మైగాడ్.. 40 నెమళ్ళు చనిపోయాయి!

  ఈమధ్యకాలంలో పంటపొలాల్లో వుంచిన పురుగుమందులు తిని నెమళ్ళు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. ముఖ్యంగా నెమళ్లు అధికంగా వుండే తెలంగాణ ప్రాంతంలో వాటి మరణం చాలా భారీ సంఖ్యలో వుంటోంది. అందమైన పక్షి కావడంతోపాటు మన జాతీయ పక్షి అయిన నెమలికి పంటపొలాల్లోని విష రసాయనాల వల్ల గండం వచ్చిపడింది. తాజాగా వరంగల్ జిల్లాలోని కోలుకొండ గ్రామం దగ్గర పంటపొలాల్లో చల్లిన విష పదార్థాలు తిన్న 40 నెమళ్ళు గిలగిల కొట్టుకుంటూ మరణించాయి. 40 నెమళ్ళు ఒకేసారి మరణించడం చూసి స్థానికులు బాధపడుతున్నారు. చనిపోయిన నెమళ్ళను గుట్టగా వేశారు. ఆ దృశ్యం చాలా బాధాకరంగా వుందని స్థానికులు అంటున్నారు. నెమళ్ళ మరణం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భవిష్యత్తులో పొలాల్లో చల్లిన విష పదార్ధాలు నెమళ్ళు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార పదార్ధాల్లో విష పదార్ధాలు పెట్టి పొలాల్లో వదలకుండా రైతులకు సూచనలు చేయాలి.

అసభ్య దూషణ.. జైల్లో పడ్డ టీవీ యాంకర్!

  కొన్ని సినిమాల్లో నటించి, ప్రస్తుతం ఓ ఛానల్లో యాంకర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో అనే వ్యక్తి ఒక లేడీ టీచర్ని దారుణంగా దూషించడంతో పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు. హైదరాబాద్‌లో బైక్ డ్రైవింగ్ చేస్తున్న లోబో తన ముందు స్కూటీ మీద వెళ్తున్న ఓ స్కూలు టీచరమ్మ తనకి దారి ఇవ్వలేదని ఆమెని దారుణంగా తిట్టాడు. దాంతో ఆమె తిరగబడి అతనితో వాగ్వాదానికి దిగింది. లోబో హద్దులు దాటి అసభ్యకరంగా మాట్లాడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోబోని అరెస్టు చేయబోతే లోబో తానేదో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినట్టుగా, తానొక టీవీ యాంకర్‌నని బిల్డప్పుగా చెప్పాడు. దాంతో పోలీసులకు మండి అయితే జైల్లో కూర్చుని యాంకరింగ్ చేసుకోమని చెప్పి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఆంధ్ర రాజధాని నిర్మాణానికి కమిటీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కొత్త రాజధాని రూపురేఖలు నిర్ణయించడానికి సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు, పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి (జీవీకే), బొమ్మిడాల శ్రీనివాస్ (జీఎంఆర్), ఎం. ప్రభాకర్ రావు (నూజివీడు సీడ్స్), పీపుల్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి శ్రీనివాసరాజులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు రాజధానిలో రాజ్ భవన్, సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలపై పరిశీలిస్తుంది. రాజధాని రూపు రేఖలు ఏ విధంగా ఉండాలి... రవాణా వ్యవస్థ, రోడ్ల నిర్మాణం ఎలా ఉండాలి.. మౌలిక సదుపాల ఏర్పాటు... తదితర అన్ని ఏ విధంగా ఉండాలి అనే ఒక సలహా ఇవ్వడానికి ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. 10 రోజులలో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

డిప్రెషన్ లోకి వెళ్ళిన బాలినేని..!!

మాజీ మంత్రి , వైఎస్ఆర్.కాంగ్రెస్ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓటమితో డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు రాజకీయవర్గాలలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత బాలినేని ఏకంగా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. గెలుపు మీద అతి విశ్వాసంతో ఆయన కోట్లు ఖర్చు చేయడమే గాక, ఏకంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున పందాలు కాసి తీవ్రంగా నష్టపోయారట. జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందని ..తిరిగి తనకు మంత్రి పదవి ఖాయం అని ఎన్నో ఆలోచనలతో ఉన్న ఆయనకు పార్టీ ఓటమితో తీవ్రంగా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.

నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ పదవి వైకాపా కైవసం

  నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ రోజు మధ్యాహ్న౦ నిర్వహించారు.ఎన్నిక సమయంలో కోఆప్షన్లను కలుపుకున్నా టీడీపీ, వైసీపీ లకు సమానంగానే బలాబలాలున్నాయి. దీంతో అధికారులు లాటరీతోనే జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకూ ఎన్నిక జరిపారు. దీంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి (వైసీపీ) జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు వైసీపీకి ప్లేటు ఫిరాయించడంతో ఈ గెలుపు సాధ్యమయినట్లు సమాచారం. జడ్పీ వైస్ ఛైర్మన్ గా అదే పార్టీకి చెందిన శిరీష గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందాతిరేకాలు వెల్లువెత్తాయి.

అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కేసిఆర్

బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బంగారు బోనం సమర్పించారు. అన౦తరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు తాను ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తెలంగాణ రాష్ట్రంలో బోనం సమర్పించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతోనే తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. బోనాల పండుగను రాష్ట్రపండుగగా గుర్తించామని చెప్పారు. లాల్ దర్వాజ్ అమ్మవారి ఆలయాన్ని అద్బుతంగా రూపుదిద్దుతామని వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి సీఎం వెంట హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డిప్యూటీ సీఎం మహ్మద్ ఆలీ వచ్చారు.

నెల్లూరు జడ్పీ కోసం పోటాపోటీ వ్యూహలు

గత రెండు సార్లుగా వాయిదా పడుతూ వస్తున్న నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఇంకా సందిగ్ధతలో కొనసాగుతోంది. చైర్మన్ పదవి ఎలాగైన కైవసం చేసుకోవాలని చూస్తున్న ప్రధాన పార్టీలు రెండు పోటాపోటీ వ్యూహలు రచిస్తున్నాయి. జిల్లాలో ఉన్న 46 స్థానాల్లో 31 వైసిపి గెలుచుకోగా ఆ తరువాత వైసిపికి చెందిన ఎనిమిది మంది టిడిపి లో చేరగా ఇరు పార్టీలకి సమాన బలం వచ్చింది. దీంతో మ్యాజిక్ సంఖ్య చేరుకోవడానికి ఈ రెండు పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రోజు జరగాల్సిన ఎన్నికపై తమకు సమాచారం లేదని, అందుకని ఎన్నికను వాయిదా వేయాలని టిడిపి వారు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ ను కోరినట్లు తెలుస్తోంది.

యూపీలో రేప్‌లు అతి తక్కువే: ములాయం

  మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ కొత్త భాష్యం చెప్పారు. 21 కోట్ల మంది జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ రేప్‌లు జరుగుతున్నాయని ములాయం సమర్థించుకున్నారు. రాష్ర్టంలో జరుగుతున్న ప్రతి నేరంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని కుమారుడు అఖిలేష్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. 32 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య విషయాన్ని ప్రశ్నించిన మీడియాపై చిర్రుబుర్రులాడారు. మీడియా ఎందుకో యూపీ మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోందన్నారు. గతంలో కూడా రేప్‌లపై ములాయం చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ పై ఓయూ స్టూడెంట్స్ ఫైర్

  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటన వచ్చినప్పటి నుండి ఉస్మానియాలో నిరసనలు మొదలయ్యాయి. నిన్న విద్యార్థుల మీద లాఠీఛార్జ్ కూడా జరిగింది. ఈ రోజు కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉదయం భేటీ అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అలాగే తమ ఆందోళనకు మద్దతు ప్రకటించాలని విద్యార్థులు కోరారు. అన్ని శాఖలలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలంటూ ఈనెల 16 తెలంగాణకేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఏపీ శాసనసభ్యులకు లోక్ సభ స్పీకర్ పాఠాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వం పై తనకు పూర్తి విశ్వాసం ఉందని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె అన్నారు. శనివారం హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు రెండో రోజు జరిగే శిక్షణ తరగతులకు ఆమె హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్యేలకు బాధ్యత పెరిగిందన్నారు. శాసన వ్యవస్థ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సభ్యులందరూ సద్వినియోగపరుచుకోవాలని సుమిత్రా సూచించారు.

జగన్ కు షాక్: టిడిపిలోకి వైకాపా ఎంపీలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలను గమనిస్తుంటే త్వరలోనే ఆ పార్టీనేతలు జగన్ కు గట్టి ఝలక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పార్టీ నాయకులకు ఏ మాత్రం విలువ ఇవ్వరని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని అంటున్నారు. ఇప్పటికే నంధ్యాల ఎంపీ పార్టీని వీడారు. కర్నూలు ఎంపీ పార్టీలో ఉంటున్నట్లు చెప్పినా అక్కడ పార్టీ బాధ్యతలు వేరేవారికి అప్పగించారు. ఆమె అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక తాజాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ నాయకత్వం తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో కలిసి త్వరలో టిడిపిలో చేరుతారని సమాచారం. ఈ వ్యవహారంపై ఇటీవల వైసీపీకి చెందిన ఓ ఎంపీ, టీడీపీ నేత సీఎం రమేష్‌తో మంతనాలు సాగించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో లోక్‌సభ సభ్యత్వాలకు ఇబ్బందిలేకుండా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇందుకు సంబంధించి బీజేపీకి చెందిన ఓ నేత వీరికి సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంహెచ్17 కూల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తు..!

  విమాన కూల్చివేత ఘటనపై ప్రపంచదేశాలు విస్మయం వ్యక్తం చేశాయి. కూల్చివేతపై నిష్పాక్షికంగా అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ గగనతలంపైనే విమానంపై దాడి జరిగింది. ఈ ఘటనకు ఉక్రెయినే బాధ్యత వహించాలి అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నెదర్లాండ్స్, మలేసియా, ఉక్రెయిన్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు.   అంతర్జాతీయ దర్యాప్తు జరిపేందుకు వీలుగా విమానశకలాలన్నింటినీ ఉక్రెయిన్‌లోనే ఉంచాలని ఆయన కోరారు. భారతప్రధాని నరేంద్రమోడీ విమానకూల్చివేత ఘటనను ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కేంద్రవిమానయాన మంత్రి అశోకగజపతిరాజు ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. దేశంలోని ఏ విమానయానసంస్థ కూడా ఉక్రెయిన్ గగనతలం మీదుగా విమానాలు నడపడంలేదని తెలిపారు.

ఇన్ఫోసిస్‌పై కేసు: హిందీ రాదని హిసించారు!

  హిందీ భాష రాదనే కారణంతో పక్షపాత ధోరణి ప్రదర్శించి తమను మానసికంగా హింసించారంటూ ఇన్పోసిస్‌పై అమెరికాకు చెందిన నలుగురు మాజీ ఉద్యోగులు అమెరికాలో కేసు పెట్టారు. గతంలో ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసిన బొల్టెన్, హ్యాండ్లోసెర్, మరో ఇద్దరు ఇన్ఫోసిస్ పై యూఎస్ కోర్ట్ ఆఫ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్ లో కేసు నమోదు చేశారు. కంపెనీకి సంబంధించిన సమావేశాలకు తమను దూరంగా ఉంచేవారని.. అంతేకాకుండా హిందీ భాషనే సమావేశాల్లో ఉపయోగించేవారని ఫిర్యాదులో మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు. టెస్టింగ్ విభాగంలో తనకంటే తక్కువ నైపుణ్యం కలిగిన వారిని, భారతీయ ఉద్యోగులనే నియమించుకునే వారని, తాను పట్ల చూపిస్తున్న వివక్షపై ఫిర్యాదు చేశానని.. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత తన వేధింపులు ఎక్కవయ్యాయని బొల్టెన్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఈ కేసును కొట్టివేయాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.

రిజిస్ట్రేషన్ల బ్యాన్? అబ్బే అదేం లేదు: మంత్రి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపినట్లు వచ్చిన ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఖండించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పడితే భూముల ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో భూముల యజమానులు, వ్యాపారులు భూములను అమ్ముకోవడం లేదని, రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ఆయన చెప్పారు. రాజధాని రాబోతోందన్న అభిప్రాయంతోనే ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా పెరిగాయని, భూముల ధరలు అడ్డగోలుగా పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పరిమితిని దాటిన వారిపై జరిమానా విధిస్తామని మంత్రి చెప్పారు.