హాటు హాట్టుగా బాలసాయి జన్మదిన వేడుకలు
ఒక దయానందుడయిన స్వామీజీ తన భక్తురాలిని పడగదిలో అనుగ్రహిస్తే, మరో పిరమిడ్ బాబా ధ్యానం అంటూ జీన్స్ వేసి కన్నెపిల్లల నడుములు పట్టుకొని భక్తుల ముందే చిందులు వేస్తాడు. మరో బాబా తనకా డ్యాన్సులు చేయడం చేతకాక ఏకంగా ఫారిన్ సరుకునే తెప్పించి ‘సారోస్తారు..రొస్తారు..’ అంటూ సామాన్య ప్రజలకి కూడా అర్ధమయ్యే విదంగా డ్యాన్సులు చేయించి మరింత పేరుతెచ్చుకొన్నాడు.
కర్నూలులో నిన్న తన 51వ జన్మదిన వేడులను ఘనంగా జరుపుకొన్న బాల సాయిబాబా సమక్షంలోనే జరిగిన కార్యక్రమమిది. భజనలు, కీర్తనలు, సందేశాలు అంటే జనం రారనుకోన్నాడోయేమో, విదేశీ డ్యాన్సర్లను (విదేశీ భక్తులని బాబా ఉవాచ), స్వదేశీ డ్యాన్సర్ లను కూడా రప్పించి, వారి డ్యాన్సులతో ఆహుతులను అలరించాడు. డ్యాన్సులతో చిందులు పూర్తయిన తరువాత, ‘వాటేసుకో మ్మావా రాసేసుకో..’ అంటూ ఘాటయిన సినిమా పాటల కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేసారు బాబాగారు.
ఈ కార్యక్రమం ద్వారా లోకానికి, ముఖ్యంగా తనను విమర్శించే వారికీ తన పలుకుబడి తెలియజేసేందుకు, అయన కొందరు రాష్ట్ర మంత్రులు, (టీ జీ. వెంకటేష్) కేంద్ర మంత్రులు (బలరం నాయక్), క్రీడాకారులు (గుట్టా జ్వాల) సినిమా పరిశ్రమకు చెందిన గాయనీ గాయకులను కూడా పాల్గొనేలా చేసారు.
కొద్ది నెలల క్రితం రాష్ట్ర రాజధానిలో సరిగ్గా డీ.జీ.పీ. ఆఫీసు ముందే ఇంజన్ పాడయి నిలిచిపోయిన ఆటోలో బాలసాయికి చెందిన 11 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకొని ఆదాయశాఖవారికి అప్పగించినప్పుడు, వారు నోటీసులు పంపినా పత్తా లేకుండా పోయిన బాలసాయిబాబా, ఆ కధని ఎలా మేనేజ్ చేసాడో గానీ మరి తరువాత ఆ ఊసే వినబడలేదు. మళ్ళీ ఇంతకాలానికి హటాత్తుగా మంత్రులతో సహా కర్నూల్ పట్టణంలో ప్రత్యక్షమవడమే గాకుండా, ఈ విదంగా ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకొన్నాడు.