గాలి, జగన్ లకు 19 వరకు రిమాండ్ పొడిగింపు
అలుపెరగని ‘బెయిలు పోరాటం’ చేస్తున్న జగన్ మరియు గాలి జనార్ధన్ రెడ్డీల రిమాండ్ గడువు ఈ రోజు ముగియడంతో వారిద్దరినీ మళ్లీ సిబీఐ కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి వచ్చింది. గత సెప్టెంబరులో జైలు బయట కాలు పెట్టిన వారిద్దరూ మళ్లీ ఇదే బయటకి రావడం. జైలులో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్నపటికీ, నేడు వీరికేసులను విచారిస్తున్న సిబీఐ జడ్జి శ్రీ దుర్గ ప్రసాద్ మూడు రోజులు శలవు మీద వెళ్ళడంతో, వీరందరినీ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం లేని గగన్ మహల్ సిబీఐ కోర్టులో ప్రవేశ పెట్టవలసి రావడంతో, అందరూ జైలు బయట కాలుపెట్టే అవకాశం పొందేరు. జగాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అతని పార్టీ కార్య కర్తలు, పరిచయస్తులూ కూడా సిబీఐ కోర్టుకి తరలి వచ్చేరు.
వారితో బాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి, రాజగోపాల్, అయోధ్య రామిరెడ్డి, ఆలీఖాన్ తదితరుల రిమాండ్ గడువు ఈరోజే ముగియడంతో వారినికూడా ఈరోజే కోర్టు ముందు ప్రవేశ పెట్టవలసి రావడంతో, హైదరాబాదు పోలీసులకి, చంచలగూడ జైలు అధికారులకి కత్తి మీద సామే అయింది వారి తరలింపు ప్రక్రియ. చంచలగూడ జైలు నుండి నాంపల్లిలో గగన్ మహల్ లో ఉన్న సిబీఐ కోర్టు వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్తగా చర్యగా, ఆ దారిలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయవలసి వచ్చింది అంటే వాళ్ళు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకొన్నారో తెలుస్తోంది.
వీరే గాక, విజయ సాయిరెడ్డి, ఐ.యేయ.స్. ఆఫీసర్లు బి.పి.ఆచార్య, శ్రీలక్ష్మి, మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు కూడా ఈ రోజే కోర్టుకి హాజరుకావలసి ఉంది. అయితే, శ్రీలక్ష్మి అనారోగ్య కారణాలవల్ల హాజరు కావడం లేదని ముందే తెలియజేసారు. ఈ రోజు కోర్టుకి హాజరయిన నిందితులు అందరికీ జడ్జి డిసెంబర్ 19వరకు రిమాండ్ పొడిగించడంతో మళ్ళీ అందరు తిరుగు ప్రయాణం అయ్యి, జైలుకి భోజనాల సమయానికల్లా జేరుకోగలిగేరు. జగన్ మాత్రం ఒక గంటసేపు తన భార్య భారతితో కోర్టు ఆవరణలోనే మాట్లాడుకోవడానికి కోర్టు అనుమతి పొందారు.