కైకలూరు ఎంఎల్ఏ రమణ పయనం ఎటు ?
ప్రస్తుత రాజకీయ నాయకులు కృష్ణా జిల్లాలోని కైకలూరు శాసనసభ్యుడు జయ మంగళ వెంకట రమణ నుండి చాలా నేర్చుకోవాల్సిఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న అవకాశవాద రాజకీయాల్లో నెగ్గుకురావడమెలాగో తెలుసుకోవాలంటే మాత్రం గత కొంత కాలంగా ఆయన చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులను కొంచెం లోతుగా పరిశీలిస్తే సరిపోతుంది.
ఆయన నడుపుతున్న రాజకీయాలు కొంత మందికి ఎబ్బెట్టుగా ఉన్నా, ఆయన మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. తన రాజకీయ జీవితం తనకు ముఖ్యం, తన గురించి ఎవరూ ఎలా అనుకుంటేనేం అని మాత్రం ఆయన భావిస్తున్నారు.
2009 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుండి తెలుగు దేశం టికెట్ ఫై పోటీ చేసి గెలుపొందిన రమణ ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ ఫై చాలా తెలివిగా, పావులు కదుపుతున్నారు. స్వార్ధపూరిత రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచి ఆయన తన రాజకీయ జీవితానికి బాటలు వేసుకుంటున్నారు.
రమణ ప్రస్తుతం తెలుగు దేశం నుండి బయటకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీర్ఘకాలం ఆ పార్టీలో ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన ప్రస్తుతం శాసనసభ కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయమహామహులంతా జగన్ పార్టీ వైపు చూస్తుండడంతో పాపం రమణకు వారి జాబితాలో చేరాలనిపించింది. అయితే, తన రాజకీయ జీవితంఫై కూడా కాస్త ఎక్కువ మక్కువ ఉండడంతో తనకు వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ టికెట్ ఇస్తానంటేనే మీ పార్టీలో చేరతానంటూ జగన్ పార్టీ అధిష్టానానికి మెలిక పెట్టారు. అయితే, మొదట తమ పార్టీలో చేరు, ఆ తర్వాత టికెట్ విషయం చూద్దామంటూ ఆ పార్టీ నుండి సమాధానం వచ్చింది. అంతే, తన రాజకీయ జీవితానికి గారంటీ ఇవ్వలేని పార్టీ ఎందుకంటూ ఏ మాత్రం ఆలోచించకుండా రమణ ఆ పార్టీలో చేరే ఆలోచనను వెంటనే విరమించుకున్నారు.
తాను జగన్ పార్టీలో చేరాలనుకున్న విషయం తన పార్టీ నేత చంద్ర బాబుకు తెలిసినప్పటికీ రమణ ఆ విషయాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, ఆ విషయాన్ని ఖండిస్తూ, ఇక రాష్ట్రంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన తన దృష్టిని సారించారు.
వాస్తవానికి కృష్ణా జిల్లాలోని నూజివీడు, గుడివాడ శాసనసభ్యులు పార్టీ వదలిన సమయంలోనే రమణఫై అనేక మందికి సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు తో ఓ కార్యక్రమంలో పాల్గొని కొల్లేరు సమస్య విషయంలో తాను చెప్పినట్లు చేస్తే, కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ ప్రకటించారు. ఇక్కడ ప్రత్యేకట ఏమిటంటే, ఓ సమస్య పరిష్కరిస్తే చాలు, ఏకంగా పార్టీనే మారేస్తానంటూ చాలా ఓపెన్ గా ప్రకటన చేయడమే.
తన ఘన కార్యాలకు రమణ ఇచ్చిన వివరణ ఎలా ఉన్నా, తనను గెలిపించిన ప్రజలు, పార్టీ మాత్రం ఆయన రాజకీయ జిమ్మిక్కులతో విస్మయం చెందుతున్న మాట మాత్రం వాస్తవం. ఈ విషయంలో రమణ వివరణ ఇస్తూ, ఇలాంటి అవకాశవాద రాజకీయాలు నడుపుతోంది తానొక్కడినే కాదనీ, అలా చేసిన వ్యక్తుల్లో తాను మొదటి వాడిని కూడా కాదంటూ ఓ ప్రకటనే ఇచ్చేసారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, కాంగ్రెస్ లో విలీనం అవుతామంటూ కే సి ఆర్ అనలేదా అనేది ఆయన వివరణ. కే సి ఆర్ నుండి తాను నేర్చుకున్నాననీ , మిగిలిన వారు తనను చూసి నేర్చుకోవాలనేది ఆయన అర్ధమేమో ?
మరోవైపు కాంగ్రెస్ లో చేరినా, అక్కడ నుండి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లభించే విషయంలో ఆయనకు కాస్త ఎక్కువ సందేహాలే ఉన్నాయి. ఎందుకంటే కైకలూరు కాంగ్రెస్ నియోజక వర్గంలో ఇప్పటికే బలమైన కాంగ్రెస్ నేతలే అక్కడ ఉన్నారు. ఎర్నేని రాజబాబు, కమ్మిలి విట్టల్, కామినేని శ్రీనివాస్ వంటి వారు ఇప్పటికే ఆ పార్టీలో ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరాలని చూస్తుండడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు టికెట్ లభించదని ఆయన భావిస్తే, ఇక ఆయన పయనం ఎటో మాత్రం అంతుబట్టడం లేదు. ఆయనకు ఎలాగు చంద్ర బాబు వద్ద ఇప్పటికే చెడ్డ పేరు వచ్చిఉండడం ఆ ఊహాగానాలకు కారణం. ఇక ప్రస్తుతం ఆయన రాజకీయ జిమ్మిక్కులు ఎలా ఉంటాయో మాత్రం వేచిచూడాల్సిందే.