ఎన్నికల ఫలితాలతో తేలిపోయిన కెసిఆర్ 'వేర్పాటు'వాదం

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       ఆంధ్రప్రదేశ్ సమైక్యతా అనుల్లంఘనీయమని నిజాం, బ్రిటిష్ పరాయి పాలనలవల్ల పలు ప్రాంతాలలో చెల్లాచెదురై శతాబ్దాలపాటు కష్టనష్టాలకు వోర్చి, తుదకు తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం ఫలితంగా ఒకే భాషా సంస్కృతుల ప్రాతిపదికపైన ఏకమైన తెలుగు (ఆంధ్ర)జాతిని తిరిగి కృత్రిమ పద్ధతుల ద్వారా విభజించడం అసాధ్యమనీ ఇటీవల రాష్ట్రవ్యాపితంగా జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి! ఈ ఫలితాలు మూడుప్రాంతాలలోని తెలుగుప్రజల వకాలిక ప్రయోజనాల రక్షణ తెలుగుజాతి సమైక్యత వల్లనే సాధ్యంకాని చీలికవల్ల కాదని మరోసారి నిరూపించాయి. గత కొన్నేళ్ళుగానూ, అంతకుముందూ కొందరు రాజకీయ నిరుద్యోగులు తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో కృత్రిమంగా నిర్మించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాలను ఎంతమాత్రం సమర్ధించుకోడానికి వీలులేకుండా సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పంచాయితీల మాదిరే ఈ సహకార సంఘాల ఎన్నికలు కూడా కిందిస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంవల్ల వాటి ఫలితాలు ప్రాథమికస్థాయిలో ప్రజాబాహుళ్యం స్థిరాభిప్రాయానికి దిక్సూచిగా భావించాలి. చివరికి కృత్రిమ "వేర్పాటు ఉద్యమ'' నిర్మాణం కోసం మోసులెత్తిన కె.సి.ఆర్. అనే ఉత్తరాంధ్రపు వలసదారైన 'బొబ్బిలిదొర' తెలంగాణా ప్రజలమధ్య టి.ఆర్.ఎస్. పార్టీ పేరిట కుంపటి పెట్టి ఇతర ప్రాంతాలలోని తోటి తెలుగుప్రజల మధ్య పచ్చి అబద్ధ ప్రచారాలద్వారా. అక్కరకురాని కృత్రిమ హామీలద్వారా తెలంగాణా ప్రాంతంలోని మన తెలుగుయువతను భ్రమలోకి నెట్టి, ఆ భ్రమలు ఆధారంగా వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడానికి ప్రత్యక్ష సూత్రధారి అయ్యాడు. ఆ పార్టీ పేరిట ఇంతవరకూ పరిమిత సంఖ్యలో గెలిచిన అసెంబ్లీ లేదా పార్లమెంటు సీట్లు కేవలం ఉపఎన్నికల ద్వారానే గాని ప్రత్యక్ష జనరల్ ఎన్నికల ద్వారా కాదు. తీరా తాజాగా తెలంగాణా సహా యావత్తు రాష్ట్రంలోనూ జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలలో గెలిచిందెవరు? ఏ "బొబ్బిలి వలసదారు'' కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాలోని ఆత్మహత్యలకు, రాష్ట్రవిభజనకు, తెలంగాణా ప్రజలకూ వ్యతిరేకమనీ, మోసకారి అనీ ఇంతకాలంగా ఆడిపోసుకుంటూ వచ్చాడో ఆ కె.సి.ఆర్. పార్టీ [ఒక్క కరీంనగర్ మినహా, అక్కడ కూడా టి.ఆర్.ఎస్.తో సమంగా కాంగ్రెస్ కూ స్థానాలు దక్కాయి] ఘోరపరాజయాలు చవిచూడవలసి వచ్చింది. అంతేగాదు, చివరికి రాష్ట్ర విభజన సమస్యపై అటూ ఇటూ కాకుండా ఉన్న, పాతికేళ్ళ రాజకీయ, పాలనానుభవంగల "తెలుగుదేశం'' పార్టీ సహితం కాంగ్రెస్ తర్వాత రెండవ పెద్ద పార్టీగా ఈ ఎన్నికల్లో తన పునాదుల్ని గణనీయంగా నిలుపుకుని విజయాలు పొందింది; అప్పటికీ "బొబ్బిలి వలస దారై''న కె.సి.ఆర్. తెలంగాణా పేరుమీద రాజకీయ నిరుద్యోగిగా పెట్టిన టి.ఆర్.ఎస్. పార్టీ ఈ ఎన్నికల్లో కనీసం మూడవస్థానాన్ని కూడా దక్కించుకొనలేకపోవడం అతని రాజకీయ శూన్యతనే కాదు, రాజకీయ నిరుద్యోగిగా అతని పదవీ వ్యామోహాన్ని కూడా ఈ ఎన్నికలు బహిర్గతం చేయడం విశేషం! కాగా, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయరంగంలో తన మరణం ద్వారా నిలిపిన శూన్యతనుంచి దూసుకువచ్చి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా "వై.యస్.ఆర్. కాంగ్రెస్'' పేరిట జగన్మోహనరెడ్డి నెలకొల్పిన పార్టీ మూడవస్థానంలో ఈ స్థానిక ఎన్నికల్లో నిలబడడం పెద్ద  విశేషం! రాష్ట్రవ్యాపితంగా మూడు ప్రాంతాలలోనూ 1219 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జరిగిన ఎన్నికలలో 940కి పైగా సహకార సంఘాలను కాంగ్రెస్ చేపట్టబోవటం ఇంత కృత్రిమమైన వ్యతిరేక రాజకీయ గాలిదుమారం మధ్య ఆ పార్టీ ఘనవిజయంగానే భావించక తప్పదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, పాలనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సారథ్యంలో సరికొత్త వాతావరణానికి దారితీసి, కాంగ్రెస్ పార్టే పునరుజ్జీవనానికి తొలిమెట్టుగానూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను సంఘటితం చేయడానికి దోహదపడగల అవకాశంగానూ భావించుకోవచ్చు. ఈ తాజా ప్రాథమికస్థాయి ఎన్నికల ఫలితాలను చూచిన తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాష్ట్ర విభజనకు, తెలుగుజాతిని చీల్చడానికీ సాహసించగల అవకాశాలు కూడా క్రమంగా తొలగిపోక తప్పదు. ఈ ప్రాథమికస్థాయి ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ "బొబ్బిలి వలస దొర'' కెసిఆర్ ఒకవైపున కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్. ను విలీనం చేయడంద్వారా 2014 నాటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలన్న "దింపుడుకల్లాం'' ఆశతో ఉన్నాడు; కాంగ్రెస్ లో తన పార్టీని అతడు విలీనం చేయడానికి ఎప్పుడు మాట ఇచ్చి వచ్చాడో అప్పటినుంచీ తన సొంత పార్టీలోనూ, బయటా "కెసిఆర్ తెలంగాణా విద్రోహి'' అన్న తీవ్ర ఆరోపణాముద్రను మోయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా ఇప్పటిదాకా అతడు యువత "ఆత్మహత్యల''కు బాధ్యతను కాంగ్రెస్ పైకి, లేదా తనతో కృత్రిమంగా బతుకుతెరువు రాజకీయం కోసం తన పార్టీకి "మద్దతు''గా గొంతును అద్దెకు యిచ్చిన తెలంగాణా కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులపైకి నెట్టజూస్తూ వచ్చాడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు జాతీయ కాంగ్రెస్ అగ్రేసర స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి ఆచరణ తొలిరూపం ఆంధ్రరాష్ట్రం కాగా, మలిరూపం విశాలాంధ్ర ఏర్పాటు - అదే "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రవతరణం. అందువల్ల తాడూ-బొంగరం లేని కెసిఆర్ లాంటి అవకాశవాద రాజకీయ నిరుద్యోగులకూ, ఎన్ని తప్పోప్పులున్నా ఒక స్థిరమైన జాతీయస్థాయి పార్టీగా 150ఏళ్ళ చరిత్రగల, ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ సంస్థగా కాంగ్రెస్ పార్టీకీ, అది ఆచితూచి చేయవలసిన నిర్ణయాలలో భూమికీ, ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది, ఉంటుంది. అందువల్ల తెలంగాణలో యువత ఆత్మహత్యలకు ప్రత్యక్ష బాధ్యత టి.ఆర్.ఎస్.దీ, దాని నాయకుడిది కాగా, దివంగత ప్రధాని ఇందిరాగాంధీలాగా దేశ సమగ్రతా రక్షణ కోసం, రాష్ట్రాల సమైక్యతా పటిష్టత కోసం వేర్పాటు ఉద్యమాలను ఆదరించి, ప్రోత్సహించే ప్రశ్నలేదని 1969-1972 నాటి ఆంధ్ర-తెలంగాణా ప్రత్యేక ఉద్యమాల తతంగాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లోని ఇరుపక్షాలనూ చీవాట్లు పెట్టగల స్థిరచిత్తంతో నేటి కాంగ్రెస్ అధిష్ఠానవర్గం వ్యవహరించక పోవడం వల్ల కెసిఆర్ ప్రోత్సహించిన ఆత్మహత్యలకు కాంగ్రెస్ పరోక్షంగా కారకురాలు కావలసివచ్చిందని విజ్ఞుల భావన! అందుకనే తాజా పరిణామాలలో భాగంగానే, ప్రాథమికస్థాయి సహకార సంఘాల ఎన్నికల ఫలితాల అనంతరం - వేర్పాటువాదుల రాష్ట్ర కృత్రిమ విభజన డిమాండ్ కు విలువ ఉండదని భావించవచ్చు! కాగా, సహకార సంఘాల ఎన్నికలను "మేము సీరియస్ గా తీసుకోబోమ''ని కెసిఆర్ మల్టీ నేషనల్ కుటుంబసభ్యుడు, కుమారరత్నం తారక రామారావు దిగాలుగా వ్యాఖ్యానించబోవడం ఆత్మవంచనా శిల్పంలో పరాకాష్ట!

స్వామిగౌడ్ పై క్రిమినల్ కేసు

        టిఎన్జీవో మాజీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత స్వామి గౌడ్ క్రిమినల్ కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలవిషయంలో స్వామిగౌడ్ ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కోర్టుకు చార్జిషీటు సమర్పించారు. ఒక హౌసింగ్ ఫ్లాట్ కు సంబంధించి స్వామిగౌడ్ తమతో సొమ్ము తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయించకుండా, సొమ్ము వెనక్కుఇవ్వకుండా బెదిరింపులకుపాల్పడుతున్నాడని ఒక వ్యక్తి స్వామిగౌడ్ పై హై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో స్వామిగౌడ్ పై వివాదం మొదలైంది. ఈ విషయంలో ఇన్ని రోజులూ స్తబ్ధుగా ఉండిపోయిన పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మళ్లీ పాతకేసును కదిలించారు. మరి ఇది స్వామిగౌడ్ ఎమ్మెల్సీ కలలపై ఏమైనా ప్రభావం చూపుతుందేమో!

ఓయూ స్నాతకోత్సవానికి తెలంగాణ సెగ: నరసింహన్ వెనకడుగు

        ఉస్మానియా విశ్వవిద్యాలయం 79వ స్నాతకోత్సవం సంధర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించారు. అయితే గవర్నర్ రాకను నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలు ఉస్మానియా బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బంద్ కాల్ ను ఉపసంహరించుకోవాలని వీసీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాల నాయకులతో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు చర్చలు కూడా జరిపారు. అయినప్పటికి వారు ఒప్పుకోలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపుతూ, తెలంగాణ అంశం పట్ల చులకన భావన ఉన్న గవర్నర్ ను ఉస్మానియాలో అడుగుపెట్టినవ్వమని వారు అధికారులతో చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రాక పెద్ద వివాదంగా మారే అవకాశం ఉండడంతో చివరినిమిషంలో గవర్నర్ ఉస్మానియా స్నాతకోత్సవానికి రాకుండా తప్పుకున్నారు.  గవర్నర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో స్నాతకోత్సవానికి చివరి నిమిషంలో గోవర్దన్ మెహతాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీంతో ఓయూ క్యాంపస్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.

అంతులేని శంకరన్న కధ

  మాజీ మంత్రి శంకరావును నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేసి వదిలేసినప్పటి నుండి, పరిస్థితులు ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారిపోయాయి. యస్సీ, బీసీ తదితత సంఘాల నాయకులు ఆయనకు మద్దతుగా కదిలి రావడం, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు కూడా ఆయనకు మద్దతునీయడంతో, కోర్టు ఆదేశాలపై ఆయనను అరెస్ట్ చేసిన నేరేడ్మెట్ పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. వివిధ వర్గాల నుండి వస్తున్న ఒత్తిడితో ముఖ్యమంత్రి సిఐడీ విచారణకు ఆదేశించినా, శంకర్ రావు మాత్రం సీబీఐ విచారణకు పట్టు పడుతూ సిఐడీ అధికారికి సహకరించడం లేదు.   వెల్లువెత్తిన మద్దతును చూసిన తరువాత ఆయన కుటుంబ సభ్యులలో బహుశః ఆత్మవిశ్వాసం పెరగడం వల్లనేమో, శంకర్ రావు కుమార్తె సుష్మిత తన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు, డీజీపీ దినేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసారు. తన తండ్రి హోం మంత్రిత్వశాఖను డీజీపీ దినేష్ రెడ్డి, ఆయన భార్య ఆస్తుల వివరాలు కోరుతూ దరఖాస్తు చేసినందునే, దినేష్ రెడ్డి పోలీసులను తన తండ్రిపై ఉసిగొల్పారని అందువల్ల అందరిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆమె తన పిర్యాదులో కోరారు. అయితే, పిర్యాదులో తమ పై అధికారి పేరు, ముఖ్యమంత్రి పేరు చేర్చడంతో న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తరువాతనే చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.   ఇటువంటి సంఘటనలు పోలీసుల మనోస్థయిర్యాన్ని దెబ్బ తీయడమే గాకుండా, వారు కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెనకాడే పరిస్థితులను కల్పిస్తాయి. శంకర్ రావుకు భాసటగా నిలిచినవారు, ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం తప్పని భావిస్తున్నారా లేక ఆయనను అరెస్ట్ చేసిన తీరును తప్పు పడుతున్నారా? మొదటి కారణం అయితే అది కోర్టు దిక్కారం అవుతుంది. రెండవ కారణం అయితే అది మానవ హక్కుల రక్షణ క్రిందకు వస్తుంది. ఏమయినపటికీ, ఈ సంఘటనలతో శంకరావు మళ్ళీ మీడియా కెక్కడమే గాకుండా, తన వెంటబడి వేదిస్తున్న గ్రీన్ ఫీల్డ్ కేసుల నుండి తాత్కాలికంగా బయట పడగలిగారు.

పొలిట్ బ్యూరో స్థానం కోసం తలసాని అలక?

  తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తలసాని మరోసారి అలిగారా? అధినేత ఇచ్చిన హామీ నెరవేరక పోవడమే కారణమా? అందులో భాగంగానే నగర కమిటీ కొత్త కార్యవర్గాన్ని వాయిదా వేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ పార్టీవర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మాజీమంత్రిగా కొన్ని నెలల క్రితం నగర రాజకీయాలపై అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస యాదవ్ ను బుజ్జగించిన అధినేత చంద్రబాబునాయుడు నగర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. నగర అధ్యక్ష పదవితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్న పొలిట్ బ్యూరో సభ్యత్వాన్ని కూడా ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం. పొలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తేనే నగర అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటానని కూడా తలసాని చంద్రబాబుకు చెప్పారు. దానికి బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే పార్టీ నగర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ లో నగర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తలసాని తన మార్క్ ను చూపించడానికి పెద్దయెత్తున హల్ చల్ చేశారు. డిసెంబర్ 8న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తెలుగుదేశం సమర భేరి నిర్వహించి హైదరాబాద్ నగరంలో టిడిపీ వైభవం చెక్కుచెదరలేదని నిరూపించారు.   సమర భేరి విజయవంతం కావడంతో చలసానికి చంద్రబాబు నుంచి ప్రశంసలు వచ్చాయి. కానీ పొలిట్ బ్యూరోలో సభ్యత్వాన్ని బాబు వాయిదా వేస్తుండడంతో తలసాని కొంత కాలంగా నగరంలో పార్టీ కార్యక్రమాలను దాదాపు నిలిపివేశారు. సమర భేరి విజయం తర్వాత ఆయన నగరంలోని కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. అప్పటికీ పొలిట్ బ్యూరోలో స్థానం లభించకపోవడంతో మరోసారి అలిగినట్టు తెలిసింది. కొత్త వారికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడంతో తలసాని ఆవేదనకు గురైనట్టు సమాచారం. పార్టీ నగర కార్యాలయానికి కూడా ఆయన వెళ్ళడం లేదు. అసంతృప్తితో ఉన్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ విషయమై పాదయాత్రలో ఉన్న చంద్రబాబుకు సమాచారం అందినట్టు తెలిసింది. పాదయాత్ర తర్వాత తలసానికి పొలిట్ బ్యూరోలో స్థానం లభిస్తుందని అందరూ భావించారు. జనవరిలో ముగియాల్సిన పాదయాత్రను మార్చి వరకు పొడిగించారు. తన విషయమై అధినేత పట్టించుకోకపోవడంతో మరోసారి తలసాని అలక వహించినట్టు తెలిసింది.   రేపు బాబుతో తలసాని భేటీ    పొలిట్ బ్యూరోలో స్థానం లభించడం లేదన్న కారణంగా అసంతృప్తితో ఉన్న తలసాని నగర కమిటీకి కొత్తగా ఏర్పాటుచేయనున్న కార్యవర్గాన్ని ప్రకటించడంపై ఆసక్తి చూపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. సంక్రాంతి తరువాత కమిటీని ప్రకటిస్తానని ప్రకటించలేదు. పొలిట్ బ్యూరోలో స్థానం విషయం తెలుసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పార్టీ అధినేత చంద్రబాబును గురువారం తలసాని కలవనున్నారు. పొలిట్ బ్యూరోలో స్థానం విషయం తేలిన తరువాతే నగర కమిటీపై చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత కమిటీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి.

ఇంట గెలిచి రచ్చ గెలవలనుకొంటున్న కాంగ్రెస్

  సహకార సంఘాల ఎన్నికల ఫలితాలతో మంచి ఊపుమీదున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం త్వరలో వ్యవసాయ నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించి, గ్రామ స్థాయిలో తన బలం మరింత పెంచుకొని, గ్రామీణ ప్రాంతాలపై పూర్తిపట్టు సంపాదించుకోవాలని ఆలోచిస్తోంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నతరుణంలో, గ్రామీణ ప్రాంతాలతో బాటు, పట్టణ ప్రాంతాలలో కూడా మరింత పట్టుసాధించుకోవాలనే ఆలోచనతో త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ లకూ కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇంట గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇక రచ్చకూడా గెలవాలనుకొంటున్నట్లు కనిపిస్తోంది.   రాష్ట్ర ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అయితే సహకార సంఘాల ఎన్నికల ఫలితాలతో ప్రేరేపితమయి, ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించడానికి కిరణ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా, కేంద్రం నిధులు విడుదలచేయాక పోవడంతో అభివృద్ది కుంటుపడుతోందనే ఆలోచనతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.   మున్సిపాలిటీలకు నిధులు రాక అభివృద్ధి ఆగిపోయిందని ఆయనకి తెలిసిఉన్నపుడు మరి ఇంత కాలం ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు వాయిదా వేసుకొంటూ పోయారు? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే, ఎన్నికలు జరగకపోవడం, నిధులు రాకపోవడం, అభివృద్ధి కుంటూ పడటం జరిగిందని ఆయన పరోక్షంగా ఒప్పుకొంటున్నారా?అనే ప్రశ్నలు తలఎత్తుతాయి.   రాజకీయ కారణాలతో ఇంతకాలం మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా వేసుకొచ్చినా, ఈసమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి నగరాలలో, పట్టణాలలోకూడా పార్టీ బలపడితే, తద్వారా సాధారణ ఎన్నికల సమయానికి నగరాలపై కూడా తమ పార్టీ పూర్తి ఆదిపత్యం సాదించవచ్చని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.   అయితే, గ్రామీణ ప్రాంతాలలో రాబట్టిన ఫలితాలను పట్టణాలలో కూడా రాబట్టడం మామూలు విషయం కాదు. ఒకవేళ, కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో కూడా సఫలమయితే ఇక దైర్యంగా సాధారణ ఎన్నికలకోసం ఎదురుచూడవచ్చును. అయితే కాంగ్రెస్ ఎన్నికల కలలు నిజం అవుతాయా లేక కల్లలుగానే మిగిలిపోతాయా అనే ప్రశ్నకు పట్టణ ప్రాంతప్రజలే జవాబు చెప్పగలరు.

ఈ రోజు నుండి షర్మిల మరో ప్రజా ప్రస్థానం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల గత డిశంబర్ నెలలో మోకాలి గాయం కారణంగా రద్దు చేసుకొన్నతన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను ఈ రోజు తెలంగాణా ప్రాంతములో ఉన్నతుర్కయంజల్ పల్లె నుండి మళ్ళీ ప్రారంబించనున్నారు.   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశంపై స్పష్టమయిన వైఖరి ప్రకటించకుండా పాదయాత్ర మొదలుపెడితే తాము అడ్డుకొంటామని ప్రకటించిన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరికకు జవాబునిస్తూ, ఆ పార్టీకి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ ఆమె బెదిరింపులకి బయపడేదిలేదని, తమ నాయకురాలి పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తెలంగాణా నేతలు అడిగినప్పుడల్లా, తెలంగాణాపై తమ వైఖరిని పదేపదే ప్రకటించవలసిన అవసరం లేదని, తాము ఈ విషయంలో చాల స్పష్టమయిన వైఖరిని తెలియజేశామని ఆయన అన్నారు.   కానీ, నిన్నవరంగల్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ది భరద్వాజ్ తెలంగాణా కోసం ఆత్మహత్య చేసుకొన్ననేపద్యంలో తెలంగాణా అంతటా తీవ్రఉద్రిక్త వాతావరణం నెలకొన్నపరిస్థితుల్లో షర్మిల పాదయాత్ర మొదలుపెట్టడం ఆమెకు కొంచెం ఇబ్బందికరంగానే మారవచ్చును. “ఒకవైపు మా తెలంగాణా బిడ్డల పాడెలు సాగుతుంటే, మరో వైపు అధికారంలో రావడం కోసం ఈ విధంగా పాదయాత్రలు చేయడం అంటే తెలంగాణా ప్రజలను అవమానించినట్లే” అని కవిత విమర్శించిన తరువాత అటు భరద్వాజ్ ఆత్మహత్య చేసుకోవడం, ఇటు షర్మిల పాదయాత్ర మొదలుకావడం ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది.   షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఇబ్రహీం పట్నంలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మళ్ళీ ట్వీటిన లోకేష్

  తెలుగు దేశం పార్టీ యువనాయకుడిగా గుర్తింపు పొందిన నారా లోకేష్, ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ ఆరంగ్రేటం చేయకపోయినా, పార్టీ వ్యవహారాలలో చురుకుగా ఉంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే. తానూ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోయినా, అప్పుడప్పుడు ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్లలో చురుక్కుమననిపించే చిన్నచిన్న సందేశాలను పెడుతూ, తమ ప్రత్యర్ధి పార్టీలను డ్డీకొంటూ ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.   మళ్ళీ చాలా రోజుల తరువాత మళ్ళీ మరోమారు వైయస్సార్ కాంగ్రే పార్టీని, దాని బాకాపత్రిక సాక్షిని గిల్లుతూ, నిన్న తన ట్వీటర్ పేజీలో ఒక చిన్న సందేశం పెట్టారు. సందేశం చిన్నదయినా సూటిగా తగల వలసిన చోటే తగిలేట్లు ఉంది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే “మీ మీడియాను ఆయుధంగా చేసుకొని న్యాయ వ్యవస్థను బెదించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, విమర్శించడాన్నిమొన్న సుప్రీంకోర్టు తప్పుపట్టింది గనుక, ఇక రేపు మీ పత్రికలో ప్రచురింపబోయే తరువాత ఆర్టికల్ సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ఉండబోతోందా?” అని వ్రాసారు.   జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినపటి నుండీ వైయస్సార్ కాంగ్రే పార్టీ ప్రత్యక్షంగా కోర్టులను వేలెత్తి చూపించే దైర్యం చేయకపోయినా, రాజకీయ దురుద్దేశాలతో కాంగ్రెస్ పార్టీ సీబిఐని ఆయుధంగా చేసుకొని జగన్ మోహన్ రెడ్డికి బెయిలు రానివ్వకుండా చేస్తున్నదని పదేపదే అనడం ద్వారా, కోర్టులను పరోక్షంగా నిందిస్తున్నట్లు భావించిన సుప్రీంకోర్టు మొన్న జరిగిన విచారణ సమయంలో జగన్ తరపున వాదిస్తున్న లాయర్లకు చివాట్లు పెట్టడం జరిగింది. నారా లోకేష్ అదే విషయాన్నీ ప్రస్తావిస్తూ ట్వీటర్ లో సందేశం పెట్టారు.

ఏమి పీకుతావో పీకమంటున్నరాజేష్

  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇక తమని పార్టీలోంచి పీకే సాహసం చేయలేరని తెలిసిపోయిన తరువాత, ‘నువ్వు పీకకపోతే మేమే బయటకి పోతాము’ అంటూ, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శాసన సభ్యుడు మద్దాల రాజేష్, ఈ రోజు చంచల్ గూడా జైలుకెళ్ళి వైయస్. జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొన్నారు. శాస్త్ర ప్రకారం జగన్ని జైల్లో కలవడం కూడా పూర్తయిపోయింది కనుక, ఇక నేదో రేపో ఆ పార్టీలో సభ్యత్వం తీసుకొంటున్నట్లు చేసే ప్రకటన లాంచన ప్రాయమే.   ఒక విధంగా బొత్స సత్తిబాబుకు ఇది చెంప పెట్టు వంటిది. ఈ రోజు రాజేష్ వెళ్ళినట్లే రేపు మిగిలిన 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపొతే అందుకు సత్తిబాబే దోషిగా నిలబడవలసి ఉంటుంది. ఇంతవరకు, పెద్ద ఇబ్బందులు లేకుండా జగన్ అనుచరుల మద్దతుతో ఎలాగో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బొత్స ప్రకటనతో కొరివితో తల గోక్కునట్లు జగన్ వర్గాన్ని రెచ్చగొట్టినట్లయింది. తత్ఫలితమే రాజేష్ నిష్క్రమణ.

వాయిస్ మార్చిన ఎంఐఎం అక్బరుద్దీన్‌

        వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన అక్బరుద్దీన్‌కు బెయిల్ మంజూరు కాలేదు. నిర్మల్ కోర్టు ఈ నెల 19 వరకు ఆయనకు రిమాండ్ పొడగించింది. నిర్మల్ న్యాయమూర్తి ఎదుట అక్బరుద్దీన్ కు స్వరపరీక్షలు నిర్వహించారు. ఈ సంధర్భంగా అక్బరుద్దీన్ తన గొంతును మార్చి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా అక్బరుద్దీన్ గొంతు మారిందని ఆయన తరపు వ్యక్తులు చెబుతున్నా, ఫోరెన్సిక్ నివేదికలో తన స్వరం ఎక్కడ పోలుతుందోనన్న భయంతోనే గొంతు మార్చాడని తెలుస్తోంది. అక్బరుద్దీన్ స్వరం పోలే అవకాశం లేకపోవడంతో ఆయనకు మరో సారి స్వరపరీక్షలు చేస్తారని తెలుస్తోంది.

నీరజ్ అంతిమయాత్ర..కోదండరాం వార్నింగ్

    తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన నీరజ్ భరద్వాజ్ అంతిమయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి బసవరాజు సారయ్య ఫ్లెక్సీని విద్యార్థులు ధ్వంసం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికిదిగి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ జరపవలసి వచ్చింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి గాయపడినట్లు సమాచారం.తోపులాటలో ఎమ్మెల్యే హరీష్ రావు గాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి నీరజ్ భరద్వాజ్‌ది ప్రభుత్వ హత్యేనని తెలంగాణ పొలిటికల్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. భరద్వాజ్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పరువు తీసిన బొత్స నోటి దురద

  మన రాజకీయనాయకులకు అప్పుడప్పుడు ఆవేశంలో నోరు జారడం, ఆ తరువాత అది పీకకు చుట్టుకొన్నాక లబలబలాడుతూ “నేనలా అనలేదు, మీడియా నా మాటలను వక్రీకరించిందని” బుకాయించడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. మీడియా వారు ఆడియో, వీడియో సాక్ష్యాలు చూపించినా “ఆ గొంతు నాది కాదు, ఆ బొమ్మ నాది కాదు” అంటూ అతితెలివిగా వాదిస్తుంటారు.   ఇటీవల కాలంలో తరచూ నోరుజారి మీడియాకి దొరికిపోతున్న పీసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ (సత్తి బాబు)వివాదాలకు కేంద్రబిందువయ్యారు. మొన్న9మంది జగన్ విధేయులను పార్టీనుండి బహిష్కరిస్తున్నానని గొప్పగా ప్రకటించిన తరువాత, అది కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్లు, తిరిగి తిరిగి మళ్ళీ అయన పీకకే చుట్టుకొంది.   అసలే నామ మాత్రపు మెజార్టీతో నిలబడున్న ప్రభుత్వాన్ని కిరణ్ కుమార్ రెడ్డి అతికష్టం మీద నెట్టుకువస్తుంటే, బొత్స సత్యనారాయణ ప్రకటనతో అది కాస్తా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం డిల్లీలో ఉన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇదే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం సత్తిబాబును తెలంగాణా చర్చలపేరిట వెంటనే డిల్లీకి రప్పించి బాగా తలంటనున్నదని సమాచారం.   చివరికి తన మాటలు తన పదవికే ఎసరు తెచ్చేట్లు ఉందనే వాస్తవాన్ని గ్రహించిన సత్తిబాబు మాట మార్చి తాను శాసన సభ్యులను (జగన్ అనుచరులను) పార్టీ నుండి బహిష్కరించినట్లు చెప్పలేదని, సోనియాగాంధీ నాయకత్వం, కాంగ్రెస్ సిద్దాంతం ప్రకారం నడచుకోలేని వారు ఎవరయినా సరే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనివారిగా తానూ భావిస్తున్నానని చెపితే, మీడియా తన మాటలను వక్రీకరించి తానూ ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు వార్తలు వ్రాసి తనను ఇబ్బందులోకి నెట్టిందని ఆయన అన్నారు.   మొత్తం మీద ఆయన బహిష్కరణ ప్రకటనతో తన పరువే కాక, పార్టీ పరువును కూడా గంగలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నజగన్ అనుచరుల విషయం ఇంతవరకు ప్రతిపక్షాలు గానీ, స్వయంగా జగన్ గానీ ఎవరూ ప్రస్తావించకపోయినా, ఆయన స్వయంగా ఆ అంశాన్నితన ప్రకటనతో లేవనెత్తి, జగన్ అనుచరులను పార్టీ నుండి బహిష్కరించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రతిపక్షాలు విమర్శించేందుకు అవకాశం కల్పించారు. జగన్ మోహన్ రెడ్డి చెపుతున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి నడుస్తోందనే నిజాన్ని బొత్స సత్యనారాయణ తన వాచాలత్వంతో మరో మారు నిరూపించి, ప్రతిపక్ష పార్టీల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మరింత అలుసయిపోయేలా చేసారు.   ఇక, ఈ అంశం ఇక్కడితో ముగిసిపోతే ఆయన అదృష్టవంతుడేనని అనుకోవచ్చును. కానీ, అది తన పదవిని బలితీసుకొంటే, మీడియా ముందు బుకాయించినా, ఆనక తలుపులేసుకొని తీరికగా పశ్చాతాపపడకతప్పదు.

కామన్వెల్త్ స్కామ్ : శిల్పాశెట్టికి 71 లక్షలు

      కామన్ వెల్త్ స్కామ్ ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ గేమ్స్ ముగిసి రెండేళ్లు గడిచిపోయినా… ఈ స్కామ్ సూత్రధారులు, లబ్ధిదారుల లిస్టు ఇంకా పెరుగుతూనే ఉంది. కామన్ వెల్త్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి శిల్పకు కేవలం అఫిషియల్ గానే కాకుండా, అనఫిషియల్ గా కూడా సొమ్ము చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ కోర్టు బయటపెట్టింది. మరి గేమ్స్ కు సంబంధించిన కార్యక్రమాల్లోడాన్సులూ గట్రా చేసినందుకు శిల్పకు అఫిషియల్ గా సొమ్ములు అందజేయగా… స్కామ్ లో భాగస్వామ్యులపైన ఇద్దరు నిందితులు ఆమెకు 71 లక్షల రూపాయలు చెల్లించారని కోర్టు తెలిపింది. మరి ఈ అనధికార చెల్లింపు ఎందుకు జరిగాయో తేలాల్సి ఉంది!   కామన్‌వెల్త్‌ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్‌ భానోత్‌ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.  

చంద్రబాబు వల్లభనేని వంశీని పక్కన పెట్టేసారా?

    కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకి పంపినట్లే పార్టీలోకి కొత్త నాయకులు రాగానే పాతవారు పనికి రాకుండాపోతారు. అంతకాలంగా వారు పార్టీకి చేసిన సేవలకన్నా, వారి వల్లజరిగిన తప్పులే ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. ఇక అప్పుడు, వారికి తప్పని పరిస్థితుల్లో పార్టీనివీడి బయటకి వెళ్ళక తప్పదు. వివిధ పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ అనుభవం ఎప్పడు ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది.   ఇక విషయానికి వస్తే, ఒకనాడు దేవినేని నెహ్రు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే, ఆ తరువాత వచ్చిన కొందరు నాయకులు ఆయనని పార్టీ నుండి బయటకి సాగనంపే వరకు విశ్రాంతి తీసుకోలేదు. మళ్ళీ కొద్ది కాలం క్రితం, నందమూరి వీరాభిమాని కొడాలి నానికి అటువంటి అనుభవమే ఎదురయింది. దానితో అయన కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళక తప్పలేదు.   ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కృష్ణా జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుండీ చాలా చురుకుగా పనిచేసిన ఆయనను, ప్రస్తుతం కేసినేని నాని వర్గం పక్కకు తప్పించి చంద్రబాబు పాదయాత్రను తన అదుపులోకి తీసుకొంది. అయినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం తనను పట్టించుకోకపోవడంతో, వంశీ క్రమంగా ఆయన పాదయాత్రలో కనిపించడం మానేశారు. ఒకవేళ, తెలుగు దేశం పార్టీ ఆయనతో అదే విధంగా వ్యహరిస్తే, ఆయన కూడా కొడాలినాని వలెనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే, ఒక కొత్త నాయకుడు రాగానే పాతవారిని పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తారనే అపవాదు చంద్రబాబు నిజం చేసినవారవుతారు.

సాక్షి పేపర్ కి సుప్రీంకోర్ట్ అక్షింతలు

        ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'ప్రజా ప్రయోజనం' పేరిట వ్యాజ్యం వేసిన ఇద్దరు పిటిషనర్లకు చెరో రూ.50 వేలు జరిమానా విధించింది. జస్టిస్ రమణపై అవాస్తవాలు, విపరీతమైన వ్యతిరేకాలంకారాలతో కూడిన కథనం ప్రచురించిన 'సాక్షి' పత్రికని తీవ్రంగా తప్పు పట్టింది. ఆ కథనం పరువునష్టం, కోర్టు ధిక్కారం నేరాల కిందికి వస్తుందని పేర్కొంది. సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైన తర్వాతే, జడ్జిపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను సేకరించి, దాని ఆధారంగా ఈ పిటిషన్ వేసినట్లు అర్థమవుతోందని తెలిపింది. "ఈ పిటిషన్‌ను చాలా నైపుణ్యంతో డ్రాఫ్ట్ చేశారు. జస్టిస్ రమణను చెడుకోణంలో చూపించేలా ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను మెలితిప్పారు. పిటిషనర్లు ఎంత సమర్థులో, న్యాయవాది ఎంత అనుభవజ్ఞుడో ఈ పిటిషన్‌ను డ్రాఫ్ట్ చేసిన విధానం చూస్తేనే అర్థమైపోతుంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదికలోని అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది. 'జస్టిస్ రమణపై ఉన్న కేసు రికార్డులను నిజాయితీతో, నిష్పాక్షికంగా పరిశీలించి ఉంటే... మేం ఈ తీర్పులో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన నివేదికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలే వారికీ కలిగేవి. ఈ పిటిషన్‌లో చిత్తశుద్ధి లేదు. ఏదైనా తప్పును సరిచేయాలనే నిజాయితీ లేదు. జస్టిస్ రమణను అపఖ్యాతి పాలు చేయడమే వారి అసలు ఉద్దేశం'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. సీవీసీ కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసుకూ వర్తింప చేయాలన్న వాదనను తోసి పుచ్చింది.

వైఎస్ షర్మిలాకు ఆపరేషన్ జరగలేదు!

        వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా మోకాలికి గాయం కావడంతో కీహోల్ ఆపరేషన్ చేశారు. దీంతో యాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే షర్మిలా మోకాలికి ఆపరేషన్ జరగలేదని కవిత అనుమాన౦ వ్యక్తం చేశారు. ఆపరేషన్ నిజమే అయితే అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. షర్మిల ప్రభుత్వ సహకారంతో పోలీసుల అండతో పాదయాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజలను అది అవమానించడమేనని తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే తాము నల్ల జెండాలతో ఆమె మరో ప్రజా ప్రస్థానం యాత్రకు నిరసన తెలియజేస్తామన్నారు. జగన్ అధికారంలోకి వస్తే వైయస్ కుటుంబానికే వెలుగు కానీ, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తేనే వెలుగు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను షర్మిల గౌరవించాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు జగన్ పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల అవినీతి పై చట్టం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.  

మళ్ళీ విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ

  నిన్నజరిగిన సహకారసంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరోమారు విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 2933 సంఘాలలోకాంగ్రెస్ 1233 గెలుచుకొని తన ప్రత్యర్దులయిన తెలుగు దేశం పార్టీ, తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను వెనక్కు నెట్టి, రాష్ట్రం మొత్తం మీద పట్టు సాదించింది. తెలుగు దేశం పార్టీ:730; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ:432;తెరాస:121; లెఫ్ట్:31; ఇతరులు:131 సంఘాలలో గెలిచారు. మొత్తం 161 సంఘాల ఫలితాలు వాయిదాపడగా, మరో 85 సంఘాల ఫలితాలు ‘హంగ్’ అని ప్రకటించారు.   పార్టీ రహితంగా జరుగవలసిన ఈ సహకార ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానే పోటీకి దిగడంతో, సాధారణ ఎన్నికలు తీసిపోని రీతిలోసాగాయి. ఈ ఎన్నికలలోపట్టు సాధించడం ద్వారా రాజకీయ పార్టీలు గ్రామ స్థాయిలో తమ పార్టీలను బలోపేతం చేసుకొనే అవకాశం ఉన్నందునే, అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ పడ్డాయి.   వచ్చే సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో మిగిలిన పార్టీలన్నిటినీ తుడిచిపెట్టేస్తామని బింకాలు పలుకుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా అంశంపై, తెలంగాణా ప్రజలపై తమకే పూర్తీ హక్కులున్నయనట్లు మాట్లాడే తెరాస, రెండూ కూడా ఈఎన్నికలలో చతికిలబడ్డాయి. అయితే, ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరిక వంటివే నని చెప్పవచ్చును. రాష్ట్రంలో అన్ని పార్టీలు కట్టకట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఎంత ప్రచారం చేసినా కూడా, చివరికి ఆయనదే పైచేయి అవడం వారందరికీ చెంప పెట్టువంటిదేనని చెప్పవచ్చును.   కిరణ్ కుమార్ రెడ్డిని చరిత్రలోనే అత్యంత అసమర్ధ ముఖ్యమంత్రి అని పేర్కొనే వారికి, ఈ ఎన్నికలోక చెంప దెబ్బవంటివి. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెరాసలు చేరుకోలేకపోయాయి. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ కొంత మెరుగుయిన ఫలితాలను రాబట్టి, ఆ రెండు పార్తీలకన్నా ఎక్కువ సంఘాలను గెలుచుకొని రాష్ట్రంలో తన ప్రభావం తగ్గలేదని నిరూపించుకొంది.   ఈ ఎన్నికలలో స్థానిక పరిస్థితులు, స్థానిక నేతల మద్య నున్న సంబంధ బాంధవ్యాలు లెక్కలోకి తీసుకొంటే, వీటిని సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చెప్పలేక పోయిన్నపటికీ, ఈ ఎన్నికల ప్రభావం రాజకీయ పార్టీలపై తప్పకుండా ఉంటుంది. మళ్ళీ అదికారంలోకి రావాలనుకొనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఫలితాలను హెచ్చరికగా తెసుకొని తగిన మార్పులు, ప్రణాలికలు చేసుకోకపొతే, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ధృడంగా ఎదిగి, రాష్ట్రంలో అన్నిరాజకీయ పార్టీలకు పెనుసవాలు విసురుతుందని చెప్పవచ్చును.  

సీఎం ఢిల్లీ టూర్ తెలిసి..బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

        ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాల్లో ఉన్న విట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం స్టూడెంట్ కడవెండి నీరజ్ భరద్వాజ్ బాత్రూంలోకి వెళ్లి డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొవడంతో, అతనిని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలు పెద్దవి కావడంతో పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చికిత్స పొందుతూతుది శ్వాస విడిచాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్తున్నారని మీడియా ద్వారా తెలిసిందని, అదే రోజు ఆత్మ బలిదానానికి సిద్ధపడితే దాని ప్రభావం అధిష్టానంపై ఉంటుందనే భావనతోనే భరద్వాజ్ ఆత్మహత్యకు పూనుకున్నట్లు తనతో చెప్పారని టిఎంయు నేత బాబు తెలిపారు. భరద్వాజ్ నూ  పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంజీఎం ఆస్పత్రి ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదుట విద్యార్థులు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. ఒక పోలీసు జీపు, రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.

బాలయ్యతో మళ్ళీ జత కట్టనున్ననయనతార?

  నందమూరి బాలకృష్ణ తన శ్రీమన్నారాయణ చిత్రం తరువాత మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏసినిమా కూడా మొదలుపెట్టలేదు. అయితే, త్వరలో ఆయన ఒక జానపద సినిమాలో నటించబోతున్నాడని టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘సింహా,’ ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలలో ఆయనతో జతకట్టిన నయనతార మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆయనతో జత కట్టబోతోందని సమాచారం. ఈ సినిమాలో వారిద్దరూ మహారాజు, మహారాణీ పాత్రలు పోషిస్తారని సమాచారం. ఇక, బాలయ్య బాబు అభిమానులకు సంతోషం కలిగించే మరో ఆసక్తికరమయిన వార్త ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన ఎలమంచిలి శివాజీ నిర్మిస్తారని సమాచారం. బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలవవచ్చునని సమాచారం. అయితే, ఈ విషయాన్నిఇంకా సంబందిత వ్యక్తులు ధృవీకరించవలసి ఉంది.