ఈరోజు ఆంద్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం
రెండు నెలల క్రితం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వీలయినంత త్వరగా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేందుకు ఇంచుమించుగా ప్రతీ పదిరోజులకీ ఒకసారి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా మళ్ళీ మరో మారు ఆయన అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.
గత సమావేశంలో మంత్రుల పనితీరును సమీక్షించిన ఆయన, వారిలో చాలామందికి పనితీరు మెరుగు పరుచుకోమని హెచ్చరికలు జారీ చేసారు. ప్రతీ మంత్రి తమ శాఖల పనితీరుని మెరుగుపరిచి, తాము కొత్తగా అమలుచేయబోయే కార్యక్రమాలను, సంక్షేమ పధకాల అమలు గురించి ముఖ్యమంత్రి నివేదికలు కోరుతున్నారు. కనుక ఈ రోజు సమావేశంలో మంత్రుల పనితీరుపై కూడా మరో మారు సమీక్ష జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకొన్న ఏడు ప్రాధాన్య రంగాల ( వ్యవసాయం, విద్య, ఉపాధి, మౌలిక వసతులు, పర్యాటకం, పరిశ్రమలు, మానవవనరుల అభివృద్ధి మరియు స్కిల్ డెవెలప్ మెంటు) పై ఈ సమావేశంలో లోతుగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చును. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించదలచుకొందో ప్రకటించలేదు. ఈరోజు సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకొని సమావేశం ముగియగానే ప్రకటించవచ్చును. ఇక ఈ నెల 18 లేదా 20 తేదీల నుండి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కనుక సమావేశాల షెడ్యూల్ కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలోనే ఖరారు చేయవచ్చును. రాష్ట్రంలో గిరిజనులకు ప్రత్యేకంగా రంప చోడవరం కేంద్రంగా ఒక ప్రత్యేకజిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బహుశః దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చును.