నేపాల్ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి: మోడీ

  నేపాల్ త్వరగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని నేపాల్ అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తదితరులకు భారత ప్రధాని మోడీ సూచించారు. ‘నేపాల్‌కు వీలయినంత త్వరగా రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంది’ అని మోడీ వారికి చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోబోదని మోడీ తన పర్యటనలో నేపాల్‌కు హామీ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి మోడీ తన నేపాల్ పర్యటనను సోమవారం ముగించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే కృషిలో భాగంగా నేపాల్‌కు వివిధ రకాల సహాయాన్ని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 17 ఏళ్లలో నేపాల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే కావడం విశేషం.

ఏపీ నంబర్ ప్లేట్లతో ప్రాబ్లమేంటి? హైకోర్టు ప్రశ్న...

  హైకోర్టు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రశ్న ఎదురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పేరిట జారీ చేసిన నంబర్ ప్లేట్లను టీఎస్ పేరిట మార్చుకోవాలంటూ జూన్ నెలలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ మూడు మీద హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ జీవోను ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యానికి స్పందిస్తూ కోర్టు పై విధంగా ప్రశ్నించింది. తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఉత్తారాది రాష్ట్రాల వాహనాలు నంబర్ ప్లేట్ల పై ఎటువంటి మార్పు లేకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నాయని 60 ఏళ్లు ఉమ్మడిగా ఉండి కూడా ఏపీ నంబర్ ప్లేట్లతో హైదరాబాద్‌లో వాహనాలు తిరగడానికి అభ్యంతరం చెప్పడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనకు మీ వివరణ ఏంటని హైకోర్టు రవాణా శాఖ న్యాయవాదిని ప్రశ్నించింది. అసలు ఇటువంటి జీవో జారీకి ఏ చట్టం అనుమతిస్తున్నదో తెలపాలని నిలదీసింది. ఈ విషయంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రవాణా శాఖ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది.

స్కూలు బస్సు బోల్తా... 10 మంది విద్యార్థులకు గాయాలు...

  అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ స్కూలు బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. అధికారులు స్కూలు బస్సుల ఫిట్‌నెస్ గురించే ఆలోచిస్తున్నారు. ఆ బస్సులను నడుపుతున్న డ్రైవర్ల అర్హతలు, వారు డ్రైవింగ్ చేసే విధానాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే తరచుగా స్కూలు బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం నాడు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపాలెం దగ్గర ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

రిషీకేశ్ టీటీడీ ఆలయంలో దోపిడీ దొంగలు.. గార్డు హత్య...

  ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేంకటేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయంలో దోపిడీకి ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ విధుల్లో వున్న గార్డు వారిని ప్రతిఘటించాడు. దాంతో ఆ దోపిడీ దొంగలు సెక్యూరిటీ గార్డును హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆలయంలో ఎలాంటి దోపిడీ జరగనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిషీకేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషీకేశ్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దొంగలు వేంకటేశ్వర ఆలయంలో చోరీకి ప్రయత్నించారు. రిషీకేశ్ ఆలయంలో దోపిడి దొంగల బీభత్సం గురించి తెలుసుకున్న టీటీడీ అధికారులు రిషీకేశ్‌కి బయల్దేరారు.

నిజాం సుగర్స్ జీఎం ఆత్మహత్య

  నిజాం సుగర్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ శర్మ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో వున్న నిజాం సుగర్స్ కార్యాలయంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. జీఎం శర్మ ఆత్మహత్య చేసుకుని వుండటాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. శర్మ మృతికి కారణాలు వ్యక్తిగతమా, ఫ్యాక్టరీకి సంబంధించిన వివాదాలు కారణామా అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు శర్మ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శర్మ మృతి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం వుందని నిజాం సుగర్స్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్‌లో అంతర్మథనం... ప్రియాంకకి స్వాగతం...

  గత ఎన్నికలలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పొందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులలో అంతర్మథనం ప్రారంభమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయతక్వం నుంచి రాహుల్ గాంధీని దూరంగా పెట్టి ప్రియాంకని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ పెద్దలు ప్రియాంకకి పార్టీ పగ్గాలు అందిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని సోనియాగాంధీ దగ్గరే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సోనియా ఆమోదం తెలపడంతో త్వరలో ప్రియాంక పూర్తి స్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం వుందని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీని పూర్తిగా పక్కన పెట్టడం కాకుండా రాహుల్ నాయకత్వంలోనే ప్రియాంక పనిచేస్తుందని కొందరు కాంగ్రెస్ పార్టీయులు అంటున్నారు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీకి పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

గోల్కొండ కోట మీద పంద్రాగస్టు.. కేసీఆర్ పరిశీలన...

  ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటపై జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, ప్రభుత్వ సలహాదారు పాపారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.కె.మీనా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గోల్కొండ పరిసరాలను రెండు గంటల పాటు పరిశీలించారు. కోటలోని తారామతి మజీద్‌ పైభాగంలో ఉన్న బాలా-ఈ-హిస్సార్‌ కింది భాగంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని సర్కారు ఈ సందర్భంగా నిర్ణయించింది. తారామతి మజీద్‌ ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో ఆహ్వానితులు ఆసీనులవుతారు. ఈ ప్రాంతం 10 నుండి 12 వేల మంది కూర్చోడానికి అనువుగా ఉంటుందని అధికారులు తేల్చారు.

మందుకొట్టి కారు నడిపిన యువతి... ముగ్గురి మృతి

  నెల్లూరు జిల్లాలోని హరినాథపురం సమీపంలోని ముత్తుకూరు రోడ్డు దగ్గర ఓ యువతి మద్యం సేవించి కారు నడిపి బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతున్న యువతి మొదట రోడ్డు డివైడర్ని ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు కార్లు, నాలుగు బైక్‌లని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన వున్న విద్యార్థుల మీదకి కారు దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మరణించారు. తప్పతాగి కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన సదరు యువతి గతంలో కూడా పల్సర్ బైక్ నడిపి అనేక ప్రమాదాలు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ యువతిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం అనుమానాస్పదంగా వుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు అందాకే స్పందిస్తాం...

  ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు అధికారికంగా అందిన తర్వాత పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యుడు వినోద్ చెప్పారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన నెగ్గిందని అనుకోవడం లేదన్నారు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అన్యాయం చేయదని, దీనినే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నోసార్లు చెప్పారన్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై తెలంగాణ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు రావడం సహజమని వినోద్ అన్నారు. సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు మాత్రమే ఇచ్చిందని, కోర్టు నుంచి నుంచి లిఖితపూర్వకమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే స్పందిస్తామని, న్యాయమూర్తుల అభిప్రాయాలపై స్పందించలేమని ఆయన చెప్పారు.

తప్పు చేసినట్టు రుజువైతే మరణశిక్షకి రెడీ...

  గ్వాలియర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ తనను హైకోర్టులోని ఓ జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మహిళా జడ్జిని తాను లైంగికంగా వేధించినట్టు రుజువైతే మరణశిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి అన్నారు. ఈ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్కు డాన్సు చేయమన్నారని కూడా మహిళా జడ్జి ఆరోపించారు. ఈ విషయాలు చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అనుమతి ఇవ్వలేదంటూ జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేశారు.

బాలికని చంపిన రాకాసి కోడిపుంజు...

ఎనిమిది నెలల చిన్నారి జాహ్నవిపై కోడిపుంజు దాడిచేసి పొడవడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. నల్గొండ జిల్లా మునుగోడు లక్ష్మీదేవి గూడానికి చెందిన కొంపల్లి సైదులు గీతల కుమార్తె అయిన జాహ్నవికి జ్వరం రావడంతో తల్లి గీత మందు పట్టించి మూతను శుభ్రం చేయడానికి బయటకు వెళ్లింది. ఇంతలో అక్కడున్న కోడిపుంజు ఆడుకుంటున్న జాహ్నవిపై దాడి చేసి తలపై పొడిచింది. దీంతో జాహ్నవి తలపై నుంచి రక్తం కారడంతో చిన్నారిని స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు జాహ్నవి తల్లిదండ్రులు. అయితే పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని హైదరాబాద్ తీసుకెళ్లాలని స్థానికి వైద్యులు సూచించగా జాహ్నవిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి చనిపోయింది.

నేపాల్ పర్యటన పూర్తి.. స్వదేశానికి తిరిగొచ్చిన మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. సోమవారం సాయంత్రం మోడీ బృందం భారత రాజధాని ఢిల్లీకి చేరుకుంది. రెండు రోజుల నేపాల్ పర్యటనకు వెళ్లిన మోడీ కీలక ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. మోడీ నేపాల్ పర్యటన విజయవంతంగా ముగిసిందని ఇరు దేశాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మోడీ తన పర్యటనలో నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని, మావోయిస్టు నేతలతో చర్చలు కీలకమైన జరిపారు. నేపాల్ అసెంబ్లీలో ప్రసంగించిన భారత ప్రధాని అక్కడి ప్రఖ్యాత పశుపతి ఆలయాన్ని దర్శించుకున్నారు. నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన ఏకైన భారత ప్రధానిగా మోడీ నిలిచారు.

ఫాస్ట్ పథకం కేసు.. పితానికి కోర్టు ప్రశ్నలు

  తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (సాఫ్ట్) పథకానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పితానిని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఫాస్ట్ పథకం వల్ల మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీరు స్థానిక ఎమ్మెల్యేనా? అని ప్రశ్నించింది. కేసును హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ అంశం మీద హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయిబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేస్తూ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించింది. స్థానికత సమస్య తీసుకువచ్చి ఒక్క తెలంగాణ విద్యార్థులకే ఫీ రియింబర్స్‌మెంట్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని సవాల్ చేస్తూ పితాని సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాం దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశించింది.. కౌన్సెలింగ్ నిర్వహించండి: కిషన్‌రెడ్డి

  ఆగస్టు 31లోపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే తెలంగాణ విద్యార్థులకే నష్టమని ఆయన అన్నారు. విభజన బిల్లులో అంశాలపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. సమయం ఉంటుంది కాబట్టి వచ్చే ఏడాది ఎంసెట్‌లో మార్పులు, చేర్పులపై ఆలోచన చేయవచ్చునని కిషన్ రెడ్డి సూచించారు.

నట్వర్ సింగ్ ఆత్మకథకు సీక్వెల్

  కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ మార్కెట్లోకి విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సోనియాగాంధీ కుటుంబం గుట్టు రట్టు చేసింది. ఇప్పుడు నట్వర్ సింగ్ తన తన ఆత్మకథ పార్ట్ - ’ సిద్ధం చేస్తున్నారు. ఆ పుస్తకానికి ‘మై ఇర్రెగ్యులర్ డైరీ’ అని పేరు పెట్టారు. ఈ సీక్వెల్ పుస్తకాన్ని మార్చిలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. గాంధీ కుటుంబ వ్యవహారతీరును, కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకత్వంపై మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని సూచనప్రాయంగా నట్వర్ వెల్లడించారు. ఇదిలా వుండగా, నట్వర్ సింగ్ రచించిన 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే ఆత్మకథ మరో నాలుగు రోజుల్లో మార్కెట్‌లోకి రానుంది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కలిసిన నేపథ్యంలో ఏమైనా అంశాలను తొలగించారా అనే ప్రశ్నకు ఒక పదాన్ని కూడా తీయకుండా తన ఆత్మకథ మార్కెట్ లోకి రాబోతోందని నట్వర్ సింగ్ తెలిపారు.

తస్లిమా నస్రీన్‌కి ‘బిగ్‌బాస్’ ఆఫర్... నో చెప్పిన రచయిత్రి

  కలర్స్ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులను ఒక ఇంట్లో ఉంచి, సీసీ కెమెరాల ద్వారా వారి ప్రవర్తనను రికార్డు చేసి, ఎడిట్ చేసి టీవీలో ప్రసారం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పటికి ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు బిగ్ బాస్-8లో పాల్గొనడానికి కలర్స్ టీవీ ప్రముఖ బంగ్లాదేశ రచయిత్రి, ‘లజ్జ’ పుస్తకం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తస్లిమా నస్రీన్‌కి ఆఫర్ ఇచ్చింది. సాధారణంగా ఎవరైనా ప్రముఖులు బిగ్ బాస్ షోలో పాల్గొనే ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. అయితే తస్లిమా మాత్రం ఈ ఆఫర్ని తిరస్కరించారు. ఈ విషయాన్ని తస్లిమా ట్విట్టర్‌లో తెలియజేశారు. బిగ్ బాస్‌లో పాల్గొనడం ద్వారా ప్రపంచానికి తస్లీమా నస్రీన్ అంటే ఏమిటో మరోసారి తెలియజేయవచ్చని, దీంతో పాటు మంచి పారితోషికం కూడా ఇస్తామని బిగ్ బాస్ వర్గాలు తనను సంప్రదించాయని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. అయితే దీనిని తిరస్కరించినట్టు తెలిపారు. 1994లో బంగ్లాదేశ్ నుంచి స్వీయ బహిష్కరణ తర్వాత ఇండియన్ వీసా మీద 2004 నుంచి తస్లిమా ఇక్కడే ఉంటున్నారు. ఇటీవలే ఇండియా ఆమెకి రెసిడెన్షియల్ వీసా జారీ చేసింది.