విశ్వరూపం 7న విడుదల: కమల్ ఊహించని క్లైమాక్స్

  ఎట్టకేలకు కమల్ హస్సన్ తన స్వంత రాష్ట్రంలో, తన స్వంత ప్రజలకు, తన ‘విశ్వరూపం’ సినిమా చూపించుకొనే భాగ్యం దక్కింది. రాజకీయ నాయకులూ, కొందరు మత చాందసవాదులు, సినిమా డిస్ట్రిబ్యుటర్లూ అందరూ కలిసి తన దారిలో పేర్చిన ముళ్ళని జాగ్రత్తగా దాటుకొంటూ, చివరికి ఈ నెల 7వ తేదీన విశ్వరూపం తమిళ్ వెర్షన్ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే తెలుగు హిందీ బాషలలో ప్రపంచమంతా విడుదలయి చాలా రోజులు అయినప్పటికీ, ఇంతవరకు తమిళ్ వెర్షన్ మాత్రం తన స్వంత రాష్ట్రంలోనే విడుదల చేసుకోలేకపోయారు. అయితే, మొన్న స్థానిక ముస్లిం నేతలతో ప్రభుత్వ మద్యవర్తిత్వంలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయి, సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.   ఒక మంచి సినిమాను తీసినందుకు అభినందించవలసిన తన ప్రజలే అనేక అడ్డంకులు సృష్టించి తీవ్ర విమర్శలు చేయడంతో వేదన చెందినకమల్ హస్సన్ ఒకానొక సమయం లో రాష్ట్రం, దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతానని అన్నారు. అయితే, ఆయన ఇంతవరకు పడిన బాధను మరిపిస్తూ దేశం నలుమూలాలనుండి ఆయన అభిమానులు చెక్కులు, డీడీలు పంపి ఆయనపై అవ్యాజమయిన ప్రేమాభిమానాలు కురిపించేసరికి, కమల్ హాస్సన్ చలించిపోయారు. తను ఆర్దిక ఇబ్బందుల్లో చిక్కుకొని, చివరికి తన ఇంటిని కూడా తాక్కట్టుపెట్టుకొన్నానని ఆయన మీడియా ముందు చెప్పిన మాటలకు స్పందించిన ఆయన అభిమానులు, యధాశక్తిన డబ్బు పంపి అయన ఊహించంత ప్రేమాభిమానాలు కురిపించారు.   కొందరు ప్రజలచేత ద్వేషింపబడి దేశం వదిలిపెట్టి వెళ్లిపోదామనుకొన్న ఆయనను తమ ప్రేమాభిమానాలతో బందించివేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “నా పై ప్రజలు చూపిన ఈ ఆధారాభిమానాలను నేన్నటికీ మరిచిపోలేను. త్వరలో నా సినిమా విడుదల అవుతున్నందున నా ఆర్దిక సమస్యలని అధిగమించగలను, గనుక చెక్కులను, డీడీలను త్రిప్పి పంపిస్తున్నాను. నా కష్ట కాలం లో నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్య వాదాలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. బహుశః ఇటువంటి క్లైమాక్స్ ఆయన కూడా ఊహించి ఉండరు. అందుకే ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలని అమీర్ ఖాన్ అన్నారు.

సీఎం కిరణ్ చప్రాసీయా

        సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి అధిష్టానం పిలిపించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అపహాస్యం చేశారు. తెలంగాణలోని పరిస్థితులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ చప్రాసీయా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక్కడీవన్ని మోసుకుపోయి ఢిల్లీకి అందించే డ్యూటీ ముఖ్యమంత్రిదయినట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణపై సంప్రదింపులు జరుపుతామని కేంద్ర పెద్దలు చెబితే.. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో గత నెల జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణపై నాన్చకుండా వెంటనే తేల్చాలన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం సోనియానేనని ఆరోపించారు.

షర్మిలా, బ్రదర్ అనిల్ ఆస్తులపై విచారణకు విహెచ్ డిమాండ్

        వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ల ఆస్తులపై విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. షర్మిల, జగన్ ఆస్తులపై కాంగ్రెసు ఊరురా ప్రచారం చేయాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎంత దోచుకున్నారో బయటకు రావాలన్నారు. 10 కంపెనీలలో బ్రదర్ అనిల్ కుమార్‌కు పెట్టుబడులు ఉన్నాయని, దోచుకున్నది కాక కాంగ్రెసు నేతలనే కించపర్చేలా వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ కు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కనువిప్పు యాత్ర చేయాలని పిలుపునిచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ కు 100 కోట్ల జరిమానా

      ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపించింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ 100 కోట్ల రూపాయల జరిమానా విధి౦చింది. ఈ మేరకు రాజసాన్ రాయల్స్‌ యాజమాన్యనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విదేశాల నుండి అక్రమంగా నిధులు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. ఇది ఫెమా ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. ఫెమా ఉల్లంఘన కింద ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జరిమానాగా విధించిన రూ.100 కోట్లను 45 రోజుల్లో చెల్లించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆదేశించింది.

జగన్ కార్పోరేట్ వ్యూహం

        వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దివంగత నేత రాజశేఖరరెడ్డి హయంలో లబ్ది పొందిన కంపెనీలు సహకరిస్తున్నాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణ ఆరోపించారు. పార్టీలలో నేతల ఫిరాయింపులను కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు.   పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యూహ రచన చంచల్‌గూడ జైలు నుంచే జగన్ చేస్తుంటే, దానికి అవసరమైన డబ్బును వైయస్ వల్ల లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు సమకూర్చుతున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతి సొమ్ము పోతుందనే భయంతో వారు జగన్‌తో దోస్తీ చేస్తున్నారని యనమల మండిపడ్డారు.    

వరంగల్లో మంత్రుల ఇళ్ళ ముట్టడి, ఉద్రిక్తత

        తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో తెలంగాణ వాదులు మంత్రుల ఇళ్ళ ముట్టడికి దిగారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ మంత్రి సారయ్య ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి విద్యార్థులను అక్కడి నుండి చెదరగొట్టారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భర్త భాస్కర్ వాహనంపై కూడా ఆందోళనకారులు దాడి చేసి అద్దాలు పగులకొట్టారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కూడా ముట్టడించాలని వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోసం విద్యార్ధులు బలిదానాలు చేస్తుంటే మంత్రులు తమ పదవులలో కొనసాగడం సరికాదని వారు విమర్శిస్తున్నారు.

సీఎం కిరణ్ ఢిల్లీ టూర్: ఆజాద్ అసంతృప్తి

        అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఆజాద్ తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పైన, రాష్ట రాజకీయాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శంకర్రావు, మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై ప్రభుత్వం వ్యవహించిన తీరు పై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ రావు, ఓవైసీ అరెస్ట్ పై కిరణ్ ఆజాద్ కి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆతరువాత సహకార ఎన్నికల నివేదికను కూడా ఆయన సమర్పించారు. మొదటి విడత సహకార ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్నామని, నేటి నుంచి జరగనున్న రెండో విడత సహకారఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని కిరణ్ అజాద్ తో ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ వ్యవహారాలు, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలం తదితర అంశాలపై వారు చర్చించినట్లు  సమాచారం. గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకోవడం విశేషంగా కనిపిస్తుంది.

భయపడుతున్న జగన్ పార్టీ !

        సహకార ఎన్నికల్లో సత్తా చూపలేకపోయిన జగన్ పార్టీ తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. విద్యావంతులు, మేధావులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నందున తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించడం లేదని ప్రకటించింది. రాష్ట్రంలో మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. దీనిని బట్టి ఆ పార్టీ భయపడుతున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ పట్ల కిందిస్థాయి వర్గాల్లో సానుభూతి ఉంది. అయితే విద్యావంతులు, మేధావుల వరకు వచ్చే సరికి జగన్ అవినీతి చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దిగి రిస్కు తీసుకోవడ౦ ఎందుకు అని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండవ విడత సహకారం నేడే

    ఈ రోజు సోమవారం రాష్ట్రంలో రెండవ విడత సహకార ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1484 వ్యవసాయ సహకార సంఘాలకు, 940 ఇతర సంఘాలకు ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉండగా, వాటిలో 68సంఘాల ఎన్నికల పై ప్రభుత్వం స్టే విదించింది. మొదటి విడతలో రాజకీయ పార్టీలు ఒక దానికొకటి పూర్తిగా సహకరించుకోనట్లే, రెండవ విడతలో కూడా నీకిది-నాకది అనే రీతిలో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో 475 సంఘాలలో పోటీ లేకుండా ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు జరుపవలసిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం 7గంటలకు మొదలయ్యే పోలింగు మధ్యాహ్నం 2గంటల జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి పూర్తవగానే ఫలితాలు కూడా ఈ రోజే వెల్లడిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగే సంఘాలు:    జిల్లా పేరు            సంఘాల సంఖ్య విశాఖపట్నం 42 విజయనగరం 37 శ్రీకాకుళం 42 తూర్పుగోదావరి 42 పశ్చిమగో దావరి 56 కృష్టా 95 గుంటూరు 47 ప్రకా శం 61 నెల్లూరు 34 చిత్తూరు 30 కడప 22 కర్నూలు 27 అనంతపురం 42 అదిలాబాద్‌ 35 కరీంనగర్‌ 57 ఖమ్మం 48 వరంగల్‌ 33 నిజామబాద్‌ 54 నల్లగొం డ 53 మహబూ బ్‌నగర్‌ 44 మెదక్‌ 51 రంగారె డ్డి 18

టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల అవిశ్వాస యుద్ధం

  బొత్స సత్యనారాయణ ఏకారణంతో 9మంది జగన్ అనుకూల శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాని ప్రకటించారో గానీ, అది తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు మంచిపని కల్పించింది. ప్రభుత్వం మైనార్టీలో పడినప్పటికీ కూడా, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగు దేశం పార్టీ ఎందుకు జంకుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే, మీ సభ్యులను బహిష్కరిస్తే మీరే స్వయంగా ఆపని ఎందుకుచేయట్లేదని తెలుగు దేశం పార్టీ ఎదురు ప్రశ్నిస్తోంది.   కాంగ్రెస్ యం.పీ.గా కొనసాగుతూ వైయస్సార్ పార్టీకి జై కొడుతున్న సబ్బంహరి అడిగిన ప్రశ్నలకు జవాబుగా, “అసలు ముందు మీరే పార్టీలో ఉన్నారిప్పుడు? కాంగ్రెస్ లోనా లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనా స్పష్టం చేయమని తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోఉంటూ తన స్వంత పార్టీ మీదనే అవిశ్వాసం పెట్టమని మమ్మలిని ఆయన అడుగుతుంటే, మరి కాంగ్రెస్ పార్టీ అతనిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు? ఈవిధంగా అయన పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకి పాల్పడుతున్నపుడు అతనిని కూడా పార్టీలోంచి ఇంకా బహిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తోంది? అని ప్రశ్నించారు.   కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాసం పెట్టాలని ఆయన అంతగా తపిస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఆ పని స్వయంగా ఎందుకు చేయట్లేదు?తమ అనుచరులు 9 మందిని కాంగ్రెస్ పార్టీలోంచి బహిష్కరిస్తున్నపుడు, వారే స్వయంగా గవర్నర్ దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసహరించుకొంటున్నామని స్వయంగా చెప్పి, కిరణ్ కుమార్ ప్రభుత్వంపై వారే స్వయంగా అవిశ్వాసం పెట్టవచ్చు కదా? అని సోమిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలని ప్రశ్నించారు.   మొత్తం మీద అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టే విషయంలో ఈ విదంగా కీచులాడుకొంటూ, వెనకడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన పని తానూ నిశ్చింతగా చేసుకుపోతున్నారు. బహుశః ఇప్పుడు ఏ పార్టీ కూడా తన ప్రభుత్వాన్ని కూల్చి, ఎన్నికలకి వెళ్ళే దైర్యం చేయలేదని ఆయనకి బాగా అర్ధం అయింది కనుకనే అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారేమో.

విజయవాడలో బాబు పాదయాత్ర, లగడపాటి హల్ చల్

      చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర విజయవాడ నగరంలో ప్రవేశించనున్న నేపథ్యంలో లగడపాటి ఆదివారం వ్యూహాత్మకంగా ‘సమైక్యర్యాలీ’కి శ్రీకారం చుట్టాడు. అటు చంద్రబాబు యాత్ర నగరంలోకి రావడం, ఇక్కడ లగడపాటి ర్యాలీ ఒకేసారి ఎదురుపడే పరిస్థితి వచ్చింది. దీంతో తాను చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇస్తానంటూ లొల్లిపెట్టాడు. దీంతో బుడమేరు వంతెన వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు అనుమతి ఇస్తే వెళ్తానని పోలీసులను కోరాడు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఊరుకున్నాడు. ఇంతకుముందు యాత్ర జిల్లాలోకి వచ్చిన సమయంలో అనుమంచి వద్ద లగడపాటి ఇలాగే హడావిడి చేశాడు. తాజాగా మళ్లీ ఇదే సీన్ క్రియేట్ చేశాడు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకం అన్న భావన కలిగించడమే లగడపాటి లక్ష్యంగా కనిపిస్తుంది.

'విశ్వరూపం' కు తొలగిన కష్టాలు...త్వరలో విడుదల

        మొత్తంగా నష్టం ఏ స్థాయి తేలుతుందో కానీ ఈ సినిమా తమిళనాడు విడుదల కు సంబంధించి చర్చలు సఫలం అయ్యాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తానని కమల్ తెలిపాడు. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని అంటున్నారు. ముస్లిం సంఘాలు, కమల్ హాసన్ మధ్య శనివారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అయితే కొన్ని సీన్ల కోతలతో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఏడు వివాదస్పద దృశ్యాలు తొలగించేందుకు కమల్ అంగీకరించారు. మరో ఎనిమిది డైలాగుల వద్ద ‘సైలెంట్’ టోన్ పెట్టనున్నారట. చర్చలు సామరస్యంగా జరిగేందుకు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని కమల్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన దావాను ఉపసంహరించుకుంటామని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ ట్వెంటీ X ట్వెంటీ మ్యాచ్

  కాంగ్రెస్ పార్టీ నుండి త్వరలో 9మంది శాసనసభ్యులు వెనక్కి రానున్నఈ తరుణంలో, త్వరలో వివిధ పార్టీలకి చెందిన మరో 20 మంది శాసన సభ్యులు కూడా తమ టీంలో చేరబోతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు మాచర్లలో తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కొత్త బ్యాచ్ లో అందరూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తమ టీంలో చేరిపోతారని ఆయన పేర్కొన్నారు.    ఆ 20మంది కూడా టీంలో జేరిపోతే, వారు వదిలి వచ్చిన పార్టీలతో మ్యాచ్చ్ మొదలుపెట్టేస్తారు. బయట పార్టీలతో వారు మ్యాచ్ ఆడుకొంటే పరువలేదు గానీ, రేపు తమకి పార్టీ టికెట్ ఇవ్వలేదని జగన్ మోహన్ రెడ్డి తో మ్యాచ్ ఆడుకొంటేనే ఇబ్బంది. అయినా, మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అవుతుందని తెలుసుకోకుండా, పార్టీలోకి వస్తామని అన్నవారినందరినీ ఆహ్వానించుకుంటూపోతే, రేపు పార్టీ టికెట్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎంత మందికి పంచుతారు? ఇదివరకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడుకూడా ఇదే తంతు జరిగి చివరికి ఆ పార్టీ ఎక్కడ తెలిందో గుర్తుంచుకొంటే, ఇక వైయస్సార్ కాంగ్రెస్ తన టీం పెంచుకొనే ప్రయత్నం చేయకపోవచ్చును. లేదంటే ఆ పార్టీలో అసలు ప్లేయర్స్ కన్నా ఎగస్ట్రా ప్లేయర్లే ఎక్కువయిపోతారు. అప్పుడు వారిలో వారే 20X20 మ్యాచ్చులు ఆడుకోవలసి వస్తుంది. అయినా, కెప్టన్ ఇంకా టీంలోకి రాక ముందే ప్లేయర్స్ సిద్దం అయిపోతున్నారు.

చంద్రబాబుకి దమ్ముందా? మైసూరా

  నేతలు పార్టీలు మారగానే వారి విధేయతతో బాటు వారి స్వరం కూడా మారుతుంది. నిన్న మొన్నటివరకూ తెలుగుదేశం పార్టీలోనే నా చివరి శ్వాస, చంద్రబాబు వంటి నాయకుడు నభుతోన భవిష్యత్ అంటూ సినిమా డైలాగులు చెప్పిన మైసూరా రెడ్డి, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయగానే ఆయనకి చంద్రబాబు అకస్మాతుగా చెడ్డవాడయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ అనుచరులుగా ముద్రపడ్డ 9 మంది శాసనసభ్యులను బహిష్కరిస్తున్నట్లు పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించగానే, తమ అనుచరులను బయటకి గెంటుతున్నందుకు కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేయవలసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీతో యుద్ధం మొదలు పెట్టింది. “చంద్రబాబుకి దమ్ము దైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీతో తమకి తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయని ఒప్పుకోవాలని” మైసూరా రెడ్డి ఒక వింత డిమాండ్ చేసారు. నిన్నగాక మొన్న పుట్టిన తమ పార్టీ ఆదేశిస్తే మూడు దశాబ్దాలు చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ శిరసావహిస్తుందని అనుభవజ్ఞుడయిన ఆయన ఎలా అనుకోన్నారో తెలియదు. కోటి సంతకాలతో జగన్ మోహన్ రెడ్డి ని జైలునుండి విడిపించుకోవచ్చుననే వింత ఆలోచన చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు “ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న మరోపార్టీ మీద, మూడో పార్టీ అడిగినప్పుడల్లా అవిశ్వాసం పెట్టకపోతే, ఆరెండు పార్టీలు కుమ్మక్కుఅయినట్లే” అనే మరో సరికొత్త రాజకీయ సిద్దాంతాన్ని మైసూర డిమాండుతో ఆవిష్కరించారు. అసలు, తమ అనుచరులు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలోఉండి అక్కడ ఏమి చేస్తున్నారు? జగన్ మోహన్ రెడ్డికి విదేయులయినప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇంతకాలం ఎందుకు వ్రేలాడేరు? వారిని కాంగ్రెస్ ఇప్పుడు బయటకి పంపుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీని నిందించకపోగా తెలుగు దేశం పార్టీని మద్యలోకి ఎందుకు లాగుతున్నారు? అనే ప్రశ్నలకు మైసూరా వద్ద సమాధానలు ఉన్నాయో లేవో? ఆయనే చెప్పాలి మరి.

బొత్స పేర్లెందుకు ప్రకటించలేదంటే....

  కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది శాసన సభ్యులను బహిష్కరిస్తున్నట్లు నిన్న బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో మళ్ళీ రాష్ట్రంలో రాజకీయలొక్కసారిగా వేడెక్కాయి. ఆయన 9మందిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా వారి పేర్లు మాత్రం ప్రకటించలేదు.   బహుశః తెలంగాణా అంశం నుండి మీడియా దృష్టిని మరల్చడానికో లేక జగన్ వైపు చూస్తున్నకాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టడానికో ఆయన అవిదమయిన ఎత్తుగడచేసి ఉంటారు. ఇక, ఎన్నికలు వస్తున్నతరుణంలో కాంగ్రెస్ పార్టీలో కోవర్టులా పనిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి అనుచరులను ఉంచుకోవడం పార్టీకి ప్రమాదం అనే ఆలోచనతో, అతనికి విదేయులయిన వారిని ఈ విదంగా డెడ్ లయిన్ ఇవ్వడం ద్వారా వారంతట వారే పార్టీ వీడిపోయేలా చేయడానికి ఆయన ఈవిదమయిన ప్రకటన చేసిఉంటారు. అదే సమయంలో, ఇంకా సందిగ్ధంలోఉన్నజగన్ అనుచరులకు పార్టీలోఉండటమా లేక వదిలి వెళ్లిపోవడమా అనే సంగతిని కూడా వెంటనే తేల్చుకొనేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తూ వారి పేర్లు ప్రకటించక కొంత సమయం ఇచ్చారని భావించవచ్చును.   కాంగ్రెస్ పార్టీ, తమని మెడ పట్టుకొని బయటకి గెంటితే ఆ కారణంతో ప్రజల నుండి సానుభూతి పొందవచ్చునని ఎదురు చూస్తున్నశాసన సభ్యులకి, ఈ ప్రకటనతో కొంత గందరగోళం ఏర్పడి వారంతట వారే బయటకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ఉపాయం మెల్లగా ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జగన్ విధేయుడిగా పేరున్న జోగి రమేష్, బొత్స సత్యనారాయణపై విరుచుకుపడుతూ బయటపడటమే అందుకు చక్కని ఉదాహరణ. తద్వారా పార్టీలోంచి బయటకి వెళ్ళేవారు ఈవిధంగా తమ పరువు తామే తీసుకొని మరీ బయటకి వెళ్ళేలా చేయవచ్చును.   రాన్నున్న ఒకటి రెండు రోజుల్లో మరి కొంతమంది ఇదేవిధంగా బయటపడవచ్చును. అనర్హత వేటు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడే కన్నా, ఆ పార్టీకి రాజీనామా చేయడమే ఉత్తమం అని భావించే మరి కొందరు కూడా త్వరలోనే బయట పడవచ్చును. ఒకవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు చేసినా, ప్రభుత్వము కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఆ సంగతి ఆలోచించకుండా బొత్స సత్యనారాయణ అటువంటి ప్రకటన చేసి ఉంటారంటే అనుమానమే

మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహగర్జన

        తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మార్చి 2న నిజాం కళాశాలలో తెలంగాణ విద్యార్థి సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఓయూ జేఏసీ శనివారం ప్రకటించింది. అలాగే, ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 20న ఛలో అసెంబ్లీ ముట్టడికి ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.విద్యార్థి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓయూ జేఏసీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని తెలిపారు. త్వరలో అభ్యర్థి పేరు వెల్లడిస్తామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది.

గోకరాజు ఛాముండీ మధ్యలో సచిన్!

        ఛాముండేశ్వరి నాథ్ అమ్మాయిలను బాగా ముస్తాబు చేసుకుని సచిన్ టెండూల్కర్ వద్దకు తీసుకువెళ్లేవాడని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. కార్యదర్శిగా చాముండేశ్వరి అక్రమాలకు పాల్పడ్డాడని, ఆయన అవకతవకల మూలంగా ఐదు కోట్ల రూపాయల దాకా అసోసియేషన్ నష్టపోయిందని అన్నారు. అందుకే ఆయనను అసోసియేషన్ నుండి సస్పెండ్ చేశామని అన్నారు. ఇద్దరి మధ్య పోరులో సచిన్ ను లాగిన గంగరాజు తనకు ఈ పదవి పెద్దదేం కాదని, తన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పినట్లు తనకి సచిన్ అంటే గౌరవమని అన్నారు.

యాంటీ రేప్ లా...ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులకు ఉరిశిక్ష?

  డిసెంబర్ 16వ తేదీన డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై వాద ప్రతివాదనలు నిన్నటితో పూర్తీ అవడంతో, ప్రత్యేకంగా నియుక్తమయిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఐదుగురు నేరస్తులకి వ్యతిరేఖంగా ఈ రోజు(శుక్రవారం) చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఆరవ నేరస్తుడు మైనర్ (17సం.ల 5నెలలు) అయిన కారణంగా అతనిని బాలనేరస్తుల కోర్టులో విచారిస్తున్నారు. అయితే, బాల నేరస్తులకి కటిన శిక్షలు వేసేందుకు చట్టం ఒప్పుకోదు గనుక, అతను కేవలం 3 సం.ల జైలు శిక్షతో కేసును నుండి తప్పిచుఒనే అవకాశం ఉంది.   నిన్న జరిగిన కేంద్ర కేబినేట్ మంత్రివర్గ సమావేశంలో, జస్టిస్ వర్మ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని, కేంద్రం ఒక ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి వెంటనే పంపింది. కేంద్రం చేసిన తాజా సిఫారసుల ప్రకారం ఇంతవరకు అత్యాచార కేసుల్లో విదిస్తున్న 10సం జైలు శిక్షను రెట్టింపు చేస్తూనే, అవసరమయితే దానిని జీవిత కాల ఖైదుగా మార్చే వీలుకల్పించింది. మరణ శిక్షను రద్దు చేయమన్న వర్మ కమిటీ సిఫారుసును పక్కన బెట్టి, బాదితురాలు మరణించినా లేదా ఆమె శాశ్వితంగా కోమాలోకి వెళ్ళిపోయిన సందర్భంలో కోర్టులు మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంచింది. అయితే బాల నేరస్తుల వయసుని 18 నుండి 16కి తగ్గించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఈ విషయమై న్యాయ నిపుణులతో, రాజకీయ పార్టీలతో సంప్రదించాక ఒక నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది.   అందువల్ల, ప్రస్తుతం 6వ నేరస్తుడు మైనర్ అయిన కారణంగా కటిన శిక్షల నుండి తప్పించుకొనే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాలలో ఈ విషయంపై చర్చ జరిగి బాలనేరస్థుల వయోపరిమితి తగ్గిస్తూ ప్రత్యేక చట్టం రూపు దిద్దుకొంటే తప్ప అందరి కంటే అతి కిరాతకంగా అత్యాచారంచేసి, బాధితురాలి శరీరంలోకి ఇనుప రాడ్డును దూర్చి ఆమె మరణానికి కారకుడయిన బాలనేరస్తుడికి శిక్షపడే అవకాశం లే