కార్గిల్, లెహ్ పర్యటించనున్న ప్రధాని మోడీ
posted on Aug 12, 2014 7:06AM
కార్గిల్, లెహ్ పర్యటించనున్న ప్రధాని మోడీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్గిల్ మరియు లెహ్ ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఆయన అధికారం చేప్పట్టిన తరువాత జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించడం అప్పుడే ఇది రెండవసారి. దానిని బట్టి ఆయన ఆ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అర్ధమవుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన యుద్దభూమిగా పేరుగాంచిన సియాచిన్-గ్లేసియర్ లను ఆయన ఈరోజు పర్యటించి అక్కడ మైనస్ 30-40 డిగ్రీల వాతావరణంలో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న భారత సైనికులను కలిసి వారితో మాట్లాడుతారు. భారత వైమానిక, మిలటరీ ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమవుతారు.
ఆ తరువాత లెహ్ పట్టణంలో పోలో మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. లెహ్ లో నిర్మించిన నిమూ బజ్గో (45 మెగావాట్స్ సామర్ధ్యం) హైడ్రో విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. ఆ తరువాత లెహ్-శ్రీనగర్ ల మధ్య 349కి.మీ.ల పొడవైన విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేస్తారు. ఆ తరువాత కార్గిల్ ల్లో నిర్మించిన చౌతక్ విద్యుత్ ప్లాంటు (44 మెగావాట్స్ సామర్ధ్యం) లను ప్రారంభిస్తారు. అనంతరం కార్గిల్ పట్టణంలో ఒక బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ పర్యటనలో ఆయనతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన దల్బీర్ సింగ్ సుహాగ్, బీజేపీ నేతలు ముక్తార్ అబ్బాస్ నక్వీ, అవినాష్ రాయ్ ఖన్నా తదితరులు ప్రధాని మోడీ పర్యటనకు అవసరమయిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.