కేసీఆర్‌ మాజీ సీఎస్‌వో ఆత్మహత్య

తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ భద్రత అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..కరీంనగర్ కు చెందిన సరేష్ రావు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కేసీఆర్ భద్రతాధికారిగా పని చేశారు. అయితే రోజూలాగే శుక్రవారం విధులకు హాజరైన సురేష్ మధ్యాహ్నం భోజనం చేసిన తార్వత తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. చికిత్స నిమిత్తం అతన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మార్గంమధ్యలోనే మృతి చెందారు. కాగా గత కొంతకాలంగా సురేష్ రావు మానసిక పరిస్థితి సక్రమంగా లేదని చెబుతున్నారు.

భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలి: సుజనాచౌదరి

  తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. సుజనా చౌదరి మాట్లాడుతూ ఆర్టిక్ 19(1) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చేలా ప్రసారాలు చేశారని కొన్ని చానెళ్లపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఆ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ, మండలిలో తీర్మానం చేశారని, రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయించిందన్నారు. జూన్ 16 నుంచి దాదాపు వంద రోజులుగా తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలిచిపోయాయన్నారు. సొంత ఎజెండాతో పాలించే అధికారం ఎవరికైనా ఉందా అని సభలో ప్రశ్నించారు. తెలంగాణలో మీడియాపై ఆంక్షలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

జగన్ కోసం జనం రాలేదు..!

  ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తా ఓడిపోవడంతో పులివెందులలో సీన్ రివర్స్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా పులివెందులకు జగన్ వస్తున్నాడని పార్టీ కార్యాలయానికి సమాచారం వచ్చింది. అయినా జనం అక్కడకు ఎవరూ రాలేదు. జగన్ అనుచరులు ఓ పది మంది తప్పితే కార్యాలయం పూర్తిగా బోసిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు. పరిస్థితిలో ఇంత మార్పు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఛరీష్మా తగ్గిపోయిందా ? అని గుసగుసలు పోతుండడం గమనార్హం. అధికారం లేకున్నా గత నాలుగేళ్లుగా జగన్ కు జనం భారీగానే వచ్చే వారు. అది దక్కుతుంది అనుకుంటే జనం హ్యాండివ్వడంతో పరిస్థితిలో మార్పులు అప్పుడే కనిపిస్తున్నాయి.

ఆంధ్ర ప్రభుత్వం జెండా పండుగ ఎక్కడ నిర్వహిస్తుంది?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవాన్ని గోల్కొండ కోటలో జరుపుకోవాలని నిశ్చయించుకొని అందుకు తగిన సన్నాహాలు కూడా మొదలుపెట్టేసారు. అయితే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరుపుకోవాలో ఇంకా నిశ్చయించుకోక పోవడంతో, ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది. నిన్న విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కొత్త రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండటమే సబబు అని చెప్పారు. అంటే కొత్త రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యనే నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర రాజధానిలో నిర్వహించే ఆనవాయితీని పాటిస్తూ విజయవాడలోనే ఈ కార్యక్రమం నిర్వహించవచ్చును. ఒకవేళ ప్రభుత్వం ఆ ఆనవాయితీని పాటించదలచకపోయినట్లయితే, ఈ వేడుకలను విశాఖ, తిరుపతి, కర్నూలు లేదా రాష్ట్రంలో మరే ప్రాంతంలోనయినా నిర్వహించవచ్చును. కానీ హైదరాబాదులో మాత్రం నిర్వహించకపోవచ్చును.

టిటిడీ చైర్మన్ పదవికి కనుమూరి రాజీనామా?

   గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో టీటీడీ చైర్మన్ గా నియుక్తులయిన కనుమూరి బాపిరాజు ఈ రోజు తన పదవికి రాజినామా చేయబోతున్నారు. నాలుగు రోజుల క్రితం సమావేశమయిన రాష్ట్రమంత్రి వర్గం రాష్ట్రంలో అన్ని ఆలయ పాలక మండళ్ళను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ రోజు దాని కోసం ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది. ఆర్డినెన్స్ జారీ అయితే ఆయన పదవి నుండి తొలగింపబడినట్లవుతుంది, కనుక అంతకు ముందే స్వచ్చందంగా రాజీనామా చేసి తప్పుకోవడమే గౌరవప్రధమని భావిస్తున్నందున, ఆయన ఈ రోజు రాజీనామా చేసేందుకు సిద్దం అవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల కొండ మీదే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడబోతున్నారు. మరి కొద్ది రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. అందువల్ల అంతవరకు తనను పదవిలో కొనసాగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అంతేకాక ఒక కేంద్రమంత్రి ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదని స్పష్టమయింది. అందువల్ల ఆయన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా ఆశ్చర్యం లేదు. ఆయన స్థానంలో మాజీ తెదేపా యం.యల్యే చదలవాడ కృష్ణ మూర్తి టీటీడీ చైర్మన్ గా నియుక్తులయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.

మహిళా యంపీలకు క్షమాపణ చెప్పిన మురళీ మోహన్

  మహిళా యంపీలకు క్షమాపణ చెప్పిన మురళీ మోహన్ తెదేపా యంపీ మురళీ మోహన్ మహిళల వస్త్రధారణపై నిన్న లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపడంతో ఆయన క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. మహిళలపై దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అత్యాచారాలపై జరుగుతున్న చర్చలో పాల్గొంటూ ఆయన “నా సోదరీమణులు, దేశంలో అమ్మాయిలు అందరూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం హుందాగా ఉండే వస్త్రాలు ధరించాలని సవినయంగా కోరుతున్నాను,” అని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “సమాజంలో పురుషులు కూడా మహిళలను తమ కుటుంబ సభ్యులగానే భావించి గౌరవించాలని, అదే భరతమాతకు మనం ఇచ్చే గౌరవం’’ అని అన్నారు. ఆయన మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై సభలో మహిళా యంపీలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్‌ ఎంపీ కుమారి సుస్మితా దేవ్‌, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలె తదితరులు ఆయన వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించి ఆయనను సభ నుండి బయటకు పంపించాలని డిమాండ్ చేయడంతో, మురళీ మోహన్ స్పందిస్తూ ‘‘నేను తప్పుగా మాట్లాడానని మహిళా సభ్యులు భావించినట్లయితే వాటిని నేను ఉపసంహరించుకొంటున్నాను. నా వ్యాఖ్యలు వారిని ఇబ్బందికి గురి చేసి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నాను’’ అని చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.

విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో ఒక్కో జిల్లాలో వారానికి రెండు రోజులు చొప్పున పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు రేపు విశాఖ జిల్లాలో పర్యటించ నున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి నుండి చంద్రబాబు జిల్లా పర్యటన ప్రారంభిస్తారు. ఈరోజు ఆయన తుమ్మపాల, గంధవరం, గజపతి నగరం గ్రామాలలో పర్యటిస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలు, విద్యార్ధులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకొంటారు. ఆ తరువాత స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జిల్లా పరిస్థితి తెలుసుకొని అవసరమయిన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈరోజు చోడవరంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన పాల్గొంటారు.   గత ఏడాది ఆయన పాదయాత్ర చేసినపుడు గ్రామీణ ప్రజల సమస్యలు అనేకం ఆయన దృష్టికి వచ్చాయి. అయితే అప్పుడు ఆయన అధికారంలో లేనందున వాటిని పరిష్కరించలేకపోయారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి సమస్యలను పరిష్కరించగలిగే స్థితిలో ఉన్నందునే అయన ఇప్పుడు ఈవిధంగా గ్రామాలను పర్యటిస్తున్నారని భావించవచ్చును. ముఖ్యమంత్రి స్వయంగా అన్ని జిల్లాలలో గ్రామాలను పర్యటించడం చాలా కష్టమే అయినప్పటికీ, ప్రజల నుండి వస్తున్న అనూహ్యమయిన స్పందన చూసి చంద్రబాబు జిల్లా పర్యటనలు కొనసాగిస్తున్నారు.  

చంద్రబాబు సమావేశం వద్ద విద్యార్దుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్న హోటల్ వద్ద విద్యార్ధులు ఆందోళనకు దిగారు. 13 జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం బాబు ఈ రోజు గేట్ వే హోటల్ లో సదస్సు నిర్వహిస్తున్నారు. అక్కడకు చేరుకున్న విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనిపై సమగ్రంగా చర్చించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో హోటల్ గేట్ ఎదుట బైఠాయించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు కేబినెట్ ఆమోదం

రక్షణ రంగంలోకి ఎఫ్‌డీఐలు వచ్చేశాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఇక, రైల్వే మౌలిక వసతుల రంగంలో 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, ప్రత్యేక రవాణ లైన్లు.. తదితర వాటిలోకి ఎఫ్ డీఐలు రానున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే కొలీజియం వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

భీమవరంకు ప్రత్యేక హోదా కోసం తోట సీతరామ లక్ష్మి కృషి

  తెదేపా రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లాల్లో గల భీమవరం పట్టణానికి ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాంతం నుండయినా ఏడాదికి వెయ్యి కోట్లు పైబడి ఎగుమతులు జరుగుతునట్లయితే ఆ ప్రాంతానికి లేదా పట్టణానికి ‘టౌన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్’ అనే ప్రత్యేక హోదాను కేంద్రం కేటాయిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో ఎగుమతులు చేస్తున్న వ్యాపారులకు, సంస్థలకు పన్ను రాయితీలు, ఈపీసీజీ పధకం క్రింద విదేశాల నుండి ఎటువంటి పన్నులు లేకుండా అవసరమయిన యంత్ర పరికరాలను తెప్పించుకోవడానికి వీలవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టణానికి కేంద్రం కూడా అనేక విధాల సహాయసహకారాలు అందిస్తుంది. ఇక భీమవరం పట్టణం రొయ్యల ఎగుమతులు చాలా ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో ఏడాదికి దాదాపు రూ.3800 కోట్లు పైబడి ఎగుమతుల ద్వారా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ప్రజా ప్రతినిధులెవరూ ప్రత్యేక హోదా కోసం గట్టిగా కృషి చేయలేదు. కానీ ఈ మధ్యనే తెదేపా రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయిన తోట సీతా రామ లక్ష్మి, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి నిర్మలా సీతారామన్ నను కలిసి భీమవరానికి ‘టౌన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్’ గుర్తింపు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఆమె అభ్యర్ధనకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రానికి చెందిన యంపీలు, యం.యల్యేలు అందరూ తమ నియోజక వర్గాల అభివృద్ధికి కృషి చేసినట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగలవు.

మిజో గవర్నరు కమలాబెనీవాల్ కు ఉద్వాసన

  గుజరాత్ గవర్నరుగా వ్యవహరించిన కమలబెనీవాల్ కొద్ది రోజుల క్రితమే మిజోరాంకు బదిలీ అయ్యేరు. ఎవరూ ఊహించని విదంగా ఆమెను ఆ పదవి నుండి తొలగిస్తూ రాష్ట్రపతి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే అందుకు కారణాలు మాత్రం ఇప్పటివి కాకపోవడం మరో విశేషం. ఆమె గుజరాత్ గవర్నరుగా ఉన్నపుడు 2011 నుండి 2014 వరకు 63 సార్లు ప్రత్యేక విమానంలో ఆమె స్వంత రాష్ట్రమయిన రాజస్థాన్ వెళ్ళి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ పిర్యాదు మేరకు ఆమెను గవర్నరు పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె గుజరాత్ గవర్నరుగా ఉన్నపుడే ఆమెను తొలగించి ఉండవచ్చును. కానీ ఇంతకాలం అధికారంలో కొనసాగనిచ్చి వేరే రాష్ట్రానికి బదిలీ అయిన తరువాత ఆమెను పదవిలో నుండి తొలగించడం వెనుక కూడా పెద్ద కధే ఉంది. నిజానికి ఆమె గుజరాత్ గవర్నరుగా ఉన్నపుడు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన నరేంద్ర మోడీతో ఘర్షణ వైఖరి అవలంభించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఆమెతో సహా కాంగ్రెస్ కు చెందిన అనేకమంది గవర్నర్లను పదవిలో నుండి స్వచ్చందంగా తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం కోరింది. కానీ ఆమెతో సహా మరొకొందరు గవర్నర్లు అందుకు నిరాకరించడంతో వేరే రాష్ట్రాలకు బదిలీ చేయబడ్డారు. కమలబెనీవాల్ కూడా ఆ విధంగానే మిజోరంకు బదిలీ చేయబడ్డారు. అయితే గతంలో ఆమె మోడీని చాలా ఇబ్బంది పెట్టిన కారణంగానే ఇప్పుడు ఉద్వాసనకు గురయిఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

శభాష్ చంద్రబాబు! నాగం జనార్ధన్ రెడ్డి

  ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో తెరాసలో చేరుదామని కలలు కంటూ పార్టీని వీడారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు చంద్రబాబుపై నిత్యం చాలా ఘాటు విమర్శలు కూడా చేసేవారు. కానీ కేసీఆర్ ఆయనను తెరాసలో చేర్చుకోలేదు సరికదా తెలంగాణా జేఏసీలో కూడా చేరనీయకుండా అడ్డుపడ్డారు. అప్పటి నుండి ఆయన కేసీఆర్ పై కూడా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ని విమర్శించేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను మెచ్చుకోవడం విశేషం.   చంద్రబాబు పక్క రాష్ట్రాల నుండి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తే, కేసీఆర్ మాత్రం మరో మూడేళ్ళ వరకు తెలంగాణా కు విద్యుత్ కష్టాలు తప్పవని గొప్పగా చెప్పుకొంటున్నారని నాగం జనార్ధన్ రెడ్డి ఎద్దేవా చేసారు. నాగం మాటలలో నిజం ఉన్నప్పటికీ ఆయన కేవలం కేసీఆర్ ను విమర్శించేందుకే తను ఇంతకాలంగా ద్వేషిస్తున్న చంద్రబాబును మెచ్చుకొంటున్నట్లుంది తప్ప నిజంగా చంద్రబాబును మెచ్చుకోవడం ఆయన ఉద్దేశ్యం కాదనిపిస్తోంది. చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా ఇదివరకు పొరుగునున్న కర్నాటక రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసారు. నాగం జనార్ధన్ రెడ్డి ఆ ఆవిషయం ప్రస్తావించకపోవడం గమనిస్తే, ఆయన పొగడ్తల వెనుక అసలు ఉద్దేశ్యం అర్ధమవుతుంది.

ఫీజు రీయింబర్స్ మెంట్ పై చంద్రబాబు కొత్త ప్రతిపాదన

  హైదరాబాదు మరియు పరిసర జిల్లాలలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న ఆంద్ర విద్యార్ధులకు 52:48 నిష్పత్తిలో ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను, తెలంగాణా ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించింది. మా పిల్లలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసుకొంటున్నప్పుడు, మీరెందుకు మీ పిల్లలకు కేవలం 52 శాతమే చెల్లించాలనుకొంటున్నారు? అని ఎదురు ప్రశ్న వేసారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తాను మరోకమేట్టు దిగివచ్చెందుకు కూడా సిద్దమని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై కనీసం చర్చకు కూడా ఆసక్తి చూపలేదు. కానీ, ఫీజు రీయింబర్స్ మెంట్ సాకు చూపి ఇంజనీరింగ్ అడ్మిషన్లు చెప్పట్టకుండా కాలక్షేపం చేస్తే ఊరుకోనని సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించిన తరువాతనే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా ప్రవేశాల ప్రక్రియ చెప్పట్టేందుకు అంగీకరించింది. చంద్రబాబు నాయుడు ఇదివరకు చెప్పినట్లే, మరో మెట్టు దిగి విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై మరొక కొత్త ప్రతిపాదన చేసారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా విద్యార్ధులు ఎందరో తెలంగాణా ప్రభుత్వమే తేల్చి చెపితే వారందరికీ తమ ప్రభుత్వం 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు సిద్దంగా ఉందని, ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రకటించారు. 1956కు ముందు నుండి ఉన్నవారి పిల్లలే స్థానికులుగా గుర్తిస్తామని తెలంగాణా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది గనుక, తెలంగాణాలో పుట్టిపెరిగిన ఆంద్ర పిల్లలు అందరికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి ఇది అదనపు భారమే అయినప్పటికీ, చంద్రబాబు నిర్ణయం వేలాది విద్యార్ధులకు వారి తల్లి తండ్రులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. విద్యార్ధులను స్థానికత ఆధారంగా, ప్రాంతాలవారిగా వేరు చేసి చూడటం తగదని సుప్రీం కోర్టు తెలంగాణా ప్రభుత్వానికి మెత్తగా చివాట్లు పెట్టినప్పటికీ, తన వైఖరిలో ఎటువంటి మార్పు రా(లే)దని నిన్న కేసీఆర్ స్వయంగా స్పష్టం చేసారు. బహుశః అందుకే విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యతగల ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు ఆంధ్ర విద్యార్ధులందరికి ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు సిద్దపడి ఉండవచ్చును. అందుకు ఆయనను అభినందించవలసిందే.

కామన్వెల్త్ విజేతలకు టీ సర్కార్ నజరానాలు....

  కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో కశ్యప్, గుత్తా జ్వాలతోపాటు పలువురు క్రీడాకారులు బుధవారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా విజేతలను కేసీఆర్ అభినందించారు. క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. స్వర్ణం సాధించిన వారికి రూ. 50 లక్షలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెండిపతకం గెలుపొందిన వారికి రూ. 25 లక్షలు, కాంస్యం సాధించిన విజేతలకు రూ. 20 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించారు. విజేతల కోచ్‌లకు కూడా రూ. 50 లక్షలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ రూ. 3 లక్షలు నజరాన ప్రకటించారు. ఈ ప్రోత్సాహక బహుమతులను గోల్కొండ వేదికగా జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ఇవ్వనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

ఆత్మహత్యాయత్నం నేరం కానేకాదు....

  ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యాయత్నం నేరం. అత్మహత్యాయత్నం చేసిన వారికి ఒ సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించవచ్చని చట్టాలు చెపుతున్నాయి. ఇలాంటి ఆత్మహత్యాయత్నాన్ని నేరపరిధి నుంచి తప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 309ను రద్దు చేసి... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ విషయంపై ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని కేంద్రమంత్రి హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు నిన్న లోక్‌సభలో వెల్లడించారు. ఇదే అమలుకు వస్తే ఐపీసీ సెక్షన్ 309ను రద్దు చేస్తే గనుక ఆత్మహత్య చేసుకున్నవారిపై ఇకపై ఎలాంటి కేసు నమోదవదు.

‘గాలి’కి బెయిలు... అయినా జైల్లోనే....

    ఏఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లోఉన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డికి ఎట్టకేలకు బెంగుళూరు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసు విషయంలో బెంగుళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఫర్ స్కామ్‌లో మాత్రం ప్రస్తుతం జనార్థన్‌రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఓఎంసీ కేసులో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. ఏఎంసీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రన ఇప్పటికిప్పుడు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఓఎంసీ కేసుకు సంబంధించి గాలికి బెయిల్ రావాలసి ఉంది. దీనిపై సుప్రీం కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ప్రస్తుతం గాలి జనార్థన్‌రెడ్డి బెంగుళూరు జైల్లో ఉన్నారు.

బంగ్లాదేశ్‌లో నౌక ప్రమాదం... 200 మంది మ‌ృతి?

  బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న పినాక్-6 పేరుగల నౌక మునిగిపోవడంతో 200 మరణించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 115 మృతదేహాలు లభ్యమయ్యాయి. 40 మంది మినహా మిగతా అందరూ గల్లంతయ్యారు. చాలామంది ప్రయాణికుల జాడ ఇప్పటికీ తెలియక పోవడం, నదిలో మునిగిపోయిన పినాక్-6 పడవలోనే వారంతా చిక్కుపడి ఉండడమో, లేదా భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న పద్మా నది ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండడమో జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కెపాసిటీకి రెట్టింపు సంఖ్యలో సుమారు 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ సోమవారం అలల తాకిడికి తలకిందులై మునిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోపలే వందమందికి పైగా ప్రయాణికులను నౌకలు, స్పీడ్‌బోట్ల సాయంతో కాపాడారు.

ఉరిశిక్ష రద్దు చేసే ఆలోచనే లేదు...

  దేశంలో ఉరిశిక్షను రద్దుచేసే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టం ద్వారా కోర్టులు నేరస్థులకు ఉరిశిక్ష విధించే హక్కును కలిగి ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టాన్ని సవరించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే లా కమిషన్ ఇటీవల తన వెబ్‌సైట్‌లో ఉరిశిక్షకు సంబంధించి సూచనలు, సలహాలను, అభిప్రాయాలను అందించవలసిందిగా దేశపౌరులను కోరింది. ఈ నేపథ్యంలో, కేంద్రప్రభుత్వానికి ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన ఉందా అని పార్లమెంట్‌లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 309 ను రద్దు చేసి... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది.