రాజధాని కోసం కర్నూలువాసుల పోరాటం
posted on Aug 12, 2014 7:55AM
కర్నూలులోనే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని కోరుతూ నిన్న కర్నూలు పట్టణంలో ‘లక్ష గొంతుల పొలికేక’ పేరిట విద్యార్ధులు, మహిళలు, ఉద్యోగులతో కూడిన భారీ ర్యాలీ ఒకటి నిర్వహించబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే దానితో సరిపెట్టకుండా వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు రాజధానిని కర్నూలులోనే నిర్మించాలని ర్యాలీలో పాల్గొన్న ప్రజలు గట్టిగా తమ డిమాండ్ వినిపించారు. ఒకవేళ కర్నూలులో కాక వేరేక్కదయినా రాజధానిని నిర్మించే ప్రయత్నం చేసినట్లయితే, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలవుతాయని కర్నూల్ మాజీ మేయర్ యస్. రఘురామి రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా యం.యల్యే. యస్వీ.మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “వేలాది మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమం రాయలసీమ వాసుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. దానిని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయడం వలన అక్కడ సారవంతమయిన వేలాది ఎకరాల వ్యవసాయ భూమి పోతుంది. దానివలన ఏడాదికి 60లక్షల క్వింటాళ్ళ ఆహార దాన్యాల ఉత్పత్తి కోల్పోవలసి వస్తుంది. పైగా ఆ ప్రాంతంలో రాష్ట్రంల్ మిగిలిన అన్ని ప్రాంతాలకంటే ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరికలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది,” అని అన్నారు. కర్నూల్ రాజధాని సాధన సమితి తన ఉద్యమం మరింత తీవ్రతరం చేసేందుకు ఆగస్ట్ 13ణ కర్నూల్ జిల్లా బందుకు సిద్దమవుతోంది. ఒకవేళ పోలీసు అధికారులు తమ బంద్ కు అనుమతి ఈయనట్లయితే ఆగస్ట్ 15 వేడుకల తరువాత తప్పకుండా బంద్ నిర్వహించి తీరుతామని ఆ సమితి సభ్యుడు సోమశేఖర్ చెప్పారు.