ఢిల్లీ ఘటనకి ఎవరు బాధ్యులు..?
డిల్లీలో జరిగిన ఘోరఅత్యాచారానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిలేచిన దేశం, అంతకంటే హీనాతిహీనమయిన అత్యాచార వార్తలను విని దేశానికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్లు కంగారుపడింది. అయితే, ఇటువంటి వార్తలు చాలాకాలంగా వస్తున్నాకూడా ఇటు ప్రజలకి కానీ, అటు ప్రభుత్వానికి గానీ పట్టించుకొనే ఓపిక, తీరికా రెండూలేకనే ఇంతకాలం అవి న్యూస్ పేపర్లలో ఉన్నామనకంటికి కనబడలేదు. ఇప్పుడు డిల్లీ సంఘటనతో అవన్నీ మనకి ప్రస్పుటంగా కనిపించడం మొదలయ్యాయని చెప్పవచ్చును.
ఇటువంటి క్రూరమయిన నేరాలకి ప్రభుత్వానికి ఎంత బాద్యత ఉంటుందో, ప్రజలకీ అంటే బాద్యత ఉంటుంది. ప్రభుత్వాన్ని దాని అసమర్దతకి నిందించక తప్పనప్పుడు, సమాజం సంస్కారవంతులయిన పౌరులను దేశానికి అందించలేక పోయినందుకు సమాజాన్ని నిందించక తప్పదు. స్త్రీలను ‘ఆడది’ అనే పదంతో సంబోదించినప్పుడే వారికొక అబలత్వం కూడా దానితో ఆపాదించిన సమాజం పురుషులకు ‘మగాడు’ అనేది ఒక బిరుదో కిరీటమో పెట్టినట్లు పెట్టింది.
తల్లి కడుపులో పడగానే స్త్రీకి మొదలయిన అగ్నిపరీక్షలు ఆమె కట్టెలమీద కాలిపోయేవరకు తప్పవు. గానీ, ‘మగాడు’ పుట్టకమునుపు నుంచే ఒక ప్రత్యేక హోదాతో పుడతాడు. ఇటువంటి తేడాలే అనేకం కలిసి మనసమాజంలో స్త్రీలని మగాడికి లోకువగా చేసాయి.
ఈ మగాహంకారానికి మన సినిమాలు మరింత సొబగులు అద్డుతూ స్త్రీని హీరో, విలన్ల చేతిలో ఒక ఆటబొమ్మగా, హీరో కోసం అవసరమయినప్పుడల్లా సొగసులు ప్రదర్శించే అందాలబొమ్మగా, వీలయినంత అసభ్యంగాను చూపిస్తూ (అందుకు హీరోయిన్లకి ఏ అభ్యంతరము లేదు కూడా) స్త్రీలను సమాజంలో మరింత పలుచన చేస్తున్నారు. అంతే గాకుండా, మన సినిమాలు యువతకి అవసరమయిన ఐడియాలు- అమ్మాయిలని ఎలా పడేయాలి, గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేకపోతె ఎంత అవమానకరం, అబ్బాయిలకి కోడ్ బాషలో ఎలాగు మెసేజ్ లుపంపాలి, తల్లితండ్రులను ఎలా మోసంచేయాలి, కాలేజి స్థాయిలోనే మందుకొట్టడం, బ్లూ ఫిలిమ్స్, ఇంటర్నెట్ చాటింగ్, వంటి సమస్త లోకజ్ఞానాన్ని అందజేసి సమాజాన్ని కలుషితం చేయడంలో తన పాత్ర తానూ పోషిస్తూనే “మీరు చెడిపోతె అందుకు బాద్యత మాదికాదు” అని నిర్లజ్జగా చెప్పడమేగాకుండా, “అటువంటి సినిమాలు తీయడానికి యువతే మాకు ప్రేరణ” అని నిర్భయంగా చెప్పగలదు కూడా.
ఉయ్యాలలో నిదురిస్తున్న చిన్నారి మొదలుకొని కాటికి కాళ్ళుజాపుకొని కూర్చొన్న వృద్దురాలివరకూ
ఎవరినయినా కేవలం ‘ఆడది’ గానే చూసే మానవరూపంలో తిరిగే కొన్ని మృగాలు సమాజంలో మన మద్యనే విచ్చలవిడిగా తిరుగుతూ నిర్భయంగా అత్యాచారాలకు పాల్పడుతుంటే, అటువంటివారిని ప్రభుత్వాలు ఏమిచేయక, ప్రజలు పట్టించుకొననపుడు స్త్రీలకి భద్రతని ఆశించడం అడియాసే అవుతుంది.
డిల్లీలో ఉవ్వెత్తున యువత ఆందోళనలు చేస్తుంటే మన రాష్ట్రంలో యువత మాత్రం కనీసస్పందన కూడా చూపించలేకపోవడం గర్హనీయం. కులపిచ్చితో తమ అభిమాన సినిమా హీరోలు, రాజకీయనాయకులకు కట్టుబానిసల్లాగ మారి, నిస్సిగ్గుగా వారి వెనుకే తిరగడం, అదే తమ జీవిత పరమార్ధం అన్నట్లు వ్యహరించడం, సినిమాలు రాజకీయ చర్చలతో పొద్దుపుచ్చడం, చాటింగులు, డేటింగులు అంటూ బాధ్యతా రాహిత్యంగా వ్యహరించడంవంటివి తెలిసినంతగా, సమజం పట్ల తమ బాద్యతలను నిర్వర్తించడం మాత్రం చేతకాదు యువతలో చాలామందికి. చాతనయిన యువత నిశబ్దంగా తమ బాధ్యతలను నిర్వర్తించుకు పోతున్నారు తప్ప, మిగిలిన యువతకు ప్రేరణ కల్గించి వారిని తమ మార్గంలోకి మళ్ళించలేక పోతున్నారు.
కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతలేని యువత, బాధ్యతలేని అసమర్ధ ప్రభుత్వాలు, బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తున్న అనేక వ్యవస్తలు, సంస్కరణలకి ఎంత మాత్రం ఇష్టపడని సమాజం, అన్నీ కలగలిసి కొడేద్దుల్లయ్యి కుమ్ములాడుకుంటుంటే మద్యలో బలహీనంగా మిగిలిన లేగదూడవంటి స్త్రీ నలిగి ఈవిధంగా నశించిపోతోంది. ఇప్పటికీ సమాజం మేల్కొనకపోయినట్లయితే, భావితరాల భవిష్యత్తుని చేజేతులా మనమే నాశనం చేసుకోన్నవారమవుతాము.