్టే లాభం చాలా తక్కువగా ఉంటుందన్న నిజాన్ని గ్రహించాక అన్ని పార్టీలూ ఇప్పుడు కులసమీకరణాలమీద పడ్డాయ్.
పల్నాటి రెడ్లని, మాలల్ని, కన్వర్టెడ్ క్రిస్టియన్లని పూర్తిగా ఆకట్టుకోవడంలో సఫలత సాధించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనంత ఎక్కువగా కాపుల్నికూడా పోగేసే ప్రయత్నం చేస్తోంది. ఇంకా వీలైతే మైనారిటీల్నికూడా గట్టిగాలం వేసి లాగాలనే ప్రయత్నాలుకూడా ముమ్మరంగా సాగుతున్నాయ్.
వైకాపా మాలల్ని పోగేయడాన్ని చూసిన తెలుగుదేశం మాదిగల్ని భుజానికెత్తుకుంది. వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబు పూర్తిగా బీసీ, ఎస్టీల జపం చేస్తున్నారు. అధికారంలోకొస్తే మాదిగల రుణం తీర్చుకుంటానంటూ చంద్రబాబు హామీలివ్వడం, మందకృష్ణ ఆయన పాదయాత్రకి మద్దతుని ప్రకటించడం లాంటివన్నీ టిడిపి కొత్త సమీకరణాల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అటు రెడ్లనీ, ఇటు ఇతర వర్గాల్నీ కూడగట్టేట్టు లేదన్న నిజాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కాపుల్ని పోగేసే పనిలోపడింది. నిన్న మొన్నటిదాకా చంద్రబాబుని అస్సలు పట్టించుకోని సొంత సామాజిక వర్గం ఇప్పుడు బాబుకి ఆరునూరైనా అన్నివిధాలుగా బాసటగా నిలుస్తామని ప్రామిస్ చేసి మాటని నిలబెట్టుకుంటోంది.
గుంటూరు, బెజవాడ లాంటి స్థానాల్లో మైనారిటీల ఓట్లుకూడా కీలకం. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లోకూడా కాస్తో కూస్తో పట్టుసాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎంఐఎం. వీలైనంతగా మూడోనాలుగో ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగితే కష్టకాలంలో పార్టీలకు అడ్డంపటడేందుకు బేరం బాగా కుదుర్చుకోవచ్చన్నది ఆ పార్టీ వ్యూహం.
బీజేపీ ప్రయోగించిన తెలంగాణ అస్త్రం పేలని టపాసులా తుస్సుమంది. మరోదారి చూసుకోక తప్పని పరిస్థితి. ఎంఐఎం ఎలాగూ దూసుకుపోతూ మైనారిటీల ఓట్లని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది కాబట్టి హిందుత్వ కార్డ్ ని మళ్లీ తెరమీదికి తెస్తే సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోంది. హిందుత్వ కార్డ్ వల్ల యాంటీ ముస్లిం ఓటన్నీ తమకే వస్తాయన్న ఆశతో ఆ పార్టీ ఉంది.
వెలమలంతా కెసిఆర్ వెనకుంటే, రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కోదండరామ్ పక్షాన చేరిందన్న ప్రచారం నిజంగా నిజమైతే ఇక టిఆర్ ఎస్ కుల సమీకరణాలపై పెద్దగా ఆశలుపెట్టుకోకుండా కేవలం ప్రాంతీయతత్వం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నాలు ఎంత వరకూ సఫలమౌతాయో చెప్పలేని స్థితి.