ఉరిశిక్ష రద్దు చేసే ఆలోచనే లేదు...

  దేశంలో ఉరిశిక్షను రద్దుచేసే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టం ద్వారా కోర్టులు నేరస్థులకు ఉరిశిక్ష విధించే హక్కును కలిగి ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టాన్ని సవరించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే లా కమిషన్ ఇటీవల తన వెబ్‌సైట్‌లో ఉరిశిక్షకు సంబంధించి సూచనలు, సలహాలను, అభిప్రాయాలను అందించవలసిందిగా దేశపౌరులను కోరింది. ఈ నేపథ్యంలో, కేంద్రప్రభుత్వానికి ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన ఉందా అని పార్లమెంట్‌లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 309 ను రద్దు చేసి... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది.

జడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికల హడావిడి....

  జిల్లాలోని 39 ఎంపీపీ స్థానాలకు ఒక జడ్పీ చైర్ పర్సన్ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతో జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి. 6వ తేదీన ఎంపీపీ, ఏడో తేదీన జడ్పీ ఎన్నిక జరుగుతుంది. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. అలాగే ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలువురు నాయకులు శిబిరాలకు తెర తీశారు. ఎంపీపీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా నుండి హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులను మంగళవారం సాయంత్రమే ఆయా మండలాల్లోని రహస్య శిబిరాలకు తరలించినట్టు సమాచారం అందుతోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి.

నిజాం సుగర్స్ ఫైనాన్స్ జీఎం... పుట్టినరోజు నాడే...

  నిజాం షుగర్స్ లిమిటెడ్ కంపెనీ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ముప్పల జానకిరాం శర్మ (59) సోమవారం తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుట్టినరోజు నాడే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈమధ్యే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ పదవిలో కొనసాగుతున్నారు. సోమవారం ఆఫీసుకు వచ్చిన ఆయన అటెండర్‌కి డబ్బు ఇచ్చి ఒక తాడు తెప్పించుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శర్మ సిబ్బందిని ఇంటికి పంపేశారు. తండ్రి రాక కోసం, ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని రాత్రి 11 గంటల వరకు ఎదురుచూసిన కొడుకు శ్రీనివాస్ తండ్రికి ఫోన్ చేయగా అది కలవలేదు. దాంతో శ్రీనివాస్ కార్యాలయానికి వెళ్లగా శర్మ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా వున్నందువల్ల ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

‘కోటీశ్వరుడు’ హాట్ సీట్‌లో చిరంజీవి

  నాగార్జున యాంకరింగ్ చేస్తూ వుండగా మా టీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ సీజన్‌లో చివరి ఎపిసోడ్ ఈ గురువారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హాట్ సీట్లో కూర్చుని నాగార్జున అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిరంజీవికి మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ స్వాగతం పలికారు. బిగ్ సినర్జీ సంస్థ ఇప్పటి వరకు ఈ షో 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు చెబుతున్నాయి.

మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చట్టంలో ఎక్కడుంది?

  ఒకసారి రిజిస్టర్‌ చేయించుకున్న వాహనాలను తిరిగి రిజిస్టర్‌ చేసుకోవాలని చట్టంలో ఎక్కడ ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నిలిపివేతకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. నెంబర్‌ ప్లేట్ల మార్పు చట్టంలో ఎక్కడ ఉందని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న స్పెషల్‌ జీపీ బి. మహేందర్‌రెడ్డి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 65, 212(1) ప్రకారం వాహనాల నెంబరు ప్లేట్ల మార్పు చేసుకోవాలని ప్రభుత్వం జీవో నంబర్ 3 జారీ చేసిందని, అయితే ఆ జీవోను ఇంత వరకు అమలు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయడానికి కోర్టు ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చింది.

‘గీతాంజలి’ దర్శకుడు సేఫ్!!

  అంజలి హీరోయిన్‌గా నటించిన ‘గీతాంజలి’ సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా డైరెక్టర్‌ రాజ్‌ కిరణ్‌ ఛాతీనొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ మెహిదీపట్నంలోని జయభూషన్‌ ఆస్పత్రిలో ఉదయం చేర్చారు. కిరణ్‌కు ఛాతినొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, ఇప్పుడు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని నిర్మాత కోన వెంకట్ తెలిపారు. గీతాంజలి సినిమా విడుదల సన్నాహాలు చేస్తూ రాజ్ కిరణ్ ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం అర్థరాత్రి 1 గంట వరకు ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తన ఇంటికి వెళ్లారని, మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గుండెపోటు అనుకుని హుటాహుటిన మెహిదీపట్నంలోని జయభూషన్‌ ఆస్పత్రిలో చేర్చారు.

ఉన్నత విద్యామండలి ఛైర్మన్.. పాపిరెడ్డి....

  తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నియమితులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేసిన తమ్మల పాపిరెడ్డి ప్రొఫెసర్‌గా ఎదిగి వివిధ పదవులు నిర్వర్తించి ఈ ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ప్రొఫెసర్‌గా ఉంటూనే 2009 సంవత్సరం నుంచి జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోశించారు. ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవనూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పాపిరెడ్డి చదువు నిమిత్తం హన్మకొండకు వచ్చి స్థిపరడ్డారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన పాపిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కవిత మీద కేసు పెట్టండి... నాంపల్లి కోర్టు...

  జమ్ము - కాశ్మీర్, తెలంగాణ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. కవిత దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత విద్వేషపూరితంగా ఉన్నాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కరుణాసాగర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 124 ఏ, 153 బి, 505 సెక్షన్లకింద కేసు నమోదు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 11వ తేదీ లోపల దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

పశుపతినాథ్ ఆలయంలో మోడీ పూజలు

  భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్‌లోని సుప్రసిద్ధ పశుపతినాథ్‌ ఆలయంలో కాషాయ దుస్తులు ధరించి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం.. శ్రావణ అష్టమి కలిసి రావడంతో నేపాల్‌లో పవిత్రమైన రోజుగా భావిస్తారు. 108 మంది వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనకు స్వాగతం పలికారు. రుద్రాభిషేకం చేసిన అనంతరం మోడీ.. పంచామృత స్నానం సహా సుమారు 45 నిమిషాలు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మెడలో రుద్రాక్ష మాలలు ధరించి బయటికొచ్చారు. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రధాన పూజారి గణేశ్‌ భట్టా మోడీకి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి 2500 కేజీల గంధపు చెక్కలను విరాళంగా ఇచ్చారు.

విశాఖ పోర్టులో ఘోర ప్రమాదం.. జస్ట్ మిస్...

  విశాఖ పోర్టులో ఒక ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒక ప్రైవేట్ షిప్ విశాఖ పోర్టులో ప్రైవేటు పడవలు రాకూడని ప్రదేశానికి దూసుకుని వచ్చేసింది. ఆ ప్రదేశంలో వున్న భారీ గ్యాస్ నిల్వల బెర్త్‌ని ఢీకొనబోయి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఆ ప్రైవేట్ షిప్ గ్యాస్ నిల్వల బెర్త్‌ని ఢీకొని వుంటే ఘోర ప్రమాదం సంభవించి వుండేదని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదమే జరిగి వున్నట్టయితే మూడు నాలుగు నెలలపాటు పోర్టు కార్యకలాపాల మీద ఆ ప్రమాద ప్రభావం వుండేదని చెబుతున్నారు. సీవే షిప్పింగ్ సంస్థకి చెందిన ‘జలవాహిని’ అనే ఆ షిప్ కెప్టెన్‌ గత కొన్ని రోజులుగా తమ సంస్థ యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆ మానసిక ఒత్తిడిలో షిప్పును ఎలా పడితే అలా నడపడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేని ప్రదేశంలోకి వేగంగా వస్తున్న షిప్పును చూసి సెక్యూరిటీ సిబ్బంది హెచ్చరికలు చేసినా షిప్ కెప్టెన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ చివరి నిమిషంలో షిప్‌ను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ షిప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ కేంద్ర మంత్రి వారసులకు చెందినదిగా తెలుస్తోంది.

బియాస్ తరహా దుర్ఘటన: రెండు కుటుంబాలు...

  హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద నీటి ప్రవాహం పెరగడం వల్ల హైదరాబాద్‌కి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన దుర్ఘటనను మరవకముందే సరిగ్గా అలాంటి దుర్ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని హన్‌మాన్‌తల్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన 12 మంది బాగ్దారి జలపాతానికి వెళ్లారు. కొండల మధ్య చిన్న నదీపాయను దాటి పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు. సరిగ్గా వాళ్లు తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పెరిగిపోయిన వరద ఆ రెండు కుటుంబాలను కబళించేసింది. వరద ఉద్ధృతిలో మొదట ఓ యువకుడు పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారంతా కొట్టుకుపోయారు. ఒక యువతి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. సహాయ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టాయి. ఈ గాలింపులో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతోంది.

2009లో గెలవటమే మన్మోహన్‌కి ఆశ్చర్యం...

  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచిందనే వార్త విని మా నాన్న, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశ్చర్య పోయారని ఆయన కుమార్తె దమన్ సింగ్ పేర్కొన్నారు. ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్’ పేరుతో ఆమె ఓ పుస్తకం రాశారు. ఇందులో ఆమె కొన్ని సంచలనాత్మక కామెంట్స్ చేశారు. దమన్ సింగ్ తన తండ్రిని పూర్తిగా సమర్థించారు. తన తండ్రి రాజకీయాలకు సరిపోరని తాను భావించడం లేదన్నారు. దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే తన తండ్రి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని దమన్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆమె తన తండ్రికి మద్దతుగా వాదన వినిపించారు. రాజకీయాలకు తన తండ్రి సరిపోరని తాననుకోవడం లేదన్నారు. అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు నాన్నను పిలిచి రాత్రికి రాత్రే ఆర్థికమంత్రిగా చేశారని, అప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తన తండ్రి మన్మోహన్‌కు నెల గడువు మాత్రమే ఉందన్నారు. పీవీయే లేకుంటే 1991 బడ్జెట్ సమయంలో మన్మోహన్ ఏమి చేయలేకపోయేవారని, మన్మోహన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారని దమన్ సింగ్ చెప్పారు.

కరెంటు అడిగితేనే లాఠీలతో కొడతారా? ఇదెక్కడి న్యాయం...

  తెలంగాణ రైతులు కరెంటు కావాలని అడిగినందుకే అన్యాయంగా వాళ్ళని లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదిస్తారా అని సీపీఐ నాయకుడు నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని, సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మతోన్మాదులకు భయపడుతున్నట్లు తెలుస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు.

మా మొహాలకి అంత సీను లేదా? గుత్తా జ్వాల ఆవేదన...

  భారత క్రీడారంగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుల విషయంలో వివక్ష చూపిస్తున్నారని బ్మాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్స్ ఆడే క్రీడాకారిణులకు ఉన్నంత గుర్తింపు డబుల్స్ ఆదే క్రీడాకారిణులకు లేదని ఆమె నిష్ఠూరంగా అన్నారు. మొన్నీమధ్య ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో గుత్తా జ్వాల, అశ్వని పొన్నప్ప జోడీ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. సింగిల్స్ ఆడే వారికి ఆర్థికంగా, అన్ని రకాలుగా గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తున్నాయని, అదే డబుల్స్ ఆడేవారి విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఆమె అన్నారు. తగినంత ఆర్థిక సాయంగానీ, గుర్తింపుగానీ లభించని కారణంగా యువతరం డబుల్స్ విభాగంలో ఆడేందుకు వెనుకంజ వేస్తున్నదని గుత్తా జ్వాల అభిప్రాయపడింది. తమకు గుర్తింపు మినహా దేశ ప్రజల నుంచి మరేమీ అవసరం లేదని చెప్పింది. సింగిల్స్ ఆడేవారికి, డబుల్స్ ఆడేవారికి ఆర్థిక ప్రయోజనాల విషయంలో వున్న తేడాని జ్వాల ఈ సందర్భంగా లెక్కలతో సహా వివరించింది.

టీ బీజేపీ అధ్యక్షుడిగా మళ్ళీ కిషన్ రెడ్డి

  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాష్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి స్పందిస్తూ, ‘‘హైదరాబాద్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేయించిన ఘనత రాష్ట్ర బీజేపీకే దక్కుతుంది. ప్రధాని నరేంద్రమోడీ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను’’ అన్నారు.

గోల్కొండలో కేసీఆర్... విలేఖరి సంచిలో కత్తి...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోటలో చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోల్కొండ ప్రాంతాన్ని సందర్శించడానికి కేసీఆర్ సోమవారం గోల్కొండకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఊహించని సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తు్న్న పోలీసులు గోల్కొండ ప్రాంతలో ఒక విలేఖరి సంచిని కూడా తనిఖీ చేశారు. ఈ సంచిలో ఒక కత్తి, బీరు బాటిల్ కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే సదరు విలేఖరిని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంచిలో కత్తి పెట్టుకుని తిరుగుతున్న సదరు విలేఖరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ గోల్కొండ టూరు చూతము రారండీ...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎప్పటిలా పెరేడ్ గ్రౌండ్స్‌లో కాకుండా గోల్కొండ కోటలో జరపాలని నిర్ణయించారు. గోల్కొండ కోట మీద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి గోల్కొండ సందర్శనకు వెళ్ళారు. జెండా ఆవిష్కరణ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గోల్కొండ టూర్ విశేషాలను ఒక్కసారి పరిశీలిద్దాం.   గోల్కొండ కోట పరిసరాలన్నీ ఏనాడో కబ్జాకు గురయ్యాయి. గోల్కొండ కోట చుట్టూ కొన్ని వేల ఇళ్ళు వుంటాయి. వాటిని తొలగించడం అనేది ఎవరూ కలలో కూడా చేయలేరు. అలాంటి ప్రాంతానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వచ్చి ఆగింది. ఇలా ముఖ్యమంత్రి కాన్వాయ్ గోల్కొండ కోట దగ్గరకి రావడం ఈమధ్యకాలంలో ఇదే ప్రథమం కావడంతో స్థానికులు ఏంటా అని వింతగా చూడ్డం మొదలుపెట్టారు. కొంతమంది జనం అయితే కేసీఆర్ కాన్వాయ్‌ చుట్టుముట్టారు. దాంతో సీఎం కేసీఆర్‌ గారికి కోపం వచ్చేసింది. ముఖ్యమంత్రి అయిన తాను వచ్చినప్పటికీ జనం అలా తమ కార్లచుట్టూ గుమిగూడటమేంటని ఆయన సెక్యూరిటీ అధికారులను గదిమారు. దాంతో సెక్యూరిటీ అధికారులు అక్కడ వున్న జనాన్ని పక్కకి నెట్టేశారు. జనంతోపాటు మీడియాని కూడా కేసీఆర్ సారు నుంచి దూరంగా పంపేశారు. జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అంతా క్లియర్ అయిన తర్వాతే కేసీఆర్ కారులోంచి కిందకి దిగారు.   ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి గోల్కొండ సందర్శనకి వచ్చినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ అసదుద్దీన్‌కి, స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు అధికారులకు సమాచారం ఇవ్వలేదని కౌసర్ మొహియుద్దీన్ అనే ఎమ్మెల్యే కేసీఆర్ వచ్చినప్పుడే ఆందోళనకి దిగాడు. గోల్కొండ గేటుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశాడు. దాంతో పోలీసు అధికారులు ఆయన్ని గడ్డం పట్టుకుని బతిమాలి ఆందోళన నుంచి విరమింపజేశారు. కేసీఆర్ గోల్కొండకి రావడమేంటోగానీ, ఎప్పుడూ గోల్కొండని చూడటానికి వచ్చే పర్యాటకులు చాలా ఇబ్బంది పడిపోయారు. ముఖ్యమంత్రి గోల్కొండను చూసే సమయంలో పర్యాటకులు ఎవరూ రాకూడదన్న ఉద్దేశంతో గోల్కొండ గేట్లు మూసేశారు. దాంతో వందలాదిమంది పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.

లిబియా నుంచి తిరిగొచ్చిన కేరళ నర్సులు...

  ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంగా 67 మంది కేరళ నర్సులు ఇటీవల కేరళలో ఇరుక్కుపోయారు. వారిని భారత ప్రభుత్వం క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చింది. ఆ నర్సులు మొదట ఇరాక్‌లోనే వుండి వైద్య సేవలు చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితి విషమించడంతో వారందరూ ఇండియాకి వచ్చేశారు. తాజాగా అలాంటి పరిస్థితే లిబియాలో వున్న కేరళ నర్సులు కూడా ఎదుర్కొన్నారు. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా 44 మంది కేరళ నర్సులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. వారు గత పది రోజులుగా అక్కడ బిక్కుబిక్కుమంటూ వున్నారు. భారత ప్రభుత్వం చేసిన కృషి కారణంగా వారికి అక్కడి నుంచి విముక్తి లభించింది. లిబియాలో చిక్కుకుపోయిన 44 మంది నర్సులు మంగళవారం నాడు క్షేమంగా ఇండియాకి చేరుకున్నారు.