సుప్రీంకోర్టు కోలీజియం వ్యవస్థలో మార్పులకు మోడీ ప్రభుత్వం శ్రీకారం
posted on Aug 12, 2014 7:27AM
భారత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకాలను చేపట్టే ‘సుప్రీంకోర్టు కోలీజియం’ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అవినీతిపరులయిన న్యాయమూర్తులను పదవులలో నియమిస్తూ, కొనసాగిస్తున్నారని మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలతో న్యాయ, రాజకీయ వ్యవస్థలలో పెద్ద దుమారమే రేగింది. అయితే న్యాయవ్యవస్థపై పడిన ఈ మచ్చను తొలగించుకొనేందుకు సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు చెప్పట్టకుండా, ఆరోపణలను ఖండించడంతో సరిపెట్టుకొంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా భావించి, కోలీజియం వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేసేందుకు లోక్ సభలో నిన్న రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి కోలీజియం వ్యవస్థలో మార్పుల కోసం (జ్యూడిషియల్ నియామకాల కమీషన్ బిల్లు-2014) ఉద్దేశించింది కాగా రెండవది న్యాయమూర్తుల నియామకంలో కోలీజియం అనుసరించాల్సిన విధి విధానాలను (రాజ్యాంగ సవరణ బిల్లు-2014) రూపొందించే బిల్లు. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.