బడ్జెట్‌ ప్రసంగ౦ ప్రారంభించిన అరుణ్‌జైట్లీ

నాలుగవ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకముందు సాధారణ బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను మంత్రివర్గ సభ్యులకు వివరించారు. భేటీలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బడ్జెట్ పైన కోటి ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం తొలి సాధారణ బడ్జెట్ కావడంతో అందరి కళ్లు దీని పైనే ఉన్నాయి.

లోక్ సభలో నిద్రపోయిన రాహుల్

బుధవారం లోక్ సభ సమావేశాలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ కీర్తించిన రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోతూ కెమెరాకి చిక్కారు. ఒక పక్క ధరల పెంపు విషయంలో సభలో వాడివేడిగా చర్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ తనకు సంబంధమే లేదు అన్నట్లు కునుకేశారు! ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.'దేశంలో ధరల పెరుగుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది. ఇప్పుడు ఆ అంశం మీద చర్చ జరుగుతుంటే ఆ పార్టీ యువరాజు నిద్రపోయారు. గత పదేళ్లుగా కాంగ్రెస్‌ అదే చేస్తోంది’ అని బిజెపి విమర్శించింది. కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చారు. సభలో కళ్ళు మూసుకుని కూర్చున్న౦త మాత్రాన నిద్రపోయినట్లు కాదని, కొందరు చర్చను జాగ్రత్తగా వినేందుకు కళ్లు మూసుకుంటారని గుర్తు చేశారు.

చంద్రబాబుకి ఏపీ ఎన్జీవోలు సన్మానం

  మళ్ళీ పదేళ్ళ తరువాత ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును 58సం.ల నుండి 60సం.లకు పెంచడం ద్వారా వారి ఆధరణ పొందగలిగారు. అందుకు ఉద్యోగులు కూడా చాలా సంతోషిస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఏపీఎన్జీవోలు అందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈనెల 12న విజయవాడ లయోలా కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా సన్మానం చేయాలనుకొంటున్నారు. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించడంతో ఏపీఎన్జీవోలు ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టి, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తూనే మరో పక్క రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం చేయవలసిన ఈ కీలక తరుణంలో ప్రభుత్వోద్యోగుల పాత్ర చాలా కీలకం కానుంది. వారి సమర్ధత, అనుభవం ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరం ఉంది.ఇటువంటి తరుణంలో ప్రభుత్వం, ఉద్యోగులమధ్య చక్కటి సమన్వయము, సహకారం చాలా అవసరం. అది పుష్కలంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది.

అక్టోబరు 2 నుంచి 24 గంటల విద్యుత్

అక్టోబరు 2 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేసే పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. గత ప్రభుత్వాల ముందు చూపు లేని కారణంగా విద్యుత్ విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ ను పశ్చిమ బెంగాల్ నుండి తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీ రెవెన్యూ లోటును ఇవ్వాల్సి ఉందని, రుణాలు మాఫీ చేసేందుకు అవసరం అయిన వనరులను సమకూర్చుకునేందుకు మార్గాలు వెతుకుతున్నామని బాబు అన్నారు. అప్పు తేవడానికి ఆర్ధిక యాజమాన్యం చట్టం అడ్డు వస్తుందని అన్నారు.

రాహుల్ ని చూసి బిత్తరపోతున్నారు..!

  మూడు రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ రాహుల్ గాంధీని చూస్తున్న జనం బిత్తరపోతున్నారట. ఎందుకంటే ఆయన ఈ మూడు రోజులుగా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ వున్నారు. ఎప్పుడు చూసినా అందర్నీ నవ్వుతూ పలకరిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పటికంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారట. భారత ప్రజలు తమని, తమ పార్టీని ఇంటికి సాగనంపారన్న దిగులు ఏ కోశానా ఆయన ముఖంలో కనిపించడం లేదట. తన జీవితంతో ఎప్పుడూ ఎవరినీ పలకరించి ఎరుగని వాళ్ళని కూడా పేరు పెట్టి మరీ పిలిచి పలకరిస్తూ చాలా ఉల్లాసంగా మాట్లాడుతున్నారట. రాహుల్ గాంధీ ఈ యవ్వారమంతా చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన గారి మాతృమూర్తి సోనియాగాంధీ మురిసిపోతూ వుండొచ్చేమోగానీ, మిగతా రాజకీయ వర్గాలు మాత్రం రాహుల్ గాంధీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

సోనియాకు ఐటీ నోటీసులు.. కక్ష సాదిస్తున్నారా..!

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని, అటువంటి వాటికి తాను భయపడేది లేదని, తమను ఎంతగా ఇబ్బందిపెడితే తాము అంత శక్తివంతంగా తయారయ్యి మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. అయితే ఇంతకాలం మిత్ర పక్షాలను, ప్రతిపక్షాలను వేదించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇప్పుడు తనవంతు రాగానే దానిని కక్ష సాధింపు చర్యలని వర్ణించడం హాస్యాస్పదం. సోనియా గాంధీ అధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మూతపడిన తరువాత, దాని ఆస్తులను ఇతర సంస్థలకు అప్పుగా ఇవ్వడం వ్యాపారపరమయిన లావాదేవీగానే భావిస్తూ, ఆ లావాదేవీలపై వచ్చిన ఆదాయంపై పన్నుఎగవేసినందుకు ఆదాయపన్ను శాఖా నోటీసులు జారీ చేసింది.

సీబీఐ విచారణ పూర్తి..నరసింహన్ ఏం చేస్తారో?

రాజ్‌భవన్‌లో సీబీఐ విచారణ ముగిసింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను సీబీఐ గంటన్నరపాటు ప్రశ్నించింది. ఈ ఉదయం రాజ్‌భవన్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు గవర్నర్‌కు ప్రశ్నావళిని అందించి వాంగ్మూలం తీసుకున్నారు. సెక్షన్ 161(ఏ) ప్రకారం గవర్నర్ వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసుకుంది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు సమయంలో గవర్నర్ నరసింహన్ ఐబీ చీఫ్‌గా ఉన్నారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు అంశంతో ప్రమేయం వున్న నారాయణన్, వాంగ్ ఛూలను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించడం, మొన్నటి వరకూ గవర్నర్ పదవులను వెలగబెట్టిన వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకోవడం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ గవర్నర్‌ గిరీకి రాజీనామా చేయక తప్పదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

గవర్నర్ నరసింహన్‌ను విచారించిన సిబిఐ

ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం రాజ్‌భవన్‌కు చేరుకున్న సీబీఐ అధికారులను ఆగస్టా కేసులో గవర్నర్‌ నుంచి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎమ్.కె.నారాయణన్ ను, అలాగే గోవా గవర్నర్ వాంచూని వాంగ్మూలాలను కూడా సిబిఐ నమోదు చేసింది. ఆ తరువాత వారు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజకీయవర్గాల తాజా సమాచారం ప్రకారం అప్పట్లో గవర్నర్ లెజెన్స్ బ్యూరో ఛీప్ అధికారిగా వున్నారు కాబట్టి ప్రధాని వద్ద జరిగే కీలక సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ హోదాలో ఆయన ఆ సమావేశానికి హాజరయ్యారు తప్ప ఆయనకు ఆ కేసుతో ఎలాంతో సంబంధం లేదు. కానీ ఆ సమావేశానికి హాజరయ్యారు కాబట్టే ఇప్పుడు సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గవర్నర్ సన్నిహితులు అంటున్నారు. మరీ నరసింహన్ ఇప్పుడు మిగతా గవర్నర్ల బాటలో నడుస్తారా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

పోలవరం డిజైన్ మార్పు సాధ్యంకాదు

  పోలవరం ప్రాజెక్టు డిజైన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లొద్దని టీడీపీ ఎంపీ సుజానా చౌదరి అన్నారు. పార్లమెంట్‌ వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం డిజైన్‌పై నాయకులు సూచనలు చేయడం తగదని, ఇంజినీర్లు చెప్పినట్లు వినాలన్నారు. సమస్యను సృష్టించేందుకే పోలవరంపై రగడ చేస్తున్నారని తెలిపారు. విభజన చట్టంలో పోలవరం అంశం సృష్టంగా ఉందని తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్ పై టీఆర్ఎస్ కావాలనే గొడవ చేసి, ఏదోక సమస్య సృష్టించాలని అనుకుంటుందని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిపై గవర్నర్ అధికారం, పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినవి కావని అన్నారు. రైల్వే బడ్జెట్ అభివృద్ధి దిశగా వుందని, ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే బడ్జెట్ లో మరింత న్యాయ౦ జరుగుతుందని అన్నారు.

గవర్నర్ నరసింహన్ రాజీనామా చేస్తారా?

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారా? ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కేసులో ఇప్పటికే సాక్షులుగా సిబిఐ విచారణను ఎదుకొన్న ఇద్దరూ గవర్నర్లు ఎంకే నారాయణ్, బివి వంచూ తమ పదవులకు రాజీనామా చేశారు. అదే బాటలో గవర్నర్ నరసింహన్ కూడా తన పదవి నుంచీ వైదొలగక తప్పదా? ఆగస్టా కుంభకోణం కేసులో గవర్నర్ నరసింహన్ ను ఈరోజు సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హెలికాప్టర్ కొనుగొళ్ళ కోసం సాంకేతిక పరమైన నిర్ణయాలు తీసుకున్న సమయంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌, ఎస్‌పీజీ చీఫ్‌ బీవీ వాంఛూ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌గా ఉన్న నరసింహన్‌ వున్నారు. ఆ తర్వాత ఈ డీల్‌ ఆంగ్లో-ఇటాలియన్‌కు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్‌కు ఓకే అయ్యింది. ఈ కొనుగొళ్ళలో 360 కోట్లు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వున్నాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షునిగా అమిత్ షా

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హోంమంత్రిగా మోడీ ప్రభుత్వంలో బాధ్యతలు చెప్పట్టడంతో, ఆ పదవికి మరొకరిని ఎంపిక చేయవలసిన అవసరం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పేరు బీజేపీ జాతీయ అధ్యక్షునిగా దాదాపు ఖరారయింది. ఈరోజు డిల్లీలో జరిగే పార్టీ సమావేశంలో లాంఛనంగా ఆయనను ఎన్నుకొని పార్టీ అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఘన విజయానికి ఆయన కూడా ముఖ్య కారకుడు.   దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం కానిదే పార్టీ విజయం సాధించడం కష్టమని గ్రహించిన ఆయన, ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా ఉత్తరప్రదేశ్ బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీని బలోపేతం చేయడంతో ఊహించినట్లుగానే బీజేపీ ఘన విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నంలోనే ఆయన నరేంద్ర మోడీని వారణాసి నుండి పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేసి చివరికి అనుకొన్నది సాధించారు. అమిత్ షా పదునయిన వ్యూహాల ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బహు జన్ సమాజ్ వాదీ పార్టీలు నిలవలేకపోవడంతో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఆ ప్రభావం ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన బీహార్, మధ్యప్రదేశ్, డిల్లీపై కూడా పడటంతో అక్కడ కూడా బీజేపీ ఘన విజయం సాధించింది.   ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై పట్టు సాధించి, దేశాన్ని అన్ని రంగాలలలో అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున సమయంలో, సమర్ధుడు, నమ్మకస్తుడు తనకు అత్యంత సన్నిహితుడు అయిన అమిత్ షా చేతికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే, తన ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీని అన్ని వర్గాలు, మతాల ప్రజలకు సన్నిహితం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తునందున అమిత్ షాను ఆ పదవికి ఎంచుకొన్నారు. 

రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

  ఈసారి రైల్వే బడ్జెటులో చాలా ఆసక్తికరమయిన అంశాలున్నాయి. గంటకు 160-200కి.మీ వేగంతో నడిచే హై స్పీడ్ రైళ్ళు, గంటకు 300-350కి.మీ వేగంతో నడిచే బుల్లెట్ రైళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. రైల్వేల చరిత్రలో మొట్ట మొదటిసారిగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించబోతున్నారు. లక్షల కోట్లు ఖర్చయ్యే బుల్లెట్ రైళ్ళ కావాలనుకొంటే ఇంతకంటే మంచి మార్గం లేదు. కానీ భద్రతా కారణాల చేత రైల్వేల నిర్వహణ (ఆపరేషన్స్)లో మాత్రం ఈ పెట్టుబడులను అనుమతించబోమని రైల్వే మంత్రి తెలిపారు.   ప్రస్తుతం నిమిషానికి కొన్ని వందలు ఆన్ లైన్ టికెట్స్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. దానిని ఏకంగా నిమిషానికి 7200 టికెట్స్ ఇచ్చే విధంగా, ఒకేసారి లక్షమంది లాగిన్ అయినా తట్టుకొనే విధంగా ఆన్ లైన్ విధానాన్ని ఆదునీకరిస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. అంతే కాక ఆన్ లయిన్ ద్వారా ప్లాట్ ఫారం టికెట్లు, స్టేషన్లలో ఉండే రిటైరింగ్ రూములు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంతవరకు ఆన్ లైన్ ద్వారా ఒకసారి కేవలం 5-6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. కానీ తీర్ధయాత్రలు లేదా శుభ కార్యాలకు వెళ్ళేవారు ఏకంగా ఒక బోగీని లేదా ఏకంగా ఒక రైలుని కూడా బుక్ చేసుకొనే అవకాశం కల్పించబోతున్నారు. ఇక సరుకు రవాణా చేసుకొనే సంస్థలు కూడా ఆన్ లైన్ ద్వారా రైల్వే వేగన్లను బుక్ చేసుకొనే సదుపాయం కల్పించాబోతున్నారు. పోస్ట్ ఆఫీసులలో రైల్వే టికెట్స్ విక్రయిస్తామని తెలిపారు.   అన్ని ఏ కేటగిరీ రైళ్ళలో ఉచిత ‘వై ఫై’ సౌకర్యం, బయో టాయిలట్లు, స్టేషన్ల కప్పుల మీద సోలార్ విద్యుత్ ఫలకాలు ఏర్పాటు ద్వారా స్టేషన్లకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. రైళ్ళలో ప్రయాణిస్తున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు , పారిశ్రామిక వేత్తలు తదితరులు ప్రయాణంలోనే తమ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి రైళ్ళలోనే వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే రైళ్ళలోనే ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన కంప్యూటర్లు, ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్ వంటి ఏర్పాట్లు ఉండవచ్చను.   ఇక రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య శుభ్రమయిన, రుచికరమయిన ఆహారం, మంచి నీళ్ళు, టాయిలట్లు, భద్రత. వీటన్నిటి కోసం వేర్వేరు ఏర్పాట్లు ప్రకటించారు. స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు, కార్పోరేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా స్టేషన్లలో స్వచ్చమయిన నీళ్ళు ఏర్పాటు, వృద్ధులు, వికలాంగులను ప్లాట్ ఫారంలపైకి చేర్చేందుకు బ్యాటరీతో నడిచే వాహనాల ఏర్పాటు, అవుట్ సోర్సింగ్ ద్వారా పారిశుద్య పనులు నిర్వహించడం, వీటన్నిటిపై పర్యవేక్షణకు ప్రత్యెక వ్యవస్థల ఏర్పాటు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు.   అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ, ప్రయాణం, రవాణా కూడా మరింత భారం అయ్యే అవకాశం ఉంది. జనరల్ బోగీకి- స్లీపర్-ఏసీ-క్లాసుల ధరలలో ఏవిధంగా తీవ్ర వ్యత్యాసం ఉంటుందో అదేవిధంగా ఒక సాధారణ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణానికి-హై స్పీడ్-బుల్లెట్ రైలు ప్రయాణానికి కూడా టికెట్ ధరలలో తీవ్ర వ్యత్యాసం ఉంటుంది.

పోలవరం ఆర్డినెన్స్‌పై దద్దరిల్లిన లోకసభ

  కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పోలవరం ముంపు ఆర్డినెన్స్ ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సంధర్బంగా తెలంగాణ ఎంపీలు సభలో గందరగోళాన్ని సృష్టించారు. పోలవం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ, టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆర్డినెన్స్‌ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ సభ్యులు వారికి మద్ధతులు తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభాపతి సమావేశాన్ని మధ్యాహ్నం మూడు గంటలవరకూ వాయిదా వేశారు. తిరిగి మూడు గంటలకు ధరల పెరుగుదలపై చర్చను ఆరంబించగా, దానికి అడ్డు తగులుతూ టిఆర్ఎస్ ఎంపీలు ఆటంకం కలిగించారు. స్పీకర్ పోడియం వద్దకు వెల్లి నిరసన తెలిపారు.

రైల్వే బడ్జెటులో కొత్త రైల్వే జోన్ ప్రసక్తి లేదేమిటి?

  రైల్వే బడ్జెటులో కొత్త రైల్వే జోన్ ప్రసక్తి లేదేమిటి? రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అందుకోసం వేసిన కమిటీ ఇంకా తన నివేదిక సమర్పించకపోవడంతో ఈరోజు ప్రకటించలేదు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు కోసం అనేక ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొనవలసి ఉంటుంది. అందుకే కమిటీ నివేదిక అందజేయడానికి మరికొంత సమయం పడుతుంది.   విశాఖ కేంద్రంగా ఈ కొత్త రైల్వేజోను ఏర్పాటు చేయాలని భావిస్తునందున, ముందుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రింద ఉన్న వాల్టేర్ (విశాఖ) డివిజన్ను దాని నుండి వేరు చేయవలసి ఉంటుంది. అయితే అందుకు ఒడిష ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర అభ్యంతరం పెడుతున్నారు. ఒకవేళ వాల్టర్ డివిజన్ను తీసుకోదలిస్తే, తమకు కొత్తగా మూడు రైల్వే డివిజన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క (విశాఖ) రైల్వే జోన్ ఏర్పాటు కోసమే అనేక ఏళ్లుగా పోరాటాలు చేయవలసి వస్తే, ఒడిష ప్రభుత్వం, వాల్టేర్ డివిజను వదులుకొనందుకు ఏకంగా మూడు కొత్త రైల్వే జోన్లు కావాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదం.   ఇక కొత్త రైల్వే జోను ఏర్పాటు కోసం భూముల సమీకరణ, దక్షిణ మధ్య రైల్వేతో సహా ఇతర రైల్వే జోన్లతో చేసుకోవలసిన సాంకేతిక ఏర్పాట్లు, సర్దుబాట్లు వగైరాలు చాలానే ఉన్నాయి. ఇంకా పైకి తెలియని అనేక అంశాలు, సమస్యలు అన్నిటికీ తగిన పరిష్కారం కనుగొన్న తరువాతనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలను సమస్యలలోకి నెట్టినట్లు కాకుండా, రైల్వే జోన్ ఏర్పాటుకు ముందే అన్ని సమస్యలు పరిష్కరించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు తెర వెనుక కమిటీ సభ్యులు, రైల్వే అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈరోజు బడ్జెట్ లో కొత్త రైల్వే జోన్ ప్రస్తావన లేకపోయినప్పటికీ కంగారు పడవలసిన అవసరం లేదు.

రైల్వే బడ్జెట్: ఆంధ్ర-తెలంగాణకు ఇవే

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ్‌ తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రూ.20,680 కోట్లతో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.   ఆంధ్ర-తెలంగాణకు కేటాయించినవి:   1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం. 2. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం. 3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 4. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్. 5. చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు. 6. విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ప్రెస్ కొత్తరైలు. 7. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు. 8. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్. 9.పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్.

మేడెక్కి దూకుతా: ఎమ్మెల్యే వార్నింగ్

  ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, దారుణాలను అడ్డుకోలేకపోతున్నానన్న నిర్వేదం ఎవరిచేత ఎలాంటి పని అయినా చేయిస్తుంది. ప్రస్తుతం గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో అనేకమంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టుకున్న కట్టడాలను నేలమట్టం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిని తెలంగాణ, సీమాంధ్ర అనే తేడా లేకుండా ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అక్రమంగా అమ్మినవారిని వదిలేసి అమాయకంగా కొన్నవారిమీద ప్రతాపం చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకముందు గురుకుల్ ట్రస్ట్ భూముల బాధితులకు అండగా వుంటామని ప్రకటించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట తామే తప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతలకు గురైన భవనాలను సందర్శించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కట్టిన కట్టడాల విషయంలో కేసీఆర్ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని, బడా బాబులు కట్టిన భవంతులను వదిలేసి సామాన్యులు కట్టుకున్న ఇళ్ళను కూల్చివేస్తున్నారని విమర్శించారు. గురుకుల్ ట్రస్ట్ భూములు కొనుక్కున్న సమాన్యులకు న్యాయం జరిగేలా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రతినిధి బృందంతో వచ్చిన స్థానిక శేరిలింగంపల్లి తెలుగుదేశం శాసనసభ్యుడు అరకపూడి గాంధీ స్థానిక ప్రజల పక్షాన నిలిచారు. ఇక్కడి కట్టడాలను కూల్చడం దారుణమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఇక్కడి కట్టడాలను కూల్చడానికి ప్రయత్ని్స్తే తాను భవంతి మీదకి ఎక్కి కిందకి దూకేస్తానని హెచ్చరించారు.