కస్టడీకి సుబేదార్ పతన్ కుమార్

  భారత సైన్యం రహస్యాలను పాకిస్థాన్ లేడీ గూఢచారికి వెల్లడించిన మిలటరీ ఉద్యోగి సుబేదార్ పతన్‌కుమార్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కస్టడీకి ఇచ్చింది. పతన్‌ను వారంపాటు సీసీఎస్ పోలీసుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఈనెల 19న వైద్య పరీక్షలు నిర్వహించి పతన్‌ను కోర్టుకు అప్పగించాలని పేర్కొంది. తన తరపు న్యాయవాది సమక్షంలోనే పోలీసులు పతన్‌ను విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్మీ సుబేదార్ పతన్‌ను కస్టడీకి అప్పగించేందుకు ఆర్మీ అధికారుల అనుమతి తీసుకున్నారా? అని న్యాయమూర్తి సిసిఎస్ పోలీసుల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆర్మీ అనుమతితో రావాలని న్యాయమూర్తి చెప్పారు. దాంతో ఆ తర్వాత ఆర్మీ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు మెమో దాఖలు చేయడంతో కోర్టు పతన్‌ను కస్టడీకి అనుమతి ఇచ్చింది. పతన్‌ను సిసిఎస్ కస్టడీకి ఇచ్చిన సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

రాజధాని కోసం కర్నూలువాసుల పోరాటం

  కర్నూలులోనే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని కోరుతూ నిన్న కర్నూలు పట్టణంలో ‘లక్ష గొంతుల పొలికేక’ పేరిట విద్యార్ధులు, మహిళలు, ఉద్యోగులతో కూడిన భారీ ర్యాలీ ఒకటి నిర్వహించబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే దానితో సరిపెట్టకుండా వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు రాజధానిని కర్నూలులోనే నిర్మించాలని ర్యాలీలో పాల్గొన్న ప్రజలు గట్టిగా తమ డిమాండ్ వినిపించారు. ఒకవేళ కర్నూలులో కాక వేరేక్కదయినా రాజధానిని నిర్మించే ప్రయత్నం చేసినట్లయితే, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలవుతాయని కర్నూల్ మాజీ మేయర్ యస్. రఘురామి రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా యం.యల్యే. యస్వీ.మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “వేలాది మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమం రాయలసీమ వాసుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. దానిని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయడం వలన అక్కడ సారవంతమయిన వేలాది ఎకరాల వ్యవసాయ భూమి పోతుంది. దానివలన ఏడాదికి 60లక్షల క్వింటాళ్ళ ఆహార దాన్యాల ఉత్పత్తి కోల్పోవలసి వస్తుంది. పైగా ఆ ప్రాంతంలో రాష్ట్రంల్ మిగిలిన అన్ని ప్రాంతాలకంటే ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరికలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది,” అని అన్నారు. కర్నూల్ రాజధాని సాధన సమితి తన ఉద్యమం మరింత తీవ్రతరం చేసేందుకు ఆగస్ట్ 13ణ కర్నూల్ జిల్లా బందుకు సిద్దమవుతోంది. ఒకవేళ పోలీసు అధికారులు తమ బంద్ కు అనుమతి ఈయనట్లయితే ఆగస్ట్ 15 వేడుకల తరువాత తప్పకుండా బంద్ నిర్వహించి తీరుతామని ఆ సమితి సభ్యుడు సోమశేఖర్ చెప్పారు.

సుప్రీంకోర్టు కోలీజియం వ్యవస్థలో మార్పులకు మోడీ ప్రభుత్వం శ్రీకారం

  భారత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకాలను చేపట్టే ‘సుప్రీంకోర్టు కోలీజియం’ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అవినీతిపరులయిన న్యాయమూర్తులను పదవులలో నియమిస్తూ, కొనసాగిస్తున్నారని మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలతో న్యాయ, రాజకీయ వ్యవస్థలలో పెద్ద దుమారమే రేగింది. అయితే న్యాయవ్యవస్థపై పడిన ఈ మచ్చను తొలగించుకొనేందుకు సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు చెప్పట్టకుండా, ఆరోపణలను ఖండించడంతో సరిపెట్టుకొంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా భావించి, కోలీజియం వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేసేందుకు లోక్ సభలో నిన్న రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి కోలీజియం వ్యవస్థలో మార్పుల కోసం (జ్యూడిషియల్ నియామకాల కమీషన్ బిల్లు-2014) ఉద్దేశించింది కాగా రెండవది న్యాయమూర్తుల నియామకంలో కోలీజియం అనుసరించాల్సిన విధి విధానాలను (రాజ్యాంగ సవరణ బిల్లు-2014) రూపొందించే బిల్లు. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.

కార్గిల్, లెహ్ పర్యటించనున్న ప్రధాని మోడీ

  కార్గిల్, లెహ్ పర్యటించనున్న ప్రధాని మోడీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్గిల్ మరియు లెహ్ ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఆయన అధికారం చేప్పట్టిన తరువాత జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించడం అప్పుడే ఇది రెండవసారి. దానిని బట్టి ఆయన ఆ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అర్ధమవుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన యుద్దభూమిగా పేరుగాంచిన సియాచిన్-గ్లేసియర్ లను ఆయన ఈరోజు పర్యటించి అక్కడ మైనస్ 30-40 డిగ్రీల వాతావరణంలో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న భారత సైనికులను కలిసి వారితో మాట్లాడుతారు. భారత వైమానిక, మిలటరీ ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమవుతారు.   ఆ తరువాత లెహ్ పట్టణంలో పోలో మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. లెహ్ లో నిర్మించిన నిమూ బజ్గో (45 మెగావాట్స్ సామర్ధ్యం) హైడ్రో విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. ఆ తరువాత లెహ్-శ్రీనగర్ ల మధ్య 349కి.మీ.ల పొడవైన విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేస్తారు. ఆ తరువాత కార్గిల్ ల్లో నిర్మించిన చౌతక్ విద్యుత్ ప్లాంటు (44 మెగావాట్స్ సామర్ధ్యం) లను ప్రారంభిస్తారు. అనంతరం కార్గిల్ పట్టణంలో ఒక బహిరంగ సభలో పాల్గొంటారు.   ఈ పర్యటనలో ఆయనతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన దల్బీర్ సింగ్ సుహాగ్, బీజేపీ నేతలు ముక్తార్ అబ్బాస్ నక్వీ, అవినాష్ రాయ్ ఖన్నా తదితరులు ప్రధాని మోడీ పర్యటనకు అవసరమయిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

గిరిజనుల పునరావాసానికి ఐఏఎస్ అధికారి నియామకం

  ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్, తెలంగాణా ప్రభుత్వంతో తలెత్తుతున్న సమస్యల గురించి లోతుగా చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 18 నుండి ఆరంభించాలని, 20 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణా ప్రభుత్వంతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం సహకరించక పోయినట్లయితే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తున్నసమస్యల పరిష్కారానికి న్యాయపోరాటం అనివార్యమవుతుందని మంత్రివర్గం భావించింది. ఇక పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రాలో కలిసినందున, స్థానిక గిరిజనుల పునరావాస చర్యలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని మంత్రివర్గ నిర్ణయించింది.

ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు!!

  తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయకుమార్ రద్దు చేశారు. టీడీపీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్‌గా ఈదర హరిబాబు గెలిచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు అయింది.

సచిన్‌కి సెలవిచ్చారు...

  క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్‌కు లీవ్ ఇచ్చారు. ఈ సెషన్ రాజ్యసభ సమావేశాలకు హాజరు కాకపోయినా పర్లేదంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సచిన్ టెండూల్కర్‌కి సెలవు ఇచ్చారు. మొన్నామధ్య కొంతమంది ఎంపీలు సచిన్ ఎంపీగా ఎన్నికయినప్పటికీ సమావేశాలకు ఎక్కువగా డుమ్మాలు కొడుతున్నారని విమర్శించారు. దానికి సచిన్ స్పందించి, తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందుకే తాను సమావేశాలకు రావడం లేదని వివరణ ఇచ్చారు. అలాగే ఎందుకొచ్చిన గొడవ అని ఈసారి సమావేశాలకు హాజరు కాకుండా వుండటానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ని లీవ్ అడిగారు. సచిన్ సమస్యని అర్థం చేసుకున్న కురియన్ లీవు ఇచ్చారు.

కవిత మీద కేసు నమోదు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవితపై మాదన్నపేట పోలీసులు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా భారత్లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా వున్నాయంటూ బీజేపీ లీగల్‌ సెల్ కన్వీనర్ కరుణాసాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఐపీసీ 124 (ఏ), 153 (ఏ), 505, సీఆర్‌పీసీ156 (3) సెక్షన్ల కింద కవితపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కల్లు దుకాణాలతో హైదరాబాద్ కళకళలాడాలి!!

  హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం ముమ్మరంగా చేస్తోంది. ప్రజలకు అన్నీ అందుబాటులో వుండేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే దసరా నుంచి హైదరాబాద్‌లో భారీగా కల్లు దుకాణాలను తెరవడానికి సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు చిక్కని కల్లు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం కల్లు ప్రియులలో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం తమవిషయంలో చూపిస్తున్న శ్రద్ధని వారు ఎంతో ఆసక్తిగా గమనిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం కల్లు దుకాణాలతో కళకళలాడేట్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి అధ్యక్షుడు గౌడ కులస్తులకు పిలుపు ఇచ్చారు. ఈ ప్రకటన కల్లు ప్రియుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వాత్సల్యం, కల్లు గీత కార్మికుల మీద వున్న అభిమానానికి దర్పణం పట్టేలా వుందన్న వ్యాఖ్యలు వినిపిస్తు్న్నాయి. పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులైపోయి బాటిళ్ళకు బాటిళ్లు బీర్లు తాగుతున్న యువతరం త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే కల్లు దుకాణాల్లో ముంతలు చేతపడితే అది మన సంస్కృతి పరంగా మంచి మార్పు అయ్యే అవకాశం వుందన్న అభిప్రాయాలు కల్లు ప్రియుల్లో వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో విరివిగా కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరికీ మంచి నాణ్యమైన కల్లు అందుబాటులో వుంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

స్మృతి ఇరానీకి యేల్ యూనివర్సిటీ డిగ్రీ...

  కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల గురించి కాంగ్రెస్ పార్టీ నానా గందరగోళం చేసి ఆ తర్వాత సౌండ్ చేయకుండా వున్న విషయం తెలిసిందే. పెద్దగా విద్యార్హతలు లేని స్మృతి ఇరానీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేశారని కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంది. అయితే స్మృతీ ఇరాని సమర్థత చూసి ఆ తర్వాత చప్పుడు చేయకుండా వుంది. అయితే తాజాగా స్మృతీ ఇరానీ తాను అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందానని చెప్పడంతో ఈ అంశాన్ని మళ్ళీ ఎలా రాజకీయం చేయాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇదిలా వుంటే, యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీపై మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. భారతదేశానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులతో పాటు ఓ ఎంపీగా స్మృతి ఇరానీ యేల్ విశ్వవిద్యాలయంలో జరిగే నాయకత్వ సదస్సుకు వెళ్తున్నట్లు తెలిపింది. ఆమె ఆ సదస్సులో పాల్గొనడానికి ఆమె డిగ్రీ సర్టిఫికెట్ పొందే విషయానికి సంబంధం లేదని కూడా చెప్పింది.

పోలవరంపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ

  పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ, ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌కి సుప్రీం కోర్టు నో చెప్పింది. తెలంగాణకు చెందిన ఒక న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్‌కు పోలవరం పిటిషన్‌ను జత చేసింది. ఈ కేసులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నోటీసులపై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఆ తర్వాత ప్రధాన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు పోలవరం పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

పార్లమెంటులోనూ ఎదురు దెబ్బే

  ఎంసెట్‌ అడ్మిషన్లపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిన్న తెలంగాణా ప్రభుత్వానికి లోక్ సభలోనూ అదే పరిస్థితి ఎదురయింది. గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ తెరాస యంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తూ లోక్ సభను స్తంభింపజేసే ప్రయత్నం చేసారు. వారికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బదులిస్తూ తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే నడుచుకొంటోoదని, ఆ చట్టప్రకారమే హైదరాబాదులో ప్రజలకు రక్షణ కల్పించేందుకు గవర్నరుకు భాద్యతలు, అధికారాలు కల్పించిందని తెరాస సభ్యుల నిరసనల మధ్య సమాధానం తెలిపారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అన్యాయం చేయాలని భావించట్లేదని, తెలంగాణకు కూడా అన్ని విధాల న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హోంమంత్రి సమాధానంతో గవర్నరుకు అధికారాలు కట్టబెట్టాలనే కేంద్ర వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టమయింది. ఊహించినట్లే తెరాస యంపీల ఆందోళన కేవలం కంటశోషగా మిగిలిపోయింది.   ఇక సుప్రీం కోర్టు తలుపు తట్టడమే మిగిలింది. అయితే ఈరోజు ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో అంతా విభజన చట్ట ప్రకారమే ఖచ్చితంగా జరగాలని స్పష్టంగా చెప్పిన సుప్రీంకోర్టు బహుశః ఈ విషయంలో కూడా అదేవిధంగా చెప్పవచ్చును. గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడమేనని తెలంగాణా ప్రభుత్వం వాదన సాధారణ పరిస్థితుల్లో మాత్రమే అన్వయించుకోవలసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన తరువాత మరే ఇతర రాష్ట్రాలకు లేని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గత ప్రభుత్వం భావించినందునే కొన్ని ప్రత్యేక నిబంధనలు విభజన చట్టంలో చేర్చవలసి వచ్చింది. కనుకనే గవర్నరుకు అధికారాలు కట్టబెట్టవలసి వచ్చింది. ఆ చట్టాన్ని తెరాస యంపీల సమక్షంలో పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్రపతి దానిపై ఆమోదముద్ర వేసారు. ఈ సంగతి తెలంగాణా ప్రభుత్వానికి కూడా తెలిసి ఉన్నప్పటికీ పంతానికి పోయి భంగపడుతోంది. ఒకవేళ ఇంకా పంతానికి పోయి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినట్లయితే బహుశః మరోమారు భంగపాటు తప్పకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర, తెలంగాణా అనే తన ప్రాంతీయభావాలను అధిగమించి తెలంగాణాలో స్థిరపడిన ప్రజలందరినీ సమానంగా చూస్తూ, వారిలో అభద్రతాభావం తొలగించేందుకు గట్టిగా కృషి చేసినట్లయితే ఇటువంటి సమస్యలన్నీ వాటంతటవే సర్దుకునే అవకాశం ఉందనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

బ్యాంకు దోపిడీ... 4 కోట్లు....

  తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. దోపిడీ దొంగలు నాలుగు కోట్ల విలువైన నగలు, నగదు దోచుకుని వెళ్ళారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్‌ గ్రామంలో వున్న గ్రామీణ వికాస్ బ్యాంకులో ఈ భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి దొంగలు దోపిడీ చేశారు. ఈ దోపిడీలో నాలుగు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలతో పాటు 16-18 లక్షల రూపాయల నగదు కూడా దొంగలపాలైంది. ప్రతిరోజూ ఏ సమయంలో అయినా రద్దీగా వుండే జాతీయ రహదారి పక్కనే, పోలీస్ స్టేషన్, జనావాలసాల దగ్గర్లోనే ఉన్న ఈ బ్యాంకు లోపలకి వెనుక భాగం నుంచి ప్రవేశించారు. బ్యాంకులో రైతులు తాకట్టు పెట్టిన బంగారం భారీ స్థాయిలో పోయినట్టు సమాచారం. బ్యాంకు సిబ్బంది ప్రమేయం, సెక్యూరిటీ గార్డు ప్రమేయం ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆగస్టు 31 లోగా కౌన్సిలింగ్...

  ఎంసెట్‌ అడ్మిషన్లపై తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది ఈరోజు. అక్టోబరు నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా వేసేందుకు తెలంగాణా ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిర్ద్వందంగా త్రోసిపుచ్చింది. ఈ నెలాఖరులోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి వచ్చేనెల మొదటి వారం నుండి విద్యార్ధులకు క్లాసులు మొదలుపెట్టాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే స్థానికత, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ అంశాలలో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. అడ్మిషన్లు మాత్రం విభజన చట్టంలో నిర్దేశించిన విధంగా ఖచ్చితంగా జరగాలని స్పష్టం చేసింది.

బాలయ్యా.. కోలుకోవయ్యా...

  సినిమా షూటింగ్ సందర్భంగా బైక్ మీద నుంచి కింద పడటంతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వల్పంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బైక్ రేసింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తూ వుండగా కిందపడి ఆయన కాలికి గాయం అయింది. ఒక వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం బాలకృష్ణ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావగారు అండ్ వియ్యంకుడూ అయిన నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఇరాన్ విమానం కూలి 39 మంది మృతి

  విమానాలు కూలిపోయే సీజన్ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు మరో విమాన దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి తబస్ నగరానికి వెళ్తోన్న ఓ విమానం రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర శివార్లలో వందలాది మిలటరీ కుటుంబాలు ఉంటున్న ప్రదేశానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయింది. ఈ విమానం అందరూ చూస్తుండగానే రోడ్డుపక్కన ఓ గోడను, చెట్లను ఢీకొట్టి విమానం పేలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రద్దీగా ఉండే ఓ మార్కెట్‌కు 500 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది. ఒకవేళ ఆ మార్కె్ట్ మీద విమానం కూలినట్టయితే జననష్టం భారీగా వుండేదని అధికారులు చెబుతున్నారు.

వైభవంగా... భక్తి శ్రద్ధలతో మనగుడి...

  జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు, హిందూ మత ప్రచారానికి టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని అద్దంకి సమీపంలోని శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. టిటిడి వారు పంపించిన శ్రీవేంకటేశ్వరస్వామి నామంతో పూజా ద్రవ్యాలతో దేవాలయంలో పూజలు నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర స్వామి పూజ ఆసాంతం గోవిందనామ స్మరణతో నిర్వహించారు. టిటిడి వారు భక్తులకోసం పంపించిన ప్రసాదం, కుంకుమ తదితర వస్తువులను భక్తులకు పంచిపెట్టారు. గత మూడు రోజులుగా జరుగుతున్న మనగుడి కార్యక్రమాన్ని చివరిరోజు వీక్షించేదుకు, పూజలో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.