రైలు ఆలస్యమైంది.. అందుకే ఘోరం జరిగింది!

  మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సును రైలు ఢీకొన్న నాందేడ్ పాసింజర్ రైలు నిజానికి ఆ సమాయానికి ఆ ప్రాంతానికి రావలసిన రైలు కాదు. అంతకు నాలుగు గంటల ముందే ఈ క్రాసింగ్ నుంచి రైలు వెళ్ళిపోవలసి వుంది. అయితే గురువారం నాడు ఈ రైలు నాలుగు గంటలు ఆలస్యమైంది. ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఉదయం ఎనిమిదిన్నర సమయంలో వచ్చే రైళ్ళు ఏవీ లేవన్న ఉద్దేశంతో భరోసాగా ట్రాక్‌ దాటుతూ వుంటారు. ఆ సమయంలో రైళ్లేవీ రావన్న ధైర్యంతోనే బస్సు డ్రైవర్ కూడా మొండిగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రైలు ఆలస్యంగా రావడం, స్కూలు బస్సు డ్రైవర్ అజాగ్రత్త కలసి చిన్నారుల జీవితాలను చిదిమేశాయి.

మీడియా కెమెరాలను ఆపేయండి: కేటీఆర్

  తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక సమావేశంలో పాల్గొన్న సందర్భంలో తనను చిత్రీకరిస్తున్న మీడియా కెమెరాలను ఆపేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్‌ ఫర్‌ తెలంగాణ' పేరిట నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా 1956 స్థానికత గురించిన ప్రశ్న ఎవరో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేముందు కేటీఆర్ మీడియా కెమెరాలను ఆపేయాలని సూచించారు. తాను తన తండ్రి కలిసే ఉంటున్నామని స్థానికత విషయం గురించి మాట్లాడేటప్పుడు మా ఇద్దరి మధ్య అపోహలకు తావు లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలి అంటూ కేటీఆర్ మీడియా కెమెరాలు ఆపేశాక 1956 స్థానికత అంశం మీద మాట్లాడారు. స్థానికత అంశం మీద తాను మాట్లాడిన మాట ఒకలాగా, తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు మరోలాగా వుంటే మీడియా ఊరుకోదన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అలా మీడియా కెమెరాలను ఆపేయాల్సిందిగా సూచించారని తెలుస్తోంది.

స్కూలు బస్సు ప్రమాదం: విషాదంలో మూడు గ్రామాలు!

  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 26 మంది చిన్నారులు మరణించారు. ఈ దుర్ఘటనలో మరణించిన విద్యార్థులందరూ మెదక్ జిల్లాలోని ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గూనేపల్లి గ్రామాలకు చెందినవారు. స్కూలు బస్సు ప్రమాదానికి గురైందని తెలియగానే ఈ మూడు గ్రామాలకు చెందిన ప్రజలు దుర్ఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో పిల్లలున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఘటనా ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ప్రమాదంలో కొనప్రాణంతో వున్న తొమ్మిదిమంది విద్యార్థులను అంబులెన్స్.లో హైదరాబాద్‌కి తరలించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కొత్తజంట.. పాపం.. పెళ్లయిన నెలకే...!

  విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలం మెయిడ గ్రామానికి చెందిన ఒక జంట పెళ్ళయిన నెల రోజులకే ఆత్మహత్య చేసుకుంది. ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంటకి పెళ్ళి చేయడానికి ఇరువైపు పెద్దలు నిరాకరించారు. దాంతో వీరిద్దరూ తమతమ ఇళ్ళలోంచి బయటకి వచ్చేసి పెళ్ళిచేసుకుని కలసి వుంటున్నారు. అయితే పెళ్ళి జరిగి నెల రోజులు అవుతున్నప్పటికీ రెండు వైపుల పెద్దలు వీరిని క్షమించలేదు. తమ ఇళ్లకు ఆహ్వానించలేదు. దాంతో వీరిద్దరూ మనస్తాపానికి గురయ్యారు. దాంతో మొదట ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. భార్య మరణించడాన్ని తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాలవారూ ఇప్పుడు భోరున ఏడుస్తున్నారు. పెళ్ళయిన నెలరోజులకే చనిపోయిన వీరిద్దరినీ చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు.

గవర్నర్ ఇఫ్తార్ విందుకి కేసీఆర్ డుమ్మా!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు రాజ్‌‌భవన్‌లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ చంద్రబాబు, జగన్ విందుకు వచ్చారు. కేసీఆర్ మాత్రం పనుల ఒత్తిడిలో వున్నానంటూ ఇఫ్తార్ విందుకు డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాల ఫార్మాసిటీ

  తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తు్న్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివార్లలో జాతీయ రహదారి పక్కన, రైలు మార్గం ఉన్న చోట, నీటి సౌకర్యం బాగా ఉన్న ప్రాంతంలో ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మసిటీని ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఐదు వేల ఎకరాలలో ఫార్మాసిటీ, రెండు వేల ఎకరాలలో ఫార్మాసిటీలో పనిచేసే వారికి నివాసాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఫార్మాసిటీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా లక్షమందికి, పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేసీఆర్ తెలిపారు. డ్రగ్స్ మాన్యుఫాక్చరర్స్ కంపెనీల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం జరిపిన సందర్భంగా కేసీఆర్ ఈ ఫార్మాసిటీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

దక్షిణాది కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కేసీఆర్

  దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే సదరన్ జోనల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికయ్యారు. ఆయన్ని ఈ పదవికి ఎంపిక చేస్తూ కేంద్ర హోంమంత్రి నుంచి అధికారికంగా లేఖ అందింది. సదరన్ జోనల్ కౌన్సిల్‌కి కేంద్ర హోంమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీని ఉపాధ్యక్ష పదవిలో కేసీఆర్ ఒక సంవత్సరం పాటు వుంటారు. గతంలో దక్షిణాది నుంచి జోనల్ వైస్ ఛైర్మన్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించారు. ఈ అవకాశం ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కింది. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్ఛేరి, తెలంగాణ సదరన్ జోనల్ కౌన్సిల్‌లో సభ్యులుగా వుంటాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, జాతీయ సమగ్రత, కేంద్ర పథకాల అమలు, అభివృద్ధిపై రాష్ట్రాల ఆలోచనలను కేంద్రానికి తెలియజేయడం వంటి అంశాలు కౌన్సిల్ పరిధిలో చర్చిస్తారు.

విభజన = విడాకులు: కేటీఆర్!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లాంటివని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. భార్యాభర్తలు విడిపోయినంత మాత్రాన ద్వేషాలు పెంచి పోషించాల్సిన అవసరం లేదని కేటీఆర్ కళ్ళు తెరుచుకునేంత నీతి సూత్రాన్ని చెప్పారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్వేషాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే మేఘాల్లాంటివని కూడా ఆయన తీర్మానించారు. తమవరకు తాము అన్ని రాష్ట్రాలతోనూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, కర్నాటకతో తమ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఆంధ్రప్రదేశ్‌తో కూడా అలాగే వ్యవహరిస్తామని ఆయన తేల్చారు.

తెలంగాణ అనకూడదు.. మరేమనాలి?

  ‘తెలంగాణ’ అనే పదం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మీడియాకి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇకపై టీవీలలో వార్తలు చదివే సమయంలోగానీ, వార్తాపత్రికలలో రాసే సమయంలోగానీ తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావించాల్సినప్పుడు కేవలం ‘తెలంగాణ’ అని కాకుండా ‘తెలంగాణ రాష్ట్రం’ అని అనాలని ‘తెలంగాణ రాష్ట్రం’ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. ఈ విషయం మీద ‘తెలంగాణ రాష్ట్రం’లోని అన్ని పత్రికలు, టీవీ చానెళ్ల ఎడిటర్లకు ఈ మేరకు లేఖ రాశారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాష్ట్రాన్ని ‘తెలంగాణ’ అనే సంబోంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్రం’ అని పేర్కొనాలంటూ ప్రధాన కార్యదర్శి కోరారు.

దక్షిణ కొరియాలో గాంధీజీ విగ్రహం

  మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలిసారి దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో ఏర్పాటు చేసింది. సోమవారం నాడు వైభవంగా జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ బైయోంగ్ సూసు ఈ స్మారక విగ్రహాన్ని ఆవిష్కరించి దేశానికి అంకితమిచ్చారు. దక్షిణ కొరియాలోని భారత రాయబారి విష్ణూప్రకాశ్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి డైరెక్టర్ జనరల్ సతీశ్ మెహతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుసాన్ నగర మేయర్ సూసు భారత్-కొరియా మధ్య సంబంధాలు క్రమంగా బలోపేతమవుతున్నాయని, ఇప్పుడీ గాంధీజీ విగ్రహం ఏర్పాటుతో అవి మరింత బలపడతాయని అన్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశం ప్రతి కొరియన్‌లోనూ స్ఫూర్తి నింపుతుందని సూసు ఆశాభావం వ్యక్తం చేశారు.

టీటీఈపై దాడి చేసింది లేడీ ప్రయాణికులే

  హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్లో మహిళా టీటీఈపై (టీసీ) మహిళలే దాడి చేసి చెయ్యి చేసుకున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వెళ్ళే ఎంఎంటీఎస్ బేగంపేట స్టేషన్ దగ్గరకి రాగానే టీటీఈ విధులు నిర్వహిస్తున్న కౌసల్య అనే మహిళ కుమారి, రాధ, పద్మ అనే మహిళా ప్రయాణికులను టిక్కెట్ అడిగారు. వారి దగ్గర టిక్కెట్ లేకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మహిళలు టీటీఈ మీద దాడి చేశారు. టీటీఈ ఫిర్యాదుతో పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. టీటీఈ కౌసల్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మీద రైల్వే మజ్జూర్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

జగన్‌వి పిల్ల చేష్టలు: టీడీపీ నేత బొజ్జల

  వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ పిల్ల చేష్టలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మూడు రోజులపాటు చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేసే కార్యక్రమాన్ని ఏదో పుణ్యకార్యం చేస్తున్నట్టుగా చేయాలని జగన్ పిలుపు ఇవ్వడం పిల్లచేష్టగా ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ఇలాగే తన పిల్ల చేష్టలు కంటిన్యూ చేస్తే రైతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్‌కి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. దిష్టిబొమ్మలు తగలేయడం లాంటి పిల్ల చేష్టలను జగన్ మానుకుని పెద్దరికాన్ని ప్రదర్శించాలని ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలవాల్సింది పోయి ఇలాంటి చౌకబారు పనులు చేయడం ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న జగన్‌కి తగదని బొజ్జల సూచించారు.

తైవాన్ విమాన ప్రమాదం: మృతులు ఎందరు?

  తైవాన్‌లో ఓ విమాన ప్రమాదం జరిగింది. తైవాన్‌లోని పెంఘు రాష్ట్రంలో ట్రాన్స్ ఆసియా ఎయిర్ వేస్ విమానం కుప్పకూలింది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్ ఎయిర్లైన్ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్వేస్కు చెందిన ఈ విమానాన్ని మాగాంగ్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలం కావడంతో విమానం కూలిందని తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది మరణించాలరన్న దాని మీద రకరకాల అంకెలు బయటకి వచ్చాయి. మొదట విమానంలోని అందరూ చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మృతుల సంఖ్య 51గా అధికారులు ప్రకటించారు. కొద్ది సేపటి తర్వాత దానిని 50 చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 47గా వుంది. ఇలా మృతుల సంఖ్య తగ్గుతూ వుండటం ఏమిటో అర్థం కాక విమానంలో వున్న వారి బంధువులు అయోమయానికి గురవుతున్నారు.

రోటీ రగిలింది.. వివాదం మిగిలింది!

  పదకొండు మంది శివసేన ఎంపీలు ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌లో తమకు సంప్రదాయ వంటలు వడ్డించలేదన్న నెపంతో ఒక ముస్లిం వ్యక్తికి రోటీ తినిపించి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన అంశం పార్లమెంటులో దుమారం రేపింది. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ రోటీ వివాదం రగిలి వివాదంలా మిగిలింది. బుధవారం నాడు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఈ అంశం మీద హోరు చేశాయి. బీజేపీ నాయకుడు ఎల్.కె.అద్వానీ ఈ రోటీ సంఘటన మీద తన విచారాన్ని వ్యక్తం చేశారు. అలా జరిగి వుండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం ఎలా సమసిపోతుందో చూడాలి.