తెలంగాణ సర్వే డౌటే?!
ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించాలని, ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సర్వే మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమను వేధించడానికే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి సర్వే చేపట్టిందని తెలంగాణలోని సీమాంధ్రులు విమర్శిస్తుంటే, ఈ సర్వే తమకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. మొత్తమ్మీద అటు తెలంగాణలోని సీమాంధ్రులకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ, ఈ సర్వే ఎంతమాత్రం ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది. అది కూడా ఒక్క రోజులోనే సర్వే చేస్తామని, ఆరోజు అందరూ తప్పకుండా ఇంట్లోనే వుండాలని అనడం, సర్వేలో వివరాలు ఇవ్వకపోతే లెక్కలో లేనట్లే అని బెదిరించడం కూడా పలు విమర్శలకు కారణమవుతున్నాయి. అయితే ప్రజల్లో వ్యతిరేకత వుందని తెలిసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేయాలన్న నిర్ణయంతోనే ముందుకు వెళ్తోంది.
ఈ నేపథ్యంలో 19న జరుప తలపెట్టిన తెలంగాణ సర్వే జరిగే అవకాశాలు లేనట్టేనన్న అభిప్రాయాలను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించడం వీలు కాదని వారు చెబుతున్నారు. చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ హక్కు లేదని అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహించి తీరాలని పట్టుదల మీద వుంటే, దానికోసం ముందుగా చట్టపరంగా ఎంతో కసరత్తు చేయాల్సి వుంటుందని, అవేవీ లేకుండా సర్వే నిర్వహించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ అంశం మీద అనేకమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి చట్టపరమైన స్పష్టత లేకుండా, హడావిడిగా నిర్వహించ తలపెట్టిన ఈ సర్వేకి కోర్టు బ్రేక్ వేసే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు. అలాగే ఈ అంశం మీద ఇప్పటికే కేంద్ర హోం శాఖ దృష్టిని కేంద్రీకరించింది. కేంద్ర హోంశాఖ కూడా సర్వేకి బ్రేక్ వేసే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే 19న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే జరగకపోవచ్చన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.