‘చేరా’ కన్నుమూత!
ప్రఖ్యాత సాహితీవేత్త, ‘చేరా’గా సుప్రసిద్ధులైన చేకూరి రామారావు (80) కన్నుమూశారు. ఆధునిక భాషా శాస్త్రంలో ఆయన కొత్త ఒరవడి సృష్టించిన సాహితీవేత్త. భాషాశాస్త్ర పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా చేరా ఖ్యాతి గడించారు. 1934 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందలపాడులో చేకూరి రామారావు జన్మించారు. అమెరికా కార్నెల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చేకూరి రామారావు 2002లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన రచించిన ‘స్మృతి కిరణాంకం’కు ఈ అవార్డు దక్కింది. ముత్యాలసరాల ముచ్చట్లు, ఇంగ్లీషు-తెలుగు పదకోశం, భాషా పరిశోధన వ్యాసాలు (తెలుగులో వెలుగులు), రెండు పదుల పైన, చేరా పీఠికలు, తెలుగు వాక్యం, కవిత్వానుభవం ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని. చేరాతలు పేరుతో ఏళ్ల తరబడి సాహితీ శీర్షికలు నిర్వహించారు.