కమల్‌నాథన్ కమిటీతో భేటీ: వెబ్‌సైట్‌లో విధివిధానాలు!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగుల విభజనకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన కమల్‌నాథన్ కమిటీ సమావేశం ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖల కార్యాలయంలో శుక్రవారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్‌లు కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచనున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీపై విధివిధానాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచుతామని కమిటీ తెలిపింది. తాము ఏర్పరచిన విధివిధానాల పైన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో వెబ్ సైట్ ద్వారా వ్యక్తం చేయాలని కమిటీ తెలిపింది. 371డీ ప్రకారం స్థానికతను నిర్ధారిస్తామని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని కమిటీ చెప్పింది. దంపతులు, ఒంటరి మహిళలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని కమల్ నాథన్ కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.